‘ఆటుపోట్ల కావేరి’ – శ్రీమతి కావేరి చటోపాధ్యాయ ఆత్మకథ-5

3
11

[శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ఆత్మకథ ‘Peeping Through my Window’ ని ‘ఆటుపోట్ల కావేరి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలుగుశాఖ విశ్రాంతాచార్యులు, డా. వెలుదండ నిత్యానంద రావు. Dr. Veludanda Nithyananda Rao’s translation of Mrs. Kaberi Chattopadhyay’s autobiography ‘Peeping Through my Window’ in Telugu. Special thanks to Partha Pratim Roy, chief coordinator, Virasat Art Publication, Kolkata.]

అధ్యాయం 9 – నా పెండ్లి – తదనంతర జీవితం (మొదటి భాగం)

[dropcap]మా[/dropcap] రెండవ అక్క పికు పెళ్లి బెర్హాంపూర్ (ముర్షిదాబాద్ జిల్లా-పశ్చిమబెంగాల్) లో జరిగింది. పికు అక్క పెండ్లి సంబంధం నిశ్చయం చేసుకోవడానికి మా ఇంటికి వచ్చిన బంధుబృందంలో దీపక్ కుమార్ ఛటోపాధ్యాయ అనే అందమైన యవకుడు కూడా ఉన్నాడు. ఆ హడావుడిలో నేను అతన్ని గమనించనేలేదు. ఆరోజు నన్ను చూసి చేసుకుంటే నన్నే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడట. పెళ్ళయ్యాక చెప్పాడు.

అది నిప్పులు చెరిగే ఎండాకాలం. ఏప్రిల్ నెల. మాల, నేను కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. పోస్టుమాన్ ఒక ఉత్తరం ఇచ్చి పోయాడు. గంగానగర్ (రాజస్థాన్) నుండి ఎవరో తెలియని వ్యక్తి రాశాడు. రమేష్ సోలంకి అట. దీపక్ కుమార్ ఛటోపాధ్యాయ నన్ను పెళ్లాడాలనుకొంటున్నాడనీ, ఒకవేళ నేను అంగీకరించకపోతే మరెవరినీ పెళ్లి చేసుకోనంటున్నాడనీ ఆ ఉత్తరంలోని సారాంశం, సందేశం. నా ఆశ్చర్యానికి అంతులేదు. నామీద ఇంత ప్రేమ పెంచుకున్నాడన్న సంగతి నాకు ఏమాత్రం తెలియదు. ఇంతకూ అతనెవరో కాదు, పికుఅక్కకు స్వయానా మరిది. భర్త తమ్ముడు. అందువల్ల జమాయిబాబు బావగారు, (పికుఅక్క భర్త) పికు అక్క ఇద్దరూ ఈ వివాహ విషయంలో బాగా ఆసక్తి చూపారు. వెంటనే పెళ్లి చేయడానికి నాన్నగారు సిద్ధంగా లేరు. అంతేగాక నన్ను బాగా చదివించాలనుకున్నాడు. పెళ్లి తర్వాత చదువుకు ఎలాంటి ఆటంకం ఉండదని హామీ ఇచ్చి మా అక్క బావలు ఇద్దరూ నాన్నగారి మనసు మార్చారు. చివరకు నాన్నగారు పెళ్లికి అంగీకరించారు.

పెళ్ళినాటి రిసెప్షన్ సందర్భంగా భర్తతో శ్రీమతి కావేరి

12 మార్చ్ సాయంకాలం మా వివాహమైంది. బెంగాలి క్యాలెండర్ ప్రకారం పాల్గుణమాసం- వసంతఋతువు) నాన్నగారు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. వచ్చిన వారంతా అలంకరణను, మొత్తం ఏర్పాట్లను, ప్రత్యేకించి వంటకాలను ఎంతో మెచ్చుకున్నారు. నాన్నగారు ఎప్పుడు మంచి భోజనం పెట్టాలి. అందరూ తృప్తిగా తినాలి అనేవారు. మేము కూడా ఇప్పటికీ అదే అనుసరిస్తున్నాం.

