‘ఆటుపోట్ల కావేరి’ – శ్రీమతి కావేరి చటోపాధ్యాయ ఆత్మకథ-1

2
14

[శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ఆత్మకథ ‘Peeping Through my Window’ ని ‘ఆటుపోట్ల కావేరి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలుగుశాఖ విశ్రాంతాచార్యులు, డా. వెలుదండ నిత్యానంద రావు. Dr. Veludanda Nithyananda Rao’s translation of Mrs. Kaberi Chattopadhyay’s autobiography ‘Peeping Through my Window’ in Telugu. Special thanks to Partha Pratim Roy, chief coordinator, Virasat Art Publication, Kolkata.]

అధ్యాయం 1 –

నేను పుట్టిన ఆ రాత్రి

[dropcap]అ[/dropcap]ది చిన్న తేయాకు తోటల జాగీరు. దాని పేరు మార్గరీట. భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ఉంది. ఒకసారి ఇంగ్లాండ్‌ను పరిపాలించిన ఐదవ జార్జ్ చక్రవర్తి కూతురు అయిన ఎలిజబెత్ మహారాణి, ఆమె చెల్లెలు మార్గరెట్‌తో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించిందట. ఆ మార్గరెట్ పేరు ఈ ప్రాంతానికి పెట్టారని చెప్పుకుంటారు.

అది ఆగస్టు నెల రాత్రి. నక్షత్రాలు మిలమిల మెరుస్తూ చిరు దరహాసాన్ని ఒలికిస్తూ వర్షాకాలాన్ని మైమరిపిస్తున్నాయి. మా దాదు  (తాత) కాలు గాలిన పిల్లిలాగా, ఆదుర్దాగా అటూ ఇటూ, పైకీ, కిందికీ తిరుగుతున్నాడు. మా అమ్మ అభాభట్టాచార్యకు సాయంకాలం నుండి నొప్పులు వస్తున్నాయి. ఆమె బాధతో విలవిలలాడుతుంది. మనవడో, మనవరాలో రాబోతున్న సంతోషంతో పాటు కూతురు ఆయాసాన్ని చూడలేకపోతున్న బాధతో దీద (అమ్మమ్మ) ముఖకవళికలు మాటిమాటికి మారిపోతున్నాయి. ఆ రోజుల్లో దైమా (దాయమ్మ/మంత్రసాను)ల చేతుల మీదుగా ఇండ్ల వద్దే కాన్పులు జరిగేవి. దుర్గామణికి సమర్థురాలైన మంత్రసానిగా పేరు ఉండేది కానీ అమ్మ బాధతో ఏడుస్తుంటే దుర్గామణి కోపంతో, విసుగుతో అరిచేది. ఆఖరికి అందరూ ఆతురతతో ఎదురుచూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. అమ్మ పెట్టిన ఒక పెద్ద కేకతో నేను ఇంట్లోకి వచ్చాను అన్న సంగతి ఇంటిల్లిపాదికీ అర్థమైంది. ఆనందంతో అమ్మమ్మ పరుగు పరుగున వచ్చి తాత చెవిలో ఈ వార్త వేసింది. నేను గుమ్మడి పండు లాగా ఉన్నాననీ అందరూ మురిసిపోయారు.

నేను, మా అమ్మ మా తాతగారింట్లోనే మార్గరీటాలో ఆరు నెలలపాటు ఉన్నాం. మా అమ్మకు తన ఇంటి పనులు, నా గురించి  తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్వయంగా అన్నీ చేసుకోగలిగే శక్తి వచ్చింది. జోర్హాట్ తీసుకొని పోవడానికి మా నాన్నగారు అభయపదభట్టాచార్య వచ్చారు. నాన్నగారు జోర్హాట్ లోని జే.బీ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన ఆజానుబాహువు. స్ఫురద్రూపి. గ్రీకు పురాణ కథల్లో, కఠోరమైన క్రమశిక్షణకు నిలువెత్తు రూపమైన ఒకానొక దేవుని లాగా గోచరించేవాడు.

