అద్వైత్ ఇండియా-8

0
8

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[దేవీ నవరాత్రుల ఉత్సవాలు జరుగుతుంటాయి. నరసింహశాస్త్రి ఆధ్వర్యంలో శ్రీమహాలక్ష్మమ్మ ఆలయంలో తొమ్మిది రోజులు పూజలు ఘనంగా జరుగుతాయి. చివరి రోజున ఉద్వాసన అనంతరం కలశాన్ని గోదావరీ నదిలో నిమజ్జనం చేయడం కోసం కలశాన్ని ఉంచిన వెండి పళ్ళాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తుండగా అమ్మవారు నరసింహశాస్త్రిని ఆవహిస్తుంది. వారి పూజల వల్ల తనకు ప్రీతి కలిగిందని చెబుతుంది. భక్తులందరూ దండాలు పెట్టుకుంటారు. ఆండ్రియా, ఇండియా కూడా ఆ ఊరేగింపులో పాల్గొంటారు. ఇంటికి వచ్చిన రాబర్ట్ ఇంట్లో భార్యాపిల్లలు లేకపోవడం చూసి ఎక్కడికి వెళ్ళారొ కనుక్కుని, ఊరేగింపు జరుగుతున్న ప్రాంతానికి వస్తాడు. ఆండ్రియాని సమీపించి, ఇంటికి రమ్మంటాడు. వాళ్ళిద్దరి మధ్యా వాదన జరుగుతుంది. నరసింహశాస్త్రికి అడ్డం వెళ్ళి, వాటీజ్ దిస్ అని అడుగుతాడు. నాన్నని అమ్మవారు ఆవహించిందని, ఆయన స్పృహలో లేడని, పక్కకు జరగమని అద్వైత్ చెప్పినా పట్టించుకోడు రాబర్ట్. అయితే మీ నాన్న ఇప్పుడు దేవుడా, మరి సాక్ష్యమేది అని అడుగుతాడు. అప్పటిదాక మౌనంగా ఉన్న నరసింహశాస్త్రి తన చేతిలోని పళ్ళాన్ని అద్వైత్ చేతికిచ్చి, పక్కనే ఉన్న వేపచెట్టు నుంచి వేపాకును దూసి తన కుడిచేతిలోకి తీసుకుంటారు. ఆ వేపాకుని రాబర్ట్ చేతిలో ఉంచగానే సిందూరంగా మారిపోతాయి. ఆండ్రియా, ఇండియాలు ఆ సిందూరాన్ని నుదుటన ధరిస్తారు. రాబర్ట్ చేతిలో కుంకుమ పడిన క్షణంలోనే, అక్కడ రాబర్ట్ ఇంట్లో అతని గుర్రం పెద్దగా సకిలించి నేలకూలి చనిపోతుంది. రాబర్ట్ తేరుకుని తన చేతిలోని కుంకుమని నేలకి విసిరేస్తాడు. ఆండ్రియా, ఇండియా, రాబర్ట్ ఇంటికి చేరుతారు. ఉత్సవానికి సంబంధించిన అన్నీ పనులను ముగించి, ఇంటికి చేరుతారు నరసింహశాస్త్రి, అద్వైత్, పాండురంగలు. చచ్చిపడి ఉన్న గుర్రాన్ని చూసి రాబర్ట్ ఆశ్చర్యపోతాడు. ఏం జరిగిందని సుల్తాన్‍ని అడిగితే, మీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు అంటాడు. వేపాకులు కుంకుమగా ఎలా మారాయి అని అడుగితే, దైవ మహిమ అంటాడు సుల్తాన్. నరసింహశాస్త్రికి మంత్రశక్తులున్నాయా అని అడిగితే, ఆయన మహోన్నతుడని, అందరూ ఆయన్ని గౌరవిస్తారనీ, రాబర్ట్ మాత్రమే అవమానించ చూశాడని అంటాడు. ఇంతలో అక్కడికి కల్నల్ మూన్ వస్తాడు. మూన్ రావడం చూసి ఆండ్రియా, ఇండియా కూడా లోపలి నుంచి వస్తుంది. రాబర్టును పిలిచి వరండాలో కూర్చుంటాడు మూన్. కొంత సేపు మాట్లాడాకా, తల్లీ కూతుళ్లు లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు తాను వచ్చిన పనిని రాబర్టుకు చెప్తాడు మూన్. తాను త్వరలో స్వదేశానికి వెళ్ళిపోతున్నాననీ, పై అధికారులు తన స్థానంలో రాబర్టును ఎంపిక చేశారని, త్వరలో బాధ్యతలు తీసుకోవాలని చెప్తాడు. తనకు భారతీయుల పట్ల ఆంగ్లేయులు ప్రవర్తిస్తున్న తీరు నచ్చడం లేదని అంటాడు మూన్. ఇంతలో రెండు కప్పులతో కాఫీ తెచ్చి మూన్‍కి, రాబర్ట్‌కి ఇస్తుంది ఇండియా. కాఫీ తాగి వెళ్ళొస్తానని లేస్తాడు మూన్. మీరు వెళ్ళేడప్పుడు మీతో పాటు అమ్మా, నేనూ ఇంగ్లండ్ వచ్చేస్తున్నామని అమ్మ మీకు చెప్పమంది అంటుంది ఇండియా. సరేనంటాడు మూన్. అతని కారు వెళ్ళిపోగానే, ఇండియా లోపలికి వెళ్ళిపోతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 15:

[dropcap]మూ[/dropcap]న్ వెళ్ళిపోయిన తర్వాత.. చాలాసేపు రాబర్ట్ వరండాలోనే కూర్చున్నాడు. అతని మనస్సులో మూన్ చెప్పిన మాటల వలన ఒకవైపున ఆనందం.. మరో వైపున ఆండ్రియా విమర్శలు.. రెండూ ఎదురెదురు ధృవాలుగా నిలిచాయి.

భార్యను సమీపించి.. ప్రీతిగా పలకరించే దానికి తన అహంకారం అడ్డు గోడగా నిలిచింది. ఎంతగానో ఆలోచించి.. చివరకు ఆండ్రియా మాటలను తాను లెక్కచేయకూడదనే నిర్ణయానికి వచ్చాడు.

ఆ తల్లీ కూతుళ్ళు ఏదో తిని ఆండ్రియా గది లోనికి వెళ్ళి తలుపు బిగించుకొన్నారు.

దాదాపు రెండు గంటల తర్వాత రాబర్ట్.. లేచి లోనికి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్‌ను సమీపించాడు. టేబుల్ మీద బ్రెడ్ పాకెట్ ఒక్కటే వుంది. పాకెట్ విప్పి రెండు స్లయిసులు తిని తన గదిలోకి ప్రవేశించి పడకపై వాలిపోయాడు.

అహంకారం.. స్వాతిశయం.. మనిషిలోని వివేకాన్ని కాల్చి చంపేస్తాయి. రాబర్ట్ విషయంలో అదే జరిగింది. పడకపై చాలాసేపు అటూ ఇటూ పొర్లాడు. కానీ ప్రశాంతంగా నిద్ర పట్టలేదు. ఆ రోజు అతను చేసిన చర్యల ప్రభావం కాబోలు అది.

కొన్ని గంటల తర్వాత నిద్రాదేవి అతన్ని కనికరించింది. వుదయం.. ఆరు గంటలకు ఇండియా.. ఆండ్రియాలు లేచారు. కాలకృత్యాదులు తీర్చుకొని.. టిఫిన్ చేసి ఇండియా నాట్య శిక్షణకు వెళ్ళిపోయింది.

