ఆనాటి ఫోటో

    12
    5

    [box type=’note’ fontsize=’16’] నవ్వునవ్వుకూ తేడా వుంటుంది. నవ్వే అదృష్టమెందరికుంటుంది? అంటాడోకవి….నవ్వు నవ్వే అయినా నవ్వునవ్వు వెనుక కథవుంటుందని నిరూపించే కథ ఆర్. దమయంతిఆనాటి ఫోటో‘ కథ. [/box]

    [dropcap]రో[/dropcap]జూలానే సాయంత్రం రెడీ అయి, ఇంట్లోంచీ బయటపడటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ, ఇవాళ ఎలాగైనా ఒకడుగు ఆలస్యమైంది. రోజూ ఈ పాటికి ఆటోనో, షేరింగ్ కాబో ఎక్కేద్దును కదూ? – నాలో నేనే అనుకుంటూ పని తెముల్చుకుంటున్నాను.

    ‘రేపు నువ్వు త్వరగా రావాలి. స్టేజ్ డెకరేషన్‌కి నాకు నీ హెల్ప్ కావాలి నా మ్యూజికల్ ప్రోగ్రాంకి’ – అని మరి మరీ చెప్పింది నా ఫ్రెండ్ శైల. ‘ప్రత్యేకంగా చెప్పాలా ఏమిటీ, అసలు నువ్వు రాకముందే నేను థియేటర్ కొచ్చి కుర్చుంటా. సరా?’ అని అభయమిచ్చింది తను. కానీ, ఎంత త్వరగా తెమలాలీ అని తలిస్తే, అంత ఎక్కువ ఆలస్యమౌతుంటుంది. ఒక్కోసారి అంతే. మన ప్లానింగ్‌లేవీ నడవవు. అప్పుడే ఫోనొచ్చింది లత నించి. ‘రేపెలాగైనా సరే, లంచ్‌కి రమ్మం’టూ. మాట్లాడుతూనే వుందా, అంతలోనే కాలింగ్ బెల్ మోగింది. గాస్ సిలెండర్ డెలివరీ బాయ్! రిసీట్ మీద సంతకం చేసి డబ్బులిమ్మంటూ… రెండు వేల నోట్ ఇస్తే, వొద్దని పేచీ. చేంజ్ కోసం పక్కింటి వదిన గార్ని అడిగి, ఇచ్చి, ఉరుకులు పరుగులుగా తయారై, ఆదరా బాదరాగా తలుపుకి తాళం వేసానా, అంతలో పెద్ద సందేహమొచ్చింది.

    ‘టీ పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసానా? లేదా?’ అని.

    అంతే, మళ్లా తాళం తీసి, లోపలకొచ్చి చూస్తే, స్టవ్ – సిమ్‌లో నీలంగా వెలుగుతోంది. గిన్నెలో పాలు మరుగుతూ వున్నాయి. పాలను రెండు సార్లు కాయటం అలవాటు. ‘ఇంకా నయం. ఇలానే మరిచిపోయి వెళ్లాను కాదూ?’ అని ప్రమాదం తప్పిందనుకుంటూ స్టవ్ కట్టేసి, ఎలెక్టికల్ స్విచెస్ అన్నీ ఆఫ్‌లో వున్నాయో లేదో చెక్ చేసుకుని, గడప దాటి తలుపు మూస్తుంటే సెల్ మోగింది. హాండ్ బాగ్‌లో కాదు. హాల్లో సోఫాలో. ‘అరే. ఇవాళ కూడా సెల్ మర్చిపోయానా!’ అనుకుంటూ గభాల్న చేతిలోకి తీసుకుని స్క్రీన్ మీద పేరు చూసా. శైల ఫోన్ చేస్తోంది. వెంటనే రెస్పాండ్ అవుతూ.. ‘బయల్దేరానే, వచ్చేస్తున్నా.. అలానేలే.. బై..’ అంటూ ఒక్క మాటలో జవాబిచ్చి, ఆఫ్ బటన్ నొక్కి, బాగ్‌లో పడేసుకున్నా. ఇక తలుపు మూసేయడానికి రెడీ అయ్యాను. ఈ మతిమరుపు పాడుకానూ, ఇక ఏం మరిచిపోయినా సరే, లోపలకెళ్ళడానికి వీల్లేదని నాకు నేను స్ట్రిక్ట్‌గా వార్నింగిచ్చుకుని, ధైర్యం చేసి తాళం వేసేసా.

