ఆమోదితం

7
6

[dropcap]“ఒ[/dropcap]క్కసారి – మా అన్నయ్యను చూసి రాగలుగుతావా”

అంటూనే, ఉగ్గబట్టిన ఓపిక అయిపోయి నేల మీదే కూలబడిపోయింది. ఎదురుగా, కాసింత ఎడాన.

అన్నంలో పోసిన పాలు కలుపుకుంటూ చటుక్కున తల ఎత్తాడు. అమ్మ కళ్ళు వాల్చుకొనే ఉంది.

భోజనం పూర్తయేవరకూ మాట్లాడటం అవదు –

ముగించినాకా ఆవిడే చెబుతుందని చూస్తుండిపోయాడు.

ఎప్పటివలె పడమటింటిని విడిచి పోకుండా, ఆ పక్కన ఊయల బల్ల మీదికి వెళ్ళి కూర్చున్నాడు.

తల్లిని వదలి ఉండలేని పిల్లవాడి అల్లరికి బదులుగా – తన ప్రేమతో తండ్రి వేయించిన చిన్న వసారా. పది పన్నెండేళ్ళు దాటే వరకూ అక్కడే, పగలూ రాత్రీ.

చిన్నదయిపోయింది ఇప్పుడు. అప్రయత్నంగా కాలు తాటించాడు. సన్నగా ఊపు – అటూ ఇటూ. గోడ మీద పటచిత్రం – బలభద్రుడూ జగన్నాథుడూ సుభద్రా.

పైని ఆకాశదీపం లోంచి మసక వెన్నెల. వంట ఇంటి గడప మీద ఆముదపు దీపం . మసక వెలుతురు.

ఎంతకీ రాదు, తల్లి – సుభద్ర. తన కోర్కె ను తానే తరచుకొంటూ ఆ పనీ ఈ పనీ కల్పించుకు చక్కబెడుతూ.

“అమ్మా …”

ముకుళించిన ముఖం. పసుపు చెంపల పైన కన్నీళ్ళ జాలు.

“చెప్పమ్మా – ఎక్కడికి వెళ్ళమని?”

“ఢిల్లీ లో లేడట ఇప్పుడు. కాశీ లో కనిపించాడని – రాణి గారి బంధువులు-”

“ఓహో”

“వెనకటి లాగా కాదట. వైభవమేమీ లేదు- సాటివారు వెలివేశారు …” గొంతు పూడుకుపోయింది .

“ఓ ..”

సర్వం జగన్నాథమన్న వాక్యానికి వ్యాఖ్యానంగా బ్రతికాడని, మాత్రమే – తెలుసు.

తాను ఇప్పుడు వెళ్ళి ఏమిటి చేయాలట?

అంత నిష్ఠూరం గా పైకి అనలేకపోయాడు.

“నాన్న ఏమంటాడో-”

“అడిగాను రా”

***

అడుగు అటు పడుతూనే –

అక్కడే ఉన్నాడు, తండ్రి – ఎదురు చూస్తూ.

ఏమి ఒద్దిక – ఆలుమగలది… నవ్వు వచ్చింది, తృప్తి కొద్దీ.

“రాయనిం వారు ఈ దశమి నాడు బయలు దేరుతారని అంటున్నారు…వారి కూడా వెడితే ఇబ్బంది పడనక్కరలేదని మీ అమ్మ అంటున్నది”

“వారితో నైతే మనకు స్వతంత్రం ఉంటుందా – ఆలస్యమయి పోతుంది కూడానూ”

అవును. ఆలస్యం కారాదు. బావమరది జాతకమే, తిరగవేస్తున్నాడు అప్పటి వరకూ… ఆవిడతో అనలేడు గాని. అక్కడ ఎంతో కాలం నిలవడు – మారకమో సన్యసించటమో, ఏదో ఒకటైతే తప్పదు.

“మంచిది, మాధవా. నీ వీలు చూసుకో, త్వరగా”

మూటా ముల్లే సర్దిపెడుతూ, ఒకే వరసన తలచుకుంటోంది – అన్నను.

“ఎంత గారాబమో నేనంటే. వాడి పెళ్ళికి నాలుగో ఏడు నాకు – వదినైతే నన్ను వదిలేదే కాదు… ఇక్కడున్నన్నాళ్ళూ… “- ఊరికూరికే ముక్కు ఎగబీల్చుకుంటూ.

“నువ్వూ ప్రయాణం కట్టవే, మరి. మరొక వదినె ఉన్నది గదా ఇప్పుడు “

తేలిక చేయబోయిన వేళాకోళానికి బదులుగా భోరుమన్నది.

“లేదు లేదు…ఊరుకో. ఇప్పుడేమై పోయిందనీ… మాధవుడు మీ అన్నను వెంటబెట్టుకు వస్తాడు చూడు”

“వస్తాడంటారా…” – గొణుగుకుంది.

 తల నిమురుతూండి పోయాడు.

అబ్బాయి వెళ్ళి రాగలడు. ఏపూటకు ఆ పూట -ఎవరో భోజనం పెట్టక పోరు. ఎక్కడో అక్కడ నీడ దొరకకాపోదు. ఈవిడ కు ఓపిక తక్కువా పట్టింపు ఎక్కువా… సాగదు. తెలుసు.

