అద్వైత్ ఇండియా-1

0
9

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

అధ్యాయం 1:

[dropcap]అ[/dropcap]ది 1921వ సంవత్సరం..

ప్రాంతం.. రాజమండ్రికి దక్షిణపు వైపున వున్న గోదావరీ నదీ తీరం. సమయం ఉదయం ఐదున్నర.. ప్రాతఃకాలం.. శరదృతువు, కార్తీక మాసం, చలికాలం.. అయినా నరశింహశాస్త్రిగారు వాడుక ప్రకారం నదికి వచ్చి స్నానం చేసి ఉదయించే బాలభాస్కరునికి అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నారు. యిద్దరు శిష్యులు వారి విధానాన్ని అనుసరిస్తున్నారు. వారిరువురిలో ఒకడు.. నరశింహశాస్త్రిగారి తనయుడు అద్వైత్.. రెండవ అతను శాస్త్రిగారి మేనల్లుడు పాండురంగశర్మ.

రెవిన్యూ అధికారిగా కలకత్తా నుంచి వచ్చిన తెల్లదొర.. రాబర్ట్.. గుఱ్ఱాన్ని ఎక్కి యిద్దరు అనుచరులతో నది ఒడ్డుకు వచ్చాడు.

కార్యక్రమాన్ని ముగించి నరశింహశాస్త్రి.. తనయుడు.. పాండురంగ ఒడ్డుకు వచ్చారు.

రాబర్టు చూపు వారిపై పడింది. అతని యిద్దరు అనుచరులతో ఒకడు తెల్లదొర.. మరొకడు ఆంధ్రుడు. ద్విభాషి. అతని పేరు సుల్తాన్. ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలడు. ఎంతోకాలంగా తెల్లదొరల వద్ద పని చేస్తున్నాడు. ఆంగ్లంలో అడిగాడు రాబర్ట్.

“సుల్తాన్ వారెవరు?..”

“సార్!.. ముందు నడుస్తున్న ఆరడుగుల అజానుబాహుడు నరశింహశాస్త్రి గారు. గొప్ప వేద పండితుడు. ఆచార సంపన్నుడు. మంచి మనస్సు వున్న మహారాజు.” చిరునవ్వుతో చెప్పాడు సుల్తాన్.

“మహారాజు!.. నీ ఉద్దేశమేమిటి?.. యీ ప్రాంతానికి ప్రస్తుతం మేమే.. మహారాజు. వాడు ఎలా మహారాజు అవుతాడు?..” రాబర్ట్ యొక్క అధికారగర్వం.. పలికిన పలుకులవి.

‘నీవు ఎక్కడ.. ఆయన ఎక్కడ!.. నీవు నక్కవు.. వారు సింహం..’ మనస్సున అనుకొన్నాడు సుల్తాన్.

“సుల్తాన్!.. ఏమిటి నీ ఆలోచన. వారిని యిలా పిలు!..” గుఱ్ఱాన్ని ఆపాడు రాబర్ట్.

సుల్తాన్ నరశింహ శాస్త్రిగారిని సమీపించి నమస్కరించాడు.

“సుల్తాన్!.. బాగున్నావా!..” ప్రీతిగా పలకరించాడు నరశింహశాస్త్రి.

“ఆయనకేం తక్కువ మామా!.. తెల్లవారు యీ దేశంలో వున్నంత వరకూ!..” అన్నాడు శిష్యుడు.. చెల్లెలి కొడుకు పాండురంగశర్మ.

“పాండూ!.. పెద్దల మధ్యన మాట్లాడకూడదనే విషయాన్ని మరచావా!.. సుల్తాన్ గురించి నీకేం తెలుసు..” తీక్షణంగా పాండురంగశర్మ ముఖంలోకి చూస్తూ అన్నారు నరశింహశాస్త్రి.

“అయ్యగారూ!.. పాండు చిన్న పిల్లవాడు కదా!.. ఏదో..” సుల్తాన్ ముగించక ముందే..