    వీధి గేటు మూస్తుంటే ఆ చప్పుడికి మా ఎదురింట్లో వుండే నాగమ్మ పిల్లనెత్తుకుని వచ్చింది. ‘వెళ్తున్నారా ఆంటీ..’ అంటూ. ‘వెళ్తున్నానురా! చీకటయ్యాక, పోర్టికోలో లైట్ వేయి’ అంటూ తాళం చెవి, ఆమె చేతికిచ్చాను. ‘తొమ్మిందింటికల్లా వచ్చేస్తాలే…’ అన్నాను. రోజూ చెప్పే మాటే కాబట్టి దానికంత ప్రాముఖ్యమివ్వలేదు. ‘ఫర్వాలేదు ఆంటీ మేమిక్కడే వుంటాం వాయిట్లో! ఎవురూ రార్లేండి. మీరు నెమ్మళంగా రండి’ అని నా వైపు చూసి నవ్వుతూ..’ఆంటీ మేడ మీది జాజిపూలు కోసుకోనా?’ అని అడిగింది.

    నేను లేనప్పుడు కోయద్దంటుంటాను. ఎందుకంటే, ఒకసారి కనక అవకాశమిస్తే , అదే అలవాటౌతుందని. ‘అది సరే, రేపేం వారం? శుక్రవారం కాదుగా?’ అని ఒక సారి గుర్తు చేసుకుని, కాదు. ‘పోనీ, కోసుకోనీయిలే…’ అనీ మనసు ఆర్డర్ జారీ చేసాక చెప్పాను. ‘జాగ్రత్త మరి. పసిమొగ్గలూ అవీ తెంపకు. మొక్కని దులిపేయకూడదు. నాలుగు పూలైనా వదిలేయాలి. సరేనా? మర్చిపోయా, పిల్లల్ని పైకి తీసికెళ్ళకు, ఆకతాయిగా పరుగులు పెట్టి, కింద పడితే మళ్ళా కష్టం…’ తొందర తొందరగా జాగ్రత్తలన్నీ పాటలా పాడేశా.

    నేను రెండు అడుగులు ముందుకేయగానే. “ఆంటీ ఇంకొకటడగాలి. ప్లీజ్” – అంటూ వెనకనే వొచ్చి ఆగింది. అర్ధమైంది. అప్పుడప్పుడు అప్పు అడుగుతుంది. పాలకనో, పెరుగుకనో, చుట్టాలొచ్చారు కూర కొనాలనో, పిల్లాడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలి మందుకనో డబ్బులు అడుగుతుంది.

    ఇల్లు చూస్తుంటుందనీ నేనామెని జాగ్రత్తగా చూసుకుంటుంటాను. నేను లేనప్పుడు – పోస్ట్‌మాన్, కొరియర్, కరెంట్ రీడింగ్ – వచ్చే చుట్టాలకి కేరాఫ్ అడ్రెస్ ఆమే – నాగమ్మే. అందుకే చేబదులు ఇస్తుంటాను. మరీ పెద్ద నోటైతే తప్ప, చిన్నా చితకా చిల్లర మొత్తం అయితే వెనక్కి తీసుకోను. ‘వుంచుకోలే’ అంటుంటాను. అదీ ఆమె సంతోషం.

    ఇప్పుడామె వాలకం కూడా అలానే వుంటంతో ‘ఏమిటీ డబ్బులు కావాలా?” అని అడుగుతూనే, హాండ్ బాగ్ ఓపెన్ చేయబోయాను.

    ‘అక్కర్లేదు ఆంటీ, డబ్బులు కాదు, నీళ్ళు కావాలి. పది బిందెలు చాలు..’ అంటూ గారాలు పోయింది.

