అడవి తల్లి ఒడిలో-3

0
12

[బాలబాలికల కోసం ‘అడవి తల్లి ఒడిలో’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]“సా[/dropcap]ర్ ఇదే ‘పాతాళ కనుమ’. లోయ లోపల పారే వాగును ‘పాతాళ గంగ’ అంటారు” చెప్పాడు చెన్నా.

“బహుశా అందుకేనేమో ఈ ప్లేస్‌కి ‘పాతాళ కనుమ’ అని పేరు వచ్చింటుందేమో. కదా అంకుల్” అంది నిఖిల శాంతిస్వరూప్ గారితో.

“యువర్ ‘గెస్’ మే బీ కరెక్ట్, తల్లీ!” అన్నాడాయన.

ఇంతలో కొన్ని ఆవులు, గిత్తలు తోలుకునిపోతూ వీండ్ల యీడు పిల్లవాడు కనబడ్డాడు. వీళ్లను చూసి ఆగాడు. మొత్తం ఏడెనిమిది పశువులున్నాయి వాడి మందలో. రెండు చిన్న లేగ దూడలు కూడా ఉన్నాయి. ఆ పిల్లవాడు తమ వెంట రాకుండా నిలబడి పోవడం చూసి, పశువులు కూడా కొద్ది దూరంలో ఆగిపోయినయి. వాడి వైపు ఎందుకు ఆగావన్నట్లుగా చూస్తున్నాయి.

“పొట్టెగా, శీకటి పడముందే మీ గూడెం చేరుకోవాలని తెలియదా, ఇంకా ఏం చేస్తుండావు?” అనడిగాడు చెన్నా.

“ఎంచేపు బోతా సిన్నాయనా, రెండు సార్లు లగెత్తినామంటే గూడెం చేరుకుంటాం” అన్నాడు వాడు. మాసిన నిక్కరు. చినిగిపోయిన బనియను. భుజం మీద ఒక గళ్ల టవలు. కాళ్లకు టైరు చెప్పులు. నల్లగా దృడంగా ఉన్నాడు. వాడి చేతిలో ఒక వెదురు పిల్లన గ్రోవి. ఇంకో చేతిలో ఒక కర్ర.

“నీ పేరేమిటి?” అనడిగాడు నచికేత వాడిని.

వాడు నోరంతా తెరిచి నవ్వుతూ “నా పేరా? లక్యా నాయక్ గదా!?” అన్నాడు వాడి పళ్లు తెల్లగా మెరిశాయి.

“వీండ్లు సుగాలోల్లు సార్. వీండ్ల గూడెం మన ఆఫీసుకు మైలున్నర ఉండాది. ‘సుగాలి మెట్ట’ అంటారు. అక్కడికి పోవడానికి అడవిలో దగ్గర దారి ఉంది.”

నిఖిల బ్యాగులోంచి కొన్ని జంతికలు, ఒక ఫైవ్ స్టార్ చాకోలెట్, ఒక మైసూర్ పాక్ తీసి వాడి చేతిలో పెట్టింది. వాడి కళ్లు మెరిశాయి.

“నీవు మంచి పిల్లవు!” అన్నాడు వాడు. థాంక్య్ అలా చెప్పాడన్నమాట.

పశువులను తీసుకుని వెళ్లబోతూంటే నచికేత అడిగాడు. “నీ ఫ్లూట్ మీద ఒక పాట వాయించవా?”

“ఇది పూలూట్ కాదు తమ్మి, ‘పిల్లగొయ్య’ -” అన్నాడు. దాని కొసను పెదవుల అంచుకు చేర్చి పట్టుకొని ఏదో పాట వేళ్లతో వాయించసాగాడు. ఆ పాట ఏదో వారికి అర్థం కాలేదు. కానీ చాలా మెలోడియస్‍గా ఉంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ అడవిలో వాడి మురళీనాదం ప్రతిధ్వనించింది. ఒక లేగ దూడ వాడి దగ్గరకొచ్చి నిలబడి పాట వినసాగింది.

