సామాన్య నేపథ్యం-అసాధారణ వ్యక్తిత్వం-స్ఫూర్తిదాయక జీవితం

0
12

[డా. వెలుదండ నిత్యానంద రావు గారు అనువదించిన శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ్ ఆత్మకథ ‘ఆటుపోట్ల కావేరి’ ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]సా[/dropcap]ధారణంగా ఆత్మకథలంటే.. ఎక్కువగా సెలబ్రిటీలవో లేక దిగ్గజాలవో అయివుంటాయనీ, వాటి ద్వారా ఆ యా ప్రముఖుల జీవితాలలోకి తొంగి చూడవచ్చని, పెద్దగా ఎవరికీ తెలియని విషయాలను తెలుసుకోవచ్చనీ, లేదా వారి అంతరంగాన్ని, జీవన నేపథ్యాన్ని, జరిపిన పోరాటాలనీ, సాధించిన విజయాలనీ, ఎదురైన పరాజయాలనీ తెలుసుకోవచ్చని పాఠకులు భావిస్తారు.

మరి ఆత్మకథలను దిగ్గజాలూ, ప్రముఖులే కాదు, కొందరు సాధారణ వ్యక్తులు కూడా రాసుకున్నారు. అలా వ్రాసుకోడానికి కొన్ని ప్రత్యేక కారణాలుంటాయి. అలాంటి ఓ సాధారణ వ్యక్తి.. ఒక ఆంగ్ల ఉపాధ్యాయిని తన ఆత్మకథను వ్రాసి ప్రచురించారంటే, సమాజానికి ఏదో చెప్పాలన్న తపన అందుకు కారణం కావచ్చు. ఆ ఆంగ్ల కథ తెలుగులోకి అనువాదమయిందంటే, వారి జీవితం మరింత మందికి చేరాలన్న ఆకాంక్ష – ఆ పుస్తకాన్ని ఆంగ్లంలో చదివి ప్రభావితులైన అనువాదకులకు కలిగి ఉండాలి. అలాంటి రచనే ‘ఆటుపోట్ల కావేరి’.

శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ్ ‘Peeping Through My Window’ అనే పేరుతో తన ఆత్మకథని ఆంగ్లంలో ప్రచురించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలుగుశాఖ విశ్రాంతాచార్యులు, డా. వెలుదండ నిత్యానంద రావు ఎంతో సరళంగా, హృద్యంగా తెలుగులో అనువదించారు. తొలుత సంచికలో ధారావాహికగా ప్రచురితమై, ఇప్పుడు పుస్తక రూపంలో వెలువడుతోంది.

మధ్య తరగతి బెంగాలీ కుటుంబంలో జన్మించిన కావేరి చిన్నప్పటి నుంచి తండ్రి విధించిన క్రమశిక్షణలో పెరిగారు. అమ్మ ప్రేమ, పిన్నమ్మలూ, బాబయిలూ, మేనత్తలు, నానమ్మ అభిమానం అందిపుచ్చుకున్న కావేరి తన ప్రవర్తన ద్వారా అందరి మన్ననలు పొందుతారు.

బాల్యం చదువు అందరి బాలికల్లానే సాగినా, తండ్రి నియంతృత్వ ధోరణి, తల్లి అనారోగ్యం చిన్నారి కావేరిని మానసికంగా దృఢంగా మారుస్తాయి. తల్లికి సేవలు చేస్తూ, కంటికి రెప్పలా కాపాడుకుంటూ, తోబుట్టువుల అవసరాలు తీరుస్తూ మరో అమ్మ అవుతారు కావేరి. మధ్యలో నానమ్మ వచ్చి కొన్నాళ్ళు సాయం చేసినా ఆమె చనిపోవడంతో మళ్ళీ కావేరే ఇంటి బాధ్యతలు చూడాల్సి వస్తుంది. బాల్యం నుంచే ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన కావేరి సున్నిత మనస్కురాలు కూడా.