***

చైత్రమాసం పూర్తి కావస్తోంది. దశాశ్వమేధ ఘట్టంలో సూర్యాస్తమయం. అప్పుడే కరిగించిన సువర్ణం లాగా గంగా ప్రవాహం.

వేడిమి. వేసట.

ఇంకెన్నాళ్ళు …

వెళ్ళిపోవచ్చు, కానీ పిల్ల గతి?

తెలియడం లేదు జగన్నాథ భట్టుకు.

దారాషికో వారి అంతఃపురం నుంచి తప్పించి, తనకు గురువు గారైన శేషవీరేశ్వరోపాధ్యాయుల ఇంటిలో దాచిపెట్టాడు.

విడిగానే. కలుపుకోరు.

అదైనా ఎంతకాలం ?

ఏ తురుష్క ప్రముఖుడో తలచుకు చెరబట్టదలిస్తే ఏ ఆటంకం నిలవదు, అందుకు అవకాశమే హెచ్చు… శత్రువులే ఎక్కువ .

ఎట్లా ..?

 వెనకన అందెల చప్పుడయింది.

 లవంగి. షాజహాన్ నుంచి వచ్చిన అపురూపమైన బహూకృతి. అడిగి మరీ స్వీకరించాడు తాను.

“ఆమెను వదిలేసి ప్రాయశ్చిత్తం చేసుకో, అంతా సరైపోతుంది” – లోకం మాటగా వీరేశ్వరోపాధ్యాయుల కుమారుడు.

ఉహూ.

న్యాయం కాదు.

స్వధర్మాన్ని తప్పి చాలా కాలమైంది, నీతి కూడా లేక ఇంక దేనికి!

ఆ లేడి కళ్ళూ లేత ఒళ్ళూ ఒకనాటి మురిపెం. ఏళ్ళు గడిచి వచ్చిన ఇవాళ, వేరే‌లేదు – విడగొట్టేందుకు.

మెల్లగా వెనక్కి, బసకి. వెనకే ఆమె. అడుగులో అడుగు గా.

ఏవేవో జ్ఞాపకమొస్తున్నాయి అతనికి.

కామేశ్వరి.

తన ఇల్లాలు.

పెళ్ళి నాడు పాదమెత్తి సన్నికల్లు తొక్కేందుకే తన చేయూత కావలసివచ్చింది…అంత ఎత్తు కు, స్వర్లోకానికి ఎట్లా ఎగిరిపోయిందో !

తన విలాసాలనూ విహారాలనూ తప్పు పట్టినది లేదు ఎప్పుడూ.

ఉద్దండ పండితుడూ మహా మేధావీ భర్త అవటమే చాలని ఎన్నైనా మన్నించేది. ఇంటికి వెళ్ళటమే, చల్లని మల్లెపువ్వు ల రాశిలోకి చేరినట్లుండేది.

ఈ శ్రావణానికి పద్దెనిమిదేళ్ళు… అమ్మాయి ని చేతిలో పెట్టి నిష్క్రమించి.

చంటిపిల్లకి పోషణ, అంతఃపురపు దాదుల చేతనే .

ఆసరికే ఎదిగి వచ్చి ఉన్న కొడుకు ముకుందుడికి, ముందు నుంచీ తన వరస అంత గిట్టదు.అటువైపున వాడి మామగారు గొప్ప నైష్ఠికుడు. అమ్మ పోయిన ఏడాది కల్లా తెంపేసుకుని కుటుంబం తో సహా అక్కడికి వెళ్ళిపోయాడు.

అయినా నిన్న మొన్నటి వరకూ ఇబ్బందేమీ లేదు, ఎందునా.

కొత్త పాదుషా గద్దె ఎక్కడం తోటే జీవితం పెడ తిరిగిపోయింది,

లేదు -అంతకు ఇంకా ముందే.

 సుకుమార మనస్వి షాజహాన్ పాదుషా ను చెరలో పెట్టినప్పుడే. యమునా నది నీరైనా అందకుండా చేసినప్పుడే. షాజహాన్ ఆక్రోశం తో పద్యం రాసి పంపాడు ఆ కొడుకుకు – “చనిపోయిన తలిదండ్రులకు సైతం హిందువులు నీరు వదలుతారు…బ్రతికి ఉన్న నన్ను ఇట్లా ఎండగడుతున్నావు “

ఆఖరికి – తనకు కొండంత అండ అయిన దారా షికో ను నరికివేశాక,

 చెరువైన గుండెను అరచేత పట్టుకొని ఒక్కొక్క రోజూ గడుపుతూండగా …

జగన్నాథ పండితరాయలకు ఎద్దడి మొదలైంది. బిరుదు పోయింది, సంపద తరిగింది. పర్వాలేదు కాని మతం మారి తీరాలన్న ఒత్తిడి అదిమింది.

వాళ్ళనూ వీళ్ళనూ పట్టుకొని చెప్పించి అన్నీ వదిలేసుకొని ఉన్నవాడు ఉన్నట్లుగా వారణాసికి వచ్చిపడ్డాడు.

ఇక్కడెవరూ ఆహ్వానించలేదు.

