ఆమని-14

0
7

[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది 14వ భాగం. [/box]

[dropcap]ఆ[/dropcap]రోజు ఫోన్‌లో ఒక మెసేజ్ వచ్చింది స్నేహలతకు. ఏంటంటే తమతో పాటు ఎంఎస్సీ చదివిన బ్యాచ్ వాళ్లు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తారట. తప్పకుండా పాల్గొనమని. చాలా సంతోషం అనిపించింది. మనసు ఒక్కసారిగా యూనివర్సిటీ ప్రాంగణంలోకి పరుగులు తీసింది. సుమబాలా తనూ కలిసి వెళితే సరి. మిగతావాళ్లు అక్కడ ఎలాగూ కలుస్తారు.

యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎన్నెన్నో విభాగాలుండేవి. సైన్సు, ఆర్ట్స్, ఫార్మసీ. న్యాయ విద్య, కో-ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్, మహిళా ఇంజనీరింగ్ కాలేజీని కూడా ఇప్పుడు ఓపెన్ చేశారన్నారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఎన్నో వేలమంది చదువుకోగలుగుతున్నారు. తమ క్లాసులు సౌత్ బ్లాక్‌లో జరిగేవి. తమ యూనివర్సిటీ పేరు వింటేనే తనకు ఒళ్లు పులకరిస్తుంది. నాన్నగారు కొన్ని రోజులు అక్కడా పని చేశారు. ఆయన కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే ప్రత్యేకమైన అభిమానం. విశ్వవిద్యాలయ చిహ్నాన్ని గురించి గొప్పగా మాట్లాడేవారు. ఆ చిహ్నం మధ్యలో వున్న తామర పుష్పం లక్ష్మీదేవికి ఆలవాలమట, అదే తామర పుష్పం చదువుల తల్లి సరస్వతీ దేవికి మూల పీఠమట. ఆ పీఠానికున్న అరవై నాలుగు అంచులు 64 కళలకు గుర్తులు అని చెప్పేవారు. ఇంకా తామరపువ్వుపై వున్న సూర్య కిరణాలు తేజస్సుకు, వెలుగుకు గుర్తు. తామర పువ్వు కింద వ్రాసి ఉన్న ‘తేజస్వినావధీత మస్తు’ అనే వాక్యానికి అర్థం భగవంతుని జ్ఞానాన్ని ప్రసాదించమని కోరటం. చిహ్నం మొత్తానికి అటు ఇటు ప్రముఖంగా కనిపించే రెండు పాములు, విజ్ఞాన రక్షణకు కాపలాగా నిలబడి ఉన్నాయని వివరంగా చెప్పేవారు. ఈ చిహ్నాన్ని కౌతా రామమోహన శాస్త్రిగారు అనే వారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు కలిసి రూపొందించారని గుర్తు చేసుకునేవారు. ఆ రామలింగారెడ్డి గారే ప్రథమ ఉపకులపతిగా పనిచేసి ఎన్నో సంస్కరణలకు బీజం వేశారు. ఈనాడు ఆ విశ్వవిద్యాలయం ఎన్నెన్నో డిప్లమో కోర్సులు అందిస్తూ వివిధ రంగాలలో శిక్షణ పొందడానికి, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సైతం ఎన్నో భాషలు నేర్పిస్తూ విజ్ఞాన సర్వస్వంగా ఉంటున్నది. ఇలా ఆలోచించే కొద్దీ ఎన్నెన్నో జ్ఞాపకాలో, ఎన్నెన్ని అనుభూతులో! వాటికి లెక్కే ఉండదు.

***

అనుకున్న ప్రకారం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆ రోజే. సుమబాలతో కలసి స్నేహలత హాజరయింది. ఆనాటి విద్యార్థులు ఇప్పుడు చాలా మంది బాధ్యతగల పదవులలో వున్నారు. ఎవరికి ఆ సమయంలో తమ తమ పదవులు, తమ తమ హోదాలు గుర్తుకు రాలేదు. మళ్లీ విద్యార్థులలాగా అటూ ఇటూ పరుగులు పెడదామన్నంత ఉత్సాహం దాదాపు అందరిలోనూ కనబడుతోంది. కొంతమందికైతే అప్పుడే చెంపల దగ్గర మెరుస్తూ పెద్దరికం వచ్చేస్తున్నది. కొంతమంది మగవారికి చిరు బొజ్జలూ, ఆడవారికి స్థూలకాయం కనబడుతున్నాయి.

