అదృశ్య గురువు

8
3

[dropcap]“పి[/dropcap]న్నీ! నిన్న ఫోన్ చేశావా?” ఆదివారం పొద్దున్నే చెన్నై నుంచి శిల్ప ఫోన్.

“లేదు కాల్చేశా” అంది సరళ నవ్వుతూ

గట్టిగా నవ్వేస్తూ అంది శిల్ప “ ఐ లవ్ యు పిన్నీ! ఎప్పుడూ ఎనర్జీతో ఉంటావ్! అందుకే నువ్వంటే నా కిష్టం.”

“పిల్ల బచ్చీవి, నువ్వు నా ఎనర్జీ కి సర్టిఫికెట్ ఇవ్వడం!” వెక్కిరించింది సరళ.

“అవును నిజం పిన్నీ, ఉద్యోగం చేస్తూ ఈ పిల్లలిద్దరినీ స్కూల్ పంపేటప్పటికీ జీరో ఎనర్జీ నాకు. నీ గొంతు నుంచి మాక్కూడా కొంచెం ఎనర్జీ పంపుతావ్. చెప్పు ఏంటి విశేషాలు?”

“ఈ వేసవికి పిల్లల్ని హైదరాబాద్ వచ్చి నా దగ్గర దింపెయ్యి. ఓ రెండు వారాలుంచుకుని మీ అమ్మదగ్గరికి కాకినాడ నేనే తీసుకెళ్లి దింపేస్తాను నా కార్లో. మీరు ముందుగా టికెట్‌లు బుక్ చేసుకుంటారు కదా అని చెబుతున్నా”

“ఓ పని చెయ్యకూడదూ! వాళ్ళకి పరీక్షలకి ఓ పది రోజులు ముందు నువ్వు చెన్నై వచ్చేసెయ్యి. షాపింగ్ చేసుకుని వాళ్ళని సెలవులివ్వగానే తీసుకుపోదువుగానీ. ఉగాది మార్చ్ 25న, మర్నాటినుండీ వాళ్ళకి సెలవులు.”

“అలా అంటావా?” ఆలోచిస్తోంది సరళ.

“నువ్వొచ్చి రెండేళ్లయ్యింది. ఎప్పటి నుంచో వస్తానంటున్నావు కానీ రావట్లేదు. ఇప్పుడిలా కుదిరింది. ఇంక ఆలోచించకు. రేపటి లోగా డేట్ చెప్పు ఈయన టిక్కెట్లు బుక్ చేస్తారు అటూ ఇటూ” అంది శిల్ప ఉత్సాహంగా.

“ఓకే రా శిల్పా! నాకు ప్రయాణం పెట్టావు పొద్దున్నే” అంది సరళ నవ్వి ఫోన్ పెట్టేస్తూ.

‘చెన్నై వెళ్తే షాపింగ్ చేసుకోవచ్చు.ఈ హైదరాబాద్ చీరల డిజైన్లు బోర్. అక్కడైతే బెటర్. గోల్డ్ చైన్లు కూడా మార్చాలి. కొత్తవి తీసుకోవాలి. చెప్పులూ, బాగ్‌లూ కావాలి. టీ నగర్ ఆంతా రౌండ్ కొట్టాలి’ సరళకి సంతోషంగా అనిపించింది.

యాభై మూడేళ్ళ సరళ రాష్ట్ర ప్రభుత్వోద్యోగం చేస్తూ ఇటీవలే వలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. సొసైటీకి నా వంతుగా కొంత సేవ చెయ్యాలి అని ఆశయం పెట్టుకున్న స్త్రీ ఆమె. పెళ్లి చేసుకోలేదు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో చేరి వారితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. తల్లీ తండ్రీ గతించిపోయాక అక్క గారైన శిల్ప తల్లి సుభద్ర సరళను కనిపెట్టుకుని ఉంటుంది. సంసార మాయలో పడకుండా ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్న సరళ పిన్ని అంటే శిల్పకి ఎంతో ఇష్టంతో కూడిన గౌరవం. తల్లితో కంటే పిన్నితో మాట్లాడడమే సంతోషంగా ఉంటుంది శిల్పకి. సరళా, శిల్పా లేటెస్ట్ హిందీ తెలుగు సినిమాల నుంచీ, రాజకీయాల నుంచి బంధువుల గురించిన కామెడీ కబుర్లు చెప్పుకుంటూ గట్టిగా నవ్వేసుకుంటూ ఒక రౌండ్ అప్ కొడుతూ ఉంటారు. శిల్పా ఆమె భర్త శంకర్ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లే చెన్నైలో.

