ఆమెకు అందిన ఉత్తరం

0
13

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన సృజన గారి ‘ఆమెకు అందిన ఉత్తరం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“నీ[/dropcap]కు తోచింది చేసుకో. ఐ యామ్ నో వన్ టు స్టాప్ యూ.” ఆ ఒక్క మాట అని శేఖర్ విసవిసా బైటికి వెళిపోయాడు. నిత్య అలాగే కూర్చొని వుంది. గేటు తీసిన శబ్దం, బైక్ స్టార్ట్ చేసిన అలికిడి వినిపించాయి. తిరిగి గేట్ వేసిన చప్పుడైతే ఆమెకు వినిపించలేదు. ఆమె ఏదో లోతున పడిపోయిన వస్తువుని వెతుకుతున్నదానిలా ఎటో చూపులు సారించి వుండిపోయింది. ఆమె మనసులో కోటి సెలయేళ్ళు ధారగా ప్రవహిస్తున్నట్టు ఒకటే హోరు. అనేక ప్రశ్నలు ఆమె మెదడును తినేస్తున్నాయి. అలా ఎంత సేపు కూర్చుందో తెలియదు కానీ హఠాత్తుగా ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి తన పడక గదిలోకి దారితీసింది. ఆ గదంతా నిశబ్దంగా వుంది. ఫేన్ తిరిగే చప్పుడు కూడా లేదు. ఒక మూలన టేబుల్ లైట్ వెలుగుతోంది. అది తప్పా చుట్టూ చీకటి. కిటికీ ఒకటి తెరిచి వుందేమో.. కర్టెన్ గాలికి ఎగురుతోంది. డిసెంబర్ నెల చలి గాలులు ఆ గదిని ఆక్రమించాయి. ఆమె చిన్నగా వణికింది. బైట ప్రపంచం నుంచి గదిలోకి వచ్చిన రెక్క పురుగు ఒకటి నేరుగా వచ్చి టేబుల్ లైట్ చుట్టూ తిరుగుతోంది. అంత నిశ్శబ్దపు గదిలో ఆ పురుగు చేసే శబ్దం నిత్యకు భరింపరానిదిగా వుంది. గాలికి ఎగరని డైరీ ఎదురుగా కూర్చున్న నిత్య పెన్ తీసుకొని ఇలా రాసుకుంది.. ‘ఈ రెక్క పురుగుది కూడా నాలాంటి జీవితమే! ఎంత ఆరాటపడినా ఆ ఆరాటం మూణ్ణాళ్లే’. నిత్య విరక్తిగా నవ్వుకుంది. డైరీ పక్కన కనిపిస్తున్న స్లీపింగ్ పిల్స్ బాటిల్ని చేతిలోకి తీసుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్ళు.

“అమ్మా వద్దు నాకు టేబ్లెట్స్ అంటే భయం.. నేను వేసుకోను.” యవ్వనంలో తన తల్లిని బ్రతిమలాడడం ఆమెకి ఒక ఫ్లాష్ లాగా గుర్తొచ్చింది. నిత్య గుప్పెట నిండా మాత్రలు. ఆమె చెయ్యి వణుకుతోంది. ఈ రోజుతో నా జీవితం అయిపోతుంది. నిత్య D/o సూర్యారావు & రేవతి జీవితం ముగిసిపోతుంది. ఏం సాధించగలిగింది ఈ ముఫై ఏళ్ళల్లో. కొన్ని పీడకలల్ని తప్పా వేటినీ సంపాదించుకోలేదు.

“నన్ను కాదంటున్నావా..? ఈ తండ్రి నిర్ణయాన్నే కాదంటున్నావా? నేను నీ మంచి కోరే చెప్తానని తెలిసే ఈ పెళ్ళి వద్దంటున్నావా? మరొక్కసారి ఆలోచించు నిత్యా. జీవితం ఏమీ తమాషా కాదు” తండ్రి చేసిన బెదిరింపు మెరుపులా ఆమెను మీటింది.

నిత్యకు ఆ మాటలు జ్ఞాపకానికి వచ్చేసరికి తనని తాను సంబాళించుకోవడం కష్టమైంది. ఇప్పుడు ఈ క్షణం వాళ్ళ నాన్న దగ్గరకి వెళ్ళి అతడు చెప్పిన అదే మాటని… ‘జీవితం ఏమీ తమాషా కాదు నాన్నా’ అని చెప్పాలన్న కోర్కె కలిగింది ఆమెకి. తను అలా అంటున్నప్పుడు అతడు తల దించుకోవడాన్ని ఆమె ఊహించుకుంది. ఆ ఊహకి ఆమె నవ్వింది. కానీ ఆ నవ్వు ఏడుపుగా ఎప్పుడు మారిందో ఆమెకి కూడా తెలియదు. “నీకు తోచింది చేసుకో..” అన్న శేఖర్ మాటలు గుర్తొచ్చాయి. ఆమె ఏడుపు ఠక్కున ఆగిపోయింది. ఎవరి మీదో కసి. మనుషులందరి పైన కోపం, తనపైన తనకే విరక్తి..ఇన్ని భావోద్రేకాలు ఆమెను సాంతం కదిలిస్తున్నప్పుడు ఆమె కుడి చేత్తో… కళ్ళు తుడుచుకుంది. ఊపిరి బలంగా తీసుకొని.. ఎడమ చేతిలో వున్న టేబ్లేట్లని వేసుకోడానికి సిద్ధపడింది.

