అద్వైత్ ఇండియా-37

0
11

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[ఓ రోజు అర్ధరాత్రి రాఘవ వచ్చి శాస్త్రి గారింటి తలుపు కొడతాడు. శాస్త్రిగారు తలుపు తీయగా, గుమ్మం వద్ద నిలబడిన రాఘవ నిలబడిన రాఘవ, అద్వైత్ వచ్చాడా అని అడుగుతాడు. రాఘవని లోపలికి లాగి, తలుపులు మూసి, ఏంటిరా ఇదంతా అని అడుగుతారు శాస్త్రి. ఇదంతా దైవ నిర్ణయమనీ, సీతకి ప్రసవమైందని విన్నాననీ, బావ వచ్చి ఉంటాడని అనుకున్నానీ చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సావిత్ర రాఘవను చూసి బాధపడుతుంది. పాండు కూడా లేచి వస్తాడు. కాసేపటికి సుమతి బిడ్డని తీసుకొచ్చి రాఘవకి చూపిస్తుంది. పాపని ఆశీర్వదిస్తాడు రాఘవ. ఈలోపు సావిత్రి వెళ్ళి సీతని నిద్ర లేపి రాఘవ వచ్చాడని చెబుతుంది. పోల్చుకోలేని స్థితిలో వున్న రాఘవను చూచి సీత ఆశ్చర్యపోతుంది. ఏడుస్తుంది. రాఘవ చెల్లెల్ని ఓదార్చి, బావ తప్పకుండా వస్తాడని ధైర్యం చెప్తాడు. సీత కూతురుని కూడా దీవించి, పెద్దలకి చెప్పి, అక్కడ్నించి వెళ్ళిపోతాడు. రాబర్ట్‌ని చంపేందుకు వాడి ఇంటికి వెళ్తాడు రాఘవ. అక్కడ ఇద్దరు ఆంగ్ల సిపాయిలు అడ్డుపడగా, వాళ్ళని కాల్చి చంపుతాడు. రాబర్ట్ ఊర్లో లేకపోవడంతో, అక్కడ్నించి తప్పించుకుంటాడు రాఘవ. లక్ష్మీదేవి బంగారు విగ్రహాన్ని దొంగిలించిన కరీమ్, చలమయ్యలు – రాబర్ట్ సూచనల మేరకు – కలకత్తా లోని రాబర్ట్ కొడుకు విన్సెంట్ ఇంట్లో దాచిపెడతారు. ఆనాటికి పది రోజుల ముందు రంగయ్య తన బావమరది బాలయ్యతో కలకత్తాకు వెళ్లి చామంతిని చూచి.. మాట్లాడి ఊరికి తిరిగి వస్తారు. రాఘవ ఇద్దరు సిపాయిలను చంపినందుకు, రాఘవ వివరాలు తెలిసీ చెప్పనందుకు గాను శాస్త్రి గారిని జైల్లో పెట్టిస్తాడు రాబర్ట్. ఈ వార్త తెలిసిన సావిత్రి, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళనకి లోనవుతారు. సావిత్రికి గుండెపోటు వస్తుంది. రెడ్డిరామిరెడ్ది గారు పోలీసు ఇన్‍స్పెక్టర్‍ని కలిసి మాట్లాడిన ఫలితం ఉందదు. న్యాయవాదుల సాయం కూడా లభించదు. సావిత్రికి హార్ట్ ఎటాక్ అన్న వార్త తెలియగానే రెడ్డిగారు సుల్తాన్ ఆసుపత్రికి వెళ్తారు. వైద్యానికి ఎంత ఖర్చయినా తాను భరిస్తానని రెడ్డిగారు వైద్యులకు చెప్తారు. తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్‍కి వెళ్ళి శాస్త్రిగారికి ఈ వార్తనందిస్తారు. ఆ రాత్రి పాండూకు సాయంగా రెడ్డిగారు హాస్పటల్లో.. సీతకు సాయంగా సుల్తాన్ శాస్త్రిగారి ఇంట వుండిపోతారు. – ఇక చదవండి.]

అధ్యాయం 73:

ఇల్లు సర్దుకొంటున్న సమయంలో చామంతి కంట శ్రీ మహాలక్ష్మి దేవి బంగారు విగ్రహం పడింది. దాన్ని చూచి చామంతి ఆశ్చర్యపోయింది.

