అభయం

0
7

క్లుప్తంగా కధ:

శంకరయ్య, అభయంకరయ్య మిత్రులు. శంకరయ్య రిటైరయిన తర్వాత సమాజానికి వుపయోగపడే పనేమన్నా చెయ్యాలని తపన పడతాడు. ఆలోచించి తను తేలిగ్గా చెయ్యగలిగ పని.. ఈవ్ టీజింగ్ నుంచి కాలనీ పిల్లల అవస్థ కొంతయినా తప్పించాలని సాయంకాలం స్కూళ్ళు, కాలేజ్‌లు వదిలే సమయంలో బస్ స్టాప్‌లో కూర్చుంటాడు మిత్రునితో సహా. ఒకసారి కాలేజీకి వెళ్ళి వచ్చే లక్ష్మి ఒక పోకిరీతో పడే ఇబ్బంది చూసి దానిని పరిష్కరిస్తారు.

పాత్రలు:

శంకరయ్య:    రిటైర్డ్ ఉద్యోగి. తనకి చేతయిన సహాయం సమాజానికి చెయ్యాలనే తాపత్రయం.

అభయంకరయ్య:   శంకరయ్య మిత్రుడు

లక్ష్మి:  కాలేజ్ స్టూడెంట్

కృష్ణ:   ఈవ్ టీజర్

***

అది సిటీలోని ఒక కాలనీలో బస్ స్టాప్. బస్ స్టాప్ వెనకే ఒక షాపు గట్టు మీద కూర్చుంటారు శంకరయ్య, అభయంకరయ్య.

శంక:

ఒరేయ్ .. భయంకరయ్యా

అభ:

ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు నా పేరు సరిగ్గా పలకమని. మా అమ్మ ఎంతో ముద్దుగా అభయంకర్ అని పెడితే దాన్ని నువ్వు భయంకరయ్యా చేస్తావా.. వుండు నీ పని చెబుతా!

శంక:

చెబుతూనే వున్నావులేరా ఇన్నేళ్ళనుంచీ. నలభై ఏళ్ళనుంచీ కలిసి మెలిసి తిరుగుతున్నాం. ఇన్నేళ్ళూ చెప్పనిది ఇప్పుడేం చెబుతావులే.. అయినా ఏదో ప్రాణ స్నేహితుడవని ముద్దుగా పిల్చుకుంటాను… నిన్ను కొంచెం వుడికిద్దామని. సరేలే అభయంకరూ.. ఒక విషయం గమనించావా?

అభ:

ఏమిటి మన నిఘా ఇక్కడ మొదలు పెట్టి ఇవాళ్టికి సరిగ్గా నెల రోజులయిందనా. అయినా రోజూ ఇలా బస్ స్టాపుల్లో కాపలా కాయటమేమిట్రా. రిటయిరయినంత మాత్రాన రోడ్డున పడాలా? హాయిగా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చెయ్యక. ఏం తక్కువని మనకి?

శంక:

మనకేం తక్కువ లేదులేరా. ఇంతకాలం మంచి జీవితాలే గడిపాం. మంచి వుద్యోగాలనుంచి హాయిగా రిటైరయ్యాము. ఇప్పటిదాకా మన బతుకుల గురించి మనం ఆలోచించుకున్నాం. సరే. ఇప్పుడన్నా వేరే వాళ్ళ గురించి ఆలోచిద్దాంరా. మనుష్యులుగా పుట్టినందుకు కొంచెమయినా సమాజ సేవ చేద్దామోయ్.

అభ:

ఏంటి. బస్ స్టాప్‌లో కూర్చుని సమాజాన్ని వుధ్ధరించేద్దామంటావ్. నవ్విపోతారోయ్ నలుగురూ.

శంక:

మనమేం సమాజాన్ని వుధ్ధరించటానికే మేమిక్కడ కూర్చున్నామన్న బోర్డు పెట్టుకోలేదుగా. వాళ్ళకేం తెలుసు. ఏదో కాలక్షేపానికి కూర్చున్నామనుకుంటారు.

అభ:

నాకూ అలాగే అనిపిస్తోంది. నెల రోజులనుంచీ రోజూ రావటం, గంటా రెండు గంటలు ఇక్కడ కూర్చుని వెళ్ళటం తప్పితే చేసిందేమైనా వుందా?

శంక:

ఒరేయ్ భయంకరూ..

