ఆంతర్యాలు – అనుబంధాలు

0
12

[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘ఆంతర్యాలు – అనుబంధాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“కౌ[/dropcap]సల్య సుప్రజా రామ” అంటూ సుప్రభాతం చదువుతూ గంట వాయిస్తూ ఇల్లు అంతా ధూపం వేశాడు రామారావు. ఇంట్లో అన్ని పరిశుభ్రంగా ఉండాలి. పిల్లల్ని పద్ధతిగా పెంచాడు. కొడుకు శ్రీనివాస కిరణ్ మంచి వ్యక్తి. ఉద్యోగం చేస్తున్నాడు.. పెళ్లికి ఎన్నో సంబంధాలు దగ్గరి వాళ్ళవి వచ్చాయి. శ్రీనివాస్‌కి చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇష్టం. కానీ తండ్రి “కుటుంబ పరిస్థితిని బట్టి చూడు. ఎంత చదివినా సంపాదన ముఖ్యం. ఇంక చదువు అవసరం లేదు, ఉద్యోగానికి వెడితే మంచిది” అన్నాడు. తనకి తెలిసిన ఒక పత్రిక ఆఫీసులో శ్రీనివాస్‍ని జాయిన్ చేసాడు.

సాహిత్యంపై చక్కని అవగాహన ఉన్న శ్రీనివాస్‌కి స్క్రిప్ట్ రైటింగ్ బాగా అలవాటు. ఆశువుగా పద్యాలు చెప్పేవాడు. సృజనతో వ్యాసాలు రాసేవాడు. పెద్ద వాళ్ల ఇంటర్వ్యూలు అద్భుతంగా రాసేవాడు. ఎదగాలి అనే తపన వల్ల   అంచెలు అంచెలుగా విద్యతో, వివేకంతో బాగా ఎదిగాడు. ఆఫీసులో మంచి తెలివితటలు ప్రదర్శించి అన్ని పనులు చేసేవాడు. నేను ఉన్నాను అంటూ తన వర్క్ మాత్రమే కాక అందరి వర్క్ కూడా బాగా చెపుతూ కొన్ని చేస్తూ ఎదుటివారికి తెలియక పోతే చెపుతూ ఉండేవాడు. ఒక విధంగా ‘ఆఫీస్ బంధు’ అనేవారు. అంతేకాదు ‘దేశోద్ధారక మహాశయుని’లా అందరికీ ఆదుకుంటాడనిపించుకున్నాడు.

శ్రీనివాస్ అక్క పెళ్లి అయింది. చెల్లిది బాగా గారం. తల్లి వెనకాల ఉండీ అన్ని పనులు చేసేవాడు. కొడుకు అంటే తల్లికి అమిత ప్రేమ. కొడుకు కోసం ఆలోచించేది. సిగ్మండ్డ్ ఫ్రాయిడ్ మానసిక  విజ్ఞాన శాస్త్రం ప్రకారం తల్లికి కొడుకు అంటే ప్రేమ, తండ్రికి కూతురు అంటే ప్రేమ. ఇది విశ్వ సత్యమే.

రామారావుకి ఆస్తులు ఉన్నాయి. ఫైనాన్స్ చేస్తాడు. అయినా అన్ని లెక్కకు మించిన పని ఏమి చెయ్యడం ఇష్టం ఉండదు. కొడుకు, తల్లి కలిసి దుబారా ఖర్చులు పెంచుకుని అలవాట్లు పెంచుకుంటారనే భయం ఉండేది. పువ్వుల కొనడం దగ్గర నుంచి అన్నీ ఆయన ఇష్టమే.

పెద్ద పిల్ల పెళ్లికి ఖర్చు ఎక్కువ చేశారు అంటారు. ఈ జాతకం కుదరదు అని తప్పిస్తుంటే, తెలివిగా కూతురు పెళ్లి కోసం తల్లి తాయారుకి – వేలు విడిచిన అన్న కొడుకు ఇంజనీర్ ఉంటే ఫోన్ చేసి, జాతకం పంపమని చెప్పి, కట్నం వద్దు అని చెప్పమని ముందే చెప్పింది. పిల్ల బాగుంటుంది కదా, అందుకని వాళ్ళు అలాగే చెప్పారు. దానికి రామారావు అంగీకరించి పెళ్లి చేశాడు. ఎంత చవకగా సంబంధం కుదిరింది అనుకున్నాడు. కానీ తెర వెనుక తల్లి కొడుకు కొంత డబ్బు లాంఛనాలు అని చెప్పి ఇచ్చారు. పెద్ద కూతురు భవ్యశ్రీ పెళ్లి అలా జరిగింది. ఆమెకి రెండు పురుళ్లు పోశారు.

రెండో పిల్ల కాంతిశ్రీకి సంబంధాలు వస్తే, అబ్బే పెద్ద పిల్ల భాద్యతలు ఉన్నాయి, ఈలోగా పీజీ చేస్తుంది అని ఒకసారి, తరువాత జాతకం బాగాలేదు అని మరోసారి, ఆపేశారు. కొడుకుకి కూడా సంబంధాలు వస్తే, రామారావు ఆడపిల్ల పెళ్లి అంటాడు, కట్నం కుదరడం లేదు.

శ్రీనివాస్ ఈలోగా వేరే జాబ్‍కి ట్రయల్ వేసి వెళ్ళాలి అనే భావనలో ఉన్నాడు. సూర్యోదయం పూట జాగింగ్ చేస్తూ అందరిని ఆత్మీయంగా పలుకరించి మాట్లాడేవాడు. తండ్రి వద్దన్నా, చదువు మానలేదు. తండ్రికి తెలియకుండా ప్రైవేట్‌గా పరీక్షకు వెళ్లి పాస్ అయ్యేవాడు. కానీ తండ్రికి చెప్పలేదు. తండ్రిది తనది తార కుదరలేదు ఏమో.

తండ్రి ప్రతి పనికి వంక పెట్టేవాడు. అలా వంకలు మధ్య శ్రీనివాస్ చదువు కొనసాగింది. చదువుసంస్కారం పెంచుకుంటూ, పీజీ పూర్తి చేశాడు. చదువు, వర్క్ కూడా బాగుండటంతో తెలివి ఉపయోగించి పత్రికా రంగం నుంచి మారుదామని భావించాడు. యూనివర్సిటీలో జర్నలిజంలో లెక్చరర్ పోస్ట్‌కి అవకాశం వచ్చింది. జర్నలిజం అంటే ఇష్టం కనుక ఆ ఉద్యోగంలో వెంటనే వెళ్ళి చేరాడు శ్రీనివాస్.

ముందు తండ్రికి తెలియకుండా ఊరు వెడుతున్నానని చెప్పి వెళ్లి, అక్కడ చేరాక జీతం ఎక్కువ, అందుకే చేరాను అని చెప్పాడు.

“సరేలే నీకు ఇప్పటికీ మార్పు వచ్చింది. వేరే చోట ఉంటే సంబంధాలు వస్తాయి. పెద్దవాళ్ళతో ఉంటే ఎవరు రావడం లేదు. ఒక్కడే కొడుకు, అత్త మామా దగ్గర ఉండవలసి వస్తుంది. పెళ్లి కాని ఆడపడుచు ఉన్నది, పెళ్లి అవుతుందో అవదో కూడా తెలియదు అనుకుంటున్నారు అంతా” అని అన్నాడు రామారావు. “నీ సంపాదన నాకు వద్దు, నాది నాకు చాలు. మా ఇద్దరి అనంతరం ఉన్నదంతా మీకే” అని చెప్పాడు.

