[బాలబాలికల కోసం ‘అడవి తల్లి ఒడిలో’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]
[dropcap]పా[/dropcap]వుతక్కువ మూడు గంటలకు ‘కిష్టమ్మ కోన’ బయలుదేరింది జీవు. దాదాపు ఇరవై నిమిషాలకు పైగా అడవిలోని ఒక దారిలో ప్రయాణించి ఒక చోట ఆగింది. అక్కడ అడవి బాగా దట్టంగా ఉంది. క్యానోపీతో బాటు, ఇతర వృక్ష సంతతి దగ్గర దగ్గరగా వ్యాపించి ఉంది. మహా వృక్షాలు ఠీవిగా నిలబడి ఉన్నాయి. బలమైన తీగలు వాటిని అల్లుకొని ఉన్నాయి.
వాళ్లు పాతాళ కనుమ దగ్గర చూసిన అడవికీ, ఇక్కడున్న దానికి చాలా తేడా కనిపించింది పిల్లలకు. ఖలీల్ అదే అడిగాడు అంకుల్‌ను.
“అవును మై బాయ్! వాతావరణాన్ని బట్టి అడవుల అమరికలో తేడాలుంటాయి నాన్నా! అక్కడున్న జంతువులు కూడా వేరే రకమయినవి ఉంటాయి.”
నడుచుకుంటూ అడవిలోకి వెళ్లారు. సూర్యుడు అడవిలో ప్రవేశించడానికి ఎంత ప్రయత్నం చేసినా అడవి ఆయనను తనలోకి రానివ్వడం లేదు.
“అంకుల్, ఇక్కడ అడవిలోని నేల అంతా తడితడిగా ఉంది” అన్నది నిఖిల.
“అవును తల్లీ!” అన్నాడు ఆయన. నేల నిండా ఎండుటాకులు, కుళ్లిన పుల్లలు, చివికిపోయిన పళ్లు పడి ఉన్నాయి. నేల తడిగా ఉన్నా, కొంచెం పెళ్లగించి చూస్తే లోపల వెచ్చగా ఉంది.
ఖలీల్ అన్నాడు “నచికేత్, నేల మీద నడుస్తుంటే ఒకమెత్తని కార్పెట్ మీద నడుస్తున్నట్లు లేదూ!”
“అవునురోయ్! నాకైతే ఏదో స్పాంజిలాంటి దాని మీద అడుగులు వేస్తున్నట్లు ఉంది.”
నిఖిల అరిచింది “అంకుల్. చూడండి! ఎన్ని బట్టర్‌ఫ్లైస్ ఆ పొదల మీద ఎగురుతున్నాయో?”
అందరూ అటు వెళ్లారు, వందల కొద్దీ సీతాకోక చిలుకలు మరీ ఎత్తున కాకుండా, పొదల మీద ఎగురుతున్నాయి. ప్రపంచంలోని రంగులన్నీ వాటి రెక్కల మీదే ఉన్నాయి. ఉట్టి రంగులే కాదు, రెక్కల మీద అందమైన డిజైన్లు కూడా!
“భగవంతుని సృష్టి ఎంత అందమైనదో చూశారా చిల్డ్రన్! వాటి రెక్కలు ఎంత ఆర్టిస్టిక్‌గా ఉన్నాయో చూడండి. వాటిల్లో కూడ ఎన్ని రకాలు వున్నాయో చూడండి” అన్నాడు శాంతిస్వరూప్.
“నోట్ చేసుకోండి! సీతాకోక చిలుకలు జీవితంలో నాలుగు పరిణామాలున్నాయి. గుడ్డుదశ (egg), లార్వా (caterpillar), ప్యూపా (క్రైసాలిస్), ఇమాగో (సీతాకోక చిలుక). ఇవి పగటి పూటనే చురుగ్గా ఉంటాయి. దాని శరీరంలో మూడు భాగాలుంటాయి. అవి తల (head), రొమ్ము(thorax), పొట్ట భాగం (Abdomen) దీన్ని tail end అని కూడా అంటారు.”
“అవి మాటిమాటికి మొక్కల మీద పువ్వులపై ఎందుకు వాలుతున్నాయి అంకుల్?” నచికేత ప్రశ్న.
