‘ఆటుపోట్ల కావేరి’ – శ్రీమతి కావేరి చటోపాధ్యాయ ఆత్మకథ-4

0
10

[శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ఆత్మకథ ‘Peeping Through my Window’ ని ‘ఆటుపోట్ల కావేరి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలుగుశాఖ విశ్రాంతాచార్యులు, డా. వెలుదండ నిత్యానంద రావు. Dr. Veludanda Nithyananda Rao’s translation of Mrs. Kaberi Chattopadhyay’s autobiography ‘Peeping Through my Window’ in Telugu. Special thanks to Partha Pratim Roy, chief coordinator, Virasat Art Publication, Kolkata.]

అధ్యాయం 7 – తమ్ముడి ఉపనయనంనాటి విషాదం

[dropcap]త[/dropcap]మ్ముని ఉపనయనంనాటి ఘటన నా జీవితంలో ఎప్పటికీ చెరిగిపోని మచ్చగా మిగిలిపోయింది. బ్రాహ్మణ కుటుంబాల్లో ఉపనయనం అనేది కర్మలు, పూజలు చేసే అర్హత కలిగించేది. అందువల్ల మా తల్లిదండ్రులు ఎంతో ఉబలాటపడ్డారు. ఆచారపరులైన వారి ఇళ్లల్లో నేటికీ ఎంతో ప్రాధాన్యం ఉన్నా, ఉపనయనం అనేది ఇప్పుడు చాలా మటుకు లాంఛనప్రాయమైంది.

తమ్ముడి ఉపనయనానికి చేయాల్సిన పనులు చాలా ముందే ప్రారంభమయ్యాయి. ఘనంగా ఏర్పాటు చేశారు. నాన్న తన ఏకైక కుమారుడు, వంశోద్ధారకుడని ఉపనయనానికి బాగానే ఖర్చు చేశాడు. దేశం నలుమూలల నున్న బంధుమిత్రులకు ఆహ్వానపత్రికలు వెళ్లాయి. ఆ ముహూర్తం రానే వచ్చింది. ఇప్పటికీ నాకా సాయంకాలం బాగా గుర్తుంది. గేటు వద్దే నిలబడ్డాను. గులాబీల తోరణాలతో అందంగా ధనస్సు ఆకారంలో అలంకరించిన ముఖద్వారమది. ఎందుకో కానీ, ఏదో కీడు సంభవించబోతుందన్న వింత భావనకు నేను గురయ్యాను. ఆ రోజంతా ఒక వయసు మళ్ళిన పురోహితుడు ఏ చిన్నదీ వదిలిపెట్టకుండా, నిష్ఠగా యజ్ఞాది క్రతువులు నిర్వహించాడు. బిగ్గరగా చదువుతున్న మంత్రాలు ప్రాంగణమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా సమిధలు, ఆజ్యం యజ్ఞగుండంలో వేస్తూ అగ్నిహోత్రుని కర్పిస్తున్నారు.

వచ్చిన బంధువుల్లో నా వయసు వారు రకరకాల రంగురంగుల దుస్తులు ధరించి హడావుడి చేస్తూ వారికి అప్పగించిన చిన్న చిన్న పనులన్నీ చేస్తున్నారు. అందులో అందరిలో చిన్నవాడికి ముఖ్యమైన బాధ్యత అప్పజెప్పారు. గ్లాసుల్లో నీళ్లు పోస్తూ వచ్చిన వారికి అందరికీ అందివ్వాలి. మా పిన్ని, మేనత్తలు, డిబ్రుగర్ నుండి వచ్చిన అత్తమామలు, వారి ఐదుమంది సంతానం అందరూ వచ్చారు. దేశం నలుమూలల నుండి విచ్చేసిన బంధుగణమది. ఒరిస్సా నుండి జీవన్, (నాన్నగారి పెద్దన్న ఏకైక కుమారుడు), ఆయన కూతురు దేవరాతి, కొడుకు గౌతమ్‌తో కలిసి వచ్చాడు. జీవన్ ఈ భూమి మీదికి అందర్నీ తన జోకులతో నవ్వించడానికే వచ్చినట్లున్నాడు. ఆయన వేసే ఛలోక్తులకు వచ్చిన వారంతా పడి పడి నవ్వుతున్నారు.

