‘ఆటుపోట్ల కావేరి’ – శ్రీమతి కావేరి చటోపాధ్యాయ ఆత్మకథ-2

0
9

[శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ఆత్మకథ ‘Peeping Through my Window’ ని ‘ఆటుపోట్ల కావేరి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలుగుశాఖ విశ్రాంతాచార్యులు, డా. వెలుదండ నిత్యానంద రావు. Dr. Veludanda Nithyananda Rao’s translation of Mrs. Kaberi Chattopadhyay’s autobiography ‘Peeping Through my Window’ in Telugu. Special thanks to Partha Pratim Roy, chief coordinator, Virasat Art Publication, Kolkata.]

అధ్యాయం 3 – సెలవుల్లో మా మేనమామ ఇంట్లో….

[dropcap]తా[/dropcap]త అమ్మమ్మ చనిపోయాక తరచూ సెలవుల్లో మా పెద్ద మామ ఇంట్లోనే ఉండేవారం. ఒక బెంగాలీ బాల గేయం పేర్కొనకుండా ఉండలేకపోతున్నాను

తాయి, తాయి, తాయి మామ బారి జాయి,

మామా బారి భారి మోజా కిల్ చోర్ నాయి

మేనమామ ఇంటికన్నా సంతోషకరమైనది, సుఖకరమైనది మరొకటి లేదు. ప్రేమ అభిమానాలే తప్ప తిట్లు శాపనార్థాలకు చోటు లేనిది అదొక్కటే. మా మామ ఇల్లు ఈ విషయంలో చాలా ఆదర్శవంతమైనది. మా పెద్ద మామ అశోక్ అందరికన్నా పెద్ద. మంజు మామ అందరికన్నా చిన్న. (మధ్యలో మా అమ్మ, చిన్నమ్మ లిద్దరన్నమాట.) అశోక్ మామ అన్ని విధాల పెద్దమనిషి. ఆయనకు ‘ధర్మరాజు’ అని మారుపేరు (nick name). ఆత్మగౌరవానికి, సత్యనిరతికి అసదృశునిగా మహాభారతంలో నిలిచిన పాత్ర ధర్మరాజు. (రచయిత్రి యుధిష్ఠిరుడని ప్రయోగించింది. యుధిష్ఠురుడంటే యుద్ధరంగంలో స్థిరంగా నిలువగలిగినవాడు-అని అర్థం. ఇది పరాక్రమ సూచకం. తెలుగులో ఒకవిధమైన మెతకమనిషిని ధర్మరాజని పిలువడం జాతీయం. అందుకే ఇక్కడ యుధిష్ఠురునికి బదులు ధర్మరాజని మార్చడమైంది.)

తనకున్నదంతా ఊడ్చి ఇవ్వడానికి కూడా ఏమాత్రం సందేహించని వ్యక్తి ధర్మరాజు. పెద్దమామ ముఖంలో ఎప్పుడూ పసిపిల్లవాని అమాయకపు చిరునవ్వు లాంటి నవ్వు తాండవించేది. ఆయన ఓ మోస్తరు ఎత్తు. గోధుమ వన్నె ఛాయ. కుదురైన పండ్లు. మా పెద్ద మామ ‘పెళ్ళాం చాటు మొగుడు’, ‘కొంగు చాటు కృష్ణుడు’ (hen pecked husband) అని ప్రసిద్ధి. తన మార్గంలో తాను హుందాగా ఉండేవాడు. నా స్వభావానికీ, ఆయన ఉండే తీరుకు బాగా కుదిరింది. అందువల్ల నన్ను అభిమానించడంలో ఆశ్చర్యమేమీ లేదు.

