అధ్యాపకుని అగచాట్లు

4
11

[డా. చెంగల్వ రామలక్ష్మి రచించిన ‘అధ్యాపకుని అగచాట్లు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]వే[/dropcap]సవి వచ్చింది. మల్లెల పరిమళాలు తెచ్చింది. రసాల మామిళ్ళనూ తెచ్చింది. కొత్త ఆవకాయ ఘాటు రుచులను తెచ్చింది. అధ్యాపకులకు అగచాట్లను తెచ్చింది.

“మన కాలేజీలో ముప్పైమంది లెక్చరర్లు ఉన్నారు. ఒక్కొక్కరు పదిమందికి తక్కువ కాకుండా, ఇంటర్, డిగ్రీ లలో పిల్లలను చేర్పించాలి. మొక్కుబడిగా చేయకండి. ఇది మనందరి సంస్థ అనే అంకిత భావంతో చేస్తే ఎందుకు రారండీ పిల్లలు? విద్యార్థులు పెరిగి లాభాలు వస్తే మీకూ బాగుంటుంది కదా! రేపటినుంచే ఇంటింటికీ వెళ్లి, అడిగి పిల్లలను చేర్పించండి. ఎవరెవరు ఏ ఏ ప్రదేశాలకు వెళ్లాలో ప్రిన్సిపాల్ గారు చెపుతారు. ఆ విధంగా చేయండి. ప్రతిరోజూ కాలేజీకి వచ్చి సంతకం చేసి వెళ్ళండి.

మీ సర్వే ఫలితాలను ప్రిన్సిపాల్ గారికి రోజు విడిచి రోజు కాలేజీకి వచ్చి చెప్పి వెళ్ళండి. మధ్యాహ్నం ఒంటిగంట దాకా చేసి ఇంటికి వెళ్ళిపోయి, సాయంత్రం నాలుగింటి నుంచి చేయండి. ఇవాళ 15 తేదీ. 30వ తేదీ వరకూ ఈ పని మీదే ఉండండి. ఈ 15 రోజులలో ఎవరూ సెలవలు అడగకండి” ఆజ్ఞాపిస్తున్నట్లు అని డైరెక్టర్ రంజిత్ బైటకు నడిచాడు. స్టాఫ్ మీటింగ్ ముగిసింది.

లెక్చరర్లు ఒక్కొక్కరి నుంచి ఒక్కోవిధంగా అసంతృప్తి వెల్లువలా వ్యక్తం అవుతోంది. ‘ఇవాళ్టి దాకా ఎక్కడెక్కడి కాలేజీలవో నెంబర్లు తెచ్చి ఫోన్లు చేయించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ముప్పయి మందికి చేస్తే ముగ్గురో, ఇద్దరో ఆలోచిస్తాం, కాలేజీకి వచ్చి మాట్లాడతాం అనే వారుంటారు. మిగతావన్నీ తిరస్కారాలు, అవమానాలే! ఏం ఉద్యోగాలు ఇవి. విద్యార్థులకు లెక్చరర్లంటే గౌరవం లేదు. మేనేజ్మెంట్‌కి మనమంటే లోకువే! రేపటినుంచి ఇంకో అవమానాల పర్వం మొదలు,’ ఇలా ఒకరితో మరొకరు గోడు వెళ్ళబోసుకుంటూ ఇంటి ముఖం పట్టారు.

అరవయ్యేళ్ళ వాసుదేవ రావు గారు మర్నాడు తొమ్మిదింటికంతా ప్రిన్సిపాల్ రూంకి వెళ్లారు. ప్రిన్సిపాల్ గారు “వయసు రీత్యా నైనా మిమ్మల్ని ఈ డ్యూటీ నుంచి తప్పించమని సార్‌తో చెప్పాను. కాని రూల్స్ అందరికీ ఒకటే అన్నారు” అంటూ కొంచెం బాధగా ముఖం పెట్టి, ఆయన వెళ్ళవలసిన ఊరు చెప్పి విద్యార్థుల లిస్టు ఇచ్చారు. వాసు గారు ప్రిన్సిపాల్ గారికి తనమీద ఉన్న సుహృద్భావానికి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరారు. చుట్టు పక్కల చిన్న చిన్న ఊళ్లు ఒక్కొక్కరికి ఒక్కోటి ఇచ్చారు.