    నేను వెళ్ళే హడావుడిలో వుంటం చూసి మరీ అడుగుతుంది. ఏదడిగినా కాదననని. ‘నో’ అనలేనని ఆమెకి బాగా తెలుసు.

    అందుకే అంటారు పెద్దలు. ఎదుటి వారితో మనకు అవసరమున్నప్పుడట, అడగంగానే అవుననిపించుకునే అదను చూసి అడగితే, వెంటనే పని అయిపోతుందట.

    నాగమ్మకెలాగైనా ఆ ఒడుపు తెలుసు. ఎంత లయగా అడుగుతుందో, పిల్లని చంకలో వేసుకుని వొయ్యారంగా నిలబడి కళ కళ లాడే ముఖమేసుకుని, కిల కిలా నవ్వుతూ.. నాకూ నవ్వొచ్చింది. ఆమె తెలివికి.

    ‘సర్లె. తీసుకో. బయట నల్లా తిప్పి తీసుకో. పెరట్లో నల్లా తిప్పకు. తాళ్లతో కట్టి బంధించా. రేపు మేస్త్రీకి చెప్పు. దాని తల మార్చాలనీ’ అంటూ నవ్వి, మరో సారి ఇల్లు జాగ్రత్త అని చెప్పి గబగబా అడుగులేస్తున్నా. నాగమ్మ ఉత్సాహంగా నాకు బై చెబుతోంది. చంటిదానితో ‘టా టా చెప్పు ఆంటీకి..’ అంటోంది. బదులుగా చేయూపుతూ, అడుగులేస్తున్నాను.

    మనిషికి మనిషికీ మధ్య అవసరాలుంటం ఎంతైనా అవసరం. అవి బంధాల్ని బాగా అతికిస్తాయి. అవును. అవి ఆర్ధికమైనవైతే ఫెవికోల్‌లా అతుక్కుపోతాయి. గట్టిగా పని చేస్తాయి. నా మాటలకి నాలో నేనే నవ్వుకున్నా.

    నడుస్తున్నా… నడుస్తున్నా…

    వసంత ఋతువు. చైత్రమాసపు నాటి సాయంత్రం. చల్ల గాలులు గుంపులుగుంపులుగా కెరటాల్లా వీస్తున్నాయి. దూరం నించి కోయిల రెట్టిస్తూ కూస్తోంది. తీయగా.

    మా కాలనీలో పచ్చదనమెక్కువ. సైనికులుండే ప్రదేశం కావటాన, రోడ్లూ నున్నగా వుంటాయి. వీధులన్నీ శుభ్రంగా క్లీన్‌గా వుంటాయి. ప్రతి ఇంటి ముందూ చిన్నపాటి తోట వుంటుంది. ఆరుబయట పెద్ద పెద్ద వృక్షాలు, గన్నేరూ, నందివర్ధనం, గిన్నె మందారపు పూలచెట్లూ, క్రమశిక్షణతో నిలబడిన సైనికుల్లా ఒక వరసలో తీరుగా కనిపిస్తుంటాయి.

    మలుపులో గుడి. అక్కడికి రాగానే ఆటోమాటిక్‌గా పాదాలాగిపోతాయి. వెంటనే చెప్పులొదిలేసి, మూసిన గుడితలుపులకీ, ముఖమెత్తి, ధ్వజ స్థంభానికీ దణ్నాలు పెట్టేసి, చెప్పులేసుకుని మళ్ళా నడక మొదలుపెట్టాను. మెయిన్ రోడ్డ్ వైపుకి.

    ఇంటి నించీ ఆరేడు నిమిషాలు నడిస్తేనే కానీ, మెయిన్ రోడ్డు రాదు.

    ఇదిగో సన్న గల్లీ వచ్చేసింది. ఇక్కణ్ణించి ఒకటే దారి మెయిన్ రోడ్డుకి. టర్న్ తీసుకుంటూ చూసాను.. ఇద్దరబ్బాయిలు క్రికెట్ ఆడుతున్నారు.