మూడు వారాల క్రిందట తన తండ్రి బాలయ్య మేనమామ రంగయ్యా.. కలకత్తాకు వచ్చి, రెడ్డిగారు ప్రతిష్ఠ చేయించిన శ్రీ మహాలక్ష్మిదేవి విగ్రహాన్ని గురించి వర్ణించి చెప్పిన విషయాలన్నీ చామంతికి జ్ఞప్తికి వచ్చాయి.

రాజమండ్రి స్థానిక తెలుగు పేపర్లలో చుట్టి వున్న ఆ విగ్రహాన్ని పేపర్లో వున్న రాజమండ్రి అనే పేరును చూచి ఆ విగ్రహం.. రెడ్డిగారు చేయించేదేననే నిర్ణయానికి వచ్చింది చామంతి.

కొన్ని రోజుల క్రిందట రాత్రి సమయంలో వచ్చి విన్సెంట్‌తో మాట్లాడి విగ్రహాన్ని అతనికి అప్పగించిన కరీమ్.. చలమయ్యలు తిరిగి వెళ్ళేటప్పుడు వారిని కిటికీ గుండా చూచి.. వారి తెలుగు మాటలను విన్న చామంతికి.. ఆ విగ్రహం రెడ్డిగారు చేయించిందని దృఢమయింది. తనకు చెప్పకుండా విగ్రహాన్ని దాచి పెట్టిన విన్సెంట్ మీద అనుమానం వచ్చింది.

రాజమండ్రికి వెళ్ళి ఆ విగ్రహాన్ని తన తండ్రి మామయ్యలకు చూపించి రెడ్డిగారికి అప్పగించాలనే నిర్ణయానికి వచ్చింది. విన్సెంట్ వుదయం తొమ్మిది గంటలకు ఆఫీసుకు వెళ్ళి రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి వస్తాడు.

ఆ రోజు అతను ఆఫీస్‌కు వెళ్ళగానే బజారుకు వెళ్ళి ముస్లింల నల్ల గోషా వస్త్రాన్ని కొనుక్కొని ఇంటికి చేరింది. మరుదినం.. విన్సెంట్ ఆఫీసు వెళ్ళగానే విగ్రహాన్ని సంచిలో జాగ్రర్తగా సర్దుకొని బురకాను ధరించి టాక్సీ ఎక్కి స్టేషన్‍కు చేరి మద్రాస్ వైపు వెళ్ళే రైలు ఎక్కేసింది.

గొప్ప గొప్ప చదువులు చదివినవారికే.. తెలివితేటలు.. ధర్మాధర్మాలు.. సమయస్ఫూర్తి సొంతం కాదు. ఐదో తరగతికి కన్నా తక్కువ చదివి.. పెరిగి పెద్దవారయ్యాక.. వున్న సమాజ మధ్యన వారు విన్నవి.. కన్నవి.. వాటిని గురించి మంచి చెడ్డా ఆలోచన పామరులకు కూడా వ్యక్తిత్వాన్ని కలిగిస్తాయి. చదువుకు.. సంస్కారానికి.. సంబంధం లేదు.

అధ్యాయం 74:

ఆ రోజుకు నరసింహశాస్త్రిగారు జైలుకు సావిత్రమ్మ హాస్పటల్‌కు.. చేరి మూడు రోజులు. డాక్టర్లు తమ సామర్థ్యాన్నంతా ఉపయోగించి సావిత్రి గుండె పని చేసేలా.. చేసిన ప్రయత్నాలు వృధా అయినాయి. తనయుడు తనకు దూరమైన నాటి నుంచీ.. అప్పటి నుండి శాస్త్రిగారి తత్వంలో కలిగిన మార్పును గురించీ.. అద్వైత్ ఎప్పుడు తిరిగి వస్తాడని తాను అడిగిన ప్రశ్నకు శాస్త్రిగారి భావగర్భిత మాటలను విని అర్థం చేసికోలేని కారణంగా ఆలోచించి.. ఆలోచించి ఆమె ఎంతో మనోవేదనకు గురి అయింది. అప్పుడప్పుడూ ఆమెకు గుండె నొప్పి వచ్చేది.. ఆ సమయంలో కళ్ళు మూసుకొనేది.. కానీ తన స్థితిని గురించి ఎవరికీ చెప్పలేదు. నిరపరాధి అయిన నరసింహశాస్త్రిగారు సంకెళ్ళతో జైలు పాలు కావడాన్ని చూచిన ఆమె.. తట్టుకోలేక పోయింది. పై కారణాల రీత్యా.. సావిత్రి గుండె తనలోని భారాన్ని మోయలేక ఆగిపోయింది.

