ఆశల విహంగం

0
10

[dropcap]ఎ[/dropcap]దిగే పైరు, కన్నుల ముందు కూతురు ఒక్కటే అంటారు పెద్దలు.

అది నిజమే అనేలా గారాబంగా పెంచుకున్న రామయ్య కూతురు అప్పుడే ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

“ఏం రామయ్యా కూతురు పెళ్ళీడుకు వచ్చింది. సంబంధాలు చూస్తున్నావా?” అని ఇరుగుపొరుగు వారు అడిగే మాటలు గుర్తు చేసుకుంటూ… ఈ సంవత్సరం పంట బాగా పండితే, తన కూతురు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

త్వరగా చేతికి వచ్చే కూరగాయలు సాగు, లాభసాటిగా ఉంటుంది అనుకోవడంలో మనసులో, తనకున్న రెండెకరాల్లో టమాటా పంట సాగు చేసేందుకు సిద్ధమయ్యాడు

వేకువ జామునే ఎద్దుల బండి కట్టుకొని నారు కోసం ప్రయాణమై.. తన వైపు విచిత్రంగా చూస్తున్న భార్య లక్ష్మితో –

“ఏమోయ్ శ్రీమతీ, నేను టమాటా నారు తేవడానికి బయలుదేరుతున్నాను. రాత్రి బీరువాలో డబ్బు ఉంచాను, పట్టుకురా త్వరగా” అంటూనే ఎద్దులను బండికి కట్టి, ‘ఇంకా అక్కడే ఉన్నావే’ అనేలా భార్య వైపు చూసాడు రామయ్య.

“మీకు ఎప్పుడూ తొందరే. పరగడుపున ప్రయాణం, కాస్త ఈ జొన్న రొట్టె తిని వెళ్ళండి. మరల వచ్చేటప్పటికి ఎంత సమయం పడుతుందో ఏమో?” అన్నది లక్ష్మి.

“సరేలే! సుశీల ఎక్కడికి వెళ్ళింది?”

“కాలేజీ ఎగ్జామ్స్ అంటా, గదిలో చదువుకుంటూ కూర్చుంది.”

“ఈ సంవత్సరం కుదిరితే దానికి పెళ్ళి చేద్దాం.”

“ఏం చేద్దామో ఏమో..? ఈ పంటలు ఎప్పుడు సరిగా పండవు. పండిన తగిన రేటుండదు. పదేళ్ల నుంచి ఇదే కరువుతో అల్లాడుతున్నాం, కరువు శనిలా దాపురించింది. మంచి రోజుల కోసం ఎన్నాళ్ళు ఎదురు చూడాలో ఏమో? ..అర్థం కావడం లేదు” అన్నది లక్ష్మి.

“కరువు వచ్చిందని వ్యవసాయం మానుకుంటామా, ఏదో ఒక పంటితో నెట్టుకు రావడమే” అనేసి భార్య అందించిన డబ్బులు తీసుకుని పట్నంలో నారు కొని తేవడానికి బయల్దేరినాడు రామయ్య.

***

అన్నీ అనుకున్నట్లుగా సాగిపోతే జీవితంలో అనుభవాలకు స్థానం ఎక్కడ ఉంటుంది.

రెండు ఎకరాలకు సరిపడా నారు తీసుకొని వచ్చిన రామయ్య సహనాన్ని పరీక్షించాలనుకుందేమో, బోరు మోటార్ మోరాయించింది. పట్నం నుండి వచ్చిన మెకానిక్ గంటలో రిపేర్ చేసి వేయి రూపాయలు పట్టుకెళ్ళిన తరువాత, ఏకధాటిగా నీరు పోస్తూ రెండు గంటలో పొలం మొత్తం తడిపేసింది.

భార్య లక్ష్మి ఊర్లోకి వెళ్లి కూలీలను తీసుకొని పొలానికి ఆగమేఘాల మీద రావడంతో, కూలీలతో కలిసి లక్ష్మీ కూడా పనిలో దిగడంతో పొలమంతా నాటు సాఫీగా సాగింది.

కూలీలకు డబ్బులు ఇచ్చి పంపించిన తరువాత, ఆ రోజు రాత్రి లక్ష్మీ భర్తతో –

“ఏమండీ డబ్బులు సరిపోయాయా? ఇంకేమైనా అవసరమా?” అంటూ లాలనగా అడిగింది.

