ఆయుధం

1
7

[dropcap]“అ[/dropcap]సలు ఏలియన్స్ నిజంగానే ఉన్నారంటావా? నాకెందుకో ఇదంతా సైన్స్ ఫిక్షన్ రచయితల కల్పన తప్ప నిజం కాదనిపిస్తోంది” అన్నాడు సందీప్.

అప్పటికి అరగంటనుంచి అతనికీ ఛోజోకి మధ్య మన గెలాక్సీలో ఏదో ఓ ప్లానెట్ మీద ఏలియన్స్ ఉండే సంభావ్యత గురించిన వాదన జరుగుతోంది.

సందీప్‌కి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆర్నెల్ల లోపలే కాగ్నిజెంట్లో ఉద్యోగం వచ్చింది. మాదాపూర్‍లో ఉన్న ఓరియన్ మెన్స్ హాస్టల్‍లో ఓ గదిలో మొన్నటి వరకు తన కలీగ్ రమాకాంత్‍తో కలిసి ఉండేవాడు. రమాకాంత్ బెంగుళూర్‌కి మారిపోవడంతో రెండ్రోజుల క్రితమే తన రూంలోకి కొత్తగా ఛోజో వచ్చి చేరాడు.

అతను తనని పరిచయం చేసుకుంటూ తన పేరు ఛోజో అని చెప్పినపుడే సందీప్ అడిగాడు. “అదేం పేరు? చాలా కొత్తగా ఉందే. చూడటానికి మన ప్రాంతం వాడిలానే కన్పిస్తున్నావు. కొంపదీసి ఏదైనా ఆఫ్రికన్ ట్రైబ్‌కి చెందినవాడివా ఏంటి” అంటూ నవ్వాడు.

ఛోజో కూడా నవ్వి “నా అసలు పేరు కిరణ్. ఛోజో అనేది నేను పెట్టుకున్న పేరు. నాకిష్టమైన పేరు” అన్నాడు.

“ఛోజో అంటే అర్థమేంటి?”

“నాకూ తెలియదు. మెట్రాయిడ్ అనే సైన్స్ ఫిక్షన్ వీడియో గేమ్‌లో ఛోజోస్ అనే హూమనాయిడ్స్ ఉంటాయి. అవి చాలా తెలివిగల, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించే సామర్థ్యం గల పక్షిలాంటి హ్యూమనాయిడ్స్, ఆ పేరు బాగుందనిపించి పెట్టుకున్నాను.”

మొదటి పరిచయంలోనే ఛోజోకి గెలాక్సీలన్నా, ఏలియన్స్ అన్నా, వీడియో గేమ్స్ అన్నా చాలా ఆసక్తి అనే విషయం సందీప్‌కి అర్థమైంది.

ఆ రోజు ఆదివారం కావడంతో మధ్యాహ్నం మెస్‌లో భోం చేశాక యిద్దరూ బాల్కనీలో కూచుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు సంభాషణ ఏలియన్స్ వైపుకు మళ్ళింది.

“ఏలియన్స్ లేరని నువ్వెందుకనుకుంటున్నావు? ఏలియన్స్ నిజంగానే ఉన్నారు” అన్నాడు ఛోజో.

“ఉండొచ్చనో ఉండే అవకాశం ఉందనో అనకుండా ఉన్నారని అంత ఖచ్చితంగా చెప్తున్నావేంటి? నువ్వేదో చూసినట్టు” అంటూ నవ్వాడు సందీప్.

“చూశాను కాబట్టే చెప్తున్నాను.”

“జోక్ చేయకు.”

“జోక్ కాదు. నిజం. నేను ఏలియన్‌తో కలిసి ఓ గంట గడిపాను. మాట్లాడాను కూడా.”

“మరీ క్యాబేజీలు చెవుల్లో పెట్టేస్తే ఎలా ఛోజో.. కొద్దిగా ఐనా నమ్మేలా ఉండొద్దూ.. నిజంగానే ఏలియన్‌తో ఎన్‌కౌంటర్ జరిగుంటే పేపర్లనిండా ఆ వార్త వచ్చి ఉండేది. న్యూస్ ఛానెళ్ళనిండా నీ ఇంటర్వ్యూలు వచ్చి ఉండేవి. నువ్వో సెలబ్రిటీ ఐపోయేవాడివి.”