తమ్ముడు మానసిక వికలాంగుడిగా మారితే, అనుక్షణం అతన్ని కనిపెట్టుకుంటూ సేవలు చేస్తారు. ఇన్ని బాధ్యతల మధ్యను కూడా చదువు మానకుండా, డిగ్రీ పూర్తి చేసి, బి.ఎడ్. చేస్తారు. అనంతరం రామకృష్ణ మిషన్ వారి పాఠశాలలోనూ, తదుపరి బారక్‍పూర్ సైనిక పాఠశాలలోనూ ఉపాధ్యాయినిగా పని చేస్తారు. కొంత కాలానికి శ్రీ దీపక్ కుమార్ చటోపాధ్యాయ్ గారితో వివాహం అవుతుంది. భర్తతో పాటు పలు ప్రాంతాలలో నివసిస్తారు. ఎక్కడ ఉన్నా తన బాధ్యతలను విస్మరించకుండా సక్రమంగా నిర్వర్తిస్తారు. అయితే సోదరుని మరణం ఆమెను కలచివేస్తుంది. దాన్ని తట్టుకుని ముందుకు సాగుతున్న క్రమంలో తండ్రి కూడా మరణిస్తారు.

తోబుట్టువుగా బాధ్యతలు ముగిసినా, తల్లిగా, భార్యగా బాధ్యతలు మిగిలే ఉంటాయి. ఇద్దరు కుమారులని, కుమార్తెని బాగా చదివించి, ప్రయోజకులను చేస్తారు. భర్తతో కలిసి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలో చేసిన ప్రయాణపు అనుభవాలను ఉత్సాహాంగా వివరిస్తారు. ఆ యాత్రానుభవాలను చదువుతుంటే పాఠకులు కూడా ఆ యా ప్రాంతాలలో తిరుగాడిన భావన కలుగుతుంది. ప్రకృతి వర్ణనలూ, ప్రకృతితో మమేకమవడం, భావుకతకి లోనయి అడవులను అద్భుతంగా వర్ణిస్తారు.

ఆడపడుచులతోనూ, సోదరీమణులతోనూ, బావగార్ల తోను ఉల్లాసంగా గడిపిన సమయాలను చెప్తారు. తోటి ఉపాధ్యాయులతో ఎదురైన సంఘటనలను ప్రస్తావిస్తారు. సంతోషకరంగా సాగుతున్న జీవితానికి విఘాతం కల్పిస్తుంది బ్రెస్ట్ కాన్సర్.

ఒకరోజు స్కూలుకి వెళ్తుండగా, ఛాతిలో ఏదో అసౌకర్యంగా ఉన్నదని అనుమానం వచ్చి, కుమార్తె చేత నూనెతో మర్దన చేయించుకుంటారు. ఆ సమయంలో ఛాతిలో ఎడమ వైపు ఏదో గడ్డలా ఉందని కుమార్తె చెబుతుంది. అప్పటికే బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన ఉన్న కారణంగా, కాన్సర్ గడ్డ కావచ్చని అనుమానించి, మద్రాస్ వచ్చి కాన్సర్ స్పెషలిస్ట్ డా. ఉమగారిని కలుస్తారు. ఆవిడ కొన్ని పరీక్షలు చేసి, కాన్సర్ అని నిర్ధారిస్తారు. ఇక్కడి నుంచి కావేరి గారి జీవితం మలుపు తిరుగుతుంది. ఎంతో దృఢ నిశ్చయంతో ఆవిడ చికిత్సలు చేయించుకుంటారు. కీమో థెరపీలు, రేడియోషన్ వల్ల శరీరం ఎంత ఇబ్బంది పెట్టినా – మనసును – దృఢంగా ఉంచుకుని – అమ్మవారిని మనస్ఫూర్తిగా విశ్వసించి – తాను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిని అవుతానని తనకి తాను చెప్పుకున్నారు.