వాడు ముగించగానే తన లేత నాలుకతో వాడి మోచేతిని నాకసాగింది.

 “సారూ, పిల్లకాయలూ, నేను పోతా ఇంక. ల్యాకపోతే మా కిష్టుడు ఊరుకోడు” అన్నాడు లఖియా నాయక్. శాంతిస్వరూప్ వాడికి పది రూపాయలివ్వబోతే తీసుకోలేదు. “వద్దు సార్” అన్నాడు మొహమాటంగా.

“తీసుకోరా పొట్టెగా. అంత పెద్ద సారు. ఆయప్ప గూడా మన అడవిలో పెద్ద ఆఫీసరుగా పని జేసినాడే. తీసుకో” అన్నాడు చెన్నా.

వాడు ఆ నోటు తీసుకొని నిక్కరు జేబులో పెట్టుకొని “పోయోస్తా సారు మల్ల” అని, పశువులను తోలుకుని వెళ్లిపోయాడు.

సారు పిల్లలతో “నేను చెప్పేది నోట్ చేసుకోండి” అని ఇలా చెప్పసాగాడు.

“పశువులను పోషించుకుంటూ జీవించే వృత్తి మన దేశంలో ముఖ్యమైంది పిల్లలూ! దీన్ని ఇంగ్లీషులో ‘లైవ్ స్టాక్ సెక్టార్’ అనీ, ‘యానిమల్ హజ్‌బెండ్రీ’ అనీ అంటారు. మన జి.డి.పిలో 4.86%. 2010-11 గణాంకాల ప్రకారం, దాదాపు 12,403 కోట్ల రూపాయలు పశుపోషణ వల్ల వస్తుంది. దీనిలో poultry అంటే కోళ్ల పెంపకం, పాడి పశువుల పెంపకం, ఆక్వాకల్చర్ అంటే చేపలు, రొయ్యలు పెంపకం లాంటివి కూడా భాగాలే.”

“ప్రపంచ జనాభాకు కావల్సిన ప్రోటీన్‌లో 34 శాతం, లైవ్ స్టాక్ నుండే వస్తుంది. రాసుకున్నారా?” అని కాసేపు ఆగి మళ్లీ చెప్పాడు ఆయన. “పశుపోషణ వల్ల భూసారం (soil fertility) పెరుగుతుంది. బయో డైవర్సిటీ (వాతావరణ సమతౌల్యం) పరిరక్షించబడుతుంది. లక్షలాది మంది గ్రామీణ ప్రజలకు ఉపాధి చేకూరుతుంది.”

“ఉపాధి అంటే ఏమిటంకుల్?” ఖలీల్ అడిగాడు.

“ఎంప్లాయిమెంట్.”

నచికేత అడిగాడు “అంకుల్, పశువులను పెంచడం అనే దాన్ని మొదట ఎవరు కనిపెట్టి ఉంటారు?”

“దటీజ్ ఎ గుడ్ క్వశ్చన్ మై బాయ్” అన్నాడాయన. “ప్లీజ్ నోట్ డవున్ కేర్‌ఫుల్లీ. రాబర్ట్ బేక్‌వెల్ (1725-1795) అనే బ్రిటీష్ ఆయన దీన్ని లీసెస్టర్‌‌షైర్ లోని ‘దిష్‌లే’ అనే చోట ప్రారంభించారు. మొదట గుర్రాలు, గొర్రెలు, ఆవులతో ఆయన ఈ వృత్తిని మొదలు పెట్టాడు. అందుకే ఆయనను ‘Father of Animal Breeding’ అంటారు అంటే ‘పశుపోషణకు తండ్రి లాంటి వాడ’న్నమాట.”

ఖలీల్ అడిగాడు “అంకుల్, ఇది కూడ Agriculture లో ఒక భాగం అనుకోవచ్చా?”