ఇక్కడ నేను మరో సంగతి చెప్పాలి. మా నాన్నగారికి మా అమ్మ రెండవ భార్య. నేను, నా తమ్ముడు చందన్, చెల్లెలు మాల రెండవ భార్య సంతానం అన్నమాట. మంజుఅక్క, పికుఅక్క మొదటి భార్య కూతుళ్ళు. మా  బోరోమా (పెద్దమ్మ,నాన్నగారి మొదటి భార్య) ప్రసవ సమయంలో చనిపోయింది. అప్పుడు పుట్టిన కొడుకు కూడా అచిరకాలంలోనే తల్లిని కలుసుకోవడానికి స్వర్గానికి వెళ్ళిపోయాడు. నాన్నగారు భగ్నహృదయుడై చాలాకాలంపాటు పునర్వివాహం అన్న ఊసే ఎత్తడానికి ఇష్టపడలేదు. కానీ మాథాకూమా  (నానమ్మ) పట్టు వదలకుండా నన్నను మరో పెళ్లి చేసుకోమని వెంబడిపడింది. మా అమ్మ బాగా వంట చేస్తుందనీ, తల్లి లేని ఆ ఇద్దరు చిన్న పిల్లలను (మొదటి భార్య పిల్లలను) బాగా చూసుకుంటుందని ఎన్నో విధాలా నచ్చచెప్పడానికి శాయశక్తులా ప్రయత్నించింది. కొన్ని నెలల తర్వాత నాయనమ్మ ఒత్తిడి, హితబోధలు ఫలించాయి. చిట్టచివరికి నాన్న పెళ్లికి అంగీకరించాడు……

అధ్యాయం 2 – ఉగాది పచ్చడి లాంటి నా బాల్యం

నా బాల్యమంతా ఒడిదుడుకులతోనే సాగిపోయింది. నాన్నగారు దేవీ చరణ్ బారువా మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. దాంతో రోజంతా కళాశాల వ్యవహారాల్లోనే కూరుకపోయేవారు. ఎప్పుడో గాని చుక్క తెగిపడినట్లుగా ఇంటికి వచ్చేవారు. (ఆయన వచ్చేసరికి మేం నిద్రపోయేవారిమేమో!) అందువల్ల ఎదుగుతున్న మా బాల్య జీవితం అంతా మా అమ్మ చుట్టే కొనసాగింది. అంతేకాక నాన్నగారు ప్రిన్సిపాల్ హోదాలో చాలాసార్లు గౌహతి విశ్వవిద్యాలయంలో ఆంగ్లభాషలో ప్రధాన పరీక్షకులుగా వ్యవహరించాల్సి రావడంతో తరచూ గౌహతికి వెళ్లాల్సి వచ్చేది. (నేటి గువాహాతి ఒకప్పుడు గౌహతిగా ప్రసిద్ధి చెందింది).

మా అమ్మను ఏమని వర్ణించగలను?!– ఆ మహాతల్లిని. ఆమె మృదుభాషిణి. నిలువెల్లా ప్రేమమయమూర్తి. బహుముఖ ప్రజ్ఞాశాలిని. దయార్ద్రహృదయ. పసిమిపచ్చని దేహం. నడుము దాకా వేలాడే పొడవాటి నల్లటి కురులు. ఎంతో కమ్మగా వంట చేస్తుంది. కమనీయంగా పాడుతుంది. పిల్లలకు దేవుడిచ్చిన వరం లాంటిది మా అమ్మ… నా చిన్నతనంలో ఎన్నెన్నో నీతి కథలు చెప్పేది. ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. అసాధారణ రీతిలో అమ్మ శ్రావ్యమైన గొంతుతో చెప్పేది. ఆమె మృదుమధురంగా చెప్పే కథలు మమ్మల్ని కట్టిపడేసేవి. ఆమె కళ్ళకు కట్టినట్లు చేసే అతిలోక సౌందర్యవర్ణనలు, దేవకన్యల వృత్తాంతాలు మమ్మల్ని ఏ గంధర్వలోకానికో తీసుకొనిపోయేవి. ఆ లోకాల నుండి వాస్తవ ప్రపంచంలోకి తిరిగి రావడానికి కొన్ని రోజులు పట్టేదని నాకు స్పష్టంగా గుర్తుంది.