ఆమె భవిష్యత్తుని నిర్ణయిస్తున్నట్టు.. గడియారం టిక్ టిక్ శబ్దం చేస్తోంది. అప్పుడు సమయం అర్ధరాత్రి పన్నెండు కావస్తోంది. గడియారంలో సెకెండ్స్ ముల్లు తొమ్మిదవ అంకె నుంచి పదకుండవ అంకెకి వచ్చేసరికి నిత్య టేబ్లేట్లు వేసుకునేందుకు ఎడమ చెయ్యి పైకి ఎత్తింది. ఒక్క అర సెంకెండు ఆలస్యం అయ్యివుంటే ఆమె గొంతులోకి ఆ మాతర్లన్నీ దిగిపోయేవే కానీ.. అంతలో అంతంటి నిశ్శబ్దాన్ని బద్దలు గొడుతూ.. విచిత్రమైన కేకలు వినిపించాయి. అది ఒకరి గొంతు కాదు. ఒక పది, పదిహేను మంది గొంతులు. నిత్య షాక్‌లో వుంది. ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. ఆ అరుపులకి తుళ్ళిపడి చేతిలో వున్న టేబ్లేట్స్‌ని విసిరేసింది. అవి నేల పైన చెల్లా చెదురై పడి వున్నాయి. నిత్య తేరుకొని కిటికీ దగ్గరకి వెళ్ళింది. అప్పుడే ఆకాశంలో పెద్ద వెలుగు. ఎవరో ఆపకుండా టపాసులు పేలుస్తూన్నే వున్నారు. నిత్యకి ఏం అర్థం కాలేదు. ఏమిటి ఈ హడావిడి అనుకుంది. ఇంతలో ఐదు నిమిషాల క్రితం వినిపించిన విచిత్రమైన అరుపులే మళ్ళీ వినిపించాయి. అది ఒక పదిహేను మంది కుర్ర గుంపు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని అరుస్తూ బైక్ లతో అక్కడి సందులన్నీ చక్కర్లు కొడుతున్నారు. ఈ రోజు న్యూయరా..! అని ఆశ్చర్యపోయింది నిత్య. అసంకల్పితంగా కేలెండర్ వైపు చూసింది. సెప్టెంబర్ 2023 అని వుంది అక్కడ. అంటే ఆ క్యాలెండర్‍ను సెప్టెంబర్ నెల తర్వాత మార్చనే లేదు. ఆ ఆలోచనే తనకి రాలేదంటే.. ఆమె ఏ మానసిక పరిస్థితుల్లో వున్నదో అర్థం చేసుకోవచ్చు. నిత్య తన చుట్టూ ప్రపంచంతో ఎంత డిటాచ్ అయిపోయిందో ఆమెకి అర్థం అయ్యాక తనకి భయం వేసింది. గంట వ్యవధిలో నిత్యకి చాలా ఉద్వేగాలు ఎదురయ్యాయి కానీ.. భయం వెయ్యలేదు. ఇదే తొలిసారి ఆమెకు భయం వెయ్యడం. అయితే ఇంత కన్నా భయానకమైన పరిస్థితి ఆమె కొద్దిసేపట్లోనే అనుభవించబోతుందని అప్పటికి నిత్యకు తెలియదు.

నిత్య చెల్లా చెదురై పడి వున్న టేబ్లేట్లని ఎరాలని కిందకి వంగబోయింది. ఇంతలో.. మళ్ళీ ఆకాశంలో వెలుగు. అది చూడటానికి అన్నట్టు నిత్య తల తిప్పింది. కానీ ఆమె ఆకాశంలో వెలుగును చూడడానికన్నా ముందే తన గుమ్మంలో ఒకటి చూసింది. అది చూసాక ఆమె రెండు నిమిషాల పాటు స్థణువులా నిలబడిపోయింది. మరొక తారాజువ్వ పై కి లేచింది. కిటికీ వూచలని గట్టిగా పట్టుకొని తనకు కనిపిస్తున్నది ఏమిటో తెలుసుకోవడానికి కళ్ళు చిట్లించింది. శేఖర్ వెయ్యకుండా వదిలేసిన గేటుకు వేలాడుతూ ఒక ఆకారం కనిపించింది నిత్యకి. ఆమెలో తెలియని వణుకు మొదలైంది. ఎవరది అనుకుంది మనసులో. వెళ్ళి చూడాలా వద్దా అని కాసేపు ఆలోచించి చివరికి ఒక టార్చ్ లైట్ పుచ్చుకొని గుమ్మం వైపు నడిచింది. మెయిన్ డోర్ వరకూ ఎలాగోలా వచ్చింది కానీ.. అక్కడ నుంచి మెట్లు దిగి గుమ్మంలోకి వెళ్ళడానికి ఆమెతో ఆమె చాలా యుద్ధం చెయ్యాల్సి వచ్చింది. ఆకాశంలో చంద్రుడు అరవిచ్చి నవ్వుతున్నట్టు వున్నాడు. అది పౌర్ణమి వచ్చిన ఐదవ రోజు. నక్షత్రాలు అక్కడక్కడా మెరుస్తున్నాయి. సిటీ ఇంకా పడుకోలేదని చెప్పడానికి ఆకాశంలోని వెలుగులే సాక్ష్యాలు. ఆమె ముని వేళ్ళని నేల కి గుచ్చి నిలబడి వుంది ఎటూ తేల్చుకోలేక.