భారతసైన్యంలో పనిచేసే నా భర్త ఒక నెలరోజులు పెళ్లి కోసం సెలవు పెట్టాడు. నేను బెర్హంపూర్‌లో మా అత్తగారింట్లో కాపురం పెట్టాను. మావారు, నేను, అత్తగారు, ఆడపడుచులు ఉండేవాళ్ళం. బంధువులను కలవడం, సినిమాలు చూడడం, మా ఆడపడుచులతో స్థానిక రెస్టారెంట్లలో భోజనం చేయడం, రవీంద్ర భవన్‌లో సంగీత కచేరీలకు వెళ్ళడం, ఇష్టమైనవి కొనడం ఇట్లా కొన్ని వారాలు కలలాగా గడిచిపోయాయి. బెర్హాంపూర్‌లో ఉన్నన్ని రోజులు ఆనందోత్సాహాలతో కాలం గడిచింది.

కొన్ని రోజులకు హైదరాబాద్ (తెలంగాణ రాష్ట్రం) బయలుదేరాం. ఆ రైలు ప్రయాణమే ఒక అపూర్వ అనుభవం. నేనెంతసేపు అస్సాం నుండి పశ్చిమ బెంగాల్ వరకే వెళ్లాను. ఇంత సుదూర ప్రయాణం చేయడం ఇదే మొదలు.

పరిచయం అతి స్వల్పంగా ఉన్న వ్యక్తితో వివాహబంధంతో జీవితాన్ని పంచుకోవడం అన్న ఆలోచనే నాకు బెరుకుగా ఉంది. అదే సమయంలో ఉద్వేగంగాను ఉంది. నాకు మొదటి నుంచి కాస్త సిగ్గు ఎక్కువే. లౌకికజ్ఞానం కూడా పెద్దగా లేనిదాన్ని. వృద్ధుడైన మా నాన్నగారు, చెల్లెలు మాల నిరంతరం నా మనసులో మెదులుతున్నారు. నేను లేకపోవడంతో వారంతా ఒంటరితనంతో ఎంత బాధపడుతున్నారో! మా నాన్నతో నాకు గాఢమైన అనుబంధం ఉంది. మా నాన్న అంటే నాకు మొదటినుంచీ గౌరవాభిమానాలు మెండు. నేను చదివే రోజుల్లో జోత్ కమల్ లోని పాఠశాలకు నాన్నే నన్ను రోజూ తీసుకుని పోయి దింపేవాడు. అది జాంగిపూర్‌కు పక్కన ఉన్న చిన్న గ్రామం. అలా పోతున్నప్పుడు మధ్యలో నాన్న ఎన్నెన్నో కథలు ముఖ్యంగా “కర్బలా” కథను చెప్పేవారు. తన జీవితంలోని ఎన్నో హాస్య సంఘటనలు చెప్పి నవ్వించేవారు. పాఠశాలకు పోతున్నప్పుడు తోవలో నాన్న ఆసక్తిగా చెప్పిన ఎన్నో చారిత్రక అంశాలు తరువాత కాలంలో నా చరిత్ర పరిజ్ఞానాన్ని పెంచాయి. బ్రిటిష్ కాలంలో నీలిమందు చెట్ల పెంపకం – దాని పరిణామాల గురించి నాన్న ప్రత్యేకంగా వివరించారు. నేను అత్తగారింటికి వెళ్తుంటే ఎంతో గంభీరంగా ఉండే నాన్న కళ్ళనీళ్లు పెట్టుకున్న సంగతి మదిలో మెదిలింది. మా పిన్ని కూడా ఇదే ప్రస్తావించింది. కావేరి పుట్టింటిని శాశ్వతంగా వదిలి తన సొంత జీవితాన్ని ఆరంభించడానికి మెట్టినింటికి వెళ్తుంది అన్న వాస్తవం నాన్నకు తెలిసి వచ్చింది.

మా వారు ఎప్పటికప్పుడు సానునయంగా మాట్లాడుతూ, ఓదారుస్తూ, కలుపుగోలుతనాన్ని పెంచుకొని నా పుట్టింటి మీది ధ్యాసను, పరధ్యానాన్ని పోగొట్టారు. రెండు రోజులు ప్రయాణం చేసి మేము సికింద్రాబాద్ చేరాం. ధగద్ధగాయమానంగా వెలిగిపోతున్న సికింద్రాబాద్ నగరం మమ్మల్ని చేతులు చాచి ఆలింగనం చేసుకొని “కావేరి! నీవు నీ భర్తతో ఆనందంగా, ప్రేమగా గడపడానికి ఇక్కడికి వచ్చావు సుమా!” అని నా చెవుల్లో గుసగుసలాడుతూ చెప్పినట్లుగా అనిపించింది. నిజంగా సికింద్రాబాద్‌లో గడిపిన రోజులు మరుపురాని మధురమైన రోజులు. నేను మిలట్రీకి సంబంధించిన అంశాలను మొదటిసారిగా అప్పుడే తెలుసుకున్నాను.