“పద్ధతులను ప్రతి ఒక్కరూ చిన్న వయస్సు నుంచే నేర్చుకోవాలి సుల్తాన్ భాయ్..” అన్నారు నరశింహశాస్త్రి. పాండురంగశర్మ తల దించుకొన్నాడు.

“మీరు అన్నమాట నిజమేనండయ్యా!..”

“వారేనా క్రొత్తగా వచ్చిన రెవిన్యూ అధికారి.”

“అవునయ్యా!..”

“గుఱ్ఱం ఆగిందేం!..”

“వారు మిమ్మల్ని రమ్మంటున్నారు” మెల్లగా తడబడుతూ చెప్పాడు సుల్తాన్.

“వారి పేరు?”

“రాబర్టు దొర.”

కొద్దిక్షణాల్లో ఆ నలుగురూ రాబర్టు గుఱ్ఱం వున్న ప్రాంతానికి వచ్చారు.

ఠీవిగా గుఱ్ఱం మీద కూర్చొని తన్నే చూస్తున్న రాబర్టును చూచి “గుడ్ మార్నింగ్ మిస్టర్ రాబర్ట్..” చిరునవ్వుతో చెప్పారు నరసింహశాస్త్రి

వారిని పరీక్షగా చూచాడు రాబర్ట్.

ఆంగ్లంలో.. “నీ పేరేమిటి?” అని అడిగాడు.

“సుల్తాన్ చెప్పలేదా!..” ఆంగ్లంలో అడిగాడు నరసింహశాస్త్రి.

“యు నో ఇంగ్లీష్!..”

“అఫ్ కోర్స్..” చిరునవ్వుతో చెప్పాడు నరశింహశాస్త్రి.

“నదిలో ఏం చేస్తున్నావ్?..”

“అది నేను చెప్పినా.. నీకు అర్థం కాదు.”

సుల్తాన్ నవ్వాడు. రాబర్టుకు యిన్సల్ట్ అయింది.

“సుల్తాన్..” బిగ్గరగా అరిచాడు.

“వారు విశ్వశాంతికి దేవుణ్ణి ప్రార్థించారు సార్.. ప్రతిరోజూ వారు అలాగే చేస్తారు” చెప్పాడు సుల్తాన్.

“వి సాంతి.. వాడ్ డు యు మీన్!..”

‘వి సాంతి కాదురా.. విశ్వశాంతి. నీ గుబ్బు నోరు ఆ పదాన్ని పలకలేదులే’.. అనుకొని.. “ప్రపంచంలో వున్న అందరి ప్రజల ఆనందం కోసం.. సౌఖ్యం కోసం.. దేవుణ్ణి ప్రతిరోజూ మూడు వేళలా ప్రార్థిస్తారు సార్..” ఆంగ్లంలో చెప్పాడు సుల్తాన్.

“ఓ.. మ్యాన్ కెన్ యు టీచ్ మీ టెలుగ్?..”

“నో టైమ్..” అన్నారు నరశింహశాస్త్రి.

“వాట్!..” ఆశ్చర్యంతో అడిగాడు రాబర్ట్.

“వారు ప్రసిద్ధ నాట్యాచార్యులు కూడా. దాదాపు ఆడ మగ పిల్లలు ముఫై మంది వారి దగ్గర నాట్యాన్ని నేర్చుకొంటున్నారు. ఆ కారణంగా వారికి మీకు తెలుగు నేర్పించే దానికి సమయం లేదు సార్!..”

“నాటం.. వాట్ నాటం?..”

“నాటం కాదు. నాట్యం, కూచిపూడి.. కథకళి.. భరతనాట్యం. వాటి పేర్లు.” చెప్పాడు సుల్తాన్.

“మిస్టర్ రాబర్ట్.. బై..” చెప్పి నరశింహశాస్త్రి ముందుకు నడిచారు. తనయుడు.. అల్లుడు అతన్ని అనుసరించారు.

