అద్వైత్ ఇండియా-27

0
8

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[తన పరిస్థితి పట్ల సీతకు ఎంతో ఆందోళన కలుగుతుంది. నాలుగు నెలలు వచ్చినా, వాంతులు కాకపోవడం వల్ల ఎవరీకీ అనుమానం రాలేదు. ఓ రోజు సుమతితో మాట్లాడుతూ తన పరిస్థితి గురించి భయం కలుగుతోందని అంటుంది.   సీతకు ఉన్నవి రెండే మార్గాలని – ఒకటి గర్భం ఉంచుకోవడం లేదా గర్భస్రావం చేయించుకోవడం అని అంటుంది సుమతి. తాను గర్భం ఉంచుకోదలచానని చెప్తుంది సీత. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ఆ గదిలోకి సావిత్రి వస్తుంది. తమ మాటలు ఆమె విన్నట్టు గ్రహించిన సీత తన మాంగల్యాన్ని ఆమెకు చూపించి, దాన్ని అద్వైత్ తనకు ప్రసాదించాడని చెబుతుంది. అద్వైత్, సీత పెళ్ళి చేసుకున్నారని, ప్రస్తుతం సీత గర్భవతి అని సుమతి చెబుతుంది. సావిత్ర నమ్మలేకపోతుంది. ఏమీ మాట్లాడకుండా తన గదికి వెళ్ళిపోతుంది. ఓ వివాహం జరిపించడానికి వెళ్ళిన శాస్త్రి గారూ, పాండురంగ తిరిగి వస్తారు. ఆయన స్నానం చేసి భోజనం చేసాకా, సావిత్రి కూడా తిని – తమ గదిలోకి వెళ్ళాక, జరిగినదంతా భర్తకి వివరిస్తుంది. అద్వైత్ తమకు తెలీకుండా పెళ్ళి చేసుకున్న సంగతి, సీత గర్భవతైన సంగతి తెలుసుకుని ఆశ్చర్యపోతారాయన. కొద్దిసేపు ఆలోచించిన తరువాత, సీతను జాగ్రత్తగా చూసుకోమని, ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు తమ వంశపు వారసత్వమని చెబుతారు. మర్నాడు ఉదయం శాస్త్రిగారూ, పాండు నదీస్నానానికి వెళ్ళి వస్తుండగా వారికి సుల్తాన్ ఎదురవుతాడు. శాస్త్రి గారితో మాట్లాడాలని అంటాడు. పాండురంగ వాళ్ళిదరిని వదిలి, ఇంటివైపు మళ్ళుతాడు. శాస్త్రిగారితో నెమ్మదిగా మాట్లాడుతూ – అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలిసిన వ్యక్తుల గురించి రాబర్ట్ సన్నిహితులు ఆరా తీస్తున్నారనీ, రాఘవని జాగ్రత్తగా ఉండమని ఉత్తరం రాయమని చెప్తాడు. రాబర్ట్‌కి ఇంకా మా మీద ద్వేషం పోలేదా అని శాస్త్రి గారు అడిగితే, రాబర్ట్ దుర్మార్గాల గురించి చెబుతూ, మీరు విశాఖపట్నం వెళ్ళినప్పుడు.. అంటూ చెప్పబోయి ఆపేస్తాడు సుల్తాన్. అది గ్రహించిన శాస్త్రి గారు రెట్టించి అడిగితే, రాబర్ట్ ఓ వేడుకలో అద్వైత్ చేత బలవంతంగా తాగించడం, స్పృహలో లేని అద్వైత్‍ను తాను ఇంటి దగ్గర దించడం గురించి చెప్తాడు. తన ప్రశ్నలకు అన్నిటికి జవాబులు దొరుకుతాయి శాస్త్రి గారికి. ఇంటికి వచ్చిన శాస్త్రిగారికి సీత ఎదురుపడుతుంది. తనని క్షమించమని అడుగుతుంది. జరిగినదాంట్లో నీ తప్పేం లేదని ఆమెతో చెప్పి – మనం విశాఖపట్నం వెళ్ళినప్పుడు అద్వైత్, సీత వివాహం చేసుకున్నారని – వసుంధరకి చెప్తారు. ఆమె విస్తుపోతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 53:

[dropcap]రూ[/dropcap]థర్‍ఫర్డ్.. రాబర్ట్ ఆదేశానుసారంగా.. ప్రాంతీయ ఆంగ్ల శ్రేయోభిలాషులు.. వారి పోలీసు బలగాలు.. శ్రీ సీతారామరాజుగారి కోసం ముమ్మరంగా గాలించసాగారు.