అందమైన రంగురంగుల పూసలదండ నాకు అశోక్ మామ బహూకరించిన సంగతి గతంలో చెప్పాను. మామ మమ్మల్ని బజార్ (మార్కెట్ ప్లేస్)కు తీసుకొని వెళ్లేవాడు. కూరగాయలు, చేపలు, ఇతర సామాను కొన్నాక మా ముగ్గురి (నేను, చందన్, మాల) కి క్యాండీ, చాక్లెట్స్ కొనిచ్చేవాడు. ఈ రోజుల్లో దొరికినట్లుగా క్యాడ్బరీ. ఇంకా చాక్లెట్స్ అంతగా ఆ రోజుల్లో దొరకకపోయేవి. పిల్లలు చాలా తక్కువ రకానివి చక్కెరపాకం లాంటి పిప్పరమెంట్లు అడిగేవారు. వాటితోనే సంతృప్తి పడేవారు. మామ ఇప్పించిన చాక్లెట్లను దోసిట్లో పెట్టుకుని, చూసేవారు అసూయపడే విధంగా ఎంతో ఉత్సాహంగా ఇంటికి వచ్చేవారం. పెద్దత్త లాంటి ప్రేమాభిమానాలు కురిపించే మరో మనిషి నా జీవితంలో తారసపడలేదు. ఆమె పొట్టిది. చామనఛాయ. ఆమెవి ఆకర్షణీయమైన నల్లటి రింగులు తిరిగిన కురులు. అయినా మనిషిని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆమెలోని ప్రేమాభిమానాలు ఉట్టిపడుతున్నాయని చెప్పడానికి మామూలు చూపులే చాలు. ఆమె ఎంతో మృదువుగా మాట్లాడుతుంది. అత్తమామల సేవ పట్ల ఎంతో శ్రద్ధ వహించేది. స్వతహాగా అణుకువతో మెలిగే మనిషి. పెద్ద మామ ఇంట్లో స్నానం చేయడాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా పెద్దత్త నా శరీరమంతా పసుపు రుద్దేది. కొన్నిసార్లు నిమ్మ, ఆరింజ తొక్కలు దంచి ముద్దగా చేసి నా శరీరం అంతా పట్టించేది. తర్వాత ఆ చలికాలంలో వేడినీళ్లతో స్నానం చేస్తుంటే ఎంతో హాయిగా ఉండేది. పెద్దత్త ఇంటి పనుల్లో నేర్పరి. వంట పనులు చురుగ్గా చేసేది. మసాలా దినుసులు వేసి చేపలు వండితే ఇంటిల్లిపాది ఆమెను మెచ్చుకుంటూ తినేవారు. ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా అత్త చేసిన వంటకాలన్నీ మనస్ఫూర్తిగా మెక్కేవాళ్లం. ఒక అమ్మమ్మ తప్ప అందరూ పెద్దత్తను మెచ్చుకునే వారే. తన కొడుకుకు తగిన అందమైన ఇల్లాలు కాదని అమ్మమ్మ భావం. నచ్చకపోవడానికి మరో కారణం కూడా లేకపోలేదు. ఆమె బెంగాలీ మనిషి కావడం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. బెంగాలీ వారిలో రెండు ప్రధాన వర్గాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన బెంగాలీలు. (ఆ రోజుల్లో తూర్పు పాకిస్తాన్ అనేవారు.) వీరిదొక వర్గం కలకత్తా. పరిసర ప్రాంతాలలోని వారిది మరొక వర్గం.