మా తాత (అమ్మగారి తండ్రి) వృత్తిరీత్యా స్టెనోగ్రాఫర్. ఆయన అచ్చుగుద్దినట్లుగా విదేశీయునిగా కనిపించేవాడు. మేని ఛాయ, హావభావాలు ఆంగ్లేయుని స్ఫురింపచేసేవి. ఆయన హుందాగా కనిపించేవాడు. నడకలో ఒక ధీరత్వం గోచరించేది. కుటుంబ సభ్యులంతా ఆయన అదుపాజ్ఞలోనే నడవాలనే ఆధిపత్యధోరణి ఆయనది. ఆయన ఒక నియంత అని అందరూ గొణుక్కునేవారు. తాత మంచి ఆరోగ్యంగా, దృఢంగా కనిపించేవాడు. మధ్యాహ్నం ఉడకబెట్టిన కూరలు, అన్ని రకాల చిరుతిండ్లు తినేవాడు. రాత్రి పూట రెండు చపాతీలు, బంగాళదుంప కూర తినేవాడు. తీవ్ర క్రమశిక్షణపరుడు. ఆయన ఐదుగురు పిల్లలు. ఆ క్రమశిక్షణకు, ఆయన పెట్టిన నియమనిబంధనలకు లోబడి నడుచుకొనేవారు.

 తాతయ్యకు ముగ్గురు కూతుళ్ళు. వారిలో  మా అమ్మనే ఆ ఇంట్లో అందరికన్నా పెద్దది. అమ్మ తర్వాత ఝానుమాసి (అమ్మ పెద్ద చెల్లెలు),ఖుకుమాసి ( చిన్న చెల్లెలు)  అని ఇద్దరు చెల్లెళ్ళు. అమ్మ నడవడి అందం వారు ఆరాధించేవారు.  మా అమ్మే వారికి ఆదర్శం. ఝానుమాసి  చిన్నమ్మ తాత నోట్లోంచి ఊడిపడ్డట్లుగా ప్రవర్తన, దాష్టీకం అంతా ఇంగ్లీష్ వారి తరహాలోఉండేది. పొట్టి జుట్టు (బాబ్డ్ హెయిర్), కుడిచెయ్యి మణికట్టుపై వాచ్ (చేతి గడియారం) ధరించేది. అది ఆనాటి ఫ్యాషన్. అందానికి చిహ్నం. ఖుకుమాసి చిన్నమ్మ మాత్రం అందరిలోనూ చాలా నిరాడంబరంగా ఉండేది. పొడవైన జుట్టు, ఆకట్టుకునే రూపం, మృదువుగా మాట్లాడే తీరు ఆమె సొంతం. వినయ విధేయతలు మూర్తీభవించిన సగటు బెంగాలీ మహిళలాగా కనిపించేది. ఖుకుమాసి పిన్ని మౌనంగా తన పని తాను చేసుకొనిపోతుందని అమ్మ ఎప్పుడూ చెప్పేది. ఇంట్లో ఇద్దరు పనివాళ్ళు ఉన్నా ఆమెనే ముందు పరిగెత్తుతుంది.

మా తాతకు మొత్తం ఐదు మంది సంతానం, అమ్మ, చిన్నమ్మ లిద్దరు కాక ఇద్దరు మామలు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు మామలగురించి, మా పెద్దఅత్త గురించి తరువాత చెప్తాను.