1924 మే ఆరవ తేదీన శ్రీరాజుగారి అతి సన్నిహిత సహచరుడు అగ్గిరాజుగా ప్రసిద్ధికెక్కిన పేరిచర్ల సూర్యనారాయణ గారిని ‘మద్దెరు’ వద్ద పోలీసులు పట్టుకొన్నారు. ఆ మరుసటి రోజున.. ఆంగ్లేయుల తొత్తు.. కుంచు మీనన్ శ్రీ సీతారామరాజు వున్న పరిసరాలను పోలీస్ బలగంతో ముట్టడించి వారిని బంధించాడు.

జాతి.. రీతి.. నీతి.. లేని అలాంటి స్వార్థపు పయోముఖ విషకుంభాల వల్లనే మన దేశంలోకి ముస్లింలు.. ఆంగ్లేయులు ప్రవేశించి.. అంతఃకలహాలను సృష్టించి.. వారిని వంచించి.. మారణాయుధబలంతో.. స్వార్థంతో రాజ్యాలను.. ప్రాంతాలను ఆక్రమించి.. మనకు పాలకులు కాగలిగారు.

శ్రీ సీతారామరాజుగారిని వారు కొయ్యూరుకు తీసికొని వచ్చారు.

సమయం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం.. నరసింహశాస్త్రి వసుంధర వారి యింటి వరండాలో కూర్చొని వున్నారు. సీత స్కూలుకు వెళ్లి వుంది. సుమతి వంట యింట్లో సామాగ్రిని సర్దుతా వుంది. పాండు ఆశ్రమానికి వెళ్ళి వున్నాడు.

సావిత్రి యింటి ముందున్న పూల మొక్కలకు పైపుతో నీళ్ళు పెడుతూ వుంది.

ఆకాశం మేఘావృతమయింది. కారు చీకట్లు కమ్ముకొన్నాయి. దినకరుడు కనుమరుగైనాడు. తూర్పు దిశ నుండి పెద్ద తార ఎంతో వెలుగుతో నేల రాలింది.

ఆ దృశ్యాన్ని సావిత్రి చూచి ఆశ్చర్యంతో “ఏమండీ!.. ఏమండీ!.. అలా చూడండి” అని అరిచింది.

నరసింహశాస్త్రి.. వసుంధరలు నేలకు శరవేగంతో రాలిన తారను (నక్షత్రం) చూచారు.

ఆ రోజు 1924 మే ఏడవతేదీ..

“ఏమిటండీ యీ విచిత్రం!..” భర్తను సమీపించి సావిత్రి ఆశ్చర్యంతో అడిగింది.

“అది విచిత్రమే కాదు సావిత్రి.. సూచన కూడా!..” ఆకసం వైపు చూస్తూ చెప్పారు శాస్త్రిగారు.

“ఏమిటండీ ఆ సూచన!..” ఆత్రంగా అడిగింది సావిత్రి.

“ఎవరో.. మహనీయులు.. నేల రాలనున్నారు సావిత్రి..” విచారంగా చెప్పారు నరసింహశాస్త్రి.

“ఏమిటండీ మీరంటున్నది!..” ఆశ్చర్యంతో అడిగింది సావిత్రి.

“అవునే!.. అలా దివి నుండి తార నేల రాలిందంటే.. ఎవరో గొప్ప వ్యక్తికి కాలం తీరిందని అర్థం..” వసుంధరమ్మగారి వ్యాఖ్యానం.

“అవును సావిత్రీ!..” సాలోచనగా చెప్పారు నరసింహశాస్త్రిగారు.

శ్రీ అల్లూరి సీతారామరాజుగారిని పట్టుకొనే విషయంలో ఆంగ్లేయులు సాగించిన ప్రయత్నాలు విని వున్న నరసింహశాస్త్రిగారు.. ‘బహుశా.. వారు శ్రీ అల్లూరి సీతారామరాజుగారు అయి వుంటారా!.. వారు ఆంగ్లేయులకు దొరికి వుంటారా!.. సర్వేశ్వరా!.. వారిని రక్షించు.. వారిని రక్షించు..’ దీనంగా వేడుకొన్నారు.