“కాస్త కాఫీ తాగుదాం. అలా క్యాంటీన్ వైపుకు వెళదాం రండి” అని స్నేహలతా, సుమబాలా, శేఖర్, సుధాకర్ నలుగురు కలిసి బయలుదేరారు. కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ నిలబడ్డారు.

“హలో మేడం! హౌ డు యు డు?” అన్న గొంతు వినిపించి సుమబాలా, స్నేహలతా ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు.

మహంతి మరోకామెతో కలిసి మాట్లాడుతూ దగ్గరకు వస్తున్నాడు.

“మా కజిన్ ఇక్కడే ఎమ్మెస్సీ చేసింది. అప్పట్లో వాళ్ల ఫాదర్ డిఆర్‌డిఓలో ఇక్కడే పని చేసేవారు. అందుకని తన స్టడీసంతా ఎక్కువ భాగం ఇక్కడే గడిచాయి. తనని ఇప్పుడు డ్రాప్ చేయడానికి వచ్చాను. మీ ఫ్రెండే అయి ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు జ్ఞాపకం చేసుకోండి” అంటుంటే ఎవరా అని చూశారు. తమ క్లాస్‌మేట్ రంజిత నవ్వుతూ నిలబడింది. ‘అబ్బా! ఈ రంజిత గురించా ఇంతసేపు ఈ మహంతి వర్ణించి చెప్పాడు’ అని నవ్వు వచ్చింది. సుమబాలను, స్నేహలతను చూసేసరికి రంజితకి కూడా ఎక్కడలేని సంతోషం వచ్చింది. తను బరంపురం యూనివర్సిటీలో పని చేస్తున్నానని చెప్పింది.

“అమ్మయ్య. ఒకరినొకరు గుర్తు పట్టుకున్నారుగా! సరే నే వస్తాను రంజితా, సాయంత్రం ఎర్లీ గానే వస్తాను. వచ్చి పికప్ చేసుకొని వెళతాను. రిస్కు పడొద్దు. ఓకే మేడమ్ మళ్ళీ కలుద్దాం, ఇప్పుడు కాస్త పనుంది” అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడింది రంజిత. తమ తమ కుటుంబ విషయాలూ, ఉద్యోగ విషయాలూ మాట్లాడుకున్నారు.

“తను నాకు అన్నయ్య అవుతాడు. మా మహంతి అన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐఏఎస్ అయినా కూడా ఎక్కడా గర్వం అనేది లేదు. ఏ డ్రైవరునో ఇచ్చి పంపమని చెప్పినా వినకుండా తనే వచ్చి డ్రాప్ చేసి లోపలి దాకా వచ్చి పంపిగాని వెళ్ళలేదు. చిన్నప్పట్నుంచి చాలా కష్టపడి చదువుకున్నాడు. పెదనాన్నగారు అన్నయ్య చిన్నతనంలోనే చనిపోయారు. పెద్దమ్మకు తోడుగా వుండి కుటుంబాన్ని అంతా ఒక ఒడ్డుకు చేర్చాడు. తన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు చదువులూ, పెళ్ళిళ్ళూ ఎంతో బాధ్యతగా చేశాడు. తను మాత్రం ఇంకా ఒకింటివాడు కాలేదు. ఆరోజు కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం” అంది రంజిత అభిమానంగా.

“ఐఏఎస్ అయినా చాలా సింపుల్‌గా వున్నారు” అన్నాడు సుధాకర్.

“కొందరు అంతే. అందరికీ అన్నీ చేస్తూ తాము మాత్రం నిమిత్తమాత్రులం అనుకుంటారు” అన్నాడు శేఖర్.

సుధాకర్ వ్యవసాయ శాఖలో పని చేస్తుంటే, శేఖర్ తాను ఖాదీ బోర్డులో ఉద్యోగం వస్తే దాంట్లో చేరిపోయానని చెప్పాడు. స్నేహలతకు తప్పిస్తే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. అందరి పిల్లలు పెరుగుతున్నారు. హోదా విషయంలో మాత్రం స్నేహలత అందరికన్నా ముందున్నది.