***

ఉగాదికి ఒక వారం ముందు వస్తానని, పండగ మర్నాడు తిరుగు టికెట్లు తియ్యమని చెప్పింది సరళ. ఆ ప్రకారమే శిల్ప భర్త శంకర్ రిజర్వ్ చేసిన టికెట్‌తో ట్రైన్‌లో ప్రయాణం చేసి చెన్నై చేరింది సరళ. స్టేషన్ కొచ్చి రిసీవ్ చూసుకున్నారు శంకర్, శిల్పా పిల్లలు పెద్దవాడు కార్తీక్, చిన్నవాడు కౌశిక్‌తో సహా. ఆ రోజు సెలవు పెట్టేసింది శిల్ప. శంకర్‌నీ పిల్లల్నీపంపేసి టిఫిన్ తినేసి పది కల్లా బయలుదేరి షాపింగ్ కోసం టీ నగర్‌లో పడ్డారు శిల్పా, సరళా.

ముందుగా లేటెస్ట్ చైన్‌లన్నీ అడుగుతూ వరసగా ఓ నాలుగు బంగారం షాపులు తిరిగారు. ఒక కాఫీ షాప్ దగ్గర నిలబడి కాఫీ తాగి బాగా చర్చించుకుని చూసిన షాప్‌కెళ్ళి పాత చైన్ ఒకటి మార్చి కొత్తది తీసుకున్నారు సరళ కోసం. బిల్ చెల్లించేసరికి మధ్యాహ్నం భోజనం టైం అయ్యింది. ఒక శరవణ హోటల్‌లో భోంచేసి బట్టల షాప్‌ల్లో చొరబడ్డారు.ఓ అరడజన్ చీరలు కొనుక్కుంది సరళ. అయిదయింది. అప్పుడు టీ నగర్ ఫుట్‌పాత్ షాపింగ్ ఓ రెండు గంటల చేసుకుని ఇంటికి చేరేప్పటికీ ఎనిమిదయ్యింది.

శంకర్ అప్పటికి పిల్లలు భోజనం పెట్టి తను కూడా తిని కూర్చున్నాడు. ఇంటికొచ్చి కొన్నవన్నీశంకర్‌కి చూపించి భోంచేసి కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారంతా. తెల్లారింది. అప్పటివరకూ సన్న సన్నగా దూరంగా వినబడుతున్న కరోనా భూతం వివరాలు దగ్గరగా వచ్చేసాయి. ఎక్కడో విదేశాల్లో ఉందిట ఫ్లైట్స్‌లో వచ్చేవారివల్ల వస్తుందట. అన్న వార్తల్లా మన దేశమంతటా కోవిడ్ 19 వ్యాపిస్తోంది అంటూ దుమారం రేగిపోయింది. వార్తా చానెల్స్ హోరెత్తిపోయాయి. పిల్లలకి పరీక్షలు రద్దయ్యాయి. కంగారు పడిన సరళ “పరీక్షలు లేవు కదా మాకేమైనా తత్కాల్ తియ్యండి ముగ్గురం వెళ్ళిపోతాం” అంది.

“వొద్దొద్దు ట్రైన్‌లో తెల్లవార్లూ ఉంటే ట్రైన్‌లో ఎవరైనా కరోనా పేషెంట్ ఉంటే అంటుకుంటుంది, కొంచెం ఆగుదాం” అన్నారు శిల్ప,శంకర్. మరో మూడు రోజులకి ప్రధాని జనతా లాక్‌డౌన్ అన్నారు. “ఒక్కరోజే కదా ఆ మర్నాడు బస్సులో వెళ్ళిపోతాం” అంది సరళ. “బస్సులో కూడా సేఫ్ కాదట. ముందు మీ ట్రైన్ టికెట్ కేన్సెల్ చేస్తున్నా” అన్నాడు శంకర్. సరేనంది సరళ. మరొక్కరోజు తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించింది ఏప్రిల్ పద్నాలుగు వరకూ.