ఆభ:

అదో మళ్ళీ

శంక:

అదేలేరా అభయంకరూ…నీ పేరు సార్థకం చేసుకోవాలికదా నువ్వు. ఎవరో ఒకరికన్నా అభయమివ్వద్దూ.

అభ:

ఏమిటి ఇలా బస్ స్టాప్‌లో కూర్చునా?

శంక:

ఈ మధ్య ఈవ్ టీజింగ్ పెరిగి పోయిందిరా. పనీ పాటాలేని మగ పిల్లలు ప్రేమిస్తున్నానంటూ చదువుకునే ఆడపిల్లల వెనక పడి నానా గోలా చెయ్యటం, వాళ్ళు కాదంటే వాళ్ళమీద యాసిడ్ పొయ్యటం, ఏదో విధంగా చంపెయ్యటం. కాలక్షేపం కాక కొంతా, వయసు మహత్యం కొంతా, చదువూ సంధ్యలు సరిగ్గా లేక కొంతా ఈ ఈవ్ టీజింగ్ కేసులెక్కువయిపోతున్నాయిరా.

అభ:

చెప్పొచ్చావులే. మన చిన్నప్పుడు మనం చెయ్యలా ఈవ్ టీజింగ్.. ఆ రెండు జళ్ళ సుందరి వెనక నువ్వెంతకాలం తిరగలేదూ.. ఆ అమ్మాయి ఎక్కడికెళ్తే అక్కడికి.

శంక:

ఆ సంగతి నాకూ, నీకూ ఆ అమ్మాయికీ తప్పితే ఎవరికైనా తెలుసా. ఆ అమ్మాయికూడా ఎక్కడికన్నా వెళ్తే నేను వెనకే వెళ్ళేవాడినని, బాడీగార్డ్ వున్నాడని చాలా ధైర్యంగా వెళ్ళేది. కొంత గర్వంగా కూడా ఫీల్ అయ్యేదికదా. వయసులో అదొక సరదాగానే సాగిందిగానీ మేమెప్పుడన్నా మాట్లాడుకున్నామా. ఆ అమ్మాయిని ఏ విధంగానన్నా అల్లరి పెట్టానా. ఇప్పుడు తలుచుకున్నా సరదాగా నవ్వుకోవటమేగానీ ఏ విధమైన ఇబ్బందులూ లేవు. అలా వుండాలిరా ఆటపట్టించటమంటే.

అభ:

సర్లే..నీ కధ నాకు తెలిసిందేకదా. మళ్ళీ చక్రాలేసుకోకు.. ఇంతకీ ఏమంటావు?

శంక:

అదే అలాంటి ఆకతాయి కుర్రాళ్ళనుంచి మన కాలనీ పిల్లలకి రక్షణ కల్పించాలనే కదరా నేననేది. ఈ మధ్య ఆడపిల్లలకి చదువూ, కెరీర్ మీద ధ్యాస ఎక్కువైంది. అవ్వన్నీ అయ్యాకే పెళ్ళనుకుంటున్నారు. ఈ ఇంటర్లూ, డిగ్రీలు చదివిన మగపిల్లలు సరైన వుద్యోగం రాక, వచ్చిన చిన్న చిన్న వుద్యోగాలు చెయ్యక ఆకతాయిలుగా తయారవుతున్నారు.

అభ:

ఈ సినిమాలు కూడా సగం చెడగొడుతున్నాయిరా. కూలీ పని చేసుకునేవాళ్ళుకూడా కోటీశ్వరుల కూతుర్ని ప్రేమించటమే. అసలు అలా ఎలా జరుగుతుందిరా?

శంక:

వీళ్ళు కోటీశ్వరుల కూతుళ్ళా కాదా అని కూడా చూడటం లేదుకదా. అమ్మాయి కనబడితే చాలు కాసేపు ఆడుకోవటానికి.

అభ:

అంటే..ఆడవాళ్ళంత ఆట బొమ్మలయ్యారా? వాళ్ళు మనుష్యులు కాదా!? వాళ్ళకి మనసుండదా!!? ఏమిట్రా ఆడపిల్లలున్న నువ్వే ఇలా మాట్లాడుతున్నావ్?

శంక:

అదే కదరా నా బాధ. ఆడవాళ్ళని నేనెలా చూస్తానో నీకూ తెలుసుగానీ, అసలు విషయానికొద్దాం. మనమిక్కడ కూర్చోవటం ఉపయోగపడుతోందనుకుంటాను. గమనించావా?

