ఆమని-3

0
8

[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది మూడవ భాగం. [/box]

[dropcap]స్నే[/dropcap]హలతా, కిషోర్ ఇంకా మాట్లాడుకుంటూనే వున్నారు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడివున్నారు. స్నేహలత తానే తన కుడి చేతిని అందించిందో లేక కిషోరే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడో స్నేహలతకు గమనం లేదు. వాళ్ళిద్దరి చేతులు మాత్రం ఒకరి చేతులు మరొకరి చేయి ఇమిడిపోయి వున్నాయి. ఆ స్పర్శలో చల్లని ప్రశాంతత వున్నది. ఆప్యాయతా, అనురాగాలు నిండివున్నాయి. ఒకరి పట్ల ఒకరికున్న అభిమానాన్ని ఆ చేతుల కలయిక తెలియజేస్తున్నది. చాలా రోజుల తర్వాత ఇలా కలుసుకున్నామన్న ఉత్సాహపు వడి కొంత తగ్గగానే నోటి నుండి రెండు పదాలు బయటకొచ్చాయి. ‘ఎలా వున్నారూ?’ అంటూ ఇద్దరూ ఒకేసారి పలకరించుకున్నారు.

“బావున్నాను కిషోర్. మీ సంగతులేమిటి? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనా? మీ వైఫ్ ఎలా వున్నారు? పిల్లలు ఎంత మంది, ఏం చదువుతున్నారు?”

“ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం బెంగళూర్‌లోనే వున్నారు. వాళ్లు స్కూల్ ‌కెళ్లాలిగా. మా పేరెంట్స్ చూసుకుంటున్నారు. నా వైఫ్ వాళ్ల పుట్టిల్లు ఈ పక్కనే. వెలగపూడి రాజధాని ఏరియా కావటం మూలన బాగా డెవలప్‌మెంట్ జరిగింది. నేనొకసారి చూడాలి అని తనంటే ఇద్దరం కల్సి హైద్రాబాద్ నుండి ఇటొచ్చాం. ఈ కాన్ఫరెన్స్‌లో నా పార్టిసిపేషన్ కావాలని ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియోషన్ రిక్వెస్ట్ చేసింది. దాంతో ఇలా వచ్చాను. మరి మీ సంగతులేంటి? మీ జాబ్ సంగతి నాకు తెలుసు. మీ పర్సనల్ లైఫేంటి? ఏమన్నా ఛేంజ్ వున్నదా?”

“ఛేంజ్ కావాలని అన్పించడం లేదు. అలా అన్పించినప్పుడు ఆలోచిస్తాను.”

“మీకెలా చెప్పాలో నా కర్థం కావటం లేదు స్నేహలతా. ప్రస్తుతం నేను కూడా కొంచెం డిస్టర్బ్‌గా వున్నాను. నాతో ఒక అరగంట వెలగపూడి రాగలరా. ఊరు చూచినట్లుంది. అలాగే నా వైఫ్‌ను పరిచయం చేస్తాను.”

స్నేహలత వెలగపూడి రావడానికి ఇష్టం కన్పరచలేదు. అది గమనించిన కిషోర్ “ఏ అధికారంతో రమ్మంటున్నానని అపార్ధం చేసుకోవద్దు. చాలా రోజులకు కలుసుకున్న పాత మిత్రులం. కొంచెం సేపు కలిసి మాట్లాడుకుందామనే ఉద్దేశంతోనే పిలుస్తున్నాను.”

“సరే పదండి” అంటూ కిషోర్‌తో కలిసి కారెక్కింది. ఆ కారు వెంట ఆమె జీపు ఫాలో అయింది.

“భర్తతో అన్యోన్యంగా వుంటూ, పిల్లల ముద్దు మురిపాలు అనుభవించాల్సిన వయస్సులో మీరు పూర్తిగా మొక్కలూ, చెట్లూ అంటూ అడవికే అంకితం అయిపోయారు. అదంత మంచిది కాదు. భిన్న భిన్న మనుషుల్ని తట్టుకుని జీవితాన్ని ముందుకు సాగనివ్వటమే.”

