అద్వైత్ ఇండియా-24

0
13

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[అద్వైత్.. ఇండియా, మేరీ.. మూన్ లండన్ చేరుతారు. అద్వైత్ కోసం అన్ని వసతులు ఉన్న గదిని ఏర్పాటు చేస్తుంది మేరీ. ఆ గదిని చూసి అబ్బురపడతాడు అద్వైత్. చాలా బాగుందని చెప్తాడు. కాసేపయ్యాకా బ్రేక్‌ఫాస్ట్‌కి రమ్మని పిలుస్తుంది ఆండ్రియా. మెయిడ్ వాళ్ళకి అన్నీ బల్ల మీద అమరుస్తుంది. అద్వైత్ కోసం బ్రెడ్ ముక్కలు, పల్ళు, బాదంపప్పు ప్లేట్‍లో ఉంచుతుంది. అద్వైత్‍కి కంపెనీ అంటూ, తాను కూడా ఇకపై శాకాహార భోజనమే చేస్తానని అంటుంది ఇండియా. తరువాత మేరీ, ఇండియా, అద్వైత్‍లు కారులో వెళ్ళి మేరీ నడుపుతున్న పాఠశాలలనూ చూస్తారు. తమ స్కూల్స్ ఎలా ఉన్నాయని మేరీ అడుగుతుంది. చక్కని క్రమశిక్షణతో ఉన్నాయని అంటాడు అద్వైత్. తన స్కూలు విద్యార్థులకు నాట్యం నేర్పే విషయంలో తన ప్రణాళిక వివరిస్తుంది మేరీ.  అది అతనికి అంతగా నచ్చదు. ఇండియాకి కూడా నచ్చదు. మేరీ చెప్పిన విధంగా చేస్తే, అద్వైత్‍కి పెద్దగా ఆదాయం రాదని అనుకుంటుంది. కొన్ని క్షణాల తరువాత తన మనసులోని ఆలోచనని మేరీకి చెప్తాడు. ఆమె అనుకున్నట్టుగా ఆమె స్కూళ్ళలోని విద్యార్థులకు కాకుండా – విడిగా ఒక డాన్స్ స్కూలు స్థాపిద్దామనీ, తానూ, ఇండియా అందులో పని చేస్తామని అంటాడు. ఇండియా సరేనంటుంది. ఆలోచన బాగానే ఉందని, ఆండ్రియా కూడా సంప్రదించి నిర్ణయం తీసుకుందామని అంటుంది మేరీ. రాత్రి ఆండ్రియాకు తమ ఆలోచన వివరించగా, ఆమె కూడా సరేనంటుంది. మూడవ రోజున పత్రికల్లో డాన్స్ స్కూలు గురించి ప్రకటన ఇస్తారు. రెండు వారాల్లో వందకు పైగా అప్లికేషన్స్ వస్తాయి. వారి ఆవరణలోనే డాన్స్ స్కూల్ హాల్ నిర్మించి, మంచి రోజున తరగతులు ప్రారంభిస్తారు. ఇంటికి ఉత్తరం రాస్తాడు అద్వైత్. పెద్దలందరికీ నమస్కారాలు తెలిపి, తన డాన్స్ స్కూలు వివరాలు తెలియజేస్తాడు. పాండురంగకు, సుమతికి, సీతకి ఆశీస్సులు అందజేస్తాడు. సుమతిని డాక్టరుకి చూపించమని పాండుకి చెప్పమని తండ్రిని కోరుతాడు. నాలుగు నెలల్లో తిరిగి వస్తానని చెప్తాడు. ఉత్తరం చదివిన శాస్త్రిగారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సీత కూడా ఉత్తరం చదువుతుంది. మర్నాడు ఉదయం రాఘవ వస్తాడు. అద్వైత్ రాసిన ఉత్తరం చదువుతాడు. పాండు సుమతిని లేడీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్తుంటే, సీత, రాఘవ కూడా వెళ్తారు. భార్యాభర్తలిద్దరూ ఒక రిక్షాలో, అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒక రిక్షాలో వెళ్తారు. ఆ సమయంలో రాఘవ చెల్లెలితో అన్ని విషయాలు మాట్లాడి జాగ్రత్తలు చెప్తాడు. డాక్టర్ గారు సుమతిని పరీక్షించి, అంతా నార్మల్ అని చెప్తారు. అందరూ ఇంటికి చేరుతారు. – ఇక చదవండి.]

అధ్యాయం 47:

[dropcap]రె[/dropcap]డ్డి రామిరెడ్డిగారు.. సతీమణి.. కుటుంబ సభ్యులందరితో కలసి శ్రీమహాలక్ష్మమ్మ ఆలయం వద్దకు ఉదయం ఆరు గంటలకు వచ్చారు.

