ఆమని-2

0
8

[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది రెండవ భాగం. [/box]

[dropcap]వి[/dropcap]నే వాళ్లంతా ఆశ్చర్యపోయారు – చెట్లు ఇన్ని రకాలు, రాశులకు, నక్షత్రాలకు సంబంధించినవి కూడా వున్నాయా అని. దాతలకు కూడా బాగా ముచ్చటేసింది. సంతోషం కల్గింది. తాము తల పెట్టిన పనిని చూసి, మెచ్చుకోవటమే కాకుండా ఇంత పెద్ద అధికారి స్వయంగా వచ్చి ఇంత సేపుండి ఇన్ని విషయాలు చెప్పడం అంటే అదేదో తమ పుణ్యం కొద్దీ వచ్చినట్లేనని భావించారు.

“తప్పకుండా మేడమ్. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. మా శాయశక్తులా వనాన్ని పెంచి ప్రారంభానికి మిమ్మల్నే పిలుస్తాం” అని హామీ ఇచ్చారు.

రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ దగ్గర కొచ్చి అభినందించారు. “వనాల్ని పెంపొందించాలనే మీ ఉద్దేశం బాగుంది. దానికెంత స్టాటిసిక్స్ జోడించారు. మీ విషయం పరిజ్ఞానానికి చాలా చాలా అభివందనాలు మేడమ్. నేనేదో నేను తెలుసుకున్న నాలుగు ముక్కలు వీళ్లకు చెపుతున్నాను. మీరు సప్తర్షిమండలాన్నే ఆవిష్కరింపజేసారు. వెల్‌డన్ మేడమ్” అంది.

“థాంక్స్ మేడమ్” అంటూ అందరి దగ్గరా శెలవు తీసుకుని బయటి కొచ్చారు స్నేహలతా, సుమబాల.

“ఔషధ విలువలు చెప్పి ఆ చెట్లును నాటమని సలహా ఇస్తావేమో అనుకున్నాను. నువ్వేకంగా గ్రహమండలానికీ చెట్లకు ముడిపెట్టేసి మా అందరి నోళ్లూ తెరిపించేశావు. ఇంత నాలెడ్జ్ ఎక్కడ సంపాదించావ్?”

“మొక్కలూ, చెట్లూ – ఔషధవిలువల్ని గురించి పరిశోధన చేసే దానివి నువ్వు. ఆ విషయాలన్నీ నువ్వే చెప్పాలి. అందుకని వాటిని నీ కోసం అట్టేపెట్టాను. అవకాశమున్న చోటల్లా మొక్కల్నీ, చెట్లనీ వనాల్నీ పెంచి పచ్చదనాన్ని వ్యాపింపచేయటమే మన లక్ష్యం సుమా. ఆ పచ్చదనం లోప్పించే కదా, కాలుష్యం పెరగటం భూగర్భ జలాలు ఇంకి పోవటం జరుగుతున్నాయి. మీ వాళ్లెలాగూ దేవాలయ నిర్మాణం చేపట్టారు. ఎలాగు పూజలు చేసుకుంటారు. జనానికి భక్తి బాగా పెరిగిపోతున్నది. తప్పకుండా ఈ ఏరియా గుడి పాపులర్ అవుతుంది. దీనికి అనుసంధానంగా వనం పెంచితే బాగుంటుందన్న సూచన చేశాను అంతే.”

***

మధ్యాహ్నం భోజనం చేసి వెంటనే తన కాన్ఫరెన్స్ జరిగే రాజధాని ప్రాంతానికి వెళ్లిపోయింది స్నేహలత. అక్కడొక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటానని మాత్రం ఊహించలేదు.