“ఏవిటే ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళడానికి అంత ఆలోచిస్తున్నావ్. చీకటిగా వుంటే ఆగిపోతావా.. తెగించి వెళ్ళాలే కానీ!” నిత్య కి గతంలో వాళ్ళమ్మ మాట్లాడిన మాటలు తన వెనుకే నిలబడి మాట్లాడినట్టు వినిపించాయి. ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. కుడి చేతిలో టార్చ్.. ఎడమ చేతిలో ఫోను ఆమె బలమైన పిడికిలిలో నలుగుతున్నాయి. ఇంతలో గుమ్మం దగ్గర ఏదో మూలుగు వినబడింది. నిత్యకి చెమటలు పట్టాయి. తలుపు సందుల్లోంచి పూర్తిగా చీకటి కానీ ఆ ప్రదేశాన్ని అదే పనిగా చూస్తోంది. ఆ ఇల్లు అన్ని ఇళ్ళకి, కేక వేసినా వినపడనంత దూరంలో వుంది. బైటకి వెళ్ళాక ఏదైనా జరిగితే ..సహాయానికి ఎవ్వరైనా రావడం కష్టమని ఆమెకు తెలుసు. మనస్సు ముందుకు వెళ్ళమంటోంది.. బుద్ధి వెనక్కి లాగుతోంది. ఇందులో ఎవరి మాటా వినాలో తెల్చుకునే లోగానే నిత్య ఫోన్ మోగింది. ఆమె తుళ్ళిపడింది. ఆ షాక్ నుంచి తేరుకుని ఫోన్ కట్ చెయ్యడానికి రెండు నిమిషాలు పట్టింది. అయితే అప్పటికే ఆ శబ్దం గుమ్మం వరకూ వెళ్ళిపోయింది.

“హలో! ఎవరైనా వున్నారా..?” ఒక మగ గొంతు వినబడింది.

“ప్లీజ్ హెల్ప్!” మళ్ళీ అరిచాడతడు.

అతడి కంఠంలో ఓపిక లేకపోవడం స్పష్టంగా వినబడుతోంది. “దయచేసి సాయం చెయ్యండి” మళ్ళీ అదే గొంతు. నిత్య ఇక  ఆగలేకపోయింది. ఎదో నిర్ణయించుకున్నదానిలా గుమ్మం దాటి మెట్లు దిగింది. తన చేతిలో టార్చ్ ను వెలిగింది…

“ఎవరూ!” అంది.

“మేడమ్ ప్లీజ్ సాయం చెయ్యండి.” అతని గొంతులో కంగారు. నిత్య టార్చ్ ని ఆ గొంతు వినబడ్డ వైపు చూపించింది. ఒక మధ్య వయసులో వున్న వ్యక్తి.. తన ఇంటి గెట్ దగ్గర కూలబడి వున్నాడు. అతడి పక్కన రక్తపు మడుగు. అతడిలో ఓపిక ఏ కొసానా లేదు. నిత్య ఆ రక్తాన్ని చూసి స్తంభించిపోయింది. ఆమెకు తన కాలి కింది నేల కంపిస్తున్నట్టు అనిపించింది.

“పీరియడ్స్‌లో వున్నప్పుడు ఆటలాడొద్దని చెప్పాను వింటేగా.. చూడు ఇప్పుడు ఎంత రక్తమో”…తన శరీరం పైన రక్తాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయిన నిత్యను లేవదీసినప్పుడు వాళ్ళ బామ్మ అన్న మాటలు.. నిత్యకి ఆ క్షణం గుర్తొచ్చాయి. ఆమె తానకే తెలియని కారణానికి ఏడుస్తోంది.

“దయచేసి యాంబులెన్స్‌కి కాల్ చెయ్యండి.” అతడి అర్థింపు నిత్యని మళ్ళీ వార్తమానంలోకి తెచ్చింది.

అతడి నోటి నుంచి రక్తం ధారగా కారుతోంది. అసలతనికి ఏం జరిగి వుంటుందో ఆమెకి అర్ధంకాలేదు. ఆమె ఆలోచనల్లో ఆమె వుండగా.. ఆ వ్యక్తి ఆమె కాళ్ళ దగ్గరే పెద్ద వాంతి చేసుకున్నాడు. ఆమె కళ్ళు తిరిగి పడబోయి తమాయించుకుంది. చేతులు వణుకుతుండగా..108 కి ఫోన్ చేసింది. వాళ్ళకి విషయం చెప్పగా.. వాళ్ళు పోలీస్ లకి కూడా ఇన్ఫామ్ చెయ్యమని చెప్పారు. “పోలీసులా.. ఎందుకు” అందామె. ఆమె వెన్నులో ఏదో తెలియని వణుకు.

“పోనీలే కదా తెలిసిన పిల్లని మా ఆయన చనువుగా చెయ్యి వేస్తే అతని చెయ్యి కొరికేసి వచ్చింది నీ కూతురు. ఆయన పోలీసు అది మర్చిపోయారా?” నిత్యకి తన పక్కింటి రాజ్యం ఆంటి అన్న మాటలు గుర్తొచ్చాయి.

“హాల్లో మేడం వున్నారా.. పోలీసులకి కాల్ చెయ్యండి మర్చిపోకండి” అని చెప్పి అటువైపు వ్యక్తి కాల్ కట్ చేసారు.