వేకువన నాలుగున్నర గంటల నుంచీ నరసింహశాస్త్రి.. పాండురంగ.. రాఘవ, విజయనగరం నుంచి వచ్చిన ఘనాపాటీలు కలిసి నరసింహశాస్త్రిగారి ఆధ్వర్యంలో వేదమంత్రాలతో సశాస్త్రంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ నిర్ణయించిన సమయానికి అందరికీ మహదానంద ప్రదంగా చేశారు. సావిత్రి, వసుంధర, లాయర్ గోపాల్ శర్మ, సీత, సుమతి, ఆమె తల్లిదండ్రులు.. ఆ జగత్ జనని ప్రతిష్ఠను నేత్రానందంగా తిలకించారు. పలువురు పురప్రముఖులు మహదానందంగా ఆ మహోత్సవంలో పాల్గొన్నారు.

కార్యనిర్వాహకులకందరికీ రెడ్డిగారు ఘనంగా సత్కరించారు.

నైవేద్య దీపారాధనలు ఎంతో ఘనంగా జరిగియి. రెడ్డిగారు వచ్చిన వారందరికీ విందు భోజనాలను ఏర్పాటు చేశారు. వారి అతిథి మర్యాదలకు అందరూ సంతసించారు. విందు భోజనాన్ని ఆరగించారు. నరసింహశాస్త్రి గారి కుటుంబ సభ్యులు.. వారూ సహబంతిలో కూర్చొని భోంచేశారు. వారి ఆ చర్య కొందరికి ఆశ్చర్యం!..

పెద్దలు.. రెడ్డిగారిని వారి కుటుంబ సభ్యులను ప్రీతిగా ఆశీర్వదించారు.

అందరూ.. సంతుష్టులై.. రెడ్డిగారికి నరసింహశాస్త్రి గారికి చెప్పి వెళ్ళిపోయారు. ఫోటోగ్రాఫర్ ద్వారా.. కార్యక్రమాన్నంతా ఫోటోలు తీయించారు రెడ్డిగారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సంవత్సరం క్రింద రెడ్డిగారు అచ్చువేసి విడిచిన కోడెనంది అక్కడికి వచ్చింది. పెద్ద అరిటాకును పరచి.. భోజన పదార్థాలనన్నింటినీ రెడ్డిగారు తన శ్రీమతి చేత వడ్డింపచేశారు. నంది ఆనందంగా ఆరగించింది. తన యజమానికి సమీపించి.. మెడను సాచింది. ప్రీతిగా దాని మెడ క్రింద జవురుతూ “నందీ!.. నీవు ఎక్కడ వున్నావో!.. రావేమో!.. అనుకొన్నాను.” అన్నాడు రెడ్డిగారు.

ప్రీతిగా నంది వారి ముఖంలోకి చూచింది.

వీపు మీద తట్టి.. “వెళ్ళు నందీ!..” అన్నాడు రెడ్డిగారు.

నంది వెళ్ళిపోయింది.

నరసింహశాస్త్రిగారు.. రెడ్డిగారూ.. ఆర్చకునకు జాగ్రర్తలు చెప్పి.. వారి వారి ఇండ్లకు బయలుదేరారు.

అధ్యాయం 48:

అద్వైత్ లండన్‍కు వెళ్ళి రెండు మాసాలయింది. స్కూలు తెరిచారు. వేకువన ఐదు గంటలకు లేచి.. స్నానం చేసి సీత.. సుమతులు ఇంటి పనులు నిర్వర్తించేవారు. అందరికీ టిఫిన్ తయారు చేసి పెట్టేవారు.

సీత స్కూలు తొమ్మిది గంటలకు. ఇంటి నుండి స్కూలుకు పదిహేను నిముషాల నడక. ఎనిమిదీ ముక్కాలుకు సీత బయలుదేరేది.. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి వచ్చి భోంచేసి వెంటనే బయలుదేరేది. సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి తిరిగి వచ్చేది.

విగ్రహ ప్రతిష్ఠ జరిగిన మరుదినం రాఘవ భద్రాచలానికి బయలుదేర సన్నద్ధుడైనాడు. అందరికీ చెప్పాడు. ఆ రోజు ఆదివారం. సీత ఇంట్లోనే వుంది.

నరసింహశాస్త్రి వసుంధర సావిత్రి గోపాల్ శర్మగారికి ఆరోగ్యం సరిగా లేదని విని వారిని చూచి వచ్చేదానికి వెళ్లారు. పాండురంగ ఒక వివాహాన్ని జరిపించడానికి వెళ్ళాడు.

ఇంట్లో వున్నది.. రాఘవ, సీత, సుమతి.

