ఆశల తోరణాలు

13
5

[dropcap]జీ[/dropcap]వితంలో పెద్ద ఆశయాల్ని శ్రమతో సాధించి
ఎక్కాలనుకున్న ఎత్తులన్నీ ఎక్కి చూపించి
సక్రమంగా, తృప్తిగా బాధ్యతల్ని నిర్వహించి
నేడు చిన్న, చిన్న ఆశలు తీరక బేలలైపోయాం

గాల్లోని శత్రువుని మాస్క్‌తో ఎదుర్కొంటూ
పరిశుభ్రత మంత్రంతో సబ్బు చేతబట్టి
వార్తలు వింటూ, చూస్తూ ఊపిరి బిగబట్టి
తలనిండా నింపుకుంటున్నాం వైరాగ్యం

ఉషోదయపు నడకే దూరమయ్యింది
చల్లని పైరగాలే ప్రమాదకరయ్యింది
నిత్యం చేసే ప్రతికృత్యం కలగా వస్తోంది
ఏ నాటికైనా అవి తీరేనా అనిపిస్తోంది

తోటి మమనుషుల్ని ప్రియంగా పలకరించాలని
సాహిత్య సభల్లో పెద్దల ప్రసంగాలు వినాలని
ఆత్మీయ మిత్రుల్ని ఆలింగనం చేసుకోవాలని
పరిహాసాలాడే నేస్తాలతో పగలబడినవ్వాలని

ఇవన్నీ మనం నిత్యం ఊహిస్తున్న స్వప్నాలే
నెరవేరతాయని నూరుశాతం నమ్ముతున్నవే
ఎదురుతెన్నులై ఆ రోజు కోసం చూస్తున్నవే
జాగ్రత్తల తపస్సులు ప్రతివారూ చేస్తున్నవే

మంచికాలం త్వరలో తలుపు తడుతుందని
మూసినగుమ్మం తోరణాలతో మౌనంగా నిలబడింది
నేడు ప్రపంచ జనావళి ఆర్తీ, ప్రార్థనా ఒకటే
అదే…లోకాస్సమస్తా ఆరోగ్య భద్రాభవన్తు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here