అద్వైత్ ఇండియా-6

0
9

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[రాఘవ ఉద్యోగంలో చేరేందుకు భద్రాచలం వెళ్ళే సమయం దగ్గరకొస్తుంది. ఓ సాయంత్రం అద్వైత్ రాఘవను గోదావరి ఒడ్డుకు తీసుకువెళ్ళి డ్యూటీ విషయంలో అనేక జాగ్రత్తలు చెప్తాడు. కాలం కలసి రానప్పుడు సహనంతో, శాంతంతో జీవితాన్ని ముందుకు నడిపించడం వివేకవంతుల లక్షణమని సూచిస్తాడు. ఆవేశం అన్ని వేళలా మంచిది కాదని హెచ్చరిస్తాడు. నీవు చెప్పినట్టు జాగ్రత్తగానే నడుచుకుంటాను అని చెప్పి, ఇండియాపై నీ అభిప్రాయమేమిటి అని అద్వైత్‍ను అడుగుతాడు రాఘవ. ఇండియాది చాలా మంచి తత్వమని, అనేక సద్గుణాలున్నాయని అంటాడు. తరువాత వారిద్దరి మధ్యా వివాహ ప్రసక్తి వస్తుంది. ఇరువురూ నవ్వుకుంటూ ఇంటికి తిరిగి వస్తారు. మర్నాడు భద్రాచలంలో డ్యూటీలో చేరేందుకు రాఘవ బయల్దేరితే, అద్వైత్ స్టేషనుకు వెళ్తాడు. అక్కడ ఇండియాను చూసి ఆశ్చర్యపోయిన రాఘవ, మీరెక్కడి వెళ్తున్నారని అడిగితే, మీకు సెండాఫ్ ఇవ్వడానికే వచ్చానంటుంది. రాఘవ వెళ్లిపోయాకా, అద్వైత్ బాధపడటం గమనిస్తుంది ఇండియా. అతను వెళ్ళినందుకు తనకీ బాధగానే ఉందంటుంది. తరువాత రాఘవతో పాటు వెళ్ళి స్కూలు చూస్తానంటుంది. సరేనని ఆమె కార్లో కూర్చుంటాడు రాఘవ. స్కూలు వైపు పోనిస్తూ తనతో లండన్‍కి వస్తారా అని అడుగుతుంది. నేనేందుకు లండన్‍కి అని అద్వైత్ అడిగితే, అతని నాట్య సామర్థ్యం గురించి తన అమ్మమ్మ మేరీకి ఉత్తరంలొ రాశాననీ, బదులుగా ఆ అబ్బాయిని ఇక్కడికి తీసుకురా, ఇక్కడ నాట్య పాఠశాలను ప్రారంభిద్దామని అని రాసిందని చెప్తుంది. కాసేపటికి స్కూలుకి చేరతారు. హెడ్‍ మిసెస్ గౌరికి ఇండియాని పరిచయం చేసి తన క్లాసుకి వెళ్తాడు అద్వైత్. ఇండియా చక్కని తెలుగు మాట్లాడడం చూసి గౌరి ఆశ్చర్యపోతుంది. తమ బడికి కొంత అర్థిక సాయం అవసరమనీ, మీ నాన్నగారికి చెప్పి చేయించగలవా అని ఇండియాని అడుగుతుంది గౌరి. ప్రయత్నిస్తానని చెప్తుంది ఇండియా. కాసేపయ్యాకా, అద్వైత్ చెప్పే పాఠాలను వినాలని ఉంది చెప్పి, గౌరి అనుమతి తీసుకుని వెళ్ళి ఆ క్లాసులో కూర్చుంటుంది. ఆ క్లాస్ టీచర్ రానందున, అద్వైత్ ఆ క్లాస్‍కి వెడతాడు. తెలుగు నెలల పేర్లు, తెలుగు సంవత్సరాల పేర్లు రాయిస్తాడు. కాసేపయ్యాకా, బెల్ మోగితే, అక్కడ ఇండియా ఉందన్న సంగతి మరిచిపోయి వెళ్ళిపోతాడు అద్వైత్. కాసేపటికి ఇల్లు చేరుతుంది ఇండియా. అక్కడ ఆండ్రియా, మూన్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. స్కూలుకి వెళ్ళొచ్చిన సంగతీ, గౌరీ మేడమ్ డొనేషన్స్ అడిగిన సంగతి తల్లికి చెప్తుంది. ఆండ్రియా, మూన్ ఇద్దరూ చెరో ఇరవై వేలు ఇస్తామంటారు. స్నానం చేసి వస్తానని లోపలికి వెళ్ళిపోతుంది ఇండియా. రాబర్ట్ రోజు రోజుకీ మరీ క్రూరంగా తయారవుతున్నాడనీ, అతన్ని భరించలేకపోతున్నానీ, అతనికి విడాకులిద్దామని ఆలోచిస్తున్నానని చెప్తుంది ఆండ్రియా. తొందరపడద్దు, తాను రాబర్ట్‌తో మాట్లాడుతానని అంటాడు మూన్. కొన్ని క్షణాల తరువాత బ్రిటీషర్ల పద్ధతులు తనకేమీ నచ్చడం లేదనీ, భారతీయులని అకారణంగా హింసించటం ద్వేషించడం తనకిష్టం లేదని, తాను ఇంగ్లండ్ వెళ్ళిపోదలచానని అంటాడు. అయితే తనని పెళ్ళి చేసుకుని ఇంగ్లండ్ తీసుకెళ్లమని అంటుంది ఆండ్రియా. అంతా మంచే జరగాలి అని చెప్పి వెళ్లడానికి లేస్తాడు మూన్. – ఇక చదవండి.]

అధ్యాయం 11:

[dropcap]సీ[/dropcap]త చిత్రలేఖనం బాగా చేస్తుంది. తన గదిలో వారం రోజులనుంచీ.. అద్వైత్ చిత్రాన్ని ఎవరికీ తెలియకుండా చిత్రీకరించింది. నిన్నటితో ఆ చిత్రం పరిపూర్ణం అయింది. అలమారలో వుంచి పలచటి వస్త్రాన్ని పైన కప్పింది. వసుంధర ఆ గది లోనికి సీత కోసం వచ్చింది. అలమార రెక్కలు తెరిచి వున్నాయి.

ఆమె చూపు అద్వైత్ చిత్రం మీద కప్పబడిన గుడ్డ వైపు మరలింది. దగ్గరకు వెళ్ళి గుడ్డను తొలగించింది. నవ్వుతూ వున్న అద్వైత్ రూపాన్ని చూచింది.

చిత్రం క్రింది భాగాన ‘నా వాడు’ అని వ్రాసి క్రింద ‘సీత’ అని వ్రాసి వుండడాన్ని చూచింది.

ఆ చిత్ర చిత్రీకరణం.. క్రింద వ్రాసి యున్న మూడు అక్షరాల వలన.. సీత, అద్వైత్‍ను ఎంతగా ప్రేమిస్తున్న విషయం వసుంధరకు అర్థం అయింది.

సీత వివాహం.. అద్వైత్‍తో జరగాలి.. ఆ విషయాన్ని గురించి తమ్ముడు నరసింహశాస్త్రితో మాట్లాడాలని నిర్ణయించుకొంది వసుంధర.

ఆ చిత్రంపై గుడ్డను కప్పి.. అలమార రెక్కలను మూసి గది నుంచి బయటికి వచ్చింది వసుంధర.

