అడవి తల్లి ఒడిలో-1

0
12

[బాలబాలికల కోసం ‘అడవి తల్లి ఒడిలో’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]చై[/dropcap]తన్యభారతి పబ్లిక్ స్కూలు, వనస్థలిపురం. రైతుబజారు నుండి వైదేహినగర్ పోయే రోడ్డులో ఉందది. మూడంతస్తుల భవనం. ఒకటి నుండి పన్నెండో తరగతి వరకు, సి.బి.ఎస్.సి విధానంలో, ఇంగ్లీషు మీడియంలో బోధిస్తారక్కడ. ఎన్.సి.ఇ.ఆర్.టి. (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) వారి చేత తయారు చేయబడిన పాఠ్యపుస్తకాలు హైస్కూలు పిల్లలకు ప్రిస్క్రైబ్ చేస్తారు. నగరంలో ఆ స్కూలుకు, జుబ్లీహిల్స్, హబ్సిగూడా, ఎ.ఎస్. రావు నగర్‍లలో బ్రాంచీలు ఉన్నాయి. కేవలం చదువు మాత్రమే కాకుండా, పిల్లల సృజనాత్మకతను, పరిశోధనాసక్తిని పెంపొందించేలా పాఠాలు చెబుతారని పేరు.

మొదటి అంతస్తులో, 6వ తరగతి ‘బి’ సెక్షన్‍లో సైన్స్ క్లాస్ జరుగుతూంది. టీచరు ‘మిత్రవింద’ అడవుల గురించిన లెసన్ చెబుతూంది.

“పిల్లలూ! మీరు అడవికి ఎప్పుడైనా వెళ్ళారా?”

‘నచికేత్’ అనే పిల్లవాడు నిలబడి అన్నాడు – “న్యాట్ జియో ఛానల్‍లో చూశాను మిస్!”

పిల్లలందరూ నవ్వారు!

మిస్ కూడా నవ్వింది. అదీ ఆమెలోని ప్రత్యేకత. ఆమె ఎప్పుడూ పిల్లలను కోప్పడదు. సరదాగా, జోక్స్ వేస్తూ పాఠం చెబుతుంది. సైన్సు పాఠమయినా, ఆమె టీచ్ చేస్తుంటే, విసుగనిపించదు. పైగా వినాలనిపిస్తుంది ఇంకా.

“టి.వి.లో కాదురా, నిజంగా చూశారా అని!”

నిఖిల అనే పాప చెప్పింది – “మొన్న దసరా వెకేషన్‍లో వికారాబాద్ దగ్గర ఒక రిసార్ట్‌కు వెళ్ళాం మిస్. అక్కడ అడవిని చూశాం.”

“గుడ్! ఇంకా?”

ఖలీల్ అనే అబ్బాయి చెప్పాడు – “మిస్, మా ఊరు నంద్యాల. అక్కడ నుంచి గిద్దలూరుకు రైల్లో వెళుతుంటే, మా మామూ అడవిని చూపించాడు. ఎంత బాగుందో!”

“ఓకే. టి.వి.ల్లో, ప్రయాణాల్లో, టూర్లలో మీలో కొందరు అడవిని చూసి ఉంటారు. అలా కాకుండా నిజంగా దట్టమైన అడవిలోకి వెళ్ళి అక్కడ మనం పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అడవులు మన జీవితానికి ఎంత ముఖ్యమో అర్థం అవుతుంది. అడవి నేపథ్యంలో చాలా సినిమాలు మనం చూసి ఉంటాం” అంది టీచర్.

సినిమాలనే సరికి పిల్లలకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది.

“తగ్గేదేలే” అన్నాడొక పిల్లవాడు గడ్డం కింద అచ్చం అల్లు అర్జున్‍లా నిమురుకుంటూ. అందరూ నవ్వారు.

“ఆఁ, ‘పుష్ప’ సినిమాలో అడవిలో ఎంతో విలువైన గంధం చెట్లను నరికి స్మగ్లింగ్ చేసేది చూపించారు కదా పిల్లలూ! అది మంచి పనే అంటారా?”