వుదయం తొమ్మిది గంటలయింది. సుల్తాన్ డ్యూటీకి వచ్చాడు. ఇంతకుముందు అతను వచ్చేసరికి రాబర్ట్.. సిద్ధమై వరండాలో కూర్చొని వుండేవాడు. ఆ రోజు నిద్ర లేచి గది నుండి బయటికి రాలేదు.

“మేమ్!..” పిలిచాడు సుల్తాన్.

ఆండ్రియా వరండాలోకి వచ్చింది. కుర్చీలో ఆ సమయంలో కూర్చొని వుండవలసిన రాబర్ట్ లేనందున ఆమెకు ఆశ్చర్యం కలిగింది.

“మేమ్!.. బాస్ ఎక్కడ!..” అడిగాడు సుల్తాన్.

“వారి గదిలో వున్నారేమో చూడండి..” అంది ఆండ్రియా.

సుల్తాన్ రాబర్ట్ గదిని సమీపించి తలుపును మెల్లగా తోశాడు. లోన గడియ పెట్టనందున తలుపు తెరచుకొంది. సుల్తాన్ మెల్లగా గదిలో ప్రవేశించాడు. మంచంపై పడుకొని యున్న రాబర్ట్‌ను చూచాడు. అతని శరీరంపై ఏర్పడిన బొబ్బలను చూచి ఆశ్చర్యపోయాడు. మెల్లగా తన చేతిని రాబర్ట్ కాలిమీద వుంచాడు. అతని శరీరం నుండి సెగలు. చేతిని వెంటనే వెనక్కు తీసికొన్నాడు.

రాబర్ట్ అచేతనంగా.. మంచంపై పడి వున్నాడు. సుల్తాన్ రాబర్ట్ తల నుంచి కాళ్ళ వరకూ పరిశీలనగా చూచాడు. కొన్నిక్షణాల తర్వాత.. అతనికి విషయం అర్థం అయింది. వేగంగా గది నుండి బయటికి నడిచాడు.

ఆండ్రియా వంట యింట్లో వుంది. సుల్తాన్ ఆ గదిని సమీపించి “మేమ్!..” బిగ్గరగా ఆందోళనతో పిలిచాడు. వంట మనిషికి వివరాలు చెప్పి ఆండ్రియా అతన్ని సమీపించి

“వాట్ సుల్తాన్!..” అంది.

“అయ్యగారికి అమ్మవారు పోసిందమ్మా!.. జ్వర తీవ్రత వల్ల వారు స్పృహలో లేరు”

ఆ మాటలను విన్న ఆండ్రియా వేగంగా రాబర్ట్ గదిలోనికి వెళ్ళి.. అతన్ని చూచింది. శరీరాన్ని తాకింది. ఆశ్చర్యాందోళనతో గది నుంచి బయటికి వచ్చింది.

“సుల్తాన్!.. ఇప్పుడేం చేయాలి…” ఆతృతతో అడిగింది.

“మీరే చెప్పాలమ్మా!..”

“హాస్పిటల్‍కు తీసుకొని వెళదామా!..”

“యీ స్థితిలో వారిని హాస్పటల్‍కు ఎలా తీసుకొని వెళ్ళగలమమ్మా!..”

“మరేం చేయాలి!..”

సుల్తాన్ వీధి ముందున్న వేపచెట్టును చూచాడు. వేగంగా వెళ్ళి చెట్టును సమీపించి పది రెమ్మలను విరిచి తీసికొని వచ్చి..

“పదండమ్మా అయ్యగారి గదిలోకి..” అన్నాడు.

అతని చర్య ఆండ్రియాకు ఏమీ అర్థం కాలేదు. అతని వెనకాలే రాబర్ట్ గదిలోకి నడిచింది.

సుల్తాన్ తన చేతిలోని వేప మండలను రాబర్ట్ శరీరానికి తగిలేలా అతని రెండు వైపులా అమర్చాడు.

“ఏం చేస్తున్నావు సుల్తాన్!..” ఆశ్చర్యంతో అడిగింది ఆండ్రియా.

“యీ స్థితిలో వున్న వారికి.. యీ వేపాకేనమ్మా!.. ఉపశమనాన్ని కలిగించేది..”

“అంటే..”

“యీ ఆకుల గాలి వారి శరీరానికి తగలగానే.. వారి శరీరంలో వున్న వేడి అదే జ్వరం తగ్గుతుంది”

“నిజంగానా!..”

“నిజం అమ్మా!.. యీనాటి వీరి యీ స్థితికి కారణం నిన్న వీరు నరసింహశాస్త్రిగారిని అవమానించడమే!..”

నిన్నటి దృశ్యం.. ఆండ్రియా కళ్ళ ముందు నిలిచింది. రాబర్ట్ అహంకారపు మాటలు జ్ఞప్తికి వచ్చాయి. బాధ, అవమానంతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.

ఆ క్షణంలో ఆమె హృదయంలో యిరవై మూడు సంవత్సరాల సన్నిహితుడు అస్వస్థతతో బాధ పడుతున్నాడనే ఆవేదన. అదే ఏ భాష అయినా.. ఏ దేశమైనా.. ఏ మతం అయినా.. ప్రతి స్త్రీ మూర్తికి ఆ దేవుడు యిచ్చిన మహోన్నతమైన మనస్తత్వం.

“అమ్మా!.. మీరు బాధ పడకండి. నేను వెళ్ళి నరసింహశాస్త్రిగారిని కలసి వస్తాను”

“వీరి యీ స్థితికి వారు ఏం చేయగలరు సుల్తాన్!..” దీనంగా అడిగింది ఆండ్రియా.

“అమ్మా!.. మాతా ఉపాసకులు. వారు వీరికి త్వరలో స్వస్థతను సమకూర్చగలరు. నా మాటను నమ్మండి” అనునయంగా చెప్పాడు సుల్తాన్.

“సరే సుల్తాన్ వెళ్ళిరా!..”

“అలాగేనమ్మా!.. మీరు భయపడకండి. అయ్యగారికి త్వరలో తగ్గిపోతుంది. నేను అరగంట లోపల తిరిగి వస్తాను” వేగంగా గది నుండి బయటికి నడిచాడు సుల్తాన్.

అభిప్రాయభేధాలు వున్నా.. విరోధి అయినా.. ఆపదలో వున్నప్పుడు ఆదుకోవడం.. చేయ తగిన సాయం చేయడం.. యీ భారతావని మట్టి మీద పుట్టిన ప్రతి మనిషిలో వున్న సహజగుణం. దానికి.. మతానికి.. జాతికి.. రీతికి సంబంధం లేదు. అది మానవతాభిమానం. దానికి సాటి మరొకటి లేదు.

నిన్నటి కార్యనిర్వహణలో శరీరం సొలసి పోయినా.. నరసింహశాస్త్రిగారు యథావిధిగా వుదయం ఐదు గంటలకు లేచి తన నిత్యవిధులన్నీ నెరవేర్చుకొని వరండాలో కూర్చొని వున్నారు. ఆ రోజు ఆదివారం అయినందున నాట్య శిక్షణను అద్వైత్ నిర్వహిస్తున్నాడు.

పది మంది గుంపుగా వచ్చి వారి ముందు నిలబడి చేతులు జోడించారు. వారు వీధి భాగవతపు ట్రూపు. ప్రతి సంవత్సరం ఆ ప్రాంతానికి వచ్చి.. నరసింహశాస్త్రిని కలుసుకొని వారి దీవెనలను పొంది తొలి నాటకం వారి యిష్టానుసారంగా వారి యింటి ప్రక్కన వున్న వారి ఆవణంలో ప్రదర్శించడం వారి ఆనవాయితీ.

“ఏరా కోదండా!.. అంతా బాగున్నారా!..” చిరునవ్వుతో అడిగాడు నరసింహశాస్త్రి.