ఉదయం తొమ్మిదింటికే ఎండ మండిపోతోంది. అయినా, వాహనాల మీద వెళ్లేవారు, నడిచే వారితో రోడ్లు రద్దీ గానే ఉన్నాయి. అందరూ హడావిడిగా పరుగులు పెడుతూనే ఉన్నారు. ఎవరి తొందరలో వారు పక్క వారిని దాటివెళ్ళిపోవాలనే తాపత్రయం! వాసుదేవ రావు వాహనాలను తప్పించుకుంటూ జాగ్రత్తగా నడుస్తున్నాడు. ఆయనకు వాహనం ఏమీ లేదు. ఆయనకు కేటాయించిన ప్రదేశానికి బస్సు లోనే వెళ్ళాలి.

బస్సు జనంతో కిటకిట లాడిపోతోంది. తరవాతది ఖాళీగా వుంటుందని చెప్పలేం. ఒంటిగంట లోపు ముగించుకోవాలి. కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి. వాసుదేవ రావు బస్సు ఎక్కేసాడు. అరగంట ప్రయాణం. నిల్చునే చేసాడు. పెద్దవాళ్ళు నిల్చుంటే, కూర్చున్న చిన్నవాళ్లు సీటు ఇవ్వటం అనే గౌరవ పద్ధతి సమాజంలో చాలా వరకు తగ్గిపోయింది.

వాసుదేవ రావు గమ్య స్థానానికి చేరాడు. భార్య గొడుగు తీసుకువెళ్ళమంది. ఆయనే ఇంటింటికి మూస్తూ, తెరుస్తూ విసుగ్గా వుంటుందని తేలేదు. ఎండ ఆ చెవి నుంచి ఈ చెవిలోకి కొడుతోంది. అందరి ఇళ్ల తలుపులు వేసి ఉన్నాయి. ఏ.సి. గదుల్లో హాయిగా కూర్చుని ఉంటారు అనుకున్నాడు వాసుదేవ రావు.

ఇంటి నెంబర్ చూసుకుంటూ ఒక ఇంటి ముందు నిలబడి కాలింగ్ బెల్ మోగించాడు. తనకంటే పెద్దాయన తలుపు తీసి ఏమిటన్నట్లు చూసాడు. వాసుదేవ రావు తమ కాలేజీ గురించి చెప్పబోతుంటే “ఓహో, కాలేజీ నుంచా, మా మనవరాలిని హైదరాబాద్‌లో చేర్చామండి. ఎండలో వచ్చారు. మంచి నీళ్లు తాగుతారా” అనడిగాడు. వాసుదేవ రావు వద్దని థాంక్స్ చెప్పి బైటకు నడిచాడు.

ఇంకో ఇంటికి వెళితే “మా పిల్లకి డిగ్రీ అయిపోయి పెళ్లయిపొయిందండీ. ఈ నెంబర్ మీ కెలా వచ్చింది?” అంటూ ఆరా తీసిందా ఇల్లాలు. ఆవిడకో దణ్ణం పెట్టి వేరే ఇంటికి వెళ్ళేటప్పటికి తలుపు విసురుగా తీసి “ఎంత మంది వస్తారు? ఎన్ని సార్లు వస్తారు? మా ఇంట్లో చదువుకునే పిల్లలు లేరు. ఇంకెప్పుడూ ఈ గుమ్మం లోకి రాకు” అంటూ ఏకవచన సంభోదనతో తిరస్కారంగా చూసి ముఖం మీద తలుపు దడాలున వేసుకుంది.

మరో ఇంటి గుమ్మం ఎక్కుతుంటే కిటికీలో నించి చూసిన వ్యక్తి “ఇంట్లో ఎవరూ లేరని చెప్పు” అంటున్నాడు. వాసుదేవ రావుకు ‘తనెవరు అసలు’ అని తన మీద తనకే సందేహం కలిగింది.

ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం. ఒక్కరూ చేరట్లేదు. అసలు కాలేజీ గురించి చెప్పనివ్వట్లేదు. ఎలా? ఆలోచిస్తూ వాసుదేవ రావు ఈ పూటకి ఇదే ఆఖరి ఇల్లు. ఇంక తిరగలేను, అనుకుంటూ తలుపు తట్టాడు.