సరళ బిక్కచచ్చిపోయింది. ఇంకా మూడు వారాలుండాలా? ఇప్పటికే ఒక వారం అయిపోయింది. పిన్ని మొహం చూసి “పోన్లే పిన్నీ! రెస్ట్ తీసుకో. హైదరాబాద్‌లో నీకు తీరికే ఉండదు” అంది శిల్ప. ఏమీ మాట్లాడలేదు సరళ. ఈ కరోనా గందరగోళం లోనే శార్వరి ఉగాది వచ్చి వెళ్ళిపోయింది. పనమ్మాయిల్ని మానిపించుకోవాలని శిల్ప వాళ్ళున్న గేటెడ్ కమ్యూనిటీ హెడ్ అందరికీ మెసేజ్ పెట్టాడు. శిల్ప, శంకర్ ఇంటి నుండి ఆన్‌లైన్‌లో ఆఫీస్ పని చేసుకుంటున్నారు. రోజూ లేవగానే ముగ్గురూ కలిసి ఇంటి పనులన్నీ చేసుకోవడం, పిల్లల్ని చూసుకుంటూ వంటచేసుకుని తినడం ఇదే దిన చర్య.

***

మరో వారం గడిచింది. శంకర్ అప్పుడప్పుడూ బైటికి వెళ్లి సరుకులు కొనుక్కొచ్చి ఇంటినిండా నింపుతున్నాడు.అది చూసి సరళకి చిన్నతనంగా అనిపిస్తోంది. నేనేంటి? వీళ్ళింట్లో వచ్చి ఇన్ని రోజులుండడం ఏంటి? అని. “ఎందుకు పిన్నీ! బాధ పడుతున్నావు? ఇక్కడ నీకు బాలేదా? నీకైమైనా ఇబ్బందిగా ఉందా?” అన్న శిల్ప ప్రశ్నకి “బాలేకేం! బానే ఉంది. ఎక్కడా నేను నాలుగైదు రోజులు మించి ఉండలేదు కదా అందుకే” అంది సరళ బాధను దిగమింగి. “సారీ అత్తయ్య గారూ! మనం కొంచెం ముందుగా ఊహించలేకపోయాం. ఇదంతా” అన్నాడు అల్లుడు. “అయ్యో అది కాదు నాన్నా ! ఇక్కడ బానే ఉంది పిల్లలూ, మీరిద్దరితో కలిసి ఉండడం సరదాగా ఉంది” అంది పైకి బావుండదని.

అప్పుడప్పుడూ పిల్లల పక్కన కూర్చుని వాళ్ళు టీవీలో చూసే తమిళ్ సినిమాలు చూస్తోంది సరళ. కొంతసేపు మనసు లగ్నమైనా గానీ వెంటనే ఏదో బాధ, ఏంటిది? ఈ వైరస్ ప్రపంచాన్ని మింగేస్తుందా? జన నష్టం ఎంత ఉండబోతోంది? తిరిగి మళ్ళీ ప్రజ పూర్వపు రోజులకి వెళ్లగలుగుతారా! అందరూ తమ జీవిత లక్ష్యాల కోసం ఎంత బిజీగా పరుగులు తీస్తూ ఉండేవారో! అందరినీ ఈ కరోనా ఇంట్లో కూర్చోబెట్టింది ఈ సినిమా హాల్స్‌లో, మాల్స్‌లో, షాప్స్‌లో పనిచేసే ఎంతమంది జీవనోపాధి పోయిందో? వాళ్ళ సంసారాలు ఎలా నడుపుకుంటున్నారో! వారు కనీసం వార్తా చానెల్స్ ముందుకు కూడా రావడం లేదు. అనుకుంటూ వేదనకు లోనవుతోందామె.