నిత్య మసగ్గా అయినా కళ్ళని తుడుచుకుంటూ.. పోలీసులకి కాల్ చేసింది. మాట్లాడుతున్నంత సేపు ఆమె గొంతు వణుకుతూనే వుంది. నుదిటిపై చెమటలు అంత చలిలోనూ ధార కట్టాయి. అతడు మళ్ళీ వాంతు చేసుకున్నాడు. నిత్య ఏదో గుర్తొచ్చినట్టు…ఇంట్లోకి పరిగెత్తింది. ఒక రెండు నిమిషాల్లో నీళ్ళ బాటిల్ తీసుకొని అదే పరుగుతో వచ్చింది. అతడి చేతికి అందించిన బాటిల్‌ని అతడు లాక్కున్నట్టే తీసుకున్నాడు. చేతులు వణుకుతుండగా తాగడానికి ప్రయత్నించాడు. సగానికి సగం కిందే పడ్డాయి. “యాంబులెన్స్ కి, పోలీసులకి కాల్ చేసాను. వాళ్ళు ఏ నిమిషమైనా వస్తారు. మీరు ధైర్యంగా వుండండి” అంది నిత్య. ఆమెకే లేని ధైర్యాన్ని అతడిలో నూరిపోస్తూ. అతడు ఆయాసపడుతూ తల వూపాడు. ఆమె అతడ్ని నిశితంగా పరిశీలించింది. వంటిపైన ఎక్కడా గాయాలు లేవు. కత్తి గాట్లూ లేవు. ఆమె అనుమానంగా అడిగింది.. ఏం జరిగింది మీకు అని. అతని కళ్ళల్లో ధారగా నీళ్ళు. మాట్లాడనివ్వకుండా ఒకటే దగ్గు. ఊపిరి చాలా కష్టంగా తీసుకుంటున్నాడు. వాటన్నింటి మధ్యలో.. ఏదో అస్పష్టంగా అనబోయాడు. మాట్లాడడం అతని వాళ్ళ కాలేదు. ఓపిక లేనట్టు తూలుతుండగా షర్ట్ జేబులో నుంచి ఒక ఉత్తరాన్ని తీసి ఆమెకి ఇచ్చాడు. అదేంటో ఆమె చూసేలోగానే.. అతడు స్పృహ కోల్పోయాడు. నిత్య భయపడింది. అతడికి దగ్గరగా వెళ్ళి గట్టిగా కదిపింది. ‘హల్లో సార్.. వినిపిస్తొందా’ అంటూ పిలుస్తోంది. అతడు తెలివిలో లేడు. ఆమె అదే భయంతో నెమ్మదిగా అతడి ముక్కు దగ్గర చూపుడు వేలు పెట్టింది. శ్వాస ఆడుతుంది. వెంటనే పక్కన వున్న నీళ్ళ బాటిల్లో అడుగున వున్న కాస్త నీళ్ళని అతడి మొహాన జల్లింది. అతడిలో చిన్న కదలిక. నిత్య కాస్త నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది.

“యాంబులెన్స్ వచ్చేస్తుంది కాస్త తెలివిలో వుండడానికి ప్రయత్నించండి ప్లీజ్” అందామె అర్ధింపుగా. అతడు మొద్దుబారిపోయిన నాలికతో ఏదో అంటున్నాడు. ఆమెకు అదంతా స్పష్టంగా వినిపించలేదు. అతడు ఏం అంటున్నాడో వినడం కోసం కొంచెం ముందుకు వంగి అతడి నోటికి దగ్గరగా తన చెవిని పెట్టింది.

“నా.. కు.. బ్రత.. బ్రతకా.. ల.. ని వు.. వుంది.” అన్నాడు. నిత్య నివ్వెరపోయింది. “న.. నన్ను ఎలా అయినా.. బ్రతికించండి ప్లీ.. జ్..” అతడు ఏడుస్తున్నాడు.

“సార్! ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీకేం కాదు. ధైర్యంగా వుండండి” అంది నిత్య ఇంకేం అనాలో తెలియక. వీధి చివరకే చూపు సారించి చూస్తోంది. ఏదైనా వెహికల్ వచ్చే అలికిడి అవుతోందేమో అని. ఒక రెండు నిమిషాల తర్వాత సైరన్ శబ్దం వచ్చింది. నిత్య ఆత్రంగా గేట్ దాటి బయటకు వెళ్ళి రోడ్డు మధ్యలో నిలబడింది. వస్తున్నది యాంబులెన్స్ అని తెలిసి అతడి వైపు నిశ్చింతగా చూసింది. ఆ వెహికల్ ఆమెకు మూడడుగుల దూరంలో ఆగింది. నిత్య చూస్తుండగానే అతడిని యాంబులెన్స్ లో ఎక్కించడం ఆక్సిజన్ పెట్టడం, ఇంజెక్షన్ ఇవ్వడం, సెలైన్ ఎక్కించడం అన్నీ జరిగిపోయాయి. నిత్య శిలా ప్రతిమలా నిలబడి జరిగేదంతా చూస్తూ వుంది. అంతలో అక్కడికి నర్స్ వచ్చింది. ఆయనకి ఎలా వుంది అడిగింది నిత్య. “హి ఈజ్ ఆల్ రైట్ మేడమ్. మీరు పోలీస్ లకి ఇన్ఫామ్ చేసారా” అని అడిగింది ఆ నర్స్.

“చేసాను అండి. ఇప్పటికే రావాలి. వస్తూ వుంటారు” అంది నిత్య వీధి చివర మలుపు వైపే చూస్తూ. ఇంతలో పోలీస్ జీప్ కూడా వచ్చి ఆగింది. ఎస్.ఐ నిత్య కు దగ్గరగా వెళ్ళి..

“మీరేనా ఫోన్ చేసింది?” అని అడిగాడు. నిత్య రెండు అడుగులు వెనక్కి వేసి చూపు నేలకు దించేసి అవునన్నట్టు తలూపింది.

“అతను మీకు ఏం అవుతారు?” అని అడిగాడు మళ్ళీ ఎస్.ఐ..

నిత్య, “అతను నాకేమీ కాడండీ..” అంటూ జరిగిందంతా చెప్పింది.