ఠీవిగా నడిచి ముందుకు వెళుతున్న నరశింహశాస్త్రి చూచి రాబర్ట్..

“వెరీ వెరీ ప్రవుడ్ ఫెలో.. యామై రైట్ సుల్తాన్!..” అడిగాడు.

“నో సార్!.. మీరు చెప్పింది తప్పు. వారు అసలు సిసలైన మంచి మనిషి.” ఆంగ్లంలో చెప్పాడు సుల్తాన్.

నిట్టూర్చి.. రాబర్ట్ గుఱ్ఱాన్ని ముందుకు నడిపాడు. అనుచరులిద్దరూ అతన్ని అనుసరించారు.

గుఱ్ఱం మీద వూరేగుతూ ముందుకు పోతున్న రాబర్ట్ మదిలో నరశింహశాస్త్రి గారిని గురించిన తలపులే. ‘ఆఫ్ట్రాల్ ఒక మాములు మనిషి.. నా మాటను కాదన్నాడు. నేను తలుచుకొంటే వాడికి నరకాన్ని చూపగలను. నా బలం.. నా ప్రతిభ తెలియక వాగాడు. వాడు నా మాట వినాలి. నాకు వాడు టెలుగ్ నేర్పాలి. నా ఆఫీసు వాణ్ణి పిలిపించి మాట్లాడాలి. కాదంటే నా తఢాకా చూపించాలి. బ్లాక్ ఫెలో.. వెరీ వెరీ ఫ్రవుడ్ ఫెలో!..’ అనుకొన్నాడు రాబర్ట్.

గుఱ్ఱం అతని గృహ ప్రాంగణంలో ప్రవేశించింది. గుఱ్ఱం దిగి లోనికి వస్తున్న రాబర్ట్ను చూచి నౌకరు “గుడ్ మార్నింగ్ సార్” అన్నాడు. తల ఆడించి రాబర్ట్ యింట్లోకి పోబోయి వెను తిరిగి..

“సుల్తాన్!.. ఆ మ్యాన్‌ని పిలుచుకొనిరా!..” అన్నాడు.

“ఏ మ్యాన్‌ని సార్!..” ఆశ్చర్యంతో అడిగాడు.

“ఏటి ఒడ్డున చూచిన వాణ్ణి!..”

“ఓ వారినా!..”

“యస్!..” చెప్పి లోనికి వెళ్ళిపోయాడు రాబర్టు.

అధ్యాయం 2:

నరసింహశాస్త్రి.. నది నుండి యింటికి తిరిగి వచ్చి పూజ అరలో దేవతార్చన చేసి.. నైవేద్య దీపారాధనలను సర్వేశ్వరునికి సమర్పించి.. అర్ధాంగి సావిత్రి ప్రీతితో అందించిన అల్పాహారాన్ని సేవించి జుబ్బా ధరించి నాట్యశాలలో ప్రవేశించారు.

యిరవై మంది బాలబాలికలు వారికంటే ముందు ఆ గదిలో వున్నారు. గురువుగారి రాకను గమనించి లేచి అందరూ వారికి నమస్కరించారు. కుడి చేతిని పైకెత్తి వారిని ఆశీర్వదించారు నరశింహశాస్త్రి.

తనయుడు అద్వైత్.. మేనల్లుడు పాండురంగశర్మ వచ్చి.. వారి వెనుక భాగాన చెరో వైపున నిలబడ్డారు. నరశింహ శాస్త్రి వారి స్థానంలో కూర్చున్నారు. ఇరవై మందిలో ఎనిమిది మంది బాలురు.

శిష్యులు.. శిష్యురాండ్ర వైపు చూచి.. చిరునవ్వుతో.. “ప్రారంభించండి..” అన్నారు నరసింహశాస్త్రి. తనయుడు.. మేనల్లుడు.. వారిని సమీపించారు. తాళాన్ని వేయడం ప్రారంభించారు నరశింహశాస్త్రి. వారంతా.. నాట్యముద్రతో గురువుకు పాదాభివందనం చేసి నాట్యాన్ని ప్రారంభించారు. గురువుగారి తాళయుక్తంగా వారు నాట్యభంగిమలను కొనసాగించారు.