సరళ పని చేస్తున్న సేవా సంస్థలోని మిత్రులు ఫోన్ చేస్తున్నారు. “సరళా నువ్వు లేవు. మాకు తోచడం లేదు. ఏం చెయ్యాలో? బైటికి రాకుండా ఎవరికైనా ఎలాసాయం చెయ్యగలం? గాల్లో వైరస్ ఉంది. ఇంట్లోనే తలుపులేసుకుని ఉండాలంటున్నారు” అంటూ. “అవును ఇక్కడా అదే పరిస్థితి. వీలైనంత త్వరలో వచ్చేస్తాను” అంది సరళ. అప్పుడప్పుడూ సరళ వ్యాసాలు ప్రచురించే పత్రిక వారు ఫోన్ చేసి కరోనా మీద ప్రజలకు స్థైర్యం ఇచ్చే వ్యాసం రాయమని కోరారు. సరళ “నేనిప్పుడు రాయలేనండీ” అని చెప్పేసింది, నాకే మనస్తిమితం లేకుండా ఉంది నేనెలా రాస్తాను అనుకుంటూ.

సరళకి కాలం ఏదో ఉక్కిరిబిక్కిరిగా ఉన్నట్టనిపిస్తోంది. ఒక భయం, ఆందోళన. ఒక ద్వీపంలో చిక్కుకుపోయినట్టుగా ఫీలవుతోంది. ఒక రోజు తన మిత్రురాలు హైమకి ఫోన్ చేసి తన మానసిక స్థితి చెప్పుకుంది సరళ. “కొంచెం ఓపిక చేసుకో. వచ్చేద్దువులే వీలయినంత త్వరలో” అన్న హైమ మాటకి సరళకి ప్రాణం లేచివచ్చింది. మరొక రోజు సరళ కజిన్ రాము ఫోన్ చేసాడు రాజమండ్రి నుంచి. “ఉండలేకపోతున్నానురా ఇక్కడ” అంది బేలగా అతనితో. “అక్క కూతురింట్లో ఉండడానికేం? పై వాళ్ళైతే బాధ పడాలి కానీ. అయినా ఉద్యోగం కూడా లేదు కదా ఉండు హాయిగా. ఏం పోయింది?” అని నవ్వాడు రాము. ఆ కజిన్‌ని పీక పిసికి చంపాలన్నంత కోపం వచ్చింది సరళకి.

***

అక్కగారు సుభద్ర రెండు రోజులకొకసారి ఫోన్ చేస్తోంది. “మీరిద్దరూ మిత్రులు కదా కలిసి గడపండి” అందావిడ నవ్వుతూ. “నిజమే కానీ ఇన్నిరోజులా అక్కా!” అని సరళ గట్టిగా ఏడవడంతో ఆవిడ కంగారు పడింది. వెంటనే సరళ తేరుకుని “శిల్పతో నేనిలా బెంగ పడ్డానని చెప్పకు.అది బాధ పడుతుంది” అంది. “సరే” అంది సుభద్ర.

ప్రపంచంలో అందరూ ఎవరిళ్ళలో వాళ్ళున్నారు. నేనే పరాయి ఇంట్లో ఉన్నాను. అసలు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా బాధ కంటే తన బాధే ఎక్కువగా అనిపిస్తోంది సరళకి. నడిసంద్రంలో నావలో చిక్కుకుపోయి, ఒడ్డు కనబడకపోతే ఎలా ఉంటుందో అలా ఉందామెకి. ఆమెకి ఆకలి వెయ్యడం లేదు. టీవీ చూడట్లేదు. పేపర్ కూడా చదవాలనిపించడం లేదు.

