అడవి తల్లి ఒడిలో-2

0
14

[బాలబాలికల కోసం ‘అడవి తల్లి ఒడిలో’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]త[/dropcap]ర్వాత రెండు మూడు సార్లు శాంతిస్వరూప్ పిల్లలను పార్కులో కలిశాడు. వారితో ఆడుకున్నాడు. కబుర్లు చెప్పకున్నారు. పార్కు లాన్ లోకి వస్తూనే అంకుల్ బండరాయి మీద కూర్చుని ఉన్నాడా లేదా అని చూసేంతగా ఆయనకూ వారికీ ఒక అనుబంధం ఏర్పడింది.

ఆ రోజు ఆయన వారి కోసం పునుగులు కట్టించుకొని వచ్చాడు. నాలుగు చిన్న పేపర్ ప్లేట్లలో వేడి వేడి పునుగులు, ఉల్లి టమెటా చట్నీతో నంచుకుని తిన్నారు.

“రేపట్నించి మాకు ఐదు రోజులు సెలవులు అంకుల్. క్రిస్‍మస్ మూడు రోజులు, తర్వాత శని, ఆదివారాలు. మళ్లీ సోమవారం వరకూ స్కూలు లేదు” అన్నది నిఖిల.

“వెరీ గుడ్! అయితే మనందరం అడవులను చూడడానికి వెళుతున్నాం!” అని ప్రకటించాడు అంకుల్.

పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టారు.

“పదండి, మీ యిళ్ళకు వచ్చి మీ పేరెంట్స్ అనుమతి తీసుకుంటాను.”

ముందుగా ఖలీల్ యిల్లు వచ్చింది. వాళ్ల నాన్న ఇంట్లోనే ఉన్నాడు. శాంతిస్వరూప్ తనను తాను పరిచయం చేసుకోబోతుంటే ఆయన అన్నాడు చిరునవ్వుతో –

“మావాడు మీ గురించి ఎప్పుడూ చెబుతుంటాడు సాబ్! మీరు ఫారెస్ట్ ఆఫీసరని నాకు తెలుసు.”

ఖలీల్ వాళ్లమ్మ ఉస్మానియా బిస్కట్లు, టీ కప్పులు, ఒక ట్రేలో పెట్టుకొని వచ్చింది. ఆయనకు నమస్కారం చేసింది.

“జీతే రహో బేటీ!” అని ఆశీర్వదించాడాయన.

“ఖాదర్ జీ! మీ వాడు చాలా తెలివైన వాడు. కొద్ది రోజుల్లోనే నాకు వీళ్లందరూ దగ్గరి వాళ్లు అయినారు. ఒంటరి వాడినైన నాకు ఈ పిల్లల స్నేహం చాలా రిలీఫ్ నిచ్చింది.”

శాంతిస్వరూప్ కొనసాగించాడు.

“వీళ్లందరికీ అడవులు చూడాలని ఉంది. వాళ్ల సైన్స్ టీచర్ అడవుల గురించి పాఠం చెప్పి, వెళ్లి చూడమని చెప్పారట. మీరు సరేనంటే వీళ్లందర్నీ నల్లమల ఫారెస్ట్‌కు తీసుకుని వెళతాను. నేను ఆత్మకూరు డివిజన్‌లో చాలా కాలాం పని చేశాను. మనకు అక్కడ గెస్ట్ హౌస్ కూడ ఏర్పాటు చేస్తారు. పిల్లలలో సైంటిఫిక్ స్పిరిట్ పెరగాలంటే వారిని ప్రకృతికి ఎక్స్‌పోజ్ చేయాలి. మీకు తెలియనిదేముంది?”

ఆయన సంస్కారానికి తమ పిల్లల పట్ల ఆయనకున్న ‘కన్‌సర్న్’కు ఖాదర్ వలీ దంపతులు ముగ్ధులైనారు. సంతోషంగా ఆయన ప్రతిపాదనను అంగీకరించారు.

తర్వాత నిఖిల యింటికీ, నచికేత యింటికీ వెళ్లారు. వారి పేరెంట్స్ కూడ ఒప్పుకొన్నారు. “అంత పెద్దాయన తమ పిల్లలను దగ్గరుండి తీసుకు వెళ్లి అడవులకు తీసుకుపోతానంటే అంతకంటే కావలసిందేముంది?” అన్నారు.

