అద్వైత్ ఇండియా-16

0
14

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[రెడ్డి రామిరెడ్డి వచ్చి మర్నాడు చేయబోయే కాశీ ప్రయాణం గురించి చెప్పి, శాస్త్రిగారిది, సావిత్రిది, వసుంధర టిక్కెట్లు శాస్త్రి గారికి అందజేస్తారు. రామిరెడ్డి గారి తల్లి ఆస్తికి సంబధించిన కేసు ఒకటి కోర్టులో ఉంది. ఆ కేసులో తనకు అనుకూలంగా తీర్పు వస్తే బంగారు లక్ష్మి విగ్రహం ప్రతిష్ఠింపజేస్తానని అంటారు. సాయంత్రం నుంచి కాశీయాత్ర ప్రయాణానికి బట్టలు సామాన్లు సర్దుతారు పిల్లలు. తాము తిరిగి వచ్చేవరకు ఇంటి బాధ్యతని నిర్వహించమని, అద్వైత్ సీతలను చూసుకోమని సుమతికి చెబుతుంది సావిత్రి. సీతకు జాగ్రత్తలు చెబుతుంది. భోజనాలై, ఎవరి గదుల్లోకి వారు వెళ్ళాక, సావిత్రి తమ గదికి వెళ్ళి తలుపు తోయబోయి, లోపల భర్త కొడుకుల మాటలు వినిపించి, బయటే ఆగిపోతుంది. అది చూసిన శాస్త్రి గారు ఆమెను లోపలికి రమ్మంటారు. కొడుకుకి జాగ్రత్తలు చెబుతున్నానంటారు. సావిత్రి కూడా జాగ్రత్తలు చెబుతుంది. సరేనంటాడు అద్వైత్. ప్రయాణం రోజున ఉదయం ఏడింటికల్లా స్టేషన్‍కు వస్తారంతా. వాళ్ళని సాగనంపడానికి అద్వైత్.. సీత.. పాండురంగ.. సుమతీ స్టేషన్‍కు వెడతారు. కాశీ వెడుతున్నవారంతా బోగీలో కూర్చుంటారు. ఇంతలో ఇండియా అక్కడికి పరుగున వచ్చి, గురువుగారి చేతిలో పదివేల రూపాయలు పెడుతుంది. మీ శిష్యులు, శిష్యురాండ్ర పేరుతో కాశీలో పేదలకు ఆ డబ్బుని పంచమంటుంది. ఆమెను అభినందిస్తారు శాస్త్రి గారు. నువ్వు మా జాతిలో పుట్టి ఉంటే కోడల్ని చేసుకునేదాన్ని అంటుంది సావిత్రి. ఆ మాటలు విన్న సీతకి పట్టరాని కోపం వస్తుంది. రైలుకి సిగ్నల్ ఇవ్వడంతో, అందరూ దిగుతారు. రైలు వెళ్ళిపోయాకా, ఫ్లాట్‌ఫారమ్ మీద నడుస్తూంటే, తమ వెనుకే వస్తున్న ఇండియాను చూసి, మా వెనకాలే ఎందుకు వస్తున్నావని అడుగుతుంది సీత. మీ వెనక రావడం లేదనీ, ఫ్లాట్‌ఫారమ్ మీద నడుస్తున్నానీ అంటుంది ఇండియా. పొగరు అనుకుంటుంది సీత. ఇంతలో ఇండియా గబగబా ముందుకు నడిచి అద్వైత్‍ని కలుసుకుని, అమ్మమ్మ మేరీ మిమ్మల్ని తీసుకురమ్మందని చెబుతుంది. ఎందుకని అడిగితే, కారణం తెలియదంటుంది. సీతని, సుమతిని, పాండురంగని ఇంటికి వెళ్ళమని చెప్పి, కారులో ఇండియాతో పాటు వెళ్తాడు అద్వైత్. అతన్ని తాను పిలిపించిన కారణం చెబుతుంది మేరీ. తాను వాళ్లతో లండన్ వెడుతున్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోతాడు అద్వైత్. నాన్నగారు మాట ఇచ్చారని విని, ఊరుకుంటాడు. తర్వాత వాళ్ళందరూ కలిసి ఆండ్రియా నిర్వహించే శరణాలయానికి వెళ్తారు. అక్కడి ఏర్పాటులను, పద్ధతులను చూసిన అద్వైత్ ఆమెను అభినందించి, ఐదు వందల రూపాయలు విరాళంగా ఇస్తాడు. వార్డ్‌నర్‌కి ఆండ్రియా సూచనలు చేశాకా, మళ్ళీ అందరు తిరిగి వస్తారు. – ఇక చదవండి.]

