ACT 1978 ఉద్యోగిస్వామ్యం, లంచగొండితనంతో సామాన్యుడి యుద్ధం

1
9

[dropcap]ఈ[/dropcap] వారం మిత్రుడు ప్రవీన్ సూరపనేని శిఫారసు మీద ఒక కన్నడ చిత్రం “ఏక్ట్ 1978” చూశాను. ఇప్పటికీ రెలవెన్స్ వున్న చిత్రం కాబట్టి రావాల్సిన చిత్రమే.
ఒక గర్భవతి స్త్రీ గీత, ఒక పెద్దాయనా కలిసి ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తారు. ఆ వెళ్ళడం ఎన్నో సారో లెక్క లేదు. ఆమె పని మాత్రం కాదు. తండ్రి ప్రమాదం లో మరణించినందువల్ల ఆమెకు ప్రభుత్వం ఒక అమలులో వున్న పథకం కింద కొంత సొమ్ము మంజూరు చేసింది. ఆ డబ్బు తీసుకోవడానికి ఆమె నానా కష్టాలు పడుతుంది. ఒక కారణం, లంచం ఇవ్వను అని ఆమె పట్టుబట్టడం. అక్కడి ఉద్యోగి అంటాడు కూడా 25% వదులుకుంటే వెంటనే ఆమె డబ్బు ఆమెకు అందుతుందనీ. ఆమె మాత్రం న్యాయంగానే పనులు జరగాలనుకుంటుంది.
ఈ సారి ఆమె ప్రభుత్వ కార్యాలయం లోకి వెళ్ళి ఎప్పటిలానే తన సమస్య చెప్పుకుని సహాయం చేయమని వేడుకుంటుంది. పనులు జరగక పోగా ఆమె మాటలు పడాల్సి వస్తుంది. ఆమె అక్కడి నుంచి కదలకపోవడంతో ఒక ఉద్యోగి ఆమె చేతిలో వున్న మొబైల్ తో షూట్ చేస్తున్నట్టు గ్రహించి అందరికీ కేకేసి చెబుతాడు. ఆమె అక్కడ జరిగిన తతంగమంతా ఫేస్‌బుక్ లైవ్ లో పెడుతుంది. అక్కడినుంచి కలకలం రేగుతుంది. ఆమెను పట్టుకోవడానికి ముందుకు వచ్చిన సిబ్బందిని తన దగ్గరున్న గన్ తీసి నిలువరిస్తుంది. తన పవిట చాటున కట్టుకున్న బాంబును చూపించి నాతో పాటుగా అందరూ తక్షణం చనిపోతారు నా మాట వినకుంటే అని బెదిరిస్తుంది. లోపలి నుంచి తలుపు గడియ వేసి తాళం వేస్తాడు పెద్దాయన్. ఆయన చేతిలో మరో గన్ను.


ఆమె కోరుకున్నది ఏమిటి? ప్రపంచానికి ఈ వ్యవస్థలో జరుగుతున్న మోసాన్ని తెలిపి, ఆ లంచగొండి సిబ్బంది మొత్తాన్ని ఉద్యోగం లోంచి తీసెయ్యించడం. ఈ లోగా వ్యవస్థలో ఎన్ని రకాల లొసుగులు ఉన్నాయి అన్నది ఒక్కొక్కటే బయట పడుతుంది. ఆమెకు న్యాయం జరుగుతుందా, లేదా అన్నది మిగతా కథ.
ఇలాంటి సినిమాలు హిందీ లో గతం లో వచ్చాయి. ముంబై లో జరిగిన వరస బాంబు పేలుళ్ళ నేపథ్యం లో వచ్చిన “వెడ్నెస్‌డే” వాటిలో బాగా పేరొచ్చిన, బాగా తీయబడిన చిత్రం.
గీతగా యజ్ఞ శెట్టి నటన బాగుంది. చాయాగ్రహణం, నేపథ్య సంగీతం బాగున్నాయి. మన్సోరే దర్శకత్వం కూడా బాగుంది.
Spoiler Alerrt ఇతర చిత్రాలకూ దీనికీ ఒక ముఖ్యమైన తేడా Act 1978. అందులో ఏముంది? ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న రక్షణ. వారిని ఉద్యోగంలోంచి తొలగించడానికి తీసుకోవలసిన చర్యలు చూస్తే వారిని తొలగించడం దాదాపు అసాధ్యమనే తెలుస్తుంది. ఆ అతి భద్రత వల్ల వాళ్ళు లంచగొండులుగా నిర్భయంగా మారుతున్నారని ఒక కోణం. బ్యూరోక్రసీ, రెడ్ టేపిజంలు కూడా. ఇది మామూలుగా జరిగే దోషారోపణే. ఒక ఉద్యోగి చెప్పినట్టు తాము ప్రజలతో సన్నిహితంగా ఉంటారు కాబట్టి తమ మీద దృష్టి పడుతుంది, రాజకీయ నాయకులు ఏమి చేసినా వారి దగ్గర వరకూ వెళ్ళగల పరిస్థితి సామాన్యుడికి లేదు అంటాడు. దాన్ని నిరూపించే రాజకీయ నాయకుల ఎత్తుగడలు, కమిటీ పెట్టడం, కమిటీ తీరుతెన్నులు, పార్టీ స్వలాభాలు ఇవన్నీ చూస్తే అంతటా స్వార్థమే తప్ప సామాన్యుడికి ఒరిగేది స్వల్పమే. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం చూడవచ్చు, ఎందుకంటే మన కాలానికి ఇది ఇంకా ప్రాసంగికత కల కథే. ప్రైవేటీకరణ గుమ్మం దగ్గర వున్నాము. ముందు ముందు ఎలా వుండబోతుందో చెప్పలేము.
ఆసక్తి వున్నవారు అమేజాన్ ప్రైం లో చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here