ఆ…రోహణ

4
12

[శ్రీ అనిల్ అట్లూరి రచించిన ‘ఆ…రోహణ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

 

[dropcap]స్నే[/dropcap]హితుడి ఇంట్లో శుభకార్యానికి వెళ్లడం, చిరకాల మిత్రులను కలుసుకోవడం వాళ్లతో దాదాపు మూడు నాలుగు దశాబ్దాల కబుర్లు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందని బయలుదేరాడు సుధాకర్. కానీ ఆ కలుసుకోవడం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలిసుంటే వెళ్ళేవాడు కాదేమో.

***

అంతకు ముందు ఐదారు నెలల క్రితం…

ఆ సాయంత్రం ఐదు అయ్యింది.

స్క్రీన్ మీద ఎక్సెల్ షీట్‌లో నెంబర్స్ చూస్తున్న తిలక్ భృకుటి ముడి పడింది.

“భవానీ, ఆకాష్‌ని రమ్మను,” అని ఇంటర్‌కాం బటన్ నొక్కి అరిచాడు.

“యస్ సర్,” అంటూ ఆకాష్‌ని అతని ఎక్స్‌టెన్షన్‍లో పిలిచింది.

“సార్ రమ్మంటున్నారు… ఆకాష్,” అని అతని గొంతు వినగానే చెప్పింది.

“ఔనా… ఎనిథింగ్ స్పెషల్?” అడిగాడు ఆకాష్.

“ఎస్. ‘కోడ్ రేజ్’,” అని పెట్టేసింది మరో ప్రశ్నకి ఆస్కారం ఇవ్వకుండా. ఆకాష్‌కి చెమటలు పట్టడం మొదలయ్యింది. భవాని ‘కోడ్ రేజ్’ అందంటే దానికి తిరుగుండదు. బాస్‌కి రేజ్ వచ్చిందంటే కాబిన్‍లో ఏదో ఒకటి పగలాలి. అది ఫ్లోర్ మానేజర్ హెడ్ ఐనా ఆపరేటర్ చెయ్యయినా సరే! ఏదైనా సరే. ఎదురుగుండా వున్న మానిటర్ ఐనా సరే.

తిలక్ కాబిన్ తలుపు దగ్గిర నిలబడి టై సర్దుకుని, “మే ఐ కమిన్ సర్?” అని తలుపుని ఓరగా తెరిచి అడిగాడు ఆకాష్.

“వాట్ ఇస్ దిస్ నాన్సెన్,” అని తన ఎదురుగుండా వున్న స్క్రీన్‌ని చూపిస్తూ అరిచాడు తిలక్.

ఆ వారం కంపెనీకి క్లయింట్స్ పంపిన పేమెంట్ రిసీట్స్ అవి. బ్లూమింగ్డేల్స్, హర్రొడ్స్, మేసీస్, నార్డ్‌స్త్రాం, సెల్ఫ్రిడ్జెస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థలకి తిలక్ అధినేతగా వున్న తిలక్ మాడ్యులర్ ఇంజినీరింగ్ కంపెనీ అనేక రకాల స్టాండ్స్‌ని తయారు చేసి పంపుతుంటుంది. వాటి నుంచి రావాల్సిన పేమెంట్స్ అందలేదు.

ఆ నెల రావాల్సిన బిల్స్ పెండింగ్ చూపిస్తున్నది ఆ ఎక్సెల్ షీట్. ఎర్రని ఎరుపు రంగులో వున్నవి నెంబర్స్.

“సారీ సర్. లాస్ట్ మంత్ పంపిన లాట్ ఒకటి రిజెక్ట్ అయ్యింది, సారీ” అంటూ నోరు పెగల్చుకుని చెప్పాడు ఆకాష్.

“నువ్వేం చేస్తున్నావ్? నిద్రపోతున్నావా? మాట్లాడవేం?”

“లేదు సార్. అది… సౌమిత్ర దాస్… షిఫ్ట్‌లో జరిగింది సార్.”

“వాట్ హాపెండ్?”

