ఆశ్చర్యాల ఆస్కార్లు

0
9

[dropcap]94 [/dropcap]ఏళ్ళుగా సినిమాలకు అత్యున్నత పురస్కారాలుగా వెలుగొందుతున్నాయి ఆస్కార్లు. విమర్శలు ఎదురైనా ఆస్కార్ల ప్ర్రాభవం తగ్గలేదు. కాలపరీక్షకు నిలిచే చిత్రాలను గుర్తించటంలో ఆస్కార్ సంస్థ మెప్పుటడుగులకన్నా తప్పటడుగులే ఎక్కువ వేసిందని చాలామంది అంటారు. అప్పటికి ఏది బావుందనిపిస్తే దానికే పట్టం కడతారని, తర్వాత నాలుక కరుచుకుని ఆ తప్పుని సరిదిద్దుకోవటానికి ఇంకా తప్పులు చేస్తారని అంటారు. కళాకారుల ప్రతిభను బట్టి కాక నిజజీవితంలో వారి ప్రవర్తనని బట్టి ఒక్కోసారి ఓట్లు వేస్తారు. సినిమా విపరీతంగా నచ్చితే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న వారిని కూడా అందలం ఎక్కిస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవలసిందేమిటంటే 9000 మందికి పైగా సభ్యులున్న సంస్థలో అందరూ ఒకేలా ఆలోచించరు. అధికులు ఓట్లు వేసిన వారికే అవార్డులు వస్తాయి.

2009లో ‘ద డార్క్ నైట్’ చిత్రం ఎన్నో ప్రశంసలను అందుకున్నా ఆ చిత్రానికి ఉత్తమ చిత్రం నామినేషన్ ఇవ్వలేదని ఆస్కార్ సంస్థపై విమర్శలు వచ్చాయి. బ్యాట్ మ్యాన్ లాంటి కామిక్ బుక్ పాత్ర ఉండటంవలనే ఆ చిత్రాన్ని పక్కన పెట్టారనేది విమర్శ. దాంతో 2010 నుంచి ఉత్తమ చిత్రానికి ఐదు నామినేషన్లు కాక పది నామినేషన్లు ఇవ్వటం మొదలుపెట్టారు. మిగతా విభాగాల్లో ఐదే కొనసాగుతున్నాయి. 2018లో ‘బ్లాక్ ప్యాంథర్’ అనే కామిక్ బుక్ చిత్రం నామినేషన్ అందుకుని చరిత్ర సృష్టించింది. 2015లో నామినేట్ అయిన 20 మంది నటీనటులు అందరూ శ్వేతజాతీయులే అవటంతో మళ్ళీ విమర్శలు వచ్చాయి. దాంతో జాతివివక్ష ఉండకూడదని ప్రపంచం నలుమూలల నుంచి సభ్యులను చేర్చుకున్నారు. 2015 లో 6000 ఉన్న సుభ్యుల సంఖ్య 2020కి 9000కి చేరింది. దీని పర్యవసానంగా 2019కి గాను కొరియన్ చిత్రం ‘ప్యారసైట్’ ఉత్తమ చిత్రం అవార్డు అందుకున్న మొదటి పూర్తి ఆంగ్లేతర చిత్రం అయింది.

ఈసారి ఆస్కార్లు ఏయే చిత్రాలకు రావచ్చో, ఆయా విభాగాల్లో గతంలో ఆశ్చర్యపరచిన అవార్డులు కొన్ని ఇప్పుడు చూద్దాం.

ఉత్తమ సహాయ నటుడు

1920లలో జరిగిన కథగా రూపొందించిన ‘ద పవర్ ఆఫ్ ద డాగ్’ చిత్రంలో నటించిన కోడీ స్మిట్ మెక్ఫీని విమర్శకులు ప్రశంసలతో ముంచెత్తారు. విధవరాలైన తల్లి మీద అమితమైన ప్రేమగల నెమ్మదస్తుడైన కొడుకు పాత్ర ఇది. కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. తల్లి రెండో పెళ్ళి చేసుకుంటుంది. ఆమె బావగారికి ఆమె మీద ద్వేషం. అతని మానసిక హింసని భరించలేక తాగుడుకి బానిస అవుతుంది. ఆమె కొడుకు సెలవులకి ఆమె ఇంటికి వస్తాడు. తల్లి వేదనని చూస్తాడు. పెదనాన్న రహస్యాలు తెలుసుకుంటాడు. అతనికి దగ్గరయ్యి అతన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు. ఇలా ఇద్దరి మధ్య నలిగిపోతుంటాడు. చివరికి కథ అనుకోని ముగింపుకి చేరుతుంది. కర్కశత్వం అంటే ఎలా ఉంటుందో ఊహకు అందని రీతిగా ప్రస్ఫుటమౌతుంది. జరిగిన కథ, సంఘటనలు మననం చేసుకుంటే దర్శకురాలు ఎంత అద్భుతంగా కథని నడిపించిందో అర్థమౌతుంది. 25 ఏళ్ళ కోడీ నటనలో చూపించిన సమతౌల్యం అబ్బురపరుస్తుంది.

