ఆమని-7

0
7

[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది 7వ భాగం. [/box]

“సౌందర్యా! ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? కాసేపెంతో హుషారుగా వుంటావు, మళ్ళీ కాసేపు డీలా పడిపోతావు. ధైర్యంగా ఉండమ్మా.”

“ధైర్యంగానే వుంటున్నానమ్మా. కానీ ఏదో తెలీని భయంతో సరిగా నిద్ర కూడా పట్టడం లేదు. పిల్లల్నీ, ఆయన్నీ వదిలి ఇన్ని రోజులెప్పుడూ వుండలేదు. మాటి మాటికీ వాళ్ళే గుర్తుకొస్తున్నారు. అలా దూరంగా వుండడం కూడా మంచిదేలే. నేను లేకుండా వుండటం అలవాటు చేసుకుంటారు. వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. రేపు నాకేదైనా జరిగితే ఇబ్బంది పడకుండా వుంటారు. ఆ ఉద్దేశంతోనే బావతో వెళ్ళకుండా ఇక్కడ ఆగిపోయాను. చిన్నప్పటి నుంచీ ఆడిపాడిన పుట్టిల్లు ప్రశాంతంగా వుండొచ్చనుకున్నాను గాని ఆ ప్రశాంతతేమీ నా దగ్గరకు రావడం లేదు. నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్న ఆనాటి హాయి రావటం లేదమ్మా” అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నది.

“అవేం మాటలు తల్లీ? మాకందరికీ ఎంతో ధైర్యం చెప్తూ నువ్వే ఇలా అధైర్యపడిపోతే మా గతేం కాను? మీ నాన్న లోపల్లోపలే కుమిలిపోతున్నారు. ఈ మాటలు విన్నారంటే భోరుమంటారు.  అశుభం మాట్లాడకు తల్లీ. అంతా మంచే జరుగుతుంది. పోనీ అక్కడ దగ్గరకు అమెరికా కాని, అన్నయ దగ్గరకు ఆస్ట్రేలియా కాని వెళ్ళి వైద్యం చేయించుకుంటావా?”

“అక్కడ ఇంతకన్నా మంచి వైద్యమేమీ వుండదమ్మా. ఏదన్నా జరగరానిది జరిగితే నా శవాన్ని తీసుకురావడానికి మీరంతా నానాపాట్లు పడాలి.”

“అయ్యో నా తల్లీ! అలాంటి మాటలు మాట్లాడి నిన్ను నువ్వు క్షోభ పెట్టుకోకు. ఎంతో ధైర్యంగా, వైద్యం చేయించుకుంటున్నావు. అంతే ధైర్యంగా కాలం గడపాలి గాని ఇలా డీలా పడిపోతే ఎలాగమ్మా? నేను చెప్తున్నాను కదా చూడు. కన్నతల్లి మాట గడప దాటి పోదంటారు. నా మాట ఈ గడప లోపలే ఉండి నిన్ను కాపాడుతుంది చూడు. అంతా మంచే జరుగుతుంది.”

“కీడేమీ జరగకపోతే మంచిదే కదమ్మా” అంటూ సౌందర్య నిట్టూర్చింది.

మర్నాడు ఉదయాన్నే మధుర వచ్చింది. సౌందర్య వెలగపూడిలోనే వుంది కాబట్టి వచ్చి చూచిపోదామని వచ్చానన్నది.

“మా ఇంటికి రా వదినా. రెండు రోజులన్నా వుండి వద్దువుగాని. నీకూ కాస్త మార్పుగా వుంటుంది. మీ అన్నయ్య కూడా ఈ మాటే అన్నారు.”

“వద్దు మధురా! నాకెక్కడికీ ఈ అవతారంతో రావాలని లేదు. నీకు వీలైతే ఒక్కసారి అమరావతి వెళ్ళి, అమరేశ్వరుణ్ణి దర్శించి వద్దాం.”

“అదెంత భాగ్యమొదినా? ఈ రోజే వెళ్దాం” అంటూ బయలుదేరారు.

మళ్ళీ చూస్తానో లేదో అన్నట్లుగా తనివితీరా చూస్తున్నది అమరేశ్వరుణ్ణి సౌందర్య.