కొందరు పూర్వ విద్యార్థులు ఫ్యామిలీలతో వచ్చారు. అక్కడక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటూ కనిపిస్తున్నారు. వేరే బ్యాచ్‌మేట్స్ వస్తే సుధాకర్, శేఖర్ ఇద్దరూ వెళ్లిపోయారు. రంజితా, సుమబాలా స్నేహలతా వచ్చి ఒకచోట కూర్చున్నారు. మరి ఇద్దరు కూడా వచ్చి వీళ్ళతో చేరారు. ఎవరెవరా అని ముఖాలలో పోలికలు వెతుక్కోవాల్సి వస్తుంది. గుర్తు పట్టుకున్నాక ‘ఓరి నీ నువ్వా, ఎంత మారిపోయావు?’ అని నవ్వేసుకుంటున్నారు. ఎక్కువ భాగం వాళ్ళు చేసే ఉద్యోగాల సంగతి, ఆ తర్వాత పిల్లలను సంగతులే మాట్లాడుతున్నారు. వాళ్ల వాళ్ల పిల్లలు ఎంత ఖరీదైన కాన్వెంట్లో చదువుతున్నారో, వాళ్ళ ఆయన ఇంట్లోకి ఎంత రిచ్ అయిన వస్తువులు తెస్తాడో, వాళ్ళ కారు కూడా చాలా ఖరీదైన అయినట్టు కొంతమంది చెప్పుకొచ్చారు. మరికొంతమంది ఆత్మీయంగా అల్లుకుపోయారు.

మగవాళ్లు తాము పొందబోయే ప్రమోషన్ల గురించి, పెరగబోయే శాలరీ గురించి మాట్లాడుతూ తమ ఆధిక్యతను ప్రదర్శించాలని ప్రయత్నం చేస్తున్నారు.

ఏది ఏమైనా అందరిలోనూ ఒక ఉత్సాహం ఒక సంతోషం కనబడుతున్నాయి. తమ గురువులు ఎవరెవరు ఆరోగ్యంగా ఉన్నారా? ఇంకెవరు సర్వీస్‌లో ఉన్నారా అన్న విషయం ఈపాటికే తెలిసింది. మరలా వాళ్ళందరితో కలిసి కొంతసేపయిన గడపాలన్న కోరిక ఉవ్వెత్తున ఎగసిపడింది. ఇప్పటికే కనపడ్డ వారిని తన పడ్డట్టు సెల్ఫీలు తీసే పనిలో ఉన్నారు కొందరు. నెమ్మది నెమ్మదిగా డయాస్ నిండింది. రావలసిన విశిష్ట అతిథులు అందరూ వచ్చేసారు.

లో గొంతుకతో మాట్లాడుకుంటూ రంజితా, స్నేహలతా, సుమబాలా తమ సీట్లలో కూర్చున్నారు. బయట ప్రపంచానికి వీళ్లలో కొందరు పోలీస్ ఆఫీసర్లు, అటవీశాఖ అధికారులు, విద్యావేత్తలు ఇలా ఎందరో ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం పూర్వ విద్యార్థులు. అప్పుడు సబ్జెక్టు విన్న శ్రద్ధతో ఈనాడు కూడా తమ గురువుల అందించే ఆశీస్సులను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

లంచ్ సమయానికి ఆడిటోరియం అంతా కిక్కిరిసిపోయింది. క్లాస్‌మేట్స్, బ్యాచ్‌మేట్స్ ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకోవడం, వాళ్లతో సెల్ఫీలు దిగడం, ఎమ్మెస్సీ నాటి అనుభవాలను గుర్తు చేసుకోవటం, ఇప్పటి స్థితిగతుల్ని పంచుకోవడంలో అందరూ లీనమైపోయాను. ఒకరినొకరు అభినందించుకుంటూ మరల ఎక్కడ కలుసుకోవచ్చో ప్లాన్ చేస్తూ కొందరు ఉన్నారు. చదువుకునే రోజుల్లో లాగానే రంజితా, సుమబాలా, స్నేహలలా ఇప్పుడు క్లోజ్‌గా తిరుగుతున్నారు.

“నువ్వూ లైఫ్‌లో సెటిల్ అయితే బాగుండేది స్నేహలతా! ఐఎఫ్ఎస్ అధికారివైనందుకు సంతోషంగా ఉన్నది, లైఫ్‍లో సెటిల్ కానందుకు విచారంగానూ వున్నది” అన్నది రంజిత,

“సెటిల్ అవడం అంటే పెళ్లి ఒక్కటేనా?” అంటూ నవ్వేసింది స్నేహలత.

