అచ్చిబాబు పెళ్ళి

0
2

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి సింహాద్రి నాగ శిరీష పంపిన హాస్య కథ “అచ్చిబాబు పెళ్ళి” సావిత్రి లాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకున్న అచ్చిబాబు పరిస్థితి ఏమయిందో వివరిస్తున్నారు రచయిత్రి. [/box]

[dropcap]ఆ[/dropcap]వేళ అచ్చిబాబు చాలా విషాదంలో మునిగిపోయి ఉన్నాడు. నిర్వేదంతో నీరసించిపోయి ఉన్నాడు. పిచ్చిపట్టినవాడిలా జుట్టు పీక్కుంటున్నాడు. ఆర్ట్ ఫిల్మ్ హీరోలా అకాశంలోకి చూస్తూ అదే పనిగా నిట్టూర్పులు విడుస్తున్నాడు. రాత్రి నుండి ఇదే పరిస్థితి. ఇదంతా చూస్తున్న అచ్చిబాబు తల్లికి, చెల్లికి చెప్పలేనంత భయం పట్టుకుంది. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. అదృష్టలక్ష్మి పిచ్చిలక్ష్మి రూపంలో తమ ఇంట్లో కుడికాలు మోపబోతోందని సంతోషించేలోపే ఇంతపెద్ద ఉపద్రవం ముంచుకొస్తుందని ఊహించలేదు. అసలు అచ్చిబాబుకు వచ్చిన కష్టం ఏంటో తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్ళితీరవలసిందే.

తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అచ్చిబాబూ ఇది అచ్చిబాబు కుటుంబం. అన్న పెళ్ళి చేసుకొని ముంబైలో స్థిరపడ్డాడు. పెళ్ళయింది మొదలు నెలకొకసారి ఫోను, సంవత్సరానికొకసారి కలవటం. ఈ ఫాస్టుయుగం పుణ్యమా అని ‘హలో బాగున్నావా’ అంటే ‘బాగున్నావా అనేటటువంటి పలకరింపులు మాత్రమే మిగిలాయి. తండ్రి మరణం తర్వాత తల్లిని, చెల్లిని చూడాల్సిన బాధ్యత అచ్చిబాబుపై పడింది. ఎప్పుడూ తల్లి కొంగుపట్టుకు చంటిపిల్లాడిలా తిరిగే అచ్చిబాబు, ఇంత బాధ్యత ఒక్కసారిగా నెత్తిపైకి ఎత్తుకోగలనా అని చాలా భయపడిపోయాడు. లోపల భయపడుతున్నా, పైకిమాత్రం లేని గాంభీర్యం తెచ్చుకొని తండ్రి ఉద్యోగంలో చేరాడు. అచ్చిబాబు చెల్లి తన కాళ్ళపై తాను నిలబడాలని, చదువు పూర్తయీ అవగానే చక్కటి ఉద్యోగం సంపాదించుకుంది. కూతురి పెళ్ళి ఘనంగా చెయ్యాలని అచ్చిబాబు తండ్రి ఎన్నో కలలు కనేవాడు. కానీ ఆ శుభకార్యం చూడకుండానే స్వర్గస్థులు కావటంతో ఇంటిల్లిపాదిలోనూ ఏదో నైరాశ్యం చుట్టుముట్టింది. అచ్చిబాబు మాత్రం మంచి సంబంధం చూసి ఎలాగైనా చెల్లెలి పెళ్ళిచేయాలని, తండ్రి కల నిజం చేయాలని గట్టిపట్టుదల చూపినా, అతని చెల్లి మాత్రం ససేమిరా అని మొరాయించింది.

‘సరే…. ఎలాగూ చెల్లికి పెద్ద వయసేం ముదరలేదు. మరో రెండుమూడేళ్ళు ఆగవచ్చులే. నా భయమంతా నీగురించేరా అచ్చీ… వయస్సు ముప్పై దాటినా నాకొంగు వదిలిపెట్టవు. పెళ్ళి చేసుకుంటేనైనా నీ ధోరణిలో మార్పువస్తుందేమోనని నా ఆశ. ఇప్పటికే ముదురు బెండకాయలా తయారైపోయావు. ముందు నీపెళ్ళి చూడాలనుందిరా’ అంటూ కంటతడిపెట్టుకుంది తల్లి. అమె మాట కాదనలేక అప్పటికి ‘సరే’ అన్నాడు. కానీ మనసులో మాత్రం తను కావాలనుకునే అందం,గుణగణాలు గల పిల్ల దొరుకుతుందా అని ఆలోచనలో పడ్డాడు అచ్చిబాబు.