తన ప్రభ ముమ్మరంగా వెలిగేటప్పుడు అప్పయ్య దీక్షితులను తప్పులు పట్టిన వైనం మరచిపోలేదు, వారి శిష్యులూ పరివారమూ.

పాదుషా ప్రాపకం ఉన్నంతకాలమూ ఎవరికీ ధైర్యం చాలనేలేదు.

నెలవు తప్పిన ఇప్పుడు,వెలి పెట్టారు.

లెక్కలేదు తనకు.

లేనేలేదు.

కానీ, కూతురు?

అష్టవర్షాలు దాటేసినాయి ఏ నాడో. తనకు ఆమాట తట్టేసరికి, పిల్లకు వయసూ వచ్చేసింది. వివాహానికి సాహసం కావాలి, స్మృతి నిషేధాలను దాటాలంటే.

ఎవరికి అప్పజెప్పాలి?

***

పరమ పావని, పతిత మోచని – ఆ భాగీరథి యే దిక్కు.

ఆవిడ ఉద్భవించిన శ్రీ చరణాలనో, అలంకరించిన జటాజూటాన్నో – స్మరించి వేడుకొనేందుకు గుండె చాలటం లేదు. మనసూ రావటం లేదు.

ఏదైనా, ఈ దారినే.

రోజుకొక్క విన్నపం,మొదలుగా – నలభై నాలుగయినాయి.

ఆ మిట్ట మధ్యాహ్నం.

కూర్చి చెప్పుకొన్న మాటలను పదేపదే వల్లించుకొంటూ.

“నిరస్తాలంబానామకృత సుకృతానాంతు భవతీం

 …..

పుణ్యాత్ముల నెవరైనా కాచుకోగలరమ్మా! నామమాత్రపు సుకృతమున్న నా వంటి వాడికి, ఆలంబన లేని వాడికి – ఇహానికైనా పరానికైనా, నువ్వు తప్ప ఎవరున్నారు?”

దూరం నుంచీ ఎవరో. తనవంకకే.

దగ్గరపడే కొలదీ రూపు కడుతూ.

అంత ఎత్తూ ఇంత ఎడదా.

వేదాధ్యయనపు వెలుతురు, ముఖంలో- జడత్వపు నీడ పడనిది.

ఎంతగానో ఎఱిగే ఉన్న వాలకం….

పోల్చే లోపునే పిలిచాడు –

“మామయ్యా! మాధవుడిని. సుభద్ర కొడుకును “

అబ్బా.. మధురమైన వైఖరి !

నీలమేఘం కురిసిన సుఖం. ప్రాణానికి హితవుగా.

వీడి పుట్టుకే తనకు తెలియదు … ఇంత దగ్గరి బంధువు.

ఆదరించేందుకు ఏమీ లేదు.

వెలివడి ఉండి, కౌగలించనైనా కుదరక –

వలవలమని కుంగిపోయినాడు.

ఊరడించుతూ, మేనల్లుడు.

కాస్త సర్దుకున్నాడనిపించాక, మామను అడిగాడు

“ఇంక ఇక్కడెందుకు, మామయ్యా? ఊరికి రారాదా? అంతా ఉంటారు కదా…”

“నాకే ఊరున్నదిరా! ఉపద్రష్ట వారు నన్ను ముంగండకు రానీయరు. అయినా ఎక్కడకూ కదలలేను. ఎవ్వరికీ అక్కరలేదు “

“మేము వేరే, మామయ్యా. మాకు ఉంది. అమ్మకు కావాలి, నువ్వు”

“పిచ్చిది, సుభద్ర ! దానికేమీ చేయలేదు నేను -”

“చేయాలా, ఏమిటి చెప్పు! ఉండటమే చాలుతుంది”

నవ్వాడు జగన్నాథుడు. అంత శుష్కమైన తీరు లోనూ ఆ నవ్వులో ఆకర్షణ పోనేలేదు… బాగా బ్రతికిన నాటి చిన్నెలు కనబడినాయి మాధవుడికి.

“రాలేనురా. సంకెలలున్నాయి. కోరి వేసుకున్నవే – ఇప్పడు బరువయిపోవు “

ఆ వెనుకనుంచి పలుచగా సోకే అత్తరు సువాసన.

అర్థమైంది, అల్లుడికి.

“సరేలే మామయ్యా! అమ్మ చూసి రమ్మన్నది, అందుకు వచ్చాను. ఏమైనా సాయం కావాలా, చేయగలనా?”

కుశాగ్రమైన జగన్నాథ భట్టు బుద్ధి వేగంగా ప్రసరించింది.

ఆశ కలిగింది. అంతలోనే అది అన్యాయమనిపించింది.

గ్రహించాడు మాధవుడు.

“చెప్పు, చెప్పు మామయ్యా. చేస్తాను . తప్పకుండా”

“నా కూతురుందిరా, మీ అత్తయ్య ఇచ్చిపోయినది. దాన్ని నీతో తీసుకు వెళ్ళ గలవా …?”

“అదొక పెద్ద విషయమనా, ఇంత ఆలోచన! తప్పకుండా తీసుకు వెళతాను. ఎక్కడుంది? ఎంత పిల్ల ??”