ఈ రెండవ వర్గం వారిని బెంగాలీ సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో ప్రామాణికులుగా పరిగణిస్తారు. అమ్మమ్మ వ్యతిరేక వైఖరికి అత్త బాగా బాధపడేది. కానీ, ఏమాత్రం పైకి అలా కనిపించేది కాదు. లోలోపల మాత్రం ఎంతో కుమిలిపోయేది. తాత మాత్రం ఆమెను బాగా అభిమానించేవాడు. ఇది ఆమెకు ఎంతో బలాన్ని ఇచ్చింది. బాధనుండి తేరుకోవడానికి తోడ్పడింది. దీనివల్ల తాత పట్ల అత్తకు ఒక రకమైన ఆత్మీయత, ఇష్టం ఏర్పడ్డాయి. మంజుమామ తాత సంతానంలో చివరివాడని ఇంతకు ముందే చెప్పాను. ఆయనొక విలాసపురుషుడు. ఎవరితో కలవకుండా ప్రత్యేకంగా ఉండేవాడు. కొన్నిసార్లే ఆయనను చూశాను. పెద్దమామ ఇంట్లో ఉన్న రోజుల్లో మంజుమామ మధ్యాహ్నం భోజన సమయంలోను, రాత్రి భోజన సమయంలోను కనిపించేవాడు. స్నేహితులతో పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయి ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పుడు త్వరత్వరగా దొంగ చూపులు చూస్తూ తన గదిలోకి వెళ్లిపోయేవాడు. మంజుమామ మీద కోపంతో తాత గట్టిగా వేసిన కేకలు ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అమ్మమ్మ బాధతో కంటనీరు పెట్టేది. కానీ అవేవీ మంజు మామ ప్రవర్తనలో ఎలాంటి మార్పును తీసుకొని రాలేకపోయాయి. తాతతో పెద్ద కొట్లాట జరిగి మంజుమామ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని తర్వాత అమ్మ చెప్పింది. నాగాలాండ్ లోని ‘పెక్’ అనే గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్‌గా చేరాడు. అప్పుడప్పుడు ఏదో ముక్తసరిగా ఒకటి రెండు మాటలతో ఉత్తరాలు రాసేవాడు. చివరికి కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెగతెంపులు చేసుకున్నాడు. మంజుమామ ఒక నాగాలాండ్ యువతిని సంప్రదాయానికి విరుద్ధంగా పెళ్లి చేసుకోబోతున్నాడని ఓ సాయంకాలం మా ఇంట్లో గుసగుసలుగా చెప్పుకున్నారు. తాత అమ్మమ్మల హృదయాలు పూర్తిగా గాయపడ్డాయి. మామ తిరిగి ఇంట్లోకి కాలు పెట్టలేదు. ఆయన నాగాలాండ్ లోనే స్థిరపడ్డాడు. అక్కడి అమ్మాయిని పెళ్లాడాడు. కాలక్రమంలో నలుగురు ఆడపిల్లలు కలిగారని ఎప్పుడో తెలిసింది. ఆ పిల్లలందరూ తల్లి పోలికలతో అందంగా ఉన్నారని కూడా తెలిసింది. మంజుమామ నాకు ఎప్పుడూ అర్థం కాని ఒక రహస్యమే. మామను తలుచుకున్నప్పుడల్లా, సిగరెట్ తాగడం వల్ల గార పట్టిన పండ్లతో సిగ్గుపడుతున్న చూపులతో ఒక రూపం నా కళ్ళల్లో మెదులుతుంది.

మంజుమామతో ఎక్కువగా కలవకపోయినా ఏదో అనిర్వచనీయమైన ఆత్మీయ అనుబంధం మాత్రం ఉన్నట్లు ఎందుకు అనిపిస్తుందో చెప్పలేను. ఇది కేవలం రక్తసంబంధం అనే కాదు. దానికి అతీతమైంది ఇంకా ఏదో ఉంది. మొండితనంతో మామ ఎదుర్కొన్న అవమానాలు, తిరస్కారాలు చిన్నతనంలో నేను ప్రత్యక్షంగా చూడడం కారణమైతే కావచ్చు. జానువాసి, కుకుమాసి ఇద్దరు చిన్నమ్మల గురించి ఇంతకుముందు అధ్యాయంలో ప్రస్తావించాను. వారిద్దరూ పెళ్లిళ్లు చేసుకొని హాయిగా సుఖంగా ఉన్నారు.

అధ్యాయం 4 – నా పాఠశాల రోజులు – అమ్మ అనారోగ్యం

నేను, చందన్, మాల ముగ్గురం జోర్హాట్ లోని ప్రముఖ ఆంగ్లమాధ్యమ పాఠశాల ‘హేమలత హ్యాండిక్యూ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్’లో చదువుకున్నాం. మా నాన్న మమ్మల్ని బెంగాలీ మీడియం పాఠశాలలో చదివించాలనుకుంటే అమ్మ బలవంతం చేసి ఆంగ్ల మాధ్యమంలో ఈ పాఠశాలలో చేరేలా చేసిందని తరువాత తెలిసింది. జోర్హాట్ లోని ప్రముఖ వ్యక్తులలో ఒకరైన విజయ్ హ్యాండిక్యూ తన తల్లి హేమలత స్మారకంగా ఈ పాఠశాలను స్థాపించారు.