“తమ దయవల్ల అందర బాగున్నాము సామీ!.. ప్రతి ఏడూ జరిగినట్లుగా యీ సారి కూడ తమరే మా తొలి నాటకాన్ని జరిపించాలి సామి..” వినయంగా చెప్పాడు ఆ ముఠా నాయకుడు కోదండయ్య.

“అలాగే!.. కొత్తగా ఏదైనా నాటకాన్ని నేర్చుకున్నారా!..”

“చిత్తం సామి!.. శ్రీకృష్ణ రాయబారాన్ని నేర్చుకున్నామయ్యా!..”

“సరే!.. దాన్నే ప్రదర్శించండి. మరి కృష్ణుని వేషం వేసేది మీలో ఎవర్రా!..”

“సామీ!.. వీడు నా కొడుకు. పేరు నారాయణ. పదకొండవ క్లాస్ పాసైనాడు. వీడే శ్రీకృష్ణుని వేషం వేస్తాడయ్యా!..’ తన కొడుకును వేలితో చూపించి చెప్పాడు కోదండయ్య.

“సావిత్రీ!..” పిలిచారు నరసింహశాస్త్రి.

రెండు నిముషాల తర్వాత సావిత్రి వచ్చి వారి ప్రక్కన నిలబడింది.

ఆమెను ఎరిగివున్న వీధి భాగవతపు ట్రూపు చేతులెత్తి.. “తల్లీ!.. దండాలు..” అన్నారు ఏకకంఠంతో. సావిత్రి నవ్వుతూ ప్రతినమస్కారాన్ని చెప్పి అందరినీ ప్రీతిగా చూచింది.

“సావిత్రీ!.. మనవాళ్ళు వచ్చారు. తొలి నాటకం మనమే వేయించాలట” చిరునవ్వుతో చెప్పాడు నరసింహశాస్త్రి. అవునన్నట్లు నవ్వుతూ సావిత్రి తల వూపింది.

“సరే!.. వారికి యివ్వవలసింది యివ్వు..”

“అలాగేనండి..” చెప్పి సావిత్రి లోనికి వెళ్ళింది. మూడు నిముషాల్లో తిరిగి వచ్చి డబ్బును నరసింహశాస్త్రికి అందించింది.

“రా కోదండా!.. తీసికో..”

కోదండయ్య నరసింహశాస్త్రిని సమీపించాడు. శాస్త్రిగారు తన చేతిలోని ద్రవ్యాన్ని కోదండయ్య చేతిలో వుంచాడు. డబ్బును జేబులో వుంచుకొని.. కోదండయ్య పరమానందంగా నరసింహశాస్త్రికి నమస్కరించాడు.

సుల్తాన్ వచ్చి వారి ప్రక్కన నిలబడ్డాడు. చేతులు జోడించాడు.

“యిక మీరు వెళ్ళి రండి..”

వారంతా నరసింహశాస్త్రికి మరోసారి నమస్కరించి వెళ్ళిపోయారు.

సుల్తాన్ ముఖంలోకి చూచాడు నరసింహశాస్త్రి.

“సుల్తాన్!.. ఏమిటి విషయం!.. చాలా దిగులుగా వున్నట్లున్నావ్!..” అడిగాడు నరసింహశాస్త్రి.

“అవునయ్యగారు!.. రాబర్ట్‌కు అమ్మ పోసింది. ఒళ్ళు కాలిపోతూ వుంది. మేడం చాలా బాధపడుతున్నారు. వారు స్పృహలో లేరు” విచారంగా చెప్పాడు సుల్తాన్.

“అమ్మ పోసిందా!..”

“అవునయ్యగారూ!..”

“అతనంటే ఆ తల్లికి అభిమానం వుందన్నమాట” చిరునవ్వు నవ్వారు నరసింహశాస్త్రి.

శాస్త్రిగారి మాటలకు సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.

సుల్తాన్!.. తల్లికి.. నిత్యం తనను తలచుకొని ఆరాధించే బిడ్డల మీద కన్నా.. తన్ను ద్వేషించే వారి మీదనే అభిమానం ఎక్కువ. ఒక తల్లిగా తన బిడ్డలను బాగుపరచడం.. ఆ తల్లి ధర్మమే కదా!..”

“వారి వల్ల నిన్న చాలా పెద్ద అపచారం జరిగిందయ్యా!..”

“విన్నాను సుల్తాన్!..”

“అమ్మగారి ముఖం చూచి వారిని మీరు రక్షించాలి”

“అందరినీ రక్షించేది ఆ జగన్మాతేనయ్యా. కూర్చో.. వస్తాను” నరసింహ శాస్త్రి లేచి పూజా మందిరంలోకి వెళ్ళారు. మాతా పితలను తలుచుకొని వుదయం పూజ చేసిన కుంకుమను కాగితంలో వుంచి పొట్లం కట్టారు. అభిషేక జలాన్ని ఒక గ్లాసులో పోసి చేతికి తీసుకొని వరండాలోకి వచ్చారు. కుంకుమ పొట్లాన్ని నీళ్ళ గ్లాసును సుల్తాన్‍కు అందించారు.

“యీ నీళ్ళను వారి చేత త్రాగించు. యీ కుంకుమను వారి నొసటన వుంచు. జ్వరం తగ్గిపోతుంది. అమ్మ దిగిపోతుంది. వారి విషయంలో ఎలాంటి భయాన్ని పెట్టుకోవద్దని మీ అమ్మగారికి చెప్పు. నాలుగు రోజుల్లో మామూలు మనిషై పోతారు”

“సెలవయ్యా!..” సంతోషంతో చేతులు జోడించాడు సుల్తాన్.

“వెళ్ళిరా సుల్తాన్..” ప్రీతిగా చెప్పాడు నరసింహశాస్త్రి.

తాను అరుగుపై వుంచిన తీర్థపు గ్లాసును చేతికి తీసికొని వీధిలో ప్రవేశించాడు. నడక వేగంతో పావుగంటలో రాబర్ట్ నిలయాన్ని సమీపించి గేటు తెరచుకొని మూసి.. గృహ ప్రాంగణంలో ప్రవేశించాడు సుల్తాన్.

నాట్యం క్లాసు ముగించి స్నేహితులతో బయలుదేరిన ఇండియా, ఇంటికి చేరింది. వ్యాకుల వదనంతో ఆండ్రియా, ఇండియా వరండాలో కూర్చొని యున్నారు. సుల్తాన్ వరండాను సమీపించాడు. వారిరువురూ అతృతతో లేచి నిలబడ్డారు. “సుల్తాన్!.. నరసింహశాస్త్రిగారు ఇంట్లో వున్నారా!..” అడిగింది ఆండ్రియా.

“వున్నారమ్మా!.. తీర్థాన్ని కుంకుమను యిచ్చారు. నాలుగు రోజులలో మామూలు మనిషి అవుతారని.. మీ ఇరువురినీ భయపడవద్దని చెప్పారు. యీ తీర్థాన్ని వారి చేత త్రాగించాలి. ఈ కుంకుమను వారి నొసటన వుంచాలి. పదండమ్మా లోనికి..” వినయంగా చెప్పాడు సుల్తాన్.

ముగ్గురూ రాబర్ట్ గదిలో ప్రవేశించారు. మంచంపై వేప మండల మధ్యన అతను అచేతనంగా పడి వున్నాడు. వారు మంచాన్ని సమీపించారు.

ఆ భార్యాభర్తల మధ్యన కొన్ని నెలలుగా.. అభిప్రాయభేధాలు వున్న విషయం సుల్తాన్‍కు తెలుసు. ఆండ్రియా కొన్నిక్షణాలు రాబర్ట‌‍ను చూచి.. సుల్తాన్ ముఖంలోకి చూచింది.