“నా దృష్టిలో అది పెద్ద మార్పే. ఆ మార్పును జీర్ణించుకుని ముందుకు సాగటానికి నాక్కొంత వ్యవధి అయితే కావాలి. ప్రస్తుతానికింతే. వేరే ఆలోచనలేవీ రావు.”

“ఎవరి మీద కోపం? నా మీదేగా? ఆ కోపంతో మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారు స్నేహలతా. అదికాదు చేయాల్సింది. నాకంటే వున్నతుడితో జీవితాన్ని పంచుకుని వుండాల్సింది. అప్పుడు మీ కోపం తగ్గేది!”

“మీ మీద నాకే కోపమూ లేదు. కోపముంటే ఇలా మీతో మాట్లాడనుగా. రాకనూ పోదును. ఇప్పుడా టాపిక్ వదిలేయండి ప్లీజ్! లేనిపోని బాధలు కొనితెచ్చుకోవటమెందుకు? మరుగున పడ్డ జ్ఞాపకాలను తవ్వి తీసుకోవటం ఇద్దరికీ మంచిది కాదు.”

“మనం అకాడమీలో ట్రెయినింగ్ అయ్యేటప్పుడు మీరు అదే ధ్యాసతో వుండేవాళ్లు. పరిశీలన కోసం ఏ అడవికెళ్లాల్సి వచ్చినా మాకంటే ముందు సిద్ధపడిపోయేవాళ్లు. అప్పటికీ ఇప్పటికీ అలాగే వున్నారు. ఫిజికల్‌గా మెంటల్‌గా కూడా. కొంచెం గూడా మారలేదు స్నేహలతా.”

“అప్పుడు ప్రాక్టికల్‌గా నేర్చుకున్న దానిని ఇప్పుడు మనం ఆచరణలో పెట్టాలిగా. మీరేమో రాష్ట్రస్థాయిలో వున్నారు. చాలా డెవెలప్‌మెంట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఫాలో అయి మేమూ ప్రయోగాలు మొదలెట్టాలి.”

మాటల్లోనే వెలగపూడిలోని వాళ్ల ఇల్లు వచ్చేసింది. ఇల్లు బాగా అట్టహాసంగా కనపడుతున్నది. రాజధాని ఏరియా కళ సంతరించుకుని మరీ దర్పంగా కనపడుతున్నది. లోపలికెళ్లి కూర్చున్నారు. పనామె వచ్చి మంచి నీళ్లిచ్చింది. ఫ్రూట్ జూస్, బిస్కెట్లూ అన్నీ ట్రేలో సర్దించుకుని ఒకామె వీళ్లున్న గదిలోకొచ్చింది. వాటిని అక్కడున్న టీపాయ్ మీద పెట్టించి తాను కిషోర్ పక్కన కూర్చున్నది.

“నా భార్య సౌందర్య. మధుర పెళ్లి కొచ్చినప్పుడు చూసే వుంటారు. వీరు స్నేహలత. నాకు ఐ.ఎఫ్.ఎస్‌లో బ్యాచ్‌మేట్. ఈ రోజు కాన్ఫరెన్స్‌లో కనపడితే ఇంటికి తీసుకొచ్చాను” అంటూ కిషోర్ పరిచయాలు పూర్తి చేశాడు.

సౌందర్య అందంగానే వున్నది. కాని మనిషింతా డల్‌గా వున్నది. కళ్ల కిందంతా నల్లగా అయిపాయింది. ఆ కళ్లుకూడా పీక్కుపోయి ఎక్కడో గుంటల్లో వున్నాయి. తలపైకెత్తి చూస్తే తల మీద జుట్టుంతా బాగా రాలిపోయి మాడు కనపడుతున్నది. సోఫాలో భర్త పక్కన కూర్చుని ఒక అరచేతిలో మరొక అరచేతిని వుంచుకున్నది. ఆ అర చెయ్యంతా పొట్టు రాలిపోయి నల్లనల్లగా, సున్నం రాలిపోయిన గోడలాగా వెలా తెలా పోతున్నది.