‘కోడా’ చిత్రం బధిరుల బిడ్డ అయిన రూబీ అనే అమ్మాయి కథ. ఆమె అన్నయ్య కూడా బధిరుడే. రూబీ మాత్రం వినగలదు, మాట్లాడగలదు. ఇంటర్ చదువుతూ ఉంటుంది. పాటలు పాడటం అంటే ఇష్టం. తండ్రి, అన్నయ్య మత్స్యకారులు. చేపలు సేకరించే సంస్థ కొత్త ఆంక్షలు, రుసుములు ప్రవేశపెట్టటంతో తండ్రి తిరగబడి తాను సొంతంగా చేపలు అమ్ముకుంటానని, తనతో వచ్చేవారు రావచ్చని అంటాడు. ఇలా కష్టాలు పడుతూన్న వారికి రూబీ చేదోడుగా ఉంటుంది. కాలేజీలో సంగీత సాధనకు ఇది అడ్డుపడుతుంది. సంగీత కళాశాలకు వెళ్ళాలా, బధిరులైన తన కుటుంబానికి తోడుగా ఉండాలా అనేది ఆమె ముందున్న ప్రశ్న. తండ్రిగా నటించిన ట్రాయ్ కోట్సర్‌కి సినీపరిశ్రమ పలు అవార్డులిచ్చి సత్కరించింది. అతను నిజజీవితంలో కూడా బధిరుడే. ధైర్యం, ప్రేమ చూపించే పాత్రలో అతని నటన అందర్నీ ఆకట్టుకుంది.

పోటీ వీరిద్దరి మధ్యే ఉంది. అయితే కోడీ వయసు తక్కువ కావటంతో అతను భవిష్యత్తులో ఇంకా మంచి పాత్రలు చేసి అవార్డులు గెలుచుకుంటాడని భావించి ట్రాయ్‌కి అవార్డు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 2015లో సిల్వెస్టర్ స్టాలోన్ 69 ఏళ్ళ వయసులో ‘క్రీడ్’ చిత్రానికి సహాయ నటుడిగా నామినేషన్ దక్కించుకున్నాడు. సినీపరిశ్రమ ఇచ్చిన అవార్డులు కూడా అందుకున్నాడు. అయినా ఆస్కార్ దక్కలేదు. నలభై ఏళ్ళ క్రితం స్టాలోన్ యాక్షన్ చిత్రాలలో నటించి ప్రపంచ ప్రఖ్యాతి సాధించాడు. ఎంతో సంపాదించాడు. నటన కంటే అతనికి కండపుష్టే ఎక్కువ అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అలాంటి వ్యక్తి కన్నా ఎన్నో నాటకాల్లో నటించి మంచి నటుడిగా పేరున్న 56 ఏళ్ళ మార్క్ రైలాన్స్ (‘బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్’) కి అవార్డు ఇచ్చారు. అతను సినిమాల్లో నటించటం అరుదు. మళ్ళీ అతనికి ఆస్కార్ నామినేషన్ వస్తుందో రాదో తెలియదు. వయసు మీద పడ్డ స్టాలోన్‌దీ అదే పరిస్థితి. అయినా స్టాలోన్‌కి నామినేషన్ ఇవ్వటమే అతనికిచ్చే గౌరవంగా భావించి రైలాన్స్‌కి అవార్డు ఇచ్చారు. అలాగే ట్రాయ్ కోట్సర్ కి మళ్ళీ ఆస్కార్ ఇచ్చే అవకాశం రాకపోవచ్చు. అందుకనే అతనికి అవార్డు వస్తుందని అనిపిస్తోంది.