ఒకటి నుంచి పదవ తరగతి దాకా విశాలస్థలంలో పెద్ద పెద్ద గదులతో మా పాఠశాల ఉండేది. పాఠశాలకు వెళ్లడం తమాషాగా ఉండేది. అన్ని సబ్జెక్టులు ఎంతో ఆసక్తికరంగా ఉండేవి. అధ్యాపకులు కూడా చాలా బాగా చెప్పేవారు. నివేదిత బెహరా మేడం ఇప్పటికి గుర్తొస్తుంది. ఆమె ఎంతో ఆప్యాయంగా వ్యవహరించేది. అట్లాగే చాలా క్రమశిక్షణగా ఉంచేది. మా సంగీతం అధ్యాపకుడు డెన్నిస్ బ్యాంక్ పియానో వాయించడంలో దిట్ట. ఆసక్తిగల విద్యార్థులను తన పియానో మీద వాయించమని ప్రోత్సహించేవాడు. గోల్డ్ స్మిత్ అనే మరో సంగీత అధ్యాపకుడు కూడా ఎంతో మధురంగా ఆలపించేవాడు. ఆయనంటే నాకు ఎంతో అభిమానం ఉండేది. ఆయనలాగా నేను తారస్థాయిలో పాడేదాన్ని. పాఠశాల వార్షికోత్సవాలు చాలా ఘనంగా జరిగేవి. ఇప్పటికీ నాకు కొన్ని గుర్తున్నాయి. పాటలు, నృత్యాలు, ఏకాంకికలు అన్నింటితో సందడిగా ఉండేది. పాఠశాల బయట దుకాణాలు పెట్టేవారు. వాటిలో నోరూరించే తినుబండారాలుండేవి. వాటిని కొనుక్కొని తినడానికి మా అమ్మను డబ్బులు ఇవ్వమని వేధించే వాళ్ళం. నాకైనా, తమ్ముడు చందన్ కయినా నాన్నను డబ్బులు అడగడానికి ధైర్యం చాలేది కాదు. అమ్మ మాత్రం ఎంతో ఉదారంగా ఇచ్చేది. మా ఉపాధ్యాయులు మా పట్ల ఎంతో అభిమానం చూపించేవారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. వాళ్ళు బాగా చదువుకున్నవారు. అట్లాగే ఏ సందేహం వచ్చినా నిస్సంకోచంగా అడగడానికి తగిన చనువిచ్చేవారు. వారిలో కొందరు మాకు సహాయం చేయడానికి ఎంతకైనా వెనుకంజ వేసేవారు కాదు. ఎంత కష్టమైనా భరించేవారు. ఒక సంఘటన ఇప్పటికీ నా మనసు నుండి చెదిరిపోలేదు. అప్పుడు నేను నాలుగవ తరగతి. మా లెక్కల మేడం (అప్పటికి ఆమెకింకా పెళ్ళి కాలేదు.)కు ప్రతి లెక్క పక్కనే రఫ్(rough) కూడా చేసి సొంతంగా చేశామని చూపాం. ఆమె fair, rough రెండు కలగలుప వద్దని, రెండు వేర్వేరు నోటుబుక్కుల్లో ఉంటే అప్పుడు లెక్కలు సులభంగా అర్థం అవుతాయని చెప్పారు. నేను ఒకసారి fair దాని పక్కనే rough కలిపి ఉంచాను- అని నా రెండు చెవులు గట్టిగా లాగుతూ “అమ్మాయి! రెండు కలగలపడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఎప్పుడన్నా జ్వరం వస్తే మా అమ్మ తప్పక మిక్చర్ (శనగపిండితో చేసే కారప్పూస) పెడుతుందిలే. నీవు మాత్రం మిక్చర్ పెట్టకు” అంది. (fair, rough ఒకే నోట్‌బుక్‌లో కలిపేసి రాయవద్దు అనడానికి మిక్చర్ అని ప్రయోగించింది).

నేను చదువుల్లో చాలా చురుకైన దాన్ని. నా జ్ఞాపకశక్తి అమోఘం అని అధ్యాపకులు ప్రశంసించేవారు. ఎంతకాలమైనా గుర్తుపెట్టుకోగలను. మూడవ తరగతిలో నాకు డబుల్ ప్రమోషన్ వచ్చింది. అంటే నాలుగు చదవాల్సిన అవసరం లేకుండా ఐదులో చేరడం. నా తరగతి ఉపాధ్యాయుడు వచ్చి పై తరగతిలో నన్ను కూర్చోబెట్టాడు. విద్యార్థుల ముఖాలన్నీ సరికొత్తవి. ఏ కొందరినో ఉదయం ప్రార్థన సమయంలో చూసి ఉంటాను. నాకు అంతా కొత్తగా ఉంది. నా తోటివారిని పోగొట్టుకున్నాను. అధ్యాపకులకు నేనంటే ఎంతో వాత్సల్యం. ఆటలకు, వినోదాలకు నేనెప్పుడూ దూరం. అయినా, మా అధ్యాపకులు దాన్ని పట్టించుకోకుండా అభిమానించేవారు. బ్యాడ్మింటన్, కోకో కొన్నిసార్లు ఆడాను.

