ఆదాబ్ హైదరాబాద్ – కొత్త ఫీచర్ – త్వరలో

0
10

[జూలై 2024 నుంచి సంచిక మాసపత్రికలో తాను నిర్వహించబోయే ‘ఆదాబ్ హైదరాబాద్’ ఫీచర్‍‌ని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]హై[/dropcap]దరాబాద్. నా నగరం. దేశంలో ఎన్ని పెద్ద నగరాలను చూసినా, ఎన్ని గొప్ప కట్టడాలను చూసినా, ఆ ఆనందం కాసేపే. తిరిగి మళ్ళీ నా ఊరికి వస్తే కలిగే ఆ తృప్తి వేరు. హైదరాబాద్‌లో నేను పెద్దగా తిరిగిన ప్రదేశాలు లేవు. ఎక్కువగా ఇల్లు దాటని వాతావరణంలోనే పెరిగినా, నేను తిరిగిన ఆ కాస్త మేర అంతా నా ఇల్లులా అనిపిస్తుంది.  ఇప్పుడు ఇన్నేళ్ళ తరువాత నగరంలో అన్ని వీధులను తిరుగుతున్నాను. కొన్ని నేను చూడని పదేశాలను హైదరాబాదులోనే కనుక్కుని చూస్తున్నాను. ఇంకా ఇంకా ఈ నగరాన్ని ప్రేమిస్తున్నాను. నా చిన్నతనంలోని హైదరాబాద్ వాసనలు ఇప్పుడు లేవు. నేను పాత సినిమాల కోసం వెతుక్కుని చూసిన ఆ థియేటర్లన్నీ గతంలో కలిసిపోయాయి. ఎన్నో ఇరానీ హోటళ్ళు ఇప్పుడు కనుమరుగయిపోయాయి. ఆ హోటల్లలో వెళ్ళి టీ తాగిన కొన్ని సందర్భాలు మనసులో మిగిలిపోయాయి. ప్యాలెస్, జమ్రూద్, నవరంగ్, ప్లాజా, బసంత్, షాం, లత, మహేశ్వరీ, పరమేశ్వరీ, సంగీత్, అమర్, అంజలి, అజంతా, నటరాజ్ థియేటర్లు ఇప్పుడు లేవు. పాత హిందీ సినిమాలను ఈ థియేటర్లలో చూస్తున్నప్పుడు వచ్చిన ప్రేక్షకులు ఆ డైలాగులకు ఎంత హుందాగా స్పందించేవారో చిన్నతనంలో వారి మధ్యన కూర్చుని నేను ఎంజాయ్ చేసేదాన్ని. అలాంటి టేస్ట్ ఉన్నప్రేక్షకులు ఆ నవాబీ తహజీబ్ ఇప్పుడు కనపడదు. హైదరాబాదులో అలనాటి ఆ ఉర్దూ ప్రేమికులు నాకు ప్రస్తుతం కనిపించట్లేదు.

నా చిన్నతనంలో ఎన్నో మతకలహాల గురించి వినేదాన్ని. ఓల్డ్ సిటీలో కర్ప్యూ గురించి తెలుసు కాని అదే సమయంలో  రంజాన్ మాసంలో హలీం, బేకరీలలో దొరికే దిల్ఖుష్, చిన్న సమోసాలు, ఇరానీ బిస్కట్, కరాచీ బేకరీ, మూన్ బిస్కట్లు, ఇవన్నీ బాల్యంలో నా జ్ఞాపకాలలో నిక్షిప్తమై ఉండిపోయాయి. నేను ముందు రుచి చూసిన బిర్యానీ అల్ఫా హోటల్ లోదే. మా పుట్టినరోజు షాపింగ్‌కి సికింద్రబాద్ మార్కెట్ కు వెళ్లినప్పుడు అల్పా హోటల్‌లో బిర్యాని తినడం గుర్తు. అదో అద్భుతంగా అనిపించింది. అప్పుడు నా వయసు పదేళ్ళ లోపే. ఇంటి టీ కాకుండా నేను బైట తాగిన టీ కూడా అల్ఫా హోటల్ లోనే.