ఇక నా తోబుట్టువుల దగ్గరకి తిరిగి వస్తాను. నేను పుట్టిన ఒకటిన్నర సంవత్సరానికి తమ్ముడు పుట్టాడు. మా నాన్నగారు తమ్ముడిని చూసి ఎంత ఉద్వేగంతో పొంగిపోయారో మా అమ్మ తరచూ వర్ణించి చెప్పేది. చనిపోయిన మా పెద్దమ్మగారి ఇద్దరు ఆడపిల్లలను, నన్ను కలుపుకొని ముగ్గురు ఆడపిల్లల తర్వాత వాడు పుట్టాడని మా నాన్నగారు ఎంతో పరవశించిపోయారు. నా తమ్ముడు చందన్ ఇంటికి రాకుమారుడు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. కనుక రాచమర్యాదలు. వాడి చూపులు, అమాయకత్వం ఎంతో ముద్దొచ్చేది. అల్లారుముద్దుగా పెరిగాడు. నా ప్రేమలో తడిసి ముద్దయ్యేవాడు. వాడిదంతా మహారాజు పోకడ. బట్టలైనా, తిండి అయినా ఏదో మామూలు వాటితో సర్దుకపోయే రకం కాదు. చందన్ కన్నా నేను ఒకటిన్నర సంవత్సరమే పెద్ద కనక ఎప్పుడూ కలిసి ఆడుకునేవాళ్లం, కొట్టుకునేవాళ్ళం. సహోదరుల మధ్య పోటీ ఉండడం సర్వసామాన్యం. కానీ, వాడే నాకు ఎప్పుడూ “బాస్”అని వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కోసారి మా తమ్ముడిని చూసి నేనే భయపడేదాన్ని. వాడి చుట్టూ ఆకర్షణీయమైన ఒక వింత కాంతివలయం (Aura) ఉండేది. వాడి పుట్టినరోజును పెద్ద ఉత్సవంగా పరిగణించేవారు. హంగు, ఆర్భాటాలతో వైభవంగా చేసేవారు.

నాన్నగారు పనిచేసే కళాశాల అధ్యాపకులు, గుమాస్తాలు, అటెండర్లు, అందరూ వచ్చేవారు. రకరకాల శాకాహార మాంసాహార వంటకాలను తయారు చేయించి వడ్డించేవారు. ఆచార్య శ్రీధర్ ప్రసాద్ గారు మహమ్మద్ రఫీ( హిందీ సినిమా గాయకుడు) పాటలతో మమ్మల్ని ఎంతో ఆకట్టుకునేవారు. మా అమ్మ రవీంద్రసంగీత్ (ఠాగూర్ స్వరపరిచిన గీతాలు) మృదుమధురంగా పాడితే అందరూ మంత్రముగ్ధులై కరతాళ ధ్వనులు చేసేవారు. గ్రూప్ “డి” ఉద్యోగులకు (అటెండర్లు, స్వీపర్లు, ఇలా చిన్న స్థాయి ఉద్యోగులు) నాన్నగారు స్వయంగా భోజనం వడ్డించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. అలా వడ్డించడంలో ఆయన కెంతో ఆనందం, తృప్తి కలుగుతాయని మాతో చెప్పేవారు.

చెల్లెలు మాల మానవజన్మ ఎత్తిన ఓ దేవకన్య. నిశ్శబ్దంగా ఎప్పుడూ బొమ్మలతో ఆడుకునేది. తలబిరుసుగా అల్లరి చేసేది కాదు. ఒకరిద్దరు పనివారు ఇంట్లో ఉన్నా అమ్మనే ఎక్కువగా మమ్మల్ని కనిపెట్టుకొని ఉండేది. మా అవసరాలను పట్టించుకునేది. వంటమనిషి ఉన్నా, వంట పనులన్నీ స్వయంగా చేయడంలోనే ఆసక్తి చూపేది. అమ్మ చేసిన ‘పాయసం’ చాలా రుచిగా ఉండేది. దాని కమ్మదనాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. తమ్ముడు చందన్ నామీద పడి కుప్పిగంతులేస్తూ, ఎగురుతూ, దుంకుతూ ఆడుకోవడం చుట్టే నా బాల్య స్మృతులన్నీ అల్లుకొని ఉన్నాయి.

