ఆయన ఒక రారాజు!

0
12

[08 జూన్ 2024న మృతి చెందిన రామోజీరావు గారికి నివాళి అర్పిస్తున్నారు ఏ. అన్నపూర్ణ.]

[dropcap]మ[/dropcap]రణం తథ్యమని, ఎవరికైనా తప్పదని అందరికి తెలుసు.

జీవించినంత కాలము మనం చేసే పనులు మరణానంతరం కూడా అందరి మనసుల్లోనూ నిలిచిపోతాయి.

అలా నిలిచిపోయేలా పేరు తెచ్చుకోడం కొందరికే సాధ్యం.

అలాంటి వ్యక్తి శ్రీ చెరుకూరి రామోజీ రావుగారు!

1974లో ఉమ్మడి ఆంధ్రా – విశాఖపట్నంలో ఈనాడు వార్తా పత్రిక ప్రారంభించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు రామోజీరావు.

ఈ విషయం పత్రికలు చదివేవారందరికి గుర్తే! ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ అందరికి ఆత్మబంధువు ఈనాడు.

నేను రైటర్‍గా స్థిరపడటానికి ఈనాడు ముఖ్య కారణం. పత్రిక చదివి ఉత్తరాలు రాసేదాన్ని. అలా మొదలైంది ఈనాడు పత్రికలో నా ప్రస్థానం.

ఈనాడు ప్రచురణలు జంట మాసపత్రికలు చతుర విపుల చదువుతుంటే కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చతుర హాస్య కథలతో మొదలై చతురలో నవల రాసేవరకూ వచ్చింది.

అంతేకాకుండా ఈనాడు ఆఫీసు మా ఇంటికి దగ్గిరే కనుక నేను నా రచనలను ఆఫీసులో ఇచ్చేదాన్ని.

ప్రతి పుస్తకం చదివే అలవాటుతో నెలకి ఆరు పత్రికలు కొనేదాన్ని.

ఆ పత్రికలు వెలువడినంత కాలమూ చదవకుండా వుండలేదు. ఆ పత్రికలు నాకు అంత చేరువ అయ్యాయి .

రామోజీరావుగారు ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నం చేయడం, ఆకట్టుకునే అంశాలను జోడించడం ‘ఆదివారం అనుబంధం’ కి వన్నెతెచ్చింది. ఇప్పుడు అంటే స్మార్ట్‌ఫోను గూగుల్ సెర్చిలో క్లిక్ చేస్తున్నాము కానీ ప్రపంచం నలుమూలలా జరిగే అద్భుతాలు, ఔరా! అనిపించే అంశాలను తెలియచెప్పింది ఈనాడు పేపర్.

నేను అమెరికా వెళ్ళినపుడు ఇండియన్ గ్రోసరీ స్టోరులో ఎక్సపైర్ డేటు దాటినా ప్రియా పచ్చళ్ళు ఒకటి కొంటే రెండోది ఫ్రీ అని అమ్ముతుంటే చూసి రామోజీరావుగారికి వుత్తరం రాసాను్. వారు ఈ విషయం తన దృష్టికి తెచ్చినందుకు మెచ్చుకుని, వారి మీద చర్య తీసుకున్నారు. ఇలా శ్రద్ధ తీసుకోడం, అక్కడ స్టోర్లను పరిశీలించి తెలియచేయమని నాకు అప్పగించారు. అంతటి జాగ్రత్త తీసుకోడం నిజంగా వారికే చెల్లింది.

మా అత్తగారు మార్గదర్శిలో ఇరవై అయిదు ఏళ్ళు డబ్బు దాచుకున్నారు. ఏనాడూ తేడా రాలేదు.

ఆవిడకు బ్యాంకుల మీద లేని నమ్మకం మార్గదర్శి మీద వుంది.

హైదరాబాదులో మా ఇంటికి ఎవరు స్నేహితులు బంధువులు వచ్చినా బహుమతులు ఇవ్వలేదు. వారికి రామోజీ ఫిలిం సిటీ చూపించేదాన్ని వాళ్ళు ఎంతో సంతోషపడేవారు. ఆ ఫొటో ఆల్బమ్ ఎన్ని ఉన్నాయో లెక్కలేదు.

ఫిలిం సిటీలో తిరిగే టూరిస్ట్ బస్సులు ఎక్కడానికి చాలా ఎత్తులోవుండేవి. మోకాళ్ళ నొప్పులు వున్నవారు, వృద్ధులు ఇబ్బంది పడుతుంటే చూసి రామోజీరావుగారికి తెలియచేస్తే బదులుగా లేఖ రాసేరు – ఇకనుంచి ప్రతి బస్సులోను ఎక్కడానికి చిన్న బల్లవొకటి ఉండేలా ఏర్పాటు చేస్తాను అని!

ఇక టీవీ ఛానల్స్ అంటే వీక్షకులలో వుండే ఆదరణ చెప్పలేనిది. ప్రేక్షకుల అభిరుచి మేరకు ఇష్టమైన ఛానల్ చూసేలా ఎన్నో చానళ్లను అందుబాటులోకి తెచ్చారు. వారి తర్వాత మిగిలినవారు కూడా ప్రారంభించారు కాని మొదటి స్థానం రామోజీ గారిదే! ముఖ్యంగా గృహిణులు జీవితంలో ఒక భాగంగా ప్రియా తినుబండారాలు పచ్చళ్ళు లాంటి ఉత్పత్తులు ఎంటర్టైన్మెంట్ చానల్స్ మారిపోయాయి. ఇలా అన్ని రంగాలలోను పేరును సార్థకం చేసుకోడంతో తెలుగు రాష్ట్రాలలో రామోజీరావుగారి పేరు చిరస్థాయిగా నిలిచింది.

నాకు ఊహ తెలిసాక జనరల్ నాలెడ్జ్ పట్ల ఇష్టం ఉండేది. అది చాలావరకూ ఈనాడు వార్తా పత్రిక ద్వారానే నెరవేరింది. అలాగే సాహిత్యము కూడా ఇష్టం. రచనలు చేయడం.. ఇది కూడా ఈనాడు ద్వారా నెరవేరడం ఆ పత్రిక నన్ను గుర్తించడం నాకు గిఫ్ట్!

ప్రతిధ్వని కార్యక్రమంలోనూ నాకు అవకాశం ఇవ్వడం మరువలేని అనుభూతి. ఇలా చెప్పాలి అంటే ఎన్నో.

వారు ఎందరికో ఉపాధి కల్పించిన పుణ్యమూర్తి.. మరి ఎందరికో మార్గదర్శి.

పట్టుదల, సాధించాలి అనే ధ్యేయం అంటూ ఉండేవారికి శ్రీ రామోజీరావుగారు ఒక రోల్ మోడల్.

వారికి నా నివాళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here