అధ్యాయం 32:

[dropcap]ప్ర[/dropcap]తి సంవత్సరం ఆ ప్రాంతానికి తోలు బొమ్మల ఆటగాళ్ళు ఒంటెద్దు బండ్లలో వస్తారు. వారు నరసింహశాస్త్రిగారి యింటి ఆవరణంలో ఉత్తరపు వైపున చింత చెట్ల క్రింద బస చేసి.. ప్రాంతీయ పెద్దలను కలసి తోలుబొమ్మల ఆటను ప్రదర్శిస్తారు. బండ్లను శాస్త్రిగారి యింటి ముందు నిలిపి ఆ ముఠా నాయకుడు జోగయ్య నరసింహశాస్త్రి ఇంటి వరండా ముందుకు వచ్చి నిలబడి..

“సామీ!..” పిలిచాడు.

స్కూలుకు బయలుదేరుతున్న అద్వైత్ ఆ పిలుపు విని వరండాలోనికి వచ్చాడు. “చిన్నసామీ!.. దండాలు.. అయ్యగారు లేరా!..” అడిగాడు జోగయ్య.

“జోగయ్యా!.. అంతా బాగున్నారా!..”

“ఆఁ.. అంతా మీలాంటి పెద్దల దయ సామి. నాన్నగారు..” జోగయ్య పూర్తి చేయక మునుపే..

“నాన్నా అమ్మ అత్తయ్య.. కాశీకి వెళ్ళి వున్నారు. వారం రోజుల్లో వస్తారు” చెప్పాడు అద్వైత్.

“సామీ!.. మన చెట్టు క్రింద దిగుతాం..”

“ఆ.. మంచిది..”

సీత.. తయారై వరండాలోకి వచ్చింది.

“చిన్న సామీ.. ఈమె..”

“మా పెద్దత్త వసుంధర మనుమరాలు. పేరు సీత. నాతో పాటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తూనే వుంది. ఇద్దరం స్కూలుకు బయులుదేరుతున్నాము”

“మంచిది సామి ఎల్లిరండి. నేను తమర్ని సాయంకాలం కలుస్తా..”

“సరే..”

జోగయ్య బండ్ల దగ్గరకు వెళ్ళిపోయాడు.

సీత.. అద్వైత్‍లు సుమతికి చెప్పి స్కూలుకు బయలుదేరారు.

ఆ సాయంత్రం.. జోగయ్య వచ్చాడు. అద్వైత్ వరండాలో కూర్చొని పిల్లల పరీక్ష పేపర్లను చూచి మార్కులు వేస్తూ వున్నాడు. జోగయ్యను చూచి..

“జోగయ్య!.. ఏమన్నా కావాలా!..” అడిగాడు అద్వైత్.

“చినసామీ!.. ప్రతిసారి యీ ఊర్లో మేము ఏసే తొలి ఆట నాన్నగారి పేరు మీదనే..”

“ఓహో అదా విషయం. అలాగే వేయండి.” జోబులో వున్న పర్సును తీసి ఐదువందలు జోగయ్యకు అందించాడు.

సీత.. సుమతీ వరండాలోకి వచ్చారు. వారు అద్వైత్ జోగయ్యకు ఇచ్చిన డబ్బును చూచారు.

“బావా!..”

సీత ఏమి అడగబోతుందో ఎరిగిన అద్వైత్.. “సీతా!.. వీళ్ళు తోలు బొమ్మల ఆటగాళ్ళు. మన చెట్ల క్రింద దిగి వున్నారు. ప్రతి ఏటా వస్తారు. యిక్కడ వీరు వేసే తొలి ఆట నాన్నగారి పేరు మీదనే..” చిరునవ్వుతో సీత ముఖంలోకి చూస్తూ చెప్పాడు అద్వైత్.

“మీ పేరేమిటి?..” అడిగింది సీత

“జోగయ్యమ్మగోరూ!..”

“ఏ ఏ నాటకాలు వేస్తారు!..”

“నాటకాలు కాదమ్మగోరూ.. తోలు బొమ్మలాట..”

“అదే!.. పేర్లేమిటి?..”

“లంకా దహనం.. రాయబారం.. హరిశ్చంద్ర.. కృష్ణలీలలు..”

“మా మామయ్యగారి పేరు మీద ఏ బొమ్మలాట వేస్తారు!..”

“అది మీరే చెప్పాలమ్మ గోరూ!..”

సీత సుమతి ముఖంలోకి చూచింది.

“లంకాదహనం బాగుంటుంది సీతా!..” అంది సుమతి.

“అలాగా!..”

“అవును..”

“సరే!.. జోగయ్యా!.. లంకా దహనం ఆడండి..” అద్వైత్ ముఖంలోకి చూచి.. “బావా.. నీకు యిష్టమేగా!..” అడిగింది సీత.

“పవనపుత్రుడు.. చిరంజీవి.. శ్రీ వీరాంజనేయ స్వామివారి కథ.. సుందరాకాండ.. హైందవుడుగా పుట్టిన ఎవరైనా ఇష్టం లేదని అనగలరా సీతా!.. మంచి నిర్ణయం” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్.

