ఆవేశం అనర్థం

0
10

[dropcap]అవి[/dropcap] సంక్రాంతి పండుగ ముందు రోజులు. రోజులు భారంగానే గడుస్తున్నాయి ఎప్పుడెప్పుడు పండుగ రోజులు ఆస్వాదిద్దామా అని. దానికి తోడు చల్లని వాతావరణం నా బద్ధకాన్ని మరింత ప్రోత్సాహిస్తునట్లుంది. నిద్ర లేవడం కూడా రోజూ కంటే ఆలస్యం అయ్యింది. అలాగని మిగతా పనులన్నీ ఆలస్యంగా నడపలేం కదా అందుకనే హడవిడిగా పడుతూ లేస్తూ నా పనులన్నీ కానిచ్చుకుని ఆఫీసుకి బయలుదేరాను. ఎంత ఆదుర్దా పడినా అప్పటికే ఒక అరగంట ఆలస్యం అయ్యింది. కారు అంతా దుమ్ము కొట్టుకొని ఉంది. ఆ దుమ్ము మీద ఎవరో తమ చిత్రకళను ప్రదర్శించినట్లున్నారు. దానికి తోడు కొద్దిగా భావుకత కూడాను – ‘ఆవేశం అనర్థం’ అంటూ. ఏమైనా సరే దానిని తుడిచే సమయం కానీ ఆసక్తి కానీ ఇప్పుడు లేదు. అయినా పెద్ద దుమ్ము కూడా కనిపించట్లేదు అని సర్ది చెప్పుకుని అలాగే బయలుదేరాను.

కొంత దూరం ప్రయాణించాక, యథాలాపంగా దూరంగా ఉన్న రోడ్ క్రాసింగ్ వైపు చూస్తే ఒక యువతి అసహనంగా ఎప్పుడు గ్రీన్ లైట్ వస్తుందా రోడ్ క్రాస్ చేయవచ్చన్నట్లు కదలాడుతూ కనిపించింది. ఆమె డివైడర్ పైనున్న ప్లాట్‌ఫారంపై నిలబడకుండా క్రిందకు దిగి రోడ్ మీదనే నుంచుని ఉంది. ట్రాఫిక్ పోలీస్ పలుమార్లు హెచ్చరించినా ఆమె వినిపించుకోవట్లేదు. పోలీస్ కోపంగా అమెపై అరిచాడు. అది కోపంగా కంటే అసహయతలా అనిపించింది నాకు దూరం నుంచి. ఆమె చిరాకుగా కొన్ని అడుగులు దూరంగా జరిగింది పోలీస్ నుంచి, కానీ ఇంకా రోడ్ మీదనే ఉంది. వాహనాలు సగటు వేగంతోనే వెళ్తున్నాయి కానీ అందరూ మరొక సిగ్నల్న్ తప్పించుకొనే ప్రక్రియలో హడావిడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ వాహనాల సమూహంలో నా కారు కూడా ఒకటి. దాదాపు 30 అడుగుల దూరం నుంచి ఆ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తున్నాను. జంక్షన్ దగ్గర ఇంకా గ్రీన్ సిగ్నల్ ఉండడంతో నేను కూడా అక్కడనుంచి కదిలాను.

నాకు ఆ సంఘటన చాలా చిత్రంగాను, ఆమె ప్రవర్తన బాధ్యతారహితంగాను అనిపించింది. ఆమె ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థం కాలేదు. ఆ రోజు తరువాత మళ్ళీ నేను ఎప్పుడూ ఆమెను అక్కడ చూడలేదు. బహుశా మా ప్రయాణ సమయాలు వేరేమో, లేకపోతే ఆమె అక్కడకు అస్తమానూ రాదేమో, ఏదైనా అయిండవచ్చు. నిజానికి ఆ సంఘటనను దాదాపు అదే రోజు మర్చిపోయాను. కానీ తన విధుల పట్ల ఎప్పుడూ నిజాయతీగా, శ్రద్దగా కనిపించే ఆ పోలీస్‌ను మాత్రం రోజూ చూస్తూనే ఉన్నాను. అతని పేరు తెలీదు కానీ పోలీస్ సెలక్షన్‌లో అన్ని నిర్దిష్టమైన శరీర కొలతలకు సరిగ్గా సరిపోయినట్లున్నాడు. ఉద్యోగానికి కొత్తో లేకపోతే పని పట్ల ఉన్న నిబద్ధతో తెలీదు కానీ అతని దుస్తులు కూడా చాలా శుభ్రంగా చక్కని ఫోల్డింగ్‌తో, కరెక్టు ఫిట్మెంట్‌తో చాలా చూడముచ్చటగా ఉన్నాడు. ఎప్పుడైనా కుదురుతే మాట్లాడాలని కూడా అనిపిస్తూ ఉండేది.