వారు వల్లీనాధశాస్త్రి గారింట్లో ఉండగా ఆ ఏరియా కార్పోరేటర్ మల్లేశ్ యాదవ్ శాస్త్రిగారితో ఏదో పనుండి వచ్చాడు. శాంతిస్వరూప్‌ను చూసి ఆశ్చర్యపోయి నమస్కరించాడు. ఒక గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో వారిద్దరికీ పరిచయం.

“ఆ రోజు మన యల్.బి.నగర్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిగారు మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూసిండ్రు. మీరు శాస్త్రిగారి దగ్గరకు ఏదైనా శుభకార్యానికి..”

శాస్త్రిగారు శాంతిస్వరూప్ గారు వచ్చిన పని వివరించే సరికి కార్పోరేటర్ గారు ఆశ్చర్యపోయారు. ఇలా అన్నారు. “సార్ చానా షరీఫ్ ఆద్మీ, అయ్యవారు! మన పిల్లలను నిశ్చింతగా ఆయన వెంట పంపుడ్రి.”

తర్వాత శాంతిస్వరూప్ గారు తన ప్లాన్ గురించి చెప్పారు.

“నా మిత్రుడిది జీప్ వుంది. దాన్ని తీసుకొంటాను. అడవిలోని దారుల్లోకి జీపే మంచిది. మేము ఎల్లుండి ఉదయాన్నే బయలుదేరి కర్నూలు మీదుగా ఆత్మకూరు చేరుకుంటాము. రెండు రోజుల పాటు పిల్లలకు అడవులన్నీ చూపిస్తాను. మళ్లీ శనివారం సాయంత్రానికి తిరిగి వస్తాము. పిల్లలూ, మీరు బట్టలు సర్దుకోండి. అందరూ తల ఒక చాకు, ఒక భూతద్దం (లెన్స్), ఒక మూడు అడుగుల గట్టి స్టిక్, టార్చి, ఒక నోట్ బుక్, పెన్ తెచ్చుకోండి. కాన్వాస్ షూస్, చేతులకు వీలుంటే గ్లవ్స్ కూడా. అక్కడ తినడానికి అమ్మలనడిగి స్నాక్స్ చేయించుకోండి. నేను కెమెరా తెస్తాను.”

పిల్లలందరూ ఎక్సైట్‌మెంట్‌తో చప్పట్లు కొడుతూ “హేయ్! మేం ఫారెస్టుకు వెళుతున్నాం!” అని అరిచారు.

***

ఆ రోజు ఉదయం ఆరు గంటలకు పిల్లలు ముగ్గురు ‘రడీ’ అయ్యారు. ‘అమ్మలు’ వారికి కారప్పూస, జంతికలు, పప్పు చెక్కలు, మైసూర్ పాక్, ఇంకా అలాంటి స్నాక్ ఐటమ్స్ చేసి, కట్టి ఇచ్చారు. ఎర్రరంగు ‘మహేంద్ర ధార్’ జీపును డ్రయివ్ చేసుకుంటూ శాంతిస్వరూప్ వారున్న రోడ్ లోకి వచ్చేశాడు. ఆయన షార్ట్స్, టీ షర్టు వేసుకుని, షూస్, గాగుల్స్ ధరించాడు.

పిల్లలందరూ పేరంట్స్‌కు బై చెప్పారు. వారు పిల్లలకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు.

“అంకుల్ వున్నారు కదా! మాకేం భయం?” అన్నారు వాళ్లు. వాళ్ల ముఖాలనిండా కుతూహలం, ఉత్సాహం, సంతోషం పొంగిపొర్లుతున్నాయి.

జీప్ బయలుదేరింది. బి.ఎన్.రెడ్డి జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుని, ఇబ్రహీంపట్నం వైపుగా సాగిపోతూంది. నాగార్జునసాగర్‍కు వెళ్లే రోడ్ అది. బంగులూర్ క్రాస్ వద్ద కుడివైపుకు తిరిగి ఓ.ఆర్.ఆర్. (అవుటర్ రింగురోడ్) ఎక్కింది. ఆ రోడ్ చాలా బాగుంది. దాదాపు వంద కి.మీ. వేగంతో జీపు తోలుతున్నాడు శాంతిస్వరూప్. చిన్న పిల్లలతో ప్రయాణం ఆయనకూ బాగుంది.