అభ:

ఆ..నేనెప్పుడో గమనించాను. నువ్వే గమనించావా లేదా అని అడగబోతున్నా.. నువ్వే అడిగేశావు.

శంక:

ఏమట్రా అది… నేను చెప్పకుండానే నువ్వు గమనించింది?

అభ:

అదేరా..ఆ సూరిబాబు కూతురు లక్ష్మి లేదూ…పది రోజుల క్రితందాకా కాలేజ్‌కి హుషారుగా వెళ్ళొచ్చేది. ప్రపంచంలో ఎవరినీ లెక్కచెయ్యనట్లుండేది. ఇప్పుడు ఏమిటో కుదేలయిపోయినట్లు బెరుకు బెరుగ్గా చుట్టుపక్కల ఎవరున్నారో కూడా చూసుకోకుండా తల భూమిలోకి పెట్టేసి మరీ పారిపోయినట్లు వెళ్తోంది ఇంటికి. ఏమయి వుంటుందంటావ్?

శంక:

ఏమయ్యేదేమిటి. మనకి కాలక్షేపం దొరికి వుంటుంది.

అభ:

అవునంటావా?

శంక:

మరే. అవుననే అంటాను.. చూస్తూ వుండు.

(అప్పుడే అక్కడ ఆగిన బస్ లోంచి ఒక కాలేజ్ స్టూడెంట్ దిగి నడక ప్రారంభిస్తుంది. నడకలో భయం. ఆ అమ్మాయి వెనకే ఇంకో యువకుడు దిగుతాడు. పోకిరీ లక్షణాలు)

శంక:

మన అనుమానం నిజమేరోయ్…వెనకే చూడు.

(వెనక దిగిన అబ్బాయి లక్ష్మితో మాట్లాడాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. వాళ్ళిద్దర్నీ వున్న చోటనే నడిపిస్తూ కొంత రేగింగ్ చూపించవచ్చు. తర్వాత అబ్బాయీ, అమ్మాయీ చెరో వైపూ వెళ్ళిపోతారు)

తర్వాత నేపథ్యలో…. ఆ యువకుడు కొద్ది రోజులుగా లక్ష్మిని ఇబ్బంది పెట్టటం శంకరయ్య, అభయంకరయ్య సహించలేక పోయారు. వాళ్ళ ప్లాను వాళ్ళు వేసుకున్నారు… ఆ రోజు..

(లక్ష్మి బస్ దిగింది. వెనకాలే ఆ యువకుడు. ఎప్పటిలాగే మాట్లాడించాలని ప్రయత్నించటం, తాకటానికి ప్రయత్నించటం చేస్తాడు. లక్ష్మి భయపడదు.)

లక్ష్మి:

ఇంతకీ ఏమిటి మీరనేది…నన్ను అంత గాఢంగా ప్రేమిస్తున్నారా?

యువకుడు:

అవును. చాలా బోలెడు. నీ కోసం ఏమి చెయ్యమన్నా చేస్తాను. ఐస్ క్రీం తినిపించనా… సినిమాకి తీసుకెళ్ళనా?

లక్ష్మి:

ప్రేమంటే ఐస్ క్రీం తినటం, సినిమాకి వెళ్ళటమేనా?

యువ:

పోనీ ఏం చెయ్యాలో చెప్పు?

లక్ష్మి:

ప్రేమంటే మనసుల కలయిక. బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు.

యువ:

అబ్బో, అవ్వన్నీ కూడా వుంటాయిలే.. ముందు మనుష్యులు కలిస్తే కదా అవ్వన్నీ పెరిగేది.

లక్ష్మి:

నాకిప్పుడు పెళ్ళి చేసుకోవాలని లేదు. నేనింకా బాగా చదవాలి. మంచి పొజిషన్‌లో వుండాలి. అప్పుడు పెళ్ళి సంగతి ఆలోచిస్తాను.

యువ:

పెళ్ళికి తొందరేం లేదు. తర్వాతే చేసుకోవచ్చు. ఈ లోపల రోజూ సరదాగా కొంచెం సేపు గడుపుతూంటే బాగుంటుందికదా.

లక్ష్మి:

సరదాగా గడపటమా..అంటే?