ఈ రోజుల్లో వృద్ధుల్ని వదిలేస్తున్నారు. పెద్దల డబ్బుపై పిల్లలకు ఆశ లేదు. పిల్లలేమో పెద్దల్ని పెట్టుకోవద్దు అనుకుంటున్నారు. ఎవరి జీవితాలు వారివి. ఇంకా కొందరిలో మాత్రం పిల్లల మధ్య అంతరాలు ఉన్నా అనుబంధాలు, ఆంతర్యాల పద్ధతి మారలేదు. పిల్లల్ని అదుపులో ఉంచుకుని, ఆస్తులు ఎక్కడ ఖర్చు పెడతారో అని జాగ్రత్తగా ఉంటారు.  ప్రయోజకుడు అయితే సంతోషించి ఆస్తి పంచుతారు.

శ్రీనివాస్ ఇంట్లో ఒక్క కొడుకు. అన్ని వాడికే. కట్నం బాగా రావాలి అనే ఆశ తండ్రికి ఉంది. ఇంట్లో మిగతా ఎవరికీ లేదు .

తండ్రికి తెలిస్తే ఒప్పుకోడు, అందుకే కామ్‌గా ఉండి ఇంటర్వ్యూ కి వెళ్ళాడు. జీవితంలో మార్పు కావాలి. అలా ఆలోచించి విశాఖపట్నం వెళ్ళి పోయి జాబ్‌లో చేరాడు శ్రీనివాస్.

చెల్లెలు కాంతిశ్రీ, “నేను వచ్చేస్తాను, నీకు వండి పెడతాను. నాకు జాబ్ చూడరా” అన్నది.

“వద్దు ఇద్దరం వెళ్ళడానికి ఊరుకోరు. ముందు నన్ను స్థిరపడని. మంచి సంబంధం చూస్తాను. ఎప్పటికైనా మాకు నీ పెళ్లి బాధ్యత ఉన్నది కదా. అందుకని నువ్వు అక్కడే ఉండు” అన్నాడు. చెల్లెలికి కోపం వచ్చింది అయినా తప్పదు.

శ్రీనివాస్ ఇంత వరకు తండ్రి కనుసన్నల్లో ఉన్నాడు. కొంత కాలం స్వేచ్ఛగా ఉండాలి అనే భావనతో వెళ్ళాడు. మంచి ఉద్యోగం, ఇష్టం ఉన్నది.

ఈ తరం కుర్రాళ్ళు విద్యాధికులు, విదేశాలు వెళ్లిపోతున్నారు. ఆ కారణం చేత రామారావు కొడుకుని చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకున్నాడు. అయితే కొడుకు జీవితంలో ఎదగాలి, వాడికి గొప్ప సంబంధం చెయ్యాలి, కొడుకు

మంచితనంతో తంతే వెళ్లి ఐస్ క్రీమ్ తొట్టెలో పడాలి, ఇది రామారావు ఆశ. భార్య అలివేలు మంగ తాయారుకి ఇది కొంచెం బాధ. ఒక్క కొడుకు ఇలా తిప్పలు పడుతున్నాడు అని అనుకుంటుంది.

భర్త అస్తమానం – “అసమర్థులు కారణాలు వెతుకుతూ ఉంటారు. అహంకారం అధికారం కాదు, ఆచరణ ముఖ్యం” అంటూ హిత బోధ చేస్తూ ఉంటాడు. “ఆడపిల్ల ఎప్పటికీ శాంతి పావురాల మాదిరి ఉండాలి” అంటాడు. మరి వాళ్ళకి ఎలాంటి కోడలు వస్తుందో చూద్దాం.

***

నేటి తరంలో ఇద్దరు ఆడపిల్లలు అయితే ఒక పిల్ల ఇంటి బాధ్యతలు పుచ్చుకుని అమ్మానాన్నలను చూడాలనే భావం వ్యక్తపరుస్తారు.

ఎంబీఏ చదువు చదివినా బ్రిటిష్ ఇన్‌స్టిట్యూట్ నుంచి పీజీ డిప్లొమా చేసి జాబ్ వద్దు పదిమందికి ఉపాధి ఇవ్వాలనే ఆలోచనతో  నేడు మార్కెట్లో అద్భుత గృహ శోభను అంతా ఇష్ట పడుతున్న నేపథ్యంలో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన విద్యావంతురాలు స్వర్ణముఖి. ఆంతర్యాలు, అనుబంధాలు, ఆత్మీయతలు కలబోసిన కుటుంబం.

***

స్వర్ణముఖి తండ్రి రాఘవరావు ఆలోచనలో ఉన్నాడు. ‘ప్రస్తుత కాలంలో పెళ్ళిళ్ళు విచిత్రంగా ఉంటున్నాయి. పెద్ద ఇంటి పిల్లలు ఎక్కువ మంది ఇమడలేకపోతున్నారు. కారణం వాతావరణం, ఇంటి పద్ధతులు. ఈమధ్య పెద్ద వయస్సు పెళ్ళిళ్ళు పెరిగిపోయాయి. జీవితంలో తోడు అవసరము. అందుకే పెళ్లి అని చెప్పాలి. జీవితంలో ఎన్నో అటు పొట్లు ఉంటాయి ఒకళ్ళతో గొడవ, మరొకరితో మంచితనం ఉంటాయి. అందరు అందరికీ నచ్చరు. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలలో; సీతా మహాసాధ్వి  పుట్టిన దేశంలో స్ర్తీలంతా పతివ్రతలే. అవగాహన ఉండాలి అది ముఖ్యం.

ఎక్కడో  పుట్టి పెరిగిన వాళ్ళు అత్త ఇంట ఇమడటం కొంచెం కష్టమే. కానీ ఎంతో సర్దుకుపోతూ ఆడవాళ్ళు బ్రతుకు వెళ్ళదీస్తున్నారు. అలా ఉండకపోతే జీవితం లేదు. విదేశాల్లో మన పద్ధతి వచ్చింది, వాళ్ళు ఇష్టత చూపుతున్నారు. కారణం మన దేశ అబ్బాయిల్ని చేసుకుని అమ్మాయిల్ని చేసుకుని మన సాంప్రదాయానికి విలువ ఇచ్చారు. అది ఎంతో గొప్ప విషయం.

ఇంత వయసొచ్చింది, పెళ్లి చేసుకున్న భార్యను సరిగా చూడాలి అనే భావన ఉండదు. అబ్బే నా వాళ్ళు అమాయకులు ఏమి తెలియకుండ పెరిగారు, నువ్వే అన్ని నేర్పాలి అని ముందు చెపుతారు. ఆ తరువాత ఆ పెళ్లి కాని పిల్ల (ఆడపడుచు) పెంకి పట్టుదలతో కుటుంబంలో అక్కర లేని వాదన చేస్తూ అన్న వదినకి మధ్యలో అనేక సమస్యలు తెచ్చి పెడుతూ ఆనంద పడుతుంది. వదిన గారు వెళ్లిపోతే అన్న ఆస్తికి ఆమె వారసురాలుగా పెత్తనం చెయ్యవచ్చును అనే భావన. మంచి వదిన గారు ఆమెకు పెత్తనం ఇచ్చినా, ఏదో రకంగా మానసిక హింస పెట్టి, ఇంటికి పంపయ్యలని ఉద్దేశం బయట పెడుతుంది. చెల్లెలుకే విలువ, కారణం దానికి పెళ్లి కాలేదు అంటారు. ప్రతి సంబంధం వంకలు పెడితే ఏమి అవుతుంది. ఈ తరంలో అసలు ఏమాత్రం కూడా మనుష్యులు మధ్య మానవత్వపు విలువకు ఏమాత్రం కుదరదు.