వరండాలో.. తెలిసిన వ్యక్తులు రాగా వారితో ముచ్చటిస్తున్నారు నరసింహశాస్త్రి. సంభాషణ ముగించి వారు నరసింహశాస్త్రికి నమస్కరించి బయలుదేరారు.

వారు వెళ్ళగానే హాల్లో వున్న వసుంధర వరండాలోకి వచ్చి నరసింహశాస్త్రి కూర్చొని వున్న కుర్చీకి ప్రక్కన వున్న కుర్చీలో కూర్చుంది.

“నరసింహా!..”

“ఏమిటక్కా!..”

“నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా!..”

“నీవు చెప్పదలచుకొన్నది తర్వాత చెప్పు.. ముందు నేను చెప్పబోయే విషయాన్ని విను. నీవు చాలా సంతోషిస్తావు..” చిరునవ్వుతో చెప్పాడు నరసింహశాస్త్రి.

“ఏమిట్రా ఆ విషయం!..”

“యిప్పుడు వచ్చి వెళ్లింది ఎవరనుకొన్నావ్!..”

“వారిని నేను సరిగా చూడలేదురా..”

“మన రెడ్డి రామిరెడ్డిగారి బావమరుదులు. శేషారెడ్డి.. నారాయణరెడ్డి..”

“విషయం ఏమిటిరా!..”

“రామిరెడ్డిగారు.. మనతో కలిసి కాశీక్షేత్రాన్ని దర్శించాలని నిర్ణయించుకొన్నారట”

“అలాగా!..” ఆశ్చర్యంతో అడిగింది వసుంధర.

“ఎప్పుడు బయలుదేరితే బాగుంటుందని నాతో చర్చించే దానికి వచ్చారు”

“ప్రయాణ ముహూర్తాన్ని నిర్ణయించావా!..”

“ఆఁ..”

“ఎప్పుడు?..”

“పై నెలలో.. నీవు అన్నావు కదా నాతో అనేకసార్లు.. కాశీ క్షేత్రాన్ని దర్శించాలని.. ఆ సమయం ఆసన్నమయింది. నీకు ఆనందమేగా!..”

“మహదానందం రా!..”

ఆమె ముఖంలోని ఆనందాన్ని చూచి నరసింహశాస్త్రి తృప్తిగా నవ్వాడు.

వంట పని ముగించి సావిత్రి వరండాలోకి వచ్చింది. విషయాన్ని నరసింహశాస్త్రి అర్ధాంగి సావిత్రికి తెలియజేశాడు. సావిత్రి ముఖంలో కోటి దీపకాంతులు..

“ఆ మాతా పితలకు మన మీద అనుగ్రహం కలిగిందన్న మాట..” ఆనందంగా చెప్పింది.

“అవును సావిత్రి..” ప్రీతిగా భార్య ముఖంలోకి చూస్తూ చెప్పాడు నరసింహశాస్త్రి.

“ఒసే సావిత్రీ!.. నీవు అలా కూర్చో. మీ ఇరువురికి నేను ఒక విషయం చెప్పాలి..”

సావిత్రి అరుగు పైన కూర్చుంది.

“ఏమిటి వదినా!..”

“అక్కా!.. నాతో ఏదో విషయం చెప్పాలన్నావు. అదీ యిదీ ఒకటేనా!..”

“అవున్రా!..”

“చెప్పక్కా..”

వసుంధర ఇరువురి ముఖాల్లోకి చూచింది. వసుంధర ఏమి చెప్పబోతూ వుందని సావిత్రి.. నరసింహశాస్త్రి ఆమె ముఖంలోకే చూస్తున్నారు.

“సావిత్రీ!.. సీత యింకా రాలేదుగా…”

“పెదనాన్నగారి యింటికి వెళ్ళింది కదా వదినా!.. యింకా రాలేదు.”

వసుంధర కుర్చీ నుంచి వేగంగా లేచి.. “యిప్పుడే వస్తా..” చెప్పి సీత గదికి వెళ్ళి ఆమె గీచిన అద్వైత్ చిత్రపటాన్ని తెచ్చి కుర్చీలో కూర్చుంది. బోర్లించి వున్న చిత్రపటాన్ని వెల్లికిలా త్రిప్పి “దీన్ని చూడరా నరసింహ!..” అంది.

నరసింహశాస్త్రి ఆ చిత్రాన్ని అందుకొన్నాడు. కొన్నిక్షణాలు చూచి తన్ను సమీపించిన సావిత్రి ముఖంలోకి చూచి తన చేతిలో వున్న దాన్ని ఆమెకు అందించాడు. తన కొడుకు చిత్రాన్ని చూచి.. క్రింద వ్రాసి వున్న అక్షరాలనూ చదివి ఆశ్చర్యపోయింది. భర్త ముఖంలోకి చూచింది. నరసింహశాస్త్రి చిరునవ్వు నవ్వాడు.

“నరసింహా!.. అద్వైత్ చిత్రాన్ని సీత చాలా బాగా గీచింది కదూ…”

“గీచింది కాదక్కా!.. వేసింది.. చాలా బాగా వేసింది..”

“సీతలో ఇంతటి నైపుణ్యం వుందని నాకు తెలీదండీ!..” ఆశ్చర్యంతో చెప్పింది సావిత్రి.

“ఒసేయ్!.. క్రింద వ్రాసి వున్న అక్షరాలు చదివావా!..”

“చదివాను వదినా!..” భర్త ముఖంలోకి చూస్తూ మెల్లగా చెప్పింది.

“నరసింహా!.. నీవు..”

“చదివానక్కా!..”

“దీన్ని బట్టి మీకేమర్థమయింది?..”

“అర్థం కావలసింది స్పష్టంగా అర్థం అయిందక్కా!.. సీతకు ఆది అంటే.. ఎంతో యిష్టం అని తెలుస్తూ వుంది.” భార్య ముఖంలోకి చూస్తూ చివరి మాటలను చెప్పాడు నరసింహశాస్త్రి.

“యీ విషయంలో నీ అభిప్రాయం?..” నరసింహశాస్త్రి ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది వసుంధర.

“ఇందులో ప్రత్యేకంగా నా అభిప్రాయం అంటూ వేరుగా ఏం వుంటుందక్కా.. ఇరువురికి వరస. సీతకు ఆది అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు మనకు తెలిసింది. యిక.. ఆది అభిప్రాయాన్ని కనుక్కోవాలి. వాడు సరే అంటే.. సీతా అద్వైత్‍ల వివాహాన్ని మనం జరిపించాలి”

“వాడు నీ మాటను ఏనాడు.. ఏ విషయంలో కాదన్నాడురా!..”

“ఇంతవరకూ అనలేదు. ఇది వాడికి సంబంధించిన విషయం. వాడి ఉద్దేశాన్ని కనుక్కోవడం మన ధర్మం. నేను నా ధర్మాన్ని యథావిధిగా నెరవేరుస్తానక్కా” అనునయంగా చెప్పాడు నరసింహశాస్త్రి.

“సావిత్రీ!.. నీవేమంటావే!..”

“వదినా!.. నేను మీ మాటను, మీ తమ్ముడిగారి మాటను ఏనాడైనా  కాదన్నానా!..” చిరునవ్వుతో చెప్పింది సావిత్రి.

“ఎందుకైనా మంచిది.. ఒకసారి ఇరువురి జాతకాలనూ చూస్తావా!…”

“తప్పక చూస్తానక్కా.. పెళ్ళి అంటే వెయ్యేళ్ళ పంట కదా!..”

