ఆమని-4

0
8

[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది నాల్గవ భాగం. [/box]

[dropcap]త[/dropcap]న జిల్లా పరిధిలో వున్న అడవులన్నీ ఆ చుట్టుపక్కల కాపురముండే గిరిజనుల స్థితిగతుల్నీ పరిశీలించటానికి స్నేహలత ఒక్కోసారి జిల్లా కలెక్టర్‍తో, మరోసారి ఇతర అధికారులతో కలిసి ప్రయాణం చేస్తునది. ఈ ప్రయాణాల్లో ఎలాంటి దారిలో ప్రయాణం చేయాలాన్నా, చివరికి కాలినడకన తిరగాల్సి వచ్చినా వెనుకాడటం లేదు. వెళ్ళిన చోట గిరిజనుల్ని సమావేశపరుస్తున్నారు. వారితో సాధకబాధకాలు చర్చిస్తున్నారు. ఎక్కువగా చెంచు తెగకి చెందినవారు కనబడుతున్నారు. వాళ్ళు తేనె సేకరణ బాగా చేస్తారు. వాళ్ళకు తేనె పెట్టెలను అందించే ఏర్పాట్లు చేసింది. సమతల భూములున్న చోట్ల ఔషధ మొక్కలు పెంచే దిశగా వాళ్ళకు శిక్షణ ఇప్పిస్తున్నది.

నిజాంపట్నం లాంటి తీరప్రాంతాల్లో వున్న మడ అడవుల్ని విచక్షణా రహితంగా నరికివేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అక్కడి సిబ్బందికి అన్ని జాగ్రత్తలు పంపింది. “చూడండి ఆఫీసర్స్! మనం మరింతగా ఇక్కడ ఈ మడ చెట్లను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. చిన్నా పెద్ద అడవి జంతువులు ఏమైనా ఉంటే వేటాడనివ్వకూడదు. అలా వేటాడడం చట్ట వ్యతిరేకమవుతుందని చెప్పండి. అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి”.

ప్రతి క్లస్టర్‌లో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొన్ని చోట్లకు కలెక్టరు లాంటి ఉన్నతాధికారులు వచ్చారు. గిరిజన రైతుల్నీ సమీకరించారు.

“ఇప్పుడు మన లక్ష్యం వెదురు చెత్లను అభివృద్ధి చేయటం ప్రధానంగా పెట్టుకున్నాం. త్వరలోనే వీలుని బట్టి ఔషధ మొక్కల్ని అందిస్తాం. మీరు ఔషధుల్ని, మూలికల్నీ ఉత్పత్తి చేయడం పట్ల శ్రద్ధ పెట్టండి. సరైన మార్కెటింగ్ సౌకర్యాలని కలగజేస్తాం. అలాగే మీరు తయారు చేసిన చేతి వస్తువులను అమ్ముకోవడానికి వీలుగా దగ్గరున్న పట్టణాలలో స్టాల్స్ ఏర్పాటు చేస్తాం” అంటూ గిరిజన రైతుల్ని ప్రోత్సహిస్తున్నది.

“గిరిజనాభివృద్ధికి పాటు పడడం మన కర్తవ్యం. లక్షల ఎకరాల్లో విస్తరించి వున్న ఈ అడవిని సంరక్షించడం మనందరి బాధ్యత. గిరిజన సమాజ సమితులు అన్ని చోట్లా యాక్టివ్‌గా లేవు. వాటిని యాక్టివ్ చేయించడం మన అందరి బాధ్యత. విద్యా, వైద్య సహాయలు లేని చోట వాటిని అందించాలి. వన్యప్రాణుల సంరక్షణ కోసం అక్కడక్కడా పార్కులు ఏర్పాటు చేయాలి. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతున్నాను. నేనొక్కదాన్ని ఏమీ చేయలేను. మీ అందరి సహాయ సహకారాలుంటేనే ఇవన్నీ నెరవేరుతాయి. అంకిత భావంతో అందరం పని చేసి గిరిజనాభివృద్ధిని చూద్దాం” అంటూ తన క్రింది సిబ్బందిని ఉత్సహాపరుస్తున్నది.