ఎంత సేపు నా వాళ్ళు నా అక్కలు నా తమ్ముళ్ళు అంటారు కానీ కట్టుకుని ఆశలు పండించుకోవడానికి వచ్చిన పొరుగింటి అమ్మాయి ఆ ఇంటి దీపం వెలిగించాలి మనం అవకాశం ఇవ్వాలి, ప్రేమ ఆప్యాయత పంచాలి అనే భావం ఎక్కడా లేదు.

ఎంత సేపు నువ్వు గొప్పదానివి మా ఇంటి కోడలు ఎలా అయ్యావు అంటు సాగతీతలు చేస్తూ; ఎప్పుడు ఇంటి నుంచి పంపాలి అన్నది ఆలోచిస్తూ పథకాలు వేస్తూ కాలంతో పరుగు పెడుతూ పెంకితనంగా కాలాన్ని గడుపుతున్నారు. చాలా మంది అత్తవారింట పెళ్లి కాని పిల్లలతో, మరీ పెంకివాళ్ల వల్ల కుటుంబంలో అనేక రకాల గొడవలు వస్తున్నాయి.’ ఆలోచనా ప్రవాహం ఆగింది.

కొన్ని క్షణాల తరువాత రాఘవరావు మళ్ళీ ఆలోచనలో పడ్డారు.

ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు. వంశానికి మగ పిల్లాడు లేడు అనే భావన ఉన్నది. పెద్ద పిల్ల సంగతి ఇది. ఆమె పేరు శ్రీముఖి. విద్యావంతురాలు. వివేకం కలది. ఆడబడుచు పెళ్ళి అయ్యాక వస్తానని చెప్పి, పుట్టింట తండ్రి దగ్గర ఉండి పి.హెచ్.డి చేస్తోంది. డబ్బుకి కొదువ లేదు, తెలివికి విద్యకు అంతా కన్నా కొదవ లేదు.

పెద్ద పిల్లకి కొడుకు పుడితే అల్లుడిని ఒప్పించి ఒక పిల్లాడిని పెంచుకోవాలనే కోరిక ఉండేది రాఘవరావుకి. కానీ ఆయన భార్య పరిస్థితి దీనికి వ్యతిరేకంగా ఉన్నది. బయటి పిల్లలు తెచ్చి పెంచితే తన పిల్లల మధ్య ఆస్తులు గొడవలు వస్తాయనే భావన అనేకంటే భయం వచ్చింది. అందుకే ఆయన ఊరుకున్నారు. కాలం సమాధానం చెప్పాలి.

చిన్న పిల్ల జీవితం బాగుంటుందని ఆశ కలిగింది. ‘ఎంతసేపు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయ్యే వరకు బేజారు, మగ పిల్లలు కూడా అంతే కదా. సరైన భార్య రాకపోతే ఎలా? కుటుంబ వృద్ధికి కారణమయ్యే వ్యక్తిని భార్య అంటారు. కానీ అత్త ఇంట ఆడపిల్లకి ఎన్ని సమస్యలో? అదే అల్లుడు అత్తింట ఉంటే నష్టం ఏమిటి? ఇద్దరు ఆడపిల్లలే. ఇద్దరు సమర్థవంతులు, మంచి చదువులు ఉన్నాయి’ అంటు కూతుళ్ళ గురించి వాపోయారు.

ఆయన యూనివర్సిటీలో ప్రొఫెసర్. పిల్లలని బాగా చదివించారు. రెండో పిల్ల స్వర్ణముఖి స్వంతగా ఇంటీరియర్ వర్క్ ఆఫీస్ పెట్టింది.

***

స్వర్ణముఖి ఆఫీసులో – రకరకాల క్యాటలాగ్స్, సీనరీలు, వాల్ డెకరేషన్ పేపర్స్ అన్ని ఉంటాయి. అలంకరణల వల్లే అందాలు. అందులో రకాలు. సూర్యోదయం మొదలు ఇంటి ముంగిట ముగ్గు మొదలు ఎన్నో అలంకారాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ మధ్య గోడల అందాలకి, సీలింగ్ అందాలకి ప్రాముఖ్యత పెరిగింది. దీనిలో కర్టెన్స్, వాల్ పేపర్స్ ముఖ్యం. ఇవి చాలా తక్కువ ధరకు ఆన్‌లైన్‌లో వస్తున్నాయి. అయితే కొందరికి నమ్మకం ఉండదు. అందుకని మార్కెట్‌కి వెడతారు. మార్కెట్లో రకరకాల రంగుల్లో వాల్ పేపర్స్ వస్తున్నాయి. వాటిని తెచ్చి రూమ్ సైజ్‍ను బట్టి అతుకుతున్నారు. ఇవి చాలా బాగుంటాయి. మన్నిక ఎక్కువ ఉంటాయి ఎవరు అంతటా వారు కూడా చెయ్యవచ్చును.

ఆ షాప్ వారే పనివాళ్ళని పంపి కొలతలు చూపించి మనకు నచ్చిన డిజైన్‍లు సెలెక్ట్ చేసి కొని తెచ్చుకుంటారు. వాటిని వారు అమరుస్తారు. ఈ ప్రాసెస్‍లో ఎన్నో రకాల డిజైన్స్ ఉన్నాయి. ఏక రంగులు, పువ్వులు, గళ్ళు, పిట్టలు ఇలా ఉంటాయి. ముఖ్యంగా ఇంటి అలంకరణపై ఇంట్రెస్ట్ ఉండాలి. చాలామంది ఎక్కడివి అక్కడ పడేసి ఇష్టం వచ్చినట్లు ఉంచుతారు. అలా కాకుండా ఇల్లు యొక్క సైజ్‌ను బట్టి ఏ రకం డిజైన్ ఏ గదిలో బాగుంటుంది అన్నది చూసి మనం అమర్చుకోవాలి.

కొందరు పెద్ద సముద్రం ఒడ్డున ఉన్నట్లు లేదా పూలతోటలో ఉన్నట్లు ప్రకృతి అంతా వారింట్లోనే ఏర్పాటు చేసుకుంటారు. ఆఫీస్‌లు, రేడియో టివి ఛానల్‌లో అయితే చక్కని అందమైన కాశ్మీర్ దృశ్యాలు ఇత్యాదివి అమరుస్తారు.

పెద్ద పెద్ద హల్స్ అయితే నాలుగు గోడలకి ఎన్నో రకాల సీనరీస్ పెడితే దానివల్ల మనకు ఎక్కడో అద్భుత దృశ్యం ఉన్న చోట ఉన్నట్లు భావన ఉంటుంది. ఇది బాగా అందంగా అమర్చాలి.

మనకు చాలా సెట్టింగ్స్ ఆ విధంగా ఏర్పాటు చేసి షూటింగ్ చేస్తారు. నేడు ఈ కర్టెన్స్ డిజైన్ పేపర్స్ ఆవశ్యకత పెరిగింది. కనుక అందరికీ ఇష్టమే కదా. ముఖ్యంగా నేడు అన్ని రబ్బరు పోలిష్ వర్క్‌వి వస్తున్నాయి. అవి హార్పిక్ సోపు బట్టతో తుడుచుకొని శుభ్ర పరచుకోవాలి. దుమ్ము ధూళితో ఉంచనక్కరలేకుండా ఇలా తడీ బట్ట వాడి శుభ్ర పరచవచ్చు.