సరిగ్గా.. అదే సమయంలో కిరాతక స్వరూపులు రూథర్‌ఫర్డ్ నాయకత్వంతో ఆంగ్లేయులు రంప ఉద్యమ స్థాపకులు.. వన్యవాసులు ప్రియతమ నాయకులు ఆంధ్ర హైందవజాతి ముద్దుల బిడ్డడు.. ఆంగ్లేయుల పాలిటి ఉగ్రనరసింహుడు అయిన శ్రీ అల్లూరి సీతారామరాజుగారిని చుట్టుముట్టి రాక్షసత్వంతో.. నిర్దయతో.. అమానుషంగా కాల్చి చంపారు. ఆంగ్లేయులకు యదను విరిచి గుండెలను చూపించి ‘కాల్చుకోరా నక్కా కాల్చుకో’ అని గర్జించిన ఆంధ్ర సింహం రక్తపు మడుగున అవనిపై వాలిపోయింది. ఆంగ్లేయుల హృదయాలకు శాంతి కలిగింది.. ఆ మహా విప్లవ వీరుని శకం.. ఇరవై ఆరేళ్ళకే ముగిసిపోయింది. లక్షలాది అభిమానుల హృదయాలకు తీరని ఆవేదనను మిగిల్చి ‘కృష్ణాదేవి పేట’లో భూమాత ఒడిలో శాశ్వత నిద్రితులైనారు శ్రీ అల్లూరి సీతారామరాజుగారు.

అధ్యాయం 54:

అద్వైత్.. లండన్‍కు వెళ్ళి అప్పటికి ఏడు మాసాలు..

ఏడు ఉత్తరాలు అతను తండ్రిగారికి రాశాడు. వాటికి జవాబు శాస్త్రిగారే వ్రాశారు. సీత గర్భవతి.. అని తెలిసిన తర్వాత వారు వ్రాసిన నాలుగు ఉత్తరాలలో ఆ విషయాన్ని వ్రాయలేదు. కారణం.. ఏమిటో వారికి మాత్రమే తెలుసు. సీత.. ఉత్తరం వచ్చిందని వినగానే.. తనకు ప్రత్యేకంగా అద్వైత్ వ్రాశాడని ఆశించేది. కానీ ఆది.. నరసింహశాస్త్రిగారి పేరనే వుండటంతో.. ఎంతగానో నిరాశ చెందేది.. ఆ కారణంగా తాను స్వతంత్రించి అద్వైత్‍కు ఉత్తరాన్ని వ్రాయలేకపోయింది.

నెలలు గడిచేకొద్దీ.. నరసింహశాస్త్రి.. సావిత్రి.. వసుంధర.. సుమతి.. సీతను ఎంతో అభిమానంగా చూచుకోసాగారు. నిండు చూలాలు సుమతి.. సీతకు అన్ని విషయాల్లో అండగా వుంటూ.. “అన్నయ్య త్వరలో వస్తాడుగా!.. నీవు ధైర్యంగా వుండు. మేమంతా నీకు తోడుగా వున్నాముగా!..” అని సీతకు చెప్పేది. ఆ రోజు గురువారం.. సుమతికి నొప్పులు ప్రారంభమైనాయి. హాస్పటల్లో చేర్చారు. అందరూ అక్కడే ఆ రాత్రంతా గడిపారు.

మరుదినం శుక్రవారం ఉదయం.. ఆరు గంటలకు సుమతికి సుఖ ప్రసవం జరిగింది. పాప పుట్టింది. అందరికీ ఎంతో ఆనందం. ‘మా అమ్మ శ్రీ మహాలక్ష్మి పుట్టింద’ని.. పాండురంగ మురిసిపోయాడు. ఆ శుభవార్తను నరసింహశాస్త్రిగారు.. కుమారుడికి.. మేనల్లుడు రాఘవకు ఊత్తరాల ద్వారా తెలియజేశారు.

మూడవ రోజున సుమతి పాపతో వారి అమ్మగారింటికి వెళ్లిపోయింది.

పదిహేను రోజుల తర్వాత బాలసారె రోజుకు రాఘవ వచ్చాడు. పాండురంగను కౌగలించుకొన్నాడు. అభినందనలను తెలియజేశాడు. ఆ పసికందును ఎత్తుకొని “అమ్మా! నీవు మా పిన్నివా!.. నీవు మా పిన్నివా!..” అని మురిసిపోయాడు.

నరసింహశాస్త్రిగారు.. పాపను ఎత్తుకొని “నీవు నా చెల్లివా అమ్మా!..” అని కంట తడి పెట్టుకొన్నారు. చందనపు బొమ్మలా స్వర్ణఛాయతో వున్న పాప అందరినీ ఆకర్షించింది. అందరూ ఎత్తుకొని ముద్దులాడారు. పాప బాలసారె వేడుక ఘనంగా జరిగింది. శ్రీ మహాలక్ష్మి అని నామకరణం చేశారు.

‘యీ సమయంలో బావ వుంటే ఎంత బాగుండేదో!..’ అనుకొన్నాడు రాఘవ.

మౌనంగా ప్రక్కన నిలబడి వున్న సీతను చూచి..

“అమ్మా!..” అన్నాడు.

“ఏం అన్నయ్యా!..”

“నీకు ఎన్నో నెలమ్మా!..”

“ఏడో నెల అన్నయ్యా!.. బావ నీకు ఏమైనా జాబు వ్రాశాడా..” అడిగింది సీత.