ఆమె చూపుల్లోని అర్థాన్ని గ్రహించిన సుల్తాన్..

“సార్!..” వంగి రాబర్ట్ చెవి దగ్గర అరిచాడు. జవాబు లేదు. కొన్నిక్షణాల తర్వాత కాస్త బిగ్గరగా పిలిచాడు. రాబర్ట్.. ఆ రెండవ పిలుపుకు కళ్ళను తెరువలేక మెల్లగా తెరిచాడు.

రాబర్ట్ అతని భుజాల క్రింద తన చేతిని వుంచి అతన్ని పైకి లేపాడు. తాను ఆండ్రియాకు అందించిన గ్లాస్ను తన చేతికి తీసికొని రాబర్ట్ పెదవుల వద్ద వుంచి..

“సర్ ప్లీజ్.. ఓపన్ యువర్ మౌత్..” అన్నాడు.

అతి కష్టం మీద రాబర్ట్ నోరు తెరిచాడు.

సుల్తాన్.. తన చేతిలో వున్న గ్లాసులోని నీళ్ళను వారి నోట్లో పోశాడు. రాబర్ట్ గుటక వేశాడు. చేతిని క్రిందకు దించి అతన్ని యథాస్థానానికి చేర్చాడు. జేబులో వున్న కుంకుమ పొట్లాన్ని తీసి విప్పి.. కుంకుమను రాబర్ట్ నొసటన వుంచాడు.

రాబర్ట్.. తీవ్ర జ్వరంలో వున్నందున.. అతని కళ్ళు మూతలు పడ్డాయి.

“మేమ్!.. కొన్ని గంటల్లో సార్ కళ్ళు తెరుస్తారు. ఒకటి రొండు రోజుల్లో వారికి జ్వరం తగ్గిపోతుంది. జ్వరం తగ్గాక అయ్యగారు దర్జాగా మాట్లాడుతారు. తమరు భయపడకండి” ప్రీతిగా చెప్పాడు సుల్తాన్.

ఆండ్రియా సాలోచనగా తల ఆడించింది. జరిగిన తతంగాన్ని ఇండియా ఆశ్చర్యంతో తిలకించింది. ముగ్గురూ వరండాలోకి వచ్చారు.

“అంకుల్…”

“చెప్పండమ్మా!..”

“ఫాదర్‍ని హాస్పటల్‍కు తీసుకొని వెళ్ళవలసిన అవసరం లేదా!..”

“లేదమ్మా!.. త్వరలో తల్లి పోతుంది”

“వారు కుంకుమను నేల విసిరారుగా!.. ఆ కారణంగానే వారికి యీ స్థితి కలిగింది. అవును కదా అంకుల్…” అడిగింది ఇండియా.

చిరునవ్వుతో అవునన్నట్లు తల ఆడించాడు సుల్తాన్.

“యువర్ ఫాదర్ యీజ్ నాట్ ఏ మ్యాన్.. హి యీజ్ ఎ డెవిల్… ఇటీజ్ పనిష్మెంట్ ఫార్ హిం!..” శ్యూనంలోకి చూస్తూ చెప్పింది ఆండ్రియా.

“అంకుల్ మనం హైస్కూలు దాకా వెళ్ళాలి..” అంది ఇండియా

“అలాగేనమ్మా!..”

ఇండియా లోనికి వెళ్ళింది.

“ఆ తండ్రికి యీ కూతురికి ఎంతో వ్యత్యాసం సుల్తాన్!..”

“ఆ విషయం నాకు తెలుసు మేమ్!..’

“ఇండియాకు నేను కొంత డబ్బిచ్చాను. మిస్టర్ మూన్ కొంత యిచ్చారు. తాను దాచుకొన్నది కొంత. అంతా దాదాపు లక్ష రూపాయలు. స్కూల్ హెడ్‍మిసెస్‌కు యిచ్చేదానికి బయలుదేరుతూ వుంది ఇండియా..” చిరునవ్వుతో ఆనందంగా చెప్పింది ఆండ్రియా.

“అమ్మా! నేను ఒక మాట చెప్పనా!..”

“చెప్పండి సుల్తాన్!..” అంది ఆండ్రియా

“అమ్మా!.. మన చిన్నమ్మగారు అంతా మీ మాదిరే.. వాళ్ళ నాన్నగారి గుణాలు ఆమెకు రాలేదు..” నవ్వుతూ చెప్పాడు సుల్తాన్.

ఇండియా పరుగున వరండాలోకి వచ్చింది.

“మామ్!.. నేను బయలుదేరుతాను..” తల్లిని చూస్తూ చెప్పింది ఇండియా.

“ఓకే డార్లింగ్..” చిరునవ్వుతో చెప్పింది ఆండ్రియా.

ఇండియా కారును సమీపించింది. సుల్తాన్ తన స్థానంలో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. కొన్ని క్షణాల్లో వారి కారు వీధిలో ప్రవేశించింది.

ఆండ్రియా.. కుర్చీలో కూర్చొని రాబర్ట్‌ను గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకొంది.

***

సుల్తాన్ కారు స్కూలుకు ఐదు వందల అడుగుల దూరంలో వుంది. రోడ్డు ప్రక్కన నాలుగు వైపులా కంచె దాదాపు నాలుగు గ్రవుండ్ల స్థలం. అందులో ఆవులు, గేదెలు ఎన్నో వున్నాయి. ఇండియా చూపు ఆ స్థలం అందులో వున్న పశువుల వైపు మళ్ళింది.

“అంకుల్… యీ పశువులన్నీ ఒక్కరివేనా!.. వారెవరు?..” సందేహంతో అడిగింది ఇండియా. “యివన్నీ ఒక్కరివి కావమ్మా!.. చాలా మందివి.”

“వేరు వేరు వ్యక్తులు పశువులన్నీ కలసి ఒకే చోట ఎలా వున్నాయ్. వారి వారి ఇండ్ల దగ్గరేగా అవి వుండవలసింది?..” అడిగింది ఇండియా సందేహంతో,

“మీరన్న మాట నిజం అమ్మా!.. కానీ..” ఆగిపోయాడు సుల్తాన్.

“అంకుల్… కానీ అని ఏం చెప్పడం ఆపారు?..” సుల్తాన్ ముఖంలోకి చూస్తూ అడిగింది ఇండియా.

“మీ నాన్నగారి ఆదేశానుసారం.. శిస్తు కట్టని వ్యవసాయదారులు పశువులను బలవంతంగా తోలుకొచ్చి వాటిని ఇక్కడ నిర్భంధించారు. దీనికి పేరు బందిల్ దొడ్డి. ఇక్కడ పది అటూ ఇటూ నాలుగు వందల పశువులున్నాయి. అంటే అవి దాదాపు రెండు మూడు వందల మందివి కావచ్చు. వారు శిస్తు కడితే.. వీటిని వదిలి పెడతారు”

“వీటికి గడ్డి.. నీరు!..”

“ఏమీ వుండవు. బక్కచిక్కిన పశువులు కొన్ని రోజుల తరబడి పస్తులుండి.. తినేదానికి గడ్డి.. తాగేదానికి నీళ్ళు లేక.. చచ్చిపోయిన సందర్భాలూ ఎన్నో!..” విచారంగా చెప్పాడు సుల్తాన్.

“అయ్యో పాపం!..”

“అమ్మా!.. మీరు మంచి మనస్సు వున్న తల్లివి కాబట్టి అయ్యో పాపం అన్నారు. కానీ.. మీ తెల్లదొరలకు మా మీద.. మాకు సంబంధించిన ఎవరి మీదా అంటే.. మనుషుల మీద పశువుల మీద.. పాపం అని వారికి అనిపించదమ్మా!.. నేను చెప్పింది నిజం!..” కాస్త ఆవేశంగా చెప్పాడు సుల్తాన్.