“వాటికి రుచి, వాసన, స్పర్శ తెలుసుకునే జ్ఞానేంద్రియాలు (receptors), వాటి కాళ్లలో ఉంటాయి. అవి తమ కెమోరిసెప్టార్స్ (chemoreceptors) ద్వారా, పువ్వుల మీద వాలినపుడు రకరకాల కెమికల్స్‌ను గ్రహిస్తాయి.”
“అవి ఎక్కువ ఎత్తుకు ఎగరలేవా?”
“అ ఎగరడానికి కనీసం 30 డిగ్రీల ఉష్టోగ్రత వాటి శరీరానికి అవసరం. అతి చల్లని వాతావరణంలో అవి ఎగరలేవు.”
“ఆ ఉష్ణోగ్రత వాటికి ఎలా లభిస్తుంది అంకుల్?”
“గుడ్ క్వశ్చన్, నిఖిల తల్లీ! బాగా ఎండ కాస్తున్నపుడు అవి తమ రెక్కలను బాగా విప్పుకొని, ఎండలో కాచుకుంటాయి. ఇంకో విషయం వాటి రెక్కలు చూడండి. అవి పారదర్శకంగా లేవు? (transparent). అవి అహారాన్ని తినలేవు. ప్రోబోస్కిస్ (proboscis) అనే చిన్న తొండం లాంటి అవయవం ద్వారా పూలలోని మకరందాన్ని (nectar), బురద నీటి కుంటల మీద, కుళ్లిపోయిన పళ్లమీద, చనిపోయిన జంతువుల కళేబరాల మీద రసాలను (juices) పీల్చుకుంటాయి.”
“కళేబరాలంటే డెడ్ బాడీసా అంకుల్.”
“అవును. కాని సంస్కృతంలో కళేబరం మంటే కేవలం శరీరమనే అర్థం.”
నచికేత ఉత్సాహంగా అన్నాడు “అంకుల్, మా అమ్మ సంగీతం నేర్పుతుంది. ‘చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ’ అన్న కీర్తనను క్రిష్టుని మీద రోజూ పాడుతుంది.”
“గుడ్! మరి నీవు పాడగలవా?”
“నాకు కొంచెం వచ్చు అంకుల్” అన్నాడు సిగ్గు పడుతూ.
“ఏదీ పాడు, విందాం.”
“మొన్న వినాయక చవితి ఉత్సవాల్లో ఈ పాట నేర్చుకొని పాడాను అంకుల్. నాకు థర్డ్ ప్రైజ్ ఇచ్చారు. ఒక డిక్షనరీ.” అని చెప్పి .
“జయజయ శుభకర వినాయకా, శ్రీకాణిపాక వరసద్ధి వినాయక” అన్న సినిమా పాటను పాడాడు నచికేత. అందరూ చప్పట్లు కొట్టి ఆ పిల్లవాడిని అభినందించారు.
చెన్నా, “నీ పాసుగూల, నీవు గట్టోనివి పిల్లోడా! ఎంత బాగా పాడ్తివి దేవుని పాట” అని మెచ్చుకున్నాడు.
తర్వాత మరి కొంచెంలోపలికి వెళ్లారు. పెద్ద పెద్ద చెట్ల కాండాల మీద ఉన్న బెరడుల మీద రకరకాల కీటకాలు, సాలెపురుగులు, ఉడుతలు, చీమలు, కందిరీగలు కనబడినాయి. వాటిని ఫోటోలు తీశాడు శాంతిస్వరూప్.
“పిల్లలూ, చెట్ల బెరడులపై మనం చూస్తూన్న రకరకాల కీటకాల పేర్లు నోట్ చేసుకోండి!” అని వారికి చెప్పాడు.
చెన్నా చెప్పాడు “సార్, పోయిన సంవత్సరం ఇక్కడ ఒక పేపరు మిల్లు కట్టాలని, అడవినంతా నరికి చదును చేయాలని, కర్నాటక నుంచి సిద్దరామప్ప అనే ఒక పెద్దాయన అలివిమాలిన ప్రయత్నం చేసినాడు. ఇక్కడున్న సుగాలీలు, కొండజాతి వాళ్లు, ఆత్మకూరు నుంచి త్రిపురాంతకం వరకు ఫాక్టరీ పెట్టడానికి వీలు లేదని పెద్ద స్ట్రయిక్ చేసినారు సార్. గవర్నమెంటు కూడ దానికి పర్మిసను ఇయ్యాల్యా.”