అంచనా:

విజేత – ట్రాయ్ కోట్సర్ (‘కోడా’)

గెలిచే అవకాశం ఉన్నవారు – కోడీ స్మిట్ మెక్ఫీ (‘ద పవర్ ఆఫ్ ద డాగ్’)

ఉత్తమ సహాయ నటి

ఈ విభాగం గురించి రాయటానికి ఎంతో అలోచించాల్సివచ్చింది. స్టీవెన్ స్పీల్బెర్గ్ రూపొందించిన ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ లో నటించిన ఆరియానా డిబోస్ కి సినీపరిశ్రమ నుంచి ఎన్నో అవార్డులు దక్కాయి. పొర్టో రీకో నుంచి ఎన్నో ఆశలతో అమెరికా వచ్చిన అమ్మాయి పాత్రలో నటించింది ఆమె. జాతివివక్షను ఎదుర్కుంటున్నా ఆమెలో భవిష్యత్తు మీద ఆశ ఉంటుంది. పోర్టో రీకో వాడైన తన ప్రియుడికి అమెరికన్లంటే ద్వేషం. అతనితో వాదిస్తుంది. ఈ నేపథ్యంలో న్యూ యార్క్ వీధుల్లో ఒక పాట ఉంటుంది. ఇందులో ఆరియానా నృత్యం అద్భుతంగా ఉంటుంది. కథ అనేక మలుపులు తిరిగి ఆరియానాలో నిర్వేదం కలిగిస్తుంది. ఆమె ఆశలన్నీ ఛిన్నాభిన్నమౌతాయి. ఇలా ఎన్నో భావోద్వేగాలకు గురయ్యే పాత్ర ఇది. 1961 వచ్చిన ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ కి రీమేక్ ఈ చిత్రం. ఆరియానా నటించిన పాత్రలో అప్పుడు నటించిన రీటా మొరెనోకి ఆస్కార్ వచ్చింది.

2001 లో ఆరియానా లాగే యువనటి కేట్ హడ్సన్ ‘అల్మోస్ట్ ఫేమస్’ చిత్రంలోని పాత్రకి ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఆరియానా లాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కూడా వచ్చింది. ఒక ప్రముఖ గాయకుడి మాయలో పడి అతను ప్రదర్శనల కోసం ఎక్కడికి వెళ్తీ అక్కడికి వెళ్ళే గ్రూపీ పాత్ర ఇది. కానీ కేట్ కి ఆస్కార్ దక్కలేదు. మార్షియా గే హార్డెన్ కి ఆస్కార్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది ఆస్కార్ సంస్థ. ‘పోలాక్’ చిత్రంలో ప్రముఖ చిత్రకారుడు జాక్సన్ పోలాక్ భార్యగా నటించింది మార్షియా. పిల్లలు వద్దనుకుంటుంది ఆమె. భర్త తాగుడుకి బానిసై ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటాడు. అయినా అతన్ని అంటిపెట్టుకుని ఎన్నో బాధలు అనుభవిస్తుంది. అతని కళకి తగిన గుర్తింపు రాకపోయినా అతని ప్రతిభ మీద ఆమెకి నమ్మకం.

ఇలాంటి పాత్రే ఈసారి ‘కింగ్ రిచర్డ్’లో ఉంది. వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్ తల్లి పాత్ర ఇది. ఆర్థికంగా పరిస్థితులు బాగాలేకపోయినా తన భర్తతో పాటు వీనస్, సెరీనాల టెన్నిస్ సాధనలో ఎంతో సహకారం అందిస్తుంది. అవసరమైతే భర్తతో విభేదిస్తుంది. ఈ పాత్రని ఆంజెనూ ఎలిస్ పోషించింది. వీనస్, సెరీనా మ్యాచ్ లు టీవీలో చూసిన వారికి వారి తల్లిని ప్రేక్షకుల్లో చూడటం గుర్తు ఉండే ఉంటుంది. “ఆంజెనూ మా అమ్మ లాగే అనిపించింది. భయమేసింది కూడా” అంది సెరీనా. ఆంజెనూకి ఆస్కార్ వస్తుందని నా అంచనా.