“తప్పకుండా భాగమే నాన్నా! జంతువుల పెంపకం ద్వారా మాంసం, ఫైబర్, పాల ఉత్పత్తులు, మనకు లభిస్తాయి. అడవుల్లో ఉండే గిరిజన గ్రామాల ప్రజలకు, పశువుల మేత (fodder)కు కొరత ఉండదు. పశువులకు కావలసిన పచ్చి గడ్డి, ఎండు గడ్డి, ఆకులు, సమృద్ధిగా దొరుకుతాయి.”

“నిజమే అంకుల్” అని పిల్లలు అంగీకరించారు.

అడవిలో మెల్లగా పగటి వెలుగు తగ్గసాగింది. పిల్లలు గట్టిగా మాట్లాడుకోసాగారు. చెన్నా వారిని నిశ్శబ్దంగా ఉండమన్నాడు. సాయంత్రం అడవి జంతువులు తమ తమ నెలవులకు (habitations) కు చేరుకుంటూ ఉంటాయని, మనం శబ్దం చేస్తే అవి డిస్టర్బ్ అవుతాయని, తన యాసలో చెప్పాడు.

అడవిలోకి కొంత దూరం నడిచారు. నేల అంతా చెమ్మగా ఉంది. మరి ముందుకు వెళ్లడానికి వీలు లేనంతగా అడవి అక్కడ దట్టంగా ఉంది.

ఇంతలో సడన్‌గా కొమ్మల మీద పక్షులు అలజడిగా అరుస్తున్నాయి. కోతులు బెదిరి కిచకిచలాడటం ప్రారంబించాయి. “మనుషుల అలికిడి వల్ల, నిశ్శబ్దానికి అలవాటు పడ్డ పక్షులు, కోతులు అలజడి చేస్తున్నాయి. అది సహజం. మీరు భయపడాల్సిన పనిలేదు చిల్డ్రన్” అన్నాడు.

చెన్నా అన్నాడు “సార్, ఇంక వెనక్కుబోదాం. చీకటి పడితే, రాత్రి పూట వేటాడే జంతువులు అంటే ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, అడవిపందులు బయటకొస్తాయి. పాతాళ కనుమలో ఏనుగులు, పులులు లేవనుకోండి!”

అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు. తెచ్చుకున్న స్నాక్స్ తింటూ నవడసాగారు. చెన్నాకు కూడా కొన్ని ఇచ్చారు. అడవిలో అప్పుడే చీకట్లు కమ్ముకున్నాయి. కాని గెస్ట్ హౌస్ దగ్గర మాత్రం ఇంకా మసక వెలుతురు ఉంది.

రాత్రికి డిన్నర్ డి.ఎఫ్.వో. గారు సేమ్యా కిచిడీ, ఆలూ పరోటాలు చేయించి పంపారు వారికి.

చెన్నా వెళ్లబోతూ చెప్పాడు “సార్ రేపు ఏడున్నర కల్లా టిపినీలు చేసి బయలెల్లుదాము. అడవికి ఉత్తరం దిక్కున నాలుగు మైళ్లు పోతే ‘కిష్టమ్మ కోన’ అనే ప్రాంతం ఉండాది. శానా రకాల వృచ్ఛాలుండాయి ఆడ. పిల్లోండ్లకు అవన్నీ సూపించవచ్చు. మల్లా భోయినం టయానికి ఎనిక్కి రావల్ల. రేపు సాయంత్రం మనకు దగ్గరలోనే ఉన్న సుంకులమ్మ దేవళానికి పోదాము. అడవిలో కొండ మీద ఉంటాది. శానా బాగుంటాది. ఆడ నుంచి ఆడవంతా బాగ కనబడతాది. కాని పైకి ఎక్కాల. మెట్లు లేవు. కొండ వాలెంబడి జాగ్రత్తగ ఎక్కకుంటా బోవాలె. మన పిల్లోండ్లు ఎక్కుతారా మల్లా? ఊతకు కట్టెలు తెస్తాను.”

పిల్లలు కొండ ఎక్కడానికి తాము ‘రడీ’ అని ఉబలాటం చూపారు.