“ఇప్పటికి సరిపుచ్చేసా. ఎరువులకు, మందులకు అవసరం అవుతుంది.. ఇప్పుడే మొలకలు… అది పెరిగి పెద్దయ్యే ఫలాలు ఇచ్చే వరకు మనకు ఖర్చు తప్పదు. పెట్టుబడులు పెడుతూ ఉండాలి. పంట చేతికి అందే వరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉండాలి, తప్పదు” అన్నాడు.

***

ఆ రాత్రి నిద్రపట్టలేదు రామయ్యకు. ఆలోచన సుడులు అంతరంగాన్ని తొలచి వేస్తున్నాయి, డబ్బులు పెట్టుబడికి సరిపోక. ఆలోచనలతో నిద్ర లోకి జారుకున్నాడు చివరికి రామయ్య.

మొక్కలు పెరుగుతున్నాయి. “చీడ పీడ బెడద ఎక్కువ అయ్యింది.. పట్నం పోయి మందులు తీసుకురావాలి” అని ప్రయాణమయ్యాడు రామయ్య..

భార్యతో “లక్ష్మీ, ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొనిరా” అని ఒక కేక వేశాడు..

లక్ష్మి చేతులు తుడుచుకుంటూ వచ్చి, “ఇంట్లో ఎక్కడండి డబ్బులు? ఉన్నవి అంతా కూలీలకు ఇచ్చాము కదా… ఇప్పుడు ఏమీ లేవు.” అంది రెండు బంగారు గాజులు భర్త చేతిలో పెడుతూ.

“ఇవి సౌకారి దగ్గర కుదువపెట్టి డబ్బులు తీసుకొని ఎరువు మందులు కొనుక్కొని రండి” అని చెప్పింది.

రామయ్య పట్నం పోయి మందులు కొనుక్కొని ఆ రాత్రికి చేరుకున్నారు.

“టమాటా మొక్కలకు పండ్లు చాలా చక్కగా పండినాయి. ఈ సంవత్సరం మంచి రేటు వస్తే మన అప్పులు తీరి అమ్మాయి పెళ్లికి సిద్ధం కావచ్చు” అని రామయ్య భార్యతో చెప్పేడు.

మార్కెట్లో రేటు టమాటాకు బాగానే పలుకుతుంది. కానీ దళారుల మోసంతో రైతు బాధలు తీరడం లేదు.

శివయ్య ఊర్లో చిన్న వ్యాపారం చేసుకుంటూ వ్యాపారిగా మారి ఊర్లో పంటను మార్కెట్లో అమ్మడం మొదలు పెట్టాడు. రామయ్య దగ్గరికి వచ్చి పొలంలో పంటను చూసి బేరం మొదలుపెట్టాడు.

“కాయ బాగుంది, మంచి రేటు పలుకుతుంది. పంటను నేనే కొంటాను” అని ముందుకు వచ్చాడు.

కానీ రామయ్యకి శివయ్యకు ఇవ్వడం ఇష్టం లేదు. పట్నం వెళ్లి మంచి లాభాలకు అమ్ముకోవాలని ఆశ.

ఇక్కడైతే తక్కువ రేటు చెల్లించి తీసుకుంటాడు శివయ్య.

అందుకని “నేను పట్నం తీసుకెళ్లి పండ్ల అమ్ముకుంటా, నీకు అమ్మను” అని తెగేసి చెప్పాడు. కానీ శివయ్య జిత్తులమారి నక్క అని అతనికి తెలియదు.

ఒకరోజు నలుగురు రైతులను తోడు చేసుకొని పంటంతా ట్రాక్టర్ ఎక్కించి రాత్రి పట్నం బయలుదేరాడు రామయ్య.

తెల్లవారుజామున 4 గంటలకు చేరుకొని. రేటు కనుక్కుందామని మార్కెట్లో తిరుగుతున్నారు. కిలో పది రూపాయలు రేటు పలుకుతోంది. మంచి రేటు అని అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఐదు నిమిషాల్లోనే రేటు ఐదు రూపాయలకు పడిపోయింది. ఇది ఏందో వాళ్ళకు అర్థం కావడం లేదు, దళారుల మాయాజాలం తెలియక.