యువ:

అంటే పార్కులకీ, సినిమాలకీ వెళ్ళటం, పబ్బులకెళ్ళి ఎంజాయ్ చెయ్యటం

లక్ష్మి:

వీటన్నింటితో నా చదువు పాడవుతుంది. పోనీ, అంతగా ప్రేమిస్తున్నారుగనుక పెళ్ళి చేసుకుని, తర్వాత కూడా నన్ను చదివిస్తారా?

యువ:

పెళ్ళి… చదువు (గొణుక్కుంటాడు) ఇప్పుడేగా నువ్వన్నావు షికార్లు తిరిగితే చదువు పాడవుతుందని. మరి పెళ్ళి చేసుకుంటే పాడవదా? అందుకే కొంతకాలం ఫ్రెండ్స్ గానే వుండి తర్వాత పెళ్ళి సంగతి ఆలోచిద్దాం. ఏమంటావ్?

లక్ష్మి:

నాకేమి తోచటం లేదు. అయినా నా గురించి నిర్ణయాలు తీసుకోవటానికి మావాళ్ళున్నారు. (చుట్టూ చూసి శంకరయ్యని పిలుస్తుంది). తాతయ్యా, ఒకసారి ఇలా వస్తారా.

శంక:

వస్తున్నా. (అంటూ లేచి వస్తాడు. వెనకే అభయంకర్) (వాళ్ళు రావటం చూసి యువకుడు పారిపోబోయినట్లు వెనక్కి తగ్గుతాడు. మళ్ళీ బింకంగా వున్న చోటుకే వచ్చి నుంచుంటాడు వాళ్ళని చూస్తూ. ముఖంలో కంగారు, దాన్ని అణచిపెట్టుకునే ప్రయత్నం)

శంక:

ఏమిటమ్మా…ఈ అబ్బాయి గురించేనా నువ్వు చెప్పింది? (యువకుణ్ణి పరీక్షగా చూస్తాడు) కుర్రాడికేం భేషుగ్గా వున్నాడు. ఏమయ్యా.. నీ పేరేంటన్నావు?

యువ:

సురే…కాదు కృష్ణండీ (పేరు మార్చి తప్పు చెబుతున్నట్లు తెలియాలి)

శంక:

ఏరా అభయంకరూ…పిల్లాడు బాగా లేడూ?..మన లచ్చమ్మకి తగినట్లున్నాడు కదా

అభ:

అవున్రోయ్.. ప్రొసీడ్

శంక:

ఇంతకీ ఏంటయ్యా…మా లక్ష్మిని ఇష్టపడుతున్నావా…బంగారు తల్లిలే..దానికేం తక్కువ!

యువ:

ఆ..అహ..అబ్బే..(తడబడతాడు) ఇంతకీ మీరెవరు? (మళ్ళీ ధైర్యం తెచ్చుకుని అడుగుతాడు)

శంక:

మేమా..నేనేమో .. ఇదిగో ఈ బంగారు తల్లి తాతయ్యని… వీడు నా స్నేహితుడు అభయంకర్.

(శంకరయ్య లక్ష్మి తాతయ్యనని చెప్పేసరికి కృష్ణకి ఇంకా గాబరా ఎక్కువవుతుంది. వీళ్ళని తప్పించుకుని వెళ్ళాలని చూస్తుంటాడు)

శంక:

నీ పేరేమిటన్నావ్?.. ఆ..కృష్ణ కదూ..చూడు కృష్ణా..ఇక్కడే నుంచోబెట్టి మాట్లాడుతున్నాననుకోకు. మా అబ్బాయి చండశాసనుడులే. నీ సంగతి తెలుస్తే నిన్ను చంపి జైల్లో కూర్చుంటాడు. అంత మొండోడు. మా మనవరాలికేమో చదువు తప్పితే ఇంకో ధ్యాస లేదు. పోతే.. నిన్ను చూస్తే మా అమ్మాయంటే ముచ్చట పడుతున్నావు. రంగూ, రూపూ బాగుంది. ఇంక గుణగణాల సంగతంటావా.. ఆడి పాడే వయసులో అందరూ అల్లరి చేసేవాళ్ళేనయ్యా. బాధ్యతలు పెరిగితే కుదురు దానంతటదే వచ్చి కూర్చుంటుంది. రాలేదనుకో.. మాలాంటి వాళ్ళం ఎటూ వున్నాము (తన్నటానికి రెడీ అయినట్లు చెయ్యి చూపిస్తూ)… అహ .. మీకు అండదండలు గానయ్యా!