పిల్లల గదులకి తూనీగ, సీతకొక చిలుక బొమ్మలు రకాలు పేపర్స్ కర్టెన్స్ వాడాలి. పిల్లల అభిరుచిని బట్టి చెయ్యాలి. రంగుల వాడకం కంటే పేపర్స్ వాడకం వల్ల తేలికగా మనం వాటిని శుభ్ర పరచవచ్చును. అంతేకాక ఇంటిలో కొత్తదనంగా ఉంటుంది. ఇప్పుడంతా డిజిటల్ ఎఫెక్ట్స్, ఫాంటసీ ఎఫెక్ట్స్ వచ్చాయి. పెళ్లి ఆల్బమ్ లలో కూడా ఎన్నో సీనరీస్‌తో అద్భుత చిత్రంగా చేస్తున్నారు. అవన్నీ వాల్ పేపర్స్‌తో సుసాధ్యం అని చెప్పాలి. అటువంటివి నేడు ఇంటిలో డ్రాయింగ్ రూమ్‍లో ఉంటున్నాయి. ఇవి రబ్బరు, ప్లాస్టిక్‌వి కూడా ఉన్నాయి.

కొన్ని ప్లాస్టిక్ పేపర్స్‌తో కర్టెన్స్, పూజకు కావాల్సిన అలంకారాలు అన్ని ఒక కర్టెన్స్ రూపంలో వస్తున్నాయి. ఇవి అయితే తేలికగా ఉతుకుకోవచ్చు. పండుగల్లో పెట్టీ ఆ రోజు తరువాత పెట్టెలో దాచవచ్చును. రూమ్ పార్టీషన్ మరియు ఆర్చ్‌ల దగ్గర వాడే కర్టెన్స్ సీనరీస్‌తో ఉండాలి. అప్పుడు స్పెషల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇల్లు అందంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఉంటుంది.

ఒక కస్టమర్ ఎవరో వస్తే, స్వర్ణముఖి వివరిస్తోంది.

“నా స్నేహితురాలికి ఇలా ఏర్పాటు చేశాను. అద్దె ఇల్లు అయితే అవి వెళ్ళేటప్పుడు విప్పదీసి పట్టుకెళ్ళ వచ్చును. అతి తేలిక. ఖర్చు తక్కువ, మన్నిక ఎక్కువ. మరి మీరు ప్రయత్నించండి” అంటు పెద్ద షీట్ ఆఫీస్‌లో పెట్టింది. ఎంట్రన్స్‌లో ఆకర్షణీయంగా ఉన్నది చెప్పకనే అన్ని చెప్పింది. వచ్చిన వాళ్ళు కళ్ళు తిప్పకుండా సరుకు కొనుక్కు వెడతారు. ఇది ఒక ఆకర్షణ అని చెప్పాలి.

***

శ్రీనివాస్ సూర్యోదయం మొదలు ఇల్లు వెతికే వేటలో ఎక్కడెక్కడో వెళ్ళి చూస్తున్నాడు. అప్పటి వరకు వర్కింగ్ మెన్ హాస్టల్ రూమ్‌లో ఉన్నాడు. ఉద్యోగం నచ్చింది. అతను మంచి రచయిత. స్టూడెంట్స్‌ని సమాజంలో జరిగే అంశాలపై వ్యాసాలు కథలు రాసి పత్రికలకు పంపమనేవాడు, వాటికి మార్కులు కలుస్తాయి.

ఒకసారి స్వర్ణముఖి షాప్‌లో అలంకరణల గురించి కూడా వ్యాసం రాయించాడు. కానీ అప్పుడు ఆమె తెలియదు. ఎవరో స్టూడెంట్ రాసి పట్టుకు వచ్చాడు. బాగుంది అనుకున్నాడు శ్రీనివాస్.

శ్రీనివాస కిరణ్ కొలీగ్ ఒకాయన మాటల్లో ఎక్కడ ఉంటున్నావని అడగడంతో, హాస్టల్‍లో ఉంటున్న సంగతి చెప్పాడు. ఆయన – తన ఫ్రెండ్ ఫ్రొఫెసర్ రాఘవ రిటైర్ అయ్యారనీ, ఆయన ఇంట్లో ఖాళీ ఉందని చెప్పారు. రాఘవ గారింట్లో, ఒక భాగం షోరూమ్ చేశారనీ, వెనుక ఔట్ హౌజ్ ఉంది, అది బాగుంటుంది అయితే చిన్నదనీ చెప్పారు. “భార్యభర్తలు ఉండవచ్చును, మంచి ఏరియా. కిర్లంపూడి దగ్గర. సముద్రం ఒడ్డు కనిపిస్తుంది. వాళ్ళు పైన ఉంటారు. వారి బాల్కనీ ఉయ్యాలలో కూర్చుంటే సముద్ర తరంగాలు పాల నురగ లా తెల్లగా ఎగసి పడతు కనబడతాయి. ఆయన అప్పుడప్పుడు రమ్మని పిలుస్తారు వాళ్ళ ఆతిథ్యం బాగుంటుంది. ఏ సమయానికి ఆ సమయం ఆహారం ఏర్పాటు ఉంటుంది. కష్టం, సుఖం పిచ్చాపాటీ అన్ని మాట్లాడుకుంటాము. మావాదు పెద్దగా ఎవరితో మాట్లాడడు. సరే అంతా మంచి వాళ్ల దగ్గర ఉండటం మంచిది కదా. వాళ్ళ చిన్న కూతురు బిజినెస్ చేస్తోంది, వద్దన్నా వినదు. పెద్ద పిల్ల పరిస్థితిని బట్టి చిన్న పిల్ల పెళ్లి పక్కన పెట్టింది. బిజీ గరల్ అని చెప్పాలి. డాషింగ్ అండ్ డేరింగ్ కూడా చెప్పాలి. పెద్ద పిల్ల సాత్వికంగా ఉంటుంది. ఆ అల్లుడు చిత్రమైన మనిషి. ప్రేమ ప్రేమ అంటు వెంటపడి, బంధువుల ఇంట్లో చూసి అందరి చేత చెప్పించే మరీ చేసుకున్నాడు. వీళ్ళ పెరుగుదల వేరు. డిసిప్లిన్‌డ్‌గా ఉంటారు. మరి అక్కడ ఏమి జరిగిందో, ఎలా తేడా వచ్చింది అన్నది ఎవరికీ అర్థం కాదు. ఆ పిల్ల అత్త ఇంట్లో ఎలా చెపితే అల విన్నది. అయినా సరే భార్యగా చూడలేదు. పోనీ ఈ పిల్ల అతన్ని ప్రేమగా చూసి వండి పెట్టినా అతని మనసు కరగ లేదు. ఐదు ఏళ్ళు అలాగే ఉన్నది. తల్లి తండ్రికి చెప్పలేదు. ఆమె మౌనంగా ఉంటుంది. పనులు మాత్రం బాగా చేస్తుంది, వంట అద్భుతంగా ఉంటుంది. ఏమ్మా ఎలా ఉన్నావు అంటే బాగున్నా అంకుల్ అని నవ్వుతుంది. ఇది అక్కడి స్థితి! ఓ ఆదివారం వెడదాము. నేను ఫోన్ చేసి చెపుతాను. అద్దె అన్ని చిన్న కూతురు చూస్తుంది. ఆ పిల్లకి నచ్చాలి” అన్నాడాయన.

“నచ్చేలా ప్రవర్తిస్తూ ఉంటాను. ఆ హాస్టల్ లో ఎక్కువ రోజులు ఉండలేను. కష్టమే నాకు” అన్నాడు శ్రీనివాస్.

“సరేలే నాకు వదిలెయ్యి, నేను ఆ ఇల్లు ఇప్పిస్తా” అన్నాడాయన.