ఖలీల్ అడిగాడు “ఇంత పెద్ద అడవి కదా అంకుల్! దాంట్లో కొంత నరికేసి ఫ్యాక్టరీ పెడితే ఏం? చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి కదా!”
“అదే తప్పురా నాన్నా! మీకు ఆటోట్రాఫ్స్, హెటిరోట్రాఫ్స్, శాప్రోటాఫ్స్ గురించి చెప్పాలి. నోటి చేసుకోండి”
“పచ్చని చెట్లు అందరికీ ఆహారాన్ని ఇస్తాయి. ఆటోట్రాఫ్స్, కిరణజన్య సంయోగక్రియ ద్వారా (photosynthesis) తమ ఆహారాన్ని తామే సంపాదించుకొనే జీవులు. హెటిరోట్రఫ్స్ తమ ఆహారం స్వంతంగా సంపాదించుకోలేవు. ఆటోట్రాఫ్స్ మీద ఆధారపడతాయి. మొదటివి పచ్చని మొక్కలు, బాక్టిరియా. రెండవ రకం జంతువులు. పుట్టగొడుగులు కూడ ఆటోట్రాఫ్స్. కాని అవి photosynthesis ద్వారా ఆహారం పొందలేవు. ఆర్గానిక్ మ్యాటర్ (సేంద్రియ పదార్ధాల) ద్వారా తిండినిపొందుతాయి.”
“పుట్టగొడుగులు అంటే?”
“మష్‌రూమ్స్ (mushrooms)”
“అవి మన రైతు బజారులో అమ్ముతారు. అవి మనం తినకూడదంటారు మా నాన్న.” అన్నాడు నచికేత.
“లక్షణంగా తినచ్చు. అవి శీలీంధ్ర జాతివి. శాకాహరం క్రిందికే వస్తాయని సైన్సు చెబుతుంది.”
“హెటిరోట్రాఫ్స్‌ను కన్యూమర్స్ (consumers) అని కూడ అంటారు పిల్లలూ! ఆవులు హెర్బివోర్స్. అంటే మొక్కలే వాటికి ఆహారం. కార్నివోర్స్ కేవలం ఇతర జంతువులను తింటాయి. పాములు, పులులు, నక్కలు, సింహాలు, తోడోళ్లు లాంటవి”
నచికేత అన్నాడు “ఏనుగు వెజిటేరియన్ కదా అంకుల్! అంటే హెర్బివోర్స్.”
“నీలాగే” అన్నాడు ఖలీల్. అందరూ నవ్వారు.
“ఆగండి, మష్‌రూమ్స్ రెండు రకాలు. అందులో edible mushroom లనే మనం తినాలి. కొన్ని విషపూరితంగా ఉంటాయి. ”
“అంకుల్, మరి శాఫ్రోటాప్స్ అంటే చెప్పలేదు?”
“అక్కడికే వస్తున్నా తల్లీ! అవి నిర్జీవమైన, ‘డెట్రిటస్’ అనే organic మ్యాటర్ తిని జీవిస్తాయి. ‘శాప్రో’ అంటే గ్రీకు భాషలో ‘కుళ్ళిన’ అని అర్ధం. ఇవి డీకంపోజిషన్, చేస్తాయి. న్యూట్రియంట్ సైకిలింగ్ చేస్తాయి. కుళ్లిన మొక్కలు, పండ్లు, జంతువుల శవాలలోని ఆహారాన్ని ఇవి తీసుకుంటాయి. వీటిని మైక్రోస్కోప్ ద్వారానే మనం చూడగలం. శాప్రోటోఫ్ విసర్జించే రకరకాల ఎంజైమ్స్ ద్వారా ఈ ఆహరం డైరెక్ట్‌గా జీర్ణం అవుతుంది.”
“వాటిలో ఫంగీ (fungi), అడవి నేల మీది ఫంగీ, హెర్బివోర్స్ వేసే పేడ ద్వారా కూడ జీవిస్తాయి.”
“ఇలా ఒక ఫుడ్ చెయిన్ ప్రకృతిలో ఏర్పడింది. గడ్డి – పురుగులు/కీటకాలు, – కప్ప – పాము, గద్ద – అలా ఒక దాన్ని ఇంకో దానికి ఆహారంగా ఏర్పాటు చేశాడు భగవంతుడు.”