అభ:

మన సంగతి సరేగానీ .. అసలు అబ్బాయి వివరాలు కనుక్కో. బాబూ…మీ నాన్నగారి పేరేంటి?

కృష్ణ:

సుందర … అదేనండీ సుదర్శనమండీ. (తప్పు పేరు చెప్పినట్లు తెలియాలి)

అభ:

ఏం చేస్తూ వుంటారు?

కృష్ణ:

బిజి…అవునండీ…బడి పంతులండీ

అభ:

నీకు మేనరికంలాంటిదేమన్నా వున్నదా?

కృష్ణ:

అంటేనండి?

అభ:

మామయ్య కూతురుందా..ఆ అమ్మాయితో నీ పెళ్ళి చేద్దామనే వుద్దేశం మీ వాళ్ళకుందా?

కృష్ణ:

వున్నదండీ. వాళ్ళకీ ఇళ్ళూ, పొలాలూ, చాలా ఆస్తులున్నాయండీ. ఆస్తిలో ఆస్తి కలుపుకోవాలని మావాళ్ళ ఆలోచనండీ.

శంక:

మరి నీకిష్టం లేదా మేనరికం చేసుకోవటానికి?

కృష్ణ:

ఇష్టమున్నా లేకపోయినా తప్పదు కదండీ! ఆస్తి వేరే వాళ్ళకి వెళ్ళకూడదు కదండీ!!

శంక:

అంటే.. ఆస్తి కోసం మేనరికం.. మేనరికం చేసుకోవటానికి సిధ్ధమయ్యీ మా మనవరాలి వెనక పడుతున్నావా? అంటే పెళ్ళికోసం మేనకోడలూ, ప్రేమ కోసం మా అమ్మాయి!

కృష్ణ:

(నసుగుతాడు)

అభ:

నువ్వేం చదువుకున్నావ్? ఉద్యోగమేమన్నా చేస్తున్నావా?

కృష్ణ:

(ఇట్లా ఇరుక్కుపోయానేమిట్రా బాబూ అన్నట్లుంటాడు) ఇంటరు చదివానండీ. ఉద్యోగమేం చెయ్యను. ఆస్తులు చూసుకోవద్దూ.

శంక:

మరి మా లక్ష్మి ఇంజనీరింగ్ చదువుతోంది కదా. ఇంకా చదవాలని తనకి చాలా ఆశ.

కృష్ణ:

తనిష్టం తనది. చదువుకోమనండి.

శంక:

అంటే.. పెళ్ళి చేసుకున్నా తర్వాత నువ్వు చదివిస్తావా?

కృష్ణ:

నేనలా అన్నానా… లేదండీ.. ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దు. తను కావాల్సినంత చదువుకున్నాకే దాని సంగతి ఆలోచించవచ్చు.

అభ:

చదువయిన తర్వాత కూడా సందిగ్ధమే … ఆలోచించవచ్చు..ట!

శంక:

మరి అప్పటిదాకా… ఇలా నువ్వు ఆ పిల్ల వెనకాల తిరుగుతావా?

కృష్ణ:

ఊ…ఉహూ.

అభ:

మరేం చేస్తావు పోనీ మీ ఇంట్లో చెబుతావా ఈ విషయం?

కృష్ణ:

అమ్మో .. చంపేస్తారు!!

లక్ష్మి:

ఇలాంటి వేషాలు వెయ్యచ్చుగానీ, ఇంట్లో చెబితే చంపేస్తారని భయం. మరి మా వెనకాల పడి మా బతుకులెందుకురా నాశనం చేస్తారు? మేమేం నేరం చేశాం? మీ వంక చూశామా?..మీతో మాట్లాడామా?..మిమ్మల్ని రెచ్చగొట్టామా? .. మరి మాకెందుకు ఈ నరకం? ఆడ పిల్లలంటే అంత తేలిగ్గా వున్నార్రా?.. ..రాస్కెల్

శంక:

ఉండమ్మా..మేము మాట్లాడుతున్నాం కదా. ఇంతకీ ఏమంటావబ్బాయ్?…ఇంట్లో చెప్పవు. మరి మా లక్ష్మి అంటే ఇష్టమంటావు. ఏం చేస్తావు ఈ ఇష్టాన్ని?

కృష్ణ:

గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానండీ!