“సరే సామీ!.. రేపు రాత్రికి చిన్నమ్మగారు చెప్పినట్టుగా లంకాదహనం ఆడుతాం. శలవు..” జోగయ్య వెళ్ళిపోయాడు.

డాన్స్ క్లాస్‌కు పిల్లలు వచ్చారు. వారు వచ్చిన పది నిముషాల్లో ఇండియా వచ్చింది. చింత చెట్ల క్రింద వున్న బండ్లను, మనుషులను చూచింది. అద్వైత్‍ను సమీపించింది.

“సార్!.. వారంతా ఎవరు?..”

“తోలు బొమ్మల ఆటగాళ్ళు..”

ఆ పదాలను తొలిసారి వింది ఇండియా.

“తోలు బొమ్మ ఆట.. అంటే!..”

“తోలుతో.. బొమ్మలను చేసి.. వాటికి చిత్రవిచిత్రమైన రంగులతో బట్టలను కిరీటాలను చిత్రించి.. ఆ బొమ్మలను తెరపై ఆడిస్తూ ఆడే ఆట.. మా పురాణకథలకు సంబంధించినవి..” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్.

“నేను చూడాలి..”

“రేపు చూద్దువుగాని.. పద క్లాస్‌కు టైమ్ అయింది..”

ఇండియా నాట్యం చేసే గదికి వెళ్ళిపోయింది.

వారి సంభాషణ విన్న సీత..

“సుమతీ!..”

“ఏం సీతా!..”

“యీ తెల్లదానికి అన్నీ కావాలే!..”

“తెలియని విషయాలను అడిగి తెలుసుకోవడంలో తప్పేముంది సీతా!..” అనునయంగా చెప్పింది సుమతి.

నాట్యం నేర్చుకొన వచ్చిన వారికి గంటసేపు నాట్య శిక్షణను ఇచ్చాడు అద్వైత్.. క్లాసు ముగిసింది పిల్లలందరూ వెళ్ళిపోయారు.

కారును తీసికొని సుల్తాన్ వచ్చాడు. ఇండియా అద్వైత్‌కు నమస్కరించి కారును సమీపించింది.

“అమ్మా వెళదామా!..” అడిగాడు సుల్తాన్

“ఆ చెట్ల క్రిందికి వెళదాంరా సుల్తాన్ భాయ్!..”

“ఎందుకమ్మా!..”

“తోలు బొమ్మలను చూడాలి..”

“అలాగా!..”

“అవును..”

“సరే పదండి..”

ఇరువురూ చింత చెట్ల క్రిందికి వెళ్ళారు. వారిని చూచిన జోగయ్య పరుగున వారి ముందుకు వచ్చి నమస్కరించాడు.

“ఈమె యీ ప్రాంతపు రెవిన్యూ అధికారిగారి కూతురు. మీ తోలు బొమ్మలను చూడాలని వచ్చారు. చూపించండి” అన్నాడు సుల్తాన్. గుడ్డ టెంటు లోపల పెద్ద అల్యూమినియం పెట్టెల్లో తోలు బొమ్మలున్నాయి.

ముగ్గురూ.. గుడారంలో దూరారు. జోగయ్య పెట్టెను తెరిచి రావణుడి తోలు బొమ్మను చేతికి తీసుకొని నిలబెట్టాడు.

“యీ బొమ్మ పేరు?..” అడిగింది ఇండియా.

“పది తలల రావణుడు. ఒకప్పుడు లంకకు రాజు” చెప్పాడు జోగయ్య. చిత్రమైన రంగులతో కిరీటాలతో వస్త్రధారణతో కిరోసిన్ దీపపు కాంతితో మెరిసిపోతున్న రావణుని ఆకారాన్ని చూచి ఇండియా ఆశ్చర్యపోయింది.

“దీన్ని ఎవరు తయారు చేశారు?..”

“నేనేనమ్మా!..” వినయంగా చెప్పాడు జోగయ్య.

“ఆర్టు చాలా బాగుంది. మీరు గొప్ప చిత్రకారులు..” చిరునవ్వుతో చెప్పింది ఇండియా. జోగయ్య ఆంజనేయస్వామి బొమ్మను చూపించాడు.

“వీరి పేరు..” అడిగింది ఇండియా.

“ఆంజనేయస్వామి..” చెప్పాడు జోగయ్య.

“చాలా బాగుంది. వెలుతురు చాలడం లేదు. రేపు వచ్చి చూస్తాను..” అంది ఇండియా.

“అలాగేనమ్మ. రండి” వినయంగా చెప్పాడు జోగయ్య.

నేల పాతిన గునపానికి తాడుతో కట్టిన వారి కుక్క అరుస్తూ వుంది.

“కుక్క.. విశ్వాసం గల జంతువు. క్రొత్త వాళ్ళం కదా!.. అరుస్తూ వుంది.” నవ్వుతూ చెప్పింది.