“ఐడల్ స్టాండ్ లెగ్ స్టాండర్డైజేషన్‌లో పొరబాటు జరిగింది. ఒక లెగ్‍లో టూ ఎమ్.ఎమ్. షార్ట్ వచ్చింది సర్”

బొమ్మలు నిలబెట్టడానికి వాడే చిన్న స్టాండ్‌కి వుండే నాలుగు కాళ్ళల్లో ఒక కాలు పొడుగు రెండు మిల్లీ మీటర్ల మేరకి తగ్గింది. దానితో బాలన్స్ సరిగ్గా కుదరక బొమ్మ ఒరిగిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్స్‌లో వందలు, వేల డాలర్లు, పౌండ్ల ఖరీదుండే అద్భుతమైన బొమ్మలు, ప్రతిమలు తిలక్ సంస్థ తయారుచేసే స్టాండ్స్ మీద నిలబడతాయి. అవి సరిగ్గా నిలబడకపోతే ఆ బొమ్మల అమ్మకాల మీద తీవ్రమైన ప్రభావాలు చూపుతుంది.

“మరి నువ్వేం చేసావు?”

“డైని రీకాస్ట్ చెయ్యమని చెప్పాను సర్. చేస్తున్నారు. రెండు రోజుల్లో కొత్తది వచ్చేస్తుంది.”

“ఇంకా… వాట్ నెక్స్ట్?”

“నేనే దగ్గిరుండి ట్రయల్ రన్ చూస్తాను సర్.”

“దెన్…?”

“సర్…”

అప్పటికిగాని బల్బు వెలగలేదు ఆకాష్‌కి.

“దాస్ షిఫ్ట్ మార్చాను సర్.”

“దట్స్ నాట్ ఇనఫ్. సస్పెండ్ హిమ్ ఫర్ ఎ వీక్ అండ్ రెవ్యు. పోస్ట్ మి అప్డేట్స్.”

“యస్ సర్. విల్ డూ,” అంటూ అక్కడే నిలబడ్డ అకాష్ వైపు చూస్తూ, “డొన్ట్యూ హెవ్ యెని థింగ్ బెటర్ టు డూ? ఔటాఫ్ మై ఫేస్…” అని అరిచాడు తిలక్.

మరో మాట లేకుండా ‘బతికానురా దేవుడా’ అంటు కాబిన్ నుంచి బయట పడ్డాడు ఆకాష్.

***

బ్లాక్ టక్స్‌డీలో వెలిగిపోతున్నాడు తిలక్. గ్రౌండ్ చుట్టూ వలయాకారంలో రకరకాల ఫుడ్ స్టాల్స్. మరో వైపు లిక్కర్ స్టాల్స్. సుధాకర్‌ని చూడగానే దగ్గిరకి వచ్చి చెయ్యి పట్టుకుని,

“ఇదేనా రావడం?” అంటూ అడిగాడు తిలక్.

“ఔను,” అంటుండగానే “ఏవిటి స్టేషన్ నుండి వస్తున్నావా?” అంటూ పెద్దగా నవ్వుతూ అడిగాడు.

“లేదు, ఇంటి నుండే…”

“ఔనా… నీ బట్టలు చూస్తుంటే ఇప్పుడే ఊళ్ళోకి దిగినట్టుంటే…” అంటూ మరెవరో కనబడితే వాళ్లని పలకరించడానికి అటు వెళ్ళిపొయ్యాడు. సుధాకర్ బాల్య మిత్రులు ఒకళ్ళో ఇద్దరో మాత్రమే వచ్చారు. సుధాకర్ నిరుత్సాహపడ్డాడు.

సుధాకర్ చుట్టు సూట్లే ఎక్కువ కనబడుతున్నవి. వాటితో పాటు పట్టు చీరలు, డిజైనర్ జువెలరీ, అస్సెస్సరీస్.

తిలక్‌ని చూస్తుంటే పాతికేళ్ల గతం గుర్తు వచ్చింది.

***

తిలక్ అప్పుడప్పుడే తండ్రి వ్యాపారం అందిపుచ్చుకుని ఎదుగుతున్న సందర్భం. “గురూ, అర్జెంటుగా ఒక ఐదు వేలు సర్దరా. ఆ పర్చేస్ మేనేజర్‌కి ఇవ్వాలి. ఇస్తే గాని వాడు ఆ ఆర్డర్ పాస్ చేయడు,” అంటూ ఆందోళనగా ఒక సాయంత్రం సుధాకర్‌కి ఫోను చేసాడు. పాపం పర్చేజ్ మానేజర్‌కి దక్కింది కాని ఆర్డర్ తిలక్‌కి రాలేదు. కారణం పర్చేజ్ మానేజర్ మారిపోవడం! అది తలుచుకున్నప్పుడల్లా సుధాకర్‌కి నవ్వొచ్చేది. తిలక్ ఉడుక్కునేవాడు.

***

తెల్లవారు ఝామున అయిందింటికి తిలక్ ఫోను.