లాక్‌డౌన్ మూడు వారాలు అవ్వగానే ఎలాగోలా వెళ్లిపోవాలని గట్టిగా నిర్ణయించుకుని రోజులు లెక్కపెట్టుకుంటోంది సరళ. పదిహేనో తారీకు తెల్లారే వెళ్లిపోవాలని ట్రావెల్స్ వాడితో కూడా మాట్లాడుకుంది. రేపు గడువు ముగుస్తుందనగా లాక్‌డౌన్ ఏప్రిల్ నెలాఖరువరకూ పొడిగించారన్న వార్త సరళ నెత్తిన పిడుగులా పడింది. సరళ ఆ రాత్రంతా తన గదిలో వెక్కి వెక్కి ఏడుస్తూ పడుకుంది. అకారణంగా తనకి జైలు శిక్ష ప్రాప్తించినట్టూ, ఇక్కడి నుండి ఒక సొరంగం తవ్వుకుని బైట పడాలేమో అన్నట్టూ ఉద్వేగ పడిందామె.

ఒక రోజు మేం కోవిడ్ కార్యకర్తలం అంటూ ఇద్దరు మగవాళ్ళు వచ్చారు. ఇంట్లో అందరినీ గుమ్మం బైటికి పిలిచి మొహాలు పరీక్షించి వెళ్లారు. అటువంటప్పుడు మనకి వైరస్ లక్షణాలుంటే వెంటనే ప్రభుత్వటీం వచ్చి తీసుకుని వెళ్ళిపోతారట. ఒక వేళ కరోనా బాగైతే వెనక్కి లేకపోతే బాడీ కూడా ఇవ్వరట. ఇంటివారు కూడా అడిగే హక్కులేదట. శంకర్ చెబుతుంటే విన్న సరళకి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇక్కడ తనకు కరోనా వచ్చేస్తే ఏంటి పరిస్థితి? ఆ రాత్రి పిచ్చి పిచ్చి కలలు. కొంతమందిని ఎక్కడ దాక్కున్నా పట్టేసుకుంటున్నారట. అలా బిక్కు బిక్కు మంటూ దాక్కున్న వాళ్లలో తానూ ఉందిట. మెలుకువ వచ్చిన సరళకి ఆ రాత్రి మళ్ళీ నిద్ర పట్టలేదు.

ఒక రోజు దిగులుగా కూర్చుని వార్తలు వింటుండగా తెలుగు కేంద్ర మంత్రి ఇంటర్వ్యూ లో లాక్‌డౌన్ పొడిగింపు అనేది అనివార్యమనీ అయితే అంతర్రాష్ట్ర ప్రయాణీకులు ఆన్‌లైన్‌లో పర్మిషన్ తీసుకుని సొంత వాహనంలో వెళ్ళవచ్చనీ చెప్పాడు. చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించింది సరళకి. “శిల్పా టాక్సీ మాట్లాడదాం. మేము ముగ్గురం వెళ్ళిపోతాం” అంది సరళ సంభ్రమంగా.”కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది పైగా పిల్లలు ప్రయాణం చెయ్యడం మంచిది కాదంటున్నారు. మరి మీరు ఒక్కరూ వెళ్లగలరా?” అన్నాడు శంకర్. “వెళ్ళిపోతాను. భయం లేదు. నేను వెళ్ళగలను. కరోనా తగ్గాక పిల్లల్ని తీసుకుని రండి మీరిద్దరూ” అంది సరళ. “అలాగే పిన్నీ, నువ్వింక బెంగ పడకు” అంది శిల్ప ప్రేమగా.

***

అదే రోజు ట్రావెల్స్ టాక్సీ మాట్లాడితే రావడానికీ పోవడానికీ ఇంకా టోల్ అన్నీ కలిపి ఇరవై వేలివ్వాలి అన్నాడు డ్రైవర్. సరే నంది సరళ. మర్నాడే శంకర్ వార్తా పత్రికలో ఇచ్చిన ఫోన్ నంబర్ కి ఫోన్ చేస్తే వెబ్ సైట్ అడ్రస్ ఇచ్చారు. ఆధార్ కార్డుతో సహా అన్ని వివరాలూ ఇంకా డ్రైవర్ ఫోన్ నంబరూ రాసి సరళకి తమిళనాడు నుంచి వెళ్లడానికీ తెలంగాణాలోకి ప్రవేశించడానికీ ఆన్‌లైన్ పర్మిషన్‌లు తెప్పించాడు శంకర్. మర్నాడు ఉదయమే అయిదు కల్లా బయలు దేరింది సరళ.