సికింద్రాబాదులో ఆరునెలలు గడిపాక, మా శ్రీవారికి హైదరాబాదుకు బదిలీ చేశారు. ఇది చాలా అందమైన నగరం ప్రేమాభిమానాలతో నన్ను అక్కున చేర్చుకుంది. నూతన జీవన వ్యవహార సరళిని పూర్తిగా ఒంట పట్టించుకున్నాను. సంక్షేమ కేంద్ర సమావేశాలకు, వనవిహారాలకు, సైనిక దినోత్సవాలకు, ఇంకా మరెన్నింటికో వెళ్తుండేదాన్ని. ఆ రోజులు మరిచిపోలేనివి. ఎంతో ఆనందంగా, ఉత్సాహభరితంగా సాగిపోయాయి.

ఎండాకాలంలో మావారికి మీరట్ (ఉత్తరప్రదేశ్) బదిలీ అయింది. అక్కడ ఎండలు మండిపోతున్నాయి. ఉక్క పోస్తుంది. ఏమాత్రం తేమలేదు. కొన్నిసార్లు ఆ వడగాడ్పులకు మన శరీరం కమిలిపోతుందేమో అనిపిస్తుంది. అప్పటికి నా పెద్దకొడుకు అమర్త్య పుట్టాడు. వాడు ఒకటిన్నర సంవత్సరాల ముద్దొచ్చే అల్లరి పిల్లవాడు.

పెద్ద కుమారుడు అమార్త్య ఆరు నెలల వయసులో

మీరట్‌లో ఉండడం మాకు చాలా ఉపయోగపడింది. ఎంతోమంది మిత్రులయ్యారు. సన్నిహితులయ్యారు. నాకు అక్కడి దుకాణాలు అంటే ఎంతో ఇష్టమయ్యాయి. సాయంకాలం వెళ్ళే వాహ్యాళికి ఎప్పుడూ మావారు తోడుగా వచ్చేవారు. సైనిక దినోత్సవాలు, మరికొన్ని ఇతర ఉత్సవాలు ఉత్సాహంగా వినోదాత్మకంగా జరిపేవారు. నేను ఇంగ్లీష్, హిందీ పాటలు పాడేదాన్ని. నేను పాడే తీరుకు ప్రేక్షకులు కరతాళధ్వనులు చేసేవారు. సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిపేవారు.

మీరట్‌లో ఉన్నప్పుడు మానవత్వం పట్ల, మనుషుల గుణశీలాల పట్ల నమ్మకం, సానుకూలత పెంచే సంఘటనలను ప్రత్యక్షంగా గమనించాను. జాలి, కరుణ, దయ లాంటివి ఒకరి నుండి ఒకరికి ప్రవహించాలి. మిలటరీలో చాలా ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి తాను ఏదో కోపంతో వదిలేసిన భార్యను ఆమెకు తన పట్ల ఉన్న అచంచలప్రేమను, అంతులేని అభిమానాన్ని గుర్తించి తిరిగి స్వీకరించాడు. ఇది మరో ఉన్నతాధికారి సమక్షంలో జరిగింది. వృత్తిరీత్యా నర్స్ అయిన ఒక సాధారణ స్థాయి అమ్మాయి తన వృత్తి పట్ల చూపించిన భక్తి శ్రద్ధలు గమనించి ముగ్ధుడై ఒక ఉన్నతస్థాయి అధికారి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