 “పదిహేడేళ్ళదిరా. పెళ్ళి కాలేదు”

“ఎట్లా మరి !??” – సతమతమైనాడు మాధవుడు.

“రెండే మార్గాలురా. ఒకటి విధవా వేషం -“

“ఛఛ”

“లేదా నువు వివాహమాడటం”

“ఆ!!! ?”

“మనకు – దక్షిణాది వారికి, మేనమామ కూతురును పెళ్ళాడటం సమ్మతమే “

“అది తెలుసు మామయ్యా. నేను సిద్ధమే. అమ్మానాన్నా కాదనరు. కాని….”

“పద్ధతిగానే పెరిగిందిరా. వయస్సు…. ఆ అడ్డంకికి, పూరీ శంకరాచార్యులు మార్గం చూపించగలరు… ఇప్పుడు కాశీ లోనే ఉంటున్నారట. పండితులూ ఉదారులూ కూడా….”- అప్పటికప్పుడు అనేశాడు జగన్నాథుడు. ఈ ఆధారాన్ని వదులుకోరాదు- అడుగున అంత అగాధం….

****

 గురువు గారి పెరటిలో, నౌకరులు నివసించే పక్కన – ఒంటి గది చుట్టుగుడిసె.

 అక్కడ ఉంది మిత్రవింద.

జగన్నాథ పండితరాయల కుమార్తె.

కాబా వైపుకు మోకరిల్లి ప్రార్థన ముగించింది.

భోజనం చేసి పాత్రలు కడిగిపెట్టుకుంది.

అవి తనతో తెచ్చుకున్న వెండి గిన్నెలు. ఇక్కడి ఆహారాన్ని ఆకులలో ఇస్తారు.

అనాదరం ఏమీ లేదు, వేళకు అన్నం పెడతారు. అంతకు మించి మరేమీ ఉండదు. పని చేసే వారు కూడా చాలా దూరానే ఉంటారు.

ఆచారమట.

తనకు లేదట.

లేదా?

ఆలోచించగా, అక్కడ అంతఃపురం లోనూ తన భోజనం వేరేనే. బస కూడా విడిగానే. అంతమాత్రం నిజమే. తనను కన్నతండ్రి ఏర్పాటట అది – అడపాదడపా వచ్చి చూస్తుండేవారు.

కానీ, రోజంతా ఎంత రసవంతం గా ఉండేది !

ఉదయం సంగీతమూ మధ్యాహ్నం పండిత చర్చలు. పొద్దుపోయినాక నృత్య నాటకాలు.

గులాబీలు పరిమళాలు జలతారులు జలయంత్రాలు…

వీటి మధ్యన చదువుకోవటం, సితారా సాధన చేయటం… పాడుకోవటం.

జహాపనా దారా షికో కు పెంపుడు బిడ్డ. అన్ని విధాలా తగినబిడ్డ…అని ఆయనే అంటుండేవారు.

పర్షియన్, అరబిక్, సంస్కృతం – మూడూ సమంగా వచ్చేవి. ఉపనిషత్ ల అనువాదాలలో పని చేస్తుండేది. ఖుర్ ఆన్ బాగా చదువుకుంది.

రెండింటి ప్రతిపాదనలలో చాలా సామ్యం ఉందని వింటుండేది-

అక్కడి అందరి వలెనే తానూ, నమాజ్ చేస్తూ. వారి ఆహారాన్ని రుచిచూస్తుండేది – బేగమ్ సాహెబా స్వయంగా మిఠాయిలు తినిపించేవారు.

ఇప్పుడేమీ లేవు. ఎవరూ లేరు.

అసలు తానెవరో కూడా అర్థం కావటం లేదు.

***

రెండు రోజులు గడిచాయి.

“అమ్మా !!!”

తండ్రి పిలిపించాడు, గంగా తీరానికి.

“నా మాట వింటావా?”

“చెప్పండి -”

“మీ బావతో మనదేశం వెళ్ళిపో “

చివ్వున తల ఎత్తింది.

“ఎక్కడికి నాన్నా? ఏది నా దేశం ??”

“నీది కాదులే, పోనీ. మీ అమ్మది. నాకొక ఊరే లేదు, మిగలలేదు.”

“నాకు ఉంది. ఇక్కడే ఉంటాను”

“ఔరంగజేబ్ అంతఃపురానికి వెళతానంటావా? లేదా అతను చెప్పిన చోటికి?”

“ఛీఛీ. అమూఁ ను చంపేశాడు వాడు “

“బిగ్గరగా మాట్లాడకు. గోడలే లేని ఇటువంటి చోట్ల, మనుషులు వింటారు. బ్రతకనివ్వరు”

“….”

“ఇవాళ ఉత్తరభారతానికంతకూ ఔరంగజేబు పాదుషా. కాదని నిలిచేందుకొక్క నీడ లేదు మనకు”

“ఏం, నాన్నా ? ఒక్కరైనా స్నేహితులు లేరా, మీకు ? అంత వైభవం అనుభవించారే ..?”

“ఉన్నారు కనుకనే నువ్వు ఈ మాత్రం ఉన్నావు…”

“ఏ మాత్రం ?”- అనుకోకుండా అనేసి తలదించుకుంది.