అప్పట్లో శివయ్య ప్రత్యక్షమయ్యాడు. మూడు రూపాయలకు నేను కొంటానని.. అంతకంటే ఎక్కువ రేటు రాదని నాకు అమ్మమని చెబుతూ.. ఎల్ల మధ్యన సీక్రెట్ తిప్పుతూ ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు.

రైతులు అయోమయం ఉన్నారు. 10 రూపాయల నుండి 5 రూపాయలు చివరికి ఈడు 3 రూపాయల పో కొంటానని అనడం అంతా విచిత్రంగా తోచింది.

శివయ్యకు ఊర్లో ఎకరం పొలం ఉండేది మొదట్లో. నేడు పది ఎకరాల ఆసామి. చేతినిండా ఉంగరాలు. మెడలో మందపాటి బంగారు గొలుసు. పట్నంలో కూడా ఇల్లు కొన్నాడు అని వినికిడి. దళారి వ్యాపారంలో భాగంగా సంపాదిస్తున్నాడు బాగా.

కానీ రైతులకు ఆశ చావడం లేదు. రేటు మళ్ళా పుంజుకుంటుంది ఏమోనని ఆశ.. మార్కెట్ లోకి వెళ్లి చూశారు రేటు 8 రూపాయలు అమ్ముతున్నారు. వీళ్ల ఆశలు చిగురించాయి.

తీరా వ్యాపారుల దగ్గరికి సరుకు తీసుకపోతే, “పళ్ళు కుళ్ళి పోయినాయి” అంటూ కిలో 2 రూపాయిల బేరం అడిగినారు.. చేసేదిలేక పంటంతా వాళ్ళ కప్పగించి కన్నీళ్ళ బరువును మోసుకుంటూ ఇళ్లకు బయలుదేరారు రైతులు పెట్టుబడులు రాక.. అప్పులు తీరక.

రైతులు దీనస్థితిని చూసి రామయ్యకు కన్నీళ్లు ఆగడం లేదు. ఆశాలతలు ఎండమావుల్లో వెక్కిరిస్తూ, సజీవంగా నాశనం చేస్తున్నాయి.. దళారులు మాత్రం రోజురోజుకు కుబేరులవుతారు. సామాన్య రైతులు నేలలో కూరుకుపోతున్నారు అని ఆలోచించి..

ఒకరోజు ఊర్లో రైతులంతా ఏకమై. తామే స్వయంగా మార్కెట్లో అమ్ముకునే అవకాశం కల్పించాలని ఒక తీర్మానం చేసుకుని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు.

ప్రభుత్వం వారికోసం రైతుబజార్లలో తెరిచి వాళ్ల పంటను వాళ్లు అమ్ముకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఆ సంవత్సరం పంటంతా నష్టాల కమ్ముకున్న రామయ్య కొత్త ఉత్సాహంతో మరుసటి సంవత్సరం వ్యవసాయం మొదలెట్టాడు. తొలకరి చినుకులకు నేలమ్మను మరల ముస్తాబు చేశాడు.

ఆకాశం కరుణించి వర్షం కురిపిస్తే లాభాలు వస్తాయని ఆశతో ముందుకు సాగుతూ… పొలం పనుల్లో బిజీ అయ్యాడు.

దేవుడి దయతో పుష్కలంగా వర్షాలు కురిసి అధిక దిగుబడి వచ్చింది.

దళారులను పక్కనపెట్టి ప్రతి రైతు తమ పంటను రైతు బజారులో అమ్ముకుంటూ, లాభాలను గడిస్తుంటే.. రామయ్య మనసు ఆనందబాష్పాలు చిలకరించింది.

***

రామయ్య తన అప్పులు తీర్చేసి, తనఖా పెట్టిన భార్య గాజులు తెచ్చి ఆమె చేతిలో పెట్టాడు.

ఒక మంచి సంబంధం చూసి, ఊరినందరిని ఆహ్వానించి, ఘనంగా కూతురు పెళ్ళి జరిపించాడు.

‘దళారులు లేని చోట రైతు పంట బంగారంతో సమానమే కదా!’ అనుకున్నాడు మనసులో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here