“సుధా, నేను ఇక్కడ గాంధీనగర్ హాస్పిటల్‌లో ఉన్నాను. అర్జెంటుగా నువ్వు రావాలి,” అంటే ఉరుకులు, పరుగులు పెడుతూ కిందా మీదా పడుతూ హాస్పిటల్‌కి చేరాడు. తిలక్ నాన్నకి హార్ట్ ఎటాక్. కార్డియాక్ ఐ సి యూ లో ఉన్నాడు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. తిలక్ జేబులో డబ్బులు లేవు. బ్యాంక్ అకౌంట్‌లో ఓవర్ డ్రాఫ్ట్ మీద ఓడీ ఉంది. ఏం చెయ్యాలో తోచక బిక్కుబిక్కుమని ఉంటే, “నేను ఉన్నాను పర్వాలేదు,” అంటూ తనే ముందు నిలబడి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే వరకు అన్నీ చూసుకున్నాడు.

***

చేతినిండా ఆర్డర్స్. కానీ జేబులో పైసా లేదు. పిల్లలకి కాలేజీలో సీట్‌కి డొనేషన్‌కి డబ్బులు లేకపోతే సుధాకరే డొనేషన్లు, ఫీజులు గట్రాకి సర్దాడు.

***

పెళ్లైన పది రోజులకి ఒక సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుంటే తిలక్ నుంచి ఫోను. “పెళ్లిలో నీతో సరిగ్గా టైమ్ స్పెండ్ చెయ్యలేక పొయ్యానురా! నువ్వు రా. ఫాక్టరీకి వెళ్దాం. ఆ ఫాక్టరీ ఎలా పెరిగిందో చూడలేదుగా! నేను నీ కోసం వెయిట్ చేస్తుంటాను,” అంటూ అహ్వానించాడు సుధాకర్‌ని.

ఒక శనివారం తనకి సెలవు రోజున సుధాకర్ తిలక్‌ని కలుస్తానని చెప్పాడు. సరాసరి ఇంటికి వెళ్లాడు. తిలక్‌తో పాటే బ్రేక్‌ఫాస్ట్. అంతా సిల్వర్‌వేర్‌మయం. తరువాత ఫాక్టరీకి బయలుదేరారు.

ఇంటినుండి బయలుదేరుతున్నప్పుడు, మేబాక్‌లో వెనక సీటులో కూర్చున్నాడు తిలక్. సుధాకర్ ముందు సీటులో కూర్చోబోతుంటే, “అక్కడొద్దు, సుధా… ఇక్కడ వెనక సీట్‌కి రా… ఫ్రీగా ఉంటుంది,” అని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు.

ఇక అక్కడ్నుంచి తన జీవితంలో ఆరోహణ గురించి చెప్పడం మొదలయ్యింది. ఒకే ఊళ్ళో వుంటున్నా వాళ్ళిద్దరు కలవడం తక్కువే. తన ఆరోహణలో చిన్ననాటి మిత్రులు ఎలా తనకి దూరమైపొయారో చెప్తూ… వాళ్లలో డబ్బులిస్తే ఎవరు ఎలా తిరిగి ఇవ్వనిది, తాను వాటిని ఎలా అపాత్రదానంగా భావించి వారందరిని దూరంగా వుంచింది చెప్పుకున్నాడు తిలక్. ఆ చెప్పుకునేటప్పుడు అతని కంఠంలో బాధకన్నా వదిలించుకున్నానన్న సంతోషమే వినపడింది సుధాకర్‌కి. అందుకనేనేమో బహుశ తన బాల్య మిత్రులు పెళ్ళిలో కనబడలేదనుకున్నాడు సుధాకర్.

తరువాత తను కొన్న ప్లాట్లు, పెయింటింగ్స్, రేస్ హార్సుల గురించి, వేసవి సెలవులకి యూరప్లో తిరగడానికి పెట్టిన ఖర్చు… అంటే క్లుప్తంగా డబ్బులు ఎలా ఖర్చుపెట్టింది చెప్పుకొచ్చాడు, ఎలా సంపాదించింది కాదు.

