అదిగదిగో అయోధ్య!

0
9

[dropcap]ఇ[/dropcap]న్నాళ్ళకు వదిలిందా
జాతి మొద్దునిద్ర..
ఈనాటికి నిలబడిందా అయోధ్య ముద్ర..!

రాముడు పుట్టిన చోట
రామాలయానికి ఎంత కష్టం
అదయింది ఎంత క్లిష్టం..
నువ్వు పుట్టిన చోటు
నీకు తెలుసు..
అది చూపేందుకు నీకో కార్డు..
రామయ్య పుట్టిన చోటూ
నీకు తెలుసు..
కాని..ఆ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు
ఇన్నాళ్లు ఏదీ రికార్డు..
అందుకోసం
ఎన్ని అగచాట్లు..
కోర్టు కేసులు..
వాదోపవాదాలు..
పత్రాలు..ఆధారాలు..
మధ్యలో తవ్వకాలు..
చారిత్రక సాక్ష్యాలు
ఓ సర్వాంతర్యామీ..
నీ ఉనికి చాటేందుకు
ఇంత హైరానా..అదేమి..!

అణువణువునా తెలుస్తుందే
ఆ పవిత్ర స్థలంలో
వినిపించే రామనామం..
అక్కడ కనిపించే
త్రేతాయుగపు ఆనవాళ్లు!

అదిగో యాగశాల..
అయోధ్యాపతి సంతానప్రాప్తికై
సతులతో కూడి
పుత్రకామేష్టి కావించిన పవిత్రస్థలి..
ఒక నవమి నాడు పులకించలేదా సాకేతపురి
హరి రాముడై
భువికి అరుదెంచిన
శుభవార్త విని..
చిన్ని రాముని
ముద్దులమోము గని..!

అక్కడేగా..బుల్లిరామయ్య
అద్దమునందు జాబిల్లిని చూసి
అందముగా మురిసినాడు..
నాన్న దశరథుడు ఉప్పొంగగా
ముగ్గురమ్మల ముద్దుదీరగా..!
ప్రతి కొమ్మ,రెమ్మ
రామయ్య
విక్రమం కాంచేందుకు
క్రమం తప్పక కాచుకుని
ఎదురు చూపులు చూసిన
బాలకాండ..!

అదిగదిగో ఆజానుబాహుడి
అడుగుజాడ..
కనిపించదా అచట
కళ్యాణరామయ్య వేలుబట్టి
సిగ్గుతో నిలబడిన
వధువు సీత ముచ్చట..
ఆ సిగ్గు మొగ్గలను క్రీగంట చూస్తూ చిరునగవులు
చిందించిన దాశరథి ముగ్ధమోహన రూపు..
మాసిపోవునా నేడూ రేపు..
మందిరాలు శిధిలమైనా
సీతమ్మ నయన మందారాలు
పదిలమేగా..
యుగాలు మారినా..
జగాలు మురిసేలా..
అయోధ్య పరిసరాలు
ఇప్పటికీ మెరిసేలా!

అహో..
అచ్చోట నుంచే కదా
ధరణీ చక్రవర్తి రామయ్య
అడవులకు తరలినాడు..
మునుముందు సుమిత్రానందనుడు..
తన వెనుకను మిధిలారాజసుత నడవగా భోరుభోరునా గొల్లుమన్న
అయోధ్య కార్చిన కన్నీరు సరయూ నదిని మించిన ప్రవాహంగా..
గంగా తరంగగా..
మము వీడకు..ఇలా వెడలకు
అంటూ వేడుకుంటూ రామయ్య పాదాలు తడపగా..
ఆ అయోధ్యలో గడప..గడపగా..!

అంతలోనే మరలివచ్చిన కోదండరాముని పాదుకలు..
అయోధ్యలో మళ్లీ
ఆనంద వీచికలు..
నీలమేఘశ్యామునికి మారుగా
రాజ్యం చేసిన ఆ పాదరక్షలు
ఇప్పటికీ సాకేతపురి
శిధిలాల మాటున దాగి
కని ఉండవా తమ ప్రభువు
జన్మస్థలి కోసమై సాగిన కక్షలు!

వనవాసమున రామయ్య ఉన్నది పదునాలుగేళ్ళే..
సీతావియోగ భారం
దుర్భరమే అయినా
అవతారమూర్తికి పద్నాలుగేళ్ల వనవాసం పద్నాలుగు క్షణాలే..
కాని ఆ దివ్యమూర్తి దూరమై..
సుందర రూపం కనుమరుగై..
ఇదే అయోధ్య
క్షణమొక యుగమై..
ఊపిరే భారమై..
ఎదురుచూపులై…
వాకిటిలోనే పడిగాపులై!

తపము ఫలించిన శుభవేళ
కోదండరాముడు పట్టాభిరాముడైన
ఆ మహోత్సవం..
కన్నులారా గాంచిన అయోధ్య
భువిని అంతకు మించిన పండగున్నదా..
రామరాజ్యం
అడుగడుగునా పవిత్రభావన
ఆ మట్టి వాసన..
ఎన్నాళ్ళయినా.. ఎన్నేళ్ళయినా..
చెదిరేనా..
ప్రాకారాలు కూల్చి..
అహంకారాలు పేర్చినా
కథ మారేనా!?

దాడులు..కీడులు..
ఆక్రమణలు..అతిక్రమణలు..
కాల్చివేతలు..పేల్చివేతలు..
పరాకాష్టగా కూల్చివేతలు..
ఆపై నిర్మాణాలు..
ఫర్మానాలు..
మాదే మాదే
అంటూ తీర్మానాలు..!
సయోధ్య మిధ్యై..
అయోధ్య దూరమై..
రామమందిరం
శోకమందిరమై
ఎన్ని వత్సరాలో.?
నడిమద్దెలో
ఎన్నెన్ని మత్సరాలో..!

సరే..
అంతా ముగిసి…
అంతరాలు సమసి..
జనమెల్ల మురిసి..
జగమెల్ల మెరిసి..
నాటి పట్టాభిషేక
సొగసులను తలపిస్తూ..
సింగారించుకుంటున్న అయోధ్య..
రానున్నరోజుల్లో కాదా
అటు వారణాసి..
ఇటు తిరుమలకు
సాటి కాగల మహాక్షేత్రం..
కలియుగాంతము వరకు
చాటి చెబుతూ
రామయ్య క్షాత్రం..
ఆ కరుణామూర్తి
అష్టమ అవతార గోత్రం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here