    ఒకతను అందంగా యంగ్ హీరోలా వున్నాడు. ఇంజినీరింగో, మెడిసనో చదువుతున్నట్టు అనిపించింది. ఇతనితో ఆడుతున్న వాడు మాత్రం చాలా చిన్నవాడు. నిక్కరేసుకుని, కళ్ళజోడు పెట్టుకుని ‘అన్నా… సిక్స్’ అంటూ పరుగెత్తుకుంటూ వచ్చి బాల్ తీసుకెళ్తున్నాడు.

    ఈ క్రికెట్ వీరులంటే నాకు కొంచెం భయం. వీధుల్లో ఆడే క్రికెట్లన్నా, వాళ్ళ బౌలింగ్ అన్నా నాకు జాస్తి జడుపన్నమాట వాస్తవం. ఎందుకంటే విస్సురుగా బాలొచ్చి నెత్తిమీదో, కళ్ళ జోడు మీద పడుతున్నట్టు భయపడిపోతుంటా. అలా ఎందుకూ భయపడిపోవడమంటే… మా ఇంటి కిటికీ అద్దాలు అలా ఎన్నిసార్లు బద్దలయ్యాయో- ఈ కుర్ర క్రికెటర్ల ఆటలకి. అది కాదు, అక్కడ కిటికీ బదులు మనిషుంటేనో గతేమిటీ? అనే ఊహకే గుండె గుభేల్మంటుంది. నేనిలా అనుకుంటుండంగానే ఆ హీరో కొట్టిన బాలొక్కసారిగా గాల్లోకి అంతెత్తున లేచి, చెట్టు కొమ్మలకి ఒరుసుకుని గింగుర్లు తిరుగుతూ మంటూ కిందకొస్తోంది.

    అంతే, గబుక్కున పక్కకల్లా ఒరిగి, నెత్తి మీద చేయుంచుకుని… ‘ఊ…’ అంటూ ముందుకు పరుగులా అడుగులేసా.

    హీరో నావైపు సారీ అన్నట్టు చూస్తూ, ‘పెద్దమనుషులొస్తుంటే చూసుకోవద్దా? అలా స్పీడ్‌గా బాల్ వేసేయడమే??’ అంటూ ఆ చిన్నవాణ్ణి మందలిస్తున్నాడు. ‘ఇట్సోకే ఓకె… ఫర్వాలేదు..’ సణుగుతూ, చేత్తో సైగ చేస్తూ నడుస్తున్నా.

    ఆ యువకుడు నాకు గౌరవమివ్వడం ఆ క్షణంలో నాకెంతైనా గర్వమేసింది. ఎలా అయినా కానీండీ, మనుషుల్లో మంచి మార్పుని చూస్తున్నా నేనీ మధ్య. చెప్పొద్దూ? నేనెక్కడికెళ్ళినా అందరూ చాలా గౌరవించేస్తున్నారు.

    మొన్న ట్రైన్‌లో కూడా, నేనడగక ముందే లోయర్ బెర్త్ ఇచ్చాడు ఒక అబ్బాయి. అంతెందుకూ, మెట్రోల్లో కూడా ముందుసీట్లల్లో కుర్చున్న పిల్లలు లేచి ఆంటీ మీరు కుర్చోండంటూ సీట్ ఖాళీ చేసి ఇస్తున్నారు. ఈ మధ్య ఇలాగే, బ్యాంక్ కెళ్ళినప్పుడు ఆ ఎంప్లాయీ ఎంత మర్యాద చేసాడనీ? ‘ముందు మేడం పని చూడాలం’టూ ఎఫ్‌డీ లన్నీ చెక్ చేసి, టాక్స్ పడకుండా సరిచేశాడు.

    ఎలా అయినా నా దేశం వేరు. నా వాళ్ళ సంస్కారం వేరు. ఎంత చదువుకున్నా, పెద్ద వారిపట్ల ఆదరణ చూపడం, ఇంకానేమో అణకువగా మాట్లాడటమూ.. చూస్తుంటే ముచ్చటేసిపోతోంది… యువత ఇలా మంచి మార్గంలో నడిస్తే, దేశం ముందుకెళ్తుంది. దేశ ప్రతిష్ఠ ఉన్నత శిఖరాలనందుకుంటుంది.