ఎనిమిది గంటలకల్లా ప్రకృతి అంతా మాటు మణిగింది. కీచురాళ్లు రొద చేస్తున్నాయి. కప్పలు ఎక్కడో బెకబెకమని అరుస్తున్నాయి. గెస్ట్ హౌస్‌కు దగ్గరలో ఉన్న బూరుగు చెట్టు కొమ్మలకు తలక్రిందులుగా వేలాడుతున్న గబ్బిలాలు టపటప రెక్కలు కొట్టుకుంటున్నాయి. క్రీక్, క్రీక్ మంటూ ఏదో పక్షి అరుస్తూంది ఆగి ఆగి. పిల్లలు అవన్నీ వింటూ హాయిగా నిద్రబోయారు. శాంతిస్వరూప్ మాత్రం చాలా సేపు ‘జిమ్ కార్బెట్’ వ్రాసిన ‘ది మ్యాన్ ఈటింగ్ లియోపర్డ్ ఆప్ రుద్రప్రయాగ్’ అన్న పుస్తకం చదువుతూ కూర్చున్నాడు.

***

మర్నాడు ఏడుగంటల కల్లా బ్రెడ్ ఆమ్లెటు వచ్చాయి బ్రేక్‌ఫాస్టు కోసం. నచికేత బ్రాహ్మల పిల్లవాడు. తాను ఆమ్లెట్ తిననన్నాడు. అతని కోసం కార్న్‌ఫ్లేక్స్, పాలు వచ్చాయి. అందరూ సిద్ధంగా ఉన్నారు. చెన్నా కోసం ఎదురు చూస్తున్నారు.

చెన్నా వచ్చి సార్‌కు నమస్కరించాడు. “పిల్లోండ్లందరూ తొందరగానే రడీ ఐపోయినారే!” అని సంతోషించాడు. “సార్, డి.ఎఫ్.ఓ. సారు నన్ను తిట్టారండి” అన్నాడు. “సాయంత్రం సుంకులమ్మ గుట్టకు తీస్కుపోతావా వాండ్లను? నీకేమైనా ఇంగితమనేది ఉండాదా? కొండ ఎక్కే పని గదా, మధ్యాన్నానికి ఐపోతే బాగుంటాదని చెప్పినాడు సార్” అన్నాడు.

“సరే అయితే ముందు ట్రెక్కింగ్ అన్నమాట!” అన్నాడు శాంతిస్వరూప్.

జీబు దాదాపు రెండు మైళ్లు అడవి దారిలో ప్రయాణించింది. ఎదురుగ్గా ‘సుంకలమ్మ గుట్ట’ కనడుతూంది. చాలా ఎత్తుగా ఉంది. గుట్ట అంతా పెద్ద పెద్ద బండరాళ్లు. పొదలు, చెట్లతో నిండి ఉంది.

జీపులోంచి తమ బ్యాగులు తీసుకున్నారు. చెన్నా తలా ఒక ఊతకర్ర ఇచ్చాడు. అది నాలుగుడుగుల పొడువు ఉంది. పైన పట్టుకోవడానికి వీలుగా కొసన కొంచెం వంపు తిరిగి ఉంది. ఒక అంగుళం మందం ఉంది. క్రింద ఇత్తడి పొన్ను బిగించి ఉంది.

“గుట్ట మింద శానా కోతులు ఉంటాయి. మన శేతుల్లోని సంచులు పీక్కొని బాతయి. ఈ కట్టె మన దగ్గరుంది కాబట్టి అవి మన దగ్గరికి రావు. గుట్ట ఎక్కేటప్పుడు ఈ కట్టతో కింద ‘పట్టు’ (hold) చేసుకోవాల ఒక చేత్తో. ఎక్కనీకి వీలుగా మెట్ల మాదిరి తవ్వినారు కొండ జాతోల్లు. వాండ్లకు సుంకులమ్మ కుల దేవత. ప్రతి సంవత్సరం ఎండకాలంలో అమ్మవారికి తిర్నాలు (జాతర) జరుగుతాది. శానా మంది జనం వస్తారు. పదండి పోదాము” అని చెన్నా ముందుకు దారి తీశాడు.