“చూచి ఆ నా చిన్న సందేహాన్నీ తీర్చరా!..”

“అలాగే అక్కా!..”

సీత వీధి గేటు వద్దకు వచ్చింది. ఆ గేటుకు యింటికి ముఫై అడుగుల దూరం..

వసుంధర అద్వైత్ చిత్రాన్ని తీసికొని వేగంగా సీత గదికి వెళ్ళి యథాస్థానంలో వుంచి ముసుకు గుడ్డను కప్పి వరండాలోకి వచ్చింది.

సీత వాకిట్లోనే నిలబడి వుంది.

“ఒసే సావిత్రీ ఆ పిల్ల లోపలికి రాదేం..” ఆశ్చర్యంతో అడిగింది వసుంధర.

“ఆది వస్తున్నట్లున్నాడు వదినా!..”

ఆది.. సీతను సమీపించాడు.

“ఏం వాకిట్లో వున్నావ్!..”

“తమరిని చూచి ఆగిపోయాను”

“అలాగా!..”

“అవును.. ఆగడం తప్పా!..” ఓరకంట చూస్తూ అడిగింది సీత.

“మన బృందం అంతా వరండాలోనే వున్నారు.. పదలోనికి..”

“ముందు మీరు.. వెనక నేను పదండి.” నవ్వింది సీత.

ఆది క్షణంసేపు సీత ముఖంలోకి చూచి.. వేగంగా లోనికి నడిచాడు అద్వైత్.

“సావిత్రీ!.. వాళ్ళిద్దరూ అలా నవ్వుకొంటూ వస్తూ వుంటే నీకేమనిపిస్తూ వుందే!..”

“చూడ ముచ్చటగా వుంది వదినా!..” హృదయపూర్వకంగా సావిత్రి ఆ మాటను చెప్పింది.

అధ్యాయం 12:

అది 1921వ సంవత్సరం మాఘమాసం. బహుళ పక్షం. ఇంగ్లీషు నెల ఫిబ్రవరి. ఆ రోజు మహాశివరాత్రి. శివాలయంలో నరసింహశాస్త్రి కుటుంబం ఏకాదశ మహారుద్రాభిషేకాన్ని జరిపించారు. ప్రధాన ఆచార్యులు నరసింహశాస్త్రిగారే. లయబద్ధమైన నమక చమక మంత్రోచ్ఛారణ వారి కంఠం నుండి వెలువడే తీరు అందరికీ ఆశ్చర్యదాయకం. వీనులకు విందు. వారి స్వర గాంభీర్యానికి అందరూ ఆకర్షితులే కాక సమ్మోహితులు కూడా.

అద్వైత్.. పాండురంగ వంత పలుకగా ఆలయం.. వారి మంత్రోచ్ఛారణతో మారు మ్రోగింది. ఆలయం పెద్దలు పిన్నలతో నిండిపోయింది.

ఆ ప్రాంతంలో రెడ్డి రామిరెడ్డిగారు సంపన్న కుటుంబీకులు. వారు.. ఆలయానికి సతీ సమేతంగా వచ్చారు. జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి దాదాపు నూరు ఆవులు వున్నాయి. ఒక గోవుకు జన్మించిన కోడెదూడ ఎంతో ఆరోగ్యంగా పెరిగి ఆరేళ్ళ ప్రాయానికి వచ్చింది. ఆ రోజు మహాసుదినం కాబట్టి ఆ వృషభాన్ని ఆపటెద్దుగా ముద్రవేసి వదిలేయాలని నిర్ణయించుకొన్నారు రెడ్డిగారు.

స్నానం చేయించి మెడలో పూలమాలతో ముఖాన చందనం కుంకుమ బొట్టుతో పారేర్లలు ఆ కోడెను ఆలయ ప్రాంగణంలోకి తీసికొని వచ్చారు. కంసలి కనకయ్య పిడకలను పేర్చి ఇనప అచ్చును వాటి మధ్య వుంచి నిప్పంటించాడు. అర్థగంటలో ఆ అచ్చు బాగా ఎఱ్ఱగా మారిపోయింది.

రెడ్డిగారు ఆ దూడ చిన్నతనం నుంచీ దాన్ని నందీ అనే పేరున పిలిచేవారు. ఎవరైనా సరే ఆ పేరుతో పిలిస్తే ఆ కోడె దూడ వారివైపుకు తిరిగి చూచేది. యిక రెడ్డిగారు పిలిచినప్పుడు వారిని సమీపించి మెడను చాచేది. మనిషితో మాట్లాడినట్లుగానే వారు నందితో మాట్లాడేవారు.

వారు నంది విషయంలో తీసుకొన్న నిర్ణయానికి కారణం ఆరోగ్యమైన మొగ పశువు లేకుండా ఆవులు మంచి సంతతికి జన్మనివ్వలేవు. చక్కటి పశు సంపద ఆ ప్రాంతంలో వృద్ధి చెందేలా చేసేటందుకు.. రెడ్డిగారు నందికి అచ్చువేసి ఆపటెద్దు అనే పేరుతో వదిలేయ సంకల్పించారు.

ఆ హోదా కలిగిన ఎద్దును ఎవరూ కట్టివేయరు. దాని ఇష్టానుసారంగా అది తిరగవచ్చు. ఎవరి పొలాల్లోకాని.. గడ్డివాములలో కాని.. పచ్చిక బీడులలో కాని.. తన యిష్టానుసారంగా కావలసిన మేరకు మేయవచ్చు. స్వేచ్ఛగా తిరగవచ్చు.

కాగిన ఇనుప అచ్చును కంసాలి కనకయ్య చేతికి తీసుకొన్నాడు. పాలేర్లు నంది మెడకున్న తాటిని గట్టిగా పట్టుకొన్నారు. కనకయ్య రెడ్డిగారి మాట ప్రకారం మంచి ఘడియలలో నంది వెనక కుడికాలి జొబ్బపై అచ్చు వేశాడు. ఆ వేడికి నంది ‘అంబా’ అని అరచింది. కొన్ని క్షణాలు వేదనతో ఏడ్చే బిడ్డ గొంతు విని తల్లి బాధ పడినట్లుగా రెడ్డిగారు విచారించారు. అదే.. సాకిన మమకారం.

పాలేర్లు నంది మెడకున్న త్రాటి విప్పేసారు. రెడ్డిగారు నంది సమీపించి.. “నందీ!.. ఇకపై నీవు నీ యిష్టమొచ్చిన వైపుకు పోవచ్చు. యీ క్షణం నుంచీ నీవు అందరి వాడివి. ఆనందంగా వెళ్ళు..” ప్రీతిగా వీపుపైన తట్టాడు. నంది కొన్నిక్షణాలు రెడ్డిగారి ముఖంలోకి చూచింది.

“వెళ్ళరా!..” అన్నాడు రెడ్డిగారు.

నంది తలను చాచి పైకి చూచింది. ముందుకు నడిచి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి.. రెడ్డిగారిని సమీపించింది. వీపు పైన తట్టి.. “వెళ్ళు నందీ!..” అన్నారు ప్రీతిగా.

నంది గాలి గోపురం వైపుకు నడిచింది. గోపురం మధ్యన ఆగి వెను తిరిగి తన యజమాని వైపు చూచింది. కుడి చేతిని పైకెత్తి ‘పో’ అని చేతిని వూపారు రెడ్డిగారు. నంది ముందుకు వెళ్ళిపోయింది.