“ఎప్పటికప్పుడు బిజీగా చదువు, ఉద్యోగం, ఆ తరువాత పెళ్లి పిల్లలు. ఎప్పుడో ఒకసారో అరసారో ఫోన్‌లో మాట్లాడుకుంటాం. సుమబాలని కానీ, నిన్ను కానీ కలుసుకోవటం ఇప్పటికి కానీ వీలుపడలా. ఎనీ ప్రాబ్లం? అన్‌మేరీడ్‌గా ఎందుకు వుండిపోయావు?హెల్త్ ప్రాబ్మమా? మరింకేదైనా వున్నదా? పోనీ నీకింతవరకూ నచ్చినవాడే దొరకలేదా? పూలమొక్కల్నీ, మూలికల్నీ వెదుక్కుంటూ వుండి మొగుణ్ణి వెదుక్కోటం మర్చిపోయినట్లున్నావు! ఏదైనా మరీ లేట్ చేయకూడదు. ఇప్పటికైనా స్టెప్ తీసుకో” అన్నది రంజిత.

“ఇప్పటివరకు సుమబాల ఒక్కతే పోరుతున్నది. నువ్వూ మొదలుపెట్టావా?”

“అవునమ్మా అంటాం, అడుగుతాం. మాకా హక్కు లేదా? మాలాగే నువ్వూ మొగుడితో గిల్లికజ్జాలు పెట్టుకోవాలి. పిల్లల ముక్కూ, మూతీ తుడవాలి. మొగుడితో, పిల్లలతో పడే తంటాలన్నీ పడాలి. అలా అలా పడకుండా ఇంకా జాలీగా ఎంజాయ్ చేస్తానంటే మేమొప్పుకోం. అన్నిటికంటే ముఖ్యంగా, లైఫ్‌ను పూర్తిగా ఎంజాయ్ చెయ్యాలంటే మాత్రం కుటుంబం అంటూ ఒకటుండాలి. ఆ కుటుంబంలో భర్తా, పిల్ల్లలూ పాలు పంచుకోవాలి.”

“ఓకే బాబా ఓకే. ఇంక నువ్వు కబుర్లాపితే, మన బోటనీ మేడమ్ మాట్లాడుతున్నారు. విందాం” అన్నది స్నేహలత.

బోటనీ మేడమ్ గారెప్పుడూ తేలికపాటి పట్టుచీరల్లోనే క్లాస్‌రూమ్ కొచ్చేవారు. ముఖాన కుంకుమబొట్టూ, ముక్కు మీదకు కొద్దిగా జారే కళ్ళద్దాలు వుండేవి. జుట్టును మెలిపెట్టి గుంద్రంగా మెడమీద పడేటట్టు వేసుకున్న బర్మా ముడి. ఆ ముడిలో ఒక పక్కగా పిన్నుకు గుచ్చిన గులాబీనో, నాలుగు మల్లెలో, కనకాంబరాలు మరువం కలిపి కట్టిన పూలచెండో ఏదో ఒకటి వుండేది. ఆమెకంటే ముందుగా క్లాసులోకి యార్డ్‌లీ సువాసనలొచ్చేవి. ఆ సువాసన ఎంత ఆహ్లాదంగా వుండేదో అంతకంటే హాయిగా సబ్జెక్టును అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా బోధించేవాళ్ళు. ఆమె ఇప్పుడు మాట్లాడుతుంటే అభిమానంగా వినసాగారు.

“ఇందాకా ప్రస్తుతపు వి.సి.గారు, ఇప్పుడు యూనివర్సిటీ ఎన్ని శాఖోపశాఖలుగా విస్తరించిందో ఎన్ని రకాల కోర్సులు పెరిగాయో, గణాంకాలతో సహా వివరించారు. మనం చదువుకున్నటికన్నా చాలా డెవలప్‌మెంట్ కనబడుతున్నది. ఇక్కడి విద్యార్థులు అన్ని రంగాల్లో దూసుకుపోవటమే కాకుండా, దేశవిదేశాల్లో కూడా మన బావుటా నెగరేస్తున్నారు. అదీ ఆంధ్రా యూనివర్సిటీ ఘనత” అని అన్పించింది.

“రంజితా, చిన్నపిల్లలలాగా గోల చేస్తుంటే, కొన్ని వర్డ్స్ మిస్ అయ్యాను. నువ్వే ఇలా అల్లరి చేస్తున్నావు. నీ క్లాస్ లోని పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నావో ఏమో!” అంటూ నవ్వింది స్నేహలత.