మా మేనత్తలు చందన్‌ను ఒక గదిలో తాళం వేసి ఉంచారు. బ్రహ్మచారి బయటి వారిని కానీ, బయటివారు బ్రహ్మచారిని కానీ చూడకూడదన్న విశ్వాసమే దీనికి మూలం. ఉపనయనంలో ‘భిక్ష’ (వటువు జోలె పట్టుకొని అర్థిస్తే బంధువులంతా కట్నాలు, కానుకలూ వేస్తారు.) కార్యక్రమం దాకా ఆయనకు భోజనం కాక పండ్లు, పాలు మాత్రమే తీసుకోవచ్చు తప్ప మిగిలినవేవి తినకూడదు. ఇది చివరి అంకం. తరువాత అందరితో కలిసి విందు భోజనం.

పెద్ద శబ్దాలతో, నవ్వులతో, కేరింతలతో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇదంతా సంతోషమే. కానీ.. నేను ఇంతకుముందే చెప్పాను కదా! ఏదో తెలియని బాధ, విచారం నా మనసంతా ఆక్రమించుకుంటుంది. నాకు నిమిష నిమిషానికీ, ఏదో ఉద్వేగం పెరుగుతుంది. ఏదో తెలియని ఆందోళన నాలో మిక్కుటమౌతుంది.

నాన్నగారి చుట్టూ వచ్చిన బంధుమిత్రులు చేరి ‘పలావ్’ (బాస్మతి బియ్యం వండి, అందులో నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు, యాలకులు, మసాలాలు వేసి చేసేది) గురించి, చేపల వంటకం గురించి ఎలా ఉంటే బాగుంటుందో సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. మరికొందరు వారిలోవారు స్వీట్ల గురించి ప్రశంసిస్తున్నారు. వచ్చిన అతిథులందరూ ఒకరొకరు క్రమక్రమంగా వెళ్ళిపోవడం మొదలుపెట్టారు.

అనూహ్యంగా, అకస్మాత్తుగా చందన్ ఉన్న గదిలోంచి ఒక చీకాకు కలిగించే సంగతి మెలమెల్లగా నా చెవులదాకా వచ్చింది. ఆ సంఘటన ఏమాత్రం నమ్మశక్యం కానిది. చందన్ ఎవరి తోడు లేకుండా మూత్రవిసర్జన కోసం బాత్రూంకి వెళ్లి వచ్చాడు. బాత్రూం నుండి తిరిగి వచ్చిన చందన్ ప్రవర్తన చిత్రంగా మారిపోయింది. ఎవరు పిలిచినా పట్టించుకోవడం లేదు. ఏదో గాభరా పడిపోతున్నాడు. చిగురుటాకులా వణికి పోతున్నాడు. అమ్మ బిగ్గరగా ఏడుస్తుంది.

ఉత్సాహ సంభరితమైన పండుగ వాతావరణమంతా ఒక్కసారిగా మారిపోయి కలకలం రేగింది. అంతా స్తబ్ధత నెలకొంది. ఏదో దయ్యం పూనినట్లయింది. ఏదో అపాయం, హాని సంభవించబోతున్నట్లనిపించింది. ఏదో కీడు మూడబోతుందన్న అపశకునం నాకు సాయంత్రం నుండి ఎందుకు కలిగిందో ఇప్పుడు గుర్తించాను. నేను కళ్ళు తుడుచుకున్నాను. అమ్మ ఏమాత్రం సంతోషంగా లేదు. నాన్నను అర్థం చేసుకోవడం కష్టం. ఆయన ముఖకవళికల్లో కోపతాపాలు, భాధలు ఏమీ గుర్తించలేం. నాన్న, అమ్మ, బంధువులంతా నిశ్చేష్టులైపోయారు. నాకు తెలుసు. నాన్న లోలోపలే కుమిలిపోతున్నాడు. చందన్ నాన్నకు ఏకైక కుమారుడు. నాన్న హృదయంలో ప్రత్యేక స్థానం ఉన్నవాడు. అత్యంత ప్రీతిపాత్రుడు. నాన్న మౌనంగా, గంభీరంగా నిలుచుండిపోయాడు. ఆ కరాళరాత్రి మాకెంతో విషాదాన్ని మిగిల్చిపోయింది. రాత్రంతా అమ్మానాన్నలు నిద్రపోలేదు. మా మేనత్తలంతా గుసగుసగా మాట్లాడుకొని, చందన్ ఈ దుస్థితికి రావడానికి కారణం మా పిన్ని అని తేల్చారు. పిన్ని ఆవుపేడ, నెయ్యి కలిపిన మిశ్రమాన్ని మోతాదు మించి ఇవ్వడమే చందన్ అకస్మాత్తుగా అస్వస్థుడు కావడానికి కారణమని భావించారు. ఇలా ఇస్తే బ్రహ్మచారి శరీరం, ఆత్మ పరిశుద్ధమవుతాయని ఒక విశ్వాసం. ఇదంతా ఆ రోజుల్లోని బ్రాహ్మణ పురోహితుల మూర్ఖత్వం, మతపిచ్చి. నిరంకుశత్వం వల్ల కలిగిన ఫలితం.

