ఆత్మ నివేదనము

0
7

[dropcap]సో[/dropcap]మేశ్వరపురంలో సోమయ్య అనే ఒక ధనికుడు ఉండేవాడు. ఆతనిది పెద్ద భవంతి. ఈశాన్యమూల గాజు గోడలతో ఒక విశాలమైన పెద్ద గది దేవుని గదిగా కట్టించాడు. ఆ గదిలో నవరత్నాలు పొదిగిన ఒక నిలువెత్తు వేంకటేశ్వరస్వామి విగ్రహం పంచలోహాలతో చేయించి. ఎత్తైన టేకు బల్ల మీద పెట్టించాడు. దారిన పోయే వారికంతా కనిపించే లాగా మంచి వెలుతురు నిచ్చే విద్యుత్ దీపాలు పెట్టించాడు. అతని ప్రహరీగోడకు బయటి వైపునుంచీ రహదారి మీద పోయే వారికంతా ఆ పూజాగదిలో ఉంచిన వస్తువులన్నీ బాగా కనిపిస్తుంటాయి.

సోమయ్య ఉదయాన్నే స్నానపానాలు పూర్తి చేసుకుని పూజగది లోకి వచ్చేసరికి పెద్ద అందమైన నిలువెత్తు గజమాల ఆయా కాలాల్లో లభించే పూలతో వేంకటేశ్వర స్వామివారికి ఆయన భార్య అలంకరించి ఉంటుంది. మూరెడేసి పెద్ద వెండి దీప స్తంభాలలో దీపాలు వెలిగించి వేంకటేశ్వరస్వామికి ఇరువైపులా గాజు పెట్టెల్లో ఉంచుతుంది. ఆ గదిలో వెలిగించే ఊదుకడ్డీల సువాసన వీధిలో పోయేవారికంతా ముక్కు పుటాలకు పరిమళం తగిలి తప్పక అటుకేసి చూడవలసిందే. మైసూర్ నుంచీ ప్రత్యేకంగా తయారు చేయించిన మంచి గంధపు పొడితో చేయించిన ధూపకడ్డీలు అవి.

ఆ దారినపోయే వారంతా నిలుచుని అనేక రకాల హారతులిచ్చే ఆయన పూజాగదిలోకి చూస్తూ మైమరచి నిలుచోడం గమనించిన సోమయ్య, తన దేవుని గది శోభ అలా అందరినీ ఆకర్షించడంతో కాస్త గర్వంగా, డంభంగా మనస్సు ఊగిపోగా, వారికి కనువిందేకాక నోటి విందూ చేయదలచాడు. ప్రహరీ దగ్గర ఒక గది కట్టించి దానికి పెద్ద కిటికీ పెట్టించాడు. పూజ, హారతి కాగానే ఒక పెద్ద గంప నిండా, రోజుకో రకమైన ఫలహారాలు, గారెలు, బూరెలు, లడ్డూలు, మైసూర్ పాకులూ, కజ్జికాయలూ ఇలా అనేక రకాలు తయారు చేయించి, దేవునికి నివేదన చేసి ఆ కిటికీ వద్ద ఒక మనిషిని పెట్టి, అక్కడ ఆ సమయానికి వున్న వారందరికీ ఇప్పించసాగాడు. అలా సోమయ్య పూజగది విశేషం ఆ చుట్టు పక్కల పరగణాల లోకి పాకి జనం పోగై, పూజగది శోభనే కాక ప్రసాదాల రుచి కోసం అధికంగా చేరసాగారు.

ఆ ఊర్లోనే ఒక పురాతన కాలం నాటి వేంకటేశ్వర ఆలయం ఉంది. ఒక పూజారి ఆ ఆలయంలో పూజాదికాలు చేస్తూ ఉండేవాడు, పరమ భక్తుడు. ఆ ఆలయానికి వచ్చే భక్తులు సమర్పించుకునే దక్షిణతో జీవనం సాగేది.