లక్షల ఎకరాలలో అడవులు విస్తరించి వున్నట్లే ఆమె మెదడులో కూడా అనంతమైన ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. మిగతా జిల్లాల వారు చేసినట్లుగా తాను కూడా ‘ఎకో టూరిజమ్’ అభివృద్ధి చేసి అడవుల్ని సందర్శించాలనుకునేవారికి కాటేజ్ సదుపాయం, వాహన ఏర్పాట్లు చెయ్యాలన్న ఉద్దేశంతో ఏ ప్రాంతమైతే దానికి అనుకూలంగా వుందా అని ఆలోచిస్తూ మ్యాప్ ముందు పెట్టుకుని పరిశీలించసాగింది. తన ఆలోచలను ఒక్కొక్కటే కార్యరూపంలో అమలు చేసుకుంటూ పోతే గాని తనకు తృప్తిగా వుండదు.

***

కిషోర్ బెంగుళూరు వచ్చేశాడు. సౌందర్య ఇంకా అక్కడే వున్నది.

“నాన్నగారూ! మీతో అమ్మను తీసుకురాలేదేంటి?” పిల్లలు నిరాశగా అడిగారు.

కొద్ది రోజులు అమ్మమ్మ వాళ్ళ దగ్గరుండి వచ్చేస్తుంది  నానన. అమ్మకిప్పుడు ఒంట్లో బాగోలేదుగా. కాస్త రెస్ట్ కావాలి. ఇక్కడకొస్తే మీ పనులు, నా పనులు అన్నీ చేసేస్తూ సరిగా విశ్రాంతి తీసుకోదు. అందుకని నేనే కొద్ది రోజులు అక్కడే వుండమని చెప్పొచ్చాను. ఈలోగా మీరు నానమ్మ, తాతగార్ని విసిగించకుండా బుద్ధిగా వుంటారుగా, వుంటారు. నాకు తెలుసు. మీరిద్దరూ బాగా బుద్ధిమంతులు గదా” అంటూ ఇద్దర్నీ దగ్గరకు తీసుకుని ముద్దాడాడు.

“సౌందర్య బాగానే వుందిగా, ఇబ్బందేం లేదుగా?” అన్నది అతని తల్లి ఆదుర్దాగా.

“బాగానే వుందమ్మా. ఓ నాలుగు రోజులుండి వచ్చేస్తుంది. నాకు శెలవు పొడిగించడం వీలవదుగా. పైగా పిల్లలు మేమిద్దరం లేకపోతే మరీ బెంగ పెట్టుకుంటారని నేను వెంటనే వచ్చేశాను.”

“మా పన్లు మేమే చేసుకుంటాం. మీకు హెల్ప్ చేస్తాం. అమ్మను కష్టపెట్టం. తనను త్వరగా తీసుకొచ్చేయండి నాన్నా” పిల్లలు జాలిగా అడిగారు.

“ఏంటో మేనకోడ్లని కావాలనుకుని ఎంతో మురిపెంతో ఈ పెళ్ళి చేశాం. పెళ్ళయి పదేళ్ళన్నా గడవకుండానే సౌందర్యకిలా అయింది. ఏం గ్రహచారమో ఏంటో” అన్నది బాధ నిండిన గొంతుతో కిషోర్ తల్లి ఈశ్వరమ్మ.

“పిల్లల ముందు ఇంకెప్పుడూ అలా మాట్లాడవద్దమ్మా. వాళ్ళింకా దిగులు పడిపోతారు” అంటూ కిషోర్ పిల్లల్ని తీసుకుని గదిలోకి వెళ్ళాడు.

“సౌందర్యతో పెళ్ళనగానే ఎందుకనో మొదట్నించీ కిషోర్ అంత సుముఖంగా లేడు. తనకేవో ఆలోచనలున్నాయన్నాదు. నేను నీతో కూడా అనలేదు. కాని ఆ తర్వాత సౌందర్య తన మంచితనంతో కిషోర్‌ని ఆకట్టుకున్నదనుకో. ఎలాగో సర్దుకుని కిషోర్ సౌందర్యతో ప్రేమగా వుంటున్నాడులే అని స్థిమితపడ్డాను. ఇంతలో ఇలా అయింది. కిషోర్ అన్నట్లుగా పిల్లల దగ్గర మనమెవరమూ బయటపడకూడదు” అన్నాడు కిషోర్ తండ్రి ప్రకాశరావు.

“వాడికేదో ఈ పెళ్ళి ఇష్టం లేనట్లు అనుకోకూడదండీ. ఎప్పుడైనా వాడు ఏ విషయంలోనైనా పొంగిపోవటం చూశామా? పెద్ద చదువుకు సీటొచ్చినప్పుడు గానీ, పెద్ద ఉద్యోగం వచ్చినప్పుడు గానీ ఎప్పుడూ విరగబడలేదు” అంటూ ఆమె లోపలికి నడిచింది.