“క్షమించమ్మా. నా అపరాధమే ఇది. రాజుల గతులతోబాటు ఆశ్రితులవీ కిందామీదా అయిపోతాయి. ఆశ్రయించటమే దోషం…అందునా ఇది పరాయి చోటు. మనవైపున ఒక మహానుభావుడు – నరాంకితంగా కవిత్వం చెప్పనని పట్టుబట్టి వ్యవసాయం చేసుకు జీవించాడట.. నేను అంతటి వాడిని కాను సరికదా, చాలా చాపల్యాలకు దాసుడైన వాడిని. క్షమించు”

మిత్రవింద తలపోసుకుంటోంది….”ఎంతటి వాడు ఆయన ! ఆసేతు సీతాచలమూ సాటి లేడనిపించుకొన్న పండితుడు, ఆలంకారికుడు, కవి….

మన్నించమని నన్ను అడగటమేమిటి… అయ్యో “

“అమ్మా, నిన్ను ఎటూ కాకుండా పెంచాను. ఒక దరికి చేర్చే అవకాశం ఇవ్వు… ప్రశాంతంగా దాటిపోనీయి”

అప్పుడు చూసింది, అతన్ని – మాధవ భట్టును.

కొంచెం ఎడంగా – చేతులు కట్టుకుని కదలకుండా నిలుచుని ఉన్నాడు. కానీ, కళ్ళ లో స్నేహం ఉంది. మరొకటి…. అదేమిటి – కరుణా? వాత్సల్యమా??

“మ్లేచ్ఛుల ఇంట్లో పెరిగినందున నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవలసి ఉంటుంది …”- తండ్రి.

“…..”

“హైందవ సమాజం లో ఎవరూ అవివాహితులు గా ఉండరాదు “

“శంకరులు సన్యసించారు కదా ?”

“ఆయనే ఒక మినహాయింపు, ఆ కాలానికి. కాగా, స్త్రీ లకు అవకాశం లేదు”

“బౌద్ధం లో ఉంది కదా? “

“ఆ. ఉంది…ఉందిలే. ఎక్కడికెళతావు వాళ్ళను వెతుక్కుంటూ? సిక్కులే నిలవలేకపోతున్నారు… నిన్న గాక మొన్న వాళ్ళ గురువును హత్య చేశారు…… …. వాదించకు ఇంక. నీతో వివాహానికి పూరీ శంకరాచార్యుల అనుమతి తెచ్చాడు మీ బావ. వేరే దారేదైనా ఉంటే చూసుకోపో, మరి నాకు శక్తి లేదు…”- కోపంతో అలసటతో స్మృతి తప్పుతూ నేలమీదికి జారుతూన్న జగన్నాథ భట్టును – చప్పున వచ్చి లవంగి పట్టుకుంది.

***

వెళ్ళటానికి ఇరవైరోజుల ప్రయాణం చాలింది గాని వెనక్కు అంతకు రెండింతల పైన. అదైనా, గంగ పైన సముద్రం వరకూ వెళ్ళి – దిగువకూ పడవలోనే కోరంగి రేవు చేరటం వలన.

ఎక్కువ మాటలు లేవు ఇద్దరి నడుమన. ఆమె కు ఆసక్తి లేదు, అతనికేదో మొగమాటం.

ఇంక రెండు రోజుల ప్రయాణం ఉందనగా – కదిలించింది.

“నా గురించి ఏమీ తెలియకుండా పెళ్ళి చేసుకున్నారు…”

“ఏమి తెలియాలి? మామకూతురివి. చదువుకున్నదానివి…”- నవ్వేశాడు అతను.

“కాదు. నాకేమీ తెలియవు. అలవాటు లేదు”

నమ్మకాలు వేరు అని నోటివరకూ వచ్చి ఆగింది ఆమెకు.

“ఏమీ కాదులే. అమ్మా నాన్నా మంచివాళ్ళు. చూస్తావుగా “

పీఠికా పురపు పొలిమేరలు చేరేసరికి చీకటి పడింది. ఆషాఢం, గాలీవానా.

ఊరి కి కాస్త ఇవతలగానే, మంత్రవాది వారి లోగిలి. చడీ చప్పుడూ కాకుండానే చేరేందుకు వీలయింది.

ఇకనో ఇప్పుడో వస్తాడనుకోవడమే గానీ –

ఇది ఏమిటి ?

“అమ్మా! నీ మేనకోడలు. నాన్నా ! నీ కోడలు “

మారుమాట లేకుండా దీవించారు.

స్నానం చేసి వచ్చిన కోడలిని తనివారా చూసుకున్నది సుభద్ర… అన్న పోలికలనూ వదిన చక్కదనాన్నీ.

“అమ్మాయీ, ఇది నీ గది. శ్రావణం చొరబడే వరకూ మనమిద్దరం ఒకే గడప దాటకూడదు. ఇంతవరకూ తప్పలేదు గానీ, ఇప్పటినుంచీ.బయటికి వేరే దారి ఉన్నదిలే “

మళ్ళీనా ! ఇక్కడ కూడానా ?

పట్టలేక ఒక్కసారి కావలించుకొని చెక్కిలి ముద్దాడి వెళ్ళింది, అత్తగారు.