హాస్పిటల్‌లో వున్న పాండురంగ.. సుమతి.. రామిరెడ్డిగారు.. శేషారెడ్డి.. సుల్తాన్‍లు ఆ వార్త విని.. బోరున ఏడ్చారు.

సావిత్రమ్మ శవం.. ఇంటికి చేర్చబడింది.. ఆమెను చూచిన సీత గుండెలు బాదుకొంటూ ఏడ్వసాగింది. రెడ్డిగారూ.. సుల్తాన్ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఇన్‌స్పెక్టర్ గారికి విషయాన్ని చెప్పారు. శాస్త్రిగారిని విడిపించవలసిందిగా కోరారు. రాబర్ట్ పర్మిషన్ కావాలని చెప్పాడు ఇన్‌స్పెక్టర్.

వారిరువురూ.. రాబర్ట్‌ను కలిసే దానికి ప్రయత్నించారు. అతను అవకాశం యివ్వలేదు. విచార వదనాలతో వారు శాస్త్రిగారి నిలయానికి చేరారు. రాబర్ట్ చర్యను గురించి పాండురంగకు తెలియజేశారు.

వారి మాటలను విన్న సీత.. “ఒరేయ్ అన్నయ్యా!.. నాతో రారా!..” అంది శవం ప్రక్కన కూర్చొని వున్న సీత ఆవేశంతో లేచింది.

రెడ్డిగారిని సమీపించింది.. “బాబాయ్!.. యీ సమయంలో మీరే మాకు దిక్కు. అత్తయ్య బండెడు పసుపు కుంకుమ పూలతో సాగనంపాలి.. మీరు ఏర్పాటు చేయాలి” క్షణం తర్వాత.. “నేను రాబర్ట్‌ను కలసి మామగారిని విడిపించే విషయాన్ని గురించి మాట్లాడి వస్తాను” ఆవేశంతో చెప్పింది సీత.

వేగంగా.. వీధి వైపుకు నడిచింది. ఆమె వెనకాలే బయలుదేరిన పాండూను ఆపి సుల్తాన్..

“బాబూ! మీరు ఇక్కడ వుండండి. నేను సీతమ్మకు తోడుగా వెళతాను” అన్నాడు.

పాండు.. రెడ్డిగారి ముఖంలోకి చూచాడు.

‘అవును’.. అన్నట్లు వారు తల ఆడించారు.

పాండు ఆగిపోయాడు. సుల్తాన్ సీత వెనకాల నడిచాడు.

పావుగంటలో వారిరువురూ.. రాబర్ట్ భవంతిని చేరారు. అతను మూడవ భార్య లిల్లీ వరండాలో కూర్చొని ఏదో మాట్లాడుకొంటూ నవ్వుకొంటున్నారు.

వరండా ముందుకు వచ్చి నిలబడిన సీత.. సుల్తాన్‍లను చూచిన వారి నవ్వులు ఆగిపోయాయి.

“మిస్టర్ రాబర్ట్!..” పిలిచింది సీత.

“హు ఆర్ యు!..”

“సీత.. నరసింహశాస్త్రిగారి కోడలు..” ఆంగ్లంలో చెప్పాడు సుల్తాన్.

“వాడ్ డు యు వాంట్.. ఎనీ డొనేషన్!..” వ్యంగ్యంగా అడిగాడు.

“రాబర్ట్.. వేలు లక్షల్లో వున్న నా యీ దేశవాసులు డొనేషన్స్‌తో నీవు.. నీ వారు యీ దేశంలో బ్రతుకుతున్నారు. నీవు నాకు డొనేషన్ ఇస్తావా!..” నిర్లక్ష్యంగా నవ్వుతు అంది సీత.

“వాట్ యీజ్ యువర్ బ్లాబరింగ్ ఇన్ టెలుగు!..”

సీత వేగంగా చెప్పిన తెలుగు పదాలు రాబర్ట్‌కు అర్థం కాలేదు.

“మై ఆంట్ పాస్డ్ అవే..” విచారంగా చెప్పింది సీత.

“సో!..”

“రిలీజ్ మై అంకుల్..”

“వేరీజ్ యువర్ బ్రదర్ రాఘవ!.. గెట్ హిం హియర్. ఐ విల్ రిలీజ్ యువర్ అంకుల్..”

“ఐ డోన్ట్ నో వేరీజ్ మై బ్రదర్.. ప్లీజ్ రిలీవ్ మై అంకుల్.. ఎట్ హోమ్ నౌ హిజ్ ప్రజన్స్ యీజ్ మోస్ట్ ఇంపార్టెంట్!”