ఆ రాత్రి వాస్తవంగా ఏం జరిగిందో నాకు తెలియదు. అందరూ రకరకాలుగా చెప్పుకున్న వారే కానీ చివరికి దేనివల్ల జరిగిందో తేల్చిందేమీ లేదు. చందన్ పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుంది. చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కోసారి నవ్వుతున్నాడు. ఒక్కోసారి ఏడుస్తున్నాడు. అటు ఇటు పరిగెత్తుతున్నాడు. చీకాకు చీకాకు పడుతున్నాడు. అతన్ని నిరంతరం ఏదో వెంబడిపడి బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

జీవితం భవిష్యత్తును సూచిస్తూ ముందుకు సాగుతుంది. అడుగడుగునా ఎన్నో చేదు అనుభవాల భాండాగారం జీవితం. అమ్మను ఓదార్చలేకపోతున్నాం. నాన్న ఈ లోకంలోనే ఉన్నట్లుగా అనిపించడం లేదు. ఎక్కువగా తన లోకంలోనే తానుంటున్నాడు. అన్నింటిని మించి చందన్ ఆవేశపడుతున్నాడు. ఇప్పుడు చందన్ చికిత్స మీద దృష్టి కేంద్రీకరించడం ప్రధానం. ఎక్కడ ఎలా చేయించాలి అన్న నిర్ణయానికి వచ్చారు. నాన్న, చిన్నాన్న కలిసి కలకత్తాలోని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ నాంది దగ్గరకు తీసుకొని వెళ్లారు. డాక్టర్ నాంది చందన్‌కు అన్ని పరీక్షలు చేశాడు. Schizophrenia అనే మానసిక రోగం వచ్చిందని నిర్ధారించాడు. ఈ రోగస్థులు వాస్తవానికి, భ్రమకు ఉన్న అంతరాన్ని గుర్తించలేరు. మందులు రాసిచ్చాడు. ఆ మందులను నెలరోజులపాటు వాడినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదు. చందన్ స్థితి మరీ దిగజారుతుంది. సాధారణంగా ఈ స్థితిలో హింసాత్మక చర్యలు కూడా దిగవచ్చు. కానీ ఎంత తీవ్ర మానసిక దుస్థితిలో ఉన్నా చందన్ ఏనాడూ అవతలి వారిని కొట్టడం లాంటివి చేయలేదు. చిలిపివాడే. చిన్నతనం నుండి వాడికి బిడియం, పిరికితనం ఎక్కువే.

దురదృష్టం ఎవరి మీద నైనా దండయాత్ర చేసినప్పుడు, నీ దుఃఖంలో నిజంగా పాలుపంచుకొని బాధపడేవారెందరో, కానీ వారెవరో గుర్తించడం కష్టం. దురదృష్టవశాత్తు ఈ స్థితికి సంతోషపడే వారే ఎక్కువమంది. చాలా సందర్భాల్లో, జీవితాంతం నాకు ఇది బాగా అనుభవం అవుతూనే ఉంది. నెలలు దాటిపోయాయి. సంవత్సరాలు గడిచాయి. అయినా ఫలితం మాత్రం శూన్యం. చందన్ ఇంకా ఇంకా క్షీణించి పోతున్నాడు. డాక్టర్ నాంది రకరకాలుగా మందులు మార్చి ఇచ్చినా ఫలితం లేదు. ఇప్పుడు చందన్‌ను ఒంటిగా గదిలో ఉంచి తాళం వేయాల్సి వస్తుంది. ఏదైనా అవసరం పడినప్పుడు ఒక జంతువు లాగా ఏదో అర్థం కాని అరుపు అరిచేవాడు.

నాన్నగారు కలకత్తాలోని మరో డాక్టర్‌ను సంప్రదించారు. ఈ కొత్త డాక్టర్ చికిత్స బాగా ఫలించి చందన్‌లో కొంత అభివృద్ధి కూడా కనబడసాగింది. మండు వేసవిలో వాడి పరిస్థితి మరింత దిగజారేది. వాడికి insomnia (నిద్రలేమి) అనే జబ్బు వచ్చింది. దాంతో రాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టక పెద్ద వరండాలో ఈ కొన నుండి ఆ కొనదాకా పచార్లు చేసేవాడు. తరచూ తనలో తాను ఏదేదో మాట్లాడుకునేవాడు. చందన్‌తో పాటు మేమంతా కూడా మౌనంగా బాధపడుతూనే ఉన్నాం. చందన్ పడుతున్న బాధ కన్నా మేమే ఎక్కువ బాధపడుతున్నామని కూడా చెప్పవచ్చు. అందగాడు, చిలిపివాడు, చురుకైనవాడు అయిన నా ప్రియమైన తమ్ముని స్థితి చూసి నేను విపరీతంగా బాధపడ్డాను.