నాకు కొంతమంది మిత్రులు నేటికీ బాగా గుర్తున్నారు. ఒక పంజాబీ అబ్బాయి మహ్మద్ రఫీ మధురగీతాలను ఎంతో శ్రావ్యంగా, ఉల్లాసంగా పాడేవాడు. అతను పాడుతూ మధ్య మధ్యలో బెంగాలీలో చేసే వ్యాఖ్యానాలు ఆర్ద్రంగా ఉండి చాలామందిలో కంటనీరు పెట్టించేవి. ఆ రోజుల్లో నేను ఎవరితోనూ కలవకుండా నాలో నేనే ఎక్కువగా ఉండిపోయేదాన్ని. అందరిలో కలివిడిగా మారడానికి కొన్ని రోజులు పట్టింది. నేను అందంగానే అనిపించినా నా శరీరాకృతి ఎవరిని ఆకర్షించేది కాదు. దాంతో చాలామంది నన్ను పట్టించుకునే వారు కాదని చెప్పగలను. బక్కగా, పీలగా ఉన్న నన్ను వారిలో కలుపుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఇది చాలా సహజమే. నా సహాధ్యాయుల ప్రేమాభిమానాలు నాకు కరువై నేను ఒంటరిగా మిగిలిపోయాను. నేను అందంగా లేను అన్న కారణంతో తరగతిలోని అందమైన అమ్మాయిలు నన్ను పక్కకు పెట్టడం నా హృదయాన్ని గాయపరిచింది. మా లెక్కల అధ్యాపకురాలితో నా అనుభవాన్ని ఇంతకుముందే చెప్పాను. ఆమె వల్ల నేను కొట్టివేతలు, మురికి లేకుండా కుదురుగా అందంగా రాయడం నేర్చుకున్నాను. ఆమె నుంచి నేర్చుకున్న ఈ గొప్ప పాఠం నా తర్వాతి జీవితంలో ఎంతో మేలు చేసింది. నా అందమైన, కుదురైన రాతను చూసి ఎంతో మంది ప్రశంసించేవారు. నా రాత పనుల్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఏమాత్రం కొట్టివేతలు, దిద్దుబాట్లు లేకుండా ఆకర్షణీయంగా, స్పష్టంగా ఉండడానికి పాటుపడేదాన్ని.

మా పాఠశాలలో ‘సరస్వతీపూజ’ను భక్తిశ్రద్ధలతో చేసేవాళ్లం. ఆరోజు చీర కట్టుకోవాలన్న భావన నన్ను ఎంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ సందర్భానికి తగినట్లుగా పసువుపచ్చని చీరను అమ్మ బట్టల బీరువా అంతా గాలించి, గాలించి సంపాదించి కట్టుకోవడం నేటికీ గుర్తుంది. అందరూ తినడానికి ఆ రోజున పూరీలు తయారు చేయడం, ఇంకా ఇతర పనులన్నీ చేయడంలో అంతులేని ఆనందం కలిగేది. ప్రతి సంవత్సరం సరస్వతీపూజాదినం మా ఐకమత్యానికి ప్రతీకగా నిలిచిపోయింది.