ఆ రాత్రి ఏడుగంటలకు నరసింహశాస్త్రిగారు.. సీత.. ఇండియాల నాట్య ప్రదర్శనను ఆలయ ప్రాంగణంలో జరిపించారు.

ఇసకను విసిరితే.. క్రింద నేల రాలనంత జనం. వారిరువురి నాట్య ప్రదర్శనను వీక్షించారు. మెచ్చుకొన్నారు. సీత.. ఇండియాల నాట్యప్రదర్శనను చూచేటందుకు రాబర్ట్, ఆండ్రియా కూడా.. తమ కుమార్తె నాట్యం చేయుచున్నందు చూచే దానికి వచ్చారు. తమ కుమార్తె నాట్య ప్రతిభను చూచి వారిరువురూ సంతోషించారు. ముఖ్యంగా ఆండ్రియా ఎంతగానో సంతోషించింది. వారి ప్రదర్శన ఎనిమిది గంటలకు ముగిసింది.

రామిరెడ్డిగారు ఆ యిరువురు కన్యలకు బంగారు కంకణాలను బహూకరించారు. వారి నాట్య ప్రతిభను గురించి దానికి కారకులైన నరసింహశాస్త్రిగారిని గురించి గొప్పగా మెచ్చుకొన్నారు.

తర్వాత.. ఆలయ మండపంలో శివపార్వతీ మాతల కళ్యాణాన్ని వేద మంత్రాలతో అర్చకులు ఘనంగా జరిపించారు. వివాహానంతరం.. ఆ జగన్మాతా పితలు నంది వాహన రూఢులై భక్త జనులు వాహనాన్ని మోయగా.. వూరేగింపుకు బయలుదేరారు.

రెడ్డి రామిరెడ్డిగారు ఆ ఆలయధర్మకర్త. అన్ని విషయాలను దగ్గర వుండి నరసింహశాస్త్రి గారి ఆదేశానుసారంగా జరిపించారు.

ఆ రాత్రి.. మహాశివరాత్రి.. జాగరణ చేస్తే ఎంతో పుణ్యం అనేది హైందవ నమ్మకం.

రాఘవ.. మంచి పాటగాడు. పది గంటల ప్రాంతంలో అతని పాట కచ్చేరీ ప్రారంభమవుతుందని అద్వైత్ మైక్ లో చెప్పాడు.

రెడ్డిగారు తన కుమార్తెకు బంగారు కంకణం బహూకరించిన తర్వాత రాబర్ట్ తన భార్య కూతురితో యింటికి వెళ్ళిపోయాడు. తన కూతురుని పొగిడిన రెడ్డి.. అదే నోట నరసింహశాస్త్రిని కొనియాడడం అతనికి నచ్చలేదు. అతనిలో నరసింహశాస్త్రి పట్ల వున్న ద్వేషం.. కాలం జరిగినా.. మారలేదు.

భోజనానంతరం.. రాబర్ట్ ఆండ్రియా వారి గదికి వెళ్ళిపోయారు.

యింటి దగ్గర కారు దిగగానే సుల్తాన్‍కు సైగ చేసింది ఇండియా వుండమని. ఆమె అభిప్రాయాన్ని గ్రహించిన సుల్తాన్ కార్లోనే కూర్చొని వున్నాడు.

పదిన్నర ప్రాంతంలో ఇండియా యింటి నుండి బయటికి వచ్చింది. ఆమె కట్టిన చీరకట్టును చూచి సుల్తాన్ ఆశ్చర్యపోయాడు. కారు దిగాడు.

పచ్చ అంచు తెల్లచీర.. అదే వర్ణపు జాకెట్ తల్లో మల్లె పూలు.. ఒక చేతిలో రెడ్డిగారు యిచ్చిన బంగారు కంకణం, వాచ్.. రొండవ చేతికి ఆరు బంగారు గాజులు. అప్సరసలా తయారై వచ్చి సుల్తాన్ ముందు నిలబడింది.

“సుల్తాన్ భాయ్!.. పద!.”

ఎక్కడికమ్మా!..”

“శివాలయానికి..”

“అమ్మా.. నాన్నా!..”

“నిద్రపోయరు”

“పోయరు కాదమ్మా.. పోయారు..”

“ఆఁ ఆఁ.. ఓకే.. పోయారు. కార్లో ఎక్కు..”

“ఎక్కు కాదమ్మా!.. కూర్చో అని చెప్పాలి”

ఇండియా నవ్వుతూ.. “సుల్తాన్ భాయ్!.. కూర్చో కాదు.. కూర్చోండి.. రైట్ నో..”

“యస్!.. రైట్..”

యిరువురూ ఆనందంగా నవ్వుకొన్నారు.

సుల్తాన్ కార్లో కూర్చొని స్టార్ట్ చేశాడు. ఇండియా అతని ప్రక్కన ముందు సీట్లో కూర్చుంది.

“సుల్తాన్ భాయ్!..”

“ప్లీజ్ టెల్ మిస్ ఇండియా!..”

“తెలుగులో మాటాడాలి” నవ్వింది ఇండియా.

“మాటాడాలి, కాదమ్మా.. మాట్లాడాలి”

“ఓ.. మాట్లాడాలి.. మీరు మాట్లాడాలి.. ఓకే!..”

“ఓకే..”

ఇండియా మాటలకు నవ్వుకొంటూ కారును ముందుకు నడుపుతున్నాడు సుల్తాన్.

“నేను ఒకటి అడుగుతా. నిజం చెప్పాలి మీరు..”

“అడగండమ్మా!..”

“మా ఫాదర్..”

“మా నాన్నగారు..”

“ఓ.. నాన్నగారు.. మా నాన్నగారు మంచివాడా.. మంచి వాడా!..” తర్వాత వుపయోగించవలసిన తెలుగు పదాన్ని గురించి ఆలోచించసాగింది ఇండియా.

“చెడ్డవాడా!..” నవ్వాడు సుల్తాన్.

“ఆఁ.. యస్..యస్.. చెడ్డవాడా!.. చెప్పండి”

సుల్తాన్ క్షణంసేపు ఇండియా ముఖంలోకి చూచి తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు.

“సుల్తాన్ భాయ్!.. జవాబు చెప్పండి”

“మంచివారేనమ్మా!..”

“నరసింహశాస్త్రి కంటే మంచివాడా!..”

“మాంచివాడా కాదమ్మా!.. మంచివారా!..”

“యస్.. యస్.. మంచివారా!..”

“బిట్వీన్ దిస్ టు జంటిల్‍మెన్.. నో కంపేరిజన్..’

“వై నాట్… ఎందుకు కంపేరిజన్ చేయలేరు?.. టెల్ మీ!..”

“యువర్ ఫాదర్ యీజ్ మై బాస్!..”

“నరసింహశాస్త్రి మై గురూజీ!..” అన్నది ఇండియా.

“అవును..”

“నా ప్రశ్నకు అవును జవాబు కాదు సుల్తాన్ భాయ్. నిజం చెప్పండి”

సుల్తాన్ ఆశ్చర్యంతో ఇండియా ముఖంలోకి చూచాడు ఆమె మాట్లాడిన స్వచ్ఛమైన తెలుగు పదాలను విని. “అమ్మా!.. మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు..” నవ్వాడు సుల్తాన్.