అంచనా:

విజేత: ఆంజెనూ ఎలిస్ (‘కింగ్ రిచర్డ్’)

గెలిచే అవకాశం ఉన్నవారు: ఆరియానా డిబోస్ (‘వెస్ట్ సైడ్ స్టోరీ’)

ఉత్తమ నటుడు

ఈ అవార్డు విల్ స్మిత్‌దే. ఇప్పటికే ‘కింగ్ రిచర్డ్’ లోని పాత్రకి ఎన్నో అవార్డులు అందుకున్నాడు అతను. కష్టాలు ఎదుర్కొంటూ వీనస్, సెరెనాలను ఉత్తమ టెన్నిస్ క్రీడాకారిణులుగా తీర్చిదిద్దిన రిచర్డ్ విలియమ్స్ పాత్రలో అతను ఒదిగిపోయాడు. గతం లో రెండు సార్లు నామినేషన్లు అందుకున్నా అవార్డు దక్కలేదు. ఈసారి అవార్డు ఖాయం.

ఆస్కార్ చరిత్రలో అనుభవం లేని నటులకి అవార్డు ఇవ్వటమూ ఉంది, తల పండిపోయిన వారికి ఇవ్వటమూ ఉంది. ప్రతిభే ఇక్కడ కొలమానం. ప్రస్తుత చిత్రంలో పాత్రకు ఎంత న్యాయం చేశారనేదే ప్రాతిపదిక. 2003 లో డానియల్ డే లూయిస్ (‘ద గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్’) గెలుస్తాడని అందరూ అనుకుంటే 29 ఏళ్ళ ఏడ్రియన్ బ్రోడీ గెలిచాడు. ‘ద పియనిస్ట్’ చిత్రంలో రెండో ప్రపంచ యుద్ధసమయంలో హిట్లర్ సైన్యం నుంచి తప్పించుకున్న యూదు పియానో కళాకారుడిగా నటించి ఆస్కార్ చరిత్ర లోనే అతి పిన్న వయస్కుడైన ఉత్తమ నటుడిగా నిలిచాడు.

గత సంవత్సరం దీనికి విరుద్ధంగా జరిగింది. పోటీ ఆంథొనీ హాప్కిన్స్, చాడ్విక్ బోస్మన్ మధ్య నెలకొంది. ఆంథొనీ ‘ద ఫాదర్’ చిత్రంలో డిమెన్షియా (మనుషుల్ని గుర్తుపట్టలేక పోవటం వంటి లక్షణాలున్న వ్యాధి) బారిన పడ్డ తండ్రిగా నటించాడు. చాడ్విక్ ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’లో 1920లలో ఒక ట్రంపెట్ ప్లేయర్ గా నటించాడు. దేవుడుంటే నల్లజాతివారిపై కనికరం చూపించేవాడని ధిక్కారంగా మాట్లాడే పాత్ర అది. 2020లో 43 ఏళ్ళ వయసులో క్యాన్సర్‌తో మరణించాడు చాడ్విక్. మరణానంతరం ఆస్కార్లు రావటం గతంలో జరిగింది. ఆస్కార్ నిర్వాహకులు చాడ్విక్ కి అవార్డు వస్తుందనుకుని ప్రదానోత్సవంలో ఇదే చివరి అవార్డుగా ఏర్పాటు చేశారు. మామూలుగా ఉత్తమ చిత్రం చివరి అవార్డుగా ఇస్తారు. కానీ ఈ సందర్భంలో మార్చారు. అయితే అవార్డు మాత్రం 83 ఏళ్ళ ఆంథొనీకి దక్కింది. ‘ద ఫాదర్’లో తనకి అయోమయం ఎందుకు కలుగుతోందో అర్థం చేసుకోవటానికి చిత్రం పొడుగునా ప్రయత్నించి అలసిపోయిన చివరి సన్నివేశం గుండెని పిండేసేలా ఉంటుంది. ఇంతకు ముందొకసారి ఆస్కార్ వచ్చినా అంత పెద్ద వయసులో అతను కనపరచిన నటనకి పట్టం కట్టారు ఆస్కార్ సంస్థ సభ్యులు.

ఈసారి పోటీలో ఉన్న నటులలో విల్ స్మిత్ ది నటనకు ఎంతో ఆస్కారం ఉన్న పాత్ర. నిజజీవితంలో ధీరుడైన వ్యక్తి పాత్ర. వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్ స్వయంగా నిర్మించిన చిత్రంలో వారి తండ్రి పాత్ర. ఇది ఆ పాత్రకి ఒక ప్రామణికతని చేకూర్చింది. దీనికి విల్ స్మిత్ ప్రతిభ తోడైంది. ఇవన్నీ కలిసి అతన్ని అవార్డు ముంగిట నిలిపాయి.