“ఐసీ.. ఈ ఇంట్లో ఎవరెవరు వుంటారు?”

“నేను నా హజ్బెండ్.”

“మరి ఆయనేరి?” నిత్య తడబడింది.

“అదీ! న్యూయర్ కదా పార్టీకి వెళ్ళారు” అంది.

“మిమ్మల్ని తీసికొని వెళ్ళకుండానా..?” ఆశ్చర్యం, అనుమానం కలగలిపిన స్వరంతో అన్నాడు ఎస్.ఐ.

“అది వాళ్ళ కంపెనీ తరపున ఇచ్చే పార్టీ.. నాకు కంఫర్టబుల్‌గా వుండదు. అందుకే నేనే వెళ్ళలేదు” నిత్య గుండె వేగంగా కొట్టుకుంటోంది.

“మీకెన్నేళ్ళెంది పెళ్ళె?”

ఇక నిత్య వల్ల కాలేదు.

“సర్.. అతనకి ప్రోబ్లం అయితే నన్ను ఇంటరాగేట్ చేస్తారెంటి?” అంది అసహనంగా.

“ఈ ఇన్సిడెంట్ స్పాట్‌లో మీరు వున్నారుగా, పోలీస్ గా ఇది నా బాధ్యత. మేడం ప్లీజ్ కోపరేట్” అన్నాడతను. నిత్య సహనం కోసమన్నట్టు కళ్ళు మూసుకుంది.

“మీరు నా క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యలేదు”. మళ్ళీ గుర్తుచేసాడు ఎస్.ఐ.

“రెండేళ్ళు.”

“వాట్..?”

“మాకు పెళ్ళై రెండేళ్ళు.”

ఒకే. మీ ఇల్లు తనిఖీ చెయ్యోచ్చా?”

డిస్గస్టింగ్ అనుకుంది మనసులో నిత్య.

ఆమె ఏదో అనబోతూ వుండగానే కానిస్టేబుల్ పిలిచాడు వెనకనుంచి. ఏమైంది అటు తిరిగి అడిగాడు ఎస్.ఐ..

“సార్ అతనిది సూసైడ్ అంట..” అన్నాడా కానిస్టేబుల్.

“ఈజ్ ఇట్” యాంబులెన్స్ దగ్గరికి నడిచాడు ఎస్.ఐ.. అది విన్న నిత్య వెన్ను, కొరడాతో ఎవరో కొట్టినట్టు నిటారుగా అయ్యింది. ఆమెకి తన పడక గదిలో చెల్లా చెదురై పడి వున్న స్లీపింగ్ టేబ్లేట్స్ గుర్తొచ్చాయి. వాటిని గనుకా ఈ ఎస్.ఐ. చూస్తే.. ఆ తర్వాత ఏమవుతుందో ఆమె ఆలోచించలేకపోయింది. ఆమెకు పదడుగుల దూరంలో.. అతడు యాంబులెన్స్‍౬లో స్పృహ లేకుండా వున్నాడు. ఆమెకి ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టు ఎడమ చెయ్యి పిడికిలి విప్పింది. అందులో అతడు స్పృహ కోల్పోయే సమయంలో ఇచ్చిన ఉత్తరం వుంది. అది బాగా నలిగిపోయి వుంది. నిత్య నుదిటికి చెమటలు పట్టాయి. వణుకుతున్న చేతులతో దాన్ని తెరిచి చూసింది. మొదట దాన్ని చూసి అతను రాసిన లెటర్ అనుకుంది నిత్య. కానీ తర్వాత అర్థమైంది, అది మరెవరో అతనికి రాసినదని. ఆమె నిమిషం ఆశ్చర్యపోయి అతడి వంక చూసింది. అప్పటికే ఎస్.ఐ… మీ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు అని అతడ్ని అగుతున్నాడు.

‘మురళి!

నిన్న నీ సూసైడ్ నోట్ చదివాను. సమస్యలన్నిటికీ ఈ జీవితం నుంచి పారిపోవటమే పరిష్కారమైతే నన్ను కూడా పిలవాల్సింది. నేను నీతో పాటు వచ్చేదాన్ని. ఏమనుకుంటున్నావ్ ఇదేమైనా త్యాగం అనుకుంటున్నావా లేదా ఎవరి మీదో తీర్చుకునే పగ అనుకుంటున్నావా. ఈ పనితో నీకు దక్కేది శూన్యం. నిన్ను ప్రేమించేవాళ్ళకి నువ్వు మిగిల్చేది శోకం. నువ్వు ఎవరికో జవాబు చెప్పడానికి ఏదో నిరూపించడానికి చనిపోదాం అనుకుంటున్నావేమో కానీ ఇలా చేస్తే వాళ్ళ దృష్టిలో నువ్వు ఇంకా పతనమైపోతావ్. నీ ఇంటికి వచ్చి, నిన్ను అవమానించి, నీ భార్యని కొట్టి, బాధ పెట్టిన వాళ్ళకి సరైన జవాబు చెప్పకుండా సర్వం చాలించేసి.. నీ ఓటమిని ఒప్పుకొని వెళ్లిపోవడం పతనం కాక మరేంటి. ఈ రోజు నీ జీవితంలో చీకటి రోజే కావొచ్చు. కానీ ఆ చీకటిని  వెలుగుగా మార్చుకునే అవకాశం భవిష్యత్తు ఎప్పుడు ఇస్తుంది. దాన్ని వెతక్కుండా మరింత చీకట్లో కూరుకుపోవడంలో అర్థంలేదు. నీకు ఆవేశం వచ్చినప్పుడు, ఈ జీవితం వ్యర్థం అనిపించినప్పుడు.. ఒక్క నిమిషం ఆగు. నీ నిర్ణయంలో బలం ఎంత వుందో ఆ ఒక్క నిమిషం నీకు చెప్పగలదు. నువ్వు పిరికివాడివి కాదు మురళి. నీలో చాలా ధైర్యం ఉంది. బలహీనతలకి బానిస అయిపోకు. లైఫ్ కి ఇంకొక్క ఛాన్స్ ఇవ్వు. ఇట్ డెసెర్వ్స్ వన్ మోర్ ఛాన్స్. నువ్వు మళ్ళీ తిరిగి వస్తావ్ అన్న నమ్మకం నాకు వుంది. నీకోసం ఎదురుచూస్తూ వుంటాను. నా నమ్మకాన్ని ఒమ్ము చెయ్యకు మురళి.

