ఆనాటి చిన్నబ్బాయి నాన్న

0
9

[dropcap]నా[/dropcap]న్న గాయాలను కనుపించ నీయడు.
వేలి గోరు గీసుకున్న బుగ్గ చారకు
రెప్పచాటు అరల
నీటి గుళికను ఇట్టే మింగేసి
గుండె దిటవు మందును
పూసు కుంటాడు.

నాన్నమ్మ పంపిన
ఊరగాయ పెచ్చు గట్టిన ఉప్పుకు
జాడీ మూత రజను కడుతుంటే
పచ్చి గానుగ నూనె జిడ్దు చేతుల
పట్టు జారిపోయి
కొండ నాలుక గట్టు చివరకు
దొరలి పోతూ
పేగు బంధం ఆసరాతో
లేచి నిలబడు తుంటాడు.

దూరవాణిలో అత్తయ్య
నేలకు పాకిన గుమ్మడి తీగెకు
కాపు కాస్తుంటే
దగ్గరగా వచ్చి కూచో లేని
కొత్త జ్వరానికి
కనిపెట్టిన టీకా వేయించు కునేందుకు
తోటి మనుషుల జాబితాకు చేరు కుంటాడు.

బజారు కొనుగోళ్ళ
ఖరీదులకు వెళ్తూ
స్పీడ్ బ్రేకర్ కుదుపుకు
వేగం తగ్గించి ముందు అద్దంలోంచి
కనబడుతున్న వెనుక ఖాళీ సీటును చూస్తూ,
బ్రతుకు గతుకుల పాదాలకు
ఆకుచెప్పుల దారి నడచిన
తాతయ్యను తలచుకుని
మెడ దగ్గర కాజా బొత్తాన్ని
వదులు చేసుకుంటాడు.

తూరుపు పెదవుల ఎర్రదనానికి
తొలి కానుపు నొక్కటి పరిమితం చేసి
గారాబు పట్టికి
మట్టి అంటని మెత్తని తివాచీలను పరచి
పశ్చిమానికి పహరా కాస్తాడు.
ముప్పాతిక భాగం నూలు పోగుల స్మృతులను
చరఖా రాట్నం స్మృతులకు చుట్టిన నాన్న
చెకుముకి రాళ్ళ ఒరిపిడిలో తేజ రిల్లుతుంటాడు

మినుకు నక్షత్రాల ఒంటరి గగనంలో
సాంకేతిక భాషల దస్తూరీలతో
భూమిచుట్టల పత్రాలను విప్పుకుంటూ,
ఓడి పోతూనే గెలిచినట్టుగా
కలివిడి కుటుంబంలో
ఆనాటి చిన్నబ్బాయి నాన్న,
ముడివిప్పలేని బంధాలకు
కుశల వార్తలను కోరుకుంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here