ఇండియా.. జోగయ్య తల ఆడించాడు. సుల్తాన్ ఇండియా కారును సమీపించి కూర్చున్నారు. సుల్తాన్ కారును స్టార్ట్ చేశాడు.

“సుల్తాన్ భాయ్!..”

“ఏమ్మా!..”

“యీ దేశంలో చాలా గొప్ప కళాకారులు వున్నారు.. ఆ బొమ్మలను చూచారుగా!.. ఎంతో బాగున్నాయి”

“కొందరికి అలాంటి కళలే కడుపు నింపే దానికి ఆసరా!..”

“ఆసరా అంటే!..”“

“ఆధారం..”

“ఓహో!.. మీరన్నమాట నిజం.. నాకు అలాంటి బొమ్మలు చిన్న సైజులో కావాలి వారు చేసి యివ్వగలరా!..” అడిగింది ఇండియా.

“ఆ తోలు బొమ్మలు మీకెందుకమ్మా!..”

“ఆల్బంలో వుంచుతాను..”

“అతన్ని రేపు అడుగుదాం..”

“ఆ బొమ్మలతో వారు ఏం చేస్తారు?..”

“తెల్లని పంచలను స్క్రీన్‌గా ఏర్పాటు చేసి.. వారంతా ఆ తెర వెనుకన చేరి, ఆ బొమ్మలను తెరపై వుంచి.. మనం కాళ్ళు చేతులు కదిలించినట్లుగా ఆ బొమ్మల అంగాలను కదిలిస్తూ వాటికి బదులుగా తెర వెనుక వున్న వారు మాట్లాడుతారు.. ఆ బొమ్మలను ఆడిస్తారు. పాడుతారు. వారివద్ద వున్న బొమ్మలన్నీ హైందవ పురాణ పురుషులవేనమ్మా.. వారు ఆ బొమ్మల ద్వారా ప్రదర్శించే ఆట ఆ పురాణాలకు సంబంధించినవే.. పల్లెవాసులకు ఆ ఆట పెద్ద ఆనందం. వినోదం.. తోలుబొమ్మల ఆటలను ఆడుతూ వారు వూరు వూరూ తిరిగి పొట్ట నింపుకుంటారు” అన్నాడు సుల్తాన్.

వారు అద్వైత్ గారి ఇంటి వద్దనే ఎందుకు దిగారు?..”

“మీ గురువుగారు నరసింహశాస్త్రిగారు.. తన వద్దకు వచ్చి యాచించిన వారికి ఆశ్రయాన్ని కల్పిస్తారు. వారు ప్రతి సంవత్సరం వస్తారు”

“అలాగా!..” ఆశ్చర్యంతో అడిగింది ఇండియా.

“అవునమ్మా!..”

“సుల్తాన్ భాయ్!.. మా గురువుగారు చాలా గొప్పవారు.. వారి మాదిరే అద్వైత్ గారు.. ఆ కుటుంబంలోని అందరూ చాలా మంచివారు.”

“అవునమ్మా!..” సుల్తాన్ కారును పోర్టికోలో ఆపాడు.

ఇండియా కారు దిగి లోనికి వెళ్ళిపోయింది. తాను తొలిసారిగా చూచిన తోలు రంగు బొమ్మలను గురించి తల్లి ఆండ్రియాకు అమ్మమ్మ మేరీకి ఆశ్చర్యానందాలతో చెప్పింది ఇండియా. జోగయ్య కళా నైపుణ్యాన్ని గురించి పొగిడింది. వారూ ఆశ్చర్యంతో విన్నారు. ఉదయాన్నే వెళ్ళి చూడాలనుకొన్నారు.

మరుదినం.. ఎనిమిది గంటలకు ఇండియా, ఆండ్రియా, మేరీ.. జోగయ్య వున్న స్థలానికి వచ్చారు. తెల్ల దొరసానులను చూచి జోగయ్య, ఆయన బృందం ఆశ్చర్యపోయారు. ఇండియా కోరికపై అన్ని తోలు బొమ్మలను వారికి చూపించాడు జోగయ్య. అన్ని బొమ్మల ఫోటోలను తీసింది ఇండియా. ఆండ్రియా వారికి వెయ్యి రూపాయలు ఇచ్చింది. వారంతా పరమానందంతో నమస్కరించారు.

“యీ రాత్రి ఎనిమిది గంటలకు లంకా దహనం ఆడతామమ్మా!.. మీరు తప్పక రావాలి..” వినయంగా చెప్పాడు జోగయ్య.

“తప్పకుండా వస్తాం” చెప్పింది ఇండియా.

ముగ్గురూ కారు ఎక్కి వెళ్ళిపోయారు.