కాదు. దూరం లేదు.

***

వేరే తన గది ఉండటం బాగానే ఉంది.

పొలం మధ్యన ఇల్లు. చుట్టూ చెట్టూ చేమా. ఊపిరాడుతోంది.

మాధవుడు తిరిగి ఆమె కంట పడలేదు.

మామగారు ఎప్పుడైనా తొంగిచూస్తుంటారు. పలకరించుతారు.

అత్తగారు, దాదాపుగా ఆ గడప అవతలే కాపురముంటోంది. ఎంత చూసినా ముద్దు తీరదాయె.

ఏవేవో అడుగుతుంది – జవాబులు తెలియవు మిత్రవిందకు.

ఇద్దరిదీ చెరొక భాషా?

చెరొకలోకం.

“కుంకుమ పెట్టుకోవేమమ్మా ? నిండుకుందా ఏమిటి – ఇంద, తీసుకో”

పెట్టుకోదు. అలవాటు లేక కొంత. ఎబ్బెట్టు గా తోచి, చాలా.

పాట వచ్చునా, పాడమన్నది – ఒకనాడు. ఒక్క ముక్క కూడా ఆవిడకు అర్థం కాలేదు. మళ్ళీ అడగలేదు.

“శ్రావణ మాసం వస్తే మనిద్దరికీ తీరుబడే ఉండదు, చూసుకో …ఎందుకంటావేమే, వారం వారం నోము పట్టద్దూ “

 ఆ రోజున దారికాచి నిలబెట్టింది, మాధవుడిని.

“నేను చేయను. నాకు నచ్చవు”

ఏమి నచ్చజెప్పాడోగాని అత్తగారు ఊరుకుంది. దిగులు పడింది, కాకపోతే.

కొన్నాళ్ళకు మళ్ళీ మామూలే.

శ్రావణం వచ్చేసింది. మంచి రోజున పునస్సంధానం ఏర్పాటు.

ఎక్కువ హడావిడి వద్దని మాధవుడు హెచ్చరించిన మీదట –

తప్పదు గనుక కొందరు వచ్చారు – వాళ్ళూ వీళ్ళూ . ‘ఉత్తరాది కోడలి’ ని చూసి అబ్బుర పడ్డారు. ఇబ్బందీ పెట్టారు.

పంటి బిగువున భరించింది మిత్రవింద.

వచ్చినదారినే అందరినీ పంపించివేసింది సుభద్ర, భయపడి.

రభస ఏమీ కాలేదు.

మరింకేమీ కూడా, జరగలేదు.

ఇష్టం పుట్టలేదు, ఒత్తిడి పెట్టలేదు.

బయటకు తెలియలేదు.

***

తన జాగ్రత్త లో తాను ఉంటూనే వచ్చింది, ఇప్పుడు వేరు గది లేని కారణాన.

ఆరోజు వరకూ.

దేవతార్చన మామగారిది, నైవేద్యపు వంట అత్తగారిది.

ఏదో కాసేపు పూజగది లో అడుగుపెట్టి మోకాళ్ళ మీద కూర్చుంటుంది, కళ్ళు మూసుకుంటుంది. విగ్రహానికి మొక్కినదెప్పుడూ లేదు. దారా షికో అంతఃపురం లో దైవమందిరాలు లేవు…అది ఎప్పుడో ఎక్కడో – అక్బర్ పాదుషా కాలంలో.

“ఇట్లా అక్కడి పద్ధతి కాబోలు….” సరిపెట్టుకున్నారు వీళ్ళు.

కానీ ఆవాళ.

ఎవరో పేరంటం పిలువవస్తే కోడలిని రమ్మని పిలిచింది. రాలేదు. వాళ్ళు వెళ్ళాక, ఓరగా వేసిన తలుపు తోసింది అత్తగారు సుభద్ర,కొడుకు ఇంట్లో లేడని తెలుసు.

నిర్ఘాంత పోయింది. కరచరణాలాడలేదు.

ఎట్లాగో లోపలికి –

దుప్పటి మీద కూర్చున్న కోడలి తలపైన ముసుగు.మోకాళ్ళ పైనుంచి వంగుతోంది, తల నేలకు తాకిస్తోంది. లేస్తోంది…

ఎదురుగా ఏమీ లేదు, అదేదో పుస్తకం. అదేదో భాష… నోటి వెంట.

ఒక్క కేక పెట్టింది.

మామగారు ఆదరాబాదరాగా వచ్చి పడ్డాడు.

“ఏమైంది ఏమైంది….!!!”

****

“ఏముందిలే నాన్నా. నిర్గుణ పరబ్రహ్మ ఉపాసన. మనకూ తెలుసు గా”

“తెలుసా? నీకు తెలిసే చేసుకున్నావా ?”

లేదు. తెలియదు. ఈ మధ్యన ఊహించాడంతే.

“ఆ. తెలుసు.”

“ఒరే నాయనా, మీ మామంత పండితుడిని కాదులే గాని నేను మరీ అంత అజ్ఞానిని కాను. ఇది ఆ మతం ప్రార్థన – అవునా కాదా ?”