నా మదిలో నిలిచిపోయిన రెండు సంఘటనలను ఇక్కడ పేర్కొంటాను. మా పెద్ద మామ ఒక అందమైన పూసలహారాన్ని నాకు బహూకరించాడు. అది నిజంగానే చాలా అందంగా ఉంది. ప్రపంచంలోనే ఇంతకన్నా మరో గొప్ప వస్తువు ఉండదన్నంతగా నచ్చింది. నేను ఒక మధ్యాహ్నం పూట ఆ పూసలదండను మెడలో వేసుకొని అద్దం ముందు నిలుచుని చూసుకుంటూ, ఒక మహారాణి లాగా మెరిసిపోతూ మురిసిపోతూ ఉన్నాను. కాసేపు అయ్యాక నా హోంవర్క్ చేసుకోవడంలో మునిగిపోయాను. దాని సంగతే పట్టించుకోలేదు. తమ్ముడు చందన్ వచ్చి నా వెనకే కూర్చున్నాడు. మెల్లగా హారాన్ని పట్టుకొని లాగాడు. అంతే. పూసలన్నీ తెగి చెల్లాచెదురై నా ఒళ్ళో కొన్ని, పక్కలో కొన్ని పడిపోయాయి. ఏడుపొచ్చింది. ఎంత పెద్దగా అరిచేశానో! ఇంకో సంఘటన ఇది తప్పకుండా పాఠకులకు చక్కిలిగింతలు పెడుతుంది. నేను ఒకసారి కత్తెరతో నా ముంగురులను సరి చేసుకుంటున్నాను. చందన్ ఆకస్మాత్తుగా నా రూమ్ లోకి పరిగెత్తుకొచ్చాడు. అమాంతం కత్తెర తీసుకొని నా కణతల మీది వెంట్రుకలని కత్తిరించాడు. కాసేపయ్యాక గాని వాడు చేసిన చిలిపి పనేమిటో గమనించలేకపోయాను. ఎంత తమాషా జరిగిపోయింది! ధారాపాతంగా నా కన్నీళ్లు చెంపల మీదుగా ప్రవహిస్తున్నాయి. నాకు ఇప్పటికీ గుర్తుంది. చందన్ కత్తిరించిన వెంట్రుకలతో ముఖం వికారంగా కనిపించకుండా క్లిప్పులు పెట్టి మామూలుగా కనిపించేలా ఎంతో అవస్థ పడాల్సివచ్చింది. కానీ వారం రోజులపాటు నా మిత్రులు ప్రశ్నాస్త్రాలను ఎక్కుపెడుతూనే ఉన్నారు. వాటన్నింటికీ జవాబులు చెప్పాల్సి వచ్చింది. నాది బాలబాలికలు కలిసి చదివే పాఠశాల. మగ పిల్లలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆడపిల్లలు మాత్రం సానుభూతి కురిపించారు. కానీ అదంతా పై పైనే అని నాకు బాగా తెలుసు.

నా చెల్లెలు మాల మరీ మెతక మనిషి. ఎవరితోనూ అంతగా కలువలేకపోయేది. అది ‘అమ్మ కూచి’. (అమ్మను విడిచిపెట్టి ఒక నిమిషం కూడా ఉండలేని వారిని అమ్మకూచి అంటారు) మా అమ్మ కూడా దాన్ని ఎప్పుడూ ఒక కంట కనిపెట్టుకొని ఉండేది. అది (చెల్లి మాల) బొమ్మలతో ఆడుకుంటూ, మాట్లాడుకుంటూ, వాటికి బట్టలు తొడుగుతూ, పెళ్లిళ్లు చేస్తూ తన ఊహ ప్రపంచంలో తాను ఉండిపోయేది. అమ్మకు కూడా బొమ్మల పెళ్లిళ్లు అంటే చాలా సరదా. బొమ్మల పెళ్లిళ్ల కోసం నా స్నేహితురాళ్ళను పిలిచి రకరకాల పిండి వంటలు చేసి పెట్టేది. పెళ్లికూతురు దుస్తులను ప్రత్యేకంగా కుట్టించేది. అబ్బా! ఎంత ఆనందంగా గడిపేవారిమో ఆ రోజుల్లో! మంచి రెండు ఉన్నత ఆసనాల్లో వధూవరులను (బొమ్మలను) కూర్చోబెట్టేవాళ్ళు. మా అమ్మ నిజంగానే పెళ్ళికూతురు తల్లి ఎలా హడావుడి పడుతుందో అలాగా హడావుడి చేస్తూ వడ్డించేది. నా ప్రియమైన అమ్మ గురించి ఏనాడూ విస్మరించలేని మధురమైన జ్ఞాపకా లెన్నో ఉన్నాయి.