ఇష్టం లేకపోయినా, సుల్తాన్.. రాబర్ట్ ఆదేశం ప్రకారం నరశింహశాస్త్రి నిలయానికి వచ్చాడు. అమ్మగారిని చూచి నమస్కరించాడు.

“అయ్యగారు బయటికి వచ్చేదానికి ఒక గంట పడుతుంది సుల్తాన్!..” అంది సావిత్రి.

“అమ్మా!.. నేను కూర్చుంటాను అంతవరకూ!..” విచారంగా చెప్పాడు సుల్తాన్.

“విచారంగా వున్నావ్!.. విషయం ఏమిటి సుల్తాన్!..” అడిగింది సావిత్రి.

“క్రొత్తగా కలకత్తా నుంచి వచ్చిన రెవిన్యూ అధికారి రాబర్టు. వాడు యీ రోజు ఉదయం అయ్యగారిని గోదావరి ఒడ్డున చూచి మాట్లాడాడు.”

“ఏం మాట్లాడాడు?..”

“అయ్యగారిని తనకు తెలుగు నేర్పించమని అడిగాడు.”

“మీ అయ్యగారు ఏమన్నారు?..”

“కుదరదు అన్నారు.. ఆ కారణంగా మరోసారి అయ్యగారితో మాట్లాడేదానికి.. వారు వీరిని పిలుచుకొని రమ్మన్నారు.”

“ఓహో!.. అదా విషయం?..”

“అవునమ్మా!..”

“కూర్చో!.. కాఫీ తెస్తాను.” సావిత్రి లోనికి వెళ్ళిపోయింది. సుల్తాన్ అరుగు మీద కూర్చున్నాడు.

రాగయుక్తంగా తాళం.. లయబద్ధంగా నాట్యాన్ని చేసే వారి యొక్క పాదాలకు కట్టిన కాలిగజ్జెల సవ్వడి.. చెవులకు ఎంతో విందుగా వుంది. పరవశంతో సుల్తాన్ కళ్ళు మూసుకొన్నాడు.

కొద్ది నిముషాల తర్వాత.. సావిత్రి కాఫీ గ్లాసుతో బయటికి వచ్చి సుల్తాన్‍కు అందించింది. సుల్తాన్ అందుకొన్నాడు. అదే సమయానికి.. రాఘవ అక్కడికి వచ్చారు. రాఘవ ఒక వివాహాన్ని జరిపించి రావడంలో లగేజ్‍తో ఇంట్లోకి వెళ్ళాడు.

“అత్తయ్యా!.. నమస్కారం.” నవ్వుతూ చేతులు జోడించాడు రాఘవ.

“రాఘవా!.. విశాఖపట్నం నుంచి ఎప్పుడు వచ్చావురా!..”

“రాత్రి పదకొండు గంటలకు వచ్చాను. గోపాల్ తాతయ్యగారి యిల్లు స్టేషన్‍కు దగ్గర కదా. అక్కడ వుండిపోయాను.”

“పరీక్షలు బాగా వ్రాశావా!..”

“వ్రాశానత్తయ్యా!.. బావ మామగారు!..”

“లోపల వున్నారు. గజ్జల సవ్వడి వినిపిస్తుందిగా!..” చిరునవ్వుతో చెప్పింది సావిత్రి రాఘవ పూర్తి చేయక మునుపే.

“మామయ్య బావను తప్పక తనకు వారసుణ్ణి చేస్తారన్న మాట.”

“వాడికి నాట్యం అంటే ఎంతో యిష్టం కదరా!..”

“అవునవును.. ఆ విషయం నాకూ తెలుసు అత్తయ్యా!..”