దాదాపు అరగంటకు పైగా ప్రయాణించి, శంషాబాద్ దాటిన తర్వాత బెంగుళూర్ హైవే ఎక్కారు. షాద్ నగర్ దాటిన తర్వాత ఒక మొబైల్ టిఫిన్ దగ్గర జీపు ఆపాడు. ఒక వ్యాన్‌ను క్యాంటిన్‌గా మలిచారు. ఇడ్లీ, వడ, మైసూరు బోండా, పూరీ, దోసె, అన్ని రకాల టిఫిన్లు వేడి వేడిగా తయారు చేస్తున్నారు అక్కడ. చాలా మంది తమ వాహనాలు ఆపి, అక్కడ టిఫిన్ చేస్తున్నారు.

“మైడియర్ యంగ్ ఫెలోస్! మనం కూడ ఇక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం. ఇలాంటి చోట్ల టిఫిన్ బాగుంటుంది. ధరలు కూడ చాలా తక్కువ. ఇలాంటి వాళ్లను మనం ఎంకరేజ్ చేయాలి. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో డాబు తప్ప, రుచీ పచీ ఉండదు” అన్నాడు పిల్లలతో.

అందరూ ఎవరికి నచ్చిన టిఫిన్ వారు తిన్నారు. శాంతిస్వరూప్ ‘టీ’ తాగాడు. పది గంటలకు కర్నూలు చేరారు. అక్కడ్నుంచి శ్రీశైలం రోడ్‍లో ప్రవేశించారు. నందికొట్కూరు అనే ఊర్లో పది నిమిషాలు ఆగారు. తర్వాత ఆత్మకూరు వచ్చింది. ఆత్మకూరు దాటిన అరగంటకే నల్లమల అడవి ప్రారంభమైంది.

ఎత్తైన కొండలు, పచ్చని చెట్లతో నిండి ఉన్నాయి. ఎండ కాస్తున్నా చల్లని గాలి వీస్తూంది. ఎడమ పక్క ఒక పెద్ద బోర్డు కనపడింది. దాని మీద పులి బొమ్మ ఉంది. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అటవీ శాఖ, పులుల అభయారణ్యము’ అని వ్రాసి ఉందా బోర్డు మీద. మనం ఉర్లోలో చూసే కోతుల్లాంటివేకాక, రకరకాల కోతులు, కొండముచ్చులు చెట్ల మీద కనబడినాయి. పోను పోను అటవీ శాఖ వారి బోర్డుల మీద జింకలు, దుప్పులు, ఏనుగులు, బొమ్మలు కనబడ్డాయి.

“మనం అడవిలోంచి ఒక అర కిలోమీటరు దూరం వెళితే, పిల్లలూ! కృష్ణానదిని చూడవచ్చు. అందులో మొసళ్లు కూడ ఉంటాయి. తిరుగు ప్రయాణంలో మీకు నదిని చూపిస్తాను. చాలా బాగుంటుంది” అన్నాడు శాంతిస్వరూప్.

జీప్ మరో అరగంట ప్రయాణించింది. అక్కడ ఒక చెక్ పోస్టు ఉంది. వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు. అక్కడ ఉన్న అటవీ శాఖ అధికారి శాంతిస్వరూప్‌ను చూసి నమస్కరించాడు.

“ఏం మల్లికార్జున్! బాగున్నావా?” అని చిరునవ్వుతో అతన్ని పలకరించాడాయన.

“బాగుండా సార్! డి.ఎఫ్.వో సారు మీరు వస్తాండారని, దగ్గరుండి తీస్కరమ్మని చెప్పినాడు. మన గెస్టు హౌసులోనే మీకు రెండు రూములు తీసి పెట్టినాము. నేను బైకు మీద పోతాంటాను. మీరు నా ఎనకాతల రండి సార్” అన్నాడు మల్లికార్జున్ వినయంగా.

జీపు మెయిన్ రోడు వదలి కుడి వైపుకు తిరిగింది. అది చిన్న మెటల్ రోడ్డు. రెండు వందల గజాల దూరం ప్రయాణించారు అడవిలో.