జోగయ్య బృందం సాయంకాలానికల్లా పొడుగు బెంచీలను గ్రామస్థుల ఇండ్ల నుంచి తెచ్చి వెదురు గడలను పాతి.. ఆరు మాళ్ళ తెల్ల పంచలను నాలుగింటిని తుమ్ము ముళ్ళతో కుట్టి పెద్ద స్క్రీన్‌ను తయారు చేసి గడలకు బిగించారు. పెట్రో మాక్స్ లైట్లను స్క్రీన్ వెనుక పైన ఎదురు గడకు కట్టి లైట్లను వేలాడదీశారు.

ఏడున్నర నుండి జనం.. స్టేజ్ ముందు వచ్చి గుమిగూడారు. స్టేజ్‌కి ఒక ప్రక్కగా రెండు నులక మంచాలను అద్వైత్ కుటుంబీకులు కూర్చునేటందుకు ఏర్పాటు చేశారు.

భోజనానంతరం.. అద్వైత్.. సీత.. పాండురంగ.. సుమతీ వెళ్ళి మంచాలపైన కూర్చున్నారు. జనం చాలామంది గుమికూడారు.

స్టేజి పైకి బంగారక్క.. కేతిగాడు వచ్చారు. వీరు హాస్య పోషణకు ప్రతి ఆట మొదట వచ్చే పాత్రలు.

తెర వెనుక చేరి.. జోగయ్య బృందం ఆటను ప్రారంభించారు. కేతిగాడు కాళ్ళు చేతులూ అడిస్తూ..

“ఏందే బంగారక్క!.. చాలా సంబరంగా వుండవు. ఇసయం ఏంటి?” బొమ్మ కదలిక మనిషి మాట క్రమబద్ధంగా సాగుతాయి.

“ఒరేయ్ కేతిగా!.. యియ్యాళ చాలా గొప్పరోజు. గొప్ప మనసున్న మారాజు అద్వైత్ బాబుగారు నరసింహశాస్త్రిగారి కుమారుడు లంకాదహనం తోలుబొమ్మలాట ఆడిస్తా వుండర్రా…”

“అట్టాగా.. నా బంగారక్కా!..”

“అవున్రా.. పిచ్చి సన్నాసి.. నీకు తెలవదా!..”

“తెలవదక్కా.. నీవు ఇప్పుడు చెప్పినావు కదా..”

“రేయ్.. రేయ్!.. అటు చూడు.. ఆంజనేయస్వామి ఆఘమేఘాల మీద ఆకసంలో ఎగిరిపోతుండడు.”

ఆ ఇరువురి పైన ఆంజనేయులు తోలు బొమ్మ గాల్లో తేలిపోతూ వుంది. తెర వెనుక నుంచి కళాకారుడు చిత్రంగా తెరపైన బొమ్మను కదిలిస్తున్నాడు.

“ఆఁ ఆఁ.. అవునక్క.. ఆంజనేయస్వామి రయ్యిమని ఆకశంలో ముందుకు పోతుండడు”

“ఆఁ చూచినావుగా.. యిక పద.. మనం కూడా జనంలో కూకొని ముందు ఏం జరుగుద్దో చూద్దాము పద..”

బంగారక్క కేతిగాడి బొమ్మలు తెర నుంచి తొలగిపోయాయి.

లంకిణి బొమ్మ తెరపైకొచ్చింది. నోరును తెరచుకొని చూచే దానికి భయంకరంగా వుంది.

అదే సమయానికి ఇండియా.. తన గ్రాండ్ మదర్ మేరీతో వచ్చింది. వారిని చూచిన అద్వైత్.. నవ్వుతూ వారికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికాడు.

సీత వారిని చూచి.. తన ప్రక్కనే వున్న సుమతి తొడను గిల్లింది.

“అబ్బా!..” అంటూ సుమతి సీత ముఖంలోకి చూచింది.

“అటు చూడు.. మన పాలిటి లంకిణి వచ్చింది..” అసహనంగా అంది సీత.

వారిని చూచి సుమతి.. “చూడాలని వచ్చి వుంటారు కాబోలు.. నీకేం నష్టం!..” అంది.

‘ఒసే మొద్దు.. నా బాధ నీకెలా తెలుస్తుందే!.. యిలా ప్రతిదానికి, ప్రతి చోటికీ ఆ లంకిణి దాపురిస్తే.. నేను బావా సరదాగా మాట్లాడుకొనే దానికి ఆస్కారం ఎలా వుంటుందే..’ అనుకొంది సీత.

ఇండియా.. మేరీలతో అద్వైత్ మంచాలను సమీపించాడు. వారిని కూర్చోమని చెప్పాడు.

సీత.. సుమతి.. పాండురంగా ఒక మంచం పైకి మారారు. వారు ముగ్గురూ వేరే మంచం మ్మీద కూర్చున్నారు. అంతవరకూ ఎంతో ఆనందంగా వుండిన సీత మనస్సున.. వ్యాకులత, అప్రసన్నత.