“నాకు సెలబ్రిటీ కావాలని లేదు. ఐనా నేను చూశానని చెప్పినా ఎవ్వరూ నమ్మరని నాకు తెలుసు. నేను నిజంగానే ఓ ఏలియన్ని కలిశానని నిరూపించుకునే సాక్ష్యాలేవీ నా దగ్గర లేవు.”

సందీప్ అతని మొహంలోకి పరిశీలనగా చూశాడు. అందులో జోక్ చేస్తున్న లక్షణాలేవీ కన్పించక పోవడంతో “నిజంగానే చూశావా?” అన్నాడు.

“నిజంగానే చూశాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేం ఉంది? చెప్పాగా.. సెన్సేషనల్ న్యూస్ చెప్పి సెలబ్రిటీ కావాలన్న ఉద్దేశం నాకే కోశానా లేదు. నమ్మితే నమ్ము లేకపోతే లేదు” అన్నాడు ఛోజో.

“సరే. ఆ ఏలియన్ ఎలా ఉన్నాడో చెప్పు. ఈటీ సినిమాలో చూపించినట్టు సన్నటి పుల్లలాంటి మెడ, సుత్తితో నెత్తిమీద కొట్టి చదును చేసినట్టు తల, పెద్ద కళ్ళు, చప్పిడి ముక్కు కోతినోరులాంటి నోరు.. ఇలానే ఉన్నాడా లేకపోతే కోయీ మిల్ గయా సినిమాలోలా నీలిరంగులో, ఉబ్బిన పెదవుల్తో, డొప్ప చెవుల్తో, నెత్తి మీద పాము పడగలాంటి గుర్తులో ఉన్నాడా?”

“లేదు. అచ్చం మనలానే ఉన్నాడు. మనిషిలానే.”

“ఔనా? మరి ఏలియన్ అని ఎలా తెల్సుకున్నావు?”

“తనో ఏలియన్ అని అతనే చెప్పాడు. నేను నీలానే నమ్మలేదు. జోక్ అనుకున్నాను. మా ఏలియన్స్‌కి ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోయే శక్తి ఉంటుందని నీకు తెలుసా అన్నాడు. తెలియదన్నాను. ఐతే చూడు నా రూపాన్ని మార్చుకుంటున్నాను అంటూనే పెద్దపులిలా మారిపోయాడు.”

“ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు నువ్వేం చేశావు?”

“ఎవరైనా ఏం చేస్తారో నేనూ అదే చేశాను. భయంతో అక్కడినుంచి పారిపోయాను.”

సందీప్ కొన్ని క్షణాలు సందిగ్ధంలో పడ్డాడు. అతను చెప్పింది కథా లేక నిజమా? నమ్మాలా వద్దా అని ఆలోచించాడు. ఏలియన్స్ వింత రూపాల్లో ఉంటాయని సినిమాల్లో చూశాడు తప్ప అవి మనిషి రూపంలో కూడా ఉంటాయని, అవసరమైతే కుక్కగానో పిల్లిగానో పులిగానో రూపు మార్చుకోగలవని ఎప్పుడూ వినలేదు.

“మనిషి రూపంలో ఎందుకున్నావని అడిగావా?” అన్నాడు సందీప్.

“అడిగాను. తనలానే కొన్ని వేల ఏలియన్స్ మనిషి రూపంలో మనుషుల్తో కలిసి తిరుగుతున్నాయని చెప్పాడు. మనుష్య జాతిని సమూలంగా నాశనం చేయడమే వాళ్ళ లక్ష్యమని చెప్పాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని కూడా చెప్పాడు. అప్పటినుంచే నాలో ఎన్ని అనుమానాలో.. మన హాస్టల్లో ఉన్న వాళ్ళలో కూడా ఏలియన్స్ ఉండొచ్చన్న అనుమానం. అంతెందుకు.. నువ్వు కూడా ఏలియనేనేమో.. ఏమో.. నిజమేమిటో ఎలా తెలుస్తుంది చెప్పు. నువ్వు కూడా నీ రూపాన్ని నా కళ్ళెదురుగా మార్చుకుంటే తప్ప” అన్నా డు ఛోజో.