మా నాన్నగారి సన్నిధి ఎంత ఉత్తేజకరంగా ఉన్నప్పటికీ, మరీ అంత చనువేమీ లేదు. కాస్త దూరం పాటించేవాళ్ళం. నావల్ల ఏ పొరపాటు జరగకపోయినా, ఏ తప్పు మేము చేయకపోయినా ఆయనంటే ఒక రకమైన జంకు. ఆయన ప్రవర్తన, మాట్లాడే తీరు వల్ల భయ గౌరవాలతో కూడిన ఒక వింత అనుభూతి మాలో కలిగేది. చిన్నప్పుడు నా ప్రోగ్రెస్ కార్డ్ (ఉన్నత పాఠశాలలో పరీక్షలయ్యాక ఇచ్చే మార్కుల పత్రం) చూపడానికి నాన్నగారి కళాశాలకు వెళ్లేదాన్ని. కాలేజీ దాకా ఉత్సాహంగా పోయినా, అక్కడ నాన్నగారి గదిలోకి పోవాలంటే మాత్రం కాళ్లు వణికేవి. గుండెలో దడ పుట్టేది. ఒక సంఘటన ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతుంది. ఓరోజు….. ఐదవ తరగతిలో ఉన్నప్పుడు నేను పసుపు పచ్చని లంగా, దానిమీద ఎర్రటి గౌను ధరించి చక్కగా దువ్వుకున్నాను. ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొని ఎంతో సంతోషంతో నాన్నగారి ఆఫీసు గదిలోకి వెళ్లాను. నాకు అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులే వచ్చాయి. నాన్నగారు నన్నెంతో ప్రశంసిస్తారని ఆశపడ్డాను. కానీ ముఖం చిట్లించి, తక్కిన మార్కులు ఎందుకు రాలేదని ప్రశ్నించడం మొదలు పెట్టాడు. దాంతో నేను పూర్తిగా కుంగిపోయాను. నేనెంత ఉత్సాహంతో నాన్నగారి దగ్గరికి పోయానో, అంత….. యుద్ధంలో ఓడిన సైనికుని లాగా ఇంటికి తిరిగి వచ్చాను.

మరో సంఘటన కూడా గుర్తొస్తుంది. నా చెప్పులు పాడయ్యాయి. బజారుకు పోయి కుట్టించుకోవాలి. మా ఇంట్లో పనిచేస్తున్న వారు ఎవరో ఒకరు నాకు తోడు రావాలి. ఆశ్చర్యంగా అనుకోకుండా సాయంకాలం మా నాన్నగారే నాతో వస్తానన్నారు. పాడయి పోయిన చెప్పుల జతను జాగ్రత్తగా మడిచి సంచిలో సర్దాను. చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరకు రిక్షాలో వెళ్లాం. రిక్షా దిగాక నాన్నగారు చెప్పులు ఇవ్వమన్నాడు. నేను చెప్పుల సంచి ఇంట్లోనే మరిచి వచ్చానన్నది గమనించాను. గుండె గుభిల్లుమన్నది. వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది. ఇక తిట్లు తప్పవనుకున్నాను.

కానీ నేను ఊహించనిది ఇంకోటి జరిగింది. నాన్నగారు ఏమాత్రం తిట్టకుండా, ఎంతో మృదువుగా నా భుజం మీద చేయి వేసి ఏం బాధపడకు. ఇంటికి పోతూ కొత్త చెప్పులు కొనుక్కొని పోదాం అన్నాడు. పాత చెప్పులను రెండు రోజుల తర్వాత బాగు చేయిద్దాం అన్నాడు. మా నాన్నగారేమిటి? ఇంత ఆప్యాయంగా ప్రేమతో మాట్లాడడం ఏమిటి? ఈ వింత అనుభవం మా నాన్నగారి వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని నాకు పరిచయం చేసింది. నాకు ఇంత దాకా తెలిసిన మా నాన్నకు భిన్నమైన నాన్నను నేను చూశానారోజు. నామీద ప్రేమాభిమానాలను కురిపించిన పార్శ్వాన్ని మా నాన్నలో తొలిసారిగా చూశాను.