ఒకరోజు చందన్ నన్ను పక్కకు పిలిచాడు. వాడి కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉండడం గమనించాను. ఒక పెద్ద కర్రను నా చేతికిచ్చి దానితో తన తలకాయ పగలగొట్టమన్నాడు. నేను విపరీతమైన బాధతో ఏడవడం మొదలు పెట్టాను. రాధారాణి అత్త నన్ను ఓదారుస్తూ లోపలికి తీసుకొనిపోయింది.

మా నాన్నగారు మరణించాక చందన్ మాతోపాటే ఉండిపోయాడు. అలా దాదాపు 25 ఏళ్ళు ఉన్నాడు. నేను మాత్రం చందన్ ఏ మందులూ వాడకుండా ఒక ఒక ప్రత్యేకమైన చికిత్స చేయించాను. ప్రేమాభిమానాలు కురిపిస్తూ అతన్ని మామూలు స్థితికి తెచ్చాం. చందన్ మందుల ప్రభావంతో గంటలకొద్దీ నిద్రపోవడం గతంలో చూశాను. ఇక్కడ (బారక్‌పూర్‌లో) సాధారణ మానవజీవితాన్ని గడిపాడు. నాతోపాటు ఉత్సవాలకు, సమ్మేళనాలకు వచ్చేవాడు. చందన్‌ను బాగుచేసే విషయంలో నా భర్త చూపిన దయ, సహానుభూతి నన్ను ఎంతో ముగ్ధురాలిని చేశాయి. సాధారణంగా ఇటువంటి స్థితిలో చందన్ లాంటి వారి బాధ్యతను జీవితాంతం మోయడానికి భర్తల పరిపూర్ణ సహకారం లేనిదే ఏ స్త్రీకి వీలు కాదు. ఈ విషయంలో మాత్రం నా భర్త ఇచ్చిన సహకారం, చేసిన సహాయం ఎన లేనివి.

కావేరీ చటోపాధ్యాయ గారి రచనలు

అధ్యాయం 8 – అమ్మ మరణం

నా జీవనజ్యోతి ఆరిపోయింది. మా అమ్మ చనిపోయింది.

ఒకవైపు డిగ్రీ చేస్తూనే, మరోవైపు స్థానికంగా ఉన్న ‘వివేకానంద విద్యానికేతన్’ అనే ప్రైవేటు పాఠశాలలో అధ్యాపకురాలిగా కూడా పనిచేశాను. అది షిప్ట్ స్కూలు. పొద్దున మా పాఠశాల, మధ్యాహ్నం మరొకటి నడుస్తుంది. అందువల్ల మాకు శాశ్వత భవన సౌకర్యం లేదు. మా ప్రిన్సిపల్ మిస్టర్ దాస్ ఒక శాశ్వత భవనాన్ని ఎట్లాగైనా నిర్మించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. మర్రిచెట్టు శాఖోపశాఖలు విస్తరిల్లినట్లుగా ఇప్పుడు ఈ పాఠశాల శాఖలు కూడా చాలా చోట్ల వెలిశాయి. పసిపిల్లల మధ్య నేనెంతో ఆనందంగా గడిపిన కాలమది. ఆ పిల్లలు నా పట్ల ఎంతో గౌరవాభిమానాలు ప్రదర్శించేవారు. మా పాఠశాలకు ఎలాంటి ఆర్థిక వనరులు లేవు. మా విద్యార్థులందరూ మారుమూల పల్లెల నుండి వచ్చినవారు. మా ఆదర్శ అధ్యాపక బృందం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, వారిని విద్యావంతులుగా, చదువు పట్ల శ్రద్ధాసక్తులు గల వారిగా తీర్చిదిద్దింది.