ఆ రాత్రి పిల్లలిద్దరి మీదా చేరొక చెయ్యి వేసి పడుకున్న కిషోర్‍కు ఎంతకీ నిద్ర రాలేదు. ఏవేవో ఆలోచనలు ఒకదాని వెంబడి ఒకటి వస్తున్నాయి. తానేమయినా అన్యాయంగా ప్రవర్తించాడా? ఆ అన్యాయం స్నేహలతకు జరిగినందు వలనే సౌందర్యకిలా అయిందా? ఇప్పుడు సౌందర్య ఆరోగ్యమేమవుతుంది? పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయిన స్నేహలత ఏం సాధిద్దామనుకుంటోంది? పైకి మాత్రం మామూలుగానే వున్నది. అభిమానంగానే మాట్లాడింది. బడబానలాన్నంతా మనసులోనే అదిమి పెట్టిందా? స్నేహలత అంత బాధపడుతున్నదా? తామిద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నది మాత్రం నిజం. ఆ ఉద్దేశంతోనే తమ పరిధుల్లో తాముంటూ ఎన్నో కలలు కన్నారు. తొలివలపు ఎంతో గాఢంగా వుంటుందంటారు. ఆ గాఢతలో మునిగిపోయి స్నేహలత  బయటపడలేకపోతోందా? మామూలుగా తను చాలా ధైర్యవంతురాలు. వ్యక్తిగా తన కన్నా ఆమె ఊహల్లోని కిషోర్ చాలా ప్రేమపాత్రుడు, ఆమె ఆరాధ్యుడు ఒకప్పుడు. ఆమె అవే ఆలోచనల్లో వుండి వాస్తవాలు గ్రహించలేకపోతున్నది. ఆమెను వాస్తవంలోనికి తీసుకురావాలి. ఆమె దృష్టిలో తను అవకాశవాదిని, స్వార్థపరుణ్ణీ అని కూడా అనుకుని వుంటుంది. ఎలా అనుకున్నా ఫర్వాలేదు. ఆమె జీవితం బాగుపడాలి. బాగు చేసే వ్యక్తి ఆమెకి తొందరలోనే తారసపడితే బాగుండును.

***

అకాడెమీలో శిక్షణ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన రోజులు. ఇంకా ఎక్కడా పోస్టింగ్ రాలేదు. కాని త్వరలోనే కలెక్టర్ హోదాతో సమానమైన ఉద్యోగం వస్తుందని తమ ఊర్లో అందరూ గొప్పగా చెప్పుకోసాగారు. అది ఎవరు ప్రచారం చేశారో తెలియదు.

ఆ రోజు తను టౌన్‌కి వెళ్ళి వచ్చేసరికి వెలగపూడి నుండి నెక్కల్లు లోని తమ ఇంటికి మేనమామ వచ్చి వున్నాడు. ఎప్పుడూ రానివాడు ఇట్లా వచ్చాడేంటబ్బా అనుకున్నాడు తాను గూడా. దగ్గర దగ్గర ఊళ్ళే అయినా తమను తీసుకువెళ్ళటం గానీ, వాళ్ళు రావటం గానీ చాలా తక్కువసార్లు మాత్రమే జరిగింది. ఈశ్వరమ్మ కయితే ఒకటే కంగారు. రాగానే తల్లితో ఏం మాట్లాడాడో కాని పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నది. భర్త పొలాన్నుంచి ఎప్పుడొస్తాడా అని పదే పదే వీధి వాకిలి వంక చూస్తున్నది.

“ఏమోయ్ చదువయిపోయినట్లేనా? ఉద్యోగం రావటాని కెన్నాళ్ళు పడుతుంది? ఉద్యోగమొస్తే ఈ దగ్గర్లో వస్తుందా? దూరం పోవాలా?” అంటూ ఒకదానివెంట ఒకటి తన సందేహాలన్నీ బయటపెట్టాడు.  కావటానికి స్వంత మేనమామే అయినా అంతగా ఆప్యాయత కురిపించిన సంఘటనలేవీ తనకు జ్ఞాపకమే లేవు. ఏవైనా వేడుకలప్పుడు కలిసినా మామూలు పలకరింపులే వుండెవి. పొలాలు, తోటలూ, వ్యాపారాలూ అన్నిట్లో కలిసొచ్చి డబ్బు బాగా కూడేశాడు. తన తండ్రి వున్న దాంట్లోనే తృప్తి పడే రకం. ఏ రకమైన తాపత్రయాలూ, ఆరాటమూ లేని మనిషి. నింపాదిగా తనకున్న మెట్ట వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపే మనిషి. మేనమామ లోకేశం ఏ ఎండకా గొడుగు పట్టే రకం. వున్న రూపాయిని పది రూపాయలు ఎలా చేద్దామా అని తపన పడే మనిషి.