అభ:

అంతేగానీ, మీ ఇంటికి తీసుకెళ్ళనంటావ్!

కృష్ణ:

ఇంటికి తీసుకెళ్ళటం అంత తేలిక కాదండీ. కుదరదు. మా అమ్మా నాన్నా, మా అత్తా మామా మా మరదలు, ఎవరూ ఒప్పుకోరు.

లక్ష్మి:

అది తెలిసీ నా వెనక ఎందుకు పడ్డావ్? నేనంత తేలిగ్గా కనిపిస్తున్నానా? మా అమ్మా నాన్నలకి పరువూ ప్రతిష్టలు లేవనుకుంటున్నావా? వెధవా.

కృష్ణ:

మాటలు తిన్నగా రానీయ్

శంక:

ఏమిటిరా తిన్నగా రానిచ్చేది? నువ్వు చేసిన పని తిన్నగా వుందా? ఆడపిల్ల కనబడగానే ప్రేమా దోమా గుర్తొస్తాయిగానీ పెద్దలకి చెప్పి పెళ్ళి చేసుకోవాలనే సంగతి తెలియదా. నిజంగా ప్రేమించినవాళ్ళెవరూ ఇలా వెంట పడి వేధించుకు తినరు. నీలాంటి పైలా పచ్చీసు లోఫర్ గాళ్ళు తప్ప. (జేబులోంచి ఫోన్ తీస్తూ) మీ నాన్న ఫోన్ నెంబరు చెప్పు.. ఒకసారి వచ్చి కొడుకు వైభోగం చూడమంటాను.

కృష్ణ:

మా నాన్న ఫోన్ నెంబరా…అదెందుకు ఇప్పుడు…(గాబరాగా) అయినా మా నాన్న దగ్గర ఫోన్ లేదు.

శంక:

మీ నాన్న బిజినెస్‌మేన్ అన్నావు కదా? మరి ఫోన్ లేకుండానే బిజినెస్ చేస్తున్నాడా?

అభ:

(కృష్ణ ఆ అని సమాధానం ఇస్తాడు) అదేంటి..వాళ్ళ నాన్న బడి పంతులన్నాడుకదా?

శంక:

అదేలే బిజినెస్ బడి పంతులు. ఆ తడబాటు మనం చూడలేదూ!? వీడు చెప్పినవన్నీ అబధ్ధాలే. వీడి పేరుతో సహా. ఆ మాత్రం కనుక్కోలేమనుకున్నాడు..పిల్ల కాకి.

అభ:

ఒకటి మాత్రం నిజం చెప్పాడులే .. కుటుంబం గురించి.

శంక:

సరే … ఇప్పుడు వీడినేం చేద్దాం?

లక్ష్మి:

ఈ మధ్య షీ టీమ్‌లు పెట్టారు కదా తాతయ్యా. వాళ్ళకప్పచెబ్దాము.

శంక:

అమ్మో..మా మనవరాలికి ధైర్యం పెరిగిందే!

అభ:

ఇదంతా నువ్విచ్చిన ట్రైనింగే కదరా. రెండు రోజులనుంచీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో పాఠాలు నూరి పోస్తున్నావు కదా.

లక్ష్మి:

అవును తాతయ్యా. మీరిచ్చిన ట్రైనింగూ, మీ అండదండలే నాకీ ధైర్యాన్నిచ్చాయి. లేకపోతే నేనూ నా కుటుంబం ఏమయిపోయేవాళ్ళమో తలుచుకుంటేనే భయం వేస్తోంది.

శంక:

సరే షీ టీమ్‌కి ఫోన్ చేస్తా (ఫోన్ చెయ్యబోతాడు)

కృష్ణ:

(శంకరయ్య కాళ్ళు పట్టుకుని) సారీ అంకుల్ .. షీ టీమ్‌కి ఫోన్ చెయ్యద్దు. సారీ సారీ.

శంక:

అయితే మా లక్ష్మిని పెళ్ళి చేసుకుంటావా?

కృష్ణ:

సారీ అంకుల్…నా సంగతి చెప్పాను కదా. ఇంకెప్పుడూ ఇలాంటి బుధ్ధి తక్కువ పనులు చెయ్యను.

