ఆనందమా!

    1
    14

    [సుగుణ అల్లాణి గారు రచించిన ‘ఆనందమా!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

    [dropcap]ఆ[/dropcap]నందమా!
    నీవెక్కడ!!
    మనుసు గదిలో
    కొక్కానికి వేలాడినట్టు
    ఎదురుగానే ఉంటావు
    నా దరి చేర రావు

    ఒకప్పుడు
    ఎప్పుడూ
    నాతోనే ఉండేదానివి
    ఇప్పుడేంటో అలా దూరంగా
    నను చూస్తూ నిలబడినావు!
    అప్పుడు..
    ఓ బొమ్మను చూసినా
    అమ్మ నవ్వును చూసినా
    నచ్చిన గౌను వేసుకొన్నా
    ఇంటికెవరైనా వచ్చినా
    పండగలైనా మంచి పాట విన్నా
    బడిలో మాస్టారు మెచ్చుకొన్నా
    ఇంట్లోనాన్న అక్కున చేర్చుకొన్నా
    ఆటల్లో ఆడి గెలిచినా
    ముఖం నిండా ఆవరించి వంటి నిండా ప్రవహించేదానివే!!
    మనుసులో పరుగులు తీసేదానివే!!
    కాలు నిలవకుండా కదం తొక్కేదానివే
    కన్నెమనుసు కన్న పగటి కలకే
    కళ్ల ముందు స్వర్గం చూపేదానివే!!
    ప్రేమ నిండిన ఒక చూపుకే పరవశించేదానివే!!

    ఇప్పుడేది నీ అస్తిత్వం
    చుట్టూ అందరున్నా
    చుట్టపు చూపుగా వస్తావు
    ఇళ్లువాకిళ్లు ఎన్ని ఉన్నా
    నిర్లిప్తంగా చూస్తూ ఉంటావు
    కీర్తి వాసి ఎంతున్నా
    పట్టనట్టుంటావు కదా!!
    అన్నీ ఉన్నా ఏదో వెలితి
    ఎదురుగానే ఉన్నట్టుంటావు
    దోబూచులాడుతావు
    ఎక్కడ నిన్ను వెతికేది
    ఎలా నిన్ను పొందేది
    డబ్బుపెట్టి నిన్ను కొనగలిగితే
    కోట్లు పోసి కొనడానికి పోటీ పడేవారేమో
    పొరపాటున కూడా అంగట్లోకి రాకు
    రేటు కట్టి వేలం వేస్తారు

    కళ్ల నిండా నిన్ను నింపుకుని
    మనుసారా నిన్ను అనుభవించాలని
    ఆశగా ఉంది..
    ఆ పసితనంలో నన్నాదరించినట్లు
    నను చెయ్యారా చేరదీయవా!!!

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here