“అయితే ఏమైంది నాన్నా ? దేవుడు మనకే సొత్తు కాదుగా”

“నాకు తెలియదయ్యా. మీ అమ్మకి కూడా తెలిసే అవకాశం ఉందనుకోను” – మెల్లగా లోపలికి వెళ్ళిపోయాడాయన.

బలవంతాన బదులు చెబుతూన్న మాధవుడికీ ఒక్కసారిగా నిస్త్రాణ వచ్చింది. తనూ వెళ్ళిపోయాడు. బయటకు.

పక్క గదిలోంచి మిత్రవింద వింటూ ఉంది.

ఏమిటీ మనిషి ? ఎందుకు భరిస్తున్నాడు తనను ….

అక్కడ వేరే దారులుండటం తెలుసు. మూడు మాటల తెగతెంపులు తెలుసు. తరచూ ఉపయోగించరు, కానీ ఉన్నాయి.

ఇతను తనను వదలడా?

మరొకరిని చేసుకోవచ్చునేమో కదా. తనను పెంచిన తండ్రి దారా షికో కు ఒకరే భార్య. ఇక్కడ మామగారూ అంతే. అయినా బహుభార్యాత్వం అక్కడా ఇక్కడా కూడా నిషిద్ధం కాదు…తనను కన్న తండ్రే ఉదాహరణ.

***

“నీకేమైనా పిచ్చి పట్టిందా? మళ్ళీ పెళ్ళేమిటి, ఎందుకు? మనమేమైనా దొరలమా మహారాజులమా… మంచిదానివే”

“అయితే వదలిపెట్టేయండి నన్ను”

“ఎక్కడికి వెళతావు ? ఎందుకు వెళ్ళాలి ? పంపించేందుకా, తీసుకు వచ్చాను ?”

“విషం తీసుకుంటాను “

“నీ కడుపు చల్లగా, ఆ పని మాత్రం చేయకు. మా అమ్మా నాన్నా తట్టుకోలేరు”

మరి తనకు ? తనకేమీ బాధ ఉండదా ?

 ఆమె ఉక్రోషం కనిపెట్టి అన్నాడు – “నాకూ బాధ ఉంటుంది… సరేనా! అయినా ఇంత గ్రంథమెందుకు మిత్రవిందా! బ్రతికే దారులుండకనే పోతాయా”

భార్యను పేరుపెట్టి పిలవరు. పిలుస్తాడేమి ?

కడుపు చలువ అంటే ఏమిటి ?

****

ఆ తర్వాతి కాలం అదొక మాదిరి గా గడిచింది.

అత్తగారు మాటలు తగ్గించింది. దూరదూరం గా ఉంటోంది. ఎప్పుడైనా ఇంత నవ్వు నవ్వుతుందంతే. ఒక్క చూపు లోనే ప్రేమ అంతా కుమ్మరించి అవతలికి వెళుతుంది. పెట్టుపోతలు యథావిధిగానే.

అవును, విధి కనుక.

మరి, తన విధి ?? ఉండదా !

తనంతట తనే, ఇంట్లో చొరవగా తిరగటం మొదలుపెట్టింది. సంస్కృత కావ్యాలున్నాయి, చదవనివి. అసలే చదవని తెలుగువి కూడా. తిరగవేయటం ప్రారంభించింది. ఏటికి కొత్తనీటి వలె ఎక్కుతున్నాయి, ఇంకుతున్నాయి.

ఎవరితో చర్చించాలి ? ఇంట్లో అందరూ చదివినవారే గాని…మామగారు పలకటమే లేదు, అస్తమానమూ జపమేదో. అత్తగారికి రోజు విడిచి రోజు మూగనోము.

అదీ ఒక నోము అట. నియమం నుంచి వచ్చినట్లుంది, ఆ మాట. నియమాలు ఎక్కడ లేవు?

చదువుకున్నదంతా వెళ్ళబోసుకుందుకు ఆమెకు మాధవుడొకడే. రుచి పంచుకోవటం బాగుంది….

పోగా పోగా – రుచులు వెతుక్కోవటం కూడా.

ఆమె వాడే గులాబి అత్తరు అతనికి అంటింది.

పెద్దవారి కన్నుల నిండా వెన్నెల పూసింది

***

తన ప్రార్థన మానలేదు . మానమని ఎవరూ అడగలేదు.

ఆమెకే, ఆలోచన.

“ఏమిటి జపం చేస్తారు మామయ్యా?”

అడిగినందుకు ఆనందించాడాయన.

“ద్వాదశాక్షరీ మంత్రం అమ్మా “

“అంటే “

 “విష్ణువు గురించి “

“ఆయనకు ఆకృతి ఉందా?”

“ఉంటుంది, ఉండదు కూడా. మనకెట్లా కావలిస్తే అట్లా”

“ఆదేమిటి, మన ఇష్టమా?”

“అంతే కదమ్మా. ఊత లేకుండా నడిచే శక్తి ఉంటే గొప్ప సంగతే. లేనప్పడు తీసుకోవద్దూ”

“దేనికి చేస్తున్నారు ? “

“ఆత్మ‌ను తెలుసుకుందామని”

“మరి విష్ణువు అంటారేమి?”