అంచనా:

విజేత: విల్ స్మిత్ (‘కింగ్ రిచర్డ్’)

గెలిచే (అతితక్కువ) అవకాశం ఉన్నవారు: బెనెడిక్ట్ కంబర్బ్యాచ్ (‘ద పవర్ ఆఫ్ ద డాగ్’)

ఉత్తమ నటి

ఇది అతి క్లిష్టమైన విభాగం. ఒక క్రైస్తవ మతప్రబోధకురాలి పాత్రలో జెసికా చాస్టెయిన్ (‘ది ఐస్ ఆఫ్ ట్యామీ ఫే’), గతంలో చేసిన తప్పుల విషయంలో తర్జనభర్జన పడే తల్లి పాత్రలో ఒలివియా కోల్మన్ (‘ద లాస్ట్ డాటర్’), వేరొకరి బిడ్డకు తల్లిగా ఉండాల్సిన మహిళ పాత్రలో పెనెలపీ క్రుజ్ (‘ప్యారలెల్ మదర్స్’), ప్రముఖ నటి లూసీల్ బాల్ పాత్రలో నికోల్ కిడ్మన్ (‘బీయింగ్ ద రికార్డోస్’), బ్రిటన్ యువరాణి డయానా పాత్రలో క్రిస్టెన్ స్టువర్ట్ (‘స్పెన్సర్’) నామినేట్ అయ్యారు.

జెసికా గత దశాబ్దంగా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఒకసారి ఉత్తమ సహాయ విభాగంలో, ఒకసారి ఉత్తమ నటి విభాగంలో నామినేషన్లు వచ్చాయి. కానీ ఇంతవరకూ అవార్డు రాలేదు. ఈసారి మనసున్న ఒక మతప్రబోధకురాలి పాత్ర పోషించింది. టీవీలో క్రైస్తవ మత ప్రచారం చేస్తూ ఎందరికో సహాయం చేసిన ట్యామీ ఫే నిజజీవిత కథ ఇది. ట్యామీ తల్లికి మతంపై పెద్ద విశ్వాసం ఉండదు. ఎయిడ్స్ వ్యాధి వ్యాపించిన తొలినాళ్ళలో ట్యామీ ఎయిడ్స్ రోగులకి అండగా నిలిచింది. ఇది మితవాదులకు నచ్చదు. దీనికి తోడు ఆమె భర్త విలాసాలకు అలవాటు పడతాడు. మతం పై విశ్వాసం, రాజకీయం, కుటుంబం – వీటి మధ్య సతమతమవుతుంది. అయినా ఆమెలోని మానవత్వం తగ్గదు. ఆ మానవత్వానికి తన నటనతో ప్రాణం పోసింది జెసికా.

ఒలివియా కోల్మన్ 2018కి గాను ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకుంది. ఈసారి నడివయసు ప్రొఫెసర్ పాత్ర పోషించింది. తను యువతిగా ఉన్నపుడు ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను చూసుకోలేక ఇబ్బంది పడుతూ ఉండేది. భర్త మంచివాడే అయినా అతని ఉద్యోగం అతనికి ముఖ్యం. నీ బాధ్యత లేదా అని భర్తతో గొడవపడేది. ఇప్పుడు సెలవుల కోసం ఒక్కతే గ్రీస్‌కి వెళ్ళినపుడు అక్కడ ఒక కుటుంబం తారసపడుతుంది. అందులో ఒక యువతి, ఆమె కూతురు ఉంటారు. కూతుర్ని ఎంతో ముద్దుచేస్తుంది. అయితే కూతుర్ని కనిపెట్టుకుని ఉండలేక అలసిపోతున్నానని అంటుంది. ప్రొఫెసర్‌కి తన గతం గుర్తు వస్తుంది. గతంలో చేసిన తప్పులు ఇప్పటికీ ఆమెని బాధిస్తూ ఉంటాయి. ఒక పక్క ఈర్ష్య కూడా ఉంటుంది. పిల్లలని చూసుకోవటం ప్రకృతి తల్లులకి ఇచ్చిన బాధ్యత. దాన్ని సరిగా చేయలేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం. మానసిక సంఘర్షణ పడే పాత్రలో ఒలివియా అద్భుతంగా నటించింది.