“ఇది నా ప్రశ్నకు జవాబు కాదు. మై ఫాదర్ గుడ్ ఆర్ బ్యాడ్!.. చెప్పండి” కళ్ళు ఎగరవేస్తూ అడిగింది

ఆమె అడిగిన ప్రశ్నకు తనకు జవాబు తెలుసు. కానీ దాన్ని చెబితే.. ఇండియా ఎలా ఫీలవుతుందో అనేది అతని సందేహం. మౌనంగా రోడ్డును చూస్తూ కారు నడుపుతున్నాడు. అతని ముఖంలోకి కొన్నిక్షణాలు పరీక్షగా చూచింది ఇండియా.

“మీరు నిజం చెప్పేదానికి భయపడుతున్నారు సుల్తాన్ భాయ్!.. మై ఫాదర్ యీజ్ బ్యాడ్ మ్యాన్.. ఐ నో.. వేర్ యాజ్ నా గురువుగారు నరసింహశాస్త్రిగారు గ్రేట్ మ్యాన్.. హైలీ ప్రిన్స్‌పుల్డ్ పర్సన్. యా మై రైట్… నేను చెప్పింది నిజమేనా.!..”

యీసారి సుల్తాన్‍కు జవాబు చెప్పక తప్పలేదు.

“ప్లీజ్.. చెప్పండి..” అంది ఇండియా.

“అవునమ్మా!.. మీరు చెప్పింది నిజం”

“అద్వైత్ సార్‍ను గురించి మీరేమంటారు!..”

“తండ్రికి తగిన తనయుడంటాను”

“తనయుడ అంటే!..”

“సన్..”

“తండ్రి మీన్ ఫాదర్.. యామై రైట్…”

“యస్!..”

తన తెలుగు పరిజ్ఞానాన్ని సుల్తాన్ అభినందించినందుకు ఇండియాకు ఎంతో ఆనందం. నవ్వుతూ..

“సుల్తాన్ భాయ్!..”

“ఏమ్మా!..”

“అద్వైత్ గారు చాలా చాలా మంచివారు కదూ!..”

“అవునమ్మా..”

“నా గురించి మీ అభిప్రాయం?..”

“మీరూ!.. చాలా మంచివారమ్మా!..”

“మా అమ్మ!..”

“వారూ చాలా మంచివారు..”

వారి కారు శివాలయాన్ని సమీపించింది. సుల్తాన్ కారును ఓ ప్రక్కగా ఆపాడు. మైక్‍లో అద్వైత్ స్వరం.. ప్రార్థనా గీతం.

కారు దిగుతున్న ఇండియా ఆ స్వరాన్ని విని.. “పాడేది అద్వైత్ సార్ కదా సుల్తాన్ భాయ్!..” ఆశ్చర్యంతో అడిగింది.

“అది వారి గొంతులాగే వుందమ్మా. పదండి, చూద్దాం..” కచ్చేరి వేదిక వైపుకు నడిచాడు సుల్తాన్. ఇండియా అతన్ని అనుసరించింది.

స్టేజీ మీదవున్న రాఘవ ఇండియా రావడాన్ని చూచాడు. వేగంగా స్టేజీ దిగి వచ్చి వారికి ఎదురైనాడు.

పాడుతూవున్న అద్వైత్.. పరుగున స్టేజ్ దిగిన రాఘవను చూచి పాడుతూనే.. ఆశ్చర్యపోయాడు.

ఇండియా రాఘవను చూచి నవ్వుతూ చేతులు జోడించింది.

“మీరు మా కచ్చేరికి వచ్చారా యీ రాత్రి సమయంలో, మాకు చాలా సంతోషం మేడమ్..” ఆనందంగా చెప్పాడు రాఘవ.

ఇంతలోకి పాండురంగ వారిని సమీపించాడు.

“మేడం కాదు ఇండియా.. ముందు ఒకసారి చెప్పాను. మరచారా!..” చిరునవ్వుతో అడిగింది ఇండియా. “ఓ.. సారీ!..” అని, పాండూను చూచి.. “పాండూ!.. వీరిని మామయ్య అత్తయ్య కూర్చున్న దగ్గరకు తీసుకొని వెళ్ళు..” అన్నాడు రాఘవ.

“అలాగే రా” అన్నాడు పాండు.

“మీకు వీడు తెలియదనుకొంటాను!..”

“గురువుగారి యింట్లో రెండు సార్లు చూచాను”

“పేరు పాండురంగ. మా పెద్దమ్మ.. స్మాల్ మదర్, మదర్ ఎలెడెస్టు సిస్టర్స్ సన్. మై బిగ్ బ్రదర్..”

“ఓ.. మీ తమ్ముడుగారు!..”

“అవునండి.. యు ప్లీజ్ గో విత్ హిమ్”

“మీరు నాతో తెలుగులో మాట్లాడాలి..” నవ్వింది ఇండియా.

“అలాగే.. యిక ముందు..”

“అద్వైత్ గారు చాలా బాగా పాడుతున్నారు.. మీరూ పాడుతారా!..”

“పాడతాను..”

“మా వాడి పాటను మీరు వింటారుగా.. అద్వైత్ తర్వాత పాడబోయేది.. ఆడేదీ వీడే” నవ్వుతూ చెప్పాడు పాండు.

“ఓ.. వింటాను.. చూస్తాను.”

“మేడమ్ నాతో రండి”

పాండురంగ ముందు నడువగా.. ఇండియా సుల్తాన్ అతన్ని అనుసరించారు. రాఘవ స్టేజీ వైపుకు వెళ్ళాడు.

ఆ ముగ్గురూ నరసింహశాస్త్రి కుటుంబం కూర్చొని వున్న ప్రాంతానికి చేరారు. వారి వామభాగంలో రెడ్డిగారి కుటుంబం వుంది. శాస్త్రిగారిని వారి కుటుంబీకులను చూచి నవ్వుతూ ఇండియా నమస్కరించింది.

సావిత్రి ఇండియాను చూచి.. ఆమె కట్టుబొట్టును చూచి ఆశ్చర్యపోయింది. శిష్యురాలి రాకకు నరసింహశాస్త్రి సంతోషించారు. పాండు వైపు చూచారు.

అంజి గోడకు ఆనించి వున్న కొండు కుర్చీలను తీసికొని వచ్చి అదే వరసలో వేశాడు. “కూర్చో ఇండియా!..” ప్రీతిగా చెప్పాడు నరసింహశాస్త్రి.

“థ్యాంక్యూ సార్!..” చెప్పి కూర్చుంది ఇండియా,

ఆమె ప్రక్క కుర్చీలో సుల్తాన్ కూర్చున్నాడు. వంగి వినయంగా శాస్త్రి గారికి నమస్కరించాడు.

శాస్త్రిగారి ప్రక్కన వసుంధర.. ప్రక్కన సీత.. చివరన సావిత్రి కూర్చొని వున్నారు.

‘ఈ నిశిరాత్రి సమయంలో యీ కార్యక్రమానికి యీ పండుకోతి ఎందుకు వచ్చినట్లు.. దీని బొందకు తెలుగు అర్ధం కాదుగా!..’ అనుకొంది సీత.

అమాయకురాలైన సావిత్రి సీతను తట్టి.. “సీతా!.. ఇండియా చాలా అందంగా వుంది కదూ!” అడిగింది. “ఆఁ. తెల్లబట్టల్లో ఎవరైనా బాగుంటారు అత్తయ్యా!..” వెటకారంగా అంది సీత. సీత మనస్సులో ఇండియా విషయంలో అసూయ వుందని గ్రహించింది సావిత్రి.