“అలా ఐతే నువ్వు కూడా మనిషి రూపంలో ఉన్న ఏలియన్ కావొచ్చుగా. నిన్నెలా నమ్మడం?” అన్నాడు సందీప్.

“నిజమే. ఎవ్వరూ ఎవర్నీ నమ్మలేని రోజులు. కాని నేను మామూలు మనిషినే. ఏలియన్ని కాదు. నన్ను నమ్ము” అన్నాడు ఛోజో.

***

సందీప్ తన ఆఫీస్ లోని మిత్రులతో ఛోజో చెప్పిన విషయాన్ని పంచుకున్నాడు. ‘నమ్మలేం’ అని కొం తమంది అన్నారు. ‘మన నమ్మకాలతో నిజాలకు సంబంధం లేదు. సృష్టిలో మనం నమ్మలేని నిజాలు ఎన్నున్నాయో.. ఇది కూడా వాటిలో ఒకటి ఎందుకు కాకూడదు? మాకెందుకో ఇది నిజమనే అన్పిస్తోంది’ అని మరికొంతమంది అన్నారు. వాళ్ళలో నమ్మినవాళ్ళతో పాటు నమ్మని వాళ్ళు కూడా ఆ విషయాన్ని తమ తమ మిత్ర బృందాలతో పంచుకున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే అది దావానలంలా నగరమంతా పాకిపోయింది. అక్కడినుంచి మరికొన్ని నగరాలకు… వార్తాపత్రికల్లో మొదటి పేజీలో ఆ వార్త చోటు చేసుకోడానికి ఎక్కువ సమయం పట్టలేదు. న్యూస్ ఛానెళ్ళలో దాని గురించి వార్తలతో పాటు మేధావులతో చర్చలు కూడా మొదలయ్యాయి.

ఏలియన్స్ మనుషుల రూపంలో తిరుగుతున్నారన్న వార్త నిజమైతే, వాళ్ళ వల్ల ఎటువంటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కోడానికి ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. ఎటొచ్చీ మనుషుల్లానే కన్పించే ఏలియన్స్‌ని ఎలా గుర్తించాలో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ప్రభుత్వంలోని ఇంటెలిజన్స్ విభాగం కూడా తల పట్టుకుని కూచుంది. ఏలియన్స్‌కి సంబంధించిన ప్రత్యేక లక్షణమేదైనా తెలిస్తే తప్ప వాళ్ళని గుర్తించడం కష్టమని రక్షణాధికార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఏలియన్స్‌కి సంబంధించిన వార్త ప్రపంచంలోని కొన్ని కోట్ల మందికి చేరే క్రమంలో దాని మూలం ఏమిటో ఎప్పుడో సమాధికాబడింది. ఎవరో ఓ వ్యక్తి ఏలియన్‌ని చూశాడట అని చెప్పుకుంటున్నారు తప్ప ఆ వ్యక్తి ఎవరో ఎవ్వరికీ తెలియడం లేదు.

ప్రజలందరూ భయాందోళనలకు గురవుతున్నారు. పక్కవాళ్ళని అనుమానంతో చూడటం సర్వసాధారణమైపోయింది.

ఓ రోజు సందీప్ ఛోజోతో “ఏలియన్‌ని చూసింది నువ్వేనని ప్రభుత్వానికి చెప్పొచ్చు కదా” అన్నాడు.

“నీకు ముందే చెప్పానుగా. నాకు పబ్లిసిటీ ఇష్టముండదని” అన్నాడు ఛోజో.

“ఇది నీ పబ్లిసిటీకి సంబంధించిన విషయం కాదు. దేశభద్రతకు సంబంధించిన విషయం. ప్రజల్లో నెలకొన్న భయాల్ని పారదోలేందుకు సహకరించే విషయం.”