అందరూ ఆలోచించారు.

“కాదు మిస్” అని అరిచారు.

“మీరు సెలవు రోజు యూట్యూబ్‍లో ‘అడవిరాముడు’ సినిమా చూడండి. అట్లే ఈమధ్య వచ్చిన ‘అరణ్య’ చూడండి. చాలా విషయాలు తెలుస్తాయి.”

“అలాగే మిస్!”

“సరే, ఇప్పుడు లెసన్ లోకి వెళదాము. జాగ్రత్తగా వినండి. అడవులు నరికేసి ఫ్యాక్టరీలు కట్టడం వల్ల చాలా నష్టపోతాం. దాన్ని ‘డీఫారెస్టేషన్’ అంటారు”

ఆ పదాన్ని బ్లాక్ బోర్డ్ మీద రాసింది మిత్రవింద.

“అడవుల్లో రకరకాల వృక్షజాతులుంటాయి. వాటిపై భాగాన్ని ‘గ్రీన్ టాప్స్’ అంటారు. అడవిలో చెట్లు ఎవరూ నాటరు. విత్తనాలు పక్షులు, జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి.

అడవుల్లో నుంచి మనకు ఎన్నో వనరులు వస్తాయి. వాటి ద్వారా ఎన్నో వస్తువులు తయారవుతాయి. మన యింట్లోని డోర్స్, విండోస్, కప్‍బోర్డ్స్ ఇవన్నీ ఎక్కడ నుంచి తయారవుతాయనుకుంటున్నారు? అడవిలో దొరికే వుడ్ నుంచే”

‘క్యానొపి’ (Canopy) అన్న పదాన్ని బోర్డు మీద రాసిందామె.

“దీనికి అర్థం తెలుసా చిల్డ్రన్? ఎత్తైన చెట్లు తక్కువ ఎత్తున చెట్లకు పైకప్పుగా ఉండడం అన్న మాట”

‘హ్యుమస్’ (Humus) అన్న పదాన్ని బోర్డు మీద రాసిందామె.

“ఎండుటాకులు, పుల్లలు, కుళ్ళిన మొక్కలను సూక్ష్మజీవులు తిని డార్క్ కలర్‍లో ఉండే హ్యూమస్ అనే పదార్థంగా మారుస్తాయి. ఈ సూక్ష్మజీవులను ‘డీకంపోజర్స్’ అంటారు. ప్లీజ్ నోట్ దిస్ వర్డ్. దీనివల్ల న్యూట్రియంట్స్ భూమి లోపలికి వెళ్ళి మొక్కలకు, చెట్లకు సహజమైన ఎరువుగా పని చేస్తాయి. డూ యు ఫాలో మీ?”

“యస్ మిస్” అని కోరస్‍గా అరిచారు పిల్లలు.

తర్వాత ‘గ్రీన్ లంగ్స్’ అన్న పదాన్ని బోర్డు మీద వ్రాసి, దాని గురించి వివరించింది టీచర్. పిల్లలు శ్రద్ధగా విన్నారు.

తర్వాత హెర్బివోర్స్ (Herbivores), కార్నివోర్స్ (Carnivores) గురించి క్లాసుకు చెప్పింది. ఒకదానికొకటి ఆహారంగా ఎలా పనికొస్తాయో వివరించింది.

తర్వాత ఒక వాక్యం రాసింది పెద్ద అక్షరాలలో

‘DYNAMIC LIVING ENTITY: THE FOREST’ (డైనమిక్ లివింగ్ ఎంటిటీ: ది ఫారెస్ట్)
“చిల్డ్రన్, దీని అర్థం ఏమిటో చెప్పగలరా?”

చెప్పగలిగిన వయసు కాదు వారిది.

“డైనమిక్ అంటే నిరంతర చలనశీలం. అంటే ఎప్పుడూ ఏదో ఒక యాక్టివిటీతో బిజీగా ఉండటం.”

“డైనమిక్ హీరోలాగా” అన్నాడొక పిల్లవాడు.