“ఆ అంకుల్ మాట్లాడే తెలుగు వింతగా ఉందేమిటి అంకుల్” అని అడిగింది నిఖిల.

ఆయన నవ్వి అన్నాడు “అది రాయలసీమ స్లాంగ్ తల్లీ. తెలంగాణలో తెలుగు వేరే రకంగా ఉంటుంది. కోస్తా ఆంధ్రాలో వేరు. అంతా తెలుగే. అన్నీ మంచివే. ‘వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా’ అన్నారు కదా మహాకవి సి. నారాయణరెడ్డి! ఆయన ఎవరో తెలుసా?”

తెలియదన్నట్లు తల అడ్డంగా ఉపారు. ఆయన కాసేపు ఆలోచించి “టి.విలో ఎప్పుడైనా బాలకృష్ణ సినిమా ‘మంగమ్మ గారి మనవడు’ చూశారా? అందులో ‘దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా’ అనే పాట రాసింది ఆయనే” అన్నాడు .

వారు చూడలేదన్నారు. “నిజమే, మీరు చాలా చిన్న పిల్లలు. చూసి ఉండరు పోనీలెండి” అన్నాడాయన.

‘డివిజనల్ ఫారెస్టు అధికారి వారి కార్యాలయము. ఆత్మకూరు డివిజన్. కర్నూలు జిల్లా’ అని వ్రాసి ఉన్న భవనం కనబడింది. పెద్ద పెద్ద వృక్షాలు ఆ భవనం చుట్టూ ఉన్నాయి.

మల్లికార్జున్ వీళ్లను డి.ఎఫ్.వో గారి గదికి తీసుకొని వెళ్లాడు. గది బయట గోధుమరంగు చెక్క ప్లేట్ మీద ‘నవీన్ కృష్ణ పట్నాయక్, డి.ఎఫ్.ఓ’ అన్న అక్షరాలు నలుపు రంగులో రాసి ఉన్నాయి.

లోపల ఒక నలభై ఐదేండ్ల వ్యక్తి కూర్చుని, కంప్యూటర్‌లో ఏదో చూసుకుంటున్నాడు. వీళ్లను చూసి లేచి ఆనందంగా “ఎన్నాళ్లకు సార్, శాతిస్వరూప్ జీ! మళ్లీ మిమ్మల్ని చూశాను! వెల్‍కమ్ సార్, చిల్డ్రన్, ప్లీజ్ కమ్” అంటూ సాదరంగా రిసీవ్ చేసుకున్నాడు.

“రంపచోడవరం డివిజన్‌లో మీ దగ్గర పని చేసినప్పటికీ ఇప్పటికీ మీరు పెద్దగా ఏం మారలేదు సార్” అన్నాడాయన. “మీరు ఫోన్ చేసిన వెంటనే మీకు అన్ని ఏర్పాట్లు చేశాను లెండి. మీ వెంట ఈ రెండు రోజులూ ఉండటానికి ‘చెన్నకేశవులు’ అనే ఫారెస్ట్ గార్డుకి చెప్పాను. ఈ పూట మీరు నాతో లంచ్ చేయాలి సార్” అన్నాడు.

“తప్పకుండా నవీన్!” అన్నాడు శాంతి స్వరూప్. “మీరు రూమ్స్‌కు వెళ్లి ఫ్రెష్ అవండి. ఒక అరగంటలో నేను వస్తాను. డైనింగ్ రూంలో కలుద్దాం.”

గెస్ట్ హౌస్ వంద మీటర్ల దురంలో ఉంది. ఒక రూములో శాంతిస్వరూప్, నిఖిల, ఇంకో రూములో ఖలీల్, నచికేత్ సర్దుకున్నారు. అందరూ ఫ్రెష్ అయి, డైనింగ్ రూం చేరుకున్నారు.

జొన్న్ రొట్టె, గోంగురపప్పు, వంకాయ స్టఫ్, రసం, పెరుగు భోజనంలో వాళ్లకు వడ్డించారు. పిల్లలకు ఎందుకో బాగా ఆకలిగా అనిపించింది. కడుపునిండా తిన్నారు.

“కాసేపు రెస్ట్ తీసుకెండి సార్! ఆల్ ది వే ఫ్రం హైద్రాబాద్ డ్రయివ్ చేసుకుంటూ వచ్చారు కదా! సాయంత్రం నాలుగు గంటలకు టీ తాగి, దగ్గరలో ఉన్న ముక్కంటి కోనకు వెళదురుగాని” అన్నాడు డి.ఎఫ్.వో గారు.