మీరట్‌లో ఉన్నప్పుడే, జనవరి నెల చలికాలంలో ఓ రాత్రిపూట నా రెండవ కొడుకు సుప్రతిం పుట్టాడు. మీరట్‌లోని సమయం అంతా అమర్త్య, సుప్రతింలతోనే సరిపోయేది. ఇద్దరికీ రెండేళ్ల తేడానే కనుక కలిసే పెరిగారనవచ్చు. తర్వాత ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకు బదిలీ అయ్యాం. ఆ ప్రాంతం పేరు చాంగ్‌సారి (Changsari). అదంతా కొండలు, గుట్టలమయం. గువాహతి (ఒకప్పుడు దీన్ని గౌహతి అనేవారు.) రంగియా నగరాల మధ్య ఉంటుంది. వర్షాకాలంలో దట్టమైన మేఘాలు ఆ పర్వతాలను కమ్ముకొని పూర్తిగా కనబడకుండా చేసేవి. రోజుల తరబడి వర్షం కురిసేది. దానివల్ల టీతోపాటే వేడి వేడి పకోడీలను చేద్దామంటే ఎంత కష్టమయ్యేదో ఇప్పటికీ బాగా గుర్తు ఉంది.

మా బెటాలియన్ అధిపతి కర్నల్ విజయ్ కుమార్ గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. జవానులన్నా, వారి కుటుంబాలన్నా ఆయనకు ఎనలేని ప్రేమ, కరుణ. అందుకోసం వారికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి, సౌకర్యాలు మెరుగుపరచడానికి ఎంత కృషి చేయాలో అంత చేశారు. అన్ని రకాలుగా ఆయన ఒక సైనికబృందానికి అధిపతి మాత్రమే కాదు. ఆ సైనిక కుటుంబానికి ఒక నిజమైన తండ్రి అని చెప్పవచ్చు. ఆయన స్త్రీలను ఎంత గౌరవంగా చూసేవాడో నేను సన్నిహితంగా గమనించాను.

చాంగ్‌సారిలో ఉన్నప్పుడు జరిగిన మరో సంఘటన చెప్పాలనిపిస్తుంది. మా శ్రీవారు ఆ రోజుల్లో అక్కడ అఫీషియేటింగ్ సి. ఓ గా పనిచేస్తున్నారు. అకస్మాత్తుగా అర్ధరాత్రి ఒక ఫోన్ వచ్చింది. మావారు వెంటనే లేచి వెళ్లడానికి తయారవుతున్నాడు. అది రాత్రి రెండు గంటలు. గాఢనిద్రలోనున్న నన్ను లేపి తాను వెళ్ళాక ఇంటికి తాళం వేసుకోమని చెప్పాడు. ఎక్కడో తీవ్ర ప్రమాదం సంభవించింది. మా బెటాలియన్ వాహనాలు బాగా ధ్వంసం అయ్యాయి. తాను అధికారిగా పోయి ప్రమాదస్థలాన్ని చూసి రావాలన్నాడు. ఆ రాత్రి మరిచిపోలేనిది.

చాంగ్‌సారి కొండల్లో పులులు సంచరిస్తుంటాయి. మా వారు వెళ్లిపోయాక నేనొక్కదాన్నే ఇంట్లో మిగిలిపోయాను. ఎటుచూసినా నిశ్ళబ్దమే. చుట్టూ అడవి. ఎక్కడి నుంచైనా ఏ అడవి జంతువయినా దాడి చేసే అవకాశం ఉంది. నాకు చచ్చేంత భయంగా ఉంది. ఆ రాత్రి ఒక్క క్షణం కునుకు లేదు. ఎట్లాగో తెల్లారిపోయింది. ఊపిరి పీల్చుకున్నాను.