జీప్‌లో కూర్చుని ప్రయాణం చేస్తున్న స్నేహలత మనసులో ఒక మంచి పని చేశానన్న ఆనందం కలిగింది. చిన్న స్థలాలలో చిన వనాలు, పెద్ద స్థలాలలో పెద్ద వనాలు నాటించాలి. ఇంకా కనుమరుగవుతున్న వృక్షజాలాన్ని కనుగొనాలి. అవసరమైన చోట భక్తి జోడించి చెప్తే పవిత్రమైన భక్తి వనాలూ వెలుస్తాయి. ఔషధ విలువల్ని కనుగొన్నచోట ఔషధీయిక్త వనాలు వెలుస్తాయి. అడవుల సంరక్షణ చేయాల్సిన చోట అడవులు విస్తరిస్తాయి. మార్గమేదైనా లక్ష్యం యొక్కటే – వృక్ష జాలాన్ని ఎక్కువ చేయటం. కాసేపు ఆ ఆలోచనలను పక్కన బెట్టింది. సుమబాల కాపురం, భర్తా, పిల్లలూ కదలాడారు. పండు వెన్నెల చల్లదనం, పిల్ల  తెమ్మెర హాయి కనబడింది వాళ్ల కాపురంలో, ముద్దొచ్చే చిన్న పిట్టలు కువకువలాడినట్లు ఇద్దరి పిల్లల మాటలు మంచి సంగీతం వినపడినట్లుగా మధురంగా వున్నాయి. సుమా సుమా అంటూ సుతారంగా పిలుస్తూ వెనక వెనకే తిరిగే భర్త. నీక్కావాలసింది నేను అందిచేవాడినిగా, మాటల మధ్యలో ఎందుకు లేచొచ్చావు అంటూ సుమను ఎంతో గారంగా చూసే భర్త. ఆమె నెక్కడ కష్టపడనీయకుండా ఆమె అడుగులు లేస్తుంటే ఆ అరికాళ్ల కందిపోకుండా తన అరచేతులు అడ్డు పెట్టటానికైనా సిద్ధంగా వున్నట్లు కనబడుతున్నాడు గోవర్ధన్. థాంక్ గాడ్ సుమకు అనుకూలమైన భర్తనూ, ముచ్చటైన పిల్లల్నీ ఇచ్చాడు. పిల్లల్ని దగ్గరకు తీసుకుని అరవింద్ చుట్టూ చేతులు వేసి పొదవుకున్నది తను. సేవంతిక తన బుగ్గల మీద ఎన్నో ముద్దులు పెట్టింది. తనను గుండెలకు హత్తుకుని వదలాలని అనిపించలేదు. తన పరిస్థితి చూసి సుమబాల అననే అన్నదే.

“స్నేహలతా ఇప్పటికైనా పెళ్లీ పిల్లలూ అంటూ ఆలోచించు. ఆ  విషయం పై దృష్టి పెట్టు. మొక్కల్నీ, అడవున్నీ కాదు పెంచేది పిల్లల్నీ కనిపెంచాలి. అప్పుడే స్త్రీగా నీ జీవితానికి నిండుదనమొస్తుంది. నువ్విలా ఒంటిరిగా వుండిపోవటం నాకేం నచ్చటం లేదు. త్వరగా భర్తా పిల్లల ప్రేమలో లతలాగా అల్లుకుపోవాలని కోరుకుంటున్నాను” అంది నిండు మనస్సుతో. తను నవ్వి వూరుకున్నది. ఎటూ తేల్చుకోలేక తనకు తాను సతమతమైపోతున్నది. ప్రేమించనవాణ్ణి వదిలేసుకుని వేరే మరో పరాయివాణ్ణి పెళ్లాడాలని, పిల్లల్ని కనాలనీ అలోచిస్తుంటే కాస్త కొత్తగా ఎబ్బెట్టుగా అనిపించసాగింది. పెళ్లయే దాకా భర్త పరాయివాడేగా అయినా తను సమాధాన పడలేకపోతున్నది. ఇంటికి వెళ్తే చాలు అమ్మ, నాన్నా ఇదే విషయమై బాధపడుతున్నారు. తన తమ్ముడు తన కంటే చిన్నవాడు. పెండ్లి చేసుకుని ఇద్దరు బిడ్డల తండ్రయ్యాడు. స్నేహలత ఆలోచనల్లో వుండగానే రాజధాని అమరావతి రానే వచ్చింది. ఆలోచనలను పక్కకు పెట్టి సచివాలయంలోకి నడిచింది.