లంకిణి.. “ఏయ్ కోతీ!.. ఎవరు నువ్వు?.. మా లంకకు ఎందుకొచ్చినావ్?..” గాండ్రిస్తూ ఆంజనేయస్వామి మీదికి దూకింది.

చిన్న ఆకారంలో వున్న ఆంజనేయస్వామి.. ఎగిరి ప్రక్కకు గంతేసి..

“చూడమ్మా!.. నేను కోతినే.. మీ లంక చాలా బాగుంటుందని యిన్నా, చూడాలని వచ్చినా. చూచి ఎల్లి పోతా!..” అన్నాడు ఆంజనేయస్వామి.

లంకిణి.. అంజనేయస్వామివారి తోలు బొమ్మల కదలికలు తెర వెనుక ఆయా పాత్రల సంభాషణ చెప్పేవారి చాతుర్యం.. ఇండియాకు ఎంతో ఆశ్చర్యాన్ని కదిలించాయి. ఒక్క తెలుగు అక్షరం.. రాని మేరీ కూడా ఆ విచిత్ర పదర్శనాన్ని వింతగా చూడసాగింది. అద్వైత్‌ను తన ప్రక్కన కూర్చోమని.. తనకు బొమ్మల సంభాషణను వివరించమని ఇంగ్లీష్‍లో చెప్పింది.

మనస్సున అయిష్టంగా వున్నా.. చేసే దానికి వేరు మార్గం లేక అద్వైత్ ఇండియా.. మేరీల మధ్యన కూర్చొని బొమ్మల కదలికలను గురించి.. వారి సంభాషణను గురించి మేరీకి ఆంగ్లంలో వివరించసాగాడు.

కథ.. తనకు తెలియనిది కాబట్టి.. ఇండియా అద్వైత్‌కు దగ్గరగా జరిగి అతను చెప్పే మాటలను వినసాగింది.

ఆ సన్నివేశాన్ని చూచిన సీతకు.. ఒంటికి దురదగుంటాకు రాచుకొన్న రీతిగా తనువు మనస్సున శగ పొగ క్రమ్మాయి. సహనం నశించింది. స్థిమితంగా కూర్చోలేక పోయింది. అద్వైత్‍ను చురచురా చూచింది.

అద్వైత్.. సీతను గమనించలేదు.. తెరను చూస్తూ బొమ్మల హావభావాలను గురించిన కథను మేరీకి తెలియజేస్తున్నాడు. లంకిణి బొమ్మ మారిపోయి పెద్ద ఆకారం బొమ్మ భయంకరంగా నోరు తెరచుకొని తెరపై ప్రత్యక్షమయింది.

అలుక.. కోపంతో సీత..

“నాకు తలనొప్పిగా వుంది. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను” అని సుమతికి చెప్పి.. వెళ్ళిపోయింది.

సుమతి.. పాండురంగలు సీత బాధను గ్రహించారు.. కానీ ఏమీ చేయలేని స్థితి. మౌనంగా వుండిపోయారు. ఆకసంలో మబ్బులు క్రమ్మాయి. వెలుతురు స్థానంలో చీకటి నిండింది.. వర్షం ప్రారంభమయింది. తోలు బొమ్మలాట ఆగిపోయింది. జనం లేచి తమ తమ ఇండ్ల వైపుకు పరుగులు తీశారు.

అద్వైత్ ఇండియా మేరీలు.. అద్వైత్ ఇంటి వరండాలోకి వచ్చారు. సుమతి.. పాండురంగలు ఇంట్లోకి పోయారు. గాలీ వర్షం.. తీవ్ర రూపం దాల్చింది.

కారులో వారిరువురినీ అక్కడ దింపి.. ఆండ్రియా రమ్మన్న కారణంగా సుల్తాన్ కారులో వెళ్ళిపోయాడు. నాటక స్టేజీ దగ్గర నుండి ఇంటి వరండాలోకి వచ్చేసరికి అందరి గుడ్డలూ తడిసిపోయాయి. చలికి మేరీ గడగడ వణక సాగింది. వారిరువునీ అద్వైత్ తన గదిలోకి తీసుకు వెళ్లాడు. టవల్స్ అందించి తలలను తుడుచుకోమన్నాడు. తన తల్లి రెండు చీరలను రవికలను తెచ్చి వారికి యిచ్చి బట్టలను మార్చుకోమని చెప్పాడు. తాను తలుపు మూసి గది బయటకి వచ్చాడు. ఎదుటి గది సీతది.. వాకిట నిలబడి యీనిన పులిలా అద్వైత్‌ను చూచింది. అద్వైత్ సీతను సమీపించాడు. రోషంతో లోనికి వెళ్ళిపోయింది సీత.