***

నాలుగు గంటలకు టీ వచ్చింది. పిల్లలకు హార్లిక్స్. చెన్నకేశవులు వచ్చి శాంతిస్వరూప్‌కు సెల్యూట్ చేశాడు. “వెళదామా?” అనడిగాడు ఆయన.

“సార్, మీకు తెలియంది ఏముంటాది. ఈ రోజు ముక్కంటోకన కాడికి బోయి ఎనక్కు రాలేం. సీకటి పడకముందే వచ్చేయాల. అసలే సన్నపిల్లోండ్లు!” అన్నాడు అతడు వినయంగా. “ఈ యాల్టికి మనకు దగ్గరలో ఉన్న ‘పాతాళ కనుమ’ సూపించుకొని వస్తామనుకుంటాండా.”

 “నిజమే చెన్నా, అదే మంచిది. జీపు అక్కడ వరకు వెళుతుందా?”

“రెండు పర్లాంగులు అడవిలో నడిసిపోవాల్సుంటాది సారు. జీపు ‘దయ్యాల గరువు’ కాడ పెట్టిపోదాము.”

జీపులో అందరూ పదిహేను నిముషాలు ప్రయాణించారు. ఒక చోట ఆపించాడు చెన్న. అక్కడ నుంచి దట్టంగా కలబంద పొదలున్నాయి. మనుషులు నడవడానికి వీలుగా దారి ఉంది. కాని ఎగుడుదుగుడుగా ఉంది. చెన్న ముందు నడుస్తున్నాడు. అతని భుజానికి రైఫిల్ వైలాడుతుంది. నడుముకు ఉన్న తోలు ఒరలో ఎనిమిదంగుళాల కత్తి కూడా ఉంది.

“అంకుల్, దీనికి ‘దయ్యాల గరువు’ అని ఎందుకు పేరొచ్చింది?” అనడిగాడు నచికేత.

శాంతిస్వరూప్ నవ్వి అన్నాడు “అడవుల్లో నివసించే గిరిజనులు, తరాల క్రిందట, కొన్ని ప్రాంతాలకు కొన్ని పేర్లు పెట్టుకొని ఉంటారు మై ఛైల్డ్! మొత్తానికి ప్రతి పేరు వెనుక ఒక చరిత్ర ఐతే ఉంటుంది. బట్, ఆయామ్ నాట్ ఎ హిస్టారియన్, యూ నో? ”

చెన్న అన్నాడు “పిల్లోడా, ఈ కలబంద పొదలుండాయి చూసినవా? మందంగా ఎడల్పుగా ఉన్నవి దాని ఆకులు. దాని మీద కొశ్శని(వాడి) ముండ్లున్నాయి గదా! కలబంద ఆకులను ఇక్కటోల్లు ‘పట్టలు’ అంటార్లే. దాని లోపల ఆకు పచ్చని గుజ్జు వుంటాది. అది చర్మ రోగాలకు మంచి మందుగా పని చేస్తాది. దొంగ నా కొడుకులు కలబంద పట్టలను నరక్కొని పోకుండా భయపడించడానికి ఈ గరువుకు ఆ పేరు పెట్టింటారు.”

పిల్లలకు ఈ వివరణ నచ్చింది. శాంతిస్వరూప్ చెన్నా వైపు మెచ్చుకోలుగా చూశాడు.

“పిల్లలూ, కలబందను ఇంగ్లీషులో ‘అలోవిరా’ అంటారు. దీన్ని మనం మన పెరట్లో కూడా పెంచవచ్చు. దీని గుజ్జును కొన్ని ప్రిజర్వేటివ్స్ కలిపి ‘జెల్స్’గా తయారు చేస్తారు. గాయాలు అద్భుతంగా మాన్పుతుంది. మఖం మీద మొటిమలను (pimples) పొగొడుతుంది. ఈ మొక్క ‘లిలియోప్సిడా’ వర్గానికి చెందింది. అలా వినడం కాదు. నోట్ బుక్‌లో రాసుకోండి.”