చికిత్స జరుగుతున్నంత కాలం ఒక్కసారి కూడా బెంబేలు పడిపోలేదు, ‘ఏదో నా బతుకు ఇలా అయిపోయింది’ అని కానీ బాధపడలేదు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో తోటి కాన్సర్ పేషంట్లలో ధైర్యం, స్ఫూర్తి నింపారు. దుర్గాదేవి భక్తురాలైన కావేరి – కష్టకాలంలో- పరాశక్తిని వదలకుండా, వీలున్నప్పుడల్లా ప్రార్థనలు చేస్తూ, ఆత్మశక్తిని పెంచుకున్నారు. “కీమోథెరఫీ జరుగుతున్న కాలంలో దాన్ని అధిగమించడానికి ఆ లోకాతీతశక్తి నాకెలా సాయపడిందో చెప్పాలని ఉంది. అమ్మవారి కరుణాకటాక్షం ఒక సాంత్వనం, మార్మికత, అత్యంత శక్తిమంతమని, అది పూలలోని తావి లాగా సర్వత్రా వ్యాపించిందనిపించింది. మొత్తం మీద నాకే తెలియని ఒక వింత అనుభూతిని నాలో రగిలించింది. నా ప్రస్తుత పరిస్థితి కన్నా విభిన్నమైన మరొక దివ్యమైన మైకంలో, పారవశ్యంలో ఉన్నాను. దుఃఖాలు కానీ, రోగాలు కానీ లేని ఒక మధురానుభూతిలో నా మనస్సు ఓలలాడుతుంది” అని రాశారు కావేరి.

“ఏదో ఒక రోగం వచ్చిందంటే దానికి చికిత్స చేయించుకోవాలి తప్ప శారీరకంగా మానసికంగా సమస్తం కోల్పోయినట్లే, మరణమే శరణ్యమని భావించకూడదు. వైద్యశాస్త్రం విప్లవాత్మకంగా పురోగమించింది. ఎన్నెన్నో కొత్త కొత్త పరిష్కారాలను కనుగొంటున్నారు. మనకు ఒక్కటే కావలసింది పోరాట పటిమ. అదొక్కటి ఉంటే చాలు ఆత్మనూ, మనసునూ ఛిద్రం కాకుండా ఉంచుతుంది. మానసికమైన వ్యాయామాలతో మానసిక శక్తులను వృద్ధి చేసుకోవచ్చు. తద్వారా శారీరకంగా కూడా బలపడవచ్చు” ఈ వాక్యాలను చదివితే ఆవిడ మనో నిబ్బరం అర్థమవుతుంది.

ఆమె వెంటే ఉంటూ “Don’t worry, Kaberi, everything will be alright” అంటూ అనునిత్యం ప్రోత్సహించిన భర్త దీపక్ కుమార్ గారి సహకారం మరువలేనిది.

మన కళ్ళముందే, మనం ఉన్నప్పుడే మరొక మంచి ప్రపంచాన్ని నిర్మించుకుందాం.” అంటూ తన ఆత్మకథని ముగిస్తారు కావేరి.

ఇటీవలి కాలంలో కొందరు నటీమణులు లేదా ఇతర రంగాలలోని ప్రముఖ స్త్రీలు తాము బ్రెస్ట్ కాన్సర్‍కి గురయ్యామనీ, పోరాడి విజయం సాధిస్తున్నామని సాంఘిక మాధ్యమాల ద్వారా లోకానికి వెల్లడించి ఆ జబ్బుతో పోరాడుతున్న వారిలో స్ఫూర్తి నింపుతున్నారు. అలాగే, సామాన్య నేపథ్యం కల మధ్యతరగతి కుటుంబీకురాలు, ఒక ఉపాధ్యాయిని తన జీవితాన్నే ప్రేరణగా తీసుకోమని, కేన్సర్‍కి భయపడవద్దనీ, పోరాడి విజయం సాధించమని సూచిస్తున్నారు. ఇదే ‘ఆటుపోట్ల కావేరి’ విశిష్టత.

తెలుగు అనువాదానికి మూల రచయిత్రి పేరుని, ఆమె జీవితంలోని ఒడిదుడుకులను ప్రతిబింబించేలా ‘ఆటుపోట్ల కావేరి’ అని డా. వెలుదండ నిత్యానంద రావు గారు పేరు పెట్టడం ఎంతో ఔచిత్యవంతం.

***

ఆటుపోట్ల కావేరి (శ్రీమతి కాబేరీ చటోపాధ్యాయ్ ఆత్మకథ అనువాదం)
రచన: డా. వెలుదండ నిత్యానంద రావు
పేజీలు: 104
వెల: ₹
ప్రతులకు:
త్వరలో అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత: ఫోన్‌ – 94416 66881

 

 

 

 

 

~

ఆటుపోట్ల కావేరి పుస్తకం అనువాదకులు డా. వెలుదండ నిత్యానంద రావు ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-veludanda-nithyananda-rao/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here