ఫాక్టరీకి చేరిన తరువాత దాదాపు ఒక అరగంట తన ఉద్యోగులతో మీటింగులతో సరిపోయింది తిలక్‌కి. ఆ తరువాత ఇద్దరూ బయలుదేరారు. ఫాక్టరీ మొత్తం తిరిగి, తిప్పి చూపించాడు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న సరికొత్త యంత్రాలు, వాటి ఖరీదు, వాటి ఉత్పాదకత, అన్నీ చెప్పాడు, చూపించాడు. వాటి మూలంగా తాను ఎంత లాభం పొందుతున్నది కూడా చెప్పాడు. విదేశీ మారక ద్రవ్యాన్ని తన సంస్థ ఎంత బాగా ఆదా చేస్తున్నదో చెప్పాడు. అయినా ప్రభుత్వం ఎలా తన ముక్కు పిండి టాక్సుల రూపంలో ఎలా నొక్కేస్తుందో కూడా చాలా బాధ పడుతూ చెప్పాడు. మళ్ళీ తిలక్ కాబిన్ దగ్గిరకి చేరేటప్పటికి మధ్యాహ్నం అయ్యింది.

ఈ లోపు ఇంటి నుంచి వచ్చిన లంచ్‌ని ఆ కాబిన్లోనే ఒక పక్కనే ఏర్పాటు చేసిన వర్క్-కం-డైనింగ్ టేబుల్ మీద ఆఫీస్ అసిస్టెంట్ సర్దుతుంటే అటూ ఇటూ దిక్కులు చూస్తున్న సుధాకర్‌కి, తిలక్ పక్కనే ఉన్న సైడ్ టేబుల్ మీదున్న ఒక గాజు శిల్పం కనపడింది. ‘డేవిడ్’ శిల్పం లాగున్నది అది. దాదాపు రెండు అడుగుల ఎత్తుంది. అందమైన స్టాండ్ మీద నిలబెట్టి ఉంది ఆ గాజు శిల్పం. బహుశా ఇత్తడితో చేసిన స్టాండు. రోమన్లు, గ్రీకులే కాకుండా చైనీస్ కూడా తమ కళాకృతులలో పచ్చని చెట్లూ, ఆకులు, లతలను పొదిగి చూపించేవారు. ఆ స్టాండ్ వాటి నుండి స్ఫూర్తి పొంది తయారు చేసినట్టుంది అనుకున్నాడు సుధాకర్. తిలక్ గమనించాడు. ఈ లోపు ఇద్దరి భోజనాలు అయ్యాయి.

ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే తిలక్, “ఇక వెళ్లిరానా?” అని సుధాకర్ అంటుంటే, “ఇందాక నువ్వు మైమరుస్తూ చూసింది, మైఖెల్ ఏంజిలో సృష్టించిన ‘డేవిడ్’. ఇటలీకి వెళ్ళినప్పుడు నా కూతురు కొని తీసుకుని వచ్చి ‘ఫాదర్స్ డే’ రోజున ఇచ్చింది. నేను అదివ్వలేను,” అని అన్నాడు.

నవ్వుతూ “అది కాదు నన్ను ఆకర్షించింది. దాన్ని నిలబెట్టిన స్టాండ్ బాగుంది. చక్కని లతలతో అవి నిజంగా లతలే అని భ్రమింపచేసిన ఆ నాలుగు కాళ్ల బేస్ బాగుంది,” అని అన్నాడు సుధాకర్.

“ఓహ్, అదా! దానికోసం చాలా కష్టపడ్డాను. ఇటలీలోని ఫ్లోరెన్స్ దగ్గిరలోని ఒక గ్రామంలో ఆన్టొనియో అనే కళాకారుడితో డిజైన్ చేయించాను. దానికి మూసని చైనాలో షాంఘైలో తయారు చేయించా. లక్షల్లో ఖర్చు పెట్టాను. అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో సరితూగే నాణ్యత కోసం ఖర్చుకి వెనుకాడలేదు. దేనిలోనైనా నాణ్యతే ప్రధానం! వ్యాపారంలో గాని స్నేహంలో కాని నైతికత, విలువలే ప్రధానం! ఇందాక నేను అన్నట్టు మన మిత్రులకి డబ్బే ప్రధానం! డబ్బు దేముంది కుక్కల్ని కొట్టినా వస్తుంది కాని స్నేహాలు అలా కాదుగా! నేను స్నేహానికి ప్రాణం ఇస్తాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఇబ్బందులలో ఉన్నప్పుడు నువ్వు చేసిన సహాయం మరిచిపోను! నేను మరిచిపోతే మనిషినే కాను.”