సాయంత్రం టీ బ్రేక్ సమయానికి ఆడిటోరియం పలచబడింది. మహంతి రానే వచ్చాడు, రంజిత కోసం.

‘కరెక్ట్‌గా చెప్పినదాని కన్నా ముందే అన్నయ్య వచ్చేశాడు’ అనుకుంటూ, “అన్నయ్యా, కాసేపు వుండగలవా? లేదూ అర్జంటు అంటే వెళ్ళిపోదాం” అన్నది.

“నో ప్రాబ్లమ్. ఇంకొంచెం సేపు మీ ఫ్రెండ్స్‍‌తో గడుపు. మరలా ఎప్పటికి కలుసుకుంటారో? నేను వెయిట్ చేస్తాను” అన్నాడు.

‘ఇప్పుడే వస్తాను’ అంటూ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది రంజిత. సుమబాలా, స్నేహలతలతో పాటు మహంతి మిగిలాడు. స్నేహలతా, మహంతి కాసేపు తమ తమ ఏరియాల విషయాలు మాట్లాడుకున్నారు. సుమబాల విశాఖ ఏజన్సీ గురించి తనకొచ్చిన డౌట్స్ అడిగింది. ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు.

“ఇప్పటికీ అక్కడున్న గిరిజనులు వెనకబడే వున్నారని చెప్పాలి. మా పరిధిలో మేము చేయగలిగినదంతా చేస్తున్నాం. మీరేవే చాలా ప్రాజెక్టులు చేయాలని చెప్పారు కదా స్నేహలతా! అందులో నాక్కొన్ని బాగా నచ్చాయి. మిమ్మల్ని నేను ఎప్రీషియేట్ చేస్తున్నాను. ఎనీ ప్రోగ్రెస్?”

“చాలా వుంది.  నేననుకున్నవాటిని బాగానే ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే, నాకందరి సహకారం లభిస్తుంది. కాబట్టి డిపార్ట్‌మెంట్ తరపు నుంచీ, గవర్నమెంట్ తరపునుంచీ కో-ఆపరేషన్ చాలా బాగా వుంది. మా ఏరియాలో వున్న సెటిల్‌మెంట్స్‌లో ఎరుకల వాళ్ళెక్కువగా వున్నారు. వాళ్ళకు కులవృత్తిగా వచ్చే వెదురు చువ్వలతోను, ఈత చువ్వలతోను, ఆకులతోనూ అల్లకం పని బాగా చేస్తారు. ఇంకా ఏమైనా ఇతర చేతివృత్తుల్లో కొంతవరకు శిక్షణ పొందుతున్నారు. దాన్నింకా ఎక్కువ చేయాలనుకుంటున్నాను. అలాగే వడ్డెర వాళ్ళున్నారు. వీళ్ళూ రకరకాల పన్లు చేయగలరు. కంబళ్ళు బాగా నేయగలరు. వీళ్ళకు నేత పనిలోనూ, వడ్రంగం పనిలోనూ గవర్నమెంట్ శిక్షణ ఇప్పిస్తున్నది. కో-ఆపరేటివ్ సొసైటీ వాళ్ళిచ్చే లోన్లు కాక, మన తరఫు నుంచి కూడా శిక్షణా, తర్వాత వారి కవసరమయ్యే పెట్టుబడి కోసం లోను శాంక్షన్ చేయించాలనే ప్రయత్నంలో వున్నాను. అలాగే స్టూవర్ట్‌పురం సెటిల్‌మెంట్‌లో ఎరుకల వాళ్ళే ఎక్కువ. వీళ్ళూ కులవృత్తికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఊరుకుంటారు. ఇక్కడ స్వయం ఉపాధి పథకాలను గానీ, ఏదైనా చిన్న పరిశ్రమను స్థాపించగలిగితే అక్కడివాళ్ళు నేరాల జోలికిపోరు. ఆ దిశగా ప్రణాళికలు వేయిస్తున్నాను. అలాగే యానాదీ, లంబాడీలకు కూడా సరైన వ్యాపకం కల్గించాలి. మనకి ఎప్పుడూ వుండేవేగా ఈ పనులూ, ఈ మాటలూ. రంజితకు ఇంకా మాటలు తెమల్లేదు అనుకుంటాను. ఎక్కడా పత్తా లేదు” అన్నది స్నేహలత.

“మీ సంగతేమిటి? మీకవకాశముంటే ఏజన్సీ మార్చేయాలన్న సిన్సియారిటీతో వున్నారుగా?”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here