ఆటాడుకుందాం రా తాతా

0
8

“తాతా ఏం చేస్తున్నావ్? రావొచ్చు కదా!” మనవడు అర్ణవ్, అలా రమ్మని పిలువగానే తాతగారికి అప్పటికప్పుడు మనవడి దగ్గరకు వెళ్ళిపోవాలన్న గాఢమైన కోరిక కల్గింది.

కానీ ఎలా? మనవడు మద్రాసులో. తను విశాఖలో. అన్ని ప్రయాణాలకు ‘చెక్’ పెట్టింది కరోనా.

“వస్తాన్లే” అన్నారు తాతగారు.

“ఎలా వస్తావు తాతా? రైళ్ళు, విమానాలు లేవుగా!” అన్నాడు అర్ణవ్.

“ఓరి పిడుగా! అన్నీ తెలిసే అడిగావన్న మాట. సరే, అవి వచ్చాక చెప్పు. అప్పుడేవస్తాను సరేనా?” అన్నారు తాతగారు.

“సరే.” అన్నాడు అర్ణవ్. 

కానీ ఆయనకు తెలుసు. ఈ సమస్య ఇప్పుడిప్పుడే వదిలేదికాదని. ఒకవేళ ప్రభుత్వం ప్రయాణాలకు అనుమతించినా, వాళ్ళు పెట్టే ఆంక్షలకు, పరీక్షలకు తట్టుకుని సమీప భవిష్యత్తులో ప్రయాణాలంటే కష్టమే.

మనవడికి తాతతో దోస్తీ. తాతకి మనవడితో కలసిపోయి చిన్నపిల్లాడిలా ఆడుకోవటం సరదా.

కొన్నాళ్ళ తర్వాత “తాతా రైళ్ళు, విమానాలు వస్తున్నాయట. నువ్వెప్పుడొస్తావు?” ఫోనుచేసి అడిగాడు అర్ణవ్.

“అలాగా, సరే వస్తాను కాని నాకోసం ఆడుకోవటానికి ఏమేం బొమ్మలు కొన్నావ్?”అడిగారు తాతగారు.

“ఏమేం కొన్నానంటే” అని ఒక్క క్షణం ఆలోచించి “క్రేన్, డంపర్, పోలీసుజీప్, ఏరో ప్లేన్,ఇంకా కార్లు, హెలికాప్టర్. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు హెలికాఫ్టర్‌లో వెళ్ళిపోవచ్చు.” చెప్పాడు అర్ణవ్.

“ఓ, చాలానే కొన్నావ్. సరే వస్తాన్లే” అన్నారు తాతగారు.

“ఇవ్వాళే రావాలి” అర్ణవ్ అనగానే “సరే వచ్చేస్తా” చెప్పారు తాతగారు.

ఆరోజు సాయంత్రం, “అవును నాన్నా నువ్వీరోజు బయల్దేరి వస్తున్నానన్నావట అర్ణవ్‌తో. బయల్దేరావో లేదో నన్ను అడగమన్నాడు. వాడు క్రింద సెల్లార్‌లో పిల్లలతో ఆడుకోవటానికి వెళ్ళాడు” ఫోనుచేసిన కూతురితో, “లేకపోతే అర్ణవ్ వదలడుగా?” అన్నారు తాతగారు.

మర్నాడు, అర్ణవ్ ఫోనుచేసి “తాతా నువ్వు రాలేదు కదా! వస్తానని అబద్దం చెప్పావు కదా? నువ్వు రావొద్దులే. నేనే వస్తాను మమ్మీ డాడీతో” అని ఫోను పెట్టేశాడు అర్ణవ్.

చిన్న పిల్లాడు అర్ణవ్‌కి ఎలా చెప్తే అర్థం అవుతుంది! ఈ మహమ్మారి కరోనా మానవాళి దైనందిన జీవితాలకే కాదు, వారిమధ్య ప్రేమానుబంధాలకి ‘చెక్’ పెట్టింది… అనుకుంటూ నిట్టూర్చారు తాతగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here