“ఏమైనా అనారోగ్యమా? లేక ఈవిడ తీరంతేనా?” అని అనుకునేలోగానే “నన్ను గురించి తర్వాత ఆలోచద్దురుగాని ముందీ బిస్కట్స్ తిని, జ్యూస్ తాగండి. బావా నువ్వు తీసుకో. నేను మాత్రం ఇప్పుడే తింటం మొదలు పెడుతున్నాను” అంటూ బిస్కెట్ తింటూ మధ్యమధ్యలో జ్యూస్ చప్పరించసాగింది.

“ఇప్పుడు చెప్పండి స్నేహలతా. మీరెక్కడ పని చేస్తున్నారు? ఏ ఊళ్లో వుంటున్నారు?” అని అడుగుతుండగానే గొంతు కొరబోయి దగ్గు వచ్చింది.

“జ్యూస్ తాగేసి మాట్లాడు. స్నేహలత ఈ జిల్లా IFS అధికారిగా పని చేస్తున్నారు. తను అన్‌మారీడ్” అంటూ జ్యూస్ తాగసాగాడు. “మీరు తీసుకోండి స్నేహలతా” అన్నాడు కిషోర్.

స్నేహలత గ్లాస్ చేతిలోకి తీసుకుంది. ఈలోగా గుమ్మంలోకి సౌందర్య వాళ్లమ్మగారు వచ్చి నిలబడి వీళ్లను పరీక్షగా చూసి వెళ్లబోయింది.

“రామ్మా! బావా వాళ్ల క్లాస్‌మేట్ అట. ఇక్కడే పని చేస్తున్నారు. వచ్చి ఒకసారి పలకరించి వెళ్లు” అన్నది సౌందర్య.

ఆమె లోపలికి వచ్చింది. స్నేహలత నమస్కరించింది. “మా అమ్మండీ. నాన్న బయటికెళ్లినట్లున్నారు. నేనుగాక ఇంకో అక్క, అన్నయ్య వున్నారు. అక్క యూ.యస్.లో, అన్నయ్య ఆస్ట్రేలియాలో వుంటారు. మేమే ఎక్కడికీ పోకుండా ఇండియాలో వుండి అడవులు పట్టుకు తిరుగుతూ వుంటామని అమ్మకు బాధ. నాన్నేమో పోనీలే అమ్మా, మీరైనా ఇండియాలో మా కళ్ల ముందు వున్నారు అంతే చాలు తల్లీ అంటారు.

పిల్లల బాగేగా అమ్మా పెద్దవాళ్లం కోరుకునేది. అక్కయ్య, అన్నయ్యా స్థితి కంటే మాది తక్కువ స్థితి అయిపోతుందని అలా అంటారు.”

“ఏ ఊరమ్మా మీది. మీ నాన్నగారు ఏం చేసేవాళ్లు” అంటూ ఆరాలగిడింది ఆవిడ.

“నేటివ్ ప్లేస్ ఝార్ఖండ్ అండీ. కాని నాన్నగారు ఆంధ్రా యూనివర్శిటీలో వర్క్ చేసేవాళ్లు. ”

‘అల్లుడెప్పుడూ ఇలా ఏ ఆడపిల్లనూ ఇంటికి తీసుకురాలా. తన కూతురు పక్కన ఆ అమ్మాయి చాలా ఆరోగ్యంగా, దృఢంగా కనపడుతున్నది. తన కింకా పెళ్లికాలేదన్న మాట ఆమె చెవుల్లో పడింది. క్లాస్‌మేట్‌ అట. పైగా పెళ్లి కాలేదు. వీళ్లిద్దరికీ అప్పట్నుంచి పరిచయం వున్నదా. ఆ అమ్మాయెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు. అల్లుడికీ ఆ అమ్మయికీ మధ్య వట్టి పరిచయమేనా. ఇంకేమైనా వున్నదా’ అని ఆవిడ తల్లి మనసు గబగబా ఆలోచించేటట్లు చేసింది.