మళ్ళీ నవ్వులు! మిస్ కూడా అందంగా నవ్వింది! ఆమె నవ్వుతుంటే పిల్లలకు ఎంతో బాగుంటుంది.

“సినిమాలతో ఐతే బాగా కనెక్ట్ అవుతారర్రా మీరు!” అన్నదామె. ఆమె గొంతులో కోపం లేదు. వాత్సల్యం మాత్రమే ఉంది. తర్వాత లెసన్‍ను కొనసాగించింది.

“లివింగ్ అంటే సజీవమైనది. ‘ఫుల్ ఆఫ్ లైఫ్’ అన్న మాట! ఏమిటీ? చెప్పండి!”

“ఫుల్ ఆఫ్ లైఫ్!” అందరూ చెప్పారు గట్టిగా. ‘డైనమిక్’ అన్న పదం కంటే ‘లివింగ్’ అన్న పదం వారికి బాగా అర్థమైంది.

“ఇక చివరిది ‘ఎంటిటీ’. అంటే ఒక స్వతంత్రమైన, ప్రత్యేకమైన, స్వయంపోషకమైన అస్తిత్వం అంటే ఉనికి. అర్థం కాలేదు కదా చిల్డ్రన్?”

నిజంగా వారికి అర్థం కాలేదు. వారి ముఖాల్లో అయోమయం.

“అడవి అనేది తనంతట తాను ఏర్పడుతుంది. పెరుగుతుంది. తనను తాను పోషించుకుంటుంది. కొంత ధ్వంసమైనా, మల్ళీ పునరుత్పత్తిని పొందుతుంది. అది స్వతంత్రమైనది. కాని మనం? దాని మీద ఆధారపడేవాళ్లం. యామ్ ఐ క్లియర్ నౌ?”

ఇప్పుడు వారికి కొంతవరకు అర్థమైంది.

వరదలు రాకుండా అడవులు ఎలా కాపాడుతాయో వివరించింది టీచర్. వర్షాలు పడడానికి కూడా అడవులు దోహదం చేస్తాయంది. భూగర్భ జలాలు క్రిందకి వెళ్ళిపోకుండా చెట్ల వేర్లు ఆపుతాయంది.

“కాబట్టి పిల్లలూ! అడవులను మనం కాపాడుకోవాలి. మొక్కలు నాటాలి. వాటికి నీళ్ళు పోసి పెంచాలి. అడవులు ‘డైనమిక్ లివింగ్ ఎంటిటీ’గా ఎప్పుడూ ఉండేటట్లు చూసుకునే బాధ్యత మనదే”

ఇంతలో క్లాసు పూర్తయినట్లు అలారం మోగింది!

అయినా పిల్లలు ‘డైవర్ట్’ కాలేదు! మిత్రవింద మిస్ లోని గొప్పతనం అదే!

“సోమవారం సైన్స్ ‘యూనిట్ టెస్ట్’ కు ఈ రోజు చెప్పిన ‘ది ఫారెస్ట్: ఎ డైనమిక్ లివింగ్ ఎంటిటీ’ అన్న పాఠం నుంచే ప్రశ్నలు ఇస్తాను. ఓ.కే.?”

“ఓ.కే. మిస్!”

“రేపు నోట్స్ చెబుతాను. షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు ఐదు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ పది, మల్టిపుల్ చాయిస్ అంటే, ఆబ్జెక్టివ్ టైప్ పది. మొత్తం ఇరవై ఐదు మార్కులకు టెస్ట్!”

క్లాసు వదిలి వెళ్ళబోతూ మళ్ళీ ఆగిందామె.

“మరొక విషయం. ఈరోజు నేను చెప్పినదంతా థియరీ మాత్రమే. నిజంగా అడవుల్లోకి వెళ్ళి చూస్తే చాలా థ్రిల్లింగ్‍గా ఉంటుంది తెలుసా? అలా అని మీరు సొంతంగా వెళ్ళలేరు. మన ల్యాబ్‍లో ఎక్స్‌పెరిమెంట్ చేసి చూపేవి కావు అడవులు. మీ పేరెంట్స్‌ను అడిగి, వచ్చే సంక్రాంతి సెలవుల్లో ఏదైనా పెద్ద అడవిలోకి వెళ్ళి, మనం ఈ రోజు లెసన్‍లో తెలుసుకున్న వాటిని ప్రత్యక్షంగా చూడండి. ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్! థాంక్యూ!”