“వారం రోజుల క్రిందట.. ఒక్క ఉత్తరం వ్రాశాడు..”

“ఏం వ్రాశాడు?..”

“తాను అన్ని విధాలా బాగున్నాననీ.. నన్ను జాగ్రర్తగా వుండమని.. త్వరలో వస్తానని వ్రాశాడమ్మా!..” క్షణం ఆగి.. “మీ యిరువురి మధ్యనా వుత్తరాలు లేవా!..” అడిగాడు రాఘవ.

“వారు మామయ్య గారికే వ్రాస్తారు..”

“అయితే.. నీ యీ విషయం బావకు తెలుసునా లేదా!..”

“నాకేం తెలుసు!.. మామయ్య వారికి తెలిపినట్లుగా లేదు.. కారణం ఏమిటో!..” దిగులుగా చెప్పింది సీత.

“నేను వివరంగా వ్రాస్తాను, త్వరగా బయలుదేరి రమ్మని..”

“వ్రాయి అన్నయ్యా!.. ప్లీజ్..”

“మూడు నెలల ముందు నేను వచ్చినప్పుడు.. నాకు నీవు యీ విషయాన్ని ఎందుకు చెప్పలేదమ్మా!..”

సీత మౌనంగా వుండిపోయింది.

“నేను నీ అన్నయ్యను కదమ్మా! పరాయివాడిని కాదుగా!..”

“చెప్పాలనిపించలేదన్నయ్యా!.. సారీ..”

“సారీ ఏంటమ్మా!.. యీ విషయంలో నీవు నాకు సారీ చెప్పడం ఏమిటి?.. అప్పుడు నీవు చెప్పి వుంటే.. అన్ని వివరాలతో బావను వెంటనే బయలుదేరి రమ్మని జాబు వ్రాసి వుండేవాడిని..”

“ఇప్పుడు చెయ్యి అన్నయ్యా!.. ఆ పని..” దీనంగా చెప్పింది సీత.

“తప్పకుండానమ్మా!.. రేపు వ్రాస్తాను..”

సావిత్రి పిలవడంతో సీత ఆమె వైపుకు వెళ్ళింది.

ఆ నోట యీనోటా పడి.. శ్రీ అల్లూరి సీతారామరాజుగారి మృతి విషయం.. ఆ యింటి వారి చెవికీ సోకింది. రాఘవ ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళల్లో కన్నీరు. అతని హృదయంలో ఎంతో ఆవేదన.

బాలసారెకు వచ్చిన వారంతా ఆ వార్త విని శ్రీరాజుగారిని గురించే మాట్లాడుకోసాగారు. కొందరు తెల్లవారిని ఆవేశంతో తిట్టారు. కార్యక్రమం ముగియగానే.. రాఘవ భద్రాచలం వెళుతున్నానని చెప్పి.. నేరుగా కృష్ణదేవి పేటకు వెళ్ళాడు. వారి సమాధిని చూచి బోరున ఏడ్చాడు.

మనస్తత్వాలు ఒకటైనపుడు.. ఇరువురు మధ్యన మంచి స్నేహం ఏర్పడుతుంది. దానికి వయస్సుతో నిమిత్తం లేదు. అలాగే ఆశయాలు ఒకటైనప్పుడు ఒకరి కంటే మరొకరు వయస్సులో పెద్దవారైనా చిన్నవారైనా.. వారిరువురి మధ్యన ఏర్పడేది పిచ్చి అభిమానం.. గౌరవం. శ్రీ సీతారామరాజుగారి కన్నా చిన్నవాడైన రాఘవకు వారి పట్ల ‘గురువు’ భావన. ఎంతో ప్రేమ. శ్రీ రాజుగారికి జరిగిన అన్యాయానికి రాఘవ హృదయంలో ఆంగ్లేయుల పట్ల ఎంతో ద్వేషం.. ప్రతికార వాంఛ ఏర్పడ్డాయి.

భద్రాచలం చేరి.. గూడెం నాయకుడు గంటన్నను కలసికొని రాఘవ కన్నీటితో.. ఆంగ్లేయులు శ్రీసీతారామరాజును చంపిన విషయాన్ని చెప్పాడు. గంటన్న అతని గూడెం వారంతా ఎంతగానో బాధపడ్డారు. కన్నీరు కార్చారు.

ఒక రోజంతా ఆ ప్రియతమ నాయకుణ్ణి స్మరిస్తూ అన్నపానీయాలను వారంతా మానివేశారు. యీ ఆవేదనతో రాఘవ అద్వైత్‌కు ఉత్తరాన్ని సీతకు చెప్పినట్లుగా వ్రాయలేకపోయాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here