***

ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూపుల్లో ఉన్నాడు శ్రీనివాస్. సూర్యోదయం ముందే లేచి రెడీ అయ్యి బయటకు వచ్చాడు. అక్కడి చిన్న ఫుడ్ సెంటర్‌లో పెసరట్టు ఉప్మా తిని, మళ్ళీ ఆలస్యం అవవచ్చు అని గారె తిని, కాజ తిన్నాడు. కాఫీ తాగాడు. మొదటి నుంచి ఇంట్లో రెండు టిఫిన్లు అలవాటు. రోజు ఇంట్లో ఇడ్లీ ఉండాలి. దానితో పాటు ఒక స్వీట్. ఇంకో ఐటెం ఎర్ర నూక వెజిటబుల్ బాత్ ఉంటుంది. లేదా అమ్మ చక్రపొంగలి, కట్టు పొంగలి పులిహోర, దద్దోజనం చేస్తుంది. లడ్డూలు, మినప సున్ని, పూత రేకులు, మైసూర్ పాక్ ఉంటాయి. తిండి పుష్టి ఉండాలి. ఇదే నాన్న పద్ధతి కూడా. ఇంట్లో అందరూ హెల్దీగా బొద్దుగా అందంగా ఉంటారు.

ఆదివారం అందంగా కనిపించింది క్యాలండర్‌లో. ఆ రోజు ప్రత్యేకంగా ఉన్నది. కొత్త జాబ్. కొత్త ఇల్లు. కొత్త మనుష్యులు.

ప్రొఫెసర్ గారి కోసం ఎదురు చూపులు.  ఫోన్ రింగ్ అయ్యింది. ఆయన ఎక్కడికి రావాలి అని అడిగారు. ఫలానా చోట ఉన్నానని చెప్పాడు శ్రీనివాస్. ఆయన ఎర్రని కారులో డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఎక్కించుకుని వెళ్ళారు.

రాఘవరావు గారి ఇల్లు చూస్తూనే, ‘ఇంటి ఎలివేషన్ ఎంత బాగుందో స్వర్గం అంటే ఇలా ఉంటుందా’ అనుకున్నాడు శ్రీనివాస్. పైకి అనేశాడు

“ఆహా, ఇంటి లోపల ఇంకా అద్భుతాలు ఉంటాయి. మయసభలా ఉంటుంది చూడు” అన్నారాయన.

‘ఆహా ఏమి అదృష్టం’ అనుకున్నాడు శ్రీనివాస్. గుమ్మం దగ్గరకి వెళ్ళి బెల్ కొట్టారు. ఓ పెద్దాయన పట్టు పంచెలో వచ్చి తలుపు దగ్గర చూసి రిమోట్ నొక్కాడు. భలే తమాషాగా ఓపెన్ అయ్యింది.

“రండి కూర్చోండి మా రాఘవ వస్తాడు” అన్నారు

“ఈయన నా ఫ్రెండ్ మామ గారు” అంటు పరిచయం చేశారు శ్రీనివాస్ కొలీగ్.

“ఈ అబ్బాయి మన పోర్షన్‌లో అద్దెకు ఉండటానికి వచ్చాడు” అని చెప్పారాయనతో.

“అలాగే మా అల్లుడు గారు వస్తారు” అన్నారా పెద్దాయన.

ఈలోగా ఒక మనిషి హోటల్ డ్రెస్‌లో ఉన్నాడు, మంచి నీళ్ళు ఫ్రూట్ జ్యూస్ తెచ్చి ఇచ్చాడు. ‘ఇప్పుడా, ఏమి వద్దు’ అనబోయి ఆయన సౌజ్ఞ చూసి తీసుకుని తాగరు

“మా స్వర్ణముఖికి ఇవాళ ఫ్రెండ్ పెళ్లి. అక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం వెళ్ళింది. అది సాయంత్రం వస్తుంది. బాగా తెలిసున్న వాళ్ల అమ్మాయి. ఇద్దరు కలిసి చదివారు. దీని పెళ్లి ఎప్పుడో?” అన్నారు తాతగారు.

“సమయం వస్తే అయిపోతుంది” అన్నారు మళ్ళీ ఆయనే, నవ్వుతూ మాట్లాడారు.

హమ్మయ్య పర్వాలేదు అనుకున్నాడు శ్రీనివాస్. జ్యూస్ తెచ్చిన మనిషి తాళం పుచ్చుకుని వచ్చి కింద ఇల్లు చూపించాడు. షాప్ మూసి ఉన్నది. కానీ బాగుంటుంది అని అర్థం అయింది

“మీకు తెలుసా మేము అసలు రెంట్‌కి ఇవ్వము కానీ వీరు చెప్పారని మేము ఇస్తున్నాము. అద్దె పాతిక వేలు ఇవ్వాలి. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి. కానీ మేము మీకు మంచిగా ఉంటారని తక్కువకు ఇస్తున్నాము” అన్నారు.

వాళ్ళే ఫర్నిచర్ అంతా పెట్టి ఉంచారు. వంట ఇంటి సామాను కూడా. ఫర్నిషెడ్ హౌజ్ కదా అన్నారు

“ఓకె ఓకె” అంటూ “మంచి రోజు చూసి వస్తాను” అన్నాడు శ్రీనివాస్.

“ఈ రోజు మంచిరోజే. అందుకే రమ్మన్నాము. మీరు మీ బట్టల సూట్‌కేస్ తెచ్చుకుంటే చాలు” అన్నారు.

“సరే” అన్నాడు శ్రీనివాస్. కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళారు

బ్రేక్‌ఫాస్ట్ అంటు మళ్ళీ వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకు వెళ్ళారు. చపాతీ కూర, ఆవడ పెట్టారు. అది తిన్నాక “నువ్వు సామాను తెచ్చుకో” అంటూ శ్రీనివాస్‍ని పంపేశారు అతని కోలీగ్. రెండు గంటల లోపల రమ్మని చెప్పారు. ఇద్దరు కబుర్లలో మునిగి పోయారు.

కాసేపటికి శ్రీనివాస్ వచ్చాడు. ఏముంది సామాను? ఒక్క పెద్ద బ్యాగ్, వి.ఐ.పి. సూట్‌కేస్ పట్టుకుని వచ్చాడు.

అక్కడ ఉన్న మనిషి రూమ్ లోకి తీసుకు వెళ్లి దింపాడు. అప్పటికే అక్కడ పాలు పొంగించి పరమాన్నం గిన్నెలో ఉన్నది. అది పట్టుకుని పైకి వెళ్ళారు. రెండున్నరకి భోజనాలు అక్కడే చేశారు

మొహమాటంగా ఉన్నా అతిథ్యం బాగుంది. “రేపటి నుంచి నీ ఇష్టం ఇవ్వాళ మా ఇష్టం” అన్నారు.

ఆ వర్కర్ వచ్చి బీరువాలో బట్టలు సర్ది వెళ్ళాడు. రాజభోగం అంటే ఇదేనేమో అనుకున్నాడు శ్రీనివాస్. తల్లికి ఫోన్ చేసి చెపితే సంతోషించింది. చెల్లెలు ఎప్పుడు తాను వెళ్ళలా అని ప్లాన్ వేస్తోంది. ‘కొడుక్కి మంచి రోజులు  వచ్చాయి, ఓ మంచి కోడలు కూడా వస్తే ఆనందం’ అనుకున్నది తాయారు. అదే మాట భర్తతో అంటే “నా కొడుకు నా పెంపకం” అంటూ గొప్పగా అన్నాడు రామారావు.