అమ్మకు కొంతకాలంగా బాగాలేదు. వేరే అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టుతున్నాయి. నేను డిగ్రీ చివరి సంవత్సరంలోకి ప్రవేశించాను. ఆమె ప్రవర్తనలో ఏవో మార్పులు కొట్టొచ్చినట్లు కనబడ సాగాయి. స్వతహాగా మంచి మనసున్న అమ్మలో ఆకస్మికంగా ప్రతిదానికి ఊరికే కయ్యానికికి కాలుదువ్వే తత్వం ప్రవేశించింది. ప్రతి చిన్నదానిపట్ల రాద్ధాంతం చేయడం మొదలుపెట్టింది. ఆమె కోపతాపాలు, చిర్రుబుర్రులు మాకు కొత్తగా అనిపించాయి. కొన్నిసార్లు పోట్లాడి ఏవేవో వింత వింత కోరికలు కోరేది. ఆమె చీకాకులు, ఆమె వింత కోరికలు, చిర్రుబుర్రులు, సాధారణమైన ఒక స్త్రీకి తగని విధంగా – అందునా అమ్మ వంటి మంచిమనిషికి ఏమాత్రం యోగ్యం కాని ప్రవర్తన అది. ఒక పద్ధతి, పాడు లేకపోవడం నన్ను ఎంతో గాయపరిచింది

ఒక క్షణం వేడి వేడి అన్నం పెట్టమంటుంది. మరుక్షణంలో చల్లటి పదార్థాన్ని అడుగుతుంది. చేసిన వంటకాల మీద ఎప్పుడూ వంకలు పెట్టేది. అమ్మ అనారోగ్యం దృష్ట్యా నేను చాలాసార్లు కళాశాలకు పోయేదాన్ని కాదు. అప్పుడు మా ప్రొఫెసర్లు ఎంతో దయతో ‘నోట్స్’ ఇచ్చేవారు. వాటిని నాకు అందించి, సాయం చేద్దామని నా సహాధ్యాయులైన మగపిల్లలు మా ఇంటికి వచ్చేవారు. వారి మీద అమ్మ ఎంత విరుచుకుపడేదో నాకు ఇంకా గుర్తుంది. కొన్నిసార్లు అకారణంగా అరిచేది. దాంతో ఆమె ముఖమంతా ఎంతో వికృతంగా మారిపోయేది. నా తప్పేమీ లేకున్నా, నా మీద కోపంతో నానా దుర్భాషలాడేది. రోజురోజుకు ఆమె తీరుతెన్నులు మారిపోసాగాయి. కొన్నిసార్లు ఎంతో ప్రేమతో మాట్లాడేది. ఈ దుర్మార్గమైన ప్రపంచంలో వయసులో ఉన్న ఒక అమ్మాయి ఎంత జాగ్రత్తగా మసులుకోవాలో ఎన్నో జాగ్రత్తలు చెప్పేది. క్షణక్షణానికి మారిపోయే ఆమె ప్రవర్తన నన్ను ఎంతో గందరగోళానికి గురిచేసేది. అసంబద్ధంగా మాట్లాడేది. అయోమయం పాలు చేసేది. పొద్దున్నే లేచి పండ్లు తోముకొని ముఖం కడుక్కోమన్నా వినేది కాదు. ఇప్పుడో, అప్పుడో కాలి బూడిదయ్యే శరీరానికి ఇవన్నీ ఎందుకు అని ప్రశ్నించేది. ఇదంతా వింటుంటే నాకు వెన్నులో చలి పుట్టేది. ఒకానొక తెలియని భయానికి లొంగిపోయాను. అమ్మ మాటలన్నీ ఇక తానెంతో కాలం బతకనని చెప్పడానికి సూచనలా? ఆమెకు అలాంటి శకునాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అమ్మ దయనీయ స్థితికి విచారిస్తూ ప్రతిరాత్రి నా తలగడ కన్నీటితో తడిసిపోయేది.

ఇక ఆమె ఎంతో కాలం బతకదన్న భావం నాలో స్థిరమైంది. అమ్మ మానసిక పరిస్థితి భరించలేని విధంగా రోజురోజుకు, రకరకాలుగా మారుతుంది. పొద్దున టిఫిన్ చేయడం లేదు. మధ్యాహ్నం భోజనం నిరాకరిస్తుంది. రాత్రి కూడా వద్దంటుంది. ఇక నేను ఊరుకుండలేకపోయాను. ఒకరోజు ఉదయం గట్టిగా అమ్మ మీద కేకలేశాను. అమ్మ దిగ్భ్రాంతి చెంది నాకేసి చూసింది. వెంటనే నాలో విచక్షణ మేల్కొంది. నేను ఆమె పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించాననిపించింది. ఆ క్షణంలో నాకు చనిపోవాలనిపించింది. నన్ను నేను బాగా తిట్టుకున్నాను. ఆశ్చర్యం!! అమ్మ హుందాగా నన్ను ఒక్కమాట కూడా అనకుండా, మెల్లగా తన తప్పును అంగీకరించింది. నన్ను అంత తీవ్రంగా విరుచుక పడేలా రెచ్చగొట్టడం తన తప్పేనంది. నన్ను క్షమించమని లేకపోతే సిగ్గుతో, పశ్చాత్తాపంతో చచ్చిపోతానని ప్రార్థించాను. అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని తన వణుకుతున్న చేతిని నా తల మీద పెట్టి ఆశీర్వదించింది.