“అసలు నేను చెప్పిన విషయాన్ని నువ్వెందుకు పదిమందికీ చెప్పావో అర్థం కావడం లేదు. ఈ పరిస్థితికి కారణం నువ్వే. తప్పందా నీదే”

“మన మధ్యనే మనల్ని అంతం చేయడానికి కుట్ర పన్నిన ఏలియన్స్ తిరుగుతున్నారనే విషయాన్ని దాస్తేనే తప్పవుతుంది. నేను చేసింది తప్పు కాదు. నువ్వు మీడియా ముందుకో ప్రభుత్వాధికారుల సమక్షానికో రాకుండా దాక్కుంటున్నావు చూడు.. అదీ తప్పు. నేనో నిర్ణయానికొచ్చాను. నీ గురించి నేనే మీడియాకు చెప్పేస్తాను” కోపంగా అన్నాడు సందీప్.

“ఏలియన్‌ని చూసింది నేనేనని అందరికీ వెళ్ళడించడం వల్ల ఒనగూడే ప్రయోజనమేమిటో నాకర్థం కావడం లేదు. అలా చేయడం వల్ల ప్రజల్లో ఉన్న భయాలు తొలగిపోతాయా? శత్రువులు పట్టుబడ్తారా? ఎలానో చెప్పు?”

“ఏలియన్స్‌ని గుర్తుపట్టడానికి అవసరమైన సమాచారం నువ్వు ఇవ్వొచ్చుగా”

“అటువంటి సమాచారమే నా దగ్గర ఉంటే ఇన్ని రోజులు నోరు మెదలకుండా కూచోను. నీకే కాదు నాకూ దేశభక్తి ఉంది. కానీ నా దగ్గర అటువంటి సమాచారమేదీ లేదే. నీకా రోజే చెప్పానుగా. ఏలియన్స్ అచ్చం మనలానే ఉన్నారని. వాళ్ళనెలా గుర్తుపట్టాలో నాకే తెలియకపోతే ప్రభుత్వానికేం చెప్పగలను?”

“ఆ ఏలియన్ తన రూపు మార్చుకుని పులిలా మారిన విషయం…”

అతని మాట పూర్తి కాకముందే ఛోజో పెద్దగా నవ్వాడు. “చాలా అమాయకంగా మాట్లాడుతున్నావు సందీప్. మనతో పాటు తిరుగుతూ మనలో ఒకడిగా మెసిలే ఏలియన్ మనం చూస్తూ ఉండగా రూపమెందుకు మార్చుకుంటాడు? అలా చేస్తే పట్టుబడిపోడా? ఏలియన్స్‌ని బుద్దిహీనులనుకుంటున్నావా? మనందరి కన్నా వంద రెట్లు తెలివిగలవాళ్ళు.”

సందీప్‌కి ఛోజో మాటల్లో నిజాయతీ కన్పించింది. నిజమే కదా. ఏలియన్స్‌ని పట్టిచ్చే క్లూ ఏదీ అతని దగ్గర లేనపుడు ఏలియన్‌ని చూసింది తనే అని మీడియా ముందుకు రావడం వల్ల కలిగే లాభం ఏమీ లేదనిపించింది.

ఆ రాత్రి సందీప్‍కి సరిగ్గా నిద్రపట్టలేదు. ఏలియన్స్ మనిషి రూపంలో తిరుగుతున్నా తప్పకుండా వాటి ప్రవర్తనలోనో మాటతీరులోనో శరీరభంగిమల్లోనో ఏదో తేడా ఉండే ఉంటుంది. అదేమిటో తెలిస్తే ఏలియన్స్‌ని సులభంగా ఏరివేయవచ్చు. అతనికెందుకో ఛోజో కొన్ని విషయాలు దాస్తున్నాడనిపించింది. ఏలియన్‌తో గంటసేపు కలిసి తిరిగాడు కదా. దాన్ని అతి సమీపంగా చూసిన వ్యక్తి కాబట్టి వాటిని మనషులనుంచి వేరు చేసే ప్రత్యేక లక్షణాల్ని తప్పకుండా గమనించి ఉంటాడు. మరెందుకు చెప్పడం లేదు? రేపుదయం ఎలాగైనా ఛోజోని నిలదీయాలనుకున్నాడు. పోలీసులు ఇంటరాగేట్ చేసినట్టు రకరకాల ప్రశ్నల్తో విసిగిస్తే కొంతైనా సమాచారం లభిస్తుందన్న ఆశ.. ఇలా ఆలోచిస్తూనే అర్ధరాత్రి దాటిన గంటన్నర తర్వాత నిద్రలోకి జారుకున్నాడు.