“అమ్మా! బాల చాముండేశ్వరీ! నా భర్తనూ, పిల్లల్నీ అన్యాయం చెయ్యకమ్మా! చిన్నప్పటి నుండి నిన్నే కొలుస్తున్నాను. నీ ఆశీస్సులు నా కందించమ్మా” అంటూ వేడుకున్నది.

ఇంతలో ఎవరో అధికారి వస్తున్నారంటూ గుళ్ళో కాస్త హడావిడి మొదలైంది. క్యూ లైన్లను సర్దసాగారు. తాను ఏ  హడావిడి లేకుండానే తల్లిదండ్రుల్ని తీసుకుని గుళ్ళోకి వద్దామనుకున్నది స్నేహలత. డ్రైవరూ, అటెండరూ చెప్పినట్లున్నారు తన రాక విషయం. పూజారుల్లో కొద్దిగా కలకలం మొదలైంది. తల్లీ తండ్రి దేవాలయాన్ని సందర్శించుకుంటుంటే స్నేహలత చుట్టూ పరిసరాలను కూడా పరిశీలించడం మొదలు పెట్టింది. గుడి ఏరియా అంతా చాలా బాగుంది. గుడినానుకుని కృష్ణమ్మ ప్రవహిస్తున్నది అమరేశ్వరుణ్ణి, బాల చాముండిని నిత్యం తన జలాలతో అభిషేకిస్తాను అన్నట్లుగా. వెంకటాద్రి నాయుడు విగ్రహం దగ్గర నిలబడింది ఆయన చరిత్ర అంతా జ్ఞప్తికి తెచ్చుకుంటూ.

ఇంతలో “స్నేహలత గారూ!” అంటూ దూరం నుంచి మాట వినిపించింది.

“ఆలయ మర్యాదలన్నీ అందుకుని వెలుపలికి రండి. నేనిక్కడ ఈ మంటపంలో వుంటాను” అని బిగ్గరగా అంటూ ముందుకెళ్ళింది సౌందర్య.

దర్శనమూ, ఆశీర్వచనమూ అయిన తర్వాత పూజారుల దగ్గర శెలవు తీసుకుని సౌందర్య వున్న మంటపం వైపుకు నడిచింది.

“చాలా త్వరగా మనం మళ్ళీ కలుసుకున్నాం… ఆఫీసొదిలి పెట్టి ఏమిటిలా వచ్చారు?” అన్నది సౌందర్య.

“హాపీగానే వున్నారుగా? వుండాలి. మందులవీ సరిగా వేసుకుంటున్నారా?”

“మందు బిళ్ళలు పెద్దగా మింగే పనేమీ లేదు. రేడియేషనో, కీమోలో వుంటాయి. తను మధుర. మీ కిషోర్ గారి చెల్లెలు. ఈ రోజు ఉదయమే వచ్చింది” అని చెప్పి, “మధురా! వీరు స్నేహలతగారు. మీ అన్నయ్యతో పాటు ఐఎఫ్‌ఎస్ ట్రైనింగయ్యారు. ప్రస్తుతం మన జిల్లా కన్జర్వేటర్‌గా పనిచేస్తున్నారు” అంటూ పరిచయం చేసింది.

“నేను మధుర గారి పెళ్ళికి వచ్చాను. పెళ్ళిలో తనను చూశాను. తెలుసు” అంటూ స్నేహలత నవ్వింది.

కుంజలత దంపతులు గుడిలో చూసిన విశేషాలను చర్చించుకోవటంలో మునిగిపోయారు. స్నేహలత ఇద్దరినీ సౌందర్యకూ, మధురకూ పరిచయం చేసింది.

“మీ పేరెంట్స్ కూడా వచ్చారుగా. వాళ్ళనూ తీసుకుని వెలగపూడి వెళదామా? కాసేపు కూర్చుని మాట్లాడుకోవచ్చు. మా ఊరు కూడా చూస్తారు” అన్నది సౌందర్య.

“లేదు సౌందర్యా. నాకాఫీసు పని వుంది. మరో మారు చూద్దాం. టేక్ కేర్. మధురా బై” అంటూ తల్లిదండ్రులతో పాటు గుడి బైటకు నడిచింది స్నేహలత.

“వదినా! ఈవిడ నీకెప్పుడు పరిచయమయ్యింది? బెంగుళూరేమయినా వచ్చిందా?”