చాంగ్‌సారికి వచ్చాక నా ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం చాలా కష్టమైపోయింది. నాకు మరొకరి సాయం కావాలనిపించింది. అప్పుడే మా జీవితంలోకి బూని (మాలతి అసలు పేరు, బూని ముద్దు పేరు) ప్రవేశించింది. ప్రమీలక్క తన చిన్న కూతురును తీసుకొని మా అత్తగారింటికి వచ్చింది. బూని బక్క పలుచని 12 ఏళ్ల పిల్ల. మా ముందు నిలబడడానికి కూడా భయపడే అమ్మాయి. ఏదైనా అడిగితే బెదురు ముఖంతో వణుకుతున్న గొంతుతో వినబడీ, వినబడనంత చిన్నగా జవాబు చెప్పేది. మా ముందు నిలబడాలన్నా బెరుకు. అలా వచ్చిన బూని ఏకంగా ఇంచుమించు పదేళ్లదాకా మాతోనే ఉండిపోయింది. ఆమెనూ, మా ఇద్దరి పిల్లలనూ విడదీయలే మన్నంతగా మా పిల్లలతో చనువు పెంచుకుంది. పిల్లలను నిద్రపుచ్చుతూ రాజు రాణి కథలు కాకుండా దేవతలు, దేవకన్యల అద్భుతాల కథలను మృదుమధురమైన గొంతుతో చెప్పేది. ఆ విధంగా బూని మా కుటుంబంలో ఒకతైంది. మా పిల్లలు క్రమంగా పెద్దవారయ్యారు. నా కొడుకు అమర్త్య మహాతుంటరి. వాడిని అదుపు చేయడం చాలా కష్టం. కానీ బూని మాత్రం ఎంతో అనుభవం ఉన్న పెద్దదానిలా వాడిని నియంత్రించేది.

సుప్రతిం కూడా చిన్నవాడే కానీ సామాన్యుడేం కాదు. అన్న చేసే కొంటె పనులన్నింటిలో తోడు ఉండేవాడు. ఇద్దరు ఇల్లు పీకి పందిరేసేవారు. బూని వచ్చాక కానీ ఇంటిని క్రమంగా సర్దుకోవడం సాధ్యం కాలేదు. బూని ఆ గడుగ్గాయిలిద్దరినీ తన కనబడని మంత్రదండం చేత వశపరచుకుంది.

నా కూతురు శ్రేయ పుట్టినపుడు బూనిలోని మరో కోణాన్ని నేను చూశాను. కాన్పు కోసం హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నా బాగోగులు చూడడానికీ, హాస్పిటల్‌కు వచ్చిపోవడానికి మా వారు ఆటో చార్జీల నిమిత్తం కొంత డబ్బు ఇచ్చాడు. శ్రేయ పూణే లోనున్న southern command military hospital లో పుట్టింది. నాది RH negative రక్తం కావడంతో కాన్పు చాలా కష్టమైంది. ఆ రక్తం ఉన్నపుడు ఒకటి రెండు సార్లు పర్వాలేదు, కానీ మూడోసారి ప్రసవం అంటే చాలా కష్టతరమని వైద్యులు చెప్పారు. హాస్పిటల్ వారు పెట్టే భోజనం ఏమాత్రం నాకు సరిపడేది కాదు. మామూలు హాస్పిటల్ అయినా మిలటరీ హాస్పిటల్ అయినా వారు పెట్టే తిండి ఏదో ఒక రకమైన భరింపరాని వాసన వచ్చి వెగటు కలిగించేది. దాంతో బూని ఇంటి వద్ద వండుకొని తెచ్చేది. నేను హాస్పిటల్ నుండి “డిశ్చార్జ్” అయి ఇంటికి వెళ్లే సమయంలో బూని నా చేతిలో కొంత డబ్బు పెట్టింది. ఇదేమిటని ఆశ్చర్యపోతూ ఆమె కేసి చూశాను. బూని అనుభవజ్ఞురాలు అయిన ఒక పెద్ద మనిషిలా ఇంట్లోకి ఇంకో కొత్త శిశువు వస్తున్నప్పుడు ఖర్చులు కూడా పెరుగుతాయి కదా అంది. బూని హాస్పిటలుకు రావడానికి, ఇంటికి తిరిగి వెళ్లడానికి ఇచ్చిన డబ్బును తాను నడిచి వచ్చి వాటిని మిగిలించి నాకు ఇచ్చిందని తెలిసింది. మా బూని ఎంత సున్నితంగా, తార్కికంగా ఆలోచించిందో! అందుకే మా బూని అంటే అంటే నాకెంతో ఇష్టం. బూని మా కుటుంబంతో విడదీయరానిది. నాకు మరో కూతురు లాంటిది. ఇంటి పనంతా నెత్తిన వేసుకొని చేసేది. దానివల్ల నాకు సగం బరువు తగ్గింది. దాని బెదురుచూపులు పోయి ప్రేమపూరితమైన చూపులు శాశ్వతంగా నిలిచాయి. ఏళ్లు గడిచే కొద్ది ఒక పల్లెటూరి అమ్మాయి బూని ఒక నాగరికత యువతి లాగా పరిణామం చెందింది,