“తెలుసుకోవలసినది ఆయననే”

“ఆహా…. …అయితే దేవుడు పురుషుడే కదా?”

“పురుషుడు, స్త్రీ – రెండూ అవును. ఎవరూ కారు”

“మీరేమని భావిస్తారు ? “

“పురుషుడు గానే. స్త్రీ గా భావించేందుకు వేరే మంత్రాలుటాయి”

“మరి, చేపగానో తాబేలు గానో సింహం గానో అనుకోవచ్చునా ?”

“అవశ్యం. అవీ ఉన్నాయిగా “

ఇంకేమనాలో మిత్రవింద కు తట్టలేదు.

“భగవంతుడికి రూపం ఉండదు “

“నీ ఇష్టం “

“ఆయన దయాదాక్షిణ్య మూర్తి “

“ఆ మాట సత్యమమ్మా “

***

పీఠికాపురపు ఒక దైవం కుంతీమాధవుడు. ఏనాడో ద్వాపరం లో కుంతీదేవి పేరిట వెలిశాడా మేనల్లుడు. బొమ్మలను కొలవరాదనే దుండగాలు అక్కడికీ చేరగా- కొంతకాలం, కొలిచే వారి గుండెలలో దాక్కున్నాడు. సొమ్ము అంతా కొల్లగొట్టగా ఊరుకున్నాడు- ఆయన సొమ్మేమీ పోలేదు కనుక.

తిరిగి ఇప్పుడు. వైష్ణవులైన పద్మనాయకులు పాలకులై గుడికట్టి పిలవగా లోపలికొస్తున్నాడు.

అందుకొక ఉత్సవం, కార్తీకం చివరన.

మార్గశిరం మొదలైంది.

అందరితో బాటు తానూ బయలుదేరింది, మిత్రవింద.

“మాసానాం మార్గశీర్షోహమ్”

“నెల దేవుడేమిటి ? దేవుడికి ఇష్టమనవచ్చు గాని-“

“చల్లగా ఉంటుందని. పంట పండి వస్తుందని”

“తక్కిన నెలలు కావు కాబోలు…”

“అవీ అవును. కాలమంతా అవును. మనకు ఎంత హాయిగా ఉంటే అంత చప్పున అందుకుంటామని”

“అంత బాగుంటాడా?”

“చూస్తావు గా.”

మీరా పాటలు తెలుసును, తెలియక పోలేదు.

లోకాలను ఏలేవాడు ఆ బొమ్మకెట్లా ఒదుగుతాడో అదే తెలియరాదు.

“కొలువు ఇది. మన కొలబద్ద అనుకో, పోనీ”

అడుగు లోపల పడటం వరకే వివాదాలు అన్నీ. తులసీ చందన కర్పూరాలు. పొగడపూవులూ పారిజాతాలు. మిళితమైన ఆ మహాసౌరభం లాగివేసుకుంది.

“నల్లనివాడు, పద్మనయనమ్ముల వాడు ….”తరువాతేమీ చెవుల పడనే లేదు.

“మమ మాయా దురత్యయా…”

 దాటరానిదైన ఆ మాయ కు మూలమైన మాయ ఏదో ఆమెను కమ్మింది.. సౌందర్యం ప్రవహిస్తోంది, సుడులు తిరుగుతోంది. ఆమె మునుగుతోంది, లేస్తోంది.

ఒకప్పుడు – మిత్రవిందా దేవికి తోడబుట్టిన విందానువిందులను జయించి ఆవిడను తెచ్చుకున్న స్వామి … ఇప్పుడు మరొక విధపు గర్వం తో ఉల్లాసంగా నవ్వుతున్నాడు. ఆ దరహాస కౌముదీ దీధితికి చివర లేదు, కాని అంచు ఉన్నది. అక్కడ తన సొంతమైన మాధవుడున్నాడు.

 ఇకపైన, మరి ఒక్క ఊసు లేదు.

****

ధ్యానాభ్యాస వశీకృతేన మనసా

తన్నిర్గుణం నిష్క్రియం ; జ్యోతిన్ కించ

న యోగినో యది పరం పశ్యంతుతే

అస్మాకంతు తదేవ లోచన చమత్కారాయ

భూయాచ్చిరం ; కాలిందీ పులినేషు

యత్కిమపి తన్నీలం మహో ధావతి

 – మధుసూదన సరస్వతుల వారు, 17 వ శతాబ్దం.

(యోగులైన వారు -అభ్యాసం చేత మనసును నిగ్రహించి,నిర్గుణమూ నిష్క్రియమూ అయిన జ్యోతిగా ఆ పర సత్యాన్ని దర్శించితే దర్శించనీయండి –

మాకైతే మాత్రం-

యమున ఒడ్డున తారట్లాడే ఆ ఒకానొక నీలకాంతి, చూపులను గారడి చేస్తూ – ఎప్పటికీ నిలచిపోవాలి.)

****

జగన్నాథ పండిత రాయలకు కూతురు ఉన్న ఆధారమేమీ లేదు…అది కల్పన.‌ తక్కిన విషయాలకన్నిటికీ ఆధారం ఉంది. అంతా పదిహేడవ శతాబ్దపు ఉత్తరార్థం లోనే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here