పెనెలపీ క్రుజ్ గతంలో ‘వికీ క్రిస్టీనా బార్సెలోనా’ అనే ఆంగ్ల చిత్రానికి ఉత్తమ సహాయనటిగా ఆస్కార్ అందుకుంది. ఈసారి స్పానిష్ చిత్రం ‘ప్యారలల్ మదర్స్’కి గాను నామినేట్ అయింది. ఆంగ్లేతర భాషా చిత్రాలలోని నటులకు నామినేషన్ రావటం ఈమధ్య కాలంలో పెరిగింది. ఈ చిత్రంలో వేరొకరి బిడ్డకు తల్లిగా ఉండాల్సిన పాత్రలో నటించింది పెనెలపీ. గర్భవతిగా ఉన్నప్పుడు ఆసుపత్రిలో ఇంకో గర్భవతి పరిచయమౌతుంది. ఇద్దరూ ఒకే గదిలో ఉంటారు. ప్రసవం అయిన కొన్నాళ్ళకి వైద్య పరీక్షలలో బిడ్డ తల్లిని తాను కాదని తెలుస్తుంది. ఆసుపత్రిలో తన గదిలో ఉన్న ఆమె బిడ్డను తనకిచ్చారని అనుమానం వస్తుంది. కొన్నాళ్ళకి ఆ రెండో ఆమె వద్ద ఉన్న బిడ్డ మరణించిందని తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ఈమె ఏం చేసిందనేది కథ. వింత పరిస్థితిలో చిక్కుకున్న మహిళ పాత్రలో పెనెలపీ నటన ప్రశంసలందుకుంది.

‘బీయింగ్ ద రికార్డోస్’ కథ ఆస్కార్ నామినేషన్ల వ్యాసంలో చెప్పుకున్నాం. ప్రముఖ టీవీ నటి లూసీల్ బాల్ పాత్రలో నికోల్ కిడ్మన్ నటించింది. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఈమెకు గతంలో ఉత్తమ నటి అవార్డు వచ్చింది.

బ్రిటన్ యువరాణి డయానా కథ ‘స్పెన్సర్’లో డయానా పాత్ర పోషించింది క్రిస్టెన్ స్టువర్ట్. డయానా పెళ్ళికి ముందున్న ఇంటి పేరు ‘స్పెన్సర్’. యువరాజుని పెళ్ళాడి రాజకుటుంబంలో ప్రవేశించిన ఆమె అనేక ఒడిదుడుకులని ఎదుర్కొంటుంది. రాజభవనంలో ఎన్నో కట్టుదిట్టాలు. కమీలా పార్కర్ బౌల్స్ (పస్తుతం ఈమే బ్రిటన్ యువరాణి) అనే స్త్రీ తో తన భర్తకు సంబంధముందని తెలుస్తుంది. పిల్లలను ఎలా పెంచాలో నిర్ణయించుకునే అధికారం ఆమెకు ఉండదు. జనానికి మాత్రం అంతా బావున్నట్టు ప్రదర్శన ఇవ్వాలి. దీంతో డయానా మానసికంగా కుంగిపోతుంది. కారు ప్రమాదంలో డయానా మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రమాదం వరకు కథ ఉండదు. రాజకుటుంబంలో ఇమడలేక ఆమె ఎలా నలిగిపోయిందో చూపించారు. ఈ పాత్రలో క్రిస్టెన్ హుందాతనం, దిగులు చూపించటంలో కృతకృత్యురాలైంది.

2002లో సిసీ స్పేసెక్ (‘ఇన్ ద బెడ్రూమ్’) కి ఆస్కార్ వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే నటీనటుల సంఘమైన స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ హ్యాలీ బెరీ (‘మాన్స్టర్స్ బాల్’) కి అవార్డు ఇచ్చింది. తన భర్త ఉరితీతని పర్యవేక్షించిన జైలు అధికారితో తెలియకుండా ప్రేమలో పడిన స్త్రీ పాత్ర అది. ఆమె నల్లజాతి స్త్రీ అయితే అతను తెల్లజాతివాడు. అతను ఆమెపై సానుభూతి చూపిస్తూ ఆమెకు చేరువౌతాడు. ఆమెకి నిజం తెలిస్తే ఎలా ఉంటుందో అనే ఉత్కంఠతో కథ నడుస్తుంది. చివరి సన్నివేశంలో హ్యాలీ నటన ఆమె పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. దరిమిలా ఆస్కార్ అవార్డుని కట్టబెట్టింది.