***

ఆడపిల్ల ఎంత పెద్ద చదువు చదివినా, అంతరిక్షాన్ని చుట్టి వచ్చినా ఒక అయ్య చేతిలో పెట్టే వరకు తల్లి తండ్రి ఆవేదన పడుతూనే ఉంటారు.

పెద్ద పిల్ల శ్రీముఖి విషయంలో కొంత ఆందోళన చెందారు, మంచి సంబంధం కోసం. స్వర్ణముఖి విషయంలో అలా జరుగకూడదు. వీలుంటే ఈ ఊళ్ళో సెటిల్ అయిన వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని వాళ్ళ సంకల్పము.

తాతగారు శ్రీనివాస కిరణ్‌ని పరిశీలిస్తూ ఉన్నారు. ఆదివారం శ్రీనివాస్‌తో కలిసి ఉదయం జాగింగ్‌కి వెడతారు. సాయంత్రం సముద్ర ఒడ్డుకి వెళ్లి ఇసుకలో చిన్నపిల్లలా అందమైన రాళ్ళు అల్చిప్పలు ఏరుతూ ఉంటారు. అదొక ఆనందము. అక్కడే మిర్చి బండి దగ్గర బజ్జీలు, పానీపూరి తిని వస్తూ ఉంటారు. అలా మంచి స్నేహం ఏర్పడింది.

ప్రతి నెల ఒకటో తారీఖు మాత్రం ఇంటివాళ్ళతో భోజనం చెయ్యాలి. అవ్వాల్టి రోజు గెస్ట్‌గా పిలుస్తారు. అందరూ కలిపి భోజనం చేస్తారు. వంట మాత్రం శ్రీముఖి చేస్తుంది. స్వర్ణముఖి వడ్డన చేస్తుంది. మొట్ట మొదటి నెల ‘వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఎంత బాగుందో, ఫైవ్ స్టార్ హోటల్‌ని మించి ఉన్నది. కొత్తిమీర, కరివేప, పుదీనా మెంతికూర మొక్కల పాట్స్ అమర్చారు. ఆ వెండి కంచాలు, వెండి గ్లాసులు అన్ని బాగున్నాయి. టేబుల్ మాట్స్ అన్ని కొత్తగా ఉన్నాయి’ అనుకున్నాడు శ్రీనివాస్.

“మా పిల్ల ఇంట్లో అన్ని కూడా బాగా అలంకారం చేస్తుంది. డైనింగ్ టేబుల్ పికాసో పెయింటింగ్‌లా ఉండాలి అంటుంది” అన్నారు తాతగారు.

అసలు మొదట భోజనానికి వచ్చిన రోజున శ్రీనివాస్ ముఖం ఎత్తి కూడా చూడలేదు. భయంతో భోజనం చేశాడు. నెల అయ్యాక కొంచెం చనువు వచ్చి పైకి ఎత్తి అంతా పరిశీలించాడు. ఎవరు అల్లుడు అవుతాడో అదృష్టవంతుడు అనుకున్నాడు

“ఏదో మా పిల్ల అభిరుచి” అంటు భోజనాలు ముగించారు.

“ఒక విషయం, మా పిల్లలు మా దగ్గరే ఉండాలి అని మా అభిప్రాయం” అన్నారు తాతగారు.

“అయితే ఇల్లరికం అల్లుడు కావాలన్న మాట” అన్నాడు శ్రీనివాస కిరణ్. ఆ మాట అని నాలుక కరుచుకుని నవ్వుకున్నాడు

“అబ్బే కాదు మంచి వాడు చాలు” అన్నారు

“ఎలాంటి వారు కావాలి?” అన్నాడు

“ఆహా, పెళ్ళానికి అన్నం పెట్టే వాడు చాలు” అని అన్నది స్వర్ణముఖి.

“అదేమిటి?” అన్నాడు శ్రీనివాస్.

అది అంతే అని ఊరుకున్నారు. సరే ఎవరి ఇష్టం వారిది అని ఊరుకున్నాడు శ్రీనివాస్

వెంటనే స్వర్ణముఖి అందుకుని “ఇటీవల సీరియల్స్‌లో శాడిస్ట్ భర్తలను చూసి అలా అన్నాను. ఏమి అనుకోవద్దు. మీరు మిమ్మల్ని అనుకోకండి” అన్నది.

తాతగారు ఓ ఆరునెలలు పరిశీలించి, ఒక రోజు శ్రీనివాస కిరణ్‌ని పిలిచి “మీ నాన్నగారు ఏమి చేస్తారు? ఎప్పుడు ఏమి అడుగలేదు” అన్నారు. శ్రీనివాస్ వివరాలు చెప్పాడు.

“అయితే మీకు పొలం ఉంది. ఫైనాన్స్ బిజినెస్ ఉంది. ఒకసారి మన ఇంటికి పిలిస్తే వస్తారు కదా ఎప్పుడు నువ్వే పండుగకి వెడుతూ ఉంటావు?” అన్నారు.

“సరే చెపుతా లెండి” అన్నాడు శ్రీనివాస్.

***

‘అమ్మో నాన్నను పిలిస్తే పరువు కూడా తీస్తాడు, ఎలా’ అనుకున్నాడు శ్రీనివాస్.

తల్లి తాయారుతో, చెల్లితో చెప్పాడు – నాన్నని ఏమి అడగవద్దు అని చెప్పి తీసుకురండి. ఒకసారి ఇంటివాళ్ళు రమ్మన్నారు. ఇన్నాళ్ళు అయింది, ఎవరు ఒకసారి కూడా రాలేదు, అసలు ఎవరు ఉన్నారు అంటున్నారు – అని చెప్పాడు

అలా తండ్రిని తల్లిని చెల్లిని రమ్మని చెప్పాడు. “విజయవాడ నుంచి రైల్లో వచ్చి టాక్సీ మాట్లాడుకుని రండి, ఆటోలో కాదు” అన్నాడు.

సరేనంటూ బయలుదేరారు. అరటి గెల, కొబ్బరి బొండాలు, మినప సున్ని, పూత రేకులు పట్టుకువచ్చారు. పూర్వ కాలం కళాయి పెట్టిన ఇత్తడి డబ్బాలు బంగారంలా మెరుస్తూ తళ తళలాడుతున్నాయి. తెల్లవార గట్ల ఐదుకి వచ్చారు. రామారావు ఇల్లంతా కలయ తిరిగి చూశాడు. తాయారు పాలు కాచి కాంటీన్నెంటల్ బ్రూ కలిపింది.

కాసేపు కబుర్లు చెప్పారు. బాగా తెల్ల వారింది. పని మనిషి వచ్చి ఇల్లు తుడిచి సోఫాలు అన్ని దులిపి వెళ్ళింది. “ఏమైనా తెమ్మంటారా?” అంది. “వంట పాత్రలు ఆ బీరువాలో ఉంటాయి. కూరలు తెచ్చి ఇస్తాను. బియ్యం పప్పులు కూడా తెస్తాను” అంది.

“వద్దు లేమ్మా. మేము మా ఉరునుంచి పది రోజులకు సరిపడా అన్ని తెచ్చుకున్నాము. మెంతి కారం ఉంటే మాకు సరిపోతుంది. మాకు నేతి పోపులు అలవాటు. ఇంట్లో రెండు గేదెలు, రెండు అవులు ఉన్నాయి. అన్ని పొలంలో ఉంటాయి” అని కబురు కలిపింది తాయారు.

“అలాగా బావుంది అమ్మా. అబ్బాయిగారు నెమ్మదస్తుడు, ఏమి అడగరు” అంటూ వెళ్ళింది.