వాకిట్లో కారు హారన్ మ్రోగింది. ఇండియా చీరను మార్చేసింది. మేరీకీ చీరను తానే చుట్టింది. గొడుగు సాయంతో ఇరువురిని ఒకరి తర్వాత ఒకరిని కారు దగ్గరకి చేర్చాడు అద్వైత్. వారు కార్లో వెళ్ళిపోయారు.

అధ్యాయం 33:

శాస్త్రిగారు.. కాశీ నుంచి తిరిగి వచ్చారని విన్న ఆండ్రియా, మేరీలు వారిని కలిశారు. వారి యొక్క లండన్ ప్రయాణాన్ని గురించి శాస్త్రిగారికి తెలియజేశారు. అద్వైత్‍ను పంపమని మరోసారి కోరారు. నరసింహశాస్త్రి సమ్మతించారు. వారు ఆనందంగా వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత..

అంతవరకూ హాల్లో కూర్చొని.. వరండాలో జరిగిన వారి సంభాషణను అద్వైత్ విన్నాడు. తండ్రి పిలుపు విని వరండాలోకి వచ్చాడు. తండ్రి ముఖంలోకి చూచాడు.

“నాన్నా ఆదీ!..” అద్వైత్ ముఖంలోకి చూచారు నరసింహశాస్త్రి.

“చెప్పండి నాన్నా!..”

“నీవు.. ఆండ్రియా మేరీ మేడంలతో కలిసి లండన్ వెళ్ళాలి.. నాట్యంలో నీకున్న ప్రతిభను వారు నడిపే స్కూళ్ళల్లోని బాలబాలికలకు నేర్పాలి.. మంచి పేరును గౌరవాన్ని సంపాదించాలి..” క్షణం తర్వాత.. “ఇది నీ విషయంలో నా ఆశయం..” అన్నారు శాస్త్రిగారు.

కొన్ని క్షణాలు మౌనంగా వుండిపోయాడు అద్వైత్. సింహద్వారం ప్రక్కన నిలబడి వున్న తల్లిని చూచాడు. ఆమె కళ్ళల్లో కన్నీరు.. గమనించాడు.

“అమ్మకు ఇష్టమేనా నాన్నా!..” మెల్లగా అడిగాడు అద్వైత్.

“ఒక్కగానొక్క కొడుకును దూరదేశాలకు పంపేదానికి ఏ తల్లికీ ఇష్టం వుండదు అద్వైత్. మీ తల్లీ అంతే.. కానీ.. నేను వారికి మాట యిచ్చాను నీవు నా మాటను జవదాటవనే నమ్మకంతో. పైగా.. ఇంతవరకూ నీవు నా ఏ నిర్ణయాన్ని కాదనలేదు..” చెప్పడం ఆపారు నరసింహశాస్త్రి.

“నా మీద మీకున్న నమ్మకానికి నాకు ఎంతో సంతోషంగా వుంది నాన్నా!.. మీ ఇష్టానుసారంగా నేను లండన్‌కు వారితో వెళతాను. మీకు సంతోషమే కదా నాన్నా!..” మెల్లగా చెప్పాడు అద్వైత్.

‘నీ యీ తండ్రి సృష్టికి ప్రతి సృష్టి చేయలేడు.. నీకు కష్టాలు రానున్నాయని తెలిసి.. నిన్ను మాకు దూరంగా పంపుతున్నాను. నా యీ ప్రయత్నం.. ఎంతవరకూ ధర్మబద్ధమో నాకు తెలియదు. నేనూ అందరిలా ఒక తండ్రినే కదా!.. విధి నిర్ణయం ఎలా వుందో!.. నీ క్షేమం కోసం… నాకు తోచిన ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ఆ పైన.. అందరికీ రక్షకుడు ఒక్కడే. ఆ దైవమే నిన్ను రక్షించాలి. నా ప్రయత్నం నాది!..’ మనస్సును అనుకొన్నారు నరసింహశాస్త్రి గారు.

ఆ క్షణంలో వారి నయనాల్లో కన్నీరు. అద్వైత్ వాటిని చూచాడు. తండ్రిని సమీపించి వారి ముందు మోకాళ్ళపై కూర్చొని..

“నాన్నా!.. మీరు అన్నీ తెలిసినవారు. నా భావి జీవితానికి ఏది తగునో.. ఏది తగదో.. అనే విషయం, నా కన్నా మీకే బాగా తెలుసు. ఈనాడే కాదు ఏనాడైనా సరే.. మీ నిర్ణయాన్ని నేను కాదనబోను. బాధ పడకండి.. మిమ్మల్ని యిలా చూస్తే అమ్మ.. తట్టుకోలేదు. ఆమెను వూరడించవలసిన మీరు..”

కుర్చీ నుంచి వేగంగా లేచి.. నరసింహశాస్త్రి అద్వైత్‌ను లేపి కౌగిలించుకొన్నారు. “ఆ సర్వేశ్వరుడు నిన్ను చల్లగా చూచుగాక!..” కౌగిలిని విడిచి తన కుడి హస్తాన్ని అద్వైత్ తలపై వుంచి మనసారా దీవించారు నరసింహశాస్త్రి. పవిటతో కన్నీటిని ఒత్తుకుంటున్న సావిత్రిని చూచాడు అద్వైత్. మెల్లగా ఆమెను సమీపించాడు.