ఈ మధ్యలో మా అత్తగారు మాతో ఉండడానికి వచ్చారు. ఆమె హుందా, దర్పం గల మనిషి. ఏదైనా ఆజ్ఞాపిస్తుంది. ఆమె కొడుకులు, బిడ్డలు అందరూ ఎదిగిపోయారు. అయినా ఆమె చెప్పిందంటే శిరోధార్యంగా భావించేవారు. కాదు, కూడదంటే ఆమె ఏమాత్రం సహించలేకపోయేవారు. అవమానకరంగా తలపోసేవారు. ఎలాంటి వ్యవహారాన్ని అయినా ఉక్కు పిడికిళ్ళతో అణచివేసేది. మా అత్తగారు చాలా కొద్దిగా తినేవారు. ఆమెకు నెయ్యి, పెరుగు అంటే చాలా ఇష్టం. నెయ్యి కరగబెట్టుకొని ప్రతి అన్నం మెతుకు తడిసేలా వేసుకోవడం నాకు ఇంకా గుర్తుంది. పెరుగు కూడా బాగా పోసుకునేది. ఆమెకు ప్రయాణాలు అంటే మహాపిచ్చి. చంటి పిల్లలతో మాకేమో వీలు కాకపోయేది. అయినా, ఒక శని ఆదివారాలు హైదరాబాద్ వెళ్లి ముఖ్యమైన దర్శనీయ స్థలాలను, దుకాణాలను చూసి వచ్చాం.

మా అత్తగారికి నేనంటే ఎంతో సంతోషం, గర్వం. నేను చాలా సాదాసీదాగా ఉంటానని ఆమెకు సంతోషం. నేను ఇంగ్లీషులో పది పాటలు పాడగలనని గర్వం. ఆమె స్నేహితులు నన్ను ఆకాశానికి ఎత్తేస్తుంటే ఆమె గర్వంతో పొంగిపోతుండడం చూడదగిన దృశ్యం. ఆమెకు బాగా సంతోషం వేసినప్పుడు కుడిచేతితో నోటిని తరుచు రుద్దుకోవడం అలవాటు. ఆమె మీద నేను బాగానే ఖర్చు చేశాను. ఆమెవల్లనే నాకు రకరకాల వంటకాలు చేయడం పట్ల ఆసక్తి పెరిగింది. ఆమె ఢాకా (బంగ్లాదేశ్) నుంచి వచ్చింది. వంట చేయడంలో ఆమెకో ప్రత్యేక విధానముంది. అతి మామూలు వంటకమే ఆమె చేతిలోని ఇంద్రజాలమేమో కానీ అద్భుతంగా ఉండేది. మా అత్తగారంటే నాకు నిజంగా ఒక తల్లి. స్నేహితురాలు. మార్గదర్శకురాలు. అన్నీను.

మా మామగారు బ్రిటిష్ వారి కాలంలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. చాలా దయార్ద్రహృదయులు. సదాచార సంపన్నులు. నీతి నియమాలతో బతికినవారు. మామ గారితో పోలిస్తే మా అత్తగారు ఆలోచనల్లో, నమ్మకాల్లో చాలా నవీనత గోచరించేది. మామగారు చనిపోయాక బ్రాహ్మణ వితంతువులు పాటించే కొన్ని ఆచారాలను మాత్రమే పాటించింది. చాలా మటుకు కాలం చెల్లినవని వాటిని తిరస్కరించడానికి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాలను ప్రకటింటేది. దాంతో ఇరుగు పొరుగు వారికి కోపం కూడా వచ్చింది.

ఆమె ధైర్యానికి, ఖచ్చితంగా మాట్లాడే విధానానికి మచ్చుతునకలుగా ఒకటి రెండు విషయాలు చెప్పాలి. ఆమె ఎప్పుడు భారీగా ఆభరణాలు ధరించేది. ఒకసారి బస్సులో పోతుంటే ఒక దొంగ ఆమె మెడలోని నెక్లెస్‌ను గట్టిగా లాగి తెంపుకొని పోవడానికి యత్నించాడు. మా అత్త అమాంతం సీట్లోంచి లేచి అతని గల్లా పట్టుకుని గట్టిగా కేకలు వేసింది. అందరూ ఆ దొంగ చుట్టు చేరి నెక్లెస్‌ను ఆమెకి ఇప్పించారు.