సోమయ్య భవంతి కట్టించుకుని పూజగది ఏర్పరచాక, ఆయన పెట్టే ప్రసాదాల కోసం జనం అక్కడికే గుంపులు గుంపులుగా పోవటాన, వేంకటేశ్వర ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రాను రానూ తగ్గసాగింది. పాపం పూజారికి దక్షిణ లేక, పూజలు చేయించుకునే వారు లేక ఆలయంలో ఒంటరిగా కూర్చుని వేంకటేశ్వరుని, ‘మిమ్ము ధనధాన్యాలు సొమ్ములూ అడగను. కేవలం బతకను తిండి చాలు స్వామీ! మిమ్ము చూడను భక్తులు రాక, నేను ఎలా ఇలా ఊరికే కూర్చుని బతకను స్వామీ! నిన్నే నమ్ముకుని జీవించే నాకు దారి చూపు, భగవాన్! స్వామీ! ఏమి ఈ మాయ! నీ దర్శనానికి వచ్చేవారే కరువైపోతున్నారు స్వామీ! నిన్ను నమ్ముకున్న నాకూ, నా కుటుంబానికి పొట్టకింత తిండి ప్రసాదించు ప్రభూ!’ అని మొర పెట్టుకుంటూ అష్టోత్తరాలూ, సహస్ర నామాలూ చెప్పుకుంటూ, ఆలయం చుట్టూ వున్న స్థలంలో పూలమొక్కలు వేసుకుని నీరు పోసుకుంటూ కాలక్షేపం చేయసాగాడు.

ఉదయాన్నే స్వామికి పూలన్నీ కోసి చేత్తో ఒంటి పొర మాలకట్టి అభిషేకంచేసి ఆ మాల వేసేవాడు. ప్రసాదానికి రోజూ కొబ్బరికాయ తానే కొని కొట్టి నివేదన చేసే శక్తిలేక ఇంత కలకండ నివేదన చేసేవాడు. అప్పుడప్పుడూ వేరే ఊరు వెళ్ళే వారు ఆ దారిన పోతూ ఆలయం లోపలికి వచ్చి పూజ చేయించుకుని పదో పరకో దక్షిణ వేసి పండో ఫలమో, కొబ్బరికాయో కొట్టించి నైవేద్యం పట్టుకుని వెళ్ళేవారు.

పాపం పూజారికి నిత్య కల్యాణం పచ్చతోరణంలా వెలిగిపోయే వేంకటేశ్వర వైభవం గుర్తుకువచ్చి కళ్ళ నీళ్ళ పర్యంతమయ్యేవాడు. తన నిస్సహాయతను నిందించుకుంటూ ఉండేవాడు. ఒక్కోమారు పూలు కూడా లేనపుడు మాలకట్టను తులసి, బంతి, చేమంతి, ఇంకా ఏ ఆకులుంటే వాటిని మాల కట్టి “స్వామీ! నీవు నాకిచ్చిన శక్తి ఇంతే. మన్నించు ప్రభూ!” అని వేడుకునేవాడు. దుఃఖించేవాడు.

పాపం స్వామి వారికి కొత్త వస్త్రాలు సమర్పించేవారు కూడా లేకుండా పోవటాన, స్వామివారికి పాతబడ్ద రంగువెలిసిన వస్త్రాలనే అభిషేకానంతరం కట్టవలసి వచ్చినపుడు కన్నీళ్ళతో స్వామివారి పాదాలు కడిగేవాడు పూజారి. స్వామి శేషవస్త్రాలు మాత్రమే తాను ధరించే పూజారి పంచె, కండువా కూడా చిరిగి పోయి వాటిని చేత్తో కుట్టుకుని కట్టుకోసాగాడు.

ఒకరోజున సోమయ్య పక్క గ్రామానికి ఆలయం ముందునుంచీ గుర్రపు బండిమీద పోతూ, బండి ఆపించి దిగి లోపలికి వెళ్లాడు. ఆకులతో కట్టిన మాల వేంకటేశ్వరస్వామి మెడలో చూసి “ఏం పూజారిగారూ! స్వామి వారికి పూలమాల వెయ్యకుండా ఇలా ఆకుల మాలవేశారు?” అని అడిగాడు.