“అమ్మా!.. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది. వెంటనే తలుపు తెరచి ముందు నిలబచి వున్న అదృష్టాన్ని మన సొంతం చేసికోవాలని నీవే కదా అమ్మా నాకు నేర్పావు. ఇలాంటి అవకాశం అందరికీ రాదు కదమ్మా!.. యీ దేశంలోని ఆంగ్లేయులను మన వారంతా ద్వేషిస్తున్నారు వారి ప్రవర్తనను బట్టి. కానీ వారిలో కొందరు మన కుటుంబాన్ని గౌరవించి నన్ను వారి దేశానికి తీసుకొని పోతున్నారంటే.. నీ యీ కొడుకు పగవారిలోని కొందరికి ప్రీతిపాత్రుడే కదమ్మా!.. ఇది నీకు ఆనందం కాదా… నీవు తప్పకుండా ఆనందించాలమ్మా. ఇలాంటి అవకాశం అందరికీ రాదు.. అమ్మా!.. నీ భయం ఏమిటో నాకు తెలుసు. అక్కడ నేను త్రాగుతానేమో మాంసాహారాన్ని తింటానేమో.. శీలాన్ని పోగొట్టుకొంటానేమో అనే కదూ!.. ఆ దేశంలో ఆ మూడు నన్ను ఏమీ చేయలేవమ్మా!.. కారణం నేను ఎక్కడ వున్నా ఏం చేస్తున్నా నాన్నగారు నీవు నా కళ్ళముందుటారమ్మా!.. యీ జ్యోతి ఉద్భవానికి కారణమైన ఆ దివ్యజ్యోతులు నా కళ్ళముందు నాకు మార్గదర్శకంగా ప్రజ్వలిస్తూ వుంటాయి” అన్నాడు అద్వైత్.

సావిత్రి పారవశ్యంతో.. అద్వైత్ శిరస్సును వంచి తన హృదయానికి హత్తుకొంది.

రెడ్డి రామిరెడ్డిగారు గేటు తలుపు తెరచికొని లోనికి వచ్చారు. నరసింహశాస్త్రి వారిని కూర్చోమని చెప్పారు. సావిత్రి.. అద్వైత్‍ల చూపులు వారి వైపుకు మళ్ళాయి.

“శాస్త్రిగారూ!.. అమ్మా సావిత్రమ్మా!.. నేను కేసును గెలిచామనమ్మా.. ధర్మపరంగా నాకు రావలసిన మా అమ్మగారి ఆస్తి నాకు సంక్రమించింది. కోర్టు ఆర్డర్ అయింది. యీ సంతోష సమయంలో.. నేను మీకు చెప్పినట్లుగా బంగారు శ్రీమహాలక్ష్మిమాత విగ్రహానికి ఆర్డర్ యిచ్చాను. యీ శుభవార్తను మీకు తెలియజేయాలని వచ్చాను” ఆనందంగా చెప్పాడు.

“రెడ్డిగారూ!.. మీది బంగారు మనస్సు. మీ ప్రతి సంకల్పం.. అద్వితీయంగా నెరవేరుతుంది” నవ్వుతూ చెప్పారు శాస్త్రిగారు.

“యీ శుభతరుణంలో నా చేతి కాఫీని మీరు తప్పక తాగి వెళ్ళాలి అన్నయ్యగారూ!..” చిరునవ్వుతో చెప్పి లోనికి వెళ్ళింది సావిత్రి.

“రెడ్డిగారూ!..”

“చెప్పండి స్వామీ!..”

“వచ్చే సోమవారం మన అద్వైత్‌ను, ఇండియా తల్లి అమ్మమ్మలతో లండన్ పంపుతున్నాను. వారు అక్కడ నడిపే స్కూళ్ళల్లో పిల్లలకు నాట్య శిక్షణను యిచ్చేదానికి”

“భలే.. చాలా మంచి అవకాశం.. అద్వైత్ బాబు, నీవు చాలా అదృష్టవంతుడివి. నిర్భయంగా వెళ్ళిరా. మన వారిని నేను నా ప్రాణప్రదంగా చూచుకొంటాను” సంతోషంగా చెప్పారు రెడ్డి రామిరెడ్డి.

సావిత్రి వచ్చి ముగ్గురికీ కాఫీ గ్లాసులను అందించింది.

కాఫీ త్రాగిన రామిరెడ్డి.. “అమ్మా కాఫీ అమృతంలా వుందమ్మా. వెళ్ళొస్తాను..” నరసింహశాస్త్రికి చెప్పి.. వెళ్ళిపోయారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here