మరో సందర్భం. ఉత్సాహంగా, వైభవంగా మేము క్రిస్మస్ జరిపేవాళ్ళం. చిరుగంటలు, నక్షత్రాలు, రంగురంగుల కాగితాలతో క్రిస్మస్ చెట్టును అలంకరించేవాళ్ళం. సంతోషంగా నవ్వుతున్న క్రిస్మస్ తాత బొమ్మను చేసేవాళ్ళం. మా సంగీతం అధ్యాపకులు గోల్డ్ స్మిత్, పియానో వాయించే డెన్నీస్ బ్యాంక్ మార్గదర్శకత్వంలో క్రిస్మస్ పాటలు పాడేవారం. పాఠశాల రోజుల నాటి మధురస్మృతులు జీవితాంతం మనసులో ఉండిపోతాయి. ఉపాధ్యాయులు, వారు చెప్పే తీరు, సన్నిహిత మిత్రులు, అట్లాగే కొన్నిసార్లు తిట్టుకొని మూతి ముడుచుకున్న మిత్రులు, ప్రతిరోజు ఒక కొత్త పాఠాన్ని నేర్చుకోవడం, మైదానంలో ఆటలు, మధ్యాహ్నం పూట టిఫిన్ బాక్సులు పంచుకోవడం, వేసవి సెలవుల తరువాత, చలికాలం సెలవులు తర్వాత మళ్లీ కొత్తగా అందరం కలుసుకోవడం – అంతా మరపురాని మధుర స్మృతులు. పాఠశాల రోజులనేవి జీవితానికి చైతన్యాన్ని ఇచ్చే సూర్యకాంతి లాంటిది.

నా బాల్యం మరీ అసాధారణమైనదీ కాదు. అట్లాగని అంతా సాఫీగాను సాగలేదు. దీన్ని వివరించాల్సిన అవసరముంది. నేను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు మా అమ్మ పూర్తిగా రోగంతో మంచాన పడటం ఒక పిడుగుపాటు. కోలుకోలేని పెను విషాదం. అది మా కుటుంబాన్ని ఎంతో క్రుంగ చేసింది. మా అమ్మ! ఎంత మంచిది! పొద్దున్నే మమ్మల్ని అందరినీ తయారు చేసేది.

రుచికరమైన వంటకాలతో ప్రతిరోజు లంచ్ బాక్స్ పెట్టేది. మమ్మల్ని ఆప్యాయంగా ముద్దు పెట్టుకొని స్కూల్‌కి పంపించేది. తిరిగి వచ్చేదాకా కాలు మీద కాలు నిలవకుండా ఎదురుచూసేది. ఒక్కోసారి భగవంతుడు ఎందుకంత నిర్దయుడో అన్న ప్రశ్న నన్ను ఎప్పుడూ వెంటాడేది. ఎంత దీర్ఘంగా ఆలోచించినా సమాధానం అంతు చిక్కలేదు. అమ్మకు కీళ్ల వ్యాధి వచ్చింది. స్థానిక వైద్యులు కొంత చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. ఆఖరికి డిబ్రూగర్ మెడికల్ కళాశాల (అస్సాం) లో మూడు నెలల పాటు చేర్చారు. ఆమెకు నయం కాకపోవడం బాధాకరమైన విషయం. కాళ్లు చేతులు ఏమాత్రం కదిలించకుండా పూర్తిగా మంచానికి అంకితం అయిపోయింది. నా ప్రియమైన అమ్మ- స్వయంగా నడుచుకుంటూ కారు దాకా వెళ్లి కారెక్కి హాస్పిటల్‌కి వెళ్ళిన అమ్మ- దానికి పూర్తి విరుద్ధంగా హాస్పిటల్ నుండి అంబులెన్స్‌లో రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె కదలికలన్నీ పరిచారకుల మీద ఆధారపడి ఉన్నాయి. సంపూర్ణ గృహిణి, ప్రేమమయి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన అమ్మ పద్నాలుగేళ్ళ పాటు మంచానికి అతుక్కుపోయి యాభయ్యవ ఏట అకాలమరణం పొందింది. మొదట మొదట అమ్మ అనారోగ్యాన్ని చూసి ఉబికి వస్తున్న నీటిని కండ్లల్లోనే అదుముకొని స్కూలుకు వెళ్లేవారం. ఆ రోజులన్నీ పూర్తిగా నిర్జీవంగా, నిస్సారంగా, విచారంగా సాగిపోయాయి. అమ్మ ఎంతో ఉత్సాహంతో, చిరునవ్వుతో, ప్రేమతో చేసి పెట్టిన లంచ్ (Lunch) ఈరోజు అదొక కలలోని ముచ్చట. అమ్మ పూర్తిగా మంచానికి అతుక్కొకొని పోవడం, చుట్టూ ఆయాలు ఉండడం, పదిహేను రోజులకోసారి అమెరికన్ డాక్టర్ వచ్చి చూడడం – ఇదీ ఆమె జీవితం.