“నీవు తర్వాత ఏం చేయాలనుకొంటున్నావు. పై చదువా లేక ఉద్యోగమా!..”

“ఆలోచిస్తున్నానత్తయ్యా!.. నేను యింకా ఒక నిర్ణయానికి రాలేదు.” నవ్వాడు రాఘవ.

“పొయ్యి మీద పాలు పెట్టి వచ్చానురా. వస్తాను. కూర్చో..” వేగంగా లోనికి పోయింది సావిత్రి. రాఘవ సుల్తాన్ ఎదురుగా కూర్చున్నాడు.

“బాబూ!.. నేను మీకు తెలుసా!..”

“మీ పేరు సుల్తాన్ భాయ్ కదూ!..”

“అవును.. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు.” చిరునవ్వుతో చెప్పాడు సుల్తాన్.

“నేను మిమ్మల్ని రెండు మూడు సార్లు చూచాను. మాట్లాడే అవకాశం లేకపోయింది. మీరు రెవిన్యూ ఆఫీస్‌లో పని చేస్తున్నారు కదూ!..”

“అవును బాబూ.”

“ఎవరో కొత్త అధికారి వచ్చాడట. మంచివాడేనా!..”

“హుఁ..” నిట్టూర్చి.. “మీరు అన్నమాటకు వ్యతిరేకం బాబు. మనిషి మహా అహంకారి.” వ్యంగ్యంగా చెప్పాడు సుల్తాన్.

“మనమంతా ఏకమై ఒక మాట మీద.. ఒకే బాటన నడిస్తే వారి అహంకారాన్ని అంతం చేయలేమా సుల్తాన్ భాయ్!..” అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు రాఘవ.

సుల్తాన్ దీనంగా రాఘవ ముఖంలోకి చూచి సాలోచనగా తల దించుకొన్నాడు.

“సుల్తాన్ భాయ్!.. దేన్ని సాధించాలన్నా.. మనుషుల మధ్యన సఖ్యత ముఖ్యం. పరస్పర అవగాహన, లక్ష్యం.. నమ్మకం.. ముఖ్యం. అవి ఏవీ మనలో లేవు. మన పూర్వీకులలో లేవు. కాబట్టే యీ తెల్లవారు.. మన వారిని వర్గాలుగా చీల్చి.. ఒక వైపు చేరి రెండవ వర్గాన్ని నాశనం చేసి.. తమ ఆధిక్యతను పెంచుకొని.. మన వారిని వారి మాయ మాటలతో నమ్మించి.. వంచించి.. సఖ్యతను సమాధి చేసి రాజ్యాన్ని వారి స్వాధీనం చేసికొని మనకు పాలకులైనారు. అవునా?” అవేశంగా అడిగాడు రాఘవ.

“అవునయ్యా!.. మీరు చెప్పింది సత్యం.”

ప్రక్క గదిలో కాలి అందెల సవ్వడి ఆగిపోయింది. ఆ గది తలుపు తెరవబడింది. నరశింహశాస్త్రి బయటికి వచ్చారు. వెనుక.. అద్వైత్.. పాండురంగ.

పిల్లలందరూ వరసగా బయటికి వచ్చి గృహ ప్రాంగణాన్ని దాటి వీధిలో ప్రవేశించారు.

నరసింహశాస్త్రిని సావిత్రి సమీపించింది.

“సుల్తాన్ మీ కోసం వచ్చి వున్నాడండి.” మెల్లగా చెప్పింది. నరశింహశాస్త్రి భ్రుకుటి ముడిపడింది. వరండాలోకి వచ్చారు సాలోచనగా.

శాస్త్రిగారిని చూచి.. సుల్తాన్, రాఘవ నిలుచున్నారు.

“సుల్తాన్.. విషయమేమిటి?..”

“అయ్యా!.. తమరిని రాబర్ట్ దొర పిలుచుకొని రమ్మన్నాడు” వినయంగా చెప్పాడు.

“ఎందుకట?..”