పూజారి “అయ్యా! ఈయనకు అప్పిచ్చే కుబేరుడు దొరక్క పేద వేంకటేశ్వరస్వామిగా ఉన్నందున ఈ ఆకులమాల చాలని చెప్పాడు, అందుకే ఆకులమాల వేస్తున్నానయ్యా! ఈ స్వామి పేద వేంకటేశ్వరుడు.” అన్నా డు.

“చిత్రంగా మాట్లాడుతున్నారు పూజారిగారూ! సరే కొబ్బరికాయ ఉంటే కొట్టి అష్టోత్తరం చేస్తారా!” అన్నాడు.

పూజారి “మీరే కొబ్బరికాయ తెప్పించండి బాబూ! పూజ నేను చేస్తాను” అనగానే సోమయ్య తన బండి వానిని పంపి కొబ్బరి కాయ, పూలమాల తెప్పించి పూజ చేయమని పూజారికి ఇచ్చాడు. పూజారి పూలమాల స్వామి వారికి వేసి, అష్టోత్తరం చేసి ప్రసాదంగా కొబ్బరి కాయ అర్ధభాగాన్ని ఇచ్చాడు సోమయ్యకు.

“పూజారి గారూ! పాపం స్వామికి కొబ్బరికాయ కొట్టేవారు కూడా లేకుండా పోడం అన్యాయమండీ! ఈ రెండు కొబ్బరి టెంకలూ నైవేద్యంగా ఎవరైనా వస్తే ఇవ్వండి” అంటూ జేబునుండీ ఐదు రూపాయ బిళ్ళలు తీసి పెద్దగా శబ్దం వచ్చేలాగా పళ్ళెంలో ఒకటొకటిగా వేశాడు.

పూజారి అటూ ఇటూ నడుస్తుండగా ఆయన చిరిగి కుట్టుకున్న పంచెను చూసాడు సోమయ్య.

“పూజారిగారూ! ఇలా చిరిగిన, మాసిన బట్టలు కట్టుకుంటే పూజ చేయించుకోను ఎవరు వస్తారు చెప్పండీ! కాస్త శుభ్రంగా ఉండండి. మంచి వస్త్రాలు ధరించండి.” అన్నాడు.

పూజారి నవ్వి తల ఊపి, “మా స్వామికీ నాకూ దశ మారితే మీరు చెప్పినట్లే చేస్తాను బాబూ!” అన్నాడు.

సోమయ్య వెళ్ళబోతుండగా ఒక వ్యక్తి పరుగు పరుగున వచ్చాడు.

ఒక గుడ్డల మూటను పూజారిగారికి చూపి, “అయ్యా! పూజారయ్యా! నా భార్య స్వామి వారికి సేవచేసే తమ కోసం ఈ పంచెల చాపు ఒక పక్షం రోజులు రాత్రులు నిద్రలేకుండా నేసిందయ్యా! ‘పూజారయ్య చిరిగిన పంచ కట్టుకోడం సూళ్ళేకున్నానయ్యా!’ అందయ్యా. తమరు దీన్ని స్వామికి నివేదన చేసి మీరు కట్టుకుంటే చూసి రమ్మని చెప్పిందయ్యా! ఆమె నెలలు నిండిన గర్భవతి. నడిచి ఇక్కడి దాకా రాలేదు. తమరు త్వరగా కట్టుకుని నాకు చూపితే వెళ్ళి నా భార్యకు చెప్తాను, నేను బట్టలు నేసే సాలెను. మా ఇంటి ఆడమనిషి తమరు కట్టుకునే బట్టలు చూసి బాధ పడిందయ్యా! తానే సొయాన ఈ బట్టలు రాత్రులు మేలుకుని నేసిందయ్యా! కట్టుకోండి పూజారయ్యా!”అని తొందర చేయసాగాడు.

పూజారి “అయ్యా! స్వామి వారికి కడతాను. నేను మాత్రం కట్టుకోను. ఇది స్వామివారికే, ఆయన శేషవస్త్రం మాత్రమే కట్టుకునే అర్హత ఉంది నాకు.” అంటూ మూట విప్పి పసుపు కుంకుమ పూసి స్వామివారి రెండు బుజాల మీద నుంచీ వేసి అలంకరించాడు.