అమ్మకు ఈ వ్యాధి అకస్మాత్తుగా వచ్చింది. మోకాలు చిప్పల దగ్గర కీళ్లు బాధపెడుతున్నాయని తరచు అనేది. పగలంతా ఇంటి పనుల్లో ఎట్లాగో అదుముకున్నా రాత్రిళ్ళు మాత్రం బాగా బాధపడేది. మోకాలు చిప్పల దగ్గర వాపు, జ్వరం వచ్చేది. ఆ రోజుల్లో మా అమ్మను నేను నిస్సహాయంగా చూసే ప్రేక్షకురాలిని. అందంగా వెలిగే ఆమె కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతున్నట్లు గమనించాను. అది నన్ను ఎంతో వేదనకు గురి చేసింది. అమ్మ ఉన్న దుస్థితిలో బాధపడడం తప్ప నేను ఏ రకంగానూ తోడ్పడలేని నిస్సహాయురాలిని. ఒక నల్లటి, లావాటి స్త్రీ. ఆమె పేరు ‘పుటు’. ఆమెను అమ్మకు మసాజ్ చేయడానికి నియమించారు. గోరువెచ్చని నూనెతో అమ్మ మోకాళ్ళను, ఇతర కీళ్ళను కాస్త బాధ నుండి ఉపశమింప చేయడానికి విపరీతంగా మసాజ్ చేయడంతో అమ్మ మరింత బాధపడేది. ఆమె మృదువైన చర్మం అంతా కందిపోయి ఎర్రటి వాతలతో నిండిపోయేది. నిజంగా ఇది అత్యంత హృదయవిదారకమైన స్థితి.

ఒక రాత్రి అమ్మ బాధ మరీ తీవ్రమయ్యేసరికి ఇంట్లో పెద్ద వారంతా డిబ్రూగర్ మెడికల్ కళాశాల (అస్సాం)లో తిరిగి చేర్చాలని నిర్ణయించారు. ఆ రోజున అమ్మ తనంతకు తాను కారు దాకా నడిచి స్వయంగా తలుపు తీసుకొని కూర్చుంది. అమ్మను తీసుకొని నాన్న బయలుదేరాడు. కారు కనిపించకుండా పోయేదాకా తదేకంగా చూసాం. మా హృదయాల నిండా ఏదో తెలియని విషాదం గూడు కట్టుకుంది. నా చిలిపి తమ్ముడు చందన్ మౌనంగా స్తబ్దంగా ఓరగా తెరిచి ఉన్న తలుపు దగ్గర నిలబడ్డాడు. అప్పటి నుండి వాడి ప్రవర్తనలో వింత మార్పు వచ్చింది. పూర్తిగా మూగిగా, ఏదీ పట్టని వానిగా కనిపించసాగాడు.

రోజులు గడిచిపోతున్నాయి. అమ్మకు సంబంధించిన వార్తలు ఏవి తెలియడం లేదు. నాన్నగారు క్రమం తప్పకుండా వెళ్ళి అమ్మను చూసి వస్తున్నాడు. మేము నాన్నగారిని నేరుగా ఏది అడగలేకపోయాం. అమ్మ హాస్పిటల్‌లో చేరాక నానమ్మ మాతో ఉండి మా బాగోగులు చూడడానికి వచ్చింది. ఆమె చాలా పొడుగరి. బాగా పనిచేస్తుంది. మా అమ్మ లేకపోవడంతో ఇంట్లో ఏర్పడిన శూన్యాన్ని నానమ్మ తన ప్రేమాభిమానాలతో భర్తీ చేసింది. మాకు పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టేది. మధ్యాహ్నం, రాత్రి వంట చేసేది. మాకు స్నానాలు పోసేది. దువ్వి జడలు వేసేది. రాత్రిపూట రాజు రాణి కథలు చెప్పేది. మహారాజా మహారాణి కథలకు బెంగాల్ సాహిత్యం గొప్ప ఖజానా. ఠాకుమార్ జూలీ నాయనమ్మ కథల భాండారం. కథలు చెప్పడం, అభిమానం చూపడం ఎంత చేసేదో అంత బాగా క్రమశిక్షణతో కూడా ఉంచేది. అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా, నిర్దిష్టంగా జరగాలని మాకు బోధించేది. ఆమె బాగా సేవలు చేసేది. ఒక రాత్రి నాకు బాగా జ్వరం వచ్చింది. రాత్రంతా నా పక్కనే కూర్చుని టెంపరేచర్ చూసింది. ఒక బట్ట తీసుకొని నీళ్లలో తడిపి నుదురుపై అదే పనిగా రాయడంతో ఆ వేడిమి తగ్గిపోయింది. నోటి పండ్లు ఊడిపోవడం వల్ల నానమ్మ పండ్ల చివుళ్ళతోనే రొట్టెలు చప్పరించి తినడం ఆశ్చర్యంగా వుండేది. ఆ పండ్లచివుళ్ళతో కొరికి తింటున్నప్పుడు ముఖం బాగా ఒత్తిడికి గురయ్యేది.

