ఆమె హృదయం!

0
5

[dropcap]సె[/dropcap]లయేటి మీద వెన్నెల తెల్లగా కురుస్తుంది… ఆమెలో ఎంతకీ తెగని భావధార… చెరగని ముద్రల్లా… సుదీర్ఘ జ్ఞాపకంలా… రెప్పల మాటున కన్నీరు చూపును మసక చేస్తూ, దృశ్యాలు కమ్ముకు పోతుంటే…, ఆమె అతని ధ్యానం లోకి వెళ్ళిపోయింది.

“అనంత ఆలోచన్లు దేనికీ!?” గుండెను కుదుపుతూ ఆ స్వరం ఆమెను తాకింది. ఆమె శరవేగంగా అతని కళ్ళలోకి చూసింది.

వలయాలు వలయాలుగా మాయా కాంతేదో ఆమెని చుట్టేసినట్టు ఒక ఉద్విగ్నానికి లోనయింది!

“నీ మనసు స్పర్శ లేని నన్ను ఊహించుకోలేను!! ఇద్దరికీ ఉన్న దూరాన్ని చిదిమేయాలని ఉంది” ఆర్తిగా అతని కళ్ళలోకి చూస్తూ అంది.

“అనుబంధ రాహిత్యమనే దాహం లోంచి జ్ఞాపకాలు బైట పడేస్తాయి. అవి దేహానికి ఊపిర్లు పోస్తాయి కదా!” అన్నాడతను.

“కాలమంతా ఇలా స్వప్నించలేను” చెంపలపై ధారల్ని కారుస్తూ చెప్పింది.

“నీ మనసు దృఢం లేక! చరాచర ప్రకృతిలో సహజంగా జరిగే పరిణామాలకి ఒరిగిపోతున్నావ్!” అన్నాడతను.

“అవును, సహజమైన ప్రేమోద్వేగానికే లోనవుతున్నాను” సూటిగా చూస్తూ అంది ఆమె.

“ప్రేమైక ధారగా లిప్తపాటు కాలం బతికిన చాలు, కాలంలోకి స్మృతుల్ని మోసుకుంటూ సాగిపోవడానికి” అతనన్నాడు.

“ఆ కాలమే జ్ఞప్తికి వస్తూ, మనసు దగ్ధమవుతూ, నీటి తెరలై విడుస్తుంది” కరిగిపోతున్న మనసుతో అంది ఆమె.

“బుగ్గయ్యే దేహం కోసం భ్రమలో జీవించే కన్నా, మనసుతో గడిపిన గుర్తుల్ని జీవించినంత కాలం అనుభూతులుగా ఆస్వాదించాలి” అన్నాడు.

“మరువలేని అభౌతిక స్మృతి, దేహమున్నంత సేపూ ఎప్పుడూ పచ్చగా చిగురిస్తూనే ఉంటుంది!” అంది ఆమె.

“దేహంతో అన్నీ శుష్కించుకు పోతాయి. ఐనా, ఈ దేహం ఉన్నంత సేపూ మనసున పట్టి మాయలా మురిపిస్తుంది” అన్నాడు.

“ఈ బంధం నన్ను చుట్టుకుని, ఈ భౌతిక ప్రపంచంలో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది!” అందామె.

“జ్ఞాపకాల అనుభూతుల్ని స్వప్నిస్తూనే లౌకికంలో కల్సిపోవాలి!” అన్నాడతను.

“ఇప్పుడు! ఇద్దరం కలవని దూరాలం, అదే కదా దానర్థం!” అంది ఆమె.

అతని నేత్రాలు నీటితో నిండిపోయాయి!

సెలయేటి వంతెన మీంచి అలానే నీట్లోకి తొంగి చూస్తుంది ఆమె, పైనంతా వెన్నెల…

నీటిమయమైన అతను ఆ సెలయేటి వెన్నెల్లో కనుమరుగయ్యాడు!

ఆమె కళ్ళను తుడుచుకుంది. అతని జాడల్ని తనలోకి మోసుకుంటూ, ఆలోచన్ల సంద్రమై అతీతంలోకి ఒలిగిపోతూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here