పిల్లలందరూ లేచి నిలబడి ఆమెకు విష్ చేశారు.

***

సచివాలయ నగర్‍కు ఇంచుమించు చివర్లో ఉన్న హెచ్.ఎం.డి.ఎ. (హైదరాబాద్ మున్సిపల్ డెవలప్‍మెంట్ అథారిటీ) వారి పార్కు. దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ప్రత్యేక శ్రద్ధతో దానిని ఉద్యాన శాఖ వారు తీర్చిదిద్దారు. నాలుగు విశాలమైన పచ్చిక బయళ్ళు, కాంపౌండ్ వాల్‍ను ఆనుకుని, వాకింగ్ ట్రాక్. ఏపుగా పెరిగిన రకరకాల వృక్షాలు, కాలిబాటలను ఆనుకుని పెంచి ట్రిమ్ చేయబడిన గుబురు పొదలు, అక్కడక్కడా వేసిన అందమైన సిమెంటు బెంచీలు. ఒక వైపు పిల్లలు రకరకాలుగా ఆడుకుని ఆనందించడానికి ఒక ‘ప్లే జోన్’ ఏర్పాటు చేశారు.

క్రింద మెత్తని ఇసుక అడుగున్నర ఎత్తున పరిచారు, పిల్లలు కింద పడినా దెబ్బలు తగలకుండా ఉండడానికని. అక్కడ వంపులు తిరిగిన జారుడు బల్లలు, సీ..సా..లు, రెండు ఎత్తైన ‘పోస్ట్’లను కలుపుతూ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేశారు. గొలుసులకు నాలుగు ఉయ్యాలలు ఉన్నాయి. తక్కువ ఎత్తులో ఒక రంగులరాట్నం కూడా ఉంది.

ఆ పార్కు వనస్థలిపురానికే మకుటాయమానమైనది. లాన్స్‌ను, చెట్ల మొదళ్ళను రోజూ నీటితో తడుపుతారు. వందల చదరపు మీటర్ల వైశాల్యంలో రకరకాల రంగుల పూలమొక్కలను అందంగా పెంచారు. పార్కులో ఆడుకుంటున్న చిన్నపిల్లలు కూడా ఆ రంగు రంగుల పువ్వుల్లానే ఉన్నారు.

పిల్లలను తీసుకొచ్చిన తల్లిదండ్రులు, మనవలను మనవరాళ్ళను తీసుకొచ్చిన తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు ఆడుకుంటున్న పిల్లలను శ్రద్ధగా గమనిస్తూనే, కబుర్లు చెప్పుకుంటున్నారు.

కొందరు వాకింగ్ ట్రాక్ మీద వాకిమ్గ్, జాగింగ్ చేస్తున్నారు. ఒకచోట రకరకాల ‘జిమ్’ పరికరాలున్నాయి. వాటి మీద కొందరు వ్యాయామాలు చేస్తున్నారు.

సాయంత్రం ఆరు దాటింది. నవంబరు నెల చివరి రోజులు. వాతావరణం చల్లగా హాయిగా ఉంది. పార్కంతా ప్రకాశవంతమైన లైట్లు వెలిగాయి. ఆ లైట్ల వెలుగులో లాన్లు, పూలమొక్కలు, చెట్లు – వింత శోభను సంతరించుకున్నాయి.

నచికేత్, నిఖిల, ఖలీల్ ముగ్గురూ పార్కు ఎదురుగానే ఉన్న ఆంధ్రకేసరి నగర్, రోడ్ నెంబర్ వన్‍లో ఉంటారు. వాళ్ళ ఇళ్లు ఒకే లైన్లో దగ్గర దగ్గరగానే ఉంటాయి. ముగ్గురూ ఆడుకోవడానికి పార్కుకొచ్చారు. వారిలో నచికేత్‍కు స్కేటింగ్‍లో ప్రావీణ్యం ఉంది. వాడు స్కేటింగ్ షూస్ తెచ్చుకుని వాకింగ్ ట్రాక్ మీద స్కేటింగ్ చేశాడు.