ఆనాటి సమావేశానికి వృక్ష శాస్త్రవేత్తలనూ, వ్యవసాయ శాస్త్రవేత్తలనూ, భూసార పరిశోధనావేత్తలను గూడా పిలిపించారు. జిల్లాల అటవీ శాఖాధికారులు ఎలాగువున్నారు.

సి.యమ్ గారు చర్చ మొదలుపెట్టారు. ఏం చెప్పినా విస్తృతంగా చెప్పటం ఆయన కలవాటు.

“మీరంతా సమష్టిగా కృషి చేస్తేనే ఆంద్రప్రదేశ్ అడవుల్లో ఏ జిల్లాలో పెరిగే మొక్కల్లో ఆల్కలాయిడ్‌లు లాంటి ఔషధగుణాలు ఏ స్థాయిలో వున్నయో తెలిసుకోవటానికి వీలవుతుంది. ఏ మూలికల్ని పెంచితే లాభసాటిగా వుంటుందో మీరే తెలుసుకుని చెప్పాలి.”

ఒక్కోక్కరూ చెప్పసాగారు.

“జిల్లాలవారీగా పెరిగే వృక్షసంపదను ప్రత్యేక జిల్లా ఫ్లోరాల రూపంలో వృక్ష సముదాయాన్ని గుర్తించాలి సర్. మన విజయవాడ చుట్టు పక్కల కొన్ని పదుల సంఖ్యలో ఔషధ తయారీ ఫార్మశీలు వున్నాయి. అయితే వారి క్కావలసిన ఔషధ మొక్కలు మన అడవుల్లో వున్నాయి. కాని వాటిని కనుక్కుని సేకరించటంలో మనం విఫలమవుతున్నాం. దాంతో ఫార్మశీల వాళ్లు వాళ్ల కావాలసిన వాటిని ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. అలాకాకుండా చూసుకోవాలి సార్.”

“అలాంటి పనులు మీ అటవీ శాఖాధికారులే పూనుకుని చేయాంచాలి. మీకు సాధ్యం కాకపోతే ఎవరికి సాధ్యమవుతుంది? మిగతా శాస్త్రవేత్తలకు మీరు ఎంతో తోడ్పడాలిగా.”

“తప్పకుండా సర్. మా అందరి సహాయ సహకారాలు అందరికీ వుంటాయి సర్.”

“మీ అందరికీ మార్గదర్శకం చేయటానికి కర్నాటక రాష్ట్ర అటవీశాఖ డిప్యూటి  కన్సర్వేటర్‌గా పని చేసే కిషోర్‌గారు మన ప్రాంతం వాళ్లే. మీకందరకూ తెలిసేవుంటుంది. ఈ టైంలో ఇక్కడుండటం వలన వారిని మన సమావేశానికి ఆహ్వనించటం జరిగింది. కారణమేంటంటే వారు కర్నాటకలో పని చేస్తూ కొన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూన్నారని మనందరం వింటున్నాం. వారి అనుభవాలు మనకూ పనికి వస్తాయిగా. కిషోర్‌గారు మన వాళ్తతో మాట్లాడండి” అన్నారు సి.యం గారు.