“అంకుల్ బండి ఆపండి. వెనక్కు పోనీయ్యండి..”

“ఎందుకమ్మా !…”

“నేను ఆ పశువులన్నింటినీ విడిపిస్తాను”

“మీ ఒట్టి మాటలను వారు లెక్కచేసి పశువులను విడిపించరమ్మా. వారికి డబ్బు కావాలి”

“వారికి కావలసిన డబ్బు నేను యిస్తాను”

“మనం కరణం మునుసబ్లను కలవాల్సి వుంటుందమ్మా!.. “

“అలాగా!.. సరే వారి వద్దకే వెళదాం పదండి..”

ఇండియా నిర్ణయానికి ఆమె వెంట వెంటనే యిచ్చిన జవాబులకు సుల్తాన్ ఆశ్చర్యపోయాడు. కొన్ని క్షణాలు ఆలోచించి..

“అమ్మా! ఒక్కమాట!..”

“ఏమిటది?..”

“యీ విషయం నాన్నగారికి తెలుస్తుంది. అప్పుడు వారు మిమ్మల్ని!..”

“తిడతారంటారనేగా మీరు చెప్పదలచుకొన్నది!..” సుల్తాన్ చెప్పవలసిన మాటలను ఇండియా చెప్పేసింది. ప్రశ్నార్థకంగా ఇండియా సుల్తాన్ ముఖంలోకి చూచింది.

“అవునమ్మా!..”

“సుల్తాన్ అంకుల్… మా అమ్మ, నా దృష్టిలో ఆయన మనిషి కాడు. మనిషి కానివాడు మాట్లాడే మాటల్లో మంచితనం వుండదు. వారి ఆ ధోరణి మా మనస్తత్వాలను మార్చలేదు. ఆ సమస్యను నేను ఎదుర్కోగలను. మీరు భయపడకండి. మరొక్కమాట.. మానవతావాదంతో అమ్మా నేను వారితో కలసి వుంటున్నాము” నవ్వింది ఇండియా. ఆ నవ్వులో విచారం గోచరించింది సుల్తాన్‌కు.

పావుగంటలో కారు కరణంగారి ఇంటి ముందు ఆగింది. వారి పేరు కనకరాజు. రెండు పదవులూ వారివే. “సుల్తాన్ అంకుల్.. మీరు వెళ్ళి ఆ పశువులను విడిపించే దానికి మనం ఎంత చెల్లించాలో వారిని అడగండి” తన హ్యాండ్‌బ్యాగ్‍ను తెరిచి.. అందులో పర్సును సుల్తాను అందించింది ఇండియా.

“అందులో లక్ష రూపాయలు వున్నాయి. వారికి చెల్లించవలసింది చెల్లించి రసీదు తీసుకొని రండి” అంది. సుల్తాన్ కారును ఇంటికి ప్రక్కగా నిలిపి, దిగి లోనికి వెళ్ళాడు. కరణంగారికి ఇండియా వచ్చిందని.. ఆమె నిర్ణయాన్ని తెలియజేశాడు.

సుల్తాన్ మాటలను విన్న కరనం కనకరాజు పరుగున కారును సమీపించాడు. చేతులు జోడించి ఇండియాకు నమస్కరించాడు.

“సుల్తాన్ గారి వద్ద డబ్బు వుంది. లెక్కలు చూచి మీకు రావలసిన సొమ్మును తీసుకొండి. ఆవులు గేదెలను వెంటనే విడిపించే దానికి మనిషిని పంపండి. మీరు ఏ విషయానికీ భయపడకండి. ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ అడగబోరు” శాసించినట్లు చెప్పింది ఇండియా.

అచ్చ తెలుగులో ఇండియా మాట్లాడిన మాటలను విని కరణం కనకరాజు ఆశ్చర్యపోయాడు.

“అలాగే అమ్మగారూ!..” మరోసారి చేతులు జోడించి నమస్కరించి లోనికి పరుగెత్తాడు కనకరాజు.

ఇంట్లోకి వెళ్లి జమాబంది నోట్ బుక్‌ను తెరిచి శిస్తు కట్టని వారి పేర్లను.. చెల్లించవలసిన సొమ్ము వివరాలను ఓ కాగితం మీద వ్రాసి కూడి మొత్తం నలభై వేలా ఆరువందలు అందరూ కలసి చెల్లించవలసి వుందని సుల్తాన్‍కు చెప్పాడు.

సుల్తాన్ తన చేతిలోని పర్సును తెరచి.. ఆ మొత్తాన్ని వారికి చెల్లించాడు.

పేరు పేరునా రసీదులు వ్రాసి సంతకాలు చేసి వాటిని సుల్తాన్‍కు అందించాడు కరణం కనకరాజు.

రసీదులతో సుల్తాన్ కారును సమీపించాడు. అతని వెనకాలే కరణం కనకరాజూ కారు వరకు వచ్చి.. “అమ్మా!.. మీరు చెప్పినట్లుగానే చేశాను. పావుగంటలో బందిల్ దొడ్డి నుంచి పశువులను వదిలేస్తారమ్మా!..” ఎంతో వినయంగా చెప్పాడు.

“మంచిది..” ముక్తసరిగా అంది ఇండియా. సుల్తాన్ ముఖంలోకి చూచింది.

సుల్తాన్ కార్లో కూర్చున్నాడు. పర్స్ను రసీదులను ఇండియాకు అందించి కారును స్టార్ట్ చేశాడు.

“అమ్మా!.. ఇప్పుడు మనం..” సుల్తాన్ పూర్తి చేయక మునుపే..

“స్కూలుకు వెళ్ళాలి.. అంకుల్ శిస్తుకు ఎంత చెల్లించారు?..” అడిగింది ఇండియా.

“నలభై ఆరు వేలా ఆరువందలు..”

‘సో.. బ్యాలెన్స్.. యాభై మూడువేలా నాలుగు వందలు పర్సులో వుందన్నమాట..’ స్వగతంలో అనుకొంది ఇండియా.

పది నిముషాల్లో కారు స్కూలు ఆవరణంలో ప్రవేశించింది. సుల్తాన్ కారును పార్కింగ్ స్థలంలో నిలిపాడు. ఇండియా కారు దిగి హెడ్‌మిసెస్ రూమ్‍ను సమీపించింది. తల వంచుకొని వ్రాసుకొంటున్న హెడ్‌మిసెస్‌ను చూచింది.

ప్యూన్ లోనికి వెళ్ళి ఇండియా వచ్చిన విషయాన్ని హెడ్‌మిసెస్‌కు చెప్పాడు.

వ్రాయడాన్ని ఆపి కలాన్ని ఆ కాగితం పైవుంచి హెడ్‌మిసెస్ గౌరి లేచి నవ్వుతూ ఇండియాను సమీపించింది.

“గుడ్ మార్నింగ్ మేడం” నవ్వుతూ చెప్పింది ఇండియా.

“గుడ్ మార్నింగ్ ఇండియా!.. ప్లీజ్ కమ్” ప్రీతిగా ఇండియా చేతిని తన చేతి లోనికి తీసుకొంది గౌరి.

ఇరువురూ టేబుల్‍ను సమీపించారు. గౌరి తన స్థానంలో కూర్చుంది. నవ్వుతూ తన్నే చూస్తున్న ఇండియాను చూచి..

“ప్లీజ్ టేక్ యువర్ సీట్ ఇండియా!..” ప్రీతిగా చెప్పింది గౌరి.

ఇండియా కూర్చుంది.