“అడవిలో ప్రతి భాగం ఇంకో భాగం మీద ఆధారపడి ఉంటుంది. ఒక భాగం తొలిగిస్తే, వేరే భాగాలు దెబ్బతింటాయి. ఒక విషయం చెప్పండి. పులి మంచిదా, జింక మంచిదా?”
“జింకే మంచిది!”
“ఎందుకు?”
“పాపం అది ఎవరికీ హాని చేయదు కదా అంకుల్. కాని పులి వేటాడి దాన్ని చంపి తింటుంది కదా.”
శాంతిస్వరూప్ నవ్వాడు. “మాములుగా ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. మరి పులులు చెడ్డవి కదా, ప్రభుత్వం, అటవీ శాఖ, వాటిని సంరక్షించడానికి అభయారణ్యాలు ఎందుకు ఏర్పాటు చేసింది?”
పిల్లలు మౌనం!
“అడవిలోని జింకలు దానికి దేవుడిచ్చిన ఆహారం చిల్డ్రన్. పులులు జింకల్ని వేటాడి, చంపి తినడం వాటి జీవన ధర్మం. అలా చేయకపోతే అడవిలో జింకలు, దుప్పుల లాంటి జనాభా విపరీతంగా పెరిగిపోయి. అడవుల్లో వాటికి ఆహారం సరిపోక, ఊర్లలో పొలాల మీదికి వచ్చి పంటలను తినేస్తాయి. అడవి మృగాలకు ఇల్లు లాంటిది అడవి. ఇదంతా balance of ecology క్రిందికి వస్తుంది. ప్రకృతి తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడమే ఈ ఫుడ్ చెయిన్. ఖలీల్, ఇప్పుడు చెప్పు అడవులు నరికి ఫ్యాక్టరీలు కట్టవచ్చా?”
ఖలీల్ మనస్ఫూర్తిగా అన్నాడు “సారీ అంకుల్! అది చాలా తప్పని తెలుసుకున్నాను.”
“గుడ్! దటీజ్ ది స్పిరిట్!” అన్నాడాయన. “చిల్డ్రన్, మీ బ్యాగుల్లోచి లెన్స్‌లు (భూతద్దాలు) తీయండి. నేల మీద ఉన్న ఎండుటాకులు, పుల్లలు, చివికిన పండ్లు, చనిపోయిన కీటకాలను అందులోంచి చూడండి. ఏం కనబడతాయో చెప్పండి.”
పిల్లలు భూతద్దాలలోంచి చూస్తే కొన్ని శిలీంధ్రాలు కనబడ్డాయి. ఆకుల మీద ఎన్నో సూక్ష్మజీవులు కూడా. వాటిని గురించి అంకుల్ చెప్పారు.
“లెన్స్ కొంత వరకే పని చేస్తాయి. మైక్రోస్కోప్ ద్వారా అయితే ఇంకా స్పష్టంగా కనబడతాయి. కుళ్లిపోయిన మొక్కలు, కళేబరాలులోని టిష్యూస్ (tissues) వాటికాహారం. వాటిని డార్క్ కలర్‌లో ఉంటే humus (హ్యూమస్) అనే పదార్ధంగా అవి మారుస్తాయి. దీనిలో అరవై శాతం కార్బన్, ఆరు శాతం నైట్రోజన్, తక్కువ పరిమాణంలో ఫాస్ఫరస్, సల్ఫర్ ఉంటాయి. ఇది భూమిపై భాగంలో కొన్ని అంగుళాలు పేరుకొని ఉంటుంది. మొత్తగా స్పాంజిలాగా ఉండి గోధుమరంగు లేదా నల్ల రంగులో ఉంటుంది. ఇది మొక్కల, చెట్ల పెరుగుదలకు ప్రాణాధారం. భూమిని ఎంతో సారవంతంగా మార్చగలదు. అడవుల్లోని భూమి మంచి హ్యూమస్‌తో నిండి ఉంటుంది. కాని తీర ప్రాంతాల్లో, అడవులేని ప్రాంతాల్లో, ఇది చాలా తక్కువగా ఉంటుంది. మన పెరళ్లలో పడిన ఆకులు, కాయలు, పుల్లలు లాంటి వాటిని సహజంగా కుళ్లచేయడం ద్వారా, మన పెరటి లేదా, డాబా మీది మొక్కలకు మనం దీన్ని సమకూర్చుకోవచ్చు.”