సికింద్రాబాద్ స్టేషన్‌లో అప్పట్లో ఉన్న సిగ్నలింగ్ ఆఫీసులో పని చేసే మా నాన్నగారు అల్ఫా హోటల్‌కి డైలీ కస్టమర్. ఆయనకు తెలిసిన ఒకే ఒక హోటల్ అది. అందులో టీ తప్ప ఆయనకు ఇప్పటికీ మరొకటి తెలియదు. ఆ టీని మొదటిసారి ఎంత అపురూపంగా తాగానే లీలగా నాకు ఇప్పటికీ గుర్తు.

రంజాన్ ముందు రాత్రి చార్మినార్ వీధుల్లో చంద్రుడు కనిపించినప్పుడు పక్కవారితో చాంద్ ముబారక్ చెప్పుకోవడం నేనూ అనుభవించాను.  సికింద్రాబాద్ ఏరియాలోనే ఎక్కువగా  పెరిగిన నేను ఓల్డ్ సిటీకి పాతికేళ్ల వయసు వచ్చేదాకా ఓ రెండు మూడు సార్ల కంటే ఎక్కువ వెళ్లింది లేదు.  వినాయక నిమజ్జనం, మహంకాళి జాతర, రామనవమి ఉత్సవాలను హైదరాబాదీ పద్ధతిలో ఎంజాయ్ చేసాను. నాకు చాలా ఇష్టమైన అనుభవం చార్మినార్ చూస్తూ ఇరానీ టీ తాగడం. ఓ రెండు మూడు సార్లు మాత్రమే ఈ అనుభవాన్ని ఆస్వాదించగలిగాను. ఇప్పుడు జీవితంలో మరో ఇన్నింగ్స్ మొదలెట్టిన తరువాత తరుచుగా చార్మినార్ వెళ్లి ఆనందిస్తున్నాను. ఈ నగరాన్ని మరో సారి నా పద్ధతిలో కనుగొనే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడే అనిపించింది నా కళ్లతో నా జ్ఞాపకాల మధ్య ఈ హైదరాబాద్‌ను రికార్డు చేసుకోవాలని. ఆ ప్రయత్నంలోనే మొదలుపెట్టిన ఫీచర్ ఇది.

ఈ ఫీచర్‌లో భాగంగా హైదరాబాద్‌లో, సికింద్రాబాద్ లోని కొన్ని ప్రదేశాలను నెలకొకటిగా పరిచయం చేయబోతున్నాను. కొన్ని నేను చిన్నతనంలో నుండి చూస్తున్నవి, నా బాల్యంతో ముడిపడి ఉన్న ప్రదేశాలయితే కొన్ని కొత్త ప్రదేశాలను కూడా కనుగొని వాటిని గురించి వివరాలు కనుక్కుని రాయాలని ఉంది. నేను పుట్టిన నగరం, నేను పెరిగిన నా ఊరు నాకెంత తెలుసని? కాని దీన్ని తెలుసుకోవాలని ఇప్పుడు చాలా కోరికగా ఉంది. అందరూ ఫారెన్ టూర్ల వైపు మోజు చూపుతుంటే ఎందుకే నాకు నా నగరాన్ని లోతుగా తెలుసుకోవాలని,  ఈ నగరంలోని ప్రతి వీధిలో నడుచుకుంటూ వెళ్ళాలని బలంగా అనిపిస్తుంది. ఒక వయసులో ప్రపంచాని వీడి తనలోకి తాను చూసుకోవడం దిశగా మనుషులు ప్రయత్నిస్తారట. ప్రస్తుతం నేను అదే స్థితిలో ఉన్నానేమో. రమణ మహర్షి “నిన్ను నీవు తెలుసుకో” అన్నటుగా ఈ మధ్య ఎన్నో దేశాలను చూసి వస్తున్న వారి అనుభవాలు చదువుతున్నకొద్దీ నాకు ఆ దేశాల పై మోజు పెరగట్లేదు కాని నా హైదరాబాద్‌ను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనే కోరిక పెరిగిపోతుంది. ఆ దిశలో నేను చేసే ప్రయాణమే ఈ ‘ఆదాబ్ హైదరాబాద్’. ప్రతి నెల ఓ వ్యాసంగా సంచిక వెబ్ మాగజైన్ జూలై 2024 ఎడిషన్ నుండి..

చదవండి.

సంచికలో

ఆదాబ్ హైదరాబాద్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here