ఇట్లు

నీ జ్యోతి’

ఆ ఆఖరి వాక్యం పూర్తి చేసేసరికి నిత్య కళ్ళల్లో ధారగా నీళ్ళు. ఆమెతోనే ఒక సన్నిహితురాలు ఈ మాటలు చెప్తున్నట్టు ఏదో సత్యం బొధపడుతున్నట్టు అనిపించిందామెకి. ‘మురలీ హౌ లక్కీ యూ ఆర్” అనుకుంది మనసులో. నిత్య చేతిలో వున్న ఉత్తరాన్ని ఎస్.ఐ. తీసుకోని చదివాడు. తర్వాత నిత్య వైపు తిరిగి “మీరు అవసరమైతే పోలీస్టేషన్ కి రావాల్సి వుంటుంది సరేనా” అన్నాడు. ఆమె చిన్నగా తల వూపింది.

“న్యూఇయర్ కావడం చేత రావడం లేటైంది. బట్ ఇంతలో మీరు అతనికి చేసిన సాయం ఈజ్ అన్ ఫరగెటబుల్ థ్యాంక్యూ!” అంటూ.. అతడు జీప్ దగ్గరకి వెళ్ళాడు. “అతని వైఫ్‍ని కాంటాక్ట్ చెయ్యండి. ఆమెకి జరిగింది చెప్పి హాస్పెటల్‌కి రమ్మనండి. అతని దగ్గర ఒక రిపోర్ట్ తీసుకోండి. సీన్‌లో ఏం జరిగిందో ఈమెని కూడా అడిగి రాసుకోండి. గివ్ హిమ్ ఎ నెససరీ ట్రీట్మెంట్. ఏ హాస్పేటల్‌కి తీసుకొని వెళ్తున్నారో ఇన్ఫామ్ చెయ్యండి. ఇఫ్ పాజిబుల్ ఐ విల్ కమ్ దేర్.” అని ఒక కానిస్టేబుల్ కి చెప్పి.. మురళితో కూడా వుండమని ఆర్డర్ పాస్ చేసి ఎస్.ఐ. వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన రెండు నిమిషాలకే యాంబులెన్స్ కూడా బయల్దేరబోయింది. ఇంతలో నిత్య కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి..

“నేను కూడా రావచ్చా” అని అడిగింది.

“నువ్వా.. మా సార్ చెప్పలేదు కదమ్మా.. మళ్ళీ అతనికి తెలిస్తే సమస్య అవుతుంది” అన్నాడు.

“అతని వైఫ్ వచ్చేవరకూ వుండి వెళ్ళిపోతాను అండి” ఆమె బ్రతిమాలుతున్నట్టు అడిగింది. అప్పుడే కానిస్టేబుల్‌కి గుర్తొచ్చింది.. ఎస్.ఐ. ఈమెని కూడా ఎంక్వెరీ చెయ్యమన్నాడని.

“సరే రామ్మా” అన్నాడు కానిస్టేబుల్. అప్పుడు సమయం అర్ధరాత్రి రెండు దాటింది. నిత్య కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. మురళి కళ్ళు మూసుకొని వున్నాడు. తెరిస్తే అతడి కళ్ళు ఆమె కాళ్ళలాగే వుంటాయేమో బహుశా. ఆమె అతడి కను చివరల నుంచి.. కన్నీళ్ళు జారి తలగడను తడపడం స్పష్టంగా చూసింది. ఆమె గుండెని ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్టైంది. మెదడు మొత్తం ఆలోచనలతో నిండిపోయింది. ఏం చెయ్యాలి అనుకుందో.. ఏం చేసిందో.. ఏం చేస్తూ వుందో ఆమెకే అర్థం కాలేదు.

శేఖర్ పొద్దున్న వరకూ రాడని ఆమెకి తెలుసు. ఆమె సహచర్యంలో దొరకని ఆనందాన్ని అతడు మరెక్కడో వెతుక్కుంటున్నాడని కూడా ఆమెకి తెలుసు. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలు. ఎందుకిదంతా అని ప్రశ్నిస్తే.. నీకు తెలియదా అని నిలదీస్తాడేమో అని ఆమె భయం. కానీ తను మాత్రం ఏం చేసింది. ఇందులో తన తప్పు ఏముంది. ఏ రోజైనా అసలు నీ సమస్య ఏంటి అని అడిగాడా? నేను ఇలా వుండడాన్ని అసహ్యించుకున్నాడే తప్పా.. ఎందుకో కారణం అడగలేదు, తెలుసుకోవాలని ప్రయత్నమూ చెయ్యలేదు. ప్రేమ లేకపోయినా ఒక మనిషితో బ్రతికుండాల్సి రావడం ఎంత దురదృష్టం. ఆమె కళ్ళ నుంచి రహస్యంగా ఒక నీటి చుక్క.. చెక్కిళ్ళని తడిపి కిందకి జారిపోయింది.