ఉదయం ఎనిమిదింటికి మెలకువ వచ్చింది. పక్కకు తిరిగి చూశాడు. ఛోజో ఇంకా నిద్ర లేవలేదు. దుప్పటి నిండుగా కప్పుకుని పడుకుని ఉన్నాడు.

“ఛోజో… లే. టైం ఎంతయిందో తెలుసా.. ఎనిమిది దాటింది” గొంతు పెంచి అన్నాడు.

ఛోజో లేవలేదు. మరో రెండు సార్లు పిలిచి, అతను లేవకపోయేసరికి అతని మంచం దగ్గరకెళ్ళి తట్టి లేపాడు. చలనం లేదు. మొహం పైనుంచి దుప్పటి తీసి, భుజం పట్టుకుని కుదిపాడు. వెంటనే షాక్ తగిలినట్లు చేతిని వెనక్కి లాక్కున్నాడు. ఛోజో భుజం మంచు ముద్దలా చల్లగా ఉంది. అనుమానం తీరక ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. శ్వాస ఆడటం లేదు..

ఛోజో చనిపోయాడన్న విషయం సందీప్‌కి మింగుడు పడటం లేదు. అదెలా సంభవం? నిన్న రాత్రి వరకు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్న పాతికేళ్ళ కుర్రాడు ఉదయం లేచి చూసేసరికల్లా విగతజీవిగా ఎలా మారిపోయాడు? జవాబులు దొరకని ప్రశ్నలతో అతనికి పిచ్చెక్కినట్టయింది.

హాస్టల్ యజమానికి కబురందిచాడు. హాస్టల్ యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు.

ఛోజో ఆకస్మిక మరణానికి కారణమేమై ఉంటుందో పోలీసులకు అంతుబట్టలేదు. శరీరం మీద గాయాలేమీ లేవు. మెడ మీద కమిలిన గుర్తులు కూడా లేవు. విషప్రయోగంతో హత్య జరిగి ఉండొచ్చన్న అనుమానం మీద సందీప్‌ని అరెస్ట్ చేసి, ఇంటరాగేషన్ కోసం స్టేషన్‌కి తీసుకెళ్ళారు.

“నా రూమ్మేట్‌ని నేనెందుకు చంపుతాను? నేను చంపలేదు. అతనే చచ్చిపోయాడు. నన్ను నమ్మండి” అప్పటికి సందీప్ అలా చెప్పడం అది పదోసారి.

“ఏదైనా ప్రేమ వ్యవహారమా? ట్రయాంగ్యులర్ లవ్. అడ్డు తొలగించుకోడానికి అతన్ని చంపేశావా? నీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించకముందే నిజం చెప్పు” పోలీసాఫీసర్ బెదిరించాడు.

“అసలు నాకు లవ్ ఎఫైరే లేదు.”

“ఛోజోకి ఉందా?”

“తెలియదు”

“మేము హాస్టల్లో ఉన్న సీసీ కెమెరాల ఫూటేజ్‌ని పరిశీలించాం. రాత్రి పన్నెండు దాటాక బైటివాళ్ళెవరూ హాస్టల్లోకి ప్రవేశించలేదు. మీ గది తలుపులు లోపలినుంచి గడియ పెట్టి ఉన్నాయి. అంటే మీ గదిలోకి ఎవ్వరూ రాలేదు. అతన్ని చంపే అవకాశం నీకే ఉంది. నిజం చెప్పు.. ఏ విషం ప్రయోగించావు? ఎందులో కలిపి తినిపించావు?”

“నేను చంపలేదు మొర్రో అంటే వినరెందుకు? ఎవర్ని చంపడానికైనా ఓ మోటివ్ ఉండాలిగా. నాకేం మోటివ్ ఉందో చెప్పండి?”

“అది చెప్పాల్సింది నువ్వు. ఎవరూ చంపకుండానే ఆరోగ్యంగా ఉన్న పాతికేళ్ళ యువకుడు అకారణంగా చచ్చిపోయాడంటే ఎవరైనా నమ్ముతారనుకుంటున్నావా?” పోలీస్ గద్దిస్తూ అడిగాడు.