అప్పుడు అచ్చిబాబు వయస్సు 16. తండ్రిగారి పుణ్యమా అని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసే మంచి అలవాటు అలవడింది. కాలేజీలో స్నేహితులతో ఎంత చెత్త సినిమాలు చూడటానికి తిరిగినా, ఇంటికొచ్చాక మాత్రం తండ్రిగారితో కలిసి తీరిక సమయాల్లో పాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు చూస్తుండేవాడు. మల్లీశ్వరి, బాటసారి – అచ్చిబాబు ఎక్కువగా ఇష్టపడే సినిమాలు. ఎన్నిసార్లు చూశాడో లెక్కలేదు. డైలాగులతో సహా బట్టీపట్టాడు. భానుమతి అంటే ఇక చెప్పనక్కరలేదు. అంతటి అందగత్తె గానీ, అంత గొప్పనటిగానీ, బహుముఖ ప్రజ్ఞాశాలికానీ ఈ భూప్రపంచంలోనే లేరని అచ్చిబాబు అభిప్రాయం. ఒకసారి ఏదో పరధ్యానంగా ఛానల్స్ తిప్పుతున్న అతడి దృష్టి ఓ పాత సినిమాపై పడింది. ఆ సినిమా టైటిల్ దేవత. సావిత్రి, ఎన్టీఆర్ నాయికానాయకులు. ఆత్రంగా చూడటం మొదలుపెట్టాడు. “ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి, ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి..’ పాట వస్తోంది. అచ్చిబాబులో ఏదో కదలిక. ఆహా! భార్య అంటే ఇలా ఉండాలి. సావిత్రి ఈ పాటలో ఎంత ఒదిగిపోయింది. అందానికి అందం. గుణానికి గుణం. తను జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ‘ఆలయాన వెలసిన……” పాటలో సావిత్రిలాంటి అమ్మాయినే చేసుకోవాలనుకున్నాడు. అన్న పెళ్ళి జరుగుతున్నంతసేపూ….. తనే ఇంటికి పెద్దకొడుకులా ఎందుకు పుట్టలేదా అని ఏ వందసార్లో తనను తాను తిట్టుకొని ఉంటాడు. ఆ ఛాన్స్ అన్నయ్య కొట్టేసినా… ‘ఆలయాన వెలసిన..’ పాటలో సావిత్రిలాంటి మహాఇల్లాలిని మాత్రం తన కుటుంబానికి తానే ఇవ్వాలని గట్టిగా తీర్మానించుకున్నాడు. ఇప్పుడిక పెళ్ళిప్రస్తావన రాగానే కొంచెం తొట్రుపాటుకు గురయ్యాడు. ఎందుకంటే అచ్చిబాబు తన 16వ యేట నుంచి ఎదురు పడిన ప్రతి అమ్మాయిలో ‘ఆలయాన వెలసిన…’ పాటలో సావిత్రిని వెతుకుతూనే ఉన్నాడు. భంగపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు అచ్చిబాబుకు 34 ఏళ్ళు. ఇన్నేళ్ళ నుంచి వెతికినా కనబడని తన కలలరాణి కనబడుతుందా? అసలు ఆమె పుట్టిందో, లేదో? ఒకవేళ పుట్టినా ఆమెను ఎలా కలవటం? ఏదేమైనా పెళ్ళంటూ చేసుకుంటే సావిత్రిలాంటి అమ్మాయినే చేసుకోవాలని ప్రతిజ్ఞ పూనాడు. అనుకున్నదే తడవుగా చుట్టుపక్కల అన్ని మ్యారేజిబ్యూరోలలో అతని వివరాలన్నీ నమోదై పోయాయి.