“సలహాలు చెప్పేటంత పెద్దవాణ్ణి గాదు సర్. నన్నెంతో అభిమానంగా మీ మధ్య గడపటానికి పిలిచారు. థాంక్స్ సర్. కర్నాటక విషయమేంటంటే మన కన్సర్వేటర్ గారు చాలా శ్రద్ధగల మనిషి. అక్కడ ఫారెన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్లు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాయి. అటు వృక్షశాస్త్రవేత్తలూ ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. వాళ్ల పరిశోధనల్లో కొత్త కొత్త వృక్షజాతులే బయటపడుతున్నాయి. వాళ్లు కనిపెట్టిన మూలికల్ని, దుంపల్నీ రసాయిన శాస్త్రవేత్తలు లాబ్స్‌లో పరిశోధిస్తున్నారు. అంతే కాకుండా రీజనల్ రీసర్చ్ లేబరేటరీ, సెంట్రల్ ఇండియన్ మెడిసిన్ ప్లాంట్స్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఎంతో కృషి చేసిన సంగతి మనందరం వింటున్నాం. వాళ్ళ పరిశోధనా విషయాలు బాగా వుపయోగపడుతున్నాయి. ముందుగా జిల్లాల ఫ్లోరాలు ఏర్పాటవటం చాలా అవసరం. అలాంటి వాటిని మేము ఏర్పాటు చేసుకున్నాం. అలా ఏర్పటయితే ఎక్కడ ఏమేం దొరుకుతున్నాయో తెలుస్తుంది. తెలిసినప్పుడు వాటినెలా అభివృద్ధిపరచవచ్చో తెలుస్తుంది. ఇలా  వృక్ష రసాయిన భూసార పరిశోధనా వ్యవసాయ శాస్త్రవేత్తలందరి సహాయం తీసుకుని మేం ముందుకెడుతున్నాం. ఇందులో మా కన్సర్వేటర్‌గారి కృషి చాలా వున్నది సర్. మాలాంటి వాళ్లం ఏం చేప్పినా ఆలోచించి మమ్మల్ని ప్రోత్సహించటంతోనే మేం ముందుకెడుతున్నాం. ఇలాంటి కృషి చేయటం వలన కావలసిన వాటిని దిగుమతి చేసుకోకుండా మేమే పండించుకోగలుగుతున్నాం. అలా మా వృక్ష సంపద, మూలికల ఔషధుల ఉత్పత్తి పెరుగుతున్నది. మేమే ఎగుమతి చేయగల స్థితిలో కొచ్చాం. అందరికీ ఉపయోగపడే కోడిశపాల విత్తులు, కేవుకిన్న దుంపలాంటి వాటిని ఉత్పత్తి చేసి ఎన్నో ఔషధ ఫార్మాశీలకు అందించగలుగుతుంన్నాం. మేం చేసే పని మరొకటేంటంటే లాభసాటిగా వుండే మూలికల్ని పెంచే దిశగా వ్యవసాయదారుల్ని ప్రోత్సహిస్తున్నాం. అన్ని రంగాల శాస్తవేత్తలూ తమ తమ పరిశోధనల ద్వారా నేల గుణగణాల దగ్గర నుండి ఉత్పత్తి అయిన వాటి గుణగణాల వరకూ మాకు తెలియ జేస్తున్నారు. ఈ పంటలన్నింటినీ గిరిజనుల చేతే సాగు చేయించి వాళ్లకూ ఉపాధికల్గిస్తున్నాం. మరొక ముఖ్యమైన విషయంమేంటంటే పుష్పించే మొక్కలతో పాటు పుష్పించని మొక్కలైన ఫెర్న్, రాతి పువ్వు లాంటి లైకెన్‌ల మీద పరిశోధనలు చేస్తున్నాం. ప్రయోగాలకు పనికి వచ్చే ఉద్యానవనాలను ప్రొత్సహిస్తున్నాం. ఇంకా చాలా ఆలోచనలున్నాయి. ఒక్కక్కటీ అమలు చేసుకుంటు పోవాలి.

మన రాష్ట్రంలోని చాలా జిల్లాలు ఈ పంటలకు అనుగుణంగా వుంటాయి. మొక్కల్ని పెంచి ఔషధ గుణ ప్రామాణికతను పాటిస్తే ఎంతో లాభముంటుంది సర్. ఇంకొక్క విషయం  మాత్రం చెప్పి ముగిస్తాను సర్. ఢిల్లీలోని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి వారు లక్నోలో వున్న నేషనల్ బొటానికల్ గార్డెన్ వారూ కలపి సంయుక్తంగా వేసిన బుక్స్ వున్నాయి. మాములు సామాన్య జనం కోసం ప్రచురింపబడ్డ పుస్తకాలు అవి. అవి తెప్పించి ప్రచారం చేయించండి. ఆసక్తి వున్న వాళ్లు చదువుకుంటారు” అని చెప్పి ముగించాడు.