పది గంటలు అయ్యాక రాఘవ గారు దిగి వచ్చి మాట్లాడి వెళ్ళారు. మధ్యాహ్నం శ్రీముఖి, తల్లి పూర్ణ వచ్చి మాట్లాడి వెళ్ళారు.

“ఇంత పెద్ద డెకరేషన్ మాల్ మీ అమ్మాయి నడుపుతోందా, ఆశ్చర్యంగా ఉంది” అన్నాడు రామారావు.

“ప్రయాణం సుఖంగా అయిందా? ఏమైనా కావాలంటే ఫోన్ చెయ్యండి. నేను పంపిస్తా” అంటు ఫోన్ నెంబర్ ఇచ్చింది పూర్ణ.

“అన్ని తెచ్చుకున్నాను. మీ మనిషిని పంపిస్తే అరటి గెల, కొబ్బరి బొండాలు పైకి తెస్తారు. ఏదో కొంచెం మినప సున్ని, పూత రేకులు తెచ్చాను” అంటు ఒక డబ్బాలో పెట్టి ఇచ్చింది తాయారు.

“అయ్యో మీ అబ్బాయికి ఉంచండి, మాకు ఇచ్చేస్తున్నారు”

“పర్వాలేదు మా అబ్బాయి మీ గురించి ఎంతో బాగా చెపుతాడు, మీ ఇల్లు ఎంత బాగుంటుందో అంటాడు”

“అబ్బే అంతా అతని అభిమానం. రేపు పైకి రండి” అని చెప్పి వెళ్ళింది పూర్ణ. “మీకు ఇరుకుగా ఇల్లు ఉంటే ఆడవాళ్ళు పైకి రండి, గెస్ట్ రూమ్ ఉన్నది. అందులో ఉండవచ్చు” అని చెప్పింది శ్రీముఖి.

అలాగే కానీ సరిపోతోంది చాలు అండి అన్నారు. నాలుగు రోజులు ఉన్నారు. ఇంట్లోనే అన్ని సరిపోయాయి.

ఇంటి వాళ్ల చుట్టాలు వస్తే పరిచయం చేశారు తాతగారు. విషయం ఏమిటంటే ఓ ఛానెల్ వారు వచ్చి షాప్ యాడ్ కి చూసుకుని షూటింగ్ చేశారు. వచ్చేది దసరా కదా, ఆ పండుగ అలంకారాలు అమ్మవారి రూపాలకి తగ్గట్లుగా వస్త్రాలు, ఇతరత్రా దీపాలు, దండలు అన్ని కూడా పండుగ డిస్కౌంట్ తో ఏర్పాటు చేశారు. లోకల్ ఛానెల్స్ కొన్ని, పెద్ద ఛానెల్స్ వారు కూడా అన్ని ఆన్‌లైన్‍లో కూడా లభ్యం అని చెప్పారు. ఆ యాడ్‍లో – కాంతిశ్రీ, తాయారు కూడా ఉన్నారు. ఇంకా శ్రీముఖి, పూర్ణ కూడా ఉన్నారు. కొంతమంది యూనివర్సిటీ అమ్మాయిలు కూడా వచ్చి పాల్గొన్నారు. దానితో సందడి సరిపోయింది.

“ఇప్పటి పిల్లలు పెద్దల మాట సద్ది మూట అంటే వినరు పెద్దల మాట చేదల మూట అంటున్నారు కానీ మా అబ్బాయి చాలా మంచివాడు. నేను చెప్పినట్లు వింటాడు” అంటూ కొడుకు గురించి బాగానే చెప్పాడు రామారావు. దానికి తాయారు సంతోషించింది.

“పిల్లాడికి పెళ్లి చేస్తారా? పిల్లకి ముందు అవ్వాలా?” అంటు తాతగారు ప్రశ్నలు వేశారు.

సాయంత్రం ఇద్దరు కలిపి అలా సముద్రం రోడ్డు వెంట వెళ్ళేవారు. ఉన్న నాలుగు రోజులు అలా గడిపేశాడు రామారావు. కొడుకుని ఆ ఇంటి అల్లుడు చెయ్యాలి అని లెక్కలు కట్టాడు.

స్వర్ణముఖి కొంచెం దురుసు గానే ఉంటుంది మాటకి మాట చెప్పేస్తుంది. ఇలా అవడానికి కారణం అక్క భర్త ప్రవర్తన. అక్క మొగుడు అంటుధి కానీ బావ అనదు. ఒక్కోసారి జీవితంలో కొన్ని చేదు అనుభవాలు మిగిలితే అలాగే ఉంటారు. కానీ శ్రీముఖి మాత్రం “గ్రహ స్థితి నాకు అత్తగారు ఆడబడుచూ రూపంలో వచ్చారు. వాళ్ళే కొంత కాలానికి మారుతారు. బావగారు మంచి వారు కనుక నన్ను కష్టపెట్టే పరిస్థితి లేకుండా ఇక్కడకి పంపారు. ఆ విషయంలో మెచ్చుకోవాలి” అంటుంది. “నువ్వు ఓ ఆధునిక పతివ్రతవి. సీత మహా సాద్వి పుట్టిన దేశంలో పుట్టావు” అంటుంది స్వర్ణముఖి.

“సరే లే” అని నవ్వుతుంది శ్రీముఖి. “నువ్వు ధైర్యంగా ఉండే విజయ దుర్గవి” అంటుంది. అక్క చెల్లెలు వాదులాడుకుంటారు.

అక్కడ ఉన్నన్నాళ్ళూ రోజు వెళ్లి షాప్‍లో కూర్చునేది కాంతిశ్రీ. ఇలా ఉండటం తనకి ఇష్టమే కాని అమ్మానాన్నలకి ఇష్టత ఉండదు. పది రోజుల తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు.

***

రోజులు ఇట్టే గడిచాయి.

తాతగారికి – రామారావు ఒక రోజు ఫోన్ చేశాడు. “మా అబ్బాయికి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి చూపులకి వెళ్లి వస్తున్నాము. మీకు చెప్పాడా, మా వాడు?” అన్నాడు

“లేదండీ” అన్నారు తాతగారు. “మా మనుమరాలికి చూస్తున్నాము. కానీ మంచివాడు దొరకాలి” అన్నారు. “అయినా అది తన బిజినెస్ మానదు. ఇక్కడే ఉండేవాడు కావాలి” అన్నారు. “మరి అలా ఒప్పుకునే తల్లి తండ్రి కావాలి. మా అల్లుడు మంచివాడు. నన్ను చూస్తున్నాడు. వాళ్ళకి అలాంటి వాడే కావాలి” అన్నారు తాతగారు మాటల్లో.

“అయ్యో అలాగా! మా అబ్బాయి మీకు నచ్చితే పిల్లనిచ్చి పెళ్ళి చెయ్యండి. మేము అలా ఇష్టపడతాము” చెప్పాడు రామారావు.

“మరి మీ పిల్ల పెళ్లికి ఉన్నది కదా?” అడిగారు తాతగారు.

“మా పిల్ల పెళ్లి తరువాత చేస్తాను. మీరే సంబంధం చూడవచ్చును” అన్నాడు రామారావు. అదృష్టం వచ్చి వరించింది. అసలే డబ్బు మనిషి, శ్రీమహాలక్ష్మి ఎదురు వచ్చి నట్లు అనిపించింది రామారావుకి.