కొంతకాలం ఎడాపెడా సంబంధాలు వస్తూనే ఉన్నాయి. కానీ తన ‘అలయాన వెలసిన…’ సావిత్రి మాత్రం దొరకలేదు. ఒకసారి ఇలాగే మ్యారేజిబ్యూరో వాళ్ళు సరిగ్గా తాను కోరిన లక్షణాలున్న సంబంధమని చెప్తే, ఆశగావెళ్ళిన అచ్చిబాబుకు అక్కడ కూడా నిరాశే మిగిలింది. ఆ అమ్మాయి అచ్చు సావిత్రిలానే ఉంది. కానీ ‘దేవత’ సినిమాలో సావిత్రిలా కాదు. ‘నాదీ ఆడజన్మే సినిమాలో సావిత్రిలా కారుమేఘంలా ఉంది పిల్ల. తను కోరుకున్న సావిత్రి పోలికలైతే ఉన్నాయి. అమ్మాయి చాలా మెతకగా కూడా కనిపిస్తోంది. పెద్దల పట్ల గౌరవం, భక్తిప్రపత్తులు కూడా మెండుగానే కనిపించాయి. పోనీ సర్దుకుపోదామా అని కాస్త మెత్తబడ్డాడు కానీ… చూస్తూ చూస్తూ మరీ యింత నల్లటిపిల్లనా అని మూలిగింది అతని మనసు. దాంతో ఆ సంబంధానికి కూడా ఎర్రజెండానే చూపించాడు. ఇలా వచ్చిన ప్రతి సంబంధానికీ ఏదో ఒక వంక పెట్టటం అచ్చిబాబుకు అలవాటైపోయింది. అమ్మాయి బొద్దుగా లేదనో, ఉమ్మడికుటుంబంలో అమ్మాయి కాదనో, లేదంటే చాలా ఫాస్టుగా ఉందనో పెదవి విరిచేవాడు. ఇంకోసారి సాక్షాత్తూ సంగీతసరస్వతినే ఎదురుగా నిలబెడితే… ఆ అమ్మాయి కచేరీలు పూర్తిగా మానేయాలని, అచ్చు సినిమాలో లాగా…. కేవలం తన కోసమే పాడాలని షరతుపెట్టాడు. నీకో దండం, ఈ పెళ్లికో దండం అంటూ ఈసారి పెళ్ళికూతురే ఎదురుదండం పెట్టేసింది.

‘ఇలాగైతే కష్టంరా బాబూ! నీతోపాటు నీ చెల్లెల్ని కూడా ముదరబెట్టేస్తున్నావు. నీకిదేమైనా న్యాయమా?’ అంటూ ఆక్రోశం వెళ్ళగక్కింది అచ్చిబాబు తల్లి.

ఆరునూరైనా… నూరురైనా…. నా ఆలయాన వెలసిన… సావిత్రి లాంటి పిల్లనే చేసుకుంటా. ఆమె కోసం ఎన్ని జన్మలైనా ఎదురుచూస్తా. దొరికిందా సరి. లేదంటారా…… జీవితాంతం ఘోటక బ్రహ్మచారిగానే మిగిలిపోతా. తల్లి సేవకే ఈ జీవితం అంకితంచేస్తా. ఇక చెల్లి విషయం అంటారా.. ముందు చెల్లి పెళ్ళిచేసేస్తే పోలా..’ అన్నాడు అచ్చిబాబు పెద్ద పరిష్కారం సూచించినట్లు ఫోజుపెడుతూ…..

ఆ మాటలు విన్న అచ్చిబాబు చెల్లి “ఏం…. నీవొక్కడివే గొప్ప త్యాగశీలిని అనుకుంటున్నావా? నిన్ను ఒక్కడినే బ్రహ్మచారిలా వదిలేసి.. తల్లిసేవ కూడా నీకే వదిలేసి.. నాస్వార్థం నేను చూసుకుపోయేదానిలా కనిపిస్తున్నానా. నీ పెళ్ళి తర్వాతే నా పెళ్ళి” అంటూ అంతెత్తున లేచింది.

అన్నాచెల్లెళ్ల ధోరణికి, ‘ఇదెక్కడి మాతృభక్తిరా బాబూ ‘అని విస్తుపోయి చూడటం తల్లి వంతైంది.

ఇలాగైతే లాభంలేదని, సరాసరి మ్యారేజిబ్యూరోకి వెళ్ళి, తానే అమ్మాయిల ఫొటోలను పరిశీలించటం మొదలుపెట్టాడు అచ్చిబాబు. అలా చూస్తున్న అతని దృష్టి ఓ ఫొటోలోని అమ్మాయిపై పడింది. “అరే! సాక్షాత్తూ నేను కోరుకున్నట్లుగా ఉంది అమ్మాయి” అనుకున్నాడు. అమె వివరాలు ఆరా తీయటం మొదలుపెట్టాడు. ఇక్కడ కూడా అచ్చిబాబుకు ఎదురుదెబ్బే తగిలింది. విషయం ఏమిటంటే అచ్చిబాబు వివరాలు ఆ అమ్మాయికి పంపటం, ఆ అమ్మాయి కాదు పొమ్మనటం కూడా జరిగిపోయింది. అది తెలుసుకున్న అచ్చిబాబుకు రోషం పొడుచుకొచ్చింది.