స్నేహలతను చూసిన తల్లి ముఖం ప్రసన్నంగా లేకపోవటం గమనించి “అమ్మా లోపల నీకేమైనా పని వుందేమో వెళ్లు. నేనిక్కడే వుండి వీరితో మాట్లాడతాను” అని తల్లిని లోపలకి పంపేసింది.

“బావా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు. స్నేహలతగారికి మంచి కంపెనీ ఇవ్వటం లేదు. ఏం స్నేహలతా మేడమ్. బావా అని పిలుస్తున్నానేంటని ఆలోచిస్తున్నారా. నాకీయన మేనత్త కొడుకే. చిన్నప్పుడంతగా ఈయన దగ్గర చనువు లేదు గాని పెళ్లప్పటి నుంచే బాగా పరిచయం ప్రేమా అన్నీ. ‘ఉండ్రాయీ ఒక పిండివంటేనా, మేనత్తకొడుకూ ఒక మొగుడేనా’ అనే సామెతుంది. మా విషయంలో అలా ఏం కాదు. నేనూ మా ఇంట్లో వాళ్ల బావను బాగానే గౌరవిస్తాం. తనూ నన్ను బాగా ప్రేమగా చూసుకుంటాడు” అన్నది గలగల నవ్వుతూ. ఆ నవ్వుకే అలసిపోయినట్లు సోఫాలో తల వెనక్కు వాల్చి జారిగిలబడింది.

“సౌందర్య ఎప్పుడూ అంతే. ప్రతి దానికి సామెతను జోడించి మాట్లాడుతూ వినేవాళ్లను నవ్విస్తూ వుంటుంది” అన్నాడు కిషోర్.

“నిజంగానే సౌందర్యగారి మాటలు వినటానికి హాయిగా వున్నాయి.”

“థ్యాంక్‌యూ. మాటలేగాని బావకు, పిల్లలకూ వేళకు అన్నీ అమర్చి పెట్టలేకపోతున్నా. ఇప్పుడయితే ఏకంగా కీమోథెరపీ తీసుకుంటున్నా. చూస్తున్నారుగా నా అవతారం. కీమో ఇచ్చిన తర్వాత రెండు వారాల పాటు బాగా వీక్‌గా వుంటా. కాస్త కోలుకోవటం మొదలుపెట్టగానే మరలా కీమోథెరపీ మొదలవుతుంది. దాంతో నీరసంగా వుడటం, జుట్టు రాలటం, గోళ్లతో సహా నల్లబడటం” అని చెప్తుంటే ఆమె కళ్లలో సన్నని కన్నీటి పొర కదలాడింది.

ఆ మాటలకు, సౌందర్య స్థితికి స్నేహలత ఒక్కసారిగా కదిలిపోయింది. బాధగా కిషోర్ వంక, సౌందర్య వంక మార్చి మార్చి చూసింది. కిషోర్ ముఖంలో ఏ భావమూ లేదు. చప్పున సౌందర్య చేతులు పట్టుకుని, “ఆయామ్ సారీ, మీరేం అధైర్య పడకండి. ఇప్పుడు మెడిసిన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. త్వరలోనే తగ్గిపోతుంది” అన్నది.

“నేను ఆ ఆశతోనే వున్నాను. బసవతారకం కాన్సర్ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాను. ఎర్లీ స్టేజ్ నుంచే ట్రీట్‌మెంట్ ఇస్తున్నాం కాబట్టి మీరు సేఫ్ అని వాళ్లంటున్నారు. అయినా బావ ఎవరెవరికో ఫోన్లు చేసి కనుక్కుని హాస్పిటల్ వాళ్లతో మాట్లాడుతూ వుంటాడు. చివరకు సోనియాగాంధీ గారికి ట్రీట్‌మెంట్ ఇచ్చే డాక్టర్‌గారితోనూ మాట్లాడి సలహాలు తీసుకుంటున్నాడు. హిమాలయాల్లో దొరికే 16 ఔషధులు, మూలికలూ తెప్పించి నాచేత తాగిస్తున్నాడు. నాకు తగ్గిపోతుందనే ఆశతోనే ఈ కీమోథెరపీ నరకాన్ని భరిస్తున్నాను. వచ్చిన దగ్గర నుంచీ నా విషయాలే చెప్పి మిమ్మల్ని బాగా బోర్ కొట్టించాను. ఏమనుకోవద్దు. మీరెంత మంది అక్కాచెళ్లెళ్లు. పేరెంట్స్ ఎక్కడుంటారు.”