అమ్మ పట్ల మొరటుగా ప్రవర్తించిన మరో సంఘటన. అమ్మకు అనారోగ్యంగా ఉన్న కాలంలోనే జరిగింది. పదిహేను రోజుల్లో నా ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేను పరీక్షలకు శ్రద్ధతో చదువుకుంటున్నాను. నన్ను సైగ చేసి తన దగ్గరకు రమ్మంది. తన పక్కన కూర్చోమంది. తన చిన్ననాటి ముచ్చట్లు, స్నేహితులు, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇలా… చెప్పడం మొదలు పెట్టింది. నాకే మాత్రం వాటి మీద ఆసక్తి లేదు. నేను లేచి చదువుకునే బల్ల దగ్గరకు పోదామని యత్నించాను. అమ్మ కళ్ళు పెద్దవి చేసుకొని నన్ను వెళ్ళవద్దు అని బతిమాలింది. నేను పరీక్షలకు పూర్తిగా సంసిద్ధురాలిని కాలేదు. ఆ సంవత్సరం పరీక్షలకే వెళ్ళకూడదు అనుకున్నాను. తన బిడ్డ కాకుండా మరి ఎవరైనా పరీక్షల్లో బాగా మార్కులు సంపాదించారంటే ఆ తల్లి మనసు కుతకుతలాడుతుంది. కించపడుతుంది. నేను చాలా మొండిగా చెప్పాను. ఏమీ రాయకుండా ఖాళీపేపర్ ఇస్తే మార్కులు వేసేవాడు భూమి మీద ఎవడుంటాడు? నేను చాలినంతగా పరీక్షలకు సంసిద్ధం కాలేదు. అయినా పరీక్షలకు హాజరైతే బాగా రాస్తావని మెల్లగా, మృదువుగా మరోసారి చెప్పి చూసింది.

పరీక్ష సమయంలో ఎవరో ఒకరు ఇంటి నుండి కాలేజీకి వచ్చి గాభరాగా నన్ను పిలిచి అమ్మ పోయిందన్న వార్త చెప్తారు – అనే భయం బాగా ప్రబలమైంది. దీంతో నేను పరీక్షల మీద నా దృష్టి కేంద్రీకరించలేకపోయాను. ఒక వింత మానసిక భయానికి గురయ్యాను. పరీక్షలు అయిపోయాయి. నేను అనుకున్నంత బాగా పరీక్షలు రాయలే దన్న చీకాకుతో ఉన్నాను.

9 జనవరి ఉదయం ఎప్పటిలాగే నేను పాఠశాలలో ఉన్నాను. ఎనిమిది గంటల నుండి 12 గంటల దాకా ఉదయం షిఫ్ట్ మా పని వేళలు. ఇంటికి తిరిగి వచ్చాను. అమ్మ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. మెల్లగా తాకి గాఢనిద్రలో ఉందని గమనించాను. తొందరగా బట్టలు మార్చుకొని మధ్యాహ్నం వంట చేయడానికి పూనుకున్నాను. అన్నం, చారు మాత్రమే చేసేది. అయినా అరగంటైనా పడుతుంది. నేను పాఠశాలకు పోతూ రెండు బ్రెడ్ ముక్కలు, హార్లిక్స్ కలిపి ఇచ్చాను. చాలా రోజులుగా ఉదయం టిఫిన్ వద్దంటుంది. ముఖం మీదగా దుప్పటి కప్పమంటుంది. ఆశ్చర్యం ఆరోజు ఏ వంకలు పెట్టకుండా, విసుక్కోకుండా అన్నాన్ని శుభ్రంగా తిన్నది. నా ఆనందానికి అవధులు లేవు. ఎన్నోనాళ్ళ తర్వాత నా ప్రియమైన అమ్మ చాలా కుదురుగా ప్రవర్తించింది. ఆ మధ్యాహ్నం అమ్మ ఎంత ప్రేమతో మాట్లాడిందో ఇప్పటికీ నాకు గుర్తుంది‌. చిన్నప్పుడు నా పట్ల ఎంత ప్రేమతో చూసేదో అలా చూసేసరికి నా కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఒక నెల రోజులుగా ఆమె ప్రవర్తన ఎంత ఘోరంగా ఉందో గమనించిన నాకు ఆ రోజు ఆమె ప్రవర్తించిన తీరు ఎంత ఊరట కలిగించిందో! ఆ సాయంకాలం బాగా చలిగా ఉంది. కొంతసేపు అయింది అమ్మ ఏదో చీకాకు పడుతున్నట్లు అనిపించసాగింది.