‘ఏం… నాలో ఏం లోపముందట’ అన్నాడు వెటకారంగా.

‘ఆ అమ్మాయి కూడా ఎన్.టి.ఆర్ లాంటి అబ్బాయి కోసమే వెతుకుతోందట. మీరు కూడా అలాగే ఉన్నారట. కాకపోతే ఆమెకు కావలసింది సీనియర్ ఎన్.టి.ఆర్ కాదట. జూనియర్ ఎన్.టి.ఆర్ అట. నలభై యేళ్ళ ముసలాడికి, పైగా పైన అరెకరం ఖాళీగా కన్పిస్తున్న వాడి కోసం కాదని కచ్చితంగా చెప్పింది’ అంటూ చావుకబురు చల్లగా చెప్పాడు మ్యారేజ్ బ్రోకర్.

అప్పటికి కానీ మన అచ్చిబాబుకు బల్బు వెలగలేదు. తన వయసు అక్షరాలా నలభై. వాడిపోయిన ముఖంతో ఇంటికెళ్ళి అద్దంలో తలదూర్చాడు. కొట్టొచ్చినట్టు కనబడుతున్న తెల్లవెంట్రుకలు ఓవైపు, కుర్చీలు, బెంచీలతో నిండుగా ఉన్నా, మనిషే కాదు… కనీసం ఈగలు, దోమలు కూడా లేక మూసేసిన పాత స్టేడియంలా… బోసిగా కనిపించీ కనిపించనట్లు ఉన్న బట్టతల అచ్చిబాబును వెక్కిరించసాగాయి. తనలో తానే తెగమదనపడిపోయాడు అచ్చిబాబు. తనకు ఇక పెళ్ళే కాదేమో??? అందరు ఆడపిల్లలూ ఇలాగే వెక్కిరిస్తారేమో???? అవేశంలో బ్రహ్మచారిగా ఉండిపోతానని తల్లితో చెప్పిన మాటలకు, పైన తథాస్తు దేవతలు తథాస్తు అనేశారేమో??? అయ్యబాబోయ్! ఇలాంటి ఆలోచనలే ఇంతగా భయపెడ్తే, మరి వాస్తవం ఇంకెంత భయంకరంగా ఉంటుందో??? తోటి స్నేహితులంతా పెళ్ళిళ్ళు అయిపోయి చక్కగా పిల్లాపాపలతో కాపురాలు చేసుకుంటున్నారు. ఏ ఫంక్షన్‌కు అటెండయినా, అన్నీ జంటలే. తాను మాత్రం లింగులింగుమంటూ వెళ్లిరావలసివస్తోంది. అందుకే కదా! కావాలనే ఎక్కడికీ వెళ్ళకుండా, ఇల్లు-ఆఫీసుకే పరిమితమైంది. మ్యారేజ్ బ్యూరో వారు కూడా చేతులెత్తేయడంతో గజగజా వణికిపోయాడు అచ్చిబాబు.

తాను పెళ్ళిచేసుకుంటే కానీ చెల్లెలు పెళ్ళిచేసుకోదు. తానేమో సావిత్రి లాంటి అమ్మాయిని తప్ప చేసుకోడు. అలాంటి అమ్మాయి జన్మలో దొరకదని తేలిపోయింది. అందుకే అచ్చిబాబు గుండె రాయి చేసుకొని… ‘తనకు కాబోయే భార్య సావిత్రిలా లేకున్నా, కనీసం సూర్యకాంతంలా ఉన్నా ఫర్వాలేదు… కాదు కాదు అసలు పిల్ల దొరికితే చాలు. అపై భగవదేచ్ఛ’ అని అభిప్రాయాన్ని కూడా సడలించుకున్నాడు. అచ్చిబాబులో ఈ మార్పుకు అతని తల్లి, చెల్లి పెళ్ళే జరిగిపోయినంతగా సంబరపడిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here