(లక్ష్మి తన పీడా విరగడయిపోయిందని పక పకా నవ్వుతుంది)

అభ:

నీలాంటి వాళ్ళని వూరికే వదిలేస్తే ఎలాగయ్యా. ఈ రోజు లక్ష్మి.. రేపు ఇంకో రష్మి…. ఎవరయితే ఏంటి మీకు. అమాయకంగా వుండే ఆడపిల్లలయితే చాలు..మీ ఆటలు సాగటానికి..వీళ్ళని నమ్మేదేంటి..షీ టీమ్‌కి ఫోన్ చెయ్యరా.

కృష్ణ:

వద్దండీ..ప్లీజ్. ఈ అమ్మాయి వెనకే కాదు..ఈ జన్మలో ఇంకే అమ్మాయి వెనకా పడను. అల్లరి పెట్టను. సారీ మేడమ్. మీ వాళ్ళకి చెప్పండి….ప్లీజ్.

శంక:

సరే .. ఈ సారికి వదిలేస్తున్నాము. మళ్ళీ ఎప్పుడన్నా ఇలాంటి పరిస్ధితుల్లో నిన్ను చూశామో.. షీ టీమ్ దాకా అక్కర్లేదు .. (అభయంకర్ నీ తననీ చూపించుకుంటూ) మా టీమే చాలు. ఫో.. మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనబడ్డావా….

కృష్ణ:

(బ్రతుకు జీవుడా అనుకున్నట్లు పారిపోయినట్లే వెళ్ళిపోతాడు)

లక్ష్మి:

(సంతోషంగా) చాలా ధాంక్స్ తాతయ్యలూ. మీ రుణం తీర్చుకోలేను. రెండు రోజుల క్రితం మీరు నన్ను పిలిచి వివరాలన్నీ అడుగుతూంటే చాలా చికాకు పడ్డాను. మీరేం ఆర్చేవారా తీర్చేవారా ఈ గోలంతా మీకెందుకని. కానీ నిజంగా మీరే నన్ను ఈ గోలనుంచి కాపాడారు. నా తప్పేమీ లేకపోయినా వీడి గోల చూసి, చూసిన వాళ్ళేమనుకుంటారో, ఇంట్లో తెలిస్తే ఏమవుతుందోనని భయపడి పోయాను. ఇంత సునాయాసంగా ఈ బాధ తప్పించారు. చాలా చాలా ధాంక్స్.

అభ:

నాకూ సంతోషంగా వుందమ్మా ఇవాళ. మా వాడు నెల రోజులనుంచీ రోడ్ సైడ్ రోమియోలనుంచీ ఆడపిల్లలను కాపాడాలని నన్నిక్కడ కూర్చోబెడుతూంటే విసుక్కున్నాను. కానీ వీడు చాలా మంచి పని చేశాడని ఇప్పుడు తెలిసింది. ఇంకనుంచీ రోజూ ఖాళీ వున్నప్పుడల్లా ఇక్కడే వుంటాము మీలాంటి వాళ్ళ కోసం.

శంక:

ఇప్పుడు తెలిసిందా నేనేం చెప్పానో. మనమే కాదు. (బస్ స్టాప్‌లో జరుగుతున్న గోల కనుక అప్పటికే నలుగురైదుగురు అక్కడ చోద్యం చూడటానికి గుమి కూడినట్లు చూపించవచ్చు. వాళ్ళతో, ప్రేక్షకులతో చెబుతున్నట్లు) ప్రతి కాలనీలోనూ పెద్దవాళ్ళు కాస్త పిల్లలని ఓ కంట కనిపెడుతూంటే ఆడపిల్లలకి రక్షణ వుంటుంది.

అభ:

అంటే మగ పిల్లలు ఎవరు ఆడ పిల్లలతో మాట్లాడుతున్నా మనమక్కడికి చేరిపోవాలా?

శంక:

అదేం కాదులేవోయ్. స్నేహానికీ, పోకిరీ వేషాలకి తేడా తెలియనంత అమాయకుడివేమీ కాదు నువ్వు. అవసరమైన చోటనే ప్రత్యక్షమవ్వు.

అభ:

అటులనే మిత్రమా…(అభయమిస్తున్నట్లు పోజు పెడతాడు)

(శంకరయ్య నవ్వుతాడు. లక్ష్మి నవ్వుతూ వాళ్లకి మరోసారి ధాంక్స్ చెబుతూ వెళ్తుండగా తెర).

  • ఈ నాటికని ప్రదర్శించదలచినవారు రచయిత్రిని 9866001629లో సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here