అలా సూర్య చంద్రులు క్రమం తప్పక వస్తూ పోతూ ఉండగా, సంక్రాంతి పండుగ కూడా వచ్చి వెళ్ళిపోయింది. నేను తరువాత రాబోయే సెలవలు గురించి ఎదురు చూస్తూ నా పనిలో నేను ఉన్నాను. ఎప్పటిలాగే ఆ రోజు ఉదయం వార్తాపత్రిక తిరగేస్తూ ఉంటే ఒక వార్త నన్ను ఆకర్షించింది. ఆ వార్త నేను ఇంతక ముందు గమనించిన సంఘటన జరిగిన ప్రదేశం గురించే. అక్కడే ఏదో ప్రమాదం జరిగనట్లు రాసారు కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రచురించలేదు. నేను కూడా దానిని పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే మనకు ఉన్న వాహనాల సాంద్రతకి, డ్రైవింగ్ నియమ నిబందనల పట్లున్న నిబద్ధతకి వాహన ప్రమాదాలు కొత్తేమీ కాదు కదా! ఈ వార్తలు రోజూ చూసేవే.

రోజూ లాగానే ఆ ప్రదేశానికి చేరుకోగానే మాత్రం నాకు ఆ వార్త గుర్తుకు వచ్చింది. ఎప్పటిలానే అక్కడ ఉండే పోలీస్ గురించి చూసాను, అతను కనిపించలేదు. వరుసగా రెండు రోజులు చూసాను, అతను అక్కడ లేడు. నా మదిలో రకరకాల ఆలోచనలు. అతను కానీ ఆ ప్రమాదం జరిగిన రోజు ఆ దృశ్యాన్ని దగ్గరగా చూసి ఉండడం వలన ఏమైనా షాక్‌కి గురై సెలవు మీద ఉన్నాడా? లేక అతనిని ఆ ప్రదేశం నుంచి వేరొక చోటుకి ఏమైనా మార్చారా? లేకపోతే అతనికి ఒంట్లో బాగోలేదా? ఇలా నన్ను నేను ప్రశ్నించుకుంటూ ముందుకి సాగాను. కొద్ది రోజుల పోయిన తరువాత అక్కడ ఇంకో పోలీస్ కనిపించాడు.

ఆ మరుసటి రోజు వార్తాపత్రికలో ఇంతక ముందు వార్తకు కొనసాగింపు ప్రచురించారు. ఆ వార్త నన్ను చాలా కుదిపేసింది. అందులో రాసిన దానినబట్టి ఆ ప్రమాదంలో చనిపోయింది అక్కడ బాధ్యతలను నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ అని. ఆ వార్తా కథనంలో అత్మహత్యా కోణం అని ప్రస్తావించారు. నాకు అది చదవగానే, ఎందుకో ఏదో దాస్తూ ఆ ప్రమాదం చుట్టూ కథ అల్లినట్లు అనిపించింది. ఇంతక ముందు చెప్పినట్లు నేను ఆ పోలీస్‍ను, అతని ప్రవర్తనను రోజూ చూసేవాడిని. నాకు ఆ వార్త నచ్చలేదు, నిజం అనిపించలేదు. ఈ మధ్య చూసిన సినిమాల ప్రభావం అనుకుంటా, అక్కడ నిజంగా ఏం జరిగి ఉంటుంది అని తెలుసుకోవాలని నిశ్చయుంచుకున్నాను.

***

కొత్త పోలీస్‍తో మాట్లాడలనే ఆదుర్దాతో ఆఫీస్‌కు కొద్దిగా ముందుగానే బయలుదేరాను. ఆ ట్రాఫిక్ సిగ్నల్ కు దగ్గరగా ఉన్న పార్కింగ్ స్లాట్‌లో కార్‌ని పార్క్ చేసి, అక్కడ సిగ్నల్ పోస్ట్‌లో కూర్చుని ఉన్న పోలీస్‌ను కలిసాను. నన్ను నేను పరిచయం చేసుకొని, నేను వచ్చిన పని గురించి ప్రస్తావించాను – ఆ ప్రమాదంపై వచ్చిన వార్త, దానిలో ఉన్న నిజానిజాలు గురించి. మొదట పోలీస్ పెద్దగా ఆసక్తి చూపించలేదు ఆ సంఘటన గురించి మాట్లాడడానికి. అయితే నేను ఇంతకు ముందు జరిగిన సంఘటన, నేను ఎందుకు అంత ఆసక్తిగా ఆ విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నానో చెప్పిన తరువాత, అతను చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పడం పూర్తయ్యేసరికి నా మెదడు కొన్ని క్షణాలు స్తంభించినట్లు అయ్యింది.