“హవ్ ఆర్ యు ఇండియా!..’

“అయాం వెరీ ఫైన్!.. మేడం.. మీరు నాతో తెలుగులోనే మాట్లాడండి. ప్లీజ్!..” చిరునవ్వుతో అభ్యర్థనాపూర్వకంగా కోరింది ఇండియా.

ఆమె తెలుగు ఉచ్చారణకు గౌరి ఆశ్చర్యపోయింది.

“నీ తెలుగు ఉచ్చారణచాలా స్పష్టంగా వుంది ఇండియా!.. ఎలా నేర్చుకొన్నావ్..” ఆశ్చర్యంతో అడిగింది గౌరి.

“అంతా మా గురువుగారు నరసింహశాస్త్రిగారి.. వారి కుమారులు అద్వైత్ గారి అనుగ్రహం మేడమ్” గలగలా నవ్వుతూ చెప్పింది ఇండియా.

అమెను కొన్ని క్షణాలు పరీక్షగా చూచి గౌరి.. “ఇండియా!.. నీవు నవ్వితే చాలా అందంగా కనుపిస్తావ్..” హృదయపూర్వకంగా తన అభిప్రాయాన్ని చెప్పింది గౌరి.

అవును.. ఆ మాట మూటికి ముమ్మాటికీ నిజమే!.. ముఖాన మంచి వర్చస్సును, పొందికగా కనులు ముక్కు నోరు విశాలమైన నొసలు.. చక్కటి పలువరస.. యివన్నీ కొందరికి ఆ దైవదత్తాలు. అవన్నీ కొందరికి సక్రమంగా ఆ బ్రహ్మ సృష్టిలో సంప్రాప్తం. ఆ కోవకు చెందినదే ఇండియా. అత్యంత సుందరి.

ఇండియా తన పర్స్ తెరచి.. యాభై వేలను బయటికి తీసి లెక్కపెట్టి..

“మేడమ్!.. ఇది యాభై వేలు మాత్రమే.. సారీ!.. నేను లక్షరూపాయలతో బయలుదేరాను. మార్గంలో ఓ మంచి పనికి నలభై ఆరు వేలా ఆరు వందలు ఖర్చయినాయి. ప్రస్తుతానికి దీన్ని మీరు తీసుకోండి. మిగతా యాభై వేలను నేను మీకు రేపు అందచేస్తాను” ప్రాధేయపూర్వకంగా చెప్పింది ఇండియా.

ఆమె అందించిన డబ్బును గౌరి తీసుకొంది.

“మార్గంలో అంత డబ్బును ఏ కారణానికి వెచ్చించావు ఇండియా!.. అడిగానని తప్పుగా అనుకోకు.”

“మీరు అడగవలసిన ప్రశ్ననే అడిగారు. అది తప్పు కాదు. శిస్తు కట్టలేని రైతుల పశువులను పాలకులు బందిల్ దొడ్డిలో వుంచారు. గడ్డి నీరు లేకుండా అవి ఆ దొడ్లో వుండడాన్ని చూచాను. వాటిని విడిపించాలనిపించింది. కరణంగారిని కలిసి.. నలభై ఆరువేల ఆరు వందలను వారికి చెల్లించాను. యీ పాటికి ఆ పశువులు తమ తమ యజమానుల ఇండ్లకు పోతూ వుంటాయి” చిరునవ్వుతో చెప్పింది ఇండియా.

“అలాగా!..” ఆశ్చర్యంతో అడిగింది గౌరి.

“అవును మేడమ్!.. విన్నాను.. వర్షాలు లేని కారణంగా వేసిన పంటలు ఎండిపోయాయని. పంట చేతికి అందకపోతే.. రైతులు ఏం తింటారు!.. శిస్తులు ఎలా చెల్లించగలరు… నేను యీ విషయాన్ని గురించి మా అమ్మగారితో మాట్లాడి ప్రభుత్వపక్షం నుంచి యిలాంటి చర్య మరలా జరగకుండా చేస్తాను. కర్నల్ మూన్ గారు మా అమ్మగారికి మంచి మిత్రులు”

“ఇండియా!.. నిన్ను ఎలా అభినందించాలో నాకు తెలియడం లేదమ్మా!.. నీవు చేసింది చాలా గొప్ప పని.. అయాం రియ్యల్లీ వెరి వెరీ హ్యాపీ మై డియర్ ఛైల్డ్..” సంతోషంతో చెప్పింది గౌరి.

“ఆఁ.. ఆ విషయాన్ని వదిలేయండి మేడమ్!..

పిరీడు ముగిసిన గంట మ్రోగింది.

రెండు నెలల క్రిందట ఒక మేడం డెలివరీ కోసం నాలుగు మాసాలు లీవు పెట్టి వెళ్ళిపోయింది. ఆ వేకెన్సీలో నరసింహశాస్త్రి గారిని సంప్రదించి మంచి క్యాలిఫికేషన్ వున్న సీతను ఆ స్థానంలోకి తీసుకొంది గౌరి.

తన పిరీడ్ ముగిసినందున క్లాస్ నుండి సీత బయట వేరే సెక్షన్‍కు వెళ్ళే దానికి వరండాలో నడుస్తూ వుంది. ఆమె చూపులు హెడ్‌మిసెస్ గది వైపు మళ్ళాయి. సీత ఇండియాను చూచింది. గది ముందు ఆగింది. సీతను చూచిన గౌరి.. “అక్కడే ఆగావేం. రా లోపలికి..” నవ్వుతూ చెప్పింది గౌరి.

సీత గదిలోనికి వచ్చింది.

సీతను చూచిన ఇండియా.. “గుడ్ మార్నింగ్ సీతా!..” చిరునవ్వుతో చెప్పింది.

“గుడ్ మార్నింగ్!..” యాంత్రికంగా అంది సీత.

‘ఇది.. యిక్కడికి ఎందుకు వచ్చింది!.. మేడంతో దీనికేం పని!.. బావ కోసం వచ్చిందా!..’ అనుకొంది సీత. “ఇండియా మన స్కూలుకు యాభై వేలు డొనేట్ చేసింది. మరో యాభై వేలు రేపు యిస్తుందట” చెప్పింది గౌరి.

“మన డబ్బును.. మీకు తాను విరాళంగా యిచ్చి.. దాత అనే పేరును కొట్టేసిందన్న మాట..” వ్యంగ్యంగా నవ్వుతూ అంది సీత.. ‘యీ తెల్లదానికి జనాలను ఎలా తన బుట్టలో పడేసుకోవాలో బాగా తెలుసు. ఎవరి కూతురు? రాక్షసుడు రాబర్ట్ కూతురేగా..’ అనుకొంది స్వగతంలో సీత.

“సీతా!.. ఏమిటి నీవన్నది?..” ఆశ్చర్యంతో అడిగింది గౌరి.

“మేడమ్ సీత ఏమీ తప్పుగా అనలేదు. ఆమె స్వభావం నాకు బాగా తెలుసు. నాకంటే తను రెండేళ్ళు చిన్న. ఆమె అన్నమాట నిజమే. ఆ డబ్బును మా నాన్నగారు సంపాదించింది యీ దేశంలోనే. లండన్ నుంచి తేలేదు” నవ్వుతూ చెప్పింది ఇండియా.

“మేడం!.. నాకు క్లాసుకు టైమయింది. వెళుతున్నా…” గౌరి జవాబుకు ఎదురు చూడకుండానే సీత గది నుండి వెళ్ళిపోయింది.

పోతున్న సీతను గౌరి పరోక్షంగా చూచింది. సీత పైన గౌరికి కోపం వచ్చిందని గ్రహించింది. ఆమె మనోభావాన్ని మార్చాలని..