“మొన్నా మధ్య మీ అన్నయ్య ఇంటికి తీసుకొచ్చారు. ఏ మాత్రం గర్వం లేకుండా బాగా మాట్లాడారు. ఇవాళ అనుకోకుండా గుళ్ళోనూ కనబడేసరికి నేనే పిలిచాను. బాల చాముండి ఆమెను నాకు కనిపించేటట్లు చేసింది. ఆమెతో మాట్లాడినంత సేపూ మనసు ప్రశాంతంగా వుంటుంది మధురా! బాగా మోరల్ సపోర్ట్ ఇస్తూ మాట్లాడతారు.”

“అన్నయ్య క్లాస్‌మేట్ లేకపోతే అన్నయ్య ఫ్రెండో అయినంత మాత్రాన నీ ఫ్రెండే అయిపోయినట్లుగా ఫీలవుతున్నావ్ వదినా! ఆవిడతో మాట్లాడితేనే అంత ప్రశాంతత రావటమేంటొదినా? ఆవిడ నీకంత ఆత్మీయురాలయిందా? నేనొస్తే నీకు సంతోషంగా లేదా?”

“ఛ. ఛ. అదేం కాదు మధురా. నీది బంధుత్వంతో కూడిన ఆప్యాయత. ఆమెది అమె వ్యక్తిత్వం పట్ల నాక్కలిగిన ఆత్మీయత. ఎందుకో తెలియదు గాని తనని చూడగానే ఎవరో ఆత్మీయురాలని నాకే అన్పించింది. మీ అన్నయ్య ఆమె గురించి చాలా మంచిగా చెప్పారు. నా సంగతి అలా వుంచు. మీ అన్నయ్య ఎంత హాపీగా ఫీలయ్యారో నేను గమనించాను. మనం మన చిన్నప్పటి ఫ్రెండ్స్‌ను చాలా కాలం తర్వాత చూస్తే ఎలా స్పందిస్తామో అంతకు నాలుగురెట్లు స్పందించి ఆమెను గురించి ఆ రాత్రి పొద్దుపోయేదాక నాకు చెప్తూనే వున్నారు. ఇప్పటి మా జీవితాల్లో ఇలాంటి అనుభూతులేగా వున్నవి.”

“అంత నిరాశగా మాట్లాడకొదినా. నీ కొచ్చిందేం తగ్గని రోగం కాదు. నువ్వు ధైర్యంగా వుండు. నిన్ను చూసి అన్నయ్యా, పిల్లలూ ధైర్యంగా వుంటారు. పద ఇంటి కెడదాం” అంటూ గుడి బయటకు నడిచారు.

“వదినా! నువ్వు బెంగుళూరెప్పుడు వెడుతున్నావ్? అక్కడ పిల్లలు బెంగ పెట్టేసుకుంటారేమో?”

“మీ అమ్మా నాన్న ఎంత మరిపించినా వాళ్ళుకుండే బెంగ వాళ్ళకుంటుంది. నా ఆలోచనలు స్థిరంగా వుండడం లేదు మధురా! కొన్నాళ్ళు వాళ్ళకు దూరంగా వుంటే నేను లేకుండా అలవాటు పడేట్టు చేయాలని అనిపిస్తుంది. మరొకసారి ఉన్నన్నాళ్ళైనా వాళ్ళ కళ్ళ ముందే గడపాలనీ, అలా గడిపితేనే మంచిదనీ అనుకుంటాను. త్వరలోనే బెంగుళూరు వెళ్ళిపోతాను.”

“నీకేం కాదొదినా. ఇన్ని మంచి మందులు అన్నయ్య తెప్పించి వాడిస్తున్నాడు. తగ్గదని నువ్వు అనుకోవడం పొరపాటు. ఒంటరిగా ఉండి ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తున్నావు. నువ్వు ఒంటరిగానూ వుండొద్దు, అన్నయ్య వాళ్ళ దగ్గరకెళ్ళు. ఈ స్నేహలత సంగతి నాకిప్పుడు గుర్తొచ్చింది. అన్నయ్య తన ఫ్రెండ్స్‌ను గురించి ఇంట్లో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. నా పెళ్ళికి మాత్రం కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళలో ఈమె కూడా వున్నది. నువ్వు గమనించే వుంటావు.”