“మనకు దగ్గర్లో ఉద్యోగమొచ్చే అవకాశముందా అని మామయ్య అడుగుతున్నాడు రా? వినపళ్ళేదా?”

“దగ్గర్లో రాదమ్మా. వేరే రాష్ట్రం పోవాల్సి వుంటుంది” అంటూ కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. తండ్రి కూడా వచ్చిన తర్వాత భోజనాలు చేశారు. ప్రకాశరావుకి కూడా ఆశ్చర్యమేసింది తన బావమరిది ఇక్కడకు రావటం, పైగా భోజనం చెయ్యటం. భార్య ముఖం వంక చూశాడు. ఆనందంలో వెలిగిపోతున్నది. ఇదంతా వాళ్ళన్నయ్య వచ్చినందుకేనా? అనుకున్నాడు. కిషోర్ లోపలి కెళ్ళిపోయాడు. ఈశ్వరమ్మ, లోకేశం ఒకరి ముఖాల వంక ఒకరు చూసుకుంటూ ఇక చెప్పొచ్చు అనుకున్నారు.

“మా అన్నయ్యేదో మాట్లాడతాడంటయ్యా, మీతోనూ, అబ్బాయితోనూ”

“ఇందులో దాపరికమేముంది బావా? వడ్లగింజలో బియ్యపు గింజ. సౌందర్యకు డిగ్రీ అయిపోయింది. పెళ్ళి చేయాలనుకుంటున్నాం. మేనల్లుడుండగా  బయటి సంబంధాలు చూడటమెందుకనుకుంటున్నాను. నేనిచ్చే కట్న కానుకలు మీరు ఊహించను కూడా ఊహించలేరు. పెద్దమ్మాయికిచ్చిన దానికన్నా మరింత ఎక్కువే ముట్టజెప్తాను” అన్నాడు లోకేశం దర్పంగా.

“కట్నకానుల సంగతి తర్వాత. సౌందర్యా, వాళ్ళ అమ్మా ఏమన్నారు? పైగా ఇది ఎప్పుడూ అనుకోని సంగతి. కిషోర్ ఉద్దేశమేంటో కూడా తెలుసుకోవాలి బావా”

“అదేంటి బావా, అలాగంటావు? నా మాటను సౌందర్యా, వాళ్ళ అమ్మా కాదంటారన్న ఆలోచన నీకెలా వచ్చింది? అదెప్పుడూ జరగని పని. పిల్లలు ఇప్పుడేగా పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళి సంగతులు ఇప్పుడు కాకుండా ఇంతకు ముందు నుండీ మాట్లాడుకుంటామా ఏమిటి? మీ కిషోర్‌కేమైనా చెప్పి ఒప్పించాలా? నా చెల్లెలికెలాగో ఇష్టమే. నీకూ, నీ కొడుక్కూ ఇష్టమో కాదో చెప్పండి” అన్నాడు కుండ బద్దలు కొట్టినట్టు.

“నీ మాట నీ పిల్లలెలా వింటారో మా మాట మా పిల్లలూ వింటారన్నయ్యా. ఇప్పటి వరకూ కిషోర్ మా మాటకెపుడూ ఎదురు చెప్పి ఎరుగడు” అంది ఈశ్వరమ్మ గలగలా.

“ముందు మీరు చెప్పండి,  మీ ఉద్దేశమేమిటో. మా అన్నయ్య అడుగుతున్నాడుగా” అని అన్నది భర్త నుద్దేశించి.

“వాళ్ళ పిల్ల మనింట్లో ఇమడగలదో లేదో? వాళ్ళు ఆలోచించుకోవాలి. నిన్ను చేసుకునేటప్పుడు మీదీ మాదీ ఒకే అంతస్తు. ఇప్పుడు మీ అన్నయ్య బాగా పెరిగిపోయాడుగా. కిషోర్ చిన్నపిల్లాడు గాదు. వాడూ ఆలోచించుకోవాలి. అంతేకాని ప్రత్యేకించి నా అభ్యంతరాలేముంటాయి” అన్నాడు.

“ముసుగులో గుద్దులాటెందుకు? కిషోర్‌నూ పిలవండి.  నేనే తేల్చుకుంటాను” అన్నాడు లోకేశం.

మరీ ఒత్తిడి పెడుతున్నాడనిపించింది భార్యాభర్తలకు. అయినా ఈశ్వరమ్మ వెళ్లి కిషోర్‌ను బయటకు పిలుచుకొచ్చింది.