“హార్ట్ ఎటాక్‌తో సడన్‌గా చనిపోవచ్చుకదా సార్. ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా యంగ్‌స్టర్స్‌కి కూడా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయిగా”

“పోస్ట్ మార్టం రిపోర్ట్ రానీ. నీ బండారమంతా బైటపడ్తుందిగా. అప్పుడు చూపిస్తాను పోలీస్ దెబ్బలెలా ఉంటాయో” లాఠీ ఝుళిపిస్తూ అన్నాడు పోలీస్.

***

ఛోజో బాడీని పోస్ట్ మార్టం చేస్తున్న డాక్టర్‌కి గుండె ఆగినంత పనైంది. అతని శరీరంలోపల గుండె కన్పించలేదు. పైకి మనిషిలా కన్పిస్తున్నా లోపలి అవయవాలన్నీ చాలా భిన్నంగా, వింతగా ఉన్నాయి. గుండె లేకుండా రక్త ప్రసరణ ఎలా జరిగి ఉంటుందో అతనికి అర్థం కాలేదు. మెదడు పరిమాణం మామూలుగా ఉండాల్సిన దానికన్నా రెండింతలుంది. ఎంత శోధించినా అతని చావుకి కారణమేమిటో బోధ పడలేదు. తన ఎదురుగా అటాప్సీ టేబుల్ మీదున్న శవం ఏలియన్‌దని అతనికర్థమైంది. వెంటనే అతను ఏలియన్ శరీరంలోని లోపలి భాగాల్ని వీడియోలో చిత్రీకరించాడు. తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, తను గమనించిన వింత విషయాలన్నిటిని పూసగుచ్చినట్టు చెప్పాడు.

సందీప్‌ని పోలీసులు వదిలేశారు. మనిషి రూపంలో తిరుగుతున్న ఏలియన్స్‌ని గుర్తు పట్టాలంటే వాళ్ళ శరీరాన్ని చీల్చి గుండె ఉందో లేదో గమనించడం ఒక్కటే మార్గమని ప్రజలకు అర్థమైంది. తీరా చీల్చాక లోపల గుండె ఉంటే అది హత్యానేరమై మెడకు చుట్టుకుంటుందన్న భయం కూడా వేసింది. ఏలియన్స్‌ని గుర్తించే ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో ప్రభుత్వం సందీప్ సాయాన్ని కోరింది. అప్పటికింకా సందీప్ తను ఆర్నెల్లుగా ఓ ఏలియన్‌తో కలిసి ఒకే గదిలో ఉన్నాడన్న షాక్ నుంచి పూర్తిగా కోలుకోలేదు.

“దాదాపు ఆరునెలలుగా మీరు ఓ ఏలియన్‌తో కలిసున్నారుగా. అతని ప్రవర్తనలో అసాధారణమైనదేదైనా గమనించారా? మీకతనిలో అసహజంగా ఏమైనా కన్పించిందా?” అని అడిగాడో ప్రభుత్వాధికారి.

సందీప్ ఎంత ఆలోచించినా అటువంటిదేదీ గుర్తుకు రావచడం లేదు. ఛోజో ఏలియన్ అన్న అనుమానమే ఎప్పుడూ రాలేదు. మనుషులకు భిన్నంగా అతనెప్పుడూ ప్రవర్తించలేదు. అదే చెప్పాడు సందీప్.

“బాగా ఆలోచించుకుని చెప్పండి. మీ సమాధానం మీదే దేశ భద్రత, మానవాళి శ్రేయస్సు ఆధారపడి ఉన్నాయి” అన్నాడతను.