ఆ వార్త అంత అసంబంద్ధంగా ఎందుకు ఉందో, అందులో అన్ని రకాల కోణాలను ఎందుకు ప్రస్తావించారో, అసలు విషయాన్ని అయితే ప్రక్కన పెట్టే ప్రయత్నం చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. అతను చెప్పింది విన్నప్పుడు నాకు అది ఇంతకు ముందు నేను చూసిన సంఘటనను పోలినట్లు ఉంది. కాదు కాదు మళ్ళీ పునరావృతం అయినట్లు అనిపించింది. ఒక్కసారి పోలీస్ చెప్పినదానిని, నేను ఇంతకు ముందు చూసిన సంఘటనకు జోడించి చూస్తే.. ఈ సారి అదే ఘటన తీవ్రస్థాయిలో జరిగింది. అదే వ్యక్తులు, అదే సందర్భం, అదే ప్రవర్తన, ఒకే ఒక మార్పు ఏంటంటే మితిమీరిన ఆవేశం. క్రిందటి సారిలాగే ఆమె పోలీస్ చెప్పిన మాట వినలేదు. సిగ్నల్ కోసం చూస్తూ రోడ్ మీదే నుంచుంది. పోలీస్ ఆమెను వారించాడు. ఇద్దరి మద్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. చాలా కోపం, అసహనంతో ఉన్న ఆమె, పోలీస్‍ను నెట్టి వేసింది. అలా నెట్టి వేయబడినప్పుడు అతని పాదం ఒకటి డివైడర్ పైనా మరొక పాదం రోడ్ పైనా ఉంది. దాంతో అదుపు తప్పి కదులుతున్న ట్రాఫిక్ వైపు రోడ్డుపై పడిపోయాడు. అప్పుడే అటు వెళ్తున్న సిటీ బస్ అతను మీద నుంచి వెళ్ళింది. ఇదంతా అకస్మాత్తుగా జరగడంతో డ్రైవర్ కూడా బస్‌ను నియంత్రించలేకపోయాడు. దురదృష్టం ఏంటంటే పడినప్పుడు అతడి కాళ్ళు డివైడర్ పైన, మిగతా శరీరం రోడ్ మీద పడింది. లేకపోతే ప్రాణం అయినా దక్కేదేమో. పాపం, ఆ పోలీస్ అనుభవించిన చివరి స్పర్శ ఆ బస్ టైరుదే అనుకుంటా.

ఈ రెండు సంఘటనలకు ముందు వాళ్ళిద్దరి మద్యా ఏం జరిగిందో నాకు తెలీదు. అవి ఏమైనా ఈ దుర్ఘటనకు మూల కారణం అయితే అది తప్పకుండా వేరేగా విశ్లేషించాలి. ఒకవేళ వేరే కారణాలు లేవనుకుంటే ఏ తప్పు లేకుండా, నిజాయితీగా, బాధ్యతగా తన విధిని నిర్వహిస్తున్న పోలీస్ తన బంగారు జీవితాన్ని వృథాగా కొల్పోయినట్లే. అయితే క్రమశిక్షణ లేకుండా, మొరటుగా మరియు అమానవీయంగా అతని ప్రాణాలు కోల్పోడానికి కారణం అయిన ఆ మహిళ మాత్రం ఎటువంటి శిక్ష లేకుండా బయటపడింది. ఎందుకంటే ఆమె సంఘంలో పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందింది కాబట్టి. ఆమె ఎవరో అతను నాకు స్పష్టంగా చెప్పలేదు కానీ, ఆ చెప్పిన వివరాలను బట్టి, మరియు ఆ విషయాన్ని ప్రక్క దారి పట్టేటట్లు ప్రచురించిన వార్తా కథనాన్ని బట్టి, ఎవరైనా సరే ఈ నిర్ణయానికి తప్పకుండా వస్తారు.

అక్కడి నుంచి నెమ్మదిగా బయలుదేరి, కారు దగ్గరికి చేరుకుంటూండగా నా ఆలోచనలు ఇలా సాగిపోతున్నాయి. ఎందుకు మనందరం సాదారణ నియమాలను పాటించం? పాటిస్తే బలహీనులుగా ఎందుకు భావిస్తాం? మన పలుకుబడికి సామాజిక స్థితిగతులుకు తగ్గట్లు నియమ నిబంధనలను ఎందుకు మనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాం? ఇలా చేయడం వలన ఎవరో ఒకరికి ఇబ్బంది కలగడమో లేక వారి జీవితాలను కోల్పోయే అంత తీవ్ర పరిస్థితులు రావడమో జరగాడనికి ఆస్కారం ఉంది కదా, ఈ సంఘటనలో చూసినట్లు. పగలు, రాత్రి వాటి పనిని ఏ నిబంధనలు అతిక్రమించకుండా చేసినట్లు, మనమూ వాటిని అనుసరిద్దాం. ప్రకృతి నుంచి నేర్చుకునే ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రయత్నం చేద్దాం.. ఏమంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here