“విషయం వింటున్నావు. నీ ఉద్దేశమేమిటో చెప్పు. మీ అమ్మకూ, నాన్నకూ ఏమీ అభ్యంతరం లేదు. సౌందర్య చాలా మంచిదీ, తెలివి గలదీ. నా కూతురని గాదు. ఎంత ఒద్దికగా ఉంటుందో మీరే చూచి తెలుసుకోండి” అన్నాడు లోకేశం.

“నా ట్రైయినింగ్ ఇప్పుడేగా పూర్తయ్యింది. పోస్టింగ్ ఎప్పుడొస్తుందో, ఎక్కడొస్తుందో తెలియదు. ఉద్యోగం ఖరరాయ్యేదాకా పెండ్లి చేసుకునే ఉద్దేశం లేదు” అంటూ లేచి వచ్చాడు.

కిషోర్ మనసు బండబారింది. ఇది తనూహించని పెళ్ళి ప్రస్తావన. తను అనుకునేది వేరుగా వున్నది. ఇప్పటి వరకూ మేనమామ దృష్టిలో తనొక బక్కరైతు కొడుకు మాత్రమే. తను ఐ.ఎఫ్.ఎస్. పూర్తి చేసి రాగానే అల్లుణ్ణి చేసుకోవాలనే కోరిక మోసుకొచ్చింది. ఆ కోరికతో సరాసరి వచ్చి అమ్మను ఐస్ చేసేశాడు. తన పుట్టించి నుంచే కోడల్ని తెచ్చుకోవటమన్న ఆలోచనే అమ్మకు ఎక్కడలేని ఆనందాన్నిస్తున్నది. తమ స్థాయి కూడా ఎంతో పెరిగిపోయిందని, బంధువర్గంలో తననెంతో గొప్పగా చూస్తున్నట్లు ఊహించుకోసాగింది.

ఆ రోజుకు మేనమామ వెళ్లిపోయాడు. ఈశ్వరమ్మ మాత్రం అడిగినవాళ్ళకూ, అడగని వాళ్ళకూ అందరికీ, తన అన్నే స్వయంగా వచ్చి సౌందర్యను చేసుకొమ్మని అడిగాడని, తమంతా ఒప్పేసుకున్నామని చెప్తున్నది. తన మనసులో సుడులు తిరిగే ఉద్దేశాన్ని ఎలా బయటపెట్టాలి? సంతోషంతో వెలిగిపోతున్న అమ్మ ముఖం తన మాటలు వింటే ఎలా మారిపోతుంది? తన తండ్రి కూడా తను కులాంతర వివాహం చేసుకుంటే ఒప్పుకుంటాడా? పైగా చెల్లెలు మధుర బాధ్యత ఉన్నది. ముందుగా ఆమెకు పెళ్ళి చేయాలి. తన ఉద్దేశమదే. మధుర పెళ్ళయిన తర్వాత తను స్నేహలతను పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడు. మధుర డిగ్రీ పూర్తి చేసింది.  ఒక పక్క ఇంకా తనకు పోస్టింగ్ ఆర్డర్స్ రాలేదు. “డిగ్రీ అయిందిగా, బిఇడీ చెయ్యాలని అనుకుంటున్నాను అన్నయ్యా” అని మధుర అంటున్నది. తనకూ అదీ బాగానే వుందనిపించింది. ఈలోగా లోకేశమే పూనుకుని మధురకు ఒక సంబంధం తెచ్చాడు. వరుడు బ్యాంక్ ఉద్యోగి. అందరికీ ఈ సంబంధం బాగా నచ్చింది.

“ఉన్న పొలంలో ఎక్కువ భాగం, మధురకు కట్నంగా ఇవ్వండి” అన్నాడు తను.

“ఉద్యోగంతో పాటు వాళ్ళకు వెనకాల ఆస్తిపాస్తులు బాగానే వున్నాయి. పైగా బ్యాంకులో ఉద్యోగం. కట్నకానుకలు భారీగానే ఇవ్వాల్సి వస్తుందని తెలిసింది.

“అంత భారీగా కట్నం, ఆపైన పెళ్ళి ఖర్చులు ఇవన్నీ భరించటం నా వల్ల కాదు. ఉన్నదంతా మధుర కిస్తే, మాకు భుక్తి గడిచేదెట్లా? కిషోర్‌కు ఏం ఇవ్వగలం?” అన్నాడు ప్రకాశరావు.

మధుర దిగులుగా పడుకున్నది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here