అద్వైత్ ఇండియా-9

0
9

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[మూన్ వెళ్ళిపోయాకా రాబర్ట్ చాలాసేపు వరండాలోనే కూర్చుంటాడు. భార్యాపిల్లలతో మాట్లాడడానికి అహం అడ్డొస్తుంది. తల్లీ కూతుళ్ళిద్దరూ వారి గదిలోకి వెళ్ళి తలుపులేసుకుంటారు. కాసేపయ్యాకా, రెండు బ్రెడ్ ముక్కలు తిని తానూ నిద్రపోతాడు రాబర్ట్. మర్నాడు ఉదయం సుల్తాన్ వచ్చేసరికి రాబర్ట్ ఎప్పుడూ కూర్చునే చోట కనబడడు. సుల్తాన్ ఆండ్రియాని పిలిచి అడిగితే, లోపలికి వెళ్ళి చూడమంటుంది. లోపలికి వెళ్ళిన సుల్తాన్ – రాబర్ట్‌కు అమ్మవారు సోకిందని గ్రహిస్తాడు. రాబర్ట్ ఒళ్ళంతా వేడిగా ఉంటుంది. విషయం తెలిసిన ఆండ్రియా కంగారు పడుతుంది. సుల్తాన్ గబుక్కున పెరట్లో ఉన్న వేపచెట్టు నుంచి వేపాకు కొమ్మలు తెచ్చి రాబర్ట్ చుట్టూ పెడతాడు, ఓ అరగంటలో వస్తానని చెప్పి బయటకు వస్తాడు. అదే సమయంలో నరసింహశాస్త్రి ఇంతి వద్ద వీధిభాగతం బృందం వారు వస్తారు. తాము వేయబోయే కొత్త నాటకం గురించి చెప్పగా, నరసింహశాస్త్రి వారికి కొంత డబ్బిచ్చి పంపుతారు. సుల్తాన్ అక్కడికి వచ్చి, రాబర్ట్ పరిస్థితిని వివరిస్తాడు. ఉదయం పూజ చేసిన కుంకుమను కాగితంలో పొట్లం కట్టి, అభిషేక జలాన్ని ఒక గ్లాసులో పోసి సుