ఆవిష్కారం

6
9

[box type=’note’ fontsize=’16’] లేఖిని నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథని అందిస్తున్నారు సరస్వతి కరవది. [/box]

[dropcap]”మ[/dropcap]రో గంటలో మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సభకి అధ్యక్షురాలిగా వెళ్ళాలి. మీ కార్ పంపిస్తారా?” మాధవి భర్తకి భోజనమయ్యాక చెయ్యి తుడుచుకునేందుకు టవల్ అందిస్తూ అడిగింది.

“నీ కార్ ఏమైంది డార్లింగ్?” రవి నవ్వుతూ అడిగాడు..

“అత్తయ్య గారు గుడికి వెళ్లి, అటునించి ఎవరినో చిన్ననాటి స్నేహితురాలిని చూసి వస్తానంటే నా కార్..” ఇంకా మాధవి మాట పూర్తి కానే లేదు.

“….నాతో చెప్పలేదే” అన్నాడు రవి భృకుటి ముడివేసి. “అత్తయ్య గారికే కదా ఇచ్చింది” అని నచ్చ చెప్పబోయింది మాధవి.

“ఏం చేసినా నాకో మాట చెప్తుండు. సొంత పెత్తనాలు వద్దు. సరే నేను ఆఫీస్‌కి వెళ్ళగానే కార్ పంపుతాను. నువ్వు ఇబ్బంది పడకుండా వెళ్ళిరా.” కొత్తగా పెళ్ళి కాపురానికి వచ్చిన మాధవి బిత్తరపోయి, అంతలోనే తేరుకుంది. తను ఇబ్బంది పడకూడదనేగా అంది. ఆమె బుగ్గ మీద సుతారంగా ఓ ముద్దు పెట్టి, టైం చూసుకుని హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు రవి.

రవి ఆమెను అరచేతులతో పెట్టుకుని చూసుకుంటాడు. ఎన్నో మహిళా సేవా సంస్థల్లో చేర్పించాడు. ఆమె చేత ఎన్నో సేవాకార్యక్రమాలు చేయిస్తుంటాడు. ఎన్నో విరాళాలు ఇప్పిస్తుంటాడు. అంతా బాగుంది కానీ, మాధవి ఏ చిన్న పనైనా సొంతంగా చేస్తే అతనికి కోపం ముంచుకొస్తుంది,

ముందురోజే తనతో చెప్పకుండా భార్య పుట్టింటికి వెళ్లి వచ్చిందని అలిగాడు రవి.. ఇవాళ అత్తగారి ప్రహసనం.

ఆనాటి మీటింగ్‌లో ఆమె విమెన్స్ కాలేజీ కోసం ఒక పదివేలకు చెక్కు రాసి ఇచ్చింది. నిజానికి అది పెద్దమొత్తం కాదు వాళ్ళకి. మాధవి ఇచ్చిన డొనేషన్ మాట తెలియగానే రవి మొహం మాడ్చుకున్నాడు..

“నువ్వు నన్ను అడక్కుండా రూపాయి ఇచ్చినా నాకేదోలా ఉంటుంది” అన్నాడు. మాధవి చిన్నబోయింది. క్రమక్రమంగా రవి మనస్తత్వం మాధవికి అర్థమవుతోంది. అతనికి తనంటే ప్రేమే. కానీ అతని మాట విన్నంతవరకే. తనకి ఆర్థికమే కాదు, ఏ విధమైన స్వాతంత్ర్యము లేదు.

రాను రానూ మాధవి మనసు ముకుళించుకు పోసాగింది. ఆమె అతని మనస్తత్వంతో సర్దుకుపోవటానికి విశ్వప్రయత్నం చేస్తుండగా జరిగిందా సంఘటన. ఆమె గర్భవతి అయింది. తల్లి తండ్రులు, అత్తగారు ఎంతో పొంగిపోయారు. కానీ మాధవికి పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని చట్ట విరుద్ధంగా తెలుసుకున్న రవి, మాధవిని అడగకుండానే ఆ బిడ్డను కడుపులోనే చంపేయాలని నిర్ణయించాడు. ఆ మర్నాటి ఉదయమే అబార్షన్‌కి ముహూర్తం పెట్టాడు.

మాధవి మనసు మరిగి పోతోంది. ఆమె తమ ఇంటిముందున్న గార్డెన్లో పచార్లు చేస్తూ, ఓ చెట్టు కింద ఆగిపోయింది. అక్కడ రవి పెంపుడు కుక్క లక్కీ పిల్లల్ని పెట్టినట్టుంది. ఎంత బావున్నయ్యో ఆరు బుజ్జి కుక్క పిల్లలు. లక్కీ హాయిగా పడుకుని తన పిల్లలకి పాలు ఇచ్చుకుంటోంది.

రవి అప్పుడే మాధవిని వెతుక్కుంటూ తోటలోకి వచ్చి, ఆ కుక్కపిల్లల్ని చూసాడు. “అరే ఇవి ఎప్పుడు పుట్టాయి? పైగా ఆరా? నాలుగింటిని తీసేస్తే మిగిలినవి ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇప్పుడే తల్లి నించి వేరు చెయ్యాలి..”

“వద్దు రవీ, అది ఇప్పుడే ఈనింది. దగ్గరకు వెళ్ళకు. ఊరుకోదు.”

“అది నన్నేం చేస్తుంది? దాన్ని పెంచింది నేనే” నిర్లక్ష్యంగా ముందుకు పోయాడు రవి.

లక్కీ రవిని రావద్దని గుర్తు మంటూ హెచ్చరించింది. రవి వినలేదు. రవి తనపిల్లలని తీసుకోవటానికి ముందుకి వంగి చెయ్యి సాచేసరికి లక్కీ ఎగిరి ఒక్కదూకు దూకింది అతని మీదకి. దెబ్బకి హడలి వెనక్కి పడి పోయాడు రవి. ‘నువ్వు నా పిల్లల జోలికి రాకు,నేను నీ జోలికి రాను’ అన్నట్లుంది లక్కీ ధోరణి. లక్కీ వంక భయం, భయంగా చూస్తూ లోపలికి వచ్చిపడ్డాడు రవి. మర్నాడు పొద్దున్నే “మధూ, తొందరగా లేచి తయారవ్వు. డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి” నిద్ర లేపుతూనే అన్నాడు రవి. కళ్ళు తెరిచి ఒక్కసారి రవిని చూసింది మాధవి. ఆ చూపు అచ్చం ఈనిన లక్కీ చూపు లాగానే కనిపించింది రవికి. ఒక్కసారి గుండె ఝల్లుమంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here