మొదట్లో అంత కష్టం అనిపించలేదు పిల్లలకు. పది నిమిషాలు, కర్రతో పెద్దగా అవసరం లేకుండానే చకచక గుట్ట ఎక్కారు. తర్వాత గుట్ట నిలువుగా ఉంది. ఏటవాలు తక్కువగా ఉంది. ఒక చేత్తో కర్ర పట్టుకుని, దాన్ని నేల మీద గట్టిగా ఆనించి, రెండో చేత్తో, ఏదైనా కొమ్మనో, బండరాయినో పట్టుకొని ఎక్కుతున్నారు. వీళ్లకు కొంచెం ముందు, నలుగురు గిరిజనులు గుట్ట పైకి పోతున్నారు. వాళ్ల చేతుల్లో కర్రలు కూడా లేవు.

అక్కడ కూడ పిల్లల కాన్వాస్ షూస్ జారుతున్నాయి. వాళ్లను ముందుంచి, వెనక శాంతిస్వరూప్, చెన్నా ఎక్కుతున్నారు. పొరపాటున పిల్లలెవరైనా స్లిప్ అయి, పడబోయినా పట్టుకోడానికి వీలుగా.

ఒక చోట సమతలంగా ఉన్న ఒక బండరాయి ఉంది. దాని మీద పది నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. నీళ్లు తాగుదామని వాటర్ బాటిల్స్ తీయబోతూంటే చెన్నా వారిని వారించి దగ్గరలో ఉన్న ఒక వాటర్ ఫాల్‌ను చూపాడు. పక్కన ఉన్న కొండ రాళ్ల మధ్య నుంచి అడుగున్నర వెడల్పున్న జలధార పల్చగా క్రిందికి పడుతూంది. అది క్రింద ఒక చిన్న మడుగు (puddle) గా ఏర్పడింది.

అందులోని నీరు స్వచ్ఛంగా, తేటగా ఉంది. కొంచెం క్రిందికి దిగి, మడుగులోని నీటిని దోసిళ్లతో తాగారు అందరూ. చల్లగా, ఐస్ వాటర్ లాగా ఉన్నాయి నీళ్లు. తియ్యగా ఉన్నాయి. ముఖాలపై కూడ చల్లకొని కర్చీఫ్ లతో తుడుచుకున్నారు. సేద తీరి ఫ్రెష్ అయ్యారు.

మరొక అరగంట ‘ట్రెక్కింగ్’ సాగింది. వారికి కొంత అవగాహన వచ్చింది. ఒక పది నిమిషాల పాటు కేవలం కొండ రాళ్ల మీదుగానే ఎక్కారు. కొన్ని మరీ ఎత్తుగా ఉన్నాయి.

కాసేపటికి గుట్ట మీద దేవళం కనబడసాగింది. కొండరాళ్లు దాటింతర్వాత గుట్ట మళ్లీ క్రింద భాగంలో ఉన్నట్లు బాగా ఏటవాలుగా ఉంది. వారి ట్రెక్కింగ్ సులభమైంది.

మొత్తానికి పైకి చేరుకోడానికి గంటన్నర పట్టింది. పైన దాదాపు మూడు వందల చదరపు గజాల స్థలం, చదును చేసి ఉంది. చుట్టూ కొండ రాళ్లు పేర్చి, నాలుగడుగుల ఎత్తున ప్రహారీ గోడ కట్టారు. దానికి ఎర్రమన్ను చారలు, సున్నంచారలు ఒక దాని పక్కన ఒకటి పూసి ఉన్నారు. ఒక పెద్ద రావి చెట్టు ఒక మూలన ఉంది. దాని ఆకులు గలగలమని శబ్దం చేస్తున్నాయి.

అమ్మవారి గుడి చిన్నదే. రాతి కట్టడం. లోపల ప్రమిదలు వెలుగుతున్నాయి. అమ్మవారి విగ్రహం ఐదుడుగుల నల్లరాతిది. తల్లి ప్రసన్నంగా ఉంది. పెద్ద పెద్ద కళ్లు. ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో చామరం ధరించి ఉంది. క్రింద ఒక నల్లని అడుగు ఎత్తు రాయి ఉంది. పిండి రుబ్బే పొత్రంలా ఉంది. దానికి కుంకుమ, పసుపు బొట్లు పెట్టి ఉన్నాయి.