కిషోర్ చెప్పిన విషయాలు అక్కడున్న వారందరికీ ఆమోదయోగ్యంగా వున్నట్లుగా వాళ్ల ముఖాలే చెప్తున్నాయి. మనం చెప్పాలనుకుంటున్న విషయాలను  ఈ కర్నాటక రాష్ట్ర డిప్యూటీ కన్సర్వేటర్ చెప్పి మన పని తేలిక చేసినట్లుయిందని రాష్ట్ర జిల్లాల ఐఎఫ్‌ఎస్ అధికాలులందరూ భావించారు.

సి.యమ్ గారు కూడా ఆమోదయోగ్యంగా తల పంకించారు. “మీ కృషిని మనసారా అభినందిస్తున్నాను. డెప్యూటీగా వుండీ ఇంత అభివృద్ధిని సాధిస్తున్నారు. ముందు ముందు రాష్ట్ర అటవీశాఖను మొత్తం పరిరక్షించి ఎన్నో ప్రయోజనకరమైన పనులను చేపడతారని నాకు గట్టి నమ్మకం వున్నది. మీ సూచనలు మేం గూడా అమలు చేయటానికి ప్లాన్ చేసుకుంటాం. మీ అనుభవాలతో ఇక్కడ మనవాళ్లు ఏమేం చేయాలనుకుంటున్నారో ఆలోచిద్దాం. ముఖ్యంగా మన రాష్ట్రం నుంచి కూడా ఎన్నో మూలికలు ఔషధలు వినియోగంలోకి రావాలి. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే విషయం మీదే దృష్టి పెట్టాలని నా ఉద్దేశ్యం” అని కిషోర్ గారితో చెప్పి. “మీ మీ ఏరియాలలో మీరేం చేస్తే బాగుంటుందో ఆలోచించండి” అని సి.యమ్  గారు చెప్తుంటే స్నేహలత ఒక్కనిమిషం తన ఆలోచనల్లో పడిపోయింది. ఎక్కడి కిషోర్ కర్నాటక నుండి వచ్చి ఈ సమావేశంలో పాల్గొనటం, మాట్లాడటం, తమందరికీ, ముఖ్యమంత్రిగారి సమక్షంలో సలహాలనివ్వటం, అంతా కలలాగా వున్నది. గాలిలో నుంచి సౌగంధికాపుష్పం తేలి వచ్చి తన ముందు సువాసనలు వీస్తుందా అన్నట్లుగా అనిపిస్తున్నది.

ఆమె ఆలోచనలను చెదరగొడుతూ “లేడీస్ ఫస్ట్ కదా. గుంటూరు జిల్లా ఐఎఫ్‌ఎస్ అధికారిగా అటవీ సంపదను కాపాడటానికి, వాటినింకా అభివృద్ధి చేయటానికి మీ ఐడియాస్ ఏంటి?” అన్నారు సి.యమ్ గారు.

“తప్పకుండా చెప్తాను సర్. అటవీ సంపదంటేనే చాలా విస్తృతమైన అంశం కదా సర్. నా శాయిశక్తులా  ఈ అటవీ సంపదను కాపాడటానికే ప్రయత్నిస్తాను. మనమిప్పుడు ఔషధ మొక్కల పెంపకం అభివృద్ధి గురించి మాట్లాడుకుంటునన్నాం కాబట్టి దాని పట్ల కూడా నాకు కొన్ని ఐడియాస్ వున్నాయి సర్. నేను నా సిస్టమ్‌లో కొన్ని ఐడియాలు చూపిస్తాను. చూడండి సార్ అంటూ సిస్టమ్ ఓపెన్ చెయ్యగానే ‘మహా మేరు పుష్పం’ కనపడింది. “ఇదొకసారి చూడండి సార్. దీనికి మన అంశానికీ ఏం సంబంధం లేదు. దీన్ని మహా మేరు పుష్పం అంటారు. హిమాలయాల్లో పూస్తుంది. అయితే నాలుగొందల ఏళ్ల కొకసారి మాత్రమే పూస్తుంది. ఇప్పుడు పూసింది. మన జనరేషనుకు ఇప్పుడు దీన్ని ఇలా చూసే అవకాశం కలిగింది. దీన్నిఅర్యాపో అని కూడా అంటారు. అరుదుగా పుష్పించే జాతి కదా అని చూపించాను.”