ఒక మధ్య వయస్కుడు తలుపు తీసి నవ్వు ముఖంతో చూసాడు. వాసుదేవ రావు కాలేజీ గురించి చెప్పబోతుంటే “లోపలికి రండి. ఎండలో వచ్చారు” అంటూ ఆహ్వానించాడు. వాసుదేవ రావు ఇంకా మనుషుల్లో మనిషితనం మిగిలివుంది అనుకుంటూ లోపలికి వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. హాల్లో కూడా ఏ.సి. ఉంది. చల్లగాలి శరీరాన్ని సేద తీర్చింది. ఆయన భార్య చల్లని మజ్జిగ తెచ్చి ఇచ్చింది. వాసుదేవ రావు కాలేజీ గురించి, కోర్సుల గురించి, కాలేజీ గొప్పదనాన్ని గురించి, లెక్చరర్ల అంకిత భావం గురించి ఉత్సాహంగా చెప్పాడు. పొద్దుటినుంచి ఎన్ని ఇళ్ళు తిరిగినా ఒక్క చోట గూడా చెప్పే అవకాశమే ఇవ్వలేదు. వీళ్ళే ఇంత ప్రేమగా పిలిచి కూర్చోబెట్టి విన్నది. ఒక్క అడ్మిషన్ అయినా చేయించగలిగితే బాగుండును అనుకుంటూ వాసుదేవ రావు “మీ అమ్మాయిని మా కాలేజీలో చేర్పించండి సర్. చాలా బాగుంటుంది”, అన్నాడు.

“మాస్టారూ, మీరు ఇంత ఎండలో వస్తే చూడలేక లోపలికి పిలిచి కాసేపు మాట్లాడాను. మాకు పిల్లల్లేరు. ఇది మా తమ్ముడి కూతురు పేరు. నా నెంబర్ మీకు ఎలా వచ్చిందో తెలియట్లేదు. మా తమ్ముడు ఈ మధ్యే ట్రాన్స్‌ఫర్ అయి అనంతపురంలో ఉంటున్నాడు. అక్కడే అమ్మాయిని చేర్పించాడు. సారీ, మిమ్మల్ని నిరుత్సాహ పరచాలని కాదు పిలిచింది. మీరు ఇందాక పక్క సందులో ఇంటికి వెళ్ళినప్పుడు మీ ముఖం మీద తలుపు వేయటం చూసాను. బాధగా అనిపించింది. అయితే పూర్తిగా వాళ్ళ తప్పు కూడా అనుకోవటానికి లేదు. ఈ అడ్మిషన్ల టైమ్‌లో ఎంత మంది వస్తున్నారో లెక్క లేదు. సమాధానం చెప్పలేక విసుగుని అలా చూపిస్తున్నారు. మీరు మా నాన్నగారిలా ఉన్నారు. పిలిచి కాసేపు కూర్చోమన్నాను”, అన్నాడు ఆ వ్యక్తి.

వాసుదేవ రావు వాళ్లకు కృతజ్ఞత చెప్పి, కాసేపు చల్లగా కూర్చోవటం వల్ల శక్తి పుంజుకుని రోడ్డు మీదకి వచ్చి బస్టాండ్ వైపు నడిచాడు. మొదటిరోజు సర్వే ఫలితాన్ని మాత్రం ఒంటిగంటకు వచ్చి చెప్పాలన్నారు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలి. ఇవాళ సాధించిన విజయాలు చెప్పాలి. కానీ.. ఏం చెప్పాలి? అసలు ఏం చెప్పగలడు? మొదటి రోజు ఇలా అయింది. ఈ 15 రోజులలో కనీసం నలుగురినైనా చేర్చగలడా! తనకి పాఠం చెప్పటం తప్ప ఇంకేమీ రాదు. అయినా, కొత్త విధానాలకి అలవాటు పడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

“కనీసం నాలుగు అడ్మిషన్స్ అయినా చేయించకపోతే సమ్మర్ సాలరీ సగమే వస్తుంది. పది మంది విద్యార్థులను చేర్పించలేకపోతే అసలు ఇంక్రిమెంట్ ఉండదు” అన్న డైరెక్టర్ మాటలు చెవుల్లో రింగు మంటూ రోహిణి కార్తె సూర్యుని వేడి తీవ్రత కన్నా ఎక్కువగా ఉంది. చెమటలు దిగకారిపోతున్నాయి.

ఇప్పటికే నాలుగేళ్ల నుండి ఈ బాధలు పడుతున్నాడు.

సమ్మర్ జీతం వస్తుందో, లేదో తెలియని భయాందోళనలు,

పెరిగే ఖర్చులు, పిల్లల బాధ్యతలు ఒక్కసారి మనసును కమ్మేసాయి.

బస్సులో కిటికి దగ్గర కూర్చున్న వాసుదేవ రావుకు ఎండ ఈ చెవిలోంచి ఆ చెవి లోకి కొడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here