అమ్మ ఆ రోజు ఎన్నోసార్లు మలవిసర్జన చేసింది. పక్కబట్టలు ఎన్నోసార్లు తడుపుకుంది. అమ్మ బెడ్ షీట్లు తరచూ మార్చాల్సి వచ్చింది. ఒకదాని వెనుక ఒకటి బెడ్ షీట్స్ మారుస్తూనే ఉన్నాం. అడుగున వేసిన బొంత కూడా పాడైపోయింది. అమ్మ మగతలో ఉంది. ఆ రోజు మధ్యాహ్నం నేనెందుకో తినలేదు. రొట్టె -బేగం పోరా (వంకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కలిపి చేసే కూర) ఉదయం తిన్నాను. అది నాకు ఎంతో ఇష్టమైన కూర. సాయంకాలం బాగా చలిగా ఉంది. చీకటి పడింది. నాన్న, నేను బొగ్గులకుంపటి దగ్గర కూర్చున్నాం. ఆకస్మాత్తుగా దొడ్లో ఉన్న చెట్టు మీది గుడ్లగూబ కూసింది. దాని అరుపు మహాభయంకరంగా ఉంది. హిందువులు గుడ్లగూబ అరవడం అరిష్టమని భావిస్తారు.

అమ్మ ఆ సాయంకాలం జామకాయలు కావాలంది. తనను చూడడానికి వచ్చే డాక్టర్ సర్కార్ గారికి ఇవ్వాలని చెప్పింది. మేము అప్పుడే ‘టీ’ తాగాం. అప్పుడే నాన్న బిగ్గరగా కబీ (కావేరి నా పేరు అయితే ఇంట్లో పిలిచే పొట్టి పేరు కబీ) అని కేక పెట్టాడు. “కబీ! మీ అమ్మ గొంతులో నుండి వస్తున్న ధ్వని గమనించు. ఏదో వింతగా ఉంది. ఏదో గుడగుడ శబ్దం వస్తుంది”. నేను కూడా గమనించాను. ఒక తెలియని భయం గొలిపే వింత ధ్వని అది. ఆమె గొంతులో ఏదో తట్టుకున్నట్లుగా, అది బయటకి పోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది. అమ్మ మంచం మీదే కూర్చున్న మాల ఒక్కసారిగా కేక పెట్టి “చూడండి! చూడండి! అమ్మ కనుగుడ్లు ఎలా తిప్పుతుందో” అని అంది. అందరిలోనూ ఒక భయం ఆవహించింది. ఏదో దురదృష్టం త్వరలోనే సంభవించబోతుందని అర్థమైంది. అమ్మ కొన్ని రోజులుగా ఆమె బాల్యం, పెరిగిన కాలానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలు సరదాగా నాతో చెబుతూ వచ్చింది. అమ్మకు తన పాత మిత్రుల సాంగత్యం కోల్పోయానన్న బాధ ఉందనిపించింది. ఈ లోకం నుండి కాక మరో ప్రపంచం నుండి ఆమె మాట్లాడుతున్నట్లుగా ఉంది.

కలలు – కోరికలు- ఆశయాలు- అవి ఇవి అన్నీ ఆమెకు వశమయ్యాయి. ఆమె తన తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లుగా ఉంది. కానీ నాకు మాత్రం మా అమ్మ రోగగ్రస్థురాలు గానే ఉంది. నాన్న త్వరగా వెళ్లి మా ఇంటి డాక్టర్ సర్కార్‌ను తీసుకొచ్చాడు. ఇద్దరూ పరుగు పరుగున చేరుకున్నారు. ఆమె ప్రాణాలు నిలపడానికి coramine ఇంజక్షన్ ఇచ్చారు. ప్రయోజనం లేకపోయింది. ఆకస్మికంగా అమ్మ ఒక్క కుదుపుకు లోనైనట్లుంది. కళ్ళు నిశ్చలమయ్యాయి. నాన్న బాధతో అయ్యో! అయ్యో!! అనడం నా చెవుల్లో ఇంకా మారుమోగుతుంది. డాక్టర్ సర్కార్ అమ్మనాడి చూసి ఆమె ఇక లేదని ప్రకటించారు. నేను నిశ్చేష్టురాలినయ్యాను. అకస్మాత్తుగా అమ్మ జీవితం ముగిసిపోయింది. మాల ఆగలేకపోయింది. నేను నాన్న దిక్కు చూశాను. ఆయన ముఖంలో ఏ భావమూ లేదు. ఎక్కడో ఉన్నట్లు ఉన్నాడు. చందన్ మా ముఖాలకేసి చూస్తున్నాడు. వాడు ఏడ్పు ముఖంతో ఉన్నాడు. నాన్న ఒక్కసారిగా లేచి ఎంతో దుఃఖంతో ఒక అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా “కబీ! కబీ! మీ అమ్మ యిక లేదురా” అన్నాడు. నేను ఒక నిట్టూర్పు విడిచి గొల్లుమన్నాను.