మైక్‍లో ప్రకటన.. చేస్తున్నది అద్వైత్.

“యావన్మందికి విన్నపం.. ఇప్పుడు నా ముద్దుల మరిది రాఘవ భక్తి గీతాలను పాడుతాడు.. తర్వాత జానపద.. దేశభక్తి గీతాలను పాడుతాడు. అందరూ ప్రశాంతంగా కూర్చొని వినవలసిందిగా నా కోరిక.” చేతులు జోడించి ప్రక్కకు తప్పుకొన్నాడు.

రాఘవ స్టేజీ పైకి వచ్చి సభికులకు చేతులు జోడించి..

“నాకు యీ గాన భిక్షను పెట్టింది మా అమ్మగారి సోదరులు నాకు మేనమామ.. నా బావ అద్వైత్ తండ్రిగారైన.. వారెవరో మీ అందరికీ తెలుసు. వారి దివ్యపాదపద్మాలకు నా ప్రణామాలు. పెద్దలకందరికీ నా నమస్కారాలు. పిన్నలకు నా శుభాశీస్సులు..” రాఘవ స్టేజ్ మధ్యన కూర్చున్నాడు. శుక్లాంబరధరం పాడి.. పరమశివ దేవుని భక్తి పాటలను ప్రారంభించాడు. వైలెన్ వాయించేది అద్వైత్.. మృదంగం వాయించేది పాండురంగ.. ఘటం వాయించేది వారి మిత్రుడు శేషు.

రాఘవ రాగ ఆలాపనకు పదోచ్చారణకు చూపరులంతా పరమానందంతో తన్మయులైనారు. భక్తి గీతాల ఆలాపన గంటసేపు సాగింది. ప్రక్క వాయిద్యాల వారు వారివారి ప్రతిభను పాటకు రాగానికి తగిన రీతిలో మ్రోగించి.. అందరినీ ఆనందపరిచారు.

తన ప్రక్కనే కూర్చొని పాటలను వింటున్న ఇండియా ముఖ భంగిమలను గమనించాడు నరసింహశాస్త్రి.

తనకు పదాలన్నీ అర్ధం కాకపోయినా తదేక దీక్షతో కళ్ళు మూసుకొని వింటున్న ఇండియా ఏకాగ్రతకు.. పెదవుల కదలిక వలన ఆమె ఓం.. ఓం.. అని జపిస్తున్నదన్న విషయాన్ని గ్రహించాడు నరసింహశాస్త్రి.

దాదాపు నవమాసాలుగా తన వద్ద నాట్యాన్ని అభ్యసిస్తూ వున్న ఇండియా మనస్తత్వం.. మాటల్లోని వినయ విధేయతలు.. శాస్త్రిగారికి ఎంతగానో నచ్చాయి. ఆమె మీద వారికి ఎంతో అభిమానం. ఆమె ఆ స్థితిని చూచి.. ‘ఈ భువిన పుట్టవలసిన యీ బిడ్డ ఏ కారణంగానో ఆ భువిలో పుట్టింది. నాకు శిష్యురాలయింది. ఇది ఏనాటి ఋణానుబంధమో!..’ అనుకొన్నాడు నరసింహశాస్త్రి.

వంగి.. పదే పదే ఇండియాను చూచిన సావిత్రి.. ‘అచ్చంగా చూచేటందుకు తెలుగింటి ఆడపిల్లలా వుంది. ఈ ప్రాంతంలో పుట్టి వుంటే.. నా కోడలిగా చేసికొని వుండేదాన్ని.. బంగారు బొమ్మ.. సుగుణాల రాశి’ అనుకొంది. ‘దీని బొంద.. వాడు పాడే పాటలు దీనికి ఏమి అర్థమై చస్తాయ్. నా తమ్ముడి ప్రక్కన కూర్చొని.. భక్తి పారవశ్యాన్ని నటిస్తూ వుంది. తెల్లకోతి’ అనుకుంది వసుంధర.

‘దీని యీ దొంగ వేషాలన్నీ.. వీళ్ళ గుంపు దేశాన్ని ఆక్రమించినట్లుగా.. బావను తన బుట్టలో పడేసుకోవాలనే దురుద్ధేశంతోనే. దీని ఆటలు నా దగ్గర సాగుతాయా!.. సాగనిస్తానా.!.. తను జుట్టు కత్తిరించుకొన్నట్లుగానే.. తన ఆశను నేను కత్తిరించేస్తా!..’ అనుకుంది సీత.

రాఘవ పాడుతున్న పాట ముగిసింది. మైక్‍లో “పదిహేను నిముషాలు విరామం. ఆ తర్వాత జానపద దేశ భక్తిగీతాలు రాఘవ పాడుతాడు. యిప్పుడు సమయం రెండు గంటలు. మరో నాలుగు గంటల్లో సూర్య భగవానుడు ఉదయిస్తాడు. మనమందరం.. మహాశివరాత్రి జాగరణ చేసిన వారం అవుతాం. ఆ సర్వేశ్వరుని శుభాశీస్సులు మనకందరికీ లభిస్తాయి” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్.

అద్వైత్ గొంతు వినగానే తొట్రుపాటుతో కళ్ళు తెరిచింది ఇండియా.

ప్రక్కనే కూర్చొని యున్న సుల్తాన్.. “అమ్మా!.. షల్ వుయ్ గో హోం!..” అడిగాడు మెల్లగా.

“మీరు ఇంటికి వెళ్ళాలా!..”

ఇండియా ఆ ప్రశ్న వలన.. సుల్తాన్‍కు అర్థం అయింది.. ఆమె కార్యక్రమం పూర్తి అయ్యేవరకూ వుండాలనుకొంటుందని. మౌనంగా లేదన్నట్లు తల ఆడించాడు.

ఇండియా కుర్చీ నుంచి లేచింది. తన గురువుగారి ముఖంలోకి చూచింది.

“ఏమ్మా!.. ఇంటికి వెళతావా!..” ఆప్యాయంగా అడిగారు శాస్త్రిగారు.

అవునన్నట్లు తల ఆడించి.. వారందరినీ చూచి చేతులు జోడించి ముందుకు నడిచింది ఇండియా. ఆ క్షణంలో ఆమె వదనం ఎంతో గంభీరంగా వుంది. సుల్తాన్ ఆమెను అనుసరించాడు. ఇరువురూ కారును సమీపించారు.

“సుల్తాన్ భాయ్!..”

“ఏమ్మా!..”

“రాఘవ గారికి అమ్మా నాన్నా లేరు కదూ!..”

“అవునమ్మా!..”

“వారేమైనారు?..”

“చనిపోయారు..”

“కారును నది ఒడ్డుకు పోనీండి”

“నది ఒడ్డుకా!..”

“అవును.. మనం సూర్యోదయం వరకూ నది ఒడ్డున వుంటాం” ఆ మాటల్లో స్థిరత్వం వుంది.

ఆ విషయాన్ని గ్రహించిన సుల్తాన్.. “అలాగేనమ్మా!..” అన్నాడు.

ఇరువురూ కార్లో కూర్చున్నారు. పదిహేను నిముషాల్లో కారు నది ఒడ్డుకు చేరింది.

అది ఫాల్గుణ మాసం. ఉత్తరాయణం. శిశిర ఋతువు. బహుళ పక్షం చీకటి రోజులు..