సంభాషణని పొడిగిస్తూ “నీకు ఆ స్టాండ్ నచ్చిందని నాకు అర్థం అయ్యింది మిత్రమా! నీకు ఆ స్టాండ్ బహుమతిగా ఇస్తాను. తీసుకెళ్ళు” అంటూ తిలక్ ఫోనందుకుని ఎవరికో చెప్పాడు. “కూర్చో. ఒక పది నిమిషాలలో వస్తుంది,” అంటూ తన ముందున్న ఫైల్స్ లోకి మళ్ళీ తల దూర్చాడు. ఈ లోపు ఫోను తీసి తన పని చేసుకున్నాడు సుధాకర్.

“సార్, ఇదేనా?” అంటూ తను తెచ్చిన స్టాండ్‌ని చూపించాడు ఆకాష్.

“ఆ, ఇదే.”

“అదే, పాక్ చేసేసి త్వరగా తెచ్చెయి. మా సుధాకర్‌కి బాగా నచ్చింది. ఇచ్చేద్దాం” అని నవ్వుతూ అన్నాడు.

“సార్…” అంటూ సందేహంగా మొహం పెట్టాడు ఆకాష్.

నిముషాలలో, బ్రౌన్ కాగితంలో పాక్ చేసి తెచ్చి ఇచ్చాడు. దాన్ని అందుకుని సుధాకర్‌కి రెండు చేతులతో అందజేసాడు తిలక్. “థాంక్స్ తిలక్,” అని అంటున్న సుధాకర్‌ని వారిస్తూ అతని భుజం చుట్టు చెయ్యి వేసి బయటకు తీసుకు వచ్చాడు.

బయట కాబ్ నిలబడిఉంది.

“ఇదేంటి… నువ్వు బుక్ చేసావా?” అని అడిగితే… “ఔను, నువ్వు బిజిగా ఉన్నావుగా… నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను బుక్ చేసుకున్నాను. థాంక్స్ ఫర్ దిస్…” అంటూ కాబ్ బాక్ డోర్ తెరిచి సీట్లో కూర్చుని, ‘బై’ అంటూ చెయ్యి ఊపాడు. కారు ముందుకు కదిలింది.

***

ఇంటికి వెళ్ళిన తరువాత తన స్నేహితుడిచ్చిన బ్రౌన్ పాకెట్లో నుంచి ఆ బ్రాస్ స్టాండ్‌ని బయటకు తీసి తన మంచం పక్కనే ఉన్న సైడ్ టేబుల్ మీద నిలబెట్టాడు. సరిగ్గా నుంచోలేదు. సరిగ్గా నిలబెట్టాడానికి ప్రయత్నిస్తే, చిన్నగా ‘టక్ టక్’ మని చప్పుడు చేసింది. ఆ బేస్‌కి ఉన్న నాలుగు కాళ్లలో ఒకటి పొట్టిగా ఉంది. అందుకే అది ఆ కాలు వైపు ఒరిగినప్పుడల్లా టక టక చప్పుడు చేస్తోంది. ‘ఒక రెండు మిల్లిమీటర్లు ఉంటే సరిపొయ్యేదనుకుంటా!’ అనుకున్నాడు బాల్య స్నేహితుడు.

స్టోర్ రూమ్ అలమారలో వున్న పుట్టి (లప్పం)ని తెచ్చుకుని సరిగ్గా ఆ తగ్గిన కాలుకి సరిపోయ్యెంత మందాన దాన్ని అంటించాడు. కదలకుండా అడ్హెసివ్ టేప్‌తో దాన్ని చుట్టాడు. కాస్త కదిలించాడు. చప్పుడు లేదు.

మరుసటి రోజు ఉదయం లేచి స్టాండ్ కాలుకి రాత్రి అంటించిన టేప్‌ని నెమ్మదిగా తొలగించాడు. ఇప్పుడు బేస్ చక్కగా నిలబడింది ఎటూ ఒరగకుండా. దాని మీద తన కూతురు బహుకరించిన నటరాజు విగ్రహాన్ని నిలబెట్టాడు. చక్కగా నిలబడింది.

దగ్గిర్నుంచి చూశాడు. దూరం నుంచి చూసాడు. ఆ రెండు మిల్లీ మీటర్ల లోపం కనపడలేదు. క్రితం రోజున తిలక్ ఆఫీసులో జరిగిన సంఘటనలు సుధాకర్‌కి గుర్తు వచ్చాయి. నవ్వుకున్నాడు. కాని సుధాకర్‌కి తెలియని విషయం ఒకటుంది. అది అకాష్‌కి, అతని బాస్ తిలక్‌కి మాత్రమే తెలిసిన విషయం. అదేమిటంటే ఆ స్టాండ్ రిజెక్టెడ్ లాట్ లోది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here