తమిళనాడు సరిహద్దులో పోలీసులు నలుగురు వచ్చి కార్‌ని ఆపారు. అక్కడున్న చెక్ పోస్ట్ దగ్గర ఒక టెంట్ ఉంది. అందులో మూడు కౌంటర్లున్నాయి. ఒకే రాష్ట్రంలో మరోచోటికి వెళ్ళేవాళ్ళు, పక్క రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళు, ఆఫీసియల్ పని మీద వెళ్ళేవాళ్ళు. డ్రైవర్ కారాపి వెళ్లి వచ్చాడు.అతని వెనకే ఇద్దరు పోలీసులు వచ్చారు. “మీరు కూడా రావాలి మేడం” అన్నారు. సరళ దిగి చెక్ పోస్ట్ కేసి దారి తీసింది. ఒక పోలీస్ ఒక పరికరంతో జ్వరం చెక్ చేసాడు. ఏదో రాసుకున్నాడు. ’కొంపతీసి నాకు కరోనా ఉందేమో’ సరళ గుండెలు ఠక్ ఠక్ మని కొట్టుకున్నాయి. తమిళనాడు ఆన్లైన్ పర్మిషన్ లెటర్,ఆధార్ కార్డు అడిగారు. బాగ్ లోంచి తీసి చూపించింది. వాటిని పరిశీలించి తలూపి వెళ్ళమన్నారు.

‘పద పద ప్రభుత్వ క్వారంటైన్ కి, నీకు ఖచ్చితంగా కరోనా ఉంది అంటే ఏంటి గతి?’ అని భయపడిన సరళ ఊపిరి పీల్చుకుంది. బతుకు జీవుడా అంటే ఇదే కాబోలు. మరో నాలుగు చెక్ పోస్ట్ లయ్యాయి. ప్రతి చోటా పోలీస్‌లు దొంగల కారుని చుట్టుముట్టి ఆపినట్టు ఆపి దింపి అన్నీ పరిశీలించి వెళ్లమంటున్నారు. కారు తెలంగాణ బోర్డర్‌లోకి ప్రవేశించగానే కార్ వెనక్కి తిప్పి ఆపమని చెప్పి డ్రైవర్ నీ సరళ నీ దిగమని అన్నారు పోలీసులు. అన్ని చెకింగ్‌లూ అయ్యాక తిరిగి కారెక్కుతూ ఉంటే ఆనందం పట్టలేక ఒక్కసారి తెలంగాణ మట్టిని చేత్తో తీసుకుని నుదుట రాసుకోవాలనిపించింది సరళకు.

హైదరాబాద్ సిటీ లో ప్రవేశించగానే సరళకి కారు దిగి గంతులెయ్యాలనిపించింది. తార్నాకలో తన ఫ్లాట్స్ ముందు కారాగ గానే గబ గబా కారు దిగింది. కాంపౌండ్ గేట్ తీసి ఉంది. వాచ్‌మాన్‌తో సహా ఎవరూ లేరు. సమయం సాయంత్రం అయిదయింది. బిల్డింగ్ పైన ‘సత్యా అపార్ట్మెంట్స్’ అన్న పేరు చూడగానే దుఃఖం ముంచుకొచ్చిందామెకి. శరీరం పట్టు వదిలినట్టయింది. అలా చూస్త్తూ నిలబడిపోయింది. ‘ఇది నిజమా! లేక నేను రోజూ కంటున్నా కలా?’ అనుకుంది.

“అమ్మా! మీ సూటుకేసు, బ్యాగులు” అన్న డ్రైవర్ గజేంద్రన్ మాటకి ఈ లోకంలోకి వచ్చింది సరళ. అతను మీటర్స్ లెక్క చూపించి, డ్రైవర్ బత్తాతో సహా ఎంతయ్యిందీ కాగితం మీద వేసి చూపించాడు. సరళ ఆనందంగా పర్సు లోంచి డబ్బు తీసి ఇచ్చి “రొంబ థాంక్స్” అంది అభిమానంగా. అతను నమస్కారం చేసి వెళుతుండగా పిలిచి మరో అయిదు వందలు ఇచ్చి, చిన్న పిల్లలా చెయ్యి ఊపి టాటా చెప్పింది.అతను కృతజ్ఞతా పూర్వకంగా నవ్వాడు.

