అభిప్రాయ భేదం…

0
7

[dropcap]నే[/dropcap]ను నామాటే సత్యమన్నాను
నీవు కాదన్నావు… అది తప్పన్నావు
వాదించావూ … విబేధించావు
ఛా అన్నావూ … ఛీఛీ అన్నావు
నేనేం తక్కువ తిన్నానా
ఛీపో అన్నానూ … పోపో అన్నాను
షటప్ అని నీవంటే … గెటౌట్ అని నేనన్నాను.

అభిప్రాయ భేదం… అభిప్రాయ భేదం

మన మధ్య
మాటలు మూగబోయాయి
నవ్వుల పూవులు వాడిపోయాయి

వెక్కిరింతలూ వంకరపెదాలూ
కస్సుబుస్సులూ రుసరుసలూ
రాజ్యమేలాయి
చూపులు చురచుర చూసుకుంటుంటే
విముఖతతో వీపులు అభిముఖమయ్యాయి

నీ ఉనికి నాకూ… నా ప్రసక్తి నీకూ
సహించరానివయ్యాయి
నిశ్శబ్దం అంతటా నిండిపోయింది
కాలం అక్కడెక్కడో ఆగిపోయింది

అభిప్రాయ భేదం…అభిప్రాయ భేదం

మౌనం అణువణువునా నిండినవేళ
మనసు మస్తిష్కాన్ని మేల్కొలిపింది… మాట్లాడింది

ఏమోయ్…
నీవు నీవే… నేను నేనే
నీవూ నేను మనం కాకముందు
నీలోకం నీకుంది… నా ప్రపంచం నాకుంది
నీ ఆలోచనలూ నీ భావాలూ
నీలో మొలకెత్తి పెరిగి మానులయ్యాయి
నా వివేచనలూ నా సిద్ధాంతాలూ
నాలో లోతుగా వేళ్ళూనుకపోయాయి
మన అభిప్రాయాలు కలువనూవచ్చు
కలువకపోనూ వచ్చు…
అభిప్రాయభేదాలు రానూవచ్చు.

అంతమాత్రాన మనమధ్య
ఈ సమరం అవసరమా
నిన్ను నేను వ్యధ పరుస్తూ
నన్ను నీవు వేదనకు గురిచేస్తూ
మనం అనే భావాన్నీ బలిచేస్తున్నామూ…
అనుబంధాన్ని వధిస్తున్నాము

తలుపుకు ఇటువైపు నేనున్నాను
నీవు తలుపు తీస్తావేమోనని చూస్తూ
అటువైపు నీవూ ఉంటావని తెలుసు
తలుపెప్పుడు తట్టబడుతుందానని ఎదురుచూస్తూ

సెల్ ఫోను ఒళ్ళోబెట్టుకొని కూర్చున్నాను
నీనుండి “కాల్” ఎప్పుడొస్తుందా అని
అటువైపు నీవూ అలాగే ఉన్నావని తెలుసు
నేనెప్పుడు నీకు “రింగ్” ఇస్తానో అని వేచి చూస్తూ

“ఈగో”ల గోలతో
నేనెందుకు తగ్గాలనే బింకాలమధ్య
కాలం వృథా అయిపోతోంది…
రోజు రోజుకీ
మనమధ్య దూరం పెరిగిపోతోంది..

అందుకే
నేనే అంటున్నా ముందుగా “సారీ”
క్షమించమని అంటున్నా మరోసారి

మనమధ్య ఈ గొడవలో
అభిప్రాయభేదపు ఆకతాయి ఆటలో

నీకు “సారీ” చెప్పి నేనోడిపోదలిచాను
నిన్ను గెలిపించాలనేకాదు…
నాపై గెలిచిన నిన్ను
గెలుచుకోవాలనే కోరికతోనూ….

ఏమోయ్….
క్షమించవా!!
ప్లీజ్… క్షమించవా!!!

(“అతడు” సినిమాలోని ” తలుపుకు….. ఎదురుచూస్తూ”
వాక్యాలను వాడుకున్నందుకు త్రివిక్రమ్ గారికి క్షమార్పణలతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here