“మేడం!.. నేను సీతను ఒకటిన్నర సంవత్సరంగా చూస్తున్నాను. చాలా మంచిపిల్ల. యథార్థవాది. సీతంటే నాకు ఎంతో యిష్టం” నవ్వుతూ చెప్పింది ఇండియా.

గౌరి ఇండియా ముఖంలోకి చూచింది. ఆమె సహజ చిరునవ్వును చూచినవారు.. ఎవరైనా సరే, వారి ఉనికిని వారు మరచిపోతారు. గౌరి పెదాలపై చిరునగవు విరిసింది.

“మేడమ్!..”

“చెప్పు ఇండియా!..”

“అద్వైత్ గారు ఏ క్లాస్‍లో వుంటారు!..”

“అద్వైత్ యిప్పుడు లెవన్ ‘సి’ సెక్షన్లో వుంటాడు. ఏం.. అతన్ని కలవాలా!..” అడిగింది గౌరి.

“అవును మేడమ్..”

గౌరి ప్యూన్‍ను పిలిచింది.

అతను గది ముందు నిలిచాడు.

“మేడమ‌కి లెవన్ ‘సి’ సెక్షన్ చూపించు..” చెప్పింది గౌరి.

“అలాగే మేడమ్..” అన్నాడు ప్యూన్.

ఇండియా కుర్చీ నుంచి లేచింది.

“థ్యాంక్యూ మేడమ్!.. నేను వారిని కలిసి వెళ్ళి పోతాను. మిమ్మల్ని రేపు కలుస్తాను”

“అలాగే ఇండియా!..” అంది గౌరి చిరునవ్వుతో.

ఇండియా గది నుంచి బయటికి నడిచింది. ప్యూన్ ముందు నడవగా అతని వెనకాలే లెవెన్త్ ‘సి’ సెక్షన్‌ను సమీపించింది. ప్యూస్ లోనికి వెళ్ళి ఇండియా వచ్చిందని అద్వైత్‍కు చెప్పాడు.

అద్వైత్.. ఆశ్చర్యంతో వాకిటి వైపు చూచాడు. చిరునవ్వుతో నిలబడి వున్న ఇండియాను చూచాడు. “సార్!.. నేను లోనికి రావచ్చా!..” అడిగింది ఇండియా అదే భంగిమతో,

అద్వైత్ తొట్రుపాటుతో.. “ఆ.. రండి” అన్నాడు యాంత్రికంగా. అతని తొట్రుపాటుకు కారణం.. ఆ సమయంలో అక్కడికి ఇండియా వస్తుందని అతను వూహించలేదు.

“మేడమ్ గారి పర్మిషన్ తోనే ఇక్కడికి వచ్చాను” నవ్వుతూ చెప్పింది ఇండియా.

ప్యూన్ వెళ్ళిపోయాడు. వాడి మనస్సున.. ‘యీ దొరసాని ఆ ప్రవరాఖ్యునికి లైను వేస్తూ వుంది’.. అనుకొని నవ్వుకొన్నాడు.

“ప్లీజ్ కమ్…” అన్నాడు అద్వైత్.

“నేను మీ టీచింగ్‌ని విని వెళ్ళిపోతాను” అద్వైత్‍ని సమీపించి చెప్పింది ఇండియా.

“ఓకే!..” అన్నాడు అద్వైత్.

ఇండియా వెళ్ళి వెనక బెంచిలో కూర్చుంది. చేతులను మెడ క్రిందికి చేర్చి అద్వైత‌‍ను చూడసాగింది. ఆమె రాక.. పలకరింపు.. కూర్చొని తన్ను చూస్తున్న తీరును చూచి.. అద్వైత్ అంతవరకూ.. తాను ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నదనే విషయాన్ని మరచిపోయాడు.

“సార్… తర్వాత..” అన్న ముందు బెంచి విద్యార్థి మాటను విని అద్వైత్ వాస్తవంలోకి వచ్చాడు.

ఇండియా చిరునవ్వుతో అతన్నే చూస్తూ వుంది. “తర్వాత.. మనం చెప్పుకోవలసిన గొప్ప వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు. వారి జననం 16.04.1848న రాజమహేంద్రవరంలో జరిగింది. వారు గొప్ప సంఘసంస్కర్త. సతీసహగమనాన్ని ఎదిరించి.. ఆ సనాతన ఆచారాన్ని ధిక్కరించి ఎందరో స్త్రీలను చనిపోయిన భర్త చితిపై త్రోసి కాల్చి చంపే విధానాన్ని రూపు మాపారు. ఆ రోజుల్లో స్త్రీ చదువుకోడానికి పాఠశాలకు వెళ్ళడం నిషేధం. పంతులుగారు బాలికలు కూడా బాలురి వలే చదువుకొనవలెనని.. వ్యతిరేకభావం గల నాటి పెద్దలతో వాదించారు. ఒప్పించారు. బాల్యంలో భర్త చనిపోయిన వితంతువులకు పునర్వివాహం చేసికొనే హక్కు వుందని తన రచనల ద్వారా జనంలో సంచలనాన్ని సృష్టించారు. వితంతుల వివాహాలను ఎన్నో జరిపించారు. ‘వివేకవర్ధని’ అను పేర పత్రికను ప్రచురించి వారి సంఘసంస్కరణ సూత్రాలతో జనంలో చైతన్యాన్ని కలిగించారు. వారు తెలుగు, సంస్కృతము, ఇంగ్లీషు భాషలలో అనర్గళంగా మాట్లాడి తన భావాలను ఎదుటివారికి తెలియజేసేవారు. ప్రభుత్వం వారి సంఘసంస్కరణ సేవా విధానానికి మెచ్చి.. వారికి 1893లో ‘రావుబహదూర్’ అను బిరుదును ప్రధానం చేసి వారిని గౌరవించింది. ఆ మహనీయుని నిర్యాణం 27.05.1919లో జరిగింది. వారి సహచరులు గొప్ప సంఘసంస్కర్తను కోల్పోయామని ఎంతగానో బాధ పడ్డారు. వీరిది మన రాష్ట్రం అయినందున వారి సుచరిత్రను మనం గుర్తుంచుకోవాలి. వారి సంస్కరణలను దేశమంతా పాటించింది. గౌరవించింది.

తర్వాత.. శ్రీ స్వామి వివేకానంద వారి చరిత్ర. వారి జననం.. 12.01.1863లో బగాళా దేశంలో జరిగింది. వారి ప్రియతమ గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంసగారు. వారు దుర్గా మాతకు ప్రియ భక్తులు. ఆ జగన్మాతతో వారు మాట్లాడేవారట. ఏరి కోరి వారు శ్రీ వివేకానంద స్వామి వారిని తన ప్రియశిష్యునిగా స్వీకరించారు. వారి జ్ఞానసంపదనంతా శిష్యునికి ధారపోశారు. మహాగురువు ప్రసాదించిన విజ్ఞాన సంపదతో శ్రీ వివేకానందస్వామి వారు 1893లో సెప్టెంబర్ 11వతేదీ నుండి 27వ తేదీ వరకూ చికాగో మహానగరంలో జరిగిన విశ్వమత మహాసభలో మాట్లాడి ఆ దేశపు.. అక్కడకు హాజరైన పలు విదేశాల మతాధికారులను తన సరళ సంభాషణా విధాణంతో.. మంత్రముగ్ధులను చేశారట. ఎందరో ఆ అమెరికా దేశవాసులు వారికి శిష్యులైనారట. ఆ మహనీయమూర్తి మూలంగా.. యావత్ ప్రపంచానికి హైందవ మత విశిష్టత అవగాహన అయింది. అమెరికాలో వారు 1893వ సంవత్సరం నుండి 1895వ సంవత్సరం ఆగస్టు వరకూ పలు ప్రాంతాలు తిరిగి భారతదేసాన్ని గురించి.. మన వేదాంత సారాన్ని గురించి.. మన అద్వైత తత్వాన్ని గురించి.. అమెరికా వాసులకు తెలియజేశారట. ఎందరో ఆ దేశవాసులు వారికి శిష్యులైనారు. వారిలో ఆడవారూ వున్నారు. 1895 ఆగష్టు 17న వారు ఇంగ్లండ్‌కు బయలుదేరి 10వ తేదీన లండన్ చేరారు. 1896వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన స్వదేశానికి బయలుదేరారు. లండన్ మహానగరంలో స్వామీజీవారు చేసిన ప్రసంగాలు స్త్రీ పురుషులనేకులను ప్రభావితం చేశాయి. వారి ప్రసంగ ప్రభావం.. తెల్లవారికి భారతదేశమన్నా భారతీయులన్నా గౌరవాభిమానాలు పెరిగాయి. అమెరికాలో లండన్‍లో స్వామీజీ వారు వేదంత ప్రచారం కోసం కేంద్రాలను స్థాపించారు.