“అవునట. మీ అన్నయ్య ఇంటికి తీసుకొచ్చి విషయం చెప్పినప్పుడు నాక్కొంచెం గుర్తొచ్చింది. నీకో విషయం తెలుసా మధురా? ఆవిడింత వరకూ పెళ్ళి చేసుకోలేదు. తల్లీ తండ్రీతో కలిసి వుంటున్నది. వీళ్ళ స్వంత ఊరు ఝార్ఖండ్ లోని పూర్వ్ సింగ్‌భమ్ జిల్లాలోనిదట. చాలా రోజుల్నుండి వాళ్ళ నాన్నగారి ఉద్యోగ రీత్యా ఆంధ్రాలో వుండటం వలనేమో తెలుగు బాగా వచ్చు. మీ అన్నయ్య లాగే ఈవిడకి కూడా అటవీ ప్రాంతాన్నీ, అక్కడుండే గిరిజనుల్నీ బాగు చేయాలని తపన పడుతున్నదట.”

“కానీ పెళ్ళెందుకు చేసుకోలేదో? వాళ్ళ కులంలో ఈమె చదువుకు తగ్గవాడు దొరికి వుండడు. ఆంధ్రవాళ్ళను చేసుకుంటే కులం, గిలం చూడకుండా చేసుకోవాలి. అయినా ఈ రోజుల్లో అంత పట్టింపులు పట్టడం లేదులే” అన్నది.

కారు ఇంటి ముందు ఆగగానే దిగి ఇద్దరూ లోపలికి నడిచారు.

***

గుత్తికొండ అటవీ ప్రాంతం కీలకమైనదే. తరచూ కలప మాఫియాని ఎదుర్కొనవలసి వస్తుంది. పైగా అక్కడ నక్సలైట్లు సంచరిస్తున్నారని వినికిడి వస్తుంది. ఆ డివిజన్ ఆఫీసర్ నుంచి తరచూ రిపోర్టు లొస్తున్నాయి. అనేక జాగ్రత్తలు పడవలసి వస్తున్నది. ఇక్కడ నిరుపేద గిరిజన కుటుంబాలు ఎక్కువే వున్నాయి. ఇప్పుడొచ్చిన రిపోర్టు అడవికి సంబంధించినది కాదు. ఆడపిల్లల అదృశ్యంపై వచ్చింది. గిరిజన బాలికల వసతి గృహం నుండి ఇద్దరు ఆడపిల్లలు కనిపించకుండా పోయారని తెలిసింది. కింది ఆఫీసర్లకి అప్పగించకుండా తనే స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళింది.

వసతిగృహం వాళ్ళు పోలీసు రిపోర్ట్ ఇచ్చామని చెప్తున్నారు. మిగతా పిల్లల్నీ, సిబ్బందినీ సమావేశపరిచింది.

“వాళ్ళు ఇంటికెళ్ళొచ్చి ఎంత కాలమయింది?”

“ఈ మధ్యే క్వార్టర్లీ సెలవుల కెళ్ళి వచ్చారు.”

“వచ్చేటప్పుడు హుషారుగానే వచ్చారా లేక తల్లిదండ్రుల బలవంతాన వచ్చినట్లుగా ఏమన్నా అనుమానమొచ్చిందా?”

“అదేంలేదు మేడమ్. హుషారుగానే వున్నారు. ఆ మర్నాడు కూడా మామూలుగానే బడి కెళ్ళారు. ఎక్కడా ఏం తేడా లేదు. తేడాగా వుంటే స్కూల్ ఎగ్గొట్టి రూమ్‌లో పడుకుంటారు.”

“కొత్తవాళ్ళెవరయినా ఈ వసతి గృహం చుట్టుపక్కల తిరుగుతున్నట్లు కనిపించిందా?”

“లేదు మేడమ్. ఎవరూ రాలేదు.”

“వాళ్ళంతట వాళ్ళే ఎలా పారిపోతారు?  మీలో ఎవరిదో హస్తం వుండాలి” అన్నది స్నేహలత గట్టిగా.

ఈలోగా పారిపోయిన పిల్లల తల్లిదండ్రులు మళ్ళీ అక్కడకు చేరుకున్నారు.