“దీని వల్ల కుళ్లిన మొక్కల భాగాలు, జంతువుల శవాలలోని న్యూట్రియంట్స్ భూమిలోకి వెళతాయి. చెట్లు తమ వేర్ల ద్వారా వాటిని గ్రహిస్తాయి. చిన్న జంతువులు రాబందులకు, నక్కలకు కాకులకు, ఇతర కీటకాలకు ఆహారం.”
చెన్నా అన్నాడు “సారు, ఎలుగు తగ్గిపోబట్నాది. ఇంక ఎనికుపోవడం మంచిది.”
అందరూ తిరుగు ప్రయాణం అయినారు. వచ్చేటప్పుడు దారి వెంట అక్కడక్కడ వరిపిండిని చల్లుకుంటా వచ్చాడు చెన్నా. దాని వల్ల దారి కనుకోవడం సులభమైంది వారికి. జీపు దగ్గరికి వారు చేరుకునే సరికి ఐదయింది. గెస్ట్ హౌస్ చేరుకుని రెస్ట్ తీసుకున్నారు. రాత్రి డిన్నర్ వారికి డి.ఎఫ్.వో గారు జొన్నరొట్టెలు, అనపకాయ కుర్మా, పెరుగన్నం పంపారు.
***
మర్నాడు ఏడు గంటలకన్నా చెన్నకేశవులు వచ్చేశాడు.
“నిన్న రాత్రి, ఈయల అడవిలోన ఎక్కడకెల్లాలో డి.ఎఫ్.ఓ సారు చెప్పలేదు సార్. పొద్దన్నే ఆయన కాడికిపోయి మాట్లాడి వచ్చినా” అన్నాడు.
“ఇంతకూ ఎక్కడికని నిర్ణయించాడు మా పట్నాయక్?” అనడిగాడు శాంతిస్వరూప్.
“ఇయాల మనం శానా దూరం ఎల్లాల సారు. ఆత్మకూరు – దోర్ణాల మధ్యలో బావనాశివనమని ఉండాది. మన గెస్ట్ హౌస్ నుండి సుమారు గంటన్నర ప్రయానం. మొయిన్ రోడ్డు మీది నుంచి మల్లా ఏడెనిమిది మైల్లంటాది. మనం యిప్పుడు గీన(గనుక) ఇక్కడ్నించి ఇడిస్తే(బయలుదేరితే) పది కల్లా ఆడుంటాము సారు”
“సరే టిఫిన్ చేసి బయలు దేరదాం చెన్నా.”
టిఫిన్ ఆ రోజు కారం దోసెలు. నెయ్యితో పోశారేమో ఘుమ ఘుమలాడుతాన్నాయి. నంచుకోవడానికి బొంబాయి చెట్నీ. అది పలుచగా పొగలు కక్కుతూంది. టిఫిన్ రెండు హాట్ ప్యాకుల్లో. ఒక ప్లాస్కులో కాఫీ వచ్చాయి.
కారం, కారం, అంటూనే, మధ్య మధ్య నీళ్లు తాగుతూ “ఫూ, ఫూ” అని అనుకుంటూ దోసెలు తిన్నారు పిల్లలు.
“బాగున్నాయి అంకుల్!” అన్నారు.
“ఈ నేతి కారం దోసెలు రాయలసీమ స్పెషల్! మన హైదరాబాద్‌లో కూడ ‘ఘీ కారం దోసె’ అని రెస్టారంట్లలో అమ్ముతారు గాని అవి నా మొహంలా ఉంటాయి” అన్నాడు శాంతిస్వరూప్.
“మీ మోకానికేమండి? అచ్చం కిస్నంరాజు మాదిరుంటే!” అన్నాడు చెన్నా నవ్వుతూ.
“నా మీదే జోకులేస్తున్నావా చెన్నకేశవులూ!” అన్నాడాయన సీరియస్‌గా.
చెన్నా లబలబలాడుతూ “సారూ, ఛమించండి! పుసుక్కున నోరు జారింది. తమరు..” అంటూ ఏదో చెప్పబోతుంటే, గలగలా నవ్వేశాడు శాంతిస్వరూప్.
“ఊరికే అన్నానులే. నాకేం కోపం లేదు. అయినా నా ముఖం కృష్ణంరాజు ముఖంలా ఉందన్నావుగాని, తప్పుగా ఏం అనలేదుగా!”