ఈసారి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు జెసికాకి వచ్చింది. ఆమెకే ఆస్కార్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎన్నో చిత్రాలలో మంచి పాత్రలు చేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా ఇంతవరకు ఆస్కార్ రాలేదు. ఆమెకి అవార్డు ఇచ్చే సమయం వచ్చిందని చాలామంది ఆస్కార్ సంస్థ సభ్యులు భావిస్తున్నారనేది కాదనలేని నిజం. చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే పైన విజేతలుగా అంచనా వేసిన వారిలో ఆంజెనూకి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు రాలేదు (ఆరియానాకి వచ్చింది). ఆ ఒక్క అవార్డే కాక ఇతర విషయాలు కూడా పరిగణనలోకి తీసుకోవటం జరిగింది.

అంచనా:

విజేత: జెసికా చాస్టెయిన్ (‘ది ఐస్ ఆఫ్ ట్యామీ ఫే’)

గెలిచే అవకాశం ఉన్నవారు: క్రిస్టెన్ స్టువర్ట్ (‘స్పెన్సర్’)

ఉత్తమ దర్శకత్వం

‘ద పవర్ ఆఫ్ ద డాగ్’ చిత్రదర్శకురాలు జేన్ క్యాంపియన్ కి ఈ అవార్డు ఖాయం. అమె దర్శకత్వం గురించి పైన ఉత్తమ సహాయ నటుడి గురించి ఇచ్చిన వివరణలో ప్రస్తావించటం జరిగింది. ఆమే స్క్రీన్ ప్లే కూడా రాసింది. చక్కని ఛాయాగ్రహణం, సంగీతం సమకూర్చుకుని చిత్రాన్ని మలచింది. చిత్రపరిశ్రమ ఇచ్చే దాదాపు అన్ని అవార్డులూ ఆమెకే వచ్చాయి. ఈ అవార్డు ఇనెవిటబుల్ అయిపోయింది.

2020లో ఇలాగే ఇనెవిటబుల్ అనుకున్న అవార్డు తారుమారైంది. అయితే అప్పటి పరిస్థితులు వేరు. ‘1917’ చిత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. శామ్ మెండెస్ కి ఉత్తమ దర్శకుడిగా దాదాపు అన్ని అవార్డులు వచ్చాయి. ఆస్కార్ కూడా అతనికే వస్తుందని అనుకున్నారు. ఈలోగా కొరియన్ చిత్రం ‘ప్యారసైట్’ పుంజుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. నేనైతే ‘ప్యారసైట్’కి ఉత్తమ చిత్రం ఆస్కార్ వస్తుందని ఊహించాను గానీ ఉత్తమ దర్శకత్వం అవార్డు శామ్ మెండెస్ కి వస్తుందనుకున్నాను. అనూహ్యంగా ఆ అవార్డు ‘ప్యారసైట్’ దర్శకుడు బాంగ్ జూన్-హోకి వచ్చింది. అయితే ఈసారి ఆ పరిస్థితి లేదు. ‘కోడా’ కొంత ఆలస్యంగా పుంజుకున్నా ఆ చిత్రానికి ఉత్తమ దర్శకత్వం నామినేషన్ రాలేదు. ఈసారి అవార్డు జేన్ దే.

అంచనా:

విజేత: జేన్ క్యాంపియన్ (‘ద పవర్ ఆఫ్ ద డాగ్’)

గెలిచే (అతితక్కువ) అవకాశం ఉన్నవారు: కెన్నెత్ బ్రానా (‘బెల్ ఫాస్ట్’)