    అమెరికాకెళ్ళినప్పుడు చూస్తున్నా కదా, అక్కడి వాళ్ళకింత గ్రహింపు లేదు. ఊహు. పరిచయం చేస్తే నమస్కారం అని అయినా అనరు. హలో అంటూ పలకరిస్తారు. ఎన్ని, చెప్పూ, ఇక్కడ పెరిగే పిల్లలకు వచ్చే సంస్కారాలు అక్కడి వారికి అబ్బడం కష్టమే. మరి సాంప్రదాయాన్ని పొందడమూ ఒక సంపద కాదేమిటీ? మనసు ఉప్పొంగింది. ‘జయ జయ ప్రియ భారత జనయిత్రీ…’ మనసు అపుడే పాటందుకుంది. అప్పుడు జరిగింది. కన్రెప్ప పాటులో! నా వెనకనించీ మెరుపు వేగంగా దూసుకొస్తున్న తారాజువ్వ లాటి పిల్ల! కళ్ళు జిగేల్మనేలా వుంది. లేత పూల రెమ్మ – నా ముందునించీ అతి వేగంగా. నడుస్తోంది. ఠ కా ఠక్.. ఠకా ఠక్ ఠక్ హై హీల్స్ అడుగులు రిథమిక్‌గా వినొస్తూ… వెస్టర్న్ సాంగ్‌కి బీట్‌ని తలపిస్తూ… తదనుగుణంగా వొంపైన సన్నటి నడుము ఊగుతూ వుంది.

    ‘ఎవరీ మోడల్? ఎవరమ్మాయీ…’ అనుకుంటూ ముక్కు మీదకి జారిన కళ్ళజోడులోంచి ఆమె అందమైన ఫిగర్ని – చూస్తుంటే…

    ఆమె తన భుజం మీద అలా సుతారంగా… అర చందమామ మోమునుంచి, నన్ను క్రీగంట చూసి కిసుక్కున నవ్వింది. మువ్వలా. నవ్వు ఎందుకు నవ్వింది?

    ఆ నవ్వు నన్ను గుచ్చుకుందేమిటీ? పై పెచ్చు, ఆ నవ్వేదో మాట్లాడుతోందికూడానేమిటీ? ‘ఆంటీ! ఆ హీరో పెద్ద మనిషి..’ అని అన్నది మిమ్మల్ననుకున్నారా?’ అన్నట్టు వినిపించింది.

    ‘ఆ!? అయితే, అన్నది నన్ను కాదా?’ అనుకుంటూ గబుక్కున వెనక్కి తిరిగి చూసాను. అల్లరి భడవ. ముక్కు మీద వేళ్ళతో తాటించుకుంటూ స్టయిల్‌గా, పోజిస్తూ.. కొంటెగా చూస్తున్నాడు ఆ జున్నుముక్కని.

    నేను వెనక్కి తిరిగి అతనివైపు చూస్తాననుకోని ఘటన కావడంతో ఖంగు తిని, అంతలోనే అమాయకుడిలా ముఖం మార్చేసుకుని పిల్లాడి వైపు తిరిగాడు. ఏమన్నడో ఏమో ఆ ఆ కుర్రోడు పకపకా నవ్వుతున్నాడు.

    హూ.అదన్న మాట. ‘పెద్దమనుషులొస్తుంటే చూసుకోవద్దూ..? హమ్మా?’ అతని మాటలు చెవిలో మళ్ళా మోగాయి. వెంటనే ఆ పిల్ల నావ్వు గుర్తొచ్చింది.

    యవ్వనంలో ప్రతి కన్నెపిల్ల గర్వానికి సంతకం లాటి నవ్వు అది.

    ఆ సొగసరి నవ్విన నవ్వు – తనకు మాత్రం తెలీనిదైతే కదా?

    ఆ నవ్వు తను నవ్విన నవ్వే! కాకుంటే, ఒకప్పడు. అందుకే త్వరగా అర్థమైంది.

    ఎంత మురిపమయిందో!- ఆనాటి నా ఫోటో గుర్తొచ్చి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here