“ఒక తమ్ముడు. మేము ఇద్దరమే. వాడికి మా ఏరియా వైపే జాబొచ్చింది. నన్ను గురించి అమ్మనాన్నా తమ్ముడి దగ్గరక్కుడా పోకుండా నాతోనే వుంటున్నారు. మీకు త్వరగా తగ్గిపోయి మాములు మనిషి కావాలని కోరుకుంటున్నాను. ఇక వెళ్తను” అంటూ లేచింది స్నేహలత.

వెళ్లేముందు మరోసారి సౌందర్య చేయి పట్టుకుని “త్వరలో బాగయిపోతారు చూడండి. నాకు బాగా నమ్మకముంది” అంటూ బయటకు నడిచింది.

ఆమెతో పాటు తను వరండాలోకొస్తూ “నేను త్వరలో బెంగళూరెళ్తాను. అటొచ్చే పని వుంటే మా ఇంటికొచ్చేయండి. అయినా ఎక్కవ రోజులు ఒంటికాయి సొంటి కొమ్ములాగా వుండకండి. మొగలి రేకంటి మొగుడితో రత్నమాణిక్యాల్లాంటి పిల్లలతో వుండటానికి ప్లాన్ చేసుకోండి” అంటూ వీడ్కోలు పలికింది సౌందర్య.

“మంచి సరదా అయిన మనిషి అంతే కాదు చాలా కలుపుగోలుగా కూడా వున్నారు. ఆమె సమక్షంలో రోజులు ఇట్టే గడిచిపోతాయి” అన్నది మనస్పూర్తిగా స్నేహలత.

“అవును. ఆ స్వభావంతోనే, తన మంచితనంతోనూ నన్ను పూర్తిగా తనవాణ్ణి చేసుకున్నది. కాలమే మనల్ని త్వరగా మార్చేస్తుంది స్నేహలతా. మీ జీవితంలో మరెవర్నీ రానివ్వక పాత జ్ఞాపకాలతోనే వుంటూ అదే జీవితం అని భ్రమ పడుతున్నారు. ఎవరినైనా ఆహ్వనించి చూడండి. మీలో ఎంత మార్పు వస్తుందో” అన్నాడు కిషోర్ ఆమెను సాగనంపుతూ.

“అందరూ ఒకలాగే వుండరు గదా కిషోర్? బై” అంటూ స్నేహలత వెళ్లిపోయింది.

స్నేహలత విషయంలో మానసికంగా బలహీనుడయ్యాడు. ఇవ్వాళ కూడ ఆమెతో ఇంకొంచెం మాట్లాడి వుండాల్సింది. ఉద్యోగరీత్యా ఆమె విషయం విన్నాడు గాని తన వ్యక్తిగత జీవితం గురించి ఇవ్వాళే స్పష్టంగా తెలిసింది. ఆమె అలాగే మిగిలిపోయింది. తను మాత్రం ఇద్దరు బిడ్డల తండ్రయ్యాడు. ఆమె అవివాహితగా మిగిలిపోవటానికి పూర్తిగా బాధ్యుడతనేనా? పరిస్థితి అంతా వివరించి అప్పుడే చెప్పాడు. అనుకున్నవన్నీ జరగవుగదా అని కాజువల్‌గానే మాట్లాడింది. తనను తిట్టలేదు. కోపం తెచ్చుకోలేదు. చాలా గంభీరంగా వుండిపోయింది. తనలో కూడా మార్పు వస్తుందనే అని తననుకున్నాడు. కాని ఇలాగే ఆ ఆలోచనలతోనే బతికేసే మనిషనుకోలేదు. తను అవకాశవాదా? నిఖార్సయిన ప్రేమను అందించలేని బలహీనుడయ్యుంటాను. ఆమె మాత్రం నిజాయితీగా వుండిపోయింది. ఒక్కసారిగా వెనుకటి సంగతులు కళ్ల ముందు కదలాడాయి.

