కాజాల్లాంటి బాజాలు-96: ఆనందమే కదా!

7
7

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap] ఆదివారాలు వచ్చేయంటే ఒక్కొక్కసారి బానే వుంటుంది కానీ.. ఒక్కొక్కసారి విసుగేస్తుందనుకోండి.

బాగుండేది యెప్పుడంటారా.. మనం వంట మానేసి బైటకి భోజనానికి చెక్కేసినప్పుడు.. మరింక విసుగెప్పుడంటారా.. వివరించి కూడా చెప్పాలేంటీ.. ఇంటికి చుట్టాలొచ్చి, స్పెషల్స్ చేయాల్సి వచ్చినప్పుడు.

కానీ ఈ అదివారాలు ఒక్కొక్కసారి చుట్టాలూ, స్నేహితులూ కొంతమంది ముందు చెప్పీ, కొంతమంది ఫోన్ కూడా చెయ్యకుండానూ వచ్చేస్తారు.

ఆ వచ్చినవాళ్ళు సోఫాలో కూర్చుని, కాస్త టీ ఇస్తే తాగి పోయేవాళ్లతో పరవాలేదు. కానీ కొంతమంది వంటింటి చుట్టాలుంటారు. వాళ్ళు తిన్నగా వంటింట్లోకి వచ్చేస్తారు.

మనం మన వంటింటిని యెప్పుడూ శుభ్రంగా వుంచుకుందుకే ప్రయత్నిస్తాం. కాని అదేం విడ్డూరమో.. సరిగ్గా వంటిల్లు రణరంగంలా వున్నప్పుడే ఆ వంటింటి చుట్టాల విజిట్స్ అవుతుంటాయి.

ఇంక మొదలు చూసుకోండీ.. “ఇదిక్కడ యెందుకు పెట్టావూ, అక్కడైతే వీలు కదా..” అనీ

“నువ్వీ బ్రాండ్ కొంటావా.. ఆ బ్రాండ్ అయితే కొంచెం డబ్బెక్కువైనా బాగుంటుంది..” అనీ మనకి ఒళ్ళు మండిపోయే ఉచిత సలహాలు ఇచ్చేస్తుంటారు. మనకి లోపల ఉడుకిపోతూంటుంది. యేం చేస్తాం.. చుట్టాలాయె..

అలాంటప్పుడు నాకు ఎప్పుడో చదివిన జోక్ ఒకటి గుర్తొస్తుంటుంది.

ఒకింట్లో అత్తాకోడలూ వుంటుంటారు. పొద్దున్న అత్తగారు వంట చేస్తే సాయంత్రం కోడలు వంటన్న మాట. అత్తగారిది యెడంచేతి వాటం. పొద్దున్నే ఆవిడ డబ్బాలన్నీ యెడం వైపుకి సద్దేస్తే, సాయంత్రం కోడలు వాటిని మళ్ళీ కుడి వైపుకి మార్చేస్తుంటుంది. అత్తగారి అలవాటు తెలిసి కోడలూ మార్చడం మానదూ, కోడలి వీలు తెలిసి అత్తగారు వాటిని ఉన్నచోట ఉంచదూ..

ఆ జోక్ గుర్తు చేసుకుని వాళ్ళిచ్చిన సలహాలని బుర్రలోంచి తోసేస్తుంటాను.

అలాగని అందరినీ ఒకే రాటని కట్టలేమండోయ్.. చుట్టాలూ, స్నేహితులలో మంచివాళ్ళూ ఉంటారు.

మాకు వరసకి బాబాయిగారని ఒకాయన వుండేవారు. మంచి భోజనప్రియులు. అల్లప్పుడెప్పుడో ఒక పెద్దాయన చెప్పినట్టు ఏదీ వద్దంటూనే అన్నీ పధ్ధతిగా జరిపించుకునే మనిషి. ఇంటి ఇల్లాలికి ఎలా చెప్పి తనకి కావల్సినవి చేయించుకోవాలో ఆయనకి మహ బాగా తెల్సు. ఒక ఆదివారం ఆ బాబాయిగారు మా ఇల్లు పావనం చేసేరు.

మనిషి మంచాయనే. మేమంటే అభిమానం, ఆప్యాయత ఉన్న మనిషే. కానీ ఆయనకి కావల్సినవి వండి పెట్టడమే నాలాంటిదానికి కొంచెం కష్టం.