ఇంతలో ఎవరో అన్నారు “కేరళలో మరుంజిపూలు పన్నెండేళ్లకొకసారి పూస్తే ఇది ఏకంగా నాలుగొందల ఏళ్లకు కాని పూయదు” అని.

“అవును” అంటూ నవ్వి స్నేహలత – “ఇది మన జిల్లా అటవీప్రాంతం ఏరియా సర్” అంటూ ఆ ప్రాంత స్వరూపాన్ని క్లుప్తంగా పరిచయం చేసింది.

“ఈ జిల్లాలో సాధారణ అటవీ ప్రాంతం నుండి కీలకమైన అటవీ ప్రాతం కూడా వున్నది సర్. ప్రతి క్లసరకూ సమర్ధుడైన ఫారెస్ట్ బీట్ ఆఫీసరు తప్పని సరిగా వుండాలి సర్. అతను సుమారుగా నాలుగు వేల హెక్టార్ల అటవీ భూమిని పరిరక్షించాల్సి వుంటుంది. జిల్లా కార్యాలయానికి క్లస్టర్ ఆఫీసర్స్ రిపోర్టులు పంపుతూ వుంటారు సర్.  గుత్తికొండ, నకరికట్ల లాంటి కీలక అటవీ ప్రాంతాలుంటే మదినపాడు బీడ్లు కొండ ఎక్కువగా వున్నాయి. నేను ఈ అన్ని ప్రాంతాలూ తిరుగుతాను. వృక్ష శాస్త్రవేత్తలను నాతో పాటు తీసుకెళతాను. వాళ్లక్కావలసిన సహయ సహకారాలు పూర్తిగా అందిస్తాను. అటవీప్రాంత పరిధిలో వున్న గిరిజన రైతుల్ని పంటలు పండిచటానికి ప్రోత్సహిస్తాను. కర్నాటక రాష్ట్ర డిప్యూటి కన్సర్వేటర్‌గారు చెప్పిన సూచనలన్నీ నేను నోట్ చేసుకన్నాను. నేను కూడా అదే దిశలో అలోచిస్తున్నాను. ఏ ప్రాంతంలో ఏ మొక్క, ఏ చెట్టు పెరుగుతాయో తెలుసుకోవాలని నాకు సహజంగానే కుతూహలం ఎక్కవ. ఆ ఇష్టంతోనే ఏ కొండప్రాంతానికైనా ఏ లోతట్టు ప్రాంతానికైనా వెళ్లిపోతాను. అధికారులు, శాస్త్రవేత్తలే కాక కాలేజీలు యీనివర్శిటీల నుంచి ఏ బృందం పరిశోధనలకొచ్చినా వారికి నా పూర్తి సహయ సహకారాలు అందిస్తాను. ఔషధ ఫార్మశీలకు కావలసిన ముడి సరుకును మనం అందిద్దాం సర్. వీలైనంత ఎక్కువగా దిగుమతులను అపేద్దాం సర్”  అంటూ తన మాటల్ని ముగించింది.

“బాగుంది ఇవన్నీ ఇంప్లిమెంట్ చెయ్యండి” అన్నారు సి.యమ్ గారు.

మిగతా ఐఎఫ్‌ఎస్‌లు కూడా తమ తమ ఉద్దేశాలను చెప్పారు. అందరినీ కలసి సి.యమ్ గారు కొన్ని సూచనలు చేసి ఆనాటి సమావేశాన్ని ముగించారు.

సమావేశం జరిగిన హాలు నుండి బయటి కొచ్చిన తర్వాత ఆఫీసర్లు తమ తమ మిత్రులతో బ్యాచ్‍మేట్లతో కాసేపు మాట్లాడుకున్నారు. కొద్దిగా కుటుంబ విషయాలు చర్చకు వచ్చాయి, ఆ తర్వాత అందరూ బయలుదేరి వెళ్లిపోయారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here