లోపల కోయ పూజారి ఉన్నాడు. అమ్మవారికి పూజ చేసి, హారతి ఇచ్చాడు. ఒక చెక్కపాత్రలో కుంకుమ, పసుపు కలిపిన మిశ్లమాన్ని అందరి నుదుట పెట్టాడు. దాన్ని ‘బండారు’ అంటారని చెన్నా చెప్పాడు. ఖలీల్ కూడ బొట్టు పెట్టింటుకుని అమ్మవారికి నమస్కరించుకున్నాడు. తల్లిదండ్రులు సంస్కారవంతులైతే, వారి పిల్లలకు లౌకిక భావన (secular spirit) అలవడుతుంది మరి.

ధర్శనం చేసుకొని బయటకి వచ్చి రాతి కాంపౌండ్ ఆనుకొని నిలబడ్డారు. దాదాపు రెండువేల మీటర్ల ఎత్తున ఉన్నామని శాంతిస్వరూప్ వారికి చెప్పాడు.

కొన్ని కిలోమీటర్ల మేర పరచుకొని ఉన్న పచ్చదనపు వైభవాన్ని చూస్తూ మైమరచిపోయారు పిల్లలు. ఇంతలో అటుకులు, బెల్లం, చింతపండు పులుసు కలిపి చేసిన ప్రసాదాన్ని పూజారి ఒక తాటాకు బుట్టలో తెచ్చి, అందరికీ తలా పిడికెడు దోసిళ్లలో వేశాడు. కళ్ల కద్దుకొని దాన్ని తిన్నారు. చాలా రుచిగా ఉంది. గుడిలో ఒక మూల చిన్న బాన ఉంది. దానికి మట్టి మూత. దాని మీద ఒక సత్తు గ్లాసు. దానిలోని నీళ్లను తాగారు.

గుట్ట మీద గాలి ఎంత విసురుగా వీస్తుందంటే మరీ బక్కగా ఉన్న వాళ్లు వడిపోయేంతగా.

“పిల్లలూ! అటు చూడండి! బాగా ఎత్తైన చెట్లు, తక్కువ ఎత్తున చెట్లకు పై కప్పులా లేవూ? వాటిని canopy (క్యానోపీ) అంటారు. నోట్ చేసుకోండి.”

పిల్లలు నోట్ బుక్స్‌లో రాసుకోవడం ప్రారంభించారు.

“అలా చెట్లకు వివిధ సైజుల్లో కిరీటాలు ఏర్పడతాయి. క్రింద ఉన్న వాటిని understories అంటారు. ఒక విధమైన horizontal layers లాగా చెట్లు ఏర్పడతాయి.”

“అన్నింటి కంటే పైన చెట్ల కొమ్మలు, వాటి కింద చిన్న చెట్లు, వాటి క్రింద పొదలు, గడ్డిగుబుర్లు, చివరగా ఔషధ మొక్కలు ఉంటాయి. జాగ్రత్తగా చూడండి.”

శాంతిస్వరూప్ తాను తెచ్చిన కెమెరాతో ‘canopy’ ని ‘horizontal layers’ ను ఫోటోలు తీయసాగాడు. నిన్న సాయంత్రం కూడ దయ్యాల గరువులోని కలబంద పొదలను, పాతాళ కనుమను, లోయను ఆయన ఫోటోలు తీశారు. కొన్ని ఆకులను, కాయలను పిల్లలను భద్రపరుచుకోమన్నాడు.