పిల్లలు హేండ్ బ్యాగ్ లోంచి నోట్ బుక్స్ తీసి రాసుకోవడం ప్రారంభించారు. ఆయన కొనసాగించారు.

“ఇది ASPHODELACEAE (ఆస్పోడెలాసి) కుటుంబానికి చెందిన మొక్క. జంతువులు తినకుండా ఈ ముళ్లు దానికి ‘స్వీయ రక్షణ వ్యవస్థ’గా (self-defense mechanism) పని చేస్తాయి. కలబంద గుజ్జును జట్టుకు బాగా పట్టించుకొని ఒక గంట తర్వాత శీకాయ పొడితో (shikakoi) తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.”

ఖలీద్ అన్నాడు “చెన్నా అంకుల్, మీరు ఇక్కడే ఉంటారు కదా, కలబంద గుజ్జు రాసుకోలేదా, తలకు?”

చెన్నా తన బట్ట నెత్తి (bold head) ను గోక్కుంటా నవ్వాడు. నిఖిల ఖలీల్‌ను చూసి “తప్పు. అలా అడగకూడదు ఎల్డర్స్‌ను” అని మందలించింది.

“మన దేశంలోనే పుట్టింది అద్భుతమైన ఈ మొక్క. మన యిండియన్స్‌కు దీని గొప్పతం చాలా కాలం తెలియలేదు.”

“విదేశీ శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి, మన పురాతన ఆయుర్వేద గ్రంథాలను ఇంగ్లీషులోకి ట్రాన్స్‌లేట్ చేయించుకొని, కలబందను తీసుకుపోయి వాళ్ల దేశాల్లో వేల ఎకరాల్లో సాగు చేసుకుంటున్నారు. పైగా దానితో చేసే మందులను మన దేశంలో అమ్ముకొని కోట్ల డాలర్లు సంపాదించుకుంటున్నారు.”

“ఓ మైగాడ్!” అన్నాడు నచికేత. “మా ఇంట్లో పెరట్లో ఒక కుండీలో దీన్ని మా అమ్మ పెంచుతుంది అంకుల్. కాని దాని ఆకులు చిన్నవి. ముళ్లు కూడా చిన్నవే.”

“అడవిలో పెరిగే పొదలకు, ఇంట్లో పెంచే వాటికి ‘వారా’ (తేడా) శానా ఉంటుంది పిల్లోడా!” అన్నాడు నవ్వుతూ చెన్నా.

“హెయిర్ ఆయిల్స్, షాంపులూ, ఫేస్‌వాష్‌లు ఎన్నో తయారు చేస్తారు. దీని గుజ్జుతో. దానిలో యాంటీ బాక్టీరియాల్, ఇంకా యాంటీ ఇన్‌ప్లమేటరీ ఏంజంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో సోడియం కార్బోనేట్ ఉంటుంది.”

పిల్లలు శ్రద్ధగా రాసుకుంటున్నారు. “సంస్కృతంలో దీనిని ‘కుమారీ’ అంటారు. దీని పట్టలను (మట్టలు అని కూడా అంటారు) అడ్డంగా కోస్తే లేత ఆకు పచ్చరంగులో ఉన్న చిక్కని లిక్విడ్ వస్తుంది. దాన్ని ఎండలో డ్రై చేస్తే నల్లగా మారుతుంది. దాన్ని ‘మూసాంబరం’ అంటారు. మన తెలుగు వాళ్లు అలా దాన్ని భద్రపరచుకొని చాలా వ్యాధులకు మందుగా వాడారు. దేన్నైనా వ్యాపారంగా మార్చుకోవడం మన వాళ్లకు రాదు.”

దయ్యాల గరువు దాదాపు మూడు వందల మీటర్లు పొడవు ఉంది. దాన్ని దాటగానే పెద్ద కొండలు రెండు వైపులా కనిపించాయి. ఒక వైపు లోతైన లోయ కనబడుతుంది. లోయలో పెద్దగా శబ్దం చేస్తూ ఒక వాగు పారుతూంది. నాలుగో వైపంతా లావుగా ఉన్న తీగలు చుట్టుకున్న రకపకాల చెట్లు, పొదలు, పెద్ద పెద్ద పుట్టలు, చెట్ల కొమ్మలకు వేలాడుతున్న పెద్ద పెద్ద తేనె పట్లు కనబడ్డాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here