“అయ్యా! రేపు అభిషేకానంతరమ స్వామికి ఈ వస్త్రాలు కట్టబెడతాను. రేపు వచ్చి చూడండి.” అని చెప్పాడు.

అంతా దూరం నుంచీ చూసి వెళ్ళిపోయాడు సోమయ్య.

సోమయ్య ఎక్కడి కెళ్ళినా ఏం చూసినా రంగు వెలసిన వస్త్రాలు ధరించిన, ఆకుల మాల వేసుకున్న వేంకటేశ్వర స్వామి మాత్రమే మనస్సులో మెదలసాగాడు. ఏ పనీ సరిగా చేసుకోలేకపోయాడు నగరంలో.

ఎలాగో నగరంలో పని ముగించుకుని సాయంకాలానికి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే స్నానపానాదులు ముగించి భోజనం చేసి, అలసిపోయి నిద్రపోయాడు. కలలో కూడా ఆ రాత్రంతా మాసిన వస్త్రాలతో, ఆకుల మాలతో వున్న వేంకటేశ్వరస్వామి కనిపిస్తూ ఏదో చెప్తున్నట్లు అనిపించింది.

ఉదయాన్నే అశాంతిగా నిద్ర లేచి, యథాప్రకారం స్నానం ముగించి దేవుని గదిలోకి వచ్చికూర్చున్నాడు. ఎదురుగా మాసిన పంచలో, ఆకులమాలతో వున్న స్వామి తన నవరత్నాల వేంకటేశ్వరస్వామి స్థానంలో ఉండటం చూసి భార్యను పెద్దగా కేకేశాడు.

“ఏం సుమతీ! స్వామివారికి ఆకులమాల వేశావు?” అని గట్టిగా అరిచాడు.

ఆమె “లేదండీ! ఈరోజు ప్రత్యేకంగా మల్లెపూల గజ మాల తెప్పించి వేశాను.” అంది.

“ఏయ్ !సుమతీ! నాకళ్ళనే మోసం చేస్తావా!చూడూ ఆ పాత రంగు వెలసిన వస్త్రాలేంటీ!ఆ ఆకులమాలేంటీ!మతిపోయిందాఏం? అని అరిచాడు.

సుమతి పని అమ్మాయిని పిలిచి “ఏమే వెంకమ్మా! స్వామివారి మెడలో ఉన్న మాలేంటీ?” అని అడిగింది.

ఆ పనమ్మాయి వెంకమ్మ”అమ్మా! అది మల్లెపూల గజ మాలకదమ్మా! అలా అడుగుతున్నారేమమ్మా!” అంది.

“ఛీ, ఈ పిల్ల అమ్మగారివని నీ మాటకే వత్తాసు పలుకు తున్నది.” అని ఆ పనిపిల్లనూ కోప్పడ్డాడు సోమయ్య.

సుమతి ఇంట్లో వుండే ఆరుమంది పనివారినీ పిలిచి “ఏమర్రా! స్వామి వారి మెడలో వున్న ఆ మాలేంటీ? స్వామికి కట్టిన వస్త్రాలేంటీ?” అని అడిగింది.

అంతా “అమ్మగారూ! అది మల్లెపూల గజమాల కదమ్మా! అచ్చం పట్టు వస్త్రాలు కట్టివున్నాయి కదమ్మా!” అన్నారు.

సుమతి వారిని వెళ్ళమని “మీరు ఎక్కడో ఏదో చూసారు. అది మీ మనస్సులో పాతుకుపోయింది. అదేంటో ఏమి చూసారో గుర్తుకు తెచ్చు కోండి.” అని చెప్పాక, సోమయ్య నిన్న ఉదయం పాత వెలిసి పోయిన వేంకటేశ్వరస్వామి ఆలయంలోని విగ్రహాన్నీ, ఆయన మెడలో ఆకుల మాలనూ చూసిన గుర్తు తెచ్చుకుని, అప్పటినుండీ తనకు ఆయనే కనిపిస్తు న్నాడని గమనించి, వెంటనే కొన్ని వస్తువులు గబగబా ఒక బుట్టలో వుంచుకుని గుర్రపు బండి వానిని పిలిచి ఆ బుట్ట బండిలో పెట్టించి ఆలయానికి పొమ్మన్నాడు.