“ఇంటికొచ్చినప్పుడు పిల్లలు హుషారుగానే వున్నట్లు చెప్తున్నారు. పిల్లలు కనబడలేదని మాకు ఫోన్ చేశారు. మేం వెంటనే వచ్చాం. ఇక్కడ మాకేం తెలియడం లేదు. ఇక్కడ అన్నలు తిరుగుతూ వుంటారు. లోగడెప్పుడో ఇద్దరు మగపిల్లల్ని బలవంతంగా ఎత్తుకుపోయారంట ట్రైనింగ్ ఇస్తామని. ఇప్పుడూ అలాగే ఎత్తుకుపోయుండచ్చని అంటున్నారు. మీ పిల్లలే మా కళ్ళు గప్పి పారిపోయుంటారు. తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో, చుట్టాలిళ్ళల్లో విచారించుకోండి అంటూ రకరకాల జవాబులు చెప్తున్నారమ్మా. మాకే చుట్టాలు లేరు. మా పిల్లలు ఎక్కడికీ పోరు. ఇక్కడి వాళ్ళే మా పిల్లల్ని ఏదో చేసుంటారు. పిల్లలు చదివే తరగతి గది దగ్గరకెళ్ళి అడిగాం. అక్కడా ఏం తెలియలేదు. ఆస్తల్లో ఎవర్నడిగినా ఏం మాట్లాడడం లేదు. గవర్నమెంటు చదువు చెప్పించి, తిండీ బట్టా ఇస్తుందిగదాని సంబరపడ్డాం. పిల్లలిట్లా మాయమవుతారని మాకు తెలియదు. పోలీసు రిపోర్టిచ్చామంటారు. వాళ్ళ దగ్గరకెళ్ళి అడిగితే కనుక్కుంటామని వాళ్ళు చెప్తున్నారు. మా బిడ్డల నోరూ, వాయా లేని వాళ్ళమ్మా. వాళ్ళ జాడ మీరైనా తెలుసుకోండమ్మా. మా బిడ్డల్ని మాకు అప్పగించండి” అంటూ ఆ ఆడపిల్లల తల్లిదండ్రులు కాళ్ళా వేళ్ళాపడ్డారు.

ఒక పక్క కలప మాఫియా ఆగడాలు. తానేమో ఈ ఏరియాలో ఏ రకపు మొక్కల్ని పెంచి ఏయే పంటల్ని సాగు చేయవచ్చనని ఎంక్వైరీలు చేయిస్తున్నది. శాస్త్రవేత్తలు ఆ పనిలో వున్నారు. గిరిజనాభివృద్ధికి ఇంకా ఏమేం చేయవచ్చో రిపోర్టులు తయారు చేసుకుంటున్నది. వీటన్నిటికీ తోడు ఇప్పుడీ ఆడపిల్లల అదృశ్యం సమస్య తెరమీదకొచ్చింది. శాస్త్రవేత్తల రిపోర్టు కోసం తానెంతో ఆతృతగా ఎదురుచూస్తున్నది. వాటన్నింటినీ పక్కనబెట్టి తనే ఈ ఆడపిల్లల సమస్యల పట్ల స్పందించి వసతిగృహానికి వచ్చింది. అన్ని కోణాలలోనూ విచారించింది. వార్డెన్ ఓ రకంగా, కేర్‌టేకర్ ఓ రకంగా, వంటమనిషి ఓ రకంగా అంతనా పొంతనా లేని సమాధానాలు చెప్పారు.

“సరైన సమాధానాలు చెప్పండి. నిజాలు చెప్పండి. నేను చర్య తీసుకుంటాను. నాతో బాటు కలెక్టరుగారు కూడా చర్య తీసుకుంటారు. ఆ తర్వాత మీ ఇష్టం” అన్నది.

“లేదు మేడం. పోలీసులు అడిగినప్పుడు కూడా ఇవే జవాబులు చెప్పాం. పోలీసులు వెతుకుతున్నామన్నారు. ఆచూకీ కనిపెడతామన్నారు. అసలా పిల్లలు మా కళ్ళు గప్పి ఎలా పారిపోయారో మాకే తెలియడం లేదు. ఇది ముమ్మాటికీ నిజం మేడమ్” అన్నారు.

వాళ్ళను బయటకు పంపించేసి వసతిగృహంలో వుండే తోటి విద్యార్థినులని పిలిపించింది.