స్వదేశానికి వచ్చిన తర్వాత పలు ముఖ్య పట్టణాల్లో వారు తన ఉపన్యాసాన్ని సాగించారు. ఎందరో వారి శిష్యులుగా మారిపోయారు. వారి మహోన్నత ఉపన్యాసాలతో భారతజాతిలో జాగృతి ఏర్పడింది. దేశ భక్తి పెరిగింది. విదేశీయులు పలువురు.. స్వామి వారికి శిష్యులై మన దేశానికి వచ్చారు.

1899 సంవత్సరం జూన్ 20వ తేదీన స్వామీజీ వారు రెండవసారి పాశ్చాత్యానికి ప్రయాణమయ్యారు. ఆగస్ట్ 17వ తేదీన బయలుదేరి 28వ తేదీన న్యూయార్క్ చేరారు. తాను స్థాపించిన ఆశ్రమాలను సందర్శించారు. ఎన్నో చోట్ల ఉపన్యసించారు. 1900 సం॥ జూలై 26వ తేదీన పారిస్‌కు బయలుదేరారు. ఐరోపా ఖండంలోని హంగేరి, సెర్బియా, రుమేనియా, బల్గేరియా, గ్రీసు, ఈజిప్టు, కైరోలను సందర్శించారు. తన ఉపన్యాసాలను వారందరికీ వినిపించారు. ఎందరెందరో అభిమానులుగా మారారు. 1900సం॥ 26 తేదీన ఓడ ఎక్కి డిసెంబర్ 6వ తేదీన బొంబాయి స్వదేశానికి చేరారు.

నిరంతరం పయనం.. సుదీర్ఘ ఉపన్యాసాలనివ్వడం ద్వారా స్వామీజీ వారికి ఆరోగ్యం క్షీణించింది. మధుమేహవ్యాధి సంక్రమించింది. అయినా వారు దాన్ని లెక్కచేయకుండా తన ప్రణాళికాబద్ధమైన ప్రయాణాలను స్వదేశంలో సాగించారు. తన ప్రసంగాలను కొనసాగించారు.

శ్రీ వివేకానందస్వామీజీ.. బేలూరులో తన గురువు దేవుని పేర మఠాన్ని స్థాపించారు. దాని బాధ్యతలను తన శిష్యులకు అప్పగించారు. 1902వ సం॥ జులై 4వ తేదీ రాత్రి 9గంటలకు శ్రీ వివేకానందస్వామీజీ మహా సమాధి పొందారు. అప్పటి వారి వయస్సు 39 సంవత్సరాల ఐదు నెలలా 24 రోజులు.

వారు హైందవ జ్యోతి.. విశ్వానికంతా అద్వైత.. యోగ.. హైందవ ధర్మాలను వ్యాపింపజేసిన భరతమాత ముద్దుల బిడ్డ.. మన హైందవ జాతికి పితామహులు” ఎంతో ఆవేశంగా చెబుతూ వచ్చిన అద్వైత్ తన ప్రసంగాన్ని ఆపాడు. కొన్నిక్షణాలు కళ్ళు మూసుకొన్నాడు. కళ్ళు తెరచి..

“మీరంతా యీ దేశపు భావి భారత పౌరులు. మన చరిత్ర నాయకుల చరిత్రలను చదవాలి. వారి ఆశయాలను.. వారు తమ జీవితాన్ని సాటి వారి శ్రేయస్సు కోసం సాగించిన రీతిని.. మనస్సున పదిలపరచుకోవాలి. యీ సంవత్సరం పరీక్షలు వ్రాయగానే వారి చరిత్రలను మరువకూడదు. మననం చేసికొంటూ వుండాలి. ఆ మహనీయుల వలె మీలో.. నాలో అందరిలో దేశభక్తి వుండాలి. భాషాభిమానం వుండాలి. మన మనోభావాలను ఎదుటి వారికి స్పష్టంగా తెలియజేయాలంటే చక్కటి భాషాజ్ఞానం అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ వారి మాతృభాషను గౌరవించి.. అభిమానించి చక్కగా నేర్చుకోవాలి. ఇతర భాషలు ఉపాధి కోసం అవసరం. స్వభాష అందరికీ తల్లి లాంటిది.. ‘అమ్మ’ను ఎవరూ ద్వేషించరుగా!..” పిరీడ్ ముగిసి గంట మ్రోగింది. అది భోజన సమయం. పిల్లలందరూ క్లాస్ నుంచి బయటికి నడిచారు.

అద్వైత్ ఇండియా వైపు చూచాడు. ఇండియా లేచి నిలబడి అద్వైత్‍ను సమీపించింది. అతని చేతిని తన చేతిలోనికి తీసికొని..

“సార్!.. అద్భుతం. శ్రీ వివేకానందస్వామి వారిని గురించి చాలా బాగా చెప్పారు. నేను వారి చరిత్ర కలకత్తాలో వుండగా పూర్తిగా మూడుసార్లు చదివాను. బేలూరికి కూడా వెళ్ళాను. స్వామీజీ జీవిత చరిత్ర నాకు ఎంతో యిష్టం. వారంటే నాకు ఎంతో గౌరవం..” చిరునవ్వుతో చెప్పింది ఇండియా.

“అలాగా!..”

“అవును..”

“యిక వెళతావా!..”

“మరి మీరు..”

“వెళతాను”

“ఎక్కడికి!..”

“మా యింటికి.. భోజనానికి..”

“రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను”

“వద్దు. నీవు వెళ్ళు.. నా మాట విను..”

ఇండియా కొన్నిక్షణాలు అద్వైత్ ముఖంలోకి చూచింది. అద్వైత్ ముందుకు నడిచాడు.

ఇండియా చిరుకోపంతో అతని కన్నా వేగంగా నిడిచి అతన్ని దాటి ముందుకు వెళ్ళి వెనక్కు తిరిగి చూచింది. వేగంగా ముందుకు పోయింది.

అద్వైత్.. పెదాలపై చిరునవ్వు.

అద్వైత్.. ప్రక్క తరగతి గదిని సమీపించేసరికి సీత ఆ గదిలో నుంచి బయటికి వచ్చింది.

“బావా!.. ఇం..” సీత పూర్తి చేయక మునుపే అద్వైత్..

“ఇండియా వచ్చింది. చూచాను. మాట్లాడకుండా పద యింటికి” అన్నాడు.

సీత అతన్ని ముఖం చిట్లించి క్షణంసేపు చూచి ప్రక్కనే ముందుకు సాగింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here