సీత విషయం.. సుమతికి తెలుసునన్న విషయం సీత చెప్పి వున్నందున రాఘవ వారిరువురినీ పిలిచాడు. సుమతికి రాఘవ బావ వరస.

“ఏం బావా!..” అడిగింది సుమతి.

సీత ప్రశ్నార్ధకంగా రాఘవ ముఖంలోకి చూచింది.

“రండి కూర్చోండి..” అన్నాడు రాఘవ.

ముగ్గురూ వరండాలో కూర్చున్నారు.

“సుమతీ!.. సీత విషయం నీకు తెలుసు. బావ తిరిగి వచ్చేవరకూ నీవు సీతను జాగ్రత్తగా చూచుకోవాలి. విషయం మామయ్య అత్తయ్య బామ్మలకు తెలియకూడదు.”

“బావా!.. మీరు నాకు చెప్పాలా.. వరసకు తాను నాకు మరదలైనా సీత నాకు నా తోబుట్టువుతో సమానం. మీరు నిశ్చింతంగా వెళ్ళి రండి..”

“అమ్మా!.. సీత!..”“

“ఏం అన్నయ్యా!..”

“మన సుమతి మాటలు విన్నావుగా!..”

“సుమతి.. నాతో కూడా అలాగే ఎన్నోసార్లు చెప్పిందన్నయ్యా.. యీ పరిస్థితుల్లో సుమతే నాకు అండ.. నీవు జాగ్రర్తగా వెళ్లిరా!.. ఎవరితోనూ.. ఏ విషయంలోనూ ఆవేశపడకు. నాకు రెండు దిగుళ్ళు. ఒకటి బావ చాలా దూరంలో వున్నాడనేది!.. రెండవది.. నీవు ఎవరితో ఏ గొడవలు పెట్టుకొంటావో అనేది!.. నాకు బావకు.. నీ మీద ఎంత అభిమానమో నీకు తెలుసుగా!.. నీకు ఎవరిపైనైనా అభిప్రాయభేదంతో కోపం వస్తే మమ్మల్ని తలచుకో!..” ఎంతో సౌమ్యంగా చెప్పింది సీత.

“అవును బావా!.. యీ రోజుల్లో ఎవరి బ్రతుకు వాడిది. సత్యం, నీతి, న్యాయం, ధర్మం.. అని మనం చెప్పే మంచి మాటలను వినిపించుకొనేవారు చాలా తక్కువ. ప్రతి ఒక్కరిలోనూ స్వార్థం.. తాను తనవారు ఎలాగైనా హాయిగా బ్రతకాలి.. ఎదుటి వారు ఏమైపోయినా వారికి జాలి.. దయ వుండదు. మన చుట్టూ వున్న వ్యక్తులను చూస్తున్నాంగా!.. సీత విషయంలో మీరు నిశ్చంతగా వుండండి. ఆమెను నేను జాగ్రర్తగా గమనిస్తూ చూచుకొంటాను. మీరు.. మీ విషయంలో జాగ్రర్తగా నడుచుకోండి..” ప్రాధేయపూర్వకంగా చెప్పింది సుమతి.

“నీవు బి.య్యే లిట్రేచర్ కదూ!..”

“అవును బావా!..”

“సీతా!.. సుమతి క్వాలిఫికేషన్ చెప్పి స్కూల్లో ఏదైనా వేకన్సీ వుందేమో గౌరీ మేడమ్‌ని అడుగు. ఒకవేళ లభ్యపడితే.. మీ ఇరువురూ కలసి వెళ్ళి కలసి రావచ్చుగా!..”

“అన్నాయ్!.. ఒంటరిగా వెళ్ళేదానికి నాకు భయం అనుకొంటున్నావా!..” చిరునవ్వుతో అంది సీత.

“నీకు భయం లేదు.. నాకు భయం..!..” అన్నాడు రాఘవ.

“రేపు అడుగుతాను. అవకాశం వుంటే తప్పక సాయం చేస్తుంది గౌరీ మేడమ్..”

“అలాగే!.. టైమ్ అయింది. ఇక నేను బయలుదేరుతాను. సుమతీ!.. మరో నెల రోజుల తర్వాత డాక్టర్ గార్ దగ్గరకు వెళ్లిరా!..”

“అలాగే బావా!..” అంది సుమతి.

ముగ్గురూ వీధి గేటును సమీపించారు. వారికి చెప్పి రాఘవ ముందుకు నడిచాడు.

సీత.. సుమతీలు వెనుతిరిగి చూచిన రాఘవకు ‘టాటా’ చెప్పి అతను వీధి మలుపు తిరగడంతో లోనికి వచ్చారు. ఇరువురూ కూర్చున్నారు.

“సుమతీ!..”

“ఏం సీతా!..”