ఒక మామూలు హాస్పటల్ దగ్గర యాంబులెన్స్ ఆగింది. అతడిని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొని వెళ్ళారు. కానిస్టేబుల్ నిత్యని బైటనే ఆపి అతడికి కావాల్సిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఆమె మెల్లిగా లోపలికి నడిచింది. రాత్రి కావడం చేత హాస్పెటల్ నిర్మానుష్యంగా వుంది. దూరం నుంచి ఇంకా టపాసుల శబ్దం వినిపిస్తూనే వుంది. అక్కడక్కడా కుక్కల అరుపులు ఆ శబ్దాలకి జత కట్టాయి. అలా ఒక అర్ధగంట గడిచింది. సమయం మూడు కావస్తోంది. నిత్య యథాలాపంగా కారిడార్ వైపు చూసింది. ఏదో ఆటో ఆగిన శబ్దం. ఎవరో ఒక ఆమె పరుగులాంటి నడకతో అటువైపే వస్తుండటం నిత్య గమనించింది. మనిషి కంగారుగా వుంది. పరిగెత్తుతూ రావడం వల్ల శ్వాస భారంగా తీసుకుంటోంది. జుట్టు సరిగ్గా దువ్వుకోలేదని చెదిరిన వెంట్రుకలు చెప్తున్నాయి. సన్నగా పొడవుగా వుంది. ముదురు గోధుమరంగు చీర మధ్యమధ్యలో ముదురాకు పచ్చ పువ్వులు.. ఆమెకు ఒక ముపై పైనే వుంటాయి. నిత్య గుసగుసగా అనుకుంది ‘జ్యోతి’ అని. ఆ పొడవాటి మహిళకు నిత్య పిలుపు వినబడినట్టే.. ఆమె వైపు చూసింది.

“ఇక్కడ మురళి అనే పేషెంట్ జాయిన్ చేసారని”.. అంటూ ఏదో అనేలోగానే నిత్య లేచి.. “అవునండి ఇక్కడే” అంది. అంతలో కానిస్టేబుల్ వచ్చి,

“మీరేనా మురళి భార్య”.. అని అడిగాడు.

“అవునండీ.. అయన ఎలా వున్నారు..” ఆమె గొంతులో కంగారు నిండిన ఆత్రం.

“ఆత్మహత్యా ప్రయత్నం చేసాడు. కానీ త్వరగానే మనసు మార్చుకున్నాడు. పెద్దగా ప్రమాదం ఏం లేదు. మీరు వెళ్ళి చూడొచ్చు. మీరు వెళ్లి వస్తే నేను అడగాల్సిన ప్రశ్నలు కొన్ని వున్నాయి అడగాలి” అన్నాడు కానిస్టేబుల్.

జ్యోతి కంగారుగా లోపలి వెళ్ళింది. నిత్య ఆమె వెళ్లే వైపే చూస్తూ కాసేపు నిల్చుంది. జ్యోతి బైటకి వచ్చేసరికి సమయం తెల్లవారుజాము నాలుగు అవుతోంది. చలి చాలా ఎక్కువగా వుంది. ఆమె శరీరం సన్నగా జలదరిస్తుంది. పెదవులు తన అనుమతి లేకుండానే వణుకుతున్నాయి. చీరను భుజాలు మీదుగా కప్పుకొని బైటకి వచ్చి చుట్టూ చూసింది. దూరంగా కానిస్టేబుల్ కనిపించాడు. ఎస్క్యూజ్ మీ! ఇతన్ని కాపాడింది ఎవరు అని అడిగింది అతని దెగ్గరికి వెళ్లి.  ఒక అమ్మాయి కాపాడిందమ్మ. ఇందాకే వెళ్లిపోయింది. మీరొస్తే ఈ ఉత్తరం ఇమ్మంది అంటూ అతను జ్యోతికి ఒక ఉత్తరం ఇచ్చాడు. జ్యోతి ఆత్రంగా దాన్ని తెరిచి… చదవడం ప్రారంభించింది.

‘జ్యోతి గారు!

మీకు నేను ఎవరో తేలికపోవొచ్చు. కాసేపటి క్రితం మీ ఉత్తరం చదివే వరకూ మీరు కూడా నాకు తెలీదు. దాన్ని మీ వారితో పాటు నేను చదివాను. ఆ ఉత్తరం ద్వారా మీరు నాకు జీవితకాలం గుర్తుండే పెద్ద పాఠాన్ని నేర్పారు. మీకు ఎంత పెద్ద థాంక్స్ చెప్పినా తక్కువే. ఊరు, పేరు తెలియని అనామకురాలు ఏవేవో చెప్తుంది అని మరోలా అనుకోకండి. ఈ వేదనని ఇన్నాళ్లు మనసులోనే దాచుకొని నలిగిపోయాను. ఎందుకో ఈ రోజు క్రితం ఎప్పుడు పరిచయం లేని మీకు చెప్పుకోవాలి అనిపిస్తుంది. నిన్నటి రాత్రి మురళి గారు, నా ఇంటి తలుపు తట్టకపోయి వుంటే.. నా జీవితం ఈ పాటికి ఏం అయ్యుండేదో నేను ఊహించలేను. నేను కూడా అతనిలాగానే చచ్చిపోదాం అనుకున్నాను. ఆ సమయంలోనే ఇదంతా జరిగింది. మీరు అన్నట్టు మనల్ని మనం చంపుకోవడం కన్నా హీనమైన చర్య మరొకటి లేదనుకుంటాను జ్యోతి. అయినా కూడా ఆ స్థితికి నేను దిగజారానంటే.. నేను జీవితంతో ఎంత విరక్తి చెందానో ఆలోచించండి.