నాకు చిన్నప్పటినుండి ఆత్మగౌరవం పాలు ఎక్కువే. అప్పుడు నేను ఐదవ తరగతి. నా మిత్రులతో నేను సరస్వతీ పూజ చేసుకోవడానికి కొన్ని డబ్బులు ఇవ్వమని నాన్నగారిని అడిగాను. ఎందుకో గాని ఆ రోజు ఆయన కోపంగా ఉన్నారు. ఇవ్వలేదు సరి కదా! కోపంగా చూస్తూ తటాలున నా చెంప మీద ఒక దెబ్బ వేశాడు. నా చెంప ఎర్రగా కందిపోయింది. ఐదు వేళ్ళు ముద్రపడ్డాయి. అవమానంతో రగిలిపోయాను. కొన్నిరోజుల దాకా నాన్నగారితో మాట్లాడలేదు. నాన్నగారు నా దిక్కు మాటిమాటికీ దొంగ చూపులు చూస్తూ వచ్చే చిరునవ్వును బలవంతంగా అణుచుకుంటూ ఉండటం కూడా నేను గమనించకపోలేదు. మరో సంఘటన. మా పక్కింటి ఆవిడ గంగూలి  కాకిమా (పిన్ని) తన పట్ల నా ప్రవర్తన సరిగా లేదని, తగిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని నాన్న గారికి ఫిర్యాదు చేసింది. ఇతరుల పట్ల ఎంతో గౌరవం మర్యాదలతో ప్రవర్తించాలని ఎప్పుడూ చెప్పే నాన్నగారు నన్ను ఎంత తీవ్రంగా మందలిస్తారో అని హడలిచచ్చాను. కానీ జరిగింది వేరు. ఆయన ప్రశాంతంగా “నేను నమ్మను. నా బిడ్డ ఎప్పుడూ అలా ప్రవర్తించదు”. అని అంతటితో ఆగకుండా “నా బిడ్డల్లో ఎంతో హుందాగా నడుచుకునేది అదే”నని నన్ను ప్రశంసించాడు. మా నాన్నగారి సున్నితమైన సమాధానంతో అకారణ ద్వేషంతో, నన్ను కించపరచాలన్న గంగూలి పిన్ని పన్నాగం విఫలమైంది. ఈరోజు తలుచుకొంటే అదంతా ఒక నవ్వులాటగా అనిపిస్తుంది.

మా నాన్నగారు నాకెప్పటికీ ఆదర్శం. నాకప్పుడు ఎనిమిదేళ్ళు. అప్పటి భారత రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ లాంటి పెద్ద పెద్ద వారి సమక్షంలో మా నాన్న ప్రసంగించడం నాకెంతో గర్వకారణం. మా నాన్నగారి గంభీరస్వనం జోర్హాట్ స్టేడియం నలుమూలలా ప్రతిధ్వనించేది. ఆయన చెప్పేదేమిటో పూర్తిగా నాకు బోధపడకపోవచ్చు. కానీ, తల్లిదండ్రుల వెంబడి వచ్చిన నా సహాధ్యాయ మిత్రుల దిక్కు గర్వంగా చూసేదాన్ని. నాకెంతో ఇష్టమైన బంగారు జరి అంచు గౌను వేసుకొని, నా కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని, ప్రసంగిస్తున్న మా నాన్నను తదేకంగా, ఆరాధన భావంతో చూసేదాన్ని.