ఉత్తమ చిత్రం

దర్శకుల మండలి డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా ఉత్తమ దర్శకత్వం అవార్డ్ ‘ద పవర్ ఆఫ్ ద డాగ్’ దర్శకురాలు జేన్ క్యాంపియన్ కి ఇచ్చింది. బ్రిటిష్ సంస్థ బాఫ్టా ఉత్తమ చిత్రం అవార్డ్ ఆ చిత్రానికే ఇచ్చింది. నటీనటులకి మాత్రమే అవార్డులు ఇచ్చే స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సంస్థ సమిష్టి నటన (Ensemble) కు ఒక అవార్డు ఇస్తుంది. అంటే ఒక చిత్రంలో నటీనటులందరూ కలిసి బాగా నటించారని వారందరికి కలిపి ఇచ్చే అవార్డు. ఆ అవార్డు ‘కోడా’కి వచ్చింది. అలాగే నిర్మాతల మండలి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా కూడా ‘కోడా’కి ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చింది. ఆలస్యంగా పుంజుకున్న ‘కోడా’ చిత్రానికి ఉత్తమ చిత్రం ఆస్కార్ రావచ్చు. అయితే ఇక్కడో మెలిక ఉంది. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో ‘కోడా’, ‘ద పవర్ ఆఫ్ ద డాగ్’ పోటీ పడుతున్నాయి. ఆస్కార్లలో స్క్రీన్ ప్లే అవార్డ్ కూడా ప్రాముఖ్యం ఉన్న అవార్డే. మంచి రచనే మంచి సినిమాకి మూలమని నమ్ముతారు. స్క్రీన్ ప్లే అవార్డు ‘కోడా’కి వస్తే చివర్లో ఇచ్చే ఉత్తమ చిత్రం అవార్డు రాకపోవచ్చు. ఒక మంచి చిత్రానికి స్క్రీన్ ప్లే లాంటి ప్రముఖమైన అవార్డుకి ఓటు వేశాం కాబట్టి బాధ్యత తీరిపోయిందని సభ్యులు అనుకోవచ్చు. అప్పుడు ‘ద పవర్ ఆఫ్ ద డాగ్’ కి ఉత్తమ చిత్రం రావచ్చు.

2006లో సినీ పరిశ్రమ ఇచ్చిన ఎన్నో అవార్డులు అందుకున్న ‘బ్రోక్ బ్యాక్ మౌంటెన్’ చిత్రానికి ఉత్తమ చిత్రం ఆస్కార్ వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ‘క్రాష్’ చిత్రానికి వచ్చింది. దీని పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ‘క్రాష్’ చిత్రానికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ఇచ్చిన సమిష్టి నటన అవార్డ్ అంతకు ముందు వచ్చింది. ‘బ్రోక్ బ్యాక్ మౌంటెన్’ దర్శకుడు ఆంగ్ లీ కి ఉత్తమ దర్శకుడి ఆస్కార్ వచ్చింది. అంత ప్రముఖమైన అవార్డ్ ఇచ్చాం కాబట్టి బాధ్యత తీరిపోయిందని అనుకున్నట్టు అనిపించింది. అసలు విషయం ఏమిటంటే ‘బ్రోక్ బ్యాక్ మౌంటెన్’ ఇద్దరు పురుషుల ప్రేమ కథ. ఆ కథాంశం నచ్చక చాలామంది సభ్యులు ఆ చిత్రానికి ఓటు వేయలేదు. దర్శకుడికి మాత్రం ఓటు వేశారు.

‘కోడా’కి దర్శకత్వం నామినేషన్ రాలేదు. స్క్రీన్ ప్లే అవార్డ్ వస్తే ఇక ఉత్తమ చిత్రం అవార్డ్ ఇవ్వకపోవచ్చు, ఉత్తమ చిత్రం ‘ద పవర్ ఆఫ్ ద డాగ్’ కి రావచ్చు. ఈ రెండూ ఓటీటీ చిత్రాలే కావటం విశేషం. ‘కోడా’ యాపిల్ టీవీ లో, ‘ద పవర్ ఆఫ్ ద డాగ్’ నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు. ఇంతవరకూ ఓటీటీ చిత్రానికి ఉత్తమ చిత్రం ఆస్కార్ రాలేదు. ఈసారి ఏదో ఒక ఓటీటీ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలవటం దాదాపు ఖాయం.

అంచనా:

విజేత: ‘కోడా’ కి స్క్రీన్ ప్లే అవార్డ్ వస్తే ‘ద పవర్ ఆఫ్ ద డాగ్’, లేకపోతే ‘కోడా’

చివరిగా ఒక మాట. ఇవన్నీ సినిమా ప్రియుడిగా నా అంచనాలు మాత్రమే. 9000 వేల మంది సభ్యులలో అధికులకు ఏమి నచ్చుతాయో చెప్పటం కష్టమే. ఇంకా చాలా విభాగాలు ఉన్నాయి (ఉదాహరణకి ఛాయాగ్రహణం, సంగీతం, కళాదర్శకత్వం). వాటికి నేను అంచనాలు వేయకపోవటం వాటి ప్రాధాన్యతను తగ్గించటం ఎంతమాత్రమూ కాదు.

భారత కాలమానం ప్రకారం మార్చి 28, 2022 ఉదయం 5:30 కు ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం మొదలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here