ఆశ్రయం

1
12

[‘అభినందన’ సంస్థ (విజయనగరం) జూలై 2022లో నిర్వహించిన మినీ కథల పోటీలో బహుమతి పొందిన కథ]

[dropcap]“ఎ[/dropcap]వరు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇప్పుడు?” వచ్చిన బంధువుల్లో ఒక పెద్దాయన అడుగుతున్నాడు.

“ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలుసు కదా! ముందే జాగ్రత్త పడాలి” అన్నాడు చనిపోయిన వ్యక్తికి మేనల్లుడు అయిన ఈశ్వర్.

“జాగ్రత్త పడడమంటే?” పెద్దాయన అడిగాడు.

“నేను మామయ్యకి చివరి దశలో అన్నీ చూస్తాను. ఇల్లు నా పేర రాయమంటే విన్నాడా?” అన్నాడు ఈశ్వర్.

“అదెలా? వాళ్ళమ్మాయి ఉందిగా” అన్నాడు పెద్దాయన.

“ముందు నాకు రాసేస్తే, వాళ్ళే ఉంటారు అందులో. తదనంతరం తీసుకుంటాను. ఇప్పటికైనా సరోజ వదిన ఇందుకు ఒప్పుకుంటే, మామయ్య అంత్యక్రియలు నేను చేస్తాను. వదిన బాగోగులు కూడా కనిపెట్టి చూసుకుంటాను” అన్నాడు ఈశ్వర్.

ఆస్తి రాయించుకుని కన్నతండ్రినే వీధిలోకి గెంటేసిన ఈశ్వర్ కపట బుద్ధి అక్కడున్న అందరికీ తెలుసు. ఇల్లు రాసిస్తే వీళ్ళని బతకనిచ్చేవాడా? అనుకున్నారందరూ.

సరోజ లేచి నిల్చుని “నాన్న అంత్యక్రియలకు ఇంత చర్చ అవసరం లేదు. ఆయనకు కూతురైనా, కొడుకైనా నేనే. నేను చేస్తాను. పెద్దనాన్నా, మీరు కొంచెం ఆ ఏర్పాట్లు చూడండి” అంది ఆ పెద్దాయనతో.

ఒక్కసారిగా సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం!

పెద్దనాన్న తేరుకుని “అమ్మా! ఈ రోజుల్లో ఆడవాళ్లు కొందరు ఇలా చేస్తున్నారు. కాలం మారింది. ఈ మార్పును సమాజం అంగీకరిస్తోంది. సమస్య నువ్వు చేయచ్చా, చేయకూడదా అని కాదు. నువ్వెలా చేస్తావని?” అన్నాడు. ఆయన తొంభై ఏళ్ళ వృద్ధుడు. ఎనభై ఐదేళ్ళ తమ్ముడు గుండెపోటుతో పోయాడని విని, ఆగలేక పడుతూ, లేస్తూ వచ్చాడు. ఆయన కొడుకులు రాలేదు.

‘కళ్ళు లేని ఈ అమ్మాయి తండ్రికి తలకొరివి పెడుతుందా? ఎలా పెడుతుంది? ఎంత ధైర్యం?’ అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. అంతకు కొంచెం ముందే వచ్చిన కృష్ణబాబు, చనిపోయిన రాజశేఖరం గారికి వరసకి తమ్ముడి కొడుకు, ముందుకు వచ్చాడు.

“అక్కా! ఇంత మందిమి ఉండగా, ఎవరూ లేనట్టు నువ్వు చేయటం ఏమిటి? పెద్దనాన్నకు తలకొరివి నేను పెడతాను. ఈ పన్నెండు రోజుల కార్యక్రమాలు నేను చేస్తాను” అన్నాడు. పెద్దనాన్న రామబ్రహ్మం దీర్ఘంగా నిట్టూర్చి “ఒప్పుకోమ్మా! వాడూ కొడుకు వరసే అవుతాడు. నువ్వు చెయ్యటం కష్టం” అన్నాడు.

నాన్నకు ఆప్తమిత్రుడు, కుడి భుజం అయిన రాఘవరావు అంకుల్, వాళ్ళమ్మ పోవటం వల్ల సమయానికి అక్కడ లేకపోవడం సరోజకు పెద్ద కొరతగా ఉంది. ఆయనే ఉంటే తన పక్కన నిలిచి, తనతోనే చేయించేవారు. అందరూ బలవంతంగా ఒప్పించగా సరోజ అన్యమనస్కంగా ఒప్పుకుంది.

కృష్ణబాబు సక్రమంగా జరిపించి, పన్నెండో రోజు ‘ఏదైనా అవసరమైతే ఫోన్ చేయ’మని చెప్పి వెళ్ళిపోయాడు. అందరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అందరికీ ఆ ఇంటి మీదే కన్ను. రెండు బెడ్ రూమ్‍లు, పెద్ద హాలు, వంట గది. చుట్టూ ఖాళీ జాగా. రాజశేఖరం గారు ఇష్టంతో కట్టుకున్న ఇల్లది.