ట్రయినింగ్ అయ్యేటప్పుటి స్నేహలత రూపం, ఉత్సాహం గుర్తుకొచ్చాయి. తము ఉత్తరాఖండ్ లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ తీసుకునే వాళ్లు. ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలు వేస్తూ వుండేది. ఆడపిల్లనన్న సంకోచంగాని, భయంగానీ ఏమీ వుండేవి కాదు. ఒక్కసారి మగవాళ్ల కంటే చురుగ్గా, ధైర్యంగా కీకారణ్యంల్లోనూ తిరిగేది. ఏ క్రూరమృగమో ఎదురయితే పరిస్థితి ఏంటన్న ఆలోచనే వుండేది కాదు. విషకీటకాలు కుడతాయేమోనన్న ధ్యాసే లేకుండా కొత్తగా అనిపించిన ప్రతి మొక్కనూ పరీక్షగా చూసేది. ఎంత దూరమైనా అలసట లేకుండా నడిచేది. కొండలు ఎక్కుతూ దిగుతూ వుండేది. ముందు ముందు ఉద్యోగంలో చేరాక అటవీ శాఖకు సేరైన న్యాయం చేసే మనిషినిపించేది. ఆమె కోరికకు తగ్గట్టుగానే అద్బతమైన అరణ్యప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో పోస్టింగ్ సంపాదించిందనుకున్నాడు.

“స్నేహలత పేరు బావున్నది బావా. మనిషీ పొందిగ్గా వున్నది. ఎంతో స్నేహంగా పక్కనే కూర్చుని చేయి పట్టుకుని మరీ మాట్లాడింది. నాకైతే తోబుట్టువులాగే అనిపించింది. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తుంటే మాత్రం ఎప్పుడూ అడవీ, చెట్లూ, పిట్టలూ, జంతువులూ ఇవేనా? ఇంట్లో మురిపించే మొగుడూ, పకపకలాడే పిల్లలూ ఉండొద్దూ? ఇల్లంటే వీళ్లంతా వుండాలి కానీ, కిటికీలూ, దర్వాజాలూ ఉంటే సరా? చెరువుల్లేని ఊరులూ ఊరేనా? మొగుడూ, పిల్లలూ లేని బతుకూ ఒక బతుకేనా?” అంటూ తన ధోరణిలో మాట్లాడసాగింది.

 “నువ్వూరికే ఆలోచించి వర్రీ అవకు. ఆవిడేం తెలివితక్కువది కాదులే. ఇందాకట్నుంచి కూర్చునే వున్నావు. కాసేపు పడుకుని రిలాక్స్‌వు.”

“మరీ అంత బెడ్ పేషెంట్‌ను కాదులే బావా. నీకు అన్నం, టిఫినూ అన్నీ నేనే దగ్గరుండి నా చేతుల్తో పెట్టాలి. నీ పన్లూ, పిల్లల పన్లూ నేను ఇంట్లో వున్నప్పడు ఎవరికీ అప్పచెప్పలేను. టైర్డ్ అయినట్లున్నావు. టీ పెట్టించి తీసుకొచ్చేదా?”

“వద్దు. ఇప్పుడేం వద్దు” అని అనగానే వచ్చి కిషోర్ పక్కనే కూర్చున్నది సౌందర్య.

కూతురి మాటలు వింటున్న తల్లి చాటుగా కన్నీళ్లు తుడుచుకున్నది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here