“విషయం ఫలానా అని నాతో చెప్పలేదయ్యా..”

“ఆ విషయం ఏమిటో నాకు తెలుసు నాన్నగారు!..” వరండాలోకి వస్తూ అద్వైత్ అన్నాడు.

నరశింహశాస్త్రి వెనక్కు తిరిగి చూచారు.

నరశింహశాస్త్రి ముఖ కవళికలను చూచి వారు అప్రసన్నంగా వున్నారని గ్రహించిన రాఘవ మౌనంగా వుండిపోయాడు. తనకు ప్రియమైన రాఘవను చూచి అద్వైత్.. చిరునవ్వుతో పలకరించాడు. వెను తిరిగిన తండ్రి ముఖంలోకి చూచి..

“నాన్నగారూ.!.. అతను మీతో మీరు వారికి తెలుగు నేర్పే విషయాన్ని గురించి మాట్లాడేదానికి రమ్మని వుంటారు. మీరు అనుమతిస్తే మీకు మారుగా నేను వెళతాను.”

“అంటే నీ వుద్దేశం!..”

“అతను ఆ విషయాన్నే అడిగితే.. మీకు వీలుకాదని నేను నేర్పుతానని వారికి చెబుతాను నాన్నగారూ!..”

“అతను అదే కోరితే.. నీవు అతనికి తెలుగు నేర్పుతావా!..”

“మీరు సమ్మతిస్తే నేర్పుతాను. నాన్నగారూ.. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదని మీరే కదా నాకు నేర్పారు..”

“అంతేకాదు. వారు పాలకులు. కాదని విభేదాన్ని సృష్టించకుండా వారి మాటను మన్నించి.. అవునని సఖ్యతను కోరుకోవడం వివేకవంతుల లక్షణం కదరా ఆదీ!..”

వెనుక వున్న సావిత్రి అన్న మాటలను విని ఆమె ముఖంలోకి చూచారు నరశింహశాస్త్రి.

ఆ ముఖం ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో గోచరించింది శాస్త్రిగారికి. ఆ చూపుల కలయికతో వారి వదనంలోనూ ప్రశాంతత.

“సరే.. వెళ్ళిరా అద్వైత్!..” చెప్పి, తన్నే చూస్తున్న రాఘవ వంక చూచి.. చిరునవ్వుతో.. “రాఘవా!.. ఎప్పుడు వచ్చావు?..” అడిగారు నరశింహశాస్త్రి.

“నిన్న రాత్రి వచ్చాను. తాతయ్యగారి యింట్లో మకాం. యిక్కడికి అరగంట ముందు మిమ్మల్ని చూడాలని వచ్చాను మామయ్యా!..” నువ్వుతూ.. చెప్పాడు రాఘవ.

“అయ్యా!.. ఇక నేను బయలుదేరుతానయ్యా!..” చెప్పాడు సుల్తాన్.

“నీతో అద్వైత్ వస్తాడు” కొడుకు ముఖంలోకి చూచారు నరశింహశాస్త్రి.

“వెళ్ళొస్తాను నాన్నగారూ!..” చెప్పాడు అద్వైత్.

“మంచిది”

“మామయ్యా.. నేను ఆదితో కలసి వెళతాను. వారితో మాట్లాడి తిరిగి వస్తాం” అన్నాడు రాఘవ.

“సరే!.. అనవసరమైన మాటలు వద్దు. క్లుప్తంగా మాట్లాడి రండి.”

“అలాగే మామయ్యా!..” అన్నాడు రాఘవ.

అద్వైత్.. సుల్తాన్.. రాఘవ వీధి గేటు వైపుకు నడిచారు.

“నాయనా ఆదీ.. స్నేహంతో దేన్నైనా సాధించవచ్చు. ద్వేషం పతనానికి దారి తీస్తుంది, గుర్తు వుందిగా.. జాగ్రత్త” అంది సావిత్రి.

అద్వైత్.. వెనక్కు తిరిగి తల్లిని చూచి నవ్వాడు. తల ఆడించాడు.