ఖలీల్ ఒక పెద్ద బాల్ తెచ్చాడు. ముగ్గురూ కాసేపు ఫుట్‍బాల్ ఆడారు. నిఖిల ఇంటి దగ్గర నుంచి జంతికలు, రవ్వలడ్లు తెచ్చింది. వాటర్ బాటిల్‍లో నీళ్ళు కూడా. ఆటలతో అలసిపోయి ముగ్గురూ లాన్‍లో ఒక చెట్టు కింద కూర్చుని, స్నాక్స్ తినసాగారు.

వారు కూర్చున్న చోటుకు దగ్గరలోనే పెద్ద పెద్ద బండరాళ్లున్నాయి. దాని మీద ఒక పెద్దాయన విశ్రాంతిగా కూర్చుని వీళ్ళనే గమనిస్తున్నాడు.

నిఖిల ఆయన్ను చూసి పలకరింపుగా నవ్వింది. ఒక రవ్వలడ్డు, జంతిక తీసుకొని వెళ్ళి ఆయనకి ఇచ్చింది.

“థాంక్యూ, బంగారు తల్లీ!” అన్నాడాయన. తానూ వాళ్ల దగ్గర వచ్చి కూర్చున్నాడు.

“మీరంతా ఎక్కడుంటారు?” అని అడిగాడు.

నచికేత్ చెప్పాడు, “ఇక్కడే ఎదురుగ్గా అంకుల్. ఆంధ్రకేసరి నగర్, రోడ్ నెంబర్ వన్‍లో ఉంటాము”

ఖలీల్ అన్నాడు – “అంకుల్, మేం ముగ్గురం చైతన్యభారతి పబ్లిక్ స్కూల్లో సిక్స్త్ స్టాండర్డ్ చదువుతున్నాం”

“వెరీ నైస్. మంచి స్కూలది. మీరు బాగా చదువుకోండి” అన్నాడాయన. “మీ పేరెంట్స్?” అని అడిగాడు.

నిఖిల అన్నది – “మా నాన్నగారు రామోజీ ఫిల్మ్ సిటీలో ‘తార-సితార’ హోటళ్లున్నాయి కదా అంకుల్, వాటిల్లో ఫ్లోర్ మేనేజర్. మా నాన్నగారి పేరు జగదీశ్వరరావు. అమ్మ పేరు మృణాళిని. అమ్మ ఎల్.బి.నగర్‍లో ఒక బొటిక్ నడుపుతుంది. నాకు ఒక బుజ్జి తమ్ముడు. పేరు నందన్. వాడు మా స్కూల్లోనే యు.కె.జి!”

“గుడ్” అని మిగతా ఇద్దరి వైపు చూశాడాయన.

ఖలీల్ చెప్పాడు – “మా డాడీ జి.హెచ్.ఎం.సి.లో టౌన్ ప్లానింగ్ డిపార్టుమెంటులో సీనియర్ అసిస్టెంట్ అంకుల్. ఆయన పేరు ఖాదర్ వలీ. మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. నేను ఒక్కడినే”

నచికేత్ అందుకున్నాడు – “అంకుల్, మా నాన్నగారు పౌరోహిత్యం చేస్తారు.. అంటే పూజలు, నోములు..”

“నాకు తెలుసు బాబూ పౌరోహిత్యమంటే!” అన్నాడాయన.

“నాన్నగారి పేరు వల్లీనాధశాస్త్రి. మాకు గణేశ్ టెంపుల్ దగ్గర ఒక పూజా స్టోర్ ఉంది. అది అమ్మ చూసుకుంటుంది. అమ్మ పేరు గాయత్రి. నాకు ఒక అక్క. నాకంటే చాలా పెద్దది. హయత్‍నగర్‍లో నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండ్ యియర్.”

“ఎంత బాగా మీ గురించి చెప్పారర్రా, పిల్లలూ!” అన్నాడాయన. వారి ఒద్దిక ఆయనకు నచ్చింది.