ఆలయం చేరే సరికి ఆ రోజు స్వామికి అభిషేకానంతరం, నిన్న పేద సాలె భార్య స్వయంగా నేసి స్వామికి సమర్పించుకున్న వస్త్రాలను కట్టి ఆలయంలో పూసిన పూలమాల కట్టి వేసి, హారతి ఇస్తున్న పూజారిని చూసి “పూజారయ్యా! ఈ పట్టు వస్త్రాలు స్వామికి కట్టి ఈ గజమాల వేయండి” అంటూ అక్కడున్న పళ్ళెంలో ఉంచాడు పట్టు వస్త్రాలను.

పూజారి సోమయ్యను ఆశ్చర్యంగా చూస్తూ “అయ్యా! ఈ రోజుకు స్వామికి అభిషేకం, వస్త్రధారణ ఐపోయింది. మీరు ఇచ్చిన వస్త్రాలు రేపు ధరింపజేస్తాను. ఒకమారు కట్టిన వస్త్రాలు, అదే రోజు మరలా తీయకూడదు. పూలమాల మాత్రం వేస్తాను.” అంటూ గజమాల వేశాడు.

సోమయ్య గోత్రనామాలతో పూజ చేయించుకుని వెయ్యి రూపాయలు హారతి పళ్ళెంలో వేసి “పూజారిగారూ! రేపటి నుండీ స్వామి వారికి నేను పూలమాల రోజూ పంపుతాను. ఇవిగోండి ఈ వస్త్రాలు మీకోసం తెచ్చాను. ధరించండి. ఇంకోమాట పూజరి స్వామీ! రేపటి నుండీ ప్రసాదం మా ఇంటి కిటికీలోంచీ ఇవ్వడం మానేస్తున్నాను. ఇక్కడే రోజూ భక్తులకు ప్రసాదం పంచండి. రోజూ మా ఇంటి నుండీ పంపుతాను. స్వామికి నివేదన చేసి భక్తులకు పంచండి. అసలు దేవుడిని ఇక్కడ వుంచుకుని ఇంత కాలం మా ఇంటినుంచీ ప్రసాదం పంచి తప్పు చేశాను.” అని చెప్పి శ్రధ్ధగా నమస్క రించుకుని వెళ్ళాడు సోమయ్య.

మరునాటి నుండీ సోమయ్య ఇంట్లో దేవుని గాజు గదికి తెరలు దిగాయి. లోపలి దేవుడు గజమాలలూ కనిపించట్లేదు బయటి వారికి. ప్రసాదాలు పంచే కిటికీ మూసేసారు.

ఒక మనిషి అక్కడ నిలుచుని “అయ్యా! ప్రసాదాలు వేంకటేశ్వర స్వామి ఆలయంలో పంచుతారు” అని చెప్పసాగాడు.

ఒక వారానికల్లా వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తుల రాకపోకలతో కళకళలాడసాగింది. పూజలూ, దక్షిలూ, అలంకారాలూ అధికమయ్యాయి.

పూజారి మనసు ఆనందంతో నిండిపోయింది. ‘నా స్వామికి కుబేరుని నుండి అప్పు పుట్టింది. అంతే చాలు. ఈ నా స్వామి భోగం ఇలాగే నా జీవితాంతం నేను చూస్తే చాలు వేంకటేశ్వరా! నా మొర ఆలకించి ఆలయ శోభను పునరుధ్ధరించావు. అంతే చాలు’ అని మనస్సులో తలచుకుంటూ మహదానందంగా పూజలు చేసుకోసాగాడు.

భగవంతుడు భక్తుల మొర ఆలకించే దయామయుడు కదా! తన కోసం తపించేవారిని తప్పక ఆనందపరుస్తాడు. భగవంతుడు తన ఇంట్లోనేకాక అంతటా నిండి వున్నవాడు ఒకడేననీ, తనగొప్ప చూపుకోను చేసే ఆర్భాటం వలన జరిగిన అనర్థాన్ని గ్రహించేలా చేసి భక్తి అసలు స్వరూపాన్ని బోధించి మానవులకు జ్ఞానోదయం కలిగిస్తాడు కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here