ఇప్పుడు, నా చిన్నప్పుడు నేనెంత దూడుకుగా కూడా వ్యవహరించానో తెలియడానికి ఒక సంఘటన పేర్కొంటాను. అస్సాం నుండి బెంగాలీ ప్రజలు వెళ్లిపోవాలన్న ఉద్యమం ఉవ్వెత్తున చెలరేగిన రోజులవి. ఆరోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన నాకింకా గుర్తుంది. మా నాన్నగారికి ఇష్టమైన మూడు నాలుగు వంటకాలు చేశాడు వంటమనిషి. భోజన సమయం. మా నాన్న ఎంతో ప్రసన్న వదనంతో కంచంలోని కూరగాయలను చూస్తూ కూర్చున్నారు. వెంటనే ఆ ప్రసన్నత్వం చెదిరిపోయింది. వీధిలోంచి పెద్దపెద్ద అరుపులు, కేకలు. రాళ్లు రువ్వుకోవడాలు. సంఘవిద్రోహ శక్తులు వీర విహారం చేశాయి. మా అమ్మ పూర్తిగా మంచానికి అతుక్కొని పోయి ఉంది (దీన్ని తర్వాత వివరిస్తాను). కళ్ళు పెద్దవి చేసుకొని తలకాయ అటు ఇటు తిప్పడం తప్ప లేవలేని స్థితిలో అమ్మ ఉంది. ఆ గొడవ ఇంకా ఉధృతం అవుతుంది. కిటికీ పగిలిన చప్పుడుతో ఒక్కసారిగా మా గుండె ఆగిపోయినంత పని అయింది. అంత అకస్మాత్తుగా ఏం జరిగిందో నాకు ఇప్పటికీ తెలియదు. ఎనిమిదేళ్ళ పిల్లను. పరుగెత్తుకొని వెళ్ళి తలుపులు తీశాను.

రాళ్లు విసురుతున్న ఆ మూక మీద అస్సామీ భాషలో నా చిన్నగొంతుతో పెద్దగా అరవడం మొదలు పెట్టాను. వారంతా ఆశ్చర్యంతో ఒక నిమిషం ఆగిపోయారు. ఒక పెద్ద రాయి మా అమ్మ దిండు పక్కనే పడింది. రెప్పపాటులో మా అమ్మ తప్పించుకున్నదని అల్లరి ఆపేయమని ప్రార్థించాను. ఇది చూసి ఒక పెద్దాయన బహుశా వారి నాయకుడు కావచ్చు. వచ్చి ఆపి అక్కడినుండి వారిని వెళ్లిపొమ్మని చెప్పాడు. దాంతో ఒకరి వెనుక ఒకరు జారుకున్నారు. ఇది జరిగాక ఎప్పుడూ నా మీద అధికారం చలాయించే మా తమ్ముడు చందన్ (ఆరున్నరేళ్ళు) చూపులో మార్పు వచ్చింది. నన్నేదో కొత్తకోణంలో చూడడం మొదలు పెట్టాడు. అప్పటినుంచి నేను వాడి దృష్టిలో ఒక “రాణి లక్ష్మీ బాయి”ని.

(సశేషం)


శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ప్రకృతి వనరులకు నిలయమైన సుందర రాష్ట్రం అస్సాంలో పుట్టిపెరిగారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి (బి.ఎ. ఆనర్స్) డిగ్రీ చేశారు. మేఘాలయ లోని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (NEHU) నుంచి బి.ఎడ్. చేశారు. రామకృష్ణ వివేకానంద మిషన్ లోనూ, బారక్‍పూర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లోనూ ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేశారు. రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తూ కథలూ, కవితలూ రాస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారు.

‘Peeping Through My Window’ (ఆత్మకథ)ను విరాసత్ ఆర్ట్ పబ్లికేషన్స్, 2022లో ప్రచురించింది. ఈ ఆత్మకథలో కావేరి ప్రధానంగా తాను బ్రెస్ట్ కాన్సర్‍పై చేసిన పోరాటాన్ని తెలిపారు. ‘The Twilight Bells’ (తొలి కవితా సంపుటి) 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘The Bindupara Tales & The Four-Lettered Word Love’ (కథాసంపుటి) డిసెంబరు 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘Apparitions from the other World’ (అతీత అనుభవాల తొమ్మిది కథలు) పుస్తకాన్ని 2023లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ప్రచురించింది.

కావేరీ చటోపాధ్యాయ పశ్చిమ బెంగాల్ లోని బారక్‍పూర్‍లో నివసిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here