ముగ్గురూ వీధిలో ప్రవేశించారు.

“ఏం బావా!.. ఎలా వున్నావ్..” నవ్వుతూ అడిగాడు రాఘవ అద్వైత్ భుజంపై చెయ్యి వేసి.

“రేయ్!.. రాఘవా నీ ముందే వున్నానుగా.. ఎలా వున్నానో నీవే చెప్పు!..” నవ్వాడు అద్వైత్.

తన నోటిని ఆది చెవి దగ్గరకు చేర్చి రాఘవ.. “నీకో విషయం తెలుసా బావా!..” అన్నాడు.

“ఏమిటది?..”

“అల్లూరి సీతారామరాజు చిట్టగాంగుకు బెంగాల్ విప్లవకారుల సమావేశానికి వెళ్లారట!..”

“అంటే!..”

“తిరిగి వచ్చాక మన్యవాసులతో కలసి యీ తెల్ల కొడుకుల్ని నాశనం చేయబోతున్నారు.” కసిగా చెప్పాడు

ముందు నడుస్తు సుల్తాన్‌ను చూపించి తన చూపుడు వ్రేలిని నోటికి అడ్డపెట్టాడు అద్వైత్.

“జరగవలసింది జరగక మానదు. అది విధాత నిర్ణయం.” గర్వంగా నవ్వాడు రాఘవ.

“సుల్తాన్ భాయ్!..” పిలిచాడు రాఘవ.

సుల్తాన్ వెనక్కు తిరిగి చూచాడు.

“నీ దొరగాడికి పెళ్ళాం పిల్లలూ వున్నారా!..” నవ్వుతూ అడిగాడు రాఘవ.

“ఆ విషయం మనకెందురా!..” అన్నాడు అద్వైత్.

“అంటే.. వాడు సన్యాసా లేక సంసారా అనే విషయాన్ని తెలుసుకుందామని బావా!..”

“పెళ్ళాం.. ఒక కొడుకు.. కూతురు వున్నారట బాబూ!..” చెప్పాడు సుల్తాన్.

“ఎక్కడ వున్నారు?..”

“అది మనకవసరమరా!..”

“కలవబోతున్నాం కదా!.. వివరాలు తెలిసికోవడం అవసరమే కదా బావా!..”

“ఆ సుల్తాన్ భాయ్!.. ఆ పిల్లకి వయస్సు ఎంతట?..” నవ్వుతూ అడిగాడు రాఘవ.

“ట్వంటీ టు యియర్స్..”

“ఆ చిన్న తెల్లోడికి?..”

“ట్వన్టీ సిక్స్..”

“రాఘవా!.. యిక ఆపరా!..”

“సుల్తాన్ భాయ్!.. చివరి ప్రశ్న..” అద్వైత్ ముఖంలోకి చూచి నవ్వాడు రాఘవ.

“అడగండి బాబూ!..” అన్నాడు సుల్తాన్.

“యిప్పుడు నీవు చెప్పావే.. వారంతా ఎక్కడున్నారు?..”

“కలకత్తా..”

“యిక్కడికి రారా?”

“రేపు వస్తున్నారు బాబూ!..”

రాఘవ అద్వైత్ ముఖంలోకి చూచి కన్ను కొట్టి నవ్వాడు.

“రేయ్, రేయ్ ఇది నీకు తగునా?”

“నీవు నాకు ఏమౌతావు?”.

“నీకు తెలీదా?”

“తెలుసుగా బావ.. బావవు కాబట్టే.. నీతో ఈ సరదా కబుర్లు!..” ఆనందంగా నవ్వాడు రాఘవ.

ముగ్గురూ.. రాబర్ట్ కార్యాలయాన్ని చేరారు. సుల్తాన్ లోనికి వెళ్ళి వారు వచ్చినట్లు రాబర్ట్‌కు తెలియజేశాడు. రాబర్ట్ వారు వున్న ముందు వరండాలోకి వచ్చాడు. అతని చేతిలో సిగార్ వెలుగుతూ వుంది. గట్టిగా ఓ దమ్ము లాగి పొగను బయటికి వదిలాడు.