అమ్మ ఒక మధ్యాహ్నం హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది. ఒకరిద్దరు పట్టుకొని అమ్మను కిందికి దింపారు. ఇది అంత ప్రతిష్ఠాత్మకమైన హాస్పిటల్‌లో మూడు నెలలు ఉంచితే కలిగిన ఫలితం. పాలిపోయిన, జీవకళ లేని స్త్రీ యేనా మా అమ్మ? నా కళ్ళల్లోంచి నీళ్లు బొటబొట రాలాయి. గొంతు గాద్గదికమైంది. బలవంతంగా అణుచుకున్నాను. అమ్మ మా దిక్కు చూసి అంత బాధలోనూ నవ్వింది. అమ్మ వచ్చే ఏడుపును దిగమింగుకుంటూ నవ్విందని ఆ చిన్న వయసులోనే నేను గుర్తించాను.

ఒక మధ్యాహ్నం అమ్మ ఏడ్వడం చూశాను. కారణం చూస్తే నాకు కూడా చాలా బాధేసింది. మాల తన స్కూల్ బ్యాగ్‌ను పట్టుకోబోయి బొక్క బోర్లా పడిపోయింది. అమ్మ చూసి గట్టిగా అరిచింది. కానీ, వెళ్లి మూడేళ్ల పిల్లను లేపలేని స్థితి. మాలకు గీసుకొని పోయి రక్తం వచ్చింది. అప్పుడు అమ్మ దయనీయంగా చూసిన చూపులు ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి.

జీవితం సాగిపోయింది. పని వారి సాయంతోనే మేము ఎదిగాం. పని వారంతా ఎక్కువగా నేపాలీలు. మా అమ్మ విలువల గురించి, మెలగవలసిన తీరు గురించి ఎన్నో హితబోధలు చేసింది. అవన్నీ మా జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయి.

(సశేషం)


శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ప్రకృతి వనరులకు నిలయమైన సుందర రాష్ట్రం అస్సాంలో పుట్టిపెరిగారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి (బి.ఎ. ఆనర్స్) డిగ్రీ చేశారు. మేఘాలయ లోని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (NEHU) నుంచి బి.ఎడ్. చేశారు. రామకృష్ణ వివేకానంద మిషన్ లోనూ, బారక్‍పూర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లోనూ ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేశారు. రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తూ కథలూ, కవితలూ రాస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారు.

‘Peeping Through My Window’ (ఆత్మకథ)ను విరాసత్ ఆర్ట్ పబ్లికేషన్స్, 2022లో ప్రచురించింది. ఈ ఆత్మకథలో కావేరి ప్రధానంగా తాను బ్రెస్ట్ కాన్సర్‍పై చేసిన పోరాటాన్ని తెలిపారు. ‘The Twilight Bells’ (తొలి కవితా సంపుటి) 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘The Bindupara Tales & The Four-Lettered Word Love’ (కథాసంపుటి) డిసెంబరు 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘Apparitions from the other World’ (అతీత అనుభవాల తొమ్మిది కథలు) పుస్తకాన్ని 2023లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ప్రచురించింది.

కావేరీ చటోపాధ్యాయ పశ్చిమ బెంగాల్ లోని బారక్‍పూర్‍లో నివసిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here