మా అమ్మ నాకు చీకటి అంటే భయం అనుకుంది.. కానీ ఆ చీకట్లో జరిగిన ఘోరం ఏమిటో, ఆ చీకటంటే నాకు ఎందుకు భయమో నన్ను ఏ రోజూ అడగలేదు. నా శరీరమంతా రక్తం అంటుకుంటే.. పిరియడ్ టైంలో ఆటలాడి అంటించుకున్నాను అనుకుంది మా బామ్మ, కానీ స్కూల్ స్టాఫ్ రూమ్‍లో ఏం జరిగిందో ఆమెకు తెలియదు. నా చిన్నప్పుడు మా పక్కింట్లో వుండే ఒక పోలీస్ చెయ్యి కొరికాననని చెడామడా తిట్టిన నాన్న, ఒక భయస్థురాలైన కూతురు అంత పని ఎందుకు చేసిందని తెలుసుకోలేదు. పెళ్ళి చేసుకుంటే భార్యని ఏమైనా చెయ్యోచ్చు అనుకునే భర్తకి, అతని ఊపిరి తగిలితేనే చిరాకుపడే నా వింత చేష్ట అర్థం కాలేదు. దాని వెనుక కారణం ఏమిటో తెలుసుకోలేదు సరికదా నాపై ద్వేషాన్ని చిమ్మడం అలవాటు చేసుకున్నాడు. వీటన్నింటి మధ్యా నలిగిపోయిన నాకు, బ్రతకాలనే కోరిక ఏనాడో చచ్చిపోయింది. ఈ రోజు నేను చంపాలనుకున్నది నాలోని మిగలని నన్ను మాత్రమే.

కానీ మీరు మురళికి రాసిన ఉత్తరం చదివాక నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైంది. ఈ వేదనల వెనుక దాగిపోయిన అసలైన నన్ను వెతుక్కోవడంలో నేను ఎలా ఓడిపోయానో తెలిసింది. మన మౌనాన్ని, మన కన్నీళ్ళని ఏం చెప్పకపోయినా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువమందే వుంటారు. కానీ ఆలా వుండాలి అని కోరుకోవడమే ఒక బలహీనత అని అనిపిస్తోంది. నేను బలహీనురాలిని అయ్యింది ప్రపంచం నుంచి కొరవడిన మమతా వల్ల కాదేమో, నా అనే వాళ్ళ ప్రేమ రాహిత్యం వాళ్ళ కాదు ఏమో..  నన్ను నేను ప్రేమించుకోవడం లోనే ఎదో లోపం జరిగింది అనుకుంటాను. ఇకపైన నన్ను నేను ఎంత ప్రేమించుకోగలిగితే అంత ప్రేమించుకుంటాను. ప్రపంచం నుంచి ప్రేమను ఆశించడం కన్నా ముందు అది మనలోనే జనించాలని చెప్పిన మీకు రుణపడి వుంటాను. ఈ కొత్త సంవత్సరం నాకు నిజంగా మరో జన్మనిచ్చింది. నేను మళ్ళీ పుట్టాను. నాకిప్పుడు భయం లేదని చెప్పను. దానితో పోరాడే శక్తిని అలవర్చుకోటానికి ప్రయత్నిస్తాను అని చెప్పగలను. జీవితం పైన జనించిన కొత్త  ఆశతో వెళ్తున్నాను. నా ఆకాంక్ష నెరవేరాలని కోరుకోండి. నన్ను బ్రతికించిన మీ వారికి నా తరుపున కృతజ్ఞతలు చెప్పండి. ఇదంతా మీ ముందు నిలబడి చెప్పడం నేను వున్న పరిస్థితుల్లో సాధ్యం కాదనిపించింది. అందుకే ఉత్తరం రాస్తున్నాను. జీవితం మళ్ళీ మనల్ని కలిపితే కలుసుకుందాం. అంత వరకు సెలవు.

నిత్య.’

ఉత్తరం చదవడం పూర్తి అయినా కూడా అవే అక్షరాలని మళ్ళీ మళ్ళీ చదువుకుంది జ్యోతి. ఏమిటిదంతా.. నేను చదివేదంతా నిజమేనా! ఎంత ప్రమాదం తప్పింది. ఆమె గుండెలపైన ఆ ఉత్తరాన్ని అణుచుకొని నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. రాత్రి మురళి పడుకున్న సమయంలో.. ఏం రాయాలో ఎలా రాయాలో తెలియక ఎన్ని ఉత్తరాలు రాసి చింపేసిందో ఆమెకి గుర్తొచ్చింది. ఇక రాయోద్దు అని నిర్ణయించుకున్న తర్వాత కూడా మళ్ళీ మనసు మార్చుకుని అర్ధరాత్రి మూడుగంటలకి రాసిన ఉత్తరం అది. అలా గనుక రాయకపోయి వుంటే ఏం జరిగేదో వూహించుకోవడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. ఆ నాలుగు వాక్యాలు రెండు నిండు జీవితాల్ని కాపాడాయంటే.. ఆమెకు చాలా ఆనందంగా అనిపించింది. ఆమెకి పరిచయమే లేని నిత్య ఆశించిన జీవితం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంది జ్యోతి. నిత్య చేసేది ఒంటరి ప్రయాణమే కావచ్చు.. కానీ ఈ సారి ఆమె ఒంటరితనానికి ధైర్యం తోడుగా వుంటుంది అనుకుందామె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here