“చూడండమ్మా. ఇవ్వాళ వాళ్ళిద్దరూ కనిపించకుండా పోయారు. రేపు ఇంకొంతమంది కనిపించకుండా పోవచ్చు. మీరంతా ఇక్కడికి చదువుకోవటం కోసం వచ్చారు. సక్రమంగా చదువులు పూర్తి చేసుకుని వెళ్ళొద్దా? చెప్పండి. మీరు నిజాలు చెపితే కనిపించకుండా పోయినవాళ్ళ జాడ తెలుసుకోవచ్చు. మిగతా వాళ్ళకు ఏ ఇబ్బందీ రాకుండా జాగ్రత్తపడవచ్చు” అంటూ ఎంతో అనునయంగా చెప్పిన మీదట ఒక అమ్మాయి నోరు తెరిచింది.

“పోలీసులతో చెప్పడానికి భయం వేసిందండీ. మీరు మా అమ్మలాగా మాట్లాడుతున్నారు. మాకు భయం వేయటం లేదు. ఇప్పుడు చెప్తామండీ. వెళ్ళిపోయిన వాళ్ళిద్దరూ, వంటమనిషీ ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళు. ఒక్కోసారి చాటుగా తీసుకెళ్ళి కూడా మాట్లాడేది. కనిపించకుండా పోయిన రోజు కూడా ఆమె వచ్చి వాళ్ళను పిలుచుకుపోయింది. ఆ తర్వాత కాసేపటికి వాళ్ళు తిరిగి వచ్చారు. మేమంతా ప్రొద్దుపోయిన తర్వాత  నిద్రపోయాం. తెల్లారి లేచి చూస్తే వాళ్ళు లేరు. ఇది నిజం మేడం. ఇంతకు మించి మాకు ఇతర విషయాలు తెలియవు మేడమ్.”

“సరే! మీరు బయట కెళ్ళండి” అంటూ వంటమనిషిని లోపలికి పిలిపించింది.

“చూడమ్మా! నువ్వెప్పుడూ ఇక్కడే వుంటూ వుంటావు. నీకు తెలియకుండా ఇక్కడేం జరగదు. ఇప్పటికైనా నిజం చెప్పు. లేదా నాతో పాటు కలెక్టర్ గారికి కూడా ఈ ఫిర్యాదు వెళ్ళిపోతుంది. నీకీ పని వుండదు, ఇంకెక్కడా ఏ పనీ దొరకదు. అంతేగాకుండా పోలీసులొచ్చి జైల్లో వేయడం ఖాయమే. అసలు పోలీసువాళ్ళకి కూడా నీ మీదే అనుమానమంటున్నారు. మీ వార్డెన్ గారు నచ్చచెపితే నిన్ను అరెస్టు చెయ్యకుండా ఆపారు. ఇప్పుడేవరు నిన్ను కాపాట్టానికి ముందుకు రారు. గిరిజనులంతా వచ్చి ఈ వసతిగృహాన్ని చుట్టుముడతారు. ఇవన్నీ జరిగేలోపు నిజం చెప్తే నీకే మంచింది. అన్ని వైపుల నుంచి నీ మీదే దాడి జరగొచ్చు జాగ్రత్త” అంది.

ఆ మాటల్తో వంటావిడ భయపడిపోయింది. అప్పటిదాకా ఎంతగానో బుకాయించింది. కాళ్ళబేరానికి వచ్చినదానిలా కూలబడి కన్నీళ్ళు పెట్టుకున్నది.

“ఆ పిల్లల తాలూకతనే వచ్చి తీసికెళ్ళాడమ్మా. ఆ పిల్లలకిద్దరికీ చదువుకోవాలని లేదని చెప్పారంట. బస్తీకి తీసుకెళ్ళి ఒకరింట్లో పిల్లల్ని ఆడించడానికొకర్నీ, మరో పెద్దింట్లో ఒక పెద్దామెకు తోడుగా వుంచటానికనీ మరొకర్నీ తీసుకెళ్ళాడు. ఇద్దర్నీ పనుల్లో పెట్టటానికే తీసుకెళ్ళాడు. వాళ్ళమ్మా, అయ్యలు ఈ పిల్లల్ని బలవంతంగా చదివిస్తున్నారంట. వాళ్ళకేమో చదవాలని లేదని వాళ్ళ బాబాయి వరసయ్యే వానికి చెప్పుకున్నారంట. ఆ బాబయ్యే వచ్చి పిల్లల ఇష్ట ప్రకారం పనిలో పెడతానని తీసుకెళ్లాడు” అని చెప్పింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here