బి.ఎడ్. చదువుతుండగా

ఇంకొక సంఘటన. ఒక మిత్రుడు ఆర్థిక విషయాల్లో మామగారిని మోసం చేయడానికి పూనుకుంటే అత్తగారు ధైర్యంగా ఖండించింది. దాంతో ఆ నమ్మకద్రోహి చల్లగా జారుకున్నాడు. మళ్ళీ కనిపించలేదు.

కొన్నేళ్ళు గడిచాయి. మాకు రంగియాకు బదిలీ అయింది. రంగియాలోని సైనిక పాఠశాలలో అధ్యాపకురాలిగా చేరాను. అప్పుడు నాకు జరిగిన ఇంటర్వ్యూ ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోదగింది. మిగతా ప్రశ్నల సంగతి వదిలిపెడదాం. మీ అభిమాన రచయిత ఎవరు అని అడిగారు. నేను డి. హెచ్ లారెన్స్ అని చెప్పి ఆయన వివాదాస్పద నవల “లేడీ చాటర్లీస్ లవర్” పేరు చెప్పాను. వాళ్లలో ఒక పెద్దాయన ఎందుకు దాని మీదనే మీ ఇష్టం అని అడిగారు. ఇంటర్వ్యూ చేసేవారు వెక్కిరింతగా ప్రశ్నార్థకముఖాలు పెట్టినట్లుగా గమనించాను. నేను జవాబు చెప్పడానికి తయారుగాలేను అయినా అప్పటికప్పుడు తోచిందేదో చెప్పాను. అది పైకి ఒక సాధారణ సెక్స్ కథలాగా అనిపిస్తూనే అంతర్గతంగా మరొక తాత్వికకోణం ఉందన్నాను. అది ఒక రచయిత లోతును పట్టిస్తుందని చెప్పాను. నా మాటలను బలపరిచే రెండు దృష్టాంతాలను పేర్కొన్నాను. నఖశిఖపర్యంతం హావభావాలు శృంగారభరితంగా ఉన్న ఒక పాత్ర- దానికి పూర్తి విరుద్ధంగా అమాయకపు సంతాలీ బాలిక పాత్రను ఉదాహరించాను. ఎక్కడా అశ్లీలం రేకెత్తించలేదు. వారు నా ఉదాహరణలను ప్రశంసించారు. రెండు రోజుల తర్వాత, నన్ను ఇంటర్వ్యూ చేసిన ఒక అధికారి భార్య నేను బాగా చేసినట్లు నన్నే ఎన్నిక చేసినట్లు తెలిపారు. ఆ విధంగా రంగియా స్కూల్లో నేను అధ్యాపకురాలిగా నియమితురాలినయ్యాను.

(సశేషం)


శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ప్రకృతి వనరులకు నిలయమైన సుందర రాష్ట్రం అస్సాంలో పుట్టిపెరిగారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి (బి.ఎ. ఆనర్స్) డిగ్రీ చేశారు. మేఘాలయ లోని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (NEHU) నుంచి బి.ఎడ్. చేశారు. రామకృష్ణ వివేకానంద మిషన్ లోనూ, బారక్‍పూర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లోనూ ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేశారు. రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తూ కథలూ, కవితలూ రాస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారు.

‘Peeping Through My Window’ (ఆత్మకథ)ను విరాసత్ ఆర్ట్ పబ్లికేషన్స్, 2022లో ప్రచురించింది. ఈ ఆత్మకథలో కావేరి ప్రధానంగా తాను బ్రెస్ట్ కాన్సర్‍పై చేసిన పోరాటాన్ని తెలిపారు. ‘The Twilight Bells’ (తొలి కవితా సంపుటి) 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘The Bindupara Tales & The Four-Lettered Word Love’ (కథాసంపుటి) డిసెంబరు 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘Apparitions from the other World’ (అతీత అనుభవాల తొమ్మిది కథలు) పుస్తకాన్ని 2023లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ప్రచురించింది.

కావేరీ చటోపాధ్యాయ పశ్చిమ బెంగాల్ లోని బారక్‍పూర్‍లో నివసిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here