చెన్నాను ఆటపట్టించినందుకు పిల్లలు హాయిగా నవ్వుకున్నారు.
“హి ఈజ్ యాన్ ఇన్నోసెంట్ గై. రస్టిక్ అవుట్ స్పోకెనెస్ ఈజ్ హిజ్ వర్చ్యూ. ఐలైక్ హిమ్” అన్నాడాయన పిల్లలతో.
“వుయ్ టూ అంకుల్! జస్ట్ ఫర్ ఫన్! మాకు తెలుసు.”
చెన్నా అన్నడు “సార్, నా మీద మీకు ఇంకా కోపం తగ్గినట్లులేదు. ఇంగిలీసులో పిల్లలతో యాదో సెపుతాండారు.”
“లేదు చెన్నా అంకుల్, నీవు అమాయకుడివనీ, నీవంటే తన కిష్టమనీ చెప్పారు. అంతే” అన్నది నిఖిల. టిఫిన్ కాక ఇంకో హాట్ కేస్ వచ్చింది. ఒక చిన్న స్టీలు క్యాన్ కూడా. అవన్నీ తెచ్చిన తను చెప్పాడు. “సార్, మధ్యాహ్నం లంచ్‌కు నెనక్కు వస్తే టైం చాలదని, డి.ఎప్.ఓ సారు మీకు వెజిటబుల్ పలావ్, రైతా పంపించారు సర్. మిమ్మల్ని సాయంత్రం ఆరుగంటలక్కలా తిరిగి వచ్చేయిమని చెప్పారు.”
“వండర్‌పుల్! చిల్డ్రన్, చూశారా మా నవీన్ హాస్పిటాలిటీ ఎంత ప్లాన్‌డ్‌గా ఉందో!” అన్నడాయన.
“నవీన్ సారు ఆస్పిటల్‌కు ఎందుకు బోయినాడు సార్, పొద్దున బెమ్మాండంగా ఉన్న మనిషి!” అన్నాడు చెన్నా ఆందోళనగా.
“హాస్పిటాలిటీ అంటే వచ్చిన అతిథులకు అన్నీ సమకూర్చడం రా తండ్రీ” అన్నాడు శాంతిస్వరూప్.
చెన్నా తన బట్ట నెత్తిని బరబరా గీరుకున్నాడు.
పిల్లలందరూ మళ్లీ నవ్వారు.
జీపు మెయిన్ రోడ్ ఎక్కి, దోర్ణాల వైపు పరుగులు తీయసాగింది. వాతావరణం హాయిగా ఉంది. ఎండ కాస్తూంది. కాని దానిలో తీవ్రత లేదు. రెండు వైపులా కనుచుపు మేరంతా అడవి. ఎత్తైన కొండలు. కొండల్లోంచి జాలువారుతున్న నీటి ధారలు. కొండల నిండా పచ్చదనం పరిమళిస్తున్న చెట్లు.
“గాలిలో ఒక కమ్మని సువాసన వస్తుంది గమనించినారా, మై చిల్డ్రన్!” అన్నాడాయన. బెంగుళుర్ హైవేలాగా రోడ్డు మధ్య డివైడర్ లేదు గాని, రోడ్డు విశాలంగానే ఉంది. విజయవాడ, గుంటూరుల నుండి కర్నూలుకు వస్తున్న సూపర్ లగ్జరీ, ఎ.సి.వోల్వో బస్సులు, ఆర్.టి.సి వారివి, ప్రయవేటు వారివి ఎదురుగా వస్తున్నాయి.
ఒక చోట పెద్ద చెక్‌పోస్ట్ తగిలింది. వాహనాలను తనిఖీచేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది. వీళ్ల జీపును ఆపారు. రోడ్డు కడ్డంగా ఒక పెద్ద, లావుగా ఉన్న కర్రను పెట్టారు.దానికి చివర ఒక పెద్దరాయిని కట్టారు. ఆ రాయి బరువుకు అది కరెక్ట్‌గా ఈ చివరనున్న యు ఆ కారంలోని ఒక పోస్ట్ పై వచ్చి సెట్ అవుతుంది. అటు వైపు పోస్ట్‌కు ఒక లివర్ లాంటిది ఉంది. దాన్ని రిలీజ్ చేస్తే, కర్ర రాయితో పాటు గాలిలోకి లేచి, వాహనాలకు దారి ఇస్తుంది.
(ఇంకా ఉంది)