హిందూ స్త్రీలు మరణించినప్పుడు పాటించే సంప్రదాయాలన్నీ పాటించబడ్డాయి. ముత్తయిదువలు వచ్చి సిందూరాన్ని నుదుట, పారాణిని కాళ్లకు దిద్దారు. నేను వాటిని పరిశీలిస్తూ అక్కడే నిలబడ్డాను. అలా ముత్తయిదువలు చేస్తే మా అమ్మలాగే సుమంగళిగా పోయే అదృష్టం తమకు దక్కుతుందని వారి విశ్వాసం. ఈ భావం భారతదేశం అంతటా ఉంది, మా బెంగాల్లో ఇంకా మరి ఉందేమో! అమ్మను తీసుకొని శ్మశానానికి నాన్న, చందన్ ఇంకా ఇరుగుపొరుగువారు వెళ్లారు. నేను శూన్యంలోకి చూస్తూ కిటికీ ముందు నిలుచున్నాను. అనూహ్యంగా నాకో దృశ్యం గోచరించింది. అమ్మ నా పక్కనే నిలబడి నన్ను ఓదారుస్తున్నట్లు అనిపించింది. నేటి వరకు అది నిజమా? లేక భ్రమా? అన్నది తెలియదు.

అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేరు. మాలకు, నాకు మా జీవితాలు పూర్తిగా మారిపోయాయి. నాన్న పూర్తిగా అంతర్ముఖుడైపోయాడు. నాన్న అప్రయోజనకరమైన కాఠిన్యం మమ్మల్ని చాలా బాధించింది. ఆయన మా పట్ల చూపించిన దురాగ్రహానికి ఒక్కోసారి మా రక్తం ఉడికిపోయేది. ఈ ముసలితనంలో జీవిత భాగస్వామిని కోల్పోవడం ఎంత బాధాకరమో నేను గుర్తించాను. అమ్మ మీద ఆయనకు అవధుల్లేని ప్రేమాభిమానాలు ఆమె ఉన్నప్పుడు, పోయిన తర్వాత ఎన్నోసార్లు చెప్పేవాడు. నాన్న తర్వాత జీవితం అంతా ఒక ‘ముని’ లాగా గడిపాడు.

(సశేషం)


శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ప్రకృతి వనరులకు నిలయమైన సుందర రాష్ట్రం అస్సాంలో పుట్టిపెరిగారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి (బి.ఎ. ఆనర్స్) డిగ్రీ చేశారు. మేఘాలయ లోని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (NEHU) నుంచి బి.ఎడ్. చేశారు. రామకృష్ణ వివేకానంద మిషన్ లోనూ, బారక్‍పూర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లోనూ ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేశారు. రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తూ కథలూ, కవితలూ రాస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారు.

‘Peeping Through My Window’ (ఆత్మకథ)ను విరాసత్ ఆర్ట్ పబ్లికేషన్స్, 2022లో ప్రచురించింది. ఈ ఆత్మకథలో కావేరి ప్రధానంగా తాను బ్రెస్ట్ కాన్సర్‍పై చేసిన పోరాటాన్ని తెలిపారు. ‘The Twilight Bells’ (తొలి కవితా సంపుటి) 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘The Bindupara Tales & The Four-Lettered Word Love’ (కథాసంపుటి) డిసెంబరు 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘Apparitions from the other World’ (అతీత అనుభవాల తొమ్మిది కథలు) పుస్తకాన్ని 2023లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ప్రచురించింది.

కావేరీ చటోపాధ్యాయ పశ్చిమ బెంగాల్ లోని బారక్‍పూర్‍లో నివసిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here