“వేరీజ్ యువర్ ఫాదర్?..”

“వారు రాలేదు. నన్ను పంపారు. నేను మీకు తెలుగు నేర్పుతాను”

ఆంగ్లంలో మృదుమధురంగా చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్.

“యు విల్ టీచ్ మీ!..” ఆశ్చర్యంతో అడిగాడు రాబర్ట్.

“యస్ సర్..”

“హౌ మచ్ టైమ్ యిట్ విల్ టేక్?..”

“దట్, డిపెండ్స్ అపాన్ యువర్ యింటెలిజెన్స్..” చిరునవ్వుతో చెప్పాడు రాఘవ.

“హు యీజ్ హి..” రాఘవను పరీక్షగా చూస్తూ అడిగాడు రాబర్ట్.

“మై బ్రదర్-ఇన్-లా..”

“గుడ్ లుకింగ్ లైక్ యు!..”

రాఘవ, అద్వైత్ ముఖాల్లో చిరునవ్వు.

“షల్ వుయ్ స్టార్ట్ టుమారో మార్నింగ్!..” అడిగాడు రాబర్ట్.

“నో సార్!.. డే ఆఫ్టర్ టుమారో..” అన్నాడు అద్వైత్.

“వై నాట్ టుమారో!..”

“నాట్ గుడ్ డే!..” చెప్పాడు రాఘవ.

“హి యీజ్ రైట్ సార్!..” అన్నాడు అద్వైత్.

“హో.. ఓకే. వుయ్ విల్ స్టార్ట్ డే ఆఫ్టర్ టుమారో.. కమ్ అట్ సిక్స్ థర్టీ మార్నింగ్.”

“ఓకే సార్. వుయ్ ఆర్ గోయింగ్..”

“ఆఁ, ఫర్‍గాట్ టు ఆస్క్.. వాట్ యీజ్ యువర్ నేమ్?..”

“అద్వైత్.. యు కెన్ కాల్ మీ ఆది!..” నవ్వుతూ చెప్పాడు

“అదవయిత్!..”

‘అదవయిత్ కాదురా ఎదవా.. అద్వైత్..’ అనుకొన్నాడు సుల్తాన్.

“మీనింగ్!..”

“నో సెకండ్రీ..” నవ్వాడు రాఘవ.

“మీన్ యీజ్ సుప్రీమ్!..”

“యస్.. హి యీజ్ సుప్రీమ్..”

పగలబడి నవ్వాడు రాబర్ట్.. “హి యీజ్ సుప్రీమ్!!!..”

“యస్..” తీక్షణంగా చెప్పాడు రాఘవ.

“నో నో..” తన ఎడం చేతిని గుండె వైపు తాకించి.. “వుయ్ ఆర్ సుప్రీమ్స్.. యూ ఆర్ బ్లాక్ ఫెలోస్” మరలా పగలబడి నవ్వాడు రాబర్ట్.

‘రేయ్!.. తెలుపు తెలుపు అని విర్రవీగుతూ వికటాట్టహాసం చేస్తున్నావే.. నీ తెలుపును తగలబెట్టి నల్లని మసిగా మార్చేకాలం ఎంతో దూరంలో లేదురా.. పండుకోతి’ అనుకొన్నాడు రాఘవ.

“సార్!.. బై..” వినయంగా చెప్పాడు అద్వైత్.. రాఘవ చేతిని తన చేతిలోనికి తీసికొన్నాడు. యిరువురూ ముందుకు నడిచారు.

“బై..” చెప్పి లోనికి వెళ్ళాడు రాబర్ట్.

‘నీ అహంకారం.. త్వరలో నిన్ను కాల్చి వేస్తుందిరా..’ అనుకొన్నాడు సుల్తాన్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here