“యీజ్ యిట్ సో!..”

“యస్!..”

“దెన్.. యు సిట్ ఇన్ ద జైల్.. ఐ విల్ రిలీజ్ నరసింహ!..” వికటంగా నవ్వాడు రాబర్ట్. మేరీ కూడా అతని నవ్వులో పాలు పంచుకొంది.

సీతకు అవేశం అధికమయింది.

“యు ఫూల్.. డోన్ట్ లాఫ్.. ఐయాం టాకింగ్ విత్ యు అబౌట్ వెరీ సీరియస్ మేటర్!..”

“మేటర్ మే బీ సీరియస్ టు యు. బట్ యీజ్ నాట్ ఫర్ మీ.. మై వర్డ్ యీజ్ వర్డ్!..” వ్యంగ్యంగా చెప్పాడు రాబర్ట్.

“రాబర్ట్.. మై వర్డ్ ఆల్సో వర్డ్..”

“మీన్స్..”

“యు కెన్ పుట్ మీ ఇన్ జైల్.. ఆప్టర్ మై ఆంట్స్ క్రిమినేషన్!..”

“అమ్మా!..” ఆశ్చర్యంతో అరిచాడు సుల్తాన్.

“సుల్తాన్ భాయ్!.. మామయ్యగారు జైలునుండి బయటికి రావడం ఇప్పుడు ఎంత ముఖ్యమో మీకు తెలుసుగా..” ఆవేశంగా చెప్పింది సీత.

“ఆ తర్వాత.. వీడు మిమ్మల్ని తప్పక జైల్లో పెడతాడమ్మా.. కిరాతకుడు. వీడికి దయాదాక్షిణ్యాలు లేవు..” బాధతో చెప్పాడు సుల్తాన్.

“ముందు జరగవలసింది సవ్యంగా జరగాలి సుల్తాన్ భాయ్!.. అందుకు మామగారు తప్పక జైలు నుండి బయటికి రావాలి..” అనునయంగా చెప్పింది సీత.

“ఏయ్!.. సుల్తాన్.. వాట్ యీజ్ దట్ యు బోత్ ఆర్ బార్కింగ్.. ఇన్ టెలుగు!..” ఆవేశంతో అడిగాడు.

“ఇట్ యీజ్ నాట్ బార్కింగ్. డిష్కషన్ అబౌట్ ద ప్రజంట్ ప్రాబ్లం!..” రోషంగా చెప్పాడు సుల్తాన్.

“దెన్ గెటౌవుట్.. అండ్ డు వాట్ ఎవర్ యు వాంట్..” అరిచాడు రాబర్ట్.

“రాబర్ట్!.. లిజన్.. ఆఫర్ మై ఆంట్స్ సెర్మనీస్.. ఫిఫ్టీన్ డేస్ లేటర్ ఐ విల్ బీ.. ఇన్‌ఫ్రంట్ ఆప్ యు. యు కెన్ పుట్ మీ ఇన్ జైల్. యిట్జ్ మై ప్రామిస్. నౌ యు హ్యావ్ టు రిలీవ్ మై ఫాదరిన్‍లా..”

“ఓకే!..” వికటంగా నవ్వాడు రాబర్ట్.. కొన్నిక్షణాల తర్వాత టీపాయ్ ముందున్న ఖాళీ సిగరెట్ పాకెట్ను చించి.. దాని మీద.. ‘రిలీవ్ నరసింహ’ అని వ్రాసి సంతకం చేసి..

“టేక్ యిట్ అండ్ షో టు సబ్ ఇన్‌స్పెక్టర్..” ముందుకు ఆ అట్ట ముక్కను విసిరేశాడు.

క్రిందపడ్డ ఆ సిగరెట్ కవర్ ముక్కను సుల్తాన్ వంగి చేతికి తీసికొన్నాడు. వారిరువురూ.. పోలీస్ స్టేషన్ వైపుకు నడిచారు.

రెడ్డిరామిరెడ్డిగారు జైల్లో వున్న శాస్త్రిగారిని కలసి కన్నీటితో సావిత్రి నిర్యాణాన్ని గురించి.. వారికి చెప్పలేక.. చెప్పారు. నిలబడి ఆ వార్తను విన్న శాస్త్రిగారు కుప్పలా నేల కూలిపోయారు.

సుల్తాన్ సీతలు రాబర్ట్ వ్రాసిన అట్టముక్కను సబ్ ఇన్‌స్పెక్టర్‌కు యిచ్చారు. అతను చదివి.. ప్రక్కనున్న పోలీస్‌తో.. శాస్త్రిగారిని విడిపించమని చెప్పాడు.

పోలీస్ వెళ్లి కటకటాల ద్వారాన్ని తెరిచాడు. రామిరెడ్డి లోన ప్రవేశించి నరసింహశాస్త్రి గారిని లేవదీశాడు.

మెల్లగా ఇరువురూ బయటికి వచ్చారు.

మెల్లగా రెడ్డిగారు వచ్చిన టాక్సీని సమీపించి కూర్చున్నారు. స్టేషన్ వరండాలో వున్న సీతను సుల్తాన్‌ను చూచారు.. అందరి హృదయ వేదన ఒక్కటే.. ఎవరికి ఎవరూ ఏమీ చెప్పలేని స్థితి.

సుల్తాన్ శాస్త్రిగారి చేతులు పట్టుకొని నడిపించారు. హాల్లో ప్రవేశించారు.

కారు నరసింహశాస్త్రిగారి ఇంటి వైపుకు సాగింది. ఇంటి ముందు ఆగింది. ఒకవైపు రెడ్డిగారు.. మరోవైపు

ప్రశాంత నిద్రలో చిరునవ్వుతో వున్న సావిత్రి ముఖంలోకి చూచారు శాస్త్రిగారు.. బోరున ఏడుస్తూ ఆమె ప్రక్కన కూలబడ్డారు. కొన్ని నిముషాల పాటు ఆ గృహం నాలుగు గోడల మధ్యన.. అందరి ఏడుపులు ధ్వనించాయి. రెడ్డిగారికి శాస్త్రిగారి బంధువర్గం అంతా తెలిసి వున్నందున.. వారు సావిత్రి చనిపోగానే అందరికీ మనిషి ద్వారా వర్తమానాన్ని పంపారు.

ఒక్కొక్క కుటుంబం.. ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి చేరారు. అందరినీ ఎంతో అభిమానించే సావిత్రి పలకరింపులను తలచుకొని ఎంతగానో బాధపడ్డారు.

సమయం సాయంత్రం నాలుగు గంటలు.. రెడ్డిగారు సావిత్రమ్మ అంతిమ యాత్రకు అన్ని ఏర్పాట్లు కన్నీటితో చేశారు.

స్టేషన్‌లో రైలు ఆగింది. అద్వైత్ దిగి.. వేగంగా తన ఇంటివైపుకు నడిచాడు. తన ఇంటి వీధి మలుపు తిరిగాడు. వారి ఇంటి వైపుకే వెళుతున్న ఇరువురు అమ్మలక్కలు అద్వైత్‌ను చూచారు.

“అయ్యా!.. నీవు లండన్‌లో వున్న ఆదిబాబువే కదూ!.. పాపం.. మీ అమ్మగారు వెళ్ళిపోయారయ్యా..” విచారంగా సమాచారాన్ని అద్వైత్‌కు తెలియజేశారు.

ఆ వార్త వినగానే.. అద్వైత్ తన చేతిలోని సంచులను క్రింద పడేసి తన ఇంటివైపుకు పరుగెత్తాడు. ఆ యిరువురు అమ్మలు ఆ సామాగ్రిని తమ చేతుల్లోకి తీసికొని శాస్త్రిగారి ఇంటి వైపుకు నడిచారు.

వాకిటి నిండా వున్న జనం.. బంధుమిత్రులు.. అద్వైత్‌ను ఆశ్చర్యంగా చూచారు.

యాంత్రికంగా అద్వైత్.. వరండాను దాటి హాల్లో ప్రవేశించాడు. తల్లి శాశ్వత నిద్రలో వున్న ఆకారాన్ని చూచాడు. అంతవరకూ హృదయంలో సుళ్ళు తిరుగుతున్న ఆవేదన.. ‘అమ్మా’ అనే పదంతో బయటికి వచ్చింది. బోరున ఏడుస్తూ తన తల్లి పాదాలపై తన శిరస్సును వుంచాడు అద్వైత్.

తలవని తలంపుగా అతన్ని చూచిన.. సీత.. నరసింహశాస్త్రి అతని ప్రక్కకు చేరి అతని వీపుపై తమ చేతులను వేసి.. విలపించారు.

ఊరందరికీ తెలిసి ఆ ప్రశాంతి నిలయం.. ఆనాడు ఆవేదనా నిలయంగా సావిత్రమ్మ మరణంతో మారిపోయింది. దాదాపు పావుగంట తర్వాత.. అద్వైత్ తలను పైకెత్తి తన యిరువైపులా వున్న సీతను.. నరసింహశాస్త్రిని చూచాడు. ఆది కళ్ళల్లో కన్నీటి ధారలు. ఎదుటి వ్యక్తి స్పష్టంగా గోచరించని స్థితి.

చేతులతో కన్నీటిని తుడుచుకొని తండ్రి ముఖంలోకి చూచాడు అద్వైత్.. సంవత్సరం క్రింద తాను లండన్‌కు వెళ్ళిన రోజుకు ఆ రోజుకు శాస్త్రిగారి వదనంలో ఎంతో మార్పు. డెభై ఏళ్ళు దాటి డెభై ఒకటిలో ప్రవేశించిన శాస్త్రిగారు గత సంవత్సరం రోజులుగా మానసికంగా ఎంతగా నలిగిపోయారో.. అది వారికి ఆ సర్వేశ్వరుడికే తెలుసు.  “తల్లి ఋణాన్ని తీర్చుకొనేదానికి సమయానికి వచ్చావా ఆదీ!..” బొంగురు పోయిన కంఠంతో అన్నారు శాస్త్రిగారు.

కన్నీటితో అవునన్నట్లు తల ఆడించాడు అద్వైత్.

సీత అతని భుజంపై చెయ్యి వేసింది. తలను త్రిప్పి ఆమె ముఖంలోకి చూచాడు అద్వైత్. అతని చేతులను తన చేతుల్లోకి తీసికొని బోరున ఏడ్చింది సీత. కట్టను తెంచుకొని పొంగి వస్తున్న దుఃఖంతో అద్వైత్ తలను దించుకొన్నాడు. జరగవలసిన కార్యక్రమాన్ని జరిపించేదానికి పురోహితులు వచ్చారు.

“ఇక కార్యక్రమాన్ని ప్రారంభించాలి రెడ్డిగారూ!.. శాస్త్రిగారికి చెప్పండి..” అన్నారు.

రెడ్డిగారు నరసింహశాస్త్రిని సమీపించి వారు చెప్పిన మాటలను శాస్త్రి చెవిలో చెప్పారు. సుమతి.. పాపను తీసికొని అద్వైత్‌ను సమీపించింది.

“అన్నయ్యా!.. నీ పాప..” అంది సుమతి.

“బావా!.. పాప అంతా నీ పోలికే..” పాండూ మాటలు.

సీత పాప ముఖంలోకి.. అద్వైత్ ముఖంలోకి చూచి

“రాక రాక .. ఎలాంటి సమయంలో వచ్చారు బావా!..” తల వంచి ఏడుస్తూ అంది సీత. కొన్నిక్షణాలు పాప ముఖంలోకి చూచి.. వేదనతో కూడిన చిరునవ్వుతో..

“రావలసిన సమయానికే వచ్చాను సీతా..” మెల్లగా చెప్పాడు అద్వైత్.

శాస్త్రిగారు పాండురంగ ముఖంలోకి చూచాడు.

పాండు చేయి పట్టుకొన్నాడు..

“ఇక లేవాలి బావా..” మెల్లగా చెప్పాడు గద్గద స్వరంతో.

విషయం అర్థం అయిన అద్వైత్ లేచాడు. నేరుగా పెరటు వైపుకు వెళ్ళి బావిలోని నీళ్లతో తలకు స్నానం చేశాడు. వచ్చి తల్లి ప్రక్కన నిలబడ్డాడు.

పండితుల ఆదేశం ప్రకారం సావిత్రమ్మను వరండాలోకి తరలించారు స్నానం చేయించారు.

పండితుల నిర్దేశానుసారంగా అద్వైత్.. వర్తించాడు. శ్మశాన యాత్రకు అంతా సిద్ధం అయింది.

నలుగురు ఆప్తులు మోయగా సావిత్రమ్మ శ్మశానం వైపుకు బయలుదేరింది.. అందరు ఆడవారు వీధిగేటు వరకూ వచ్చి ఆగిపోయారు. పూలు.. పసుపు.. కుంకుమలను రెడ్డిగారు స్వయంగా తన చేతులతో ఆ వూరేగింపున వెదజల్లారు.

బంధువులు.. ఆత్మీయులు.. వూరి జనం.. ఆ వూరేగింపు ముందు వెనకల నడిచి.. శ్మశానాన్ని చేరారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here