ఆ రాత్రి సరోజ గుండె పగిలేలా – “నన్ను ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోయారు నాన్నా! పుట్టుగుడ్డినైన నేను పుట్టిన్నాడే అమ్మ పోయింది. తల్లీ తండ్రీ అయి పెంచారు. మీ కళ్ళతో నాకు ప్రపంచాన్ని చూపించారు. చదివించారు. ఉద్యోగంలో చేర్చారు. నేను రిటైరయ్యే దాకా రోజూ స్కూలుకి తీసుకెళ్ళి, తీసుకొచ్చారు. నన్ను పంపించి మీరు వెళ్ళాలి కదా నాన్నా? మీ అవసరం నాకు ఇంక లేదనుకున్నారా? అలా ఎలా అనుకున్నారు? నేనేం చెయ్యాలి ఇప్పుడు? ఈ బంధువులంతా ఇంటి కోసం, నా ఒంటి మీద నగల కోసం, పెన్షన్ డబ్బుల కోసం కాచుక్కూర్చున్నారు. నేనేం మాట్లాడలేదని ఇప్పటికి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ వస్తారు. నేనేం చేయను? నాకు మార్గనిర్దేశనం చెయ్యండి నాన్నా!” అంటూ పొగిలి పొగిలి ఏడ్చింది.

రోజులు నిస్సారంగా గడుస్తున్నాయి. ఏం చేయాలి? ఈ ఒంటరి జీవితాన్ని ఎలా వెళ్ళదీయాలి? ఇదే ఆలోచన సరోజకు.

ఆ రోజు, తన కలిసి స్కూల్లో పని చేసిన జానకి పలకరించడానికి వచ్చి, తన తల్లి ఏ ఆధారం లేకపోవడం వల్ల అన్న ఇంట్లో అవమానాలు పడుతూ బతుకుతోందని, తను ఏం చేయలేకపోతున్నానని చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఇది విన్న దగ్గర నుంచి సరోజలో కొత్త ఆలోచన రూపుదిద్దుకుంటోంది.

తనకున్న ఏకైక ఆప్తుడు, నమ్మకస్తుడు అయిన రాఘవరావు అంకుల్‍ని పిలిచి సరోజ తన ఇంటిని వృద్ధాశ్రమం చేయాలనుందని, మరీ ఎక్కువ మందిని కాకుండా ఏడెనిమిది మంది ఆడవాళ్ళను, ఏ ఆశ్రయం లేని వాళ్ళను పెట్టుకుందామని చెప్పింది. తను ఒక గదిలో ఉంటానని, మిగతా వాళ్ళు రెండు గదుల్లో హాల్లో ఉంటారని, ఖర్చంతా తనదేనని, తన తదనంతరం కూడా ఈ ఇల్లు వృద్ధాశ్రమంగానే ఉండేటట్లు, నమ్మకస్తులెవరైనా నిర్వహించేటట్లు చూడాలని కోరింది. ప్రస్తుతం ఈ బాధ్యతంతా ఆయనే తీసుకోవాలని చెప్పింది.

“తప్పకుండా చేద్దామమ్మా! మీ నాన్న కష్టార్జితంతో, ఇష్టంగా కట్టుకున్న ఇల్లు స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళకుండా, ఆయన గుర్తుగా నలుగురికీ ఉపయోగపడేటట్లు చేస్తున్నావు. నాకు తెలిసినవాళ్ళే ఉన్నారు ముగ్గురు వృద్ధులైన స్త్రీలు. దేవాలయాల్లో సేవ చేస్తూ బతుకు వెళ్ళదీస్తున్నారు. వాళ్ళని, జానకి తల్లిగారిని ముందు తీసుకువద్దాం. వంటావిడని, పనమ్మాయిని కుదుర్చుకుని, వాళ్ళని రమ్మందాం.

తాన పాతికేళ్ళ వయసులో మీ అమ్మ పోతే, మళ్ళీ పెళ్ళి చేసుకోమని ఎందరు చెప్పినా ఒప్పుకోక, నీ కోసమే, నువ్వే లోకంగా బతికాడు మీ నాన్న. తండ్రి ఋణం ఈ విధంగా తీర్చుకుంటున్నావమ్మా! మీ నాన్న ఆత్మ సంతోషిస్తుంది. నువ్వన్నట్లు దీన్ని శాశ్వతంగా వృద్ధాశ్రమంగా ఉంచే ఏర్పాట్లూ చూద్దాం!” అన్నాడు.

“నాన్నకు ఏం చేసినా, నాది తీరని ఋణం అంకుల్. నా దురదృష్టమకరమైన, చూపు లేని బతుకుకు వెలుగురేఖ నాన్న. ఈ ఇంటిని ఎవరికీ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. ఏం చేయాలో ఆయన ఎప్పుడూ చెప్పలేదు కానీ ఏం చేయకూడదో చెప్పారు. ఇప్పుడు ఇలా మార్గదర్శనం చేశారు” అంది మనస్ఫూర్తిగా, సంతోషంగా సరోజ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here