“యీ మధ్య వారం రోజులుగా కడుపులో అదోలా వుంటోంది!..” మెల్లగా చెప్పింది.

“ఏమిటి సీతా!..” ఆశ్చర్యంతో అడిగింది సుమతి.

“అవును సుమతీ!.. నేను చెప్పింది నిజం!..”

సుమతి కొన్నిక్షణాలు ఆలోచించి..

“ఇంటి దూరం అయ్యే రోజులు..” సుమతి పూర్తి చేయకముందే

“దాటి పోయాయి..” మెల్లగా చెప్పింది సీత.

‘అంటే!..’ స్వగతంలో అనుకొంది.

“ఆ రోజు?..” ప్రశ్నార్థకంగా సీత ముఖంలోకి చూచింది సుమతి.

“అవును..”

“సీతా!.. ఆశ్చర్యంతో అడిగింది సుమతి. సీత కళ్ళు మూసుకొని తల ఆడించింది. సుమతి కొన్ని క్షణాలు ఆలోచించి..

“డాక్టర్ గారిని కలసి వద్దామా!”

“తప్పక వెళ్ళాలంటావా!..”

“అనుమానం తీరాలంటే వేరే దారి లేదు సీతా!..” ఆందోళనగా అంది సుమతి.

“ఎప్పుడు వెళదాం!..”

“పెదనాన్నా.. పెద్దమ్మ వాళ్ళు సాయంకాలం కదా వస్తారు!.. మనం వెంటనే బయలుదేరడం మంచిది” అంది సుమతి.

“సరే నీ యిష్టం!..” సాలోచనగా చెప్పింది సీత.

ఇరువురూ ఇంటికి తాళం వేసి రిక్షాలో డాక్టర్ వద్దకు వెళ్ళారు. పరీక్ష జరిగింది. డాక్టర్.. “షి యీజ్ ప్రెగ్నెంట్..” నవ్వుతూ చెప్పింది.

ఇరువురూ.. ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఫీజ్ చెల్లించి రిక్షా ఎక్కి.. ఇంటికి బయలుదేరారు. మౌనంగా ఎంతో గంభీరంగా ప్రక్కన కూర్చొని వున్న సీత ముఖంలోకి చూచి సుమతి.

“సీతా!..” మెల్లగా పిలిచింది.

“ఇంటికి పోయి మాట్లాడుకొందాం..” అంది సీత.

రిక్షా త్రొక్కేవాడు తెలుగు వాడు కాబట్టి.. సీత అలా అన్నదని సుమతి గ్రహించింది.

పావు గంటలో రిక్షా వారి ఇంటి ముందు ఆగింది. డబ్బులు ఆ అబ్బికి యిచ్చి ఇరువురూ లోనికి నడిచారు.

వరండాలో కూర్చున్నారు.

‘ఈ సమయంలో అన్నయ్య వుంటే బాగుండేది.. వాడూ వెళ్ళిపోయాడు’ అనుకొంది సీత.

సుమతి సీత ముఖంలోకి చూచింది. ఆమె కళ్ళు మూసుకొని వుంది.. మూసిన కళ్ళనుండి కన్నీరు క్రిందికి జారాయి. వాటిని చూచిన సుమతి..

“సీతా!.. బాధ పడుతున్నావా!..”

అవునన్నట్లు తల ఆడించింది సీత.

“బాధపడి కన్నీరు కార్చితే తీరే సమస్య కాదిది సీతా!.. నీవు ఓ నిర్ణయాన్ని తీసికోవాలి!..”

సీత గుండెలపై చేతిని వుంచుకొని సుమతి ముఖంలోకి చూచింది. ఆమె చేతికి అద్వైత్ కట్టిన మాంగల్యం తగిలింది.

మనస్సులో ఏదో తియ్యని భావన..

పవిటను ప్రక్కకు జరిపి.. మాంగల్యాన్ని బయటికి తీసి సుమతికి చూపించింది సీత.

సుమతి ఆశ్చర్యంతో చూచింది..

“సీతా!.. అంటే!.. ఆఁ..”

“జరిగిపోయింది..”

“ఆ విషయాన్ని నాతో చెప్పలేదేం!..”

“అవసరం రాదనుకొన్నాను. యిప్పుడు వచ్చింది..”

“అయితే నీ నిర్ణయం!..”

“నీవు చెప్పదలచుకొన్న నిర్ణయానికి నేను రాను. ఇలాగే వుంటాను. అత్తయ్య మామయ్యలకు విషయం తెలిస్తే.. యథార్థాన్ని వారికి చెబుతాను. అంతవరకూ నీవు.. నాతో సహకరించు సుమతీ.. చేయి జాచింది సీత.

“తప్పకుండా!..” సీత చేతిలో తన చేతిని వేసింది సుమతి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here