ఇండియా.. సుల్తాన్ కారు దిగారు. చుట్టూ గాఢాంధకారం.. ఆకాశం వైపు చూచారు. కోట్ల కొలది నక్షత్రాలు ఆకశాన మెరుస్తున్నాయి. ఏటి ఒడ్డున వున్న మర్రిచెట్టు మీది పక్షలు కారు లైట్లను దిగిన వీరిని చూచి..

‘ఎవరో మనలను వేటాడేదానికి వచ్చినట్లున్నారు. జాగ్రత్త. కదలకండి.. సవ్వడి చేయకండి..’ అని హెచ్చరించుకొన్నాయట. కుహు.. కుహు.. రవాలతో,

“అమ్మా!.. యింకా మూడు గంటలకు పైగా యిక్కడ వుండాలి!..”

“వుయ్ కేమ్ హియర్ టు స్టే.. వుండేదానికే వచ్చాము. మీకు భయమా.. ఐ మీన్ ఫియర్!.. నవ్వింది ఇండియా.

“నాకా భయమా.. నోనో.. నాకున్న భయమల్లా మీ గురించి..”

“నా గురించి!..”

“యస్ అమ్మా!..”

“ఐ హ్యావ్ నో ఫియర్. సీ అప్.. హౌ మెనీ స్టార్స్ ఆర్ దేర్.. సీ దట్ ట్రీ.. ఫ్యూ బర్డ్స్ ఆర్ ఆల్ సో దేర్!..”

“అవును మీరు చెప్పినవన్నీ వున్నాయ్!.. కానీ..”

“వాట్ కానీ!..”

“యువర్ ఫాదర్..” చెప్పదలచుకొన్నది ఇండియా ఏమనుకుంటుందోనని ఆగిపోయాడు సుల్తాన్.

“మై ఫాదర్ యీజ్ ఏ ఫూల్.. వుయ్ షుడ్ నాట్ కేర్ ఫూల్స్, సుల్తాన్ భాయ్!..” నవ్వింది ఇండియా.

‘ఈ పిల్ల సామాన్యురాలు కాదు. మహామొండి ఘటం. తన పంతమే నెరవేరాలనుకొంటుంది. తండ్రిలాగా!..’ ఆవలింత వచ్చింది. చేతిని అడ్డం పెట్టుకొని ఆవలించాడు.

“మనం కార్లోనే కూర్చుందాం!..”

“అలాగేనమ్మా!..”

ఇరువురూ కార్లో కూర్చున్నారు.

“సుల్తాన్ భాయ్!..”

“ఏమ్మా!..”

“నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పాలి.. ట్రూత్!..”

“చెబుతానమ్మా!..”

“సీత.. రాఘవ సార్!..” ఇండియా పూర్తి చేయక మునుపే..

“అన్నాచెల్లెళ్ళు..” చెప్పాడు సుల్తాన్.

“వాళ్ళ అమ్మా నాన్నలు యిపుడు ఎక్కడ వున్నారు?..”

“యీ లోకంలో లేరు..”

“అంటే!..”

“చచ్చిపోయారని ముందే చెప్పానుగా అమ్మా!..”

“ఎప్పుడు!..”

“రెండు సంవత్సరాల క్రిందట..”

“కారణం!..”

“మీ తెల్లదొరలే..”

“ఎలా చచ్చిపోయారో వివరంగా చెప్పండి..”

“అమ్మా!.. రాఘవ గారి తల్లి తండ్రి ఒంటెద్దు.. సింగల్ బులక్ కాట్‍లో విశాఖపట్నానికి ముఫై కిలోమీటర్ల దూరంలో వున్న బంధువుల యింటికి వచ్చి పెళ్ళి ముగిసాక తమ వూరికి బయలుదేరారు. మీ సిపాయిల ద్వారా ఆ సమాచారం మీ అప్పటి కర్నల్ గారికి అందింది. ఆ బండిలో వెళుతున్నది.. మీకు వ్యతిరేకులైన విప్లవకారులని భావించి.. తుపాకులతో చాటుగా వుండి వారిని కాల్చి చంపారు. ఇది రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగింది. ఇరువురూ స్పాట్ లోనే మరణించారు” వివరంగా చెప్పాడు సుల్తాన్.

“రాఘవగారు.. మా గురువు గారు.. మా వారిపై కేసు పెట్టలేదా!..” అడిగింది ఇండియా.

“కేసు పెట్టి.. డబ్బును ఖర్చు పెట్టడం తప్ప ప్రయోజనం వుండదని.. మీ అధికారులు.. వారిని కాల్చి చంపింది మీ సిపాయిలే అయినందున.. వారిని మీ వారు దండించబోరని.. అనవసరమైన శ్రమ.. ఖర్చు ఎందుకని.. పోయినవారు ఎటూ తిరిగి రాబోరు కాబట్టి నరసింహశాస్త్రిగారు వూరుకొన్నారు. వారి మాటలను ఆ యింట ఎవరూ కాదనలేరు. వారి మాటంటే వారందరికీ ఎంతో గౌరవం. ఆ యింటి వారే కాదు వారిని ఎరిగిన ఎవరూ వారి మాటను కాదనరు. కారణం వారి మాటల్లో సత్యం.. ధర్మం వుంటుంది”

“సత్యం అంటే ట్రూత్.. ధర్మం అంటే..”

“జస్టిస్..”

“మరి పాండురంగ ఫాదర్ మదర్!..”

“వారు పదేళ్ళ క్రిందట ఓ బస్సు యాక్సిడెంట్లో చనిపోయారు యిరువురూ ఒకేసారి!..”

“వారి హత్యకు మా నాన్నగారికి ఏమైనా సంబంధం వుందా!..”

“ఆ విషయం నాకు తెలియదు. ఆ టైమ్‍లో మీ నాన్నగారు కలకత్తా మహనగరంలో ఉండేవారు కదమ్మా.”

“యస్!.. అవును” సాలోచనగా అంది ఇండియా.

వ్యాపార నిమిత్తం సముద్రాలను దాటి ఇండియాకు వచ్చి తన వారు.. ఈ దేశంలో చేసిన చేస్తున్న అరాచకాలు కొంతవరకూ విని యున్నందున.. ఇండియాకు తన వారి కారణంగా సీతకు రాఘవకు తల్లిదండ్రులు లేకుండా పోయారని బాధపడింది.

అంతవరకూ నాట్యంలో తనకు పోటీగా నాట్యం చేస్తూ తనను విమర్శిస్తూ వుంటున్న సీత పట్ల ఆ క్షణంలో ఇండియాకు వాత్సల్యం.. ప్రేమ కలిగాయి. ‘పూర్ గర్ల్.. ఆర్‌ఫన్’ అనుకుంది. సీతతో మంచి స్నేహభావంతో కలసిమెలసి వుండాలని నిర్ణయించుకొంది ఇండియా.

“సుల్తాన్ భాయ్.. మరొక ప్రశ్న!..”

“అడగండమ్మా!..”

“నిజం చెప్పాలి..”

“తప్పకుండా…”

“మా దేశస్థులకు.. మీ దేశస్థులకు.. వున్న తేడా ఏమిటి?..”