***

లిఫ్ట్ లో ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చి తాళం తీసి లోపలి ఎంతో అపురూపంగా అడుగు పెట్టింది. చేతిలో సామాను కింద పడేసి ఒక్కొక్క గదిలోనికీ ఆప్యాయంగా ప్రవేశిస్తూ ఆ గోడల్ని తడుముతూ పిచ్చి దానిలా తిరిగింది. ఇల్లంతా తన వైపే ఆర్తితో చూస్తున్నట్టనిపించింది. హాల్ మధ్యలో మోకాళ్ళ మీద కూలబడి వెక్కి వెక్కి ఏడ్చి చాలా సేపటికి తెప్పరిల్లింది సరళ. ఆమెకి తాను పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకున్నట్టూ, జైలు నుంచి విడుదలయినట్టూ,తాను కోల్పోయిన సింహాసనాన్ని తిరిగి సాధించుకున్నట్టూ గర్వంగా తోచి ఉత్సాహంగా లేచింది. ఆ రోజంతా ఏమి తిన్నదో తినలేదో ఆమెకి తట్టలేదు. ఊరికే అలా కూర్చుండిపోయింది. రాత్రి కాగానే పడుకున్నా నిద్ర రావడం లేదు. ‘ఇది నిజమేనా నేను హైదరాబాద్‌కి వచ్చేసానా? అనుకుంటూ ఆనందంతో ఏ తెల్లవారు జాముకో కలత నిద్ర పోయిందామె.

మర్నాడు ఉదయమే మెలుకువ రాగానే కళ్ళు తెరిచిన సరళ మరోసారి గదిని పరీక్షించి లేచి పక్క గదిలోకి వచ్చింది.ఇది నా ఇల్లే కదా ! అవును. నాదే. ఎంత ఘోష పడి, యాతన పడి పరుగు పరుగున వచ్చానో. ఇంకెప్పుడూ ఈ ఇల్లొదిలి ఎక్కడికీ వెళ్ళకూడదు అనుకుంటూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుంది వెనక్కి వాలి. నేనేమనుకుంటున్నాను? ఇది నా ఇల్లు అని కదా! అక్కడ నేను నాలుగు రోజులు అతిధిగా ఉండబోయి నలభై రోజులుండిపోయాను. మరి ఇక్కడ నేను ఎన్నాళ్ళు ఉండగలను? లెక్కేమిటి? ఎన్ని రోజులయినా ఇక్కడే ఉంటాను. సరళ తనలో తాను అనుకుంటున్న మాటలకి ఆమె మనసు లోపలెవరో తర్కిస్తున్నారు. ‘ఉంటావనుకో శాశ్వతం కాదు కదా!’ అంటూ.

‘ఎందుకు కాదు?’ ఠక్కున వేసిన సరళ ప్రశ్నకి ‘అసలీ లోకమే ఒక అద్దె ఇల్లు. ఎన్నాళ్ళుండాలని రాసి ఉంటే అన్నాళ్ళూ ఉన్నాక తిరిగి వచ్చిన చోటుకి వెళ్ళవలసిందే’ అన్న జవాబు వచ్చింది ఆ తర్కిస్తున్నవారినుంచి.

ఒక్క క్షణం నిరుత్తరురాలయింది సరళ. ‘నిజమే! అంతే కదా’ అన్నట్టు తలాడిస్తూ నెమ్మదిగా లేచి వాష్ రూమ్ వైపు నడిచింది. ‘ఏది నీ ఇల్లు? ఏది నా ఇల్లు? అసలు మనందరి ఇల్లు ఏది? ఆలోచించాల్సిన విషయం కదా! అసలీ వివేకమూ, జ్ఞానమూ ఎక్కడి నుండి వచ్చాయి? ఏ గురువు గారు నేర్పించారీ జీవిత సత్యం?’ అనుకున్న సరళ పెదాలపై చిన్న నవ్వు సన్నగా విరిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here