“మరి నేనెవరో, ఏం చేస్తానో అడగలేదేం?”

పిల్లలు నవ్వారు. ఆ నవ్వులో ‘మీరే చెబుతారని ఊరుకున్నాం’ అనే అర్థం ఉంది.

“నా పేరు శాంతిస్వరూప్. నేను రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్శిటీలో ఎం.ఎస్.సి. బాటనీ చేశాను. తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో చేరి ముప్పై సంవత్సరాలు పని చేసి డి.ఎఫ్.ఓ.గా రెండేళ్ళ క్రిందట రిటైరయ్యాను. అన్నట్లు, పిల్లలూ, డి.ఎఫ్.ఓ. అంటే ఏంటో తెలుసా మీకు?”

తెలియదన్నట్లు తల ఊపారు ముగ్గురూ.

“డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్” అని చెప్పి, “మీకు ‘బాటనీ’ అంటే తెలుసా, వృక్షశాస్త్రం. మీ ఆంటీ పదేళ్ల కిందటే చనిపోయింది. నాకు ఒక్కతే కూతురు, లిఖిత. పెళ్ళయింది. అల్లుడు, కూతురు అమెరికాలో ఉంటారు. ఒక మనుమడున్నాడు నాకు. వాడికి ఆరేళ్ళు. పేరు ఉదాత్త్. నేను ప్రశాంత్‍నగర్ సాయిబాబా గుడి వెనక ఉన్న ఒక అపార్టుమెంట్‍లో ఉంటాను. పదండి, వెళదాం, పొద్దుపోయింది”

నిఖిల అన్నది “అంకుల్, మీరు బాటనీలో ఎమ్మెస్సీ చేశారు. పైగా ఫారెస్ట్ ఆఫీసర్. ఈరోజు మా టీచర్ మాకు అడవుల గురించి లెసన్ చెప్పారు. వింటుంటే ఎంత బాగుందో!”

“ఈజిట్! వెరీ ఇంటరెస్టింగ్! ఏం చెప్పారు మీ టీచర్?”

ఖలీల్ తాము నేర్చుకున్నది క్లుప్తంగా వివరించాడు. నచికేత్ అన్నాడు – “అంకుల్, చివర్లో మా మిస్ ఒక మాట అన్నారు – ‘నేను చెప్పినదంతా  థియరీయే. నిజంగా అడవుల్లోకి వెళ్ళగలిగితే, చాలా థ్రిల్లింగ్‍గా ఉంటుంది. ఎన్నో విషయాలు క్లాస్ రూమ్‍లో నేను చెప్పినవి ప్రాక్టికల్‍గా చూసి నేర్చుకోవచ్చు’ అని.”

“షీ ఈజ్ రైట్” అన్నాడు శాంతిస్వరూప్. ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు. “అయితే మీకందరికీ అడవులు చూడాలని ఉందా?” అన్నాడు.

“కాని మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారంకుల్?” అన్నది నిఖిల.

అందరూ నడుచుకుంటూ పార్కు మెయిన్ గేట్ దగ్గరికి వచ్చారు. వాళ్ళ ముగ్గురికీ ఐస్‍క్రీమ్‍లు ఇప్పించాడాయన. వాళ్ళు మొహమాటపడుతూంటే అన్నాడు:

“మనమందరం ఈ రోజు ఫ్రెండ్స్ అయ్యాం. అమ్మాయ్, నీవు నాకు స్నాక్స్ తెచ్చిచ్చావు. నేను వద్దన్నానా? తీసుకోండి ఏం కాదు” అని అన్నాడాయన. అంత పెద్దాయన తమను ఫ్రెండ్స్ అంటుంటే పిల్లలకు చాలా ఎక్సైటింగ్‍గా అనిపించింది.

వాళ్ళను దగ్గరుండి రోడ్ దాటించాడాయన. తర్వాత తన రాయల్ ఎన్‍ఫీల్డ్ మోటార్ బైక్ మీద ఇంటికి వెళ్ళిపోయాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here