“అడవిలోని canopy వల్ల చాలా ప్రయోజాలున్నాయి మనకు. బలమైన గాలులు, తుఫాన్లు నుండి రక్షణనిస్తాయి అవి. వీటి ఎత్తు 30 నుండి 50 మీటర్ల వరకు ఉంటుంది. ఈ canopy వృక్షాలు ‘ఫోటోసింథసిస్’ అనే ప్రక్రియ ద్వారా, వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను నీటి యావిరిని, ఆక్సిజన్‌గా, సింపుల్ షుగర్స్‌గా మారుస్తాయి. ఇవి చాలా ఎత్తుగా ఉండి, ఫోటోసింథసిస్ ఉత్పత్తి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. వీటిని పళ్లు, కాయలు, విత్తనాలు, పూలు, ఆకులు విపరీతంగా కాస్తాయి. విభిన్నమైన జంతు, పక్షులను ఇవి ఆకర్షిస్తాయి.”

“ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ – కనీసం ఐదు పొరలుగా ఉంటుంది. అవి 1. ఓవర్ స్టోరీ 2. క్యానోపీ 3. అండర్ స్టోరీ 4. ష్రబ్స్ 5. ఫారెస్ట్ ఫ్లోర్.”

“యాభై నుంచి తొంభై శాతం జీవశక్తి రెయిన్ ఫారెస్ట్‌లో, వృక్షాలలోనే ఉంటుంది. క్యానోపిలోని కోట్లాది ఆకులు, చిన్న చిన్న సోలార్ ప్యానెల్స్‌గా పని చేస్తాయి. అవి సూర్యకాంతిని energy గా మారుస్తాయి. ఇది ప్రాంతీయ, అంతర్జాతీయ వాతావరణాన్ని (climate) క్రమబద్ధీకరిస్తుంది. వాతావరణంలోని ఉష్ణోగ్రత (heat), నీటి ఆవిరి (water vapor), వాయువులు (Atmospheric gases) ఇక్కడే interchange అవుతాయి.”

“‘Canopy’ తన క్రింద ఉన్న ‘understory’ ని, తీవ్రమైన సూర్యని వేడి నుండి, పొడిగాలుల నుండి, భారీ వర్ష పాతం నుండి, కాపాడి, క్రింద అడవి భాగంలోని తేమను పట్టి ఉంచుతుంది.”

పిల్లలు అంకుల్ చెప్పిన వన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు.

“సార్ పదకొండు కావస్తుంది. ఇంక క్రిందికి పోదాము” అన్నాడు చెన్నా.

దిగడం ఎక్కడం కంటే సులభం అనిపించింది పిల్లలకు. కానీ శాంతిస్వరూప్ వారిని హెచ్చరించాడు.

“చిల్డ్రన్, బీ కేర్‌ఫుల్. భూమ్యాకర్షణ శక్తి మన బాడీస్‌ని క్రిందకు లాగుతుంది. తొందరపడకుండా నెమ్మదిగా దిగాలి.”

“పడితే దిగాల్సిన పని లేకుండా డైరెక్ట్‌గా క్రిందికి వెళ్లిపోతాం అంకుల్” అన్నది నిఖిల. అందరూ నవ్వారు!

క్రిందికి చేరుకోడానికి గంటలోపే పట్టింది. గెస్ట్ హౌస్ చేరుకునే సరికి పన్నెండున్నర. లంచ్ వచ్చింది. నిమ్మకాయ పులిహోర, బంగాళాదుంపల వేపుడు, ములక్కాడల సాంబారు, పెరుగు!

చెన్నా అన్నాడు “పిల్లోండ్లూ! మా జిల్లాలో పులిహోరను చిత్రాన్నం అనీ, బంగాళదుంపలను ఉర్లగడ్డలనీ అంటారు. ములక్కాడలను మునకాయలంటారు.”

“మరి పెరుగును?” అనడిగాడు నచికేత కొంటెగా.

“పెరుగనే అంటారు!” అన్నాడు చెన్నా. మళ్లీ నవ్వులు!

శాంతిస్వరూప్ అన్నాడు “ఒక గంట మాత్రమే రెస్ట్. ఖచ్చితంగా రెండున్నరకు మనం బయలుదేరదాం. ‘కిష్టమ్మ కోన’కు వెళదాం. అక్కడ రకరకాల వృక్షజాతులను, మనం స్టడీ చేయాలి.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here