సందీప్ తీవ్రంగా ఆలోచించాడు. భోజోతో కలిసి గడిపిన సమయాన్ని మరోసారి తన మనోఫలకం మీద ప్రొజెక్ట్ చేసుకుంటూ నిశితంగా పరిశీలించాడు. నడకలో చిన్న తేడా.. జాగ్రత్తగా గమనిస్తే గాని తెలియనంత స్వల్పమైన తేడా.. అతను కొన్ని పదాల్ని ఉచ్చరించేటపుడు అదో మాదిరిగా పలికేవాడు. పరాయి భాష మాట్లాడే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి తెలుగు నేర్చుకుని మాట్లాడేటప్పుడు ఎలా పలుకుతారో అలా.. కొన్ని ప్రత్యేకమైన పదాలే అలా పలుకుతాడు. అందుకే తనకప్పుడు అనుమానం రాలేదు. ఈ రెండు విషయాలు ప్రభుత్వాధికారులకు చెప్పాడు.

ఏలియన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వార్తాపత్రికల్లో న్యూస్ చానెళ్ళలో ప్రభుత్వం ప్రకటనలివ్వసాగింది. సందీప్ చెప్పిన లక్షణాలున్న వ్యక్తుల్ని గమనించి, అధికార్ల దృష్టికి తేవల్సిందిగా కోరింది. దాంతోపాటు ఏలియన్స్ అని నిర్ధారణ చేసుకున్నాక వాళ్ళని చంపడం నేరం కాదని తెలిపే కొత్త చట్టాన్ని రూపొందించింది.

మనుషుల్లో భయాల్తోపాటు అనుమానాలు కూడా విపరీతంగా పెరగసాగాయి. ఏ మనిషిని చూసినా అతను ఏలియన్ ఏమోనన్న అనుమానం.. సందీప్‌తో ఆరు నెలలు ఏలియన్ కలిసి ఉన్నట్టే తమతో కలిసుంటున్న వ్యక్తులో ఎంతమంది ఏలియన్స్ ఉన్నారోనన్న భయం.. వాళ్ళని గుర్తుపట్టడానికి సందీప్ చెప్పిన

రెండు లక్షణాలు కూడా అస్పష్టంగా ఉండటంతో, అనుమానం మీద ఒకర్ని ఒకరు చంపుకోసాగారు. రొమ్ముని చీల్చి గుండె ఉందో లేదోనని వెతకడం సాధారణమైపోయింది. మెల్లమెల్లగా అటువంటి చర్యలు వూపందుకున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న హత్యల్ని ఎలా నియంత్రించాలో తెలియక ప్రభుత్వం తల పట్టుకుంది. ప్రజలు ఎవ్వరిమాటా వినే పరిస్థితిలో లేరు. ఏలియన్స్‌ని మట్టుపెట్టాలనే ఉద్దేశంతో మనుషుల్ని మట్టు పెట్టసాగారు.

***

మిల్కీవే గెలాక్సీలో భూమి నుంచి నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ గ్రహంలోని రహస్య మందిరంలో ఏలియన్ల సమావేశం జరుగుతోంది. ప్రభుత్వాధినేతతో పాటు రక్షణ శాఖకు చెందిన అత్యున్నత అధికార్లు పాల్గొంటున్న సమావేశం అది.

“నేను చెప్పినట్లే జరుగుతోంది చూశారా.. భూ గ్రహంలో ఉన్న మానవాళినంతా నాశనం చేసి, దాన్ని ఆక్రమించుకోడానికి యుద్ధం ప్రకటిద్దామన్నారు. దానివల్ల మనకూ కొంత నష్టం వాటిల్లి ఉండేది. ఇప్పుడు కేవలం ఒక్క ఛోజోనే కోల్పోయాం. మనుషులు చూశారా రోజుకి ఎన్ని వేలమంది ఒకర్నొకరు చంపుకుంటున్నారో.. మానవాళిని నాశనం చేయాలంటే అణ్వాయుధాలో, భయంకరమైన రసాయనిక ఆయుధాలో అవసరం లేదు. ఓ అనుమానాన్ని వాళ్ళ మెదడు కుదుళ్ళలో బలంగా నాటితే చాలు. అది వటవృక్షమై విస్తరిస్తుంది. అనుమానాన్ని మించిన మారణాయుధం ఉంటుందా ఎక్కడైనా?” ప్రభుత్వాధినేతతో రక్షణ శాఖ ఛీఫ్ అన్నాడు. అలా అంటున్న సమయంలో అతని పెదవుల మీద గర్వంతో కూడిన దరహాసం మెరిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here