“ఇప్పటి రోజుల్లో అబ్బాయిలకి నచ్చిన పిల్ల ఉంటే అడిగి మరి చేసేసుకుంటున్నారు. అంతేనా పెళ్లి ఖర్చులు కూడా సగం చేస్తున్నారు. కొందరయితే మగ పెళ్ళి వారే ఖర్చులు పెట్టుకుని చేసుకుంటున్నారు. మంచి రోజు చూసుకుని రండి. మా మనవరాలిని పెళ్లికి నేను ఒప్పిస్తాను” అన్నారాయన.

***

పెళ్లిచూపులు, నిశ్చితార్థం అన్నీ ఒకేసారి చాలా ఘనంగా చేశారు దసపల్లా హోటల్‌లో. అటు ప్రొఫెసర్స్ ఇటు బందువులు అందరు వచ్చారు. నిశ్చితార్థం ఎంతో వేడుకగా చేశారు. ఇంకో ఇరవై రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టారు.

రిసార్ట్‌లో ఏర్పాటు చేశారు. బీచ్ దగ్గర. చల్లని గాలి. సముద్ర హోరులో విధ్యత్ దీపాలు. ఆ హాయి చెప్పగలమా, పెళ్లికి వెళ్లి చూడాలి. సముద్ర అందాలు, పెళ్లి సందడి. రిసార్ట్‌లో పెళ్లికి ఆరెంజ్‌మెంట్స్ చేశారు. మినిస్టర్ గారు వారు బంధువులు అందరూ బాగా తెలుసు కనుక గెస్ట్ హౌస్‌లు బుక్ చేసి ఉంచారు. పెళ్లి వేదికకు కార్లు పెట్టారు. అందర్నీ చాలా సౌకర్యంగా ఉంచారు. శ్రీముఖి ఫ్రెండ్స్, రాఘవరావుగారి స్టూడెంట్స్ అంతా వచ్చారు. పెళ్ళి అట్టహసంగా చేశారు.

కోడలిని ఏమి కావాలో కొనుక్కుని బిల్ ఇమ్మని మామగారు చెప్పారు. అన్ని పెద్ద కంపెనీల నుంచి పచ్చల సెట్లు ఆర్డర్ చేసి తెప్పించింది. అన్ని ఆమె చేతిలోనే ఉన్నాయి కదా. చిలక పచ్చకి మెరున్ బోర్డర్ టిష్యూ చీర తెప్పించింది. ఇంకా ఐదు పట్టు చీరలు అత్తవారి తరుఫున ఆర్డర్ చేసింది. పది రూపాయల రుమాలు కొనడానికి వంకలు పెట్టే భర్త కోడలికి ఇంత స్వాతంత్రం ఇచ్చాడని తాయారు సంతోష పడింది. కూతురు కాంతిశ్రీ మాత్రం కొంచెం ఈర్ష్య పడింది. నాన్న మారినందుకు పెద్ద పిల్ల భవ్యశ్రీ సంతోష పడింది.

బడ్జెట్ కింగ్‌గా, ఫైనాన్స్ సూపర్‍మ్యాన్‍గా ప్రసిద్ధి పొందిన రామారావు కొడుక్కి కోడలు ముందు తన ప్రజ్ఞను చూపించాడు. బస్సు వేసి బంధుమిత్రులని పెళ్లికి తీసుకు వెళ్ళాడు. అందరు ఆశ్చర్యపోయేలా పెళ్లి జరిగింది.

రిసెప్షన్‌లో ఆకుపచ్చ డ్రెస్‌లో అచ్చు ‘వచ్చెను అలమేలు మంగ’ అన్నట్లు అద్భుతంగా ఉంది కొత్త పెళ్ళికూతురు.

పెళ్ళిలో పెద్ద బ్యాండుతో పాటు సంప్రదాయ మంగళ వాయిద్యాలు పెట్టారు. భోజనాలు టిఫిన్స్ అన్ని కూడా ఎవరికి నచ్చిన స్టాల్‌లో వారు అప్పటి కప్పుడు చేసి పళ్ళెంలో పెట్టీ ఇచ్చారు. కొందరు పెళ్లిలో భోజనాలు చేశారు కొందరు టిఫిన్స్ తిన్నారు. పదిహేను రకాల స్వీట్స్, పదిహేను రకాల హాట్స్, కూరలు, పదిహేను రకాలు పచ్చళ్ళు, ఐదు రకాల పులుసులు, పదిహేను రకాల పప్పులు, ఐస్ క్రీమ్‌లు ఐదు రకాలు, ఒరుగులు ఐదు రకాలు మొత్తం వంద రకాలు పెట్టారు. ఒక ప్రక్క బఫె, మరో ప్రక్క టేబుల్ మీల్స్ ఏర్పాటు. ఎప్పటి నుంచో విశాఖలో స్థిరపడ్డారు అందుకే అక్కడ చేశారు.

అర్ధరాత్రి పన్నెండున్నరకి ముహూర్తం. ఇంకా భోజనాలు చేసేవారు చేస్తూనే ఉన్నారు.

పెళ్లి ఘనంగా మహారాజులు పెళ్ళిళ్ళ మాదిరి జరిగింది. ఒక ప్రక్క వెస్ట్రన్ బ్యాండ్. మరో ప్రక్క మంగళ వాయిద్యాలలో అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు మారుమ్రోగాయి. ఒక ప్రక్క సన్నాయిలో ‘పిడికెడు తలంబ్రాలు పెళ్లి కూతురు’ అంటు గట్టి మేళం వాయిస్తుండగా స్వర్ణముఖి శ్రీమతి శ్రీనివాస కిరణ్‌గా మారింది.

అంతేనా వచ్చిన వాళ్ళకి, ఆ ఊరు వాళ్ళకి కూడా మంచి ఖరీదైన బట్టలు పెట్టారు.

ఇంకో విషయం, మరదలు పెళ్లికి వచ్చిన స్వర్ణముఖి బావగారు తన పోటీగా తోడల్లుడు వచ్చాడని అనుకున్నాడు. వాళ్ల ఇంట్లో వాళ్ళు కూడా గ్రహించారు. దాంతో పెద్ద అల్లుడు కూడా ఆ ఊరు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వచ్చేశాడు. కానీ కొంచెం ముభావంగానే ఉండేవాడు. పోనీలే పెద్ద కూతురు జీవితం బాగుపడింది అనుకున్నారు రాఘవరావు, పూర్ణ.

రామారావు తన ఇంటికి కోడలు వచ్చాక శ్రీ సత్యనారాయణ వ్రతము, శ్రీ వేంకటేశ్వర స్వామి దీపారాధన చేశాక ఊరు భోజనాలు, వేద పండితుల సత్కారం కూడా చేశాడు.

ఇప్పుడు పెద్ద కూతురు భవ్యశ్రీ కూడా తండ్రి తల్లి దగ్గరకు వస్తూ వెడుతూ ఉంది.

రాఘవరావు గారు తన ఆస్తిని కొంత ఇద్దరు కూతుళ్లు సమంగా ఇవ్వటమే కాకుండా పెద్ద కూతురు  కూతురుకి, చిన్న కూతురు కొడుకుకి కూడా తనే పంచి రాసి ఇచ్చారు.

“మనవడికి కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది” సరదగా అన్నాడు రామారావు.

“అలాగే బావగారు మీ అబ్బాయి మమ్మల్ని కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు” అన్నాడు రాఘవరావు.

ఇప్పటి రోజుల్లో పెద్దవాళ్ళని చూసే అల్లుడు రావడం ఎంత ఘనం అన్నారు. నిజమే, ఈ రోజుల్లో అత్తమామలని చూసే అల్లుడు అతి గొప్పవాడు.

శాంతి శుభము

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here