ఒకసారి ఆయన వస్తూ వస్తూ ఎక్కడినుంచో పనసకాయ పట్టుకొచ్చేరు. మంచి పదునైన కాయ. కానీ దానిని పొట్టులా కొట్టడానికి మా ఇంట్లో పనసపొట్టు కొట్టే కత్తి లేదే… ఎలా అని బాధపడిపోతున్న నన్ను ఆయన సమాధానపరిచేరు.

“నీ కెందుకమ్మాయ్ బెంగా.. నేను లేనూ..” అంటూ రంగంలోకి దిగేరు. అలవాటున్న మనిషేమో కూరలు తరిగే చాకుతో చుట్టూ పెచ్చు ఇట్టే చెక్కేసేరు. మధ్యలో దూలం తీసేసి దానిని కత్తిపీటతో ముక్కలుగా కొయ్యమని నా ఎదురుగా కూర్చున్నారు. ఇంకేమంటాను.. దగ్గరుండి అన్ని ముక్కలూ ఒకే సైజులో వచ్చేటట్టు కోయించేరు.

ఆ తర్వాతే మొదలైంది అసలు కథ. మిక్సీలో కొన్ని ముక్కలు వేసి, “ఒక్కసారే తిప్పమ్మాయ్.” అన్నారు. నేను ఒక్కసారి తిప్పేను. అవి ఉన్నచోట్నించి కదల్లేదు. కదల్లేదు కదాని స్పీడు పెంచి ఒక్కసారి “జుయ్య్” మనిపించేను.

ఒక్క అరుపు అరిచేరాయన. హడిలిపోయి ఆపేసేను.

“అదంతా పిండి పిండైపోతుందే పిల్లా..” అని హడావిడి పడుతూ మిక్సీ జార్ మూత తీసి తొంగి చూసేరు. నిజవే.. అదంతా ఒక ముద్ద లాగా అయిపోయింది. నా మొహం పాలిపోయింది.

“పోనీలే.. అది తీసేసి ఈ మిగిలిన ముక్కలెయ్యి..” అన్నా రాయన నా ముఖం చూసి.

ఆయన చెప్పినట్టే చేసేను. ఈసారి మిక్సీని ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. ఎంతో జాగ్రత్తగా, పధ్ధతిగా, ఒక్కొక్కసారే మిక్సీ ఆన్ చేస్తూ, ఆపు చేస్తూ మొత్తానికి ఆ ముక్కల్ని చక్కటి పనసపొట్టులా తిప్పేరు. నేను అలా చూస్తూండిపోయేను.

ఆ తర్వాత బాబాయిగారు దగ్గరుండి నాకు పనసపొట్టుకూర ఎలా చెయ్యాలో నేర్పేరు.

“పనసపొట్టుకూర చెయ్యడవంటే పిండివంట చేసినట్టు చెయ్యాలి తెల్సా! పోపు పులిహారపోపులాగ ఘనంగా ఉండాలి. పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చి వేస్తే కారం బాగా పట్టుకుంటుంది. ఆవ నూరేటప్పుడు అందులో ఓ పచ్చిమిరపముక్క వేసి నూరితే అది మాంచి ఘాటుగా ఉంటుంది. కూర వేడి మీదున్నప్పుడే ఆవముద్ద కలిపైకూడ దమ్మాయ్..పొయిమీంచి దించిన ఐదు నిమిషాలకి ఆవ కలపాలి. ఇంతేనే అమ్మాయ్..ఏదైనా శ్రధ్ధగా, దృష్టి పెట్టి చెయ్యాలంతే..” అంటూ ఆయన ఆ రోజు చెప్పిన పాఠాన్ని ఇప్పటికి కూడా మర్చిపోలేను.

ఆయన మా పిల్లల చేతుల్లో పటికబెల్లం పెడతారు. మా ఆయనకి మంచీచెడ్డా చెప్తారు. అన్నింటికన్నా నాకు నచ్చేది ఆయన వెడుతూ వెడుతూ.. “గాజులేయించుకో అమ్మాయ్..” అంటూ నా చేతిలో పది రూపాయిలు పెడతారు. ఆ మాటంటుంటే ఆయన కంఠంలో పలికే ఆప్యాయతకి నాకు కళ్ళు చెమరుస్తాయి. అలా అప్పుడప్పుడు ఆయన ఇచ్చిన పది రూపాయిల కాగితాలను భద్రంగా దాచుకున్నాను ఇప్పటికీ.

అలాంటి బాబాయిలు ఇంటి కొస్తే ఆనందమే కదా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here