“యీ దేశస్థుల మనస్సులో వుండేది స్నేహభావం.. దయ.. ప్రేమ ఆదరణ.. అభిమానం.. మీ దేశస్థుల మనస్సులో వుండేది మోసం.. ద్వేషం.. స్వార్ధం.. కుట్ర.. కుతంత్రం.. విభజన భావాలు. అనాదిగా యీ దేశంలో హిందూ మహమ్మదీయుల ఎంతో సఖ్యతతో.. కలసి మెలసి వుండేవారు. మీవారు యీ దేశానికి వచ్చి మా వారి మనస్సులకు మీ తత్వాలను లేపనం చేసి.. మీ స్వప్రయోజనాల కోసం.. మా వారిలో విభేదాలను కల్పించి ఒక వైపున చేరి.. మరొక పక్షాన్ని ఓడించి.. వారి సర్వాన్ని దోచుకుంటూ.. మాలో మాకు విభేధాలను కల్పిస్తున్నారు. నా బోటి సామాన్యులు బ్రతికేటందుకు ఎలాగైనా బ్రతికితే చాలని.. మా సహజ తత్వాలను చంపుకొని మీ వారిని ఆశ్రయించి బ్రతుకుతున్నాము- మాలో వున్న ఐక్యతను మానవత్వాన్ని చంపేశారు. మమ్మల్ని ఎలాగోలా బ్రతకాలనే స్థితికి తీసుకొని వచ్చారు. అమ్మా!.. నేను చెప్పింది నా మనస్సుకు తోచింది. ఏదైనా మీకు తప్పుగా తోస్తే నన్ను మన్నించండి. యీ నా మాటలు నాన్నగారి చెవికి పోనీకండి” దీనంతా చేతులు జోడించి చెప్పాడు సుల్తాన్. క్షణం ఆగి.. “అమ్మా నేను తెలుగులో చెప్పిన విషయాలు మీకు అర్థం అయినాయా!..” అడిగాడు సుల్తాన్.

సుల్తాన్ చెప్పిన మాటలను చాలావరకు అర్థం చేసికొన్న ఇండియా.. “నాకూ బ్రెయిన్ వుందిగా!.. నేనూ ఆలోచించగలను. ఏది తప్పో.. ఏది ఒప్పో చెప్పగలను సుల్తాన్ భాయ్!..” గలగలా నవ్వింది.

చేతి వాచీ కేసి చూచింది.. సమయం ఐదుగంటలు. తూర్పు దిక్కున బాలభాస్కరుని అరుణకాంతులు చీకటిని తరిమి వ్యాపిస్తున్నాయి.

“సుల్తాన్ భాయ్!.. నేను నదిలో స్నానం చేయాలి..”

“అమ్మా..” ఆశ్చర్యంతో అడిగాడు సుల్తాన్.

“అవును. స్నానం చేసి గుడికి వెళ్ళి శివ గాడ్‍ను చూచి ఇంటికి వెళదాం. మీరూ నాతో స్నానం చేస్తారా!..”

‘ప్రతి మనిషి.. సాటి మనిషిని ప్రేమించాలి.. ఎవరి ప్రార్థనా విధానం వారిది.. విమర్శించకూడదు. అందరూ పీల్చే గాలి.. తాగే నీరు వుపయోగించే నిప్పుది ఏ కులం.. ఏ మతం.. నిండా పాతిక సంవత్సరాల వయస్సులేని యీ అమ్మలో వున్న భిన్నత్వంలో ఏకతా భావన.. యింత వయస్సు వచ్చిన నాలో లేకపోతే నేను మనిషినే కాను’ అనుకొన్నాడు సుల్తాన్.

“నా ప్రశ్నకు జవాబు చెప్పలేదే!..” అడిగింది ఇండియా.

“మీరే చేసేటప్పుడు.. నేను చేయకుండా ఎలా వుంటానమ్మా!.. చేస్తాను తల్లీ..” ఆనందంగా చెప్పాడు సుల్తాన్.

“పదండి.”

ఇరువురూ నదీ జలాలను సమీపించారు. ముందు సుల్తాన్, తర్వాత అతను చేయి అందించగా ఇండియా నదీజలంలో దిగారు, స్నానం చేశారు. ఒడ్డుకు వచ్చారు.

అదే సమయానికి అక్కడికి నరసింహశాస్త్రి, అద్వైత్, రాఘవ, పాండురంగ.. నదీ స్నానానికి వచ్చారు. ఒడ్డున వున్న సుల్తాన్ ఇండియాలను చూచి వారు ఆశ్చర్యపోయారు. నరసింహశాస్త్రి పిలువగా వారి దగ్గరకు వెళ్ళి.. జరిగిన విషయాన్ని ఇండియా అభిప్రాయాలను సుల్తాన్ శాస్త్రిగారికి చెప్పాడు. ఇండియా వారికి నమస్కరించింది. కుడిహస్తాన్ని పైకెత్తి హృదయపూర్వకంగా ఆశీర్వదించారు నరసింహశాస్త్రిగారు. ఇండియా సుల్తాన్‍లు వెళ్ళిపోయారు. వారు నదిలో దిగారు. ఇండియా సుల్తాన్‍లు శివాలయంలో ప్రవేశించి జగత్ మాతాపితలను దర్శించి అర్చకులు యిచ్చిన తీర్థ ప్రసాదాలను సేవించి ఇంటికి వెళ్ళారు.

వరండాలో రుద్రరూపంతో రాబర్ట్ కూర్చొని వున్నాడు. అతని ప్రక్క కుర్చీలో ఆండ్రియా వుంది.

“రాత్రి ఎక్కడికి వెళ్ళావ్?” గద్దించినట్లు అడిగాడు రాబర్ట్. క్షణం తర్వాత..

“మాతో చెప్పకుండా ఎలా వెళ్ళావ్?..” అన్నాడు రాబర్ట్.

“మీరిరువురూ మీ గదిలో నిద్రపోయారుగా!..”

ఏ మాత్రం జంకుబెంకు లేకుండా ఇండియా చెప్పే సమాధానాలకు రాబర్ట్‌కు  కోపం వచ్చింది. వికారమైన ముఖంతో భార్య ముఖంలోకి చూచాడు.

“మంచి పనిని చేసేటందుకు నా బిడ్డకు ఎవరి పర్మిషన్ అక్కరలేదు” తన ఖచ్చితాభిప్రాయాన్ని రాబర్ట్ ముఖంలోకి చూస్తూ చెప్పి ఆండ్రియా. కుర్చీ నుంచి లేచి.. “బేబీ!.. నాతో రా!..” లోనికి నడిచింది ఆండ్రియా. తల్లి ముందు నడువగా.. వెనకాలే చిరునవ్వుతో ఇండియా లోనికి వెళ్ళింది.

“సుల్తాన్! నీవు తప్పు చేశావు”

“చిన్నమ్మగారిని నాతో తీసికొని పోవడమా సార్!..”

“అవును..”

“సార్.. మీ మాటను అమ్మగారి మాటను నేను విని పని చేసినట్లే చిన్నమ్మగారి మాటనూ నేను వినడం నా ధర్మం కదా సార్.. కారణం ఆమె మీ కూతురు” వినయంగా చెప్పాడు సుల్తాన్.

“రాత్రంతా ఎక్కడ వున్నారు?..”

“శివాలయంలో, తర్వాత నది ఒడ్డున.. రెండూ చిన్న అమ్మగారి కోరికలే సార్..”

రాబర్టు కుర్చీ నుంచి లేచి యింట్లోకి నడిచి ఆగి.. “కం బై ఎయిట్ థర్జీ!..” అని చెప్పి లోనికి వెళ్ళిపోయాడు.

“ఓకే సార్!…” రాబర్ట్ తత్వాన్ని తలచుకొని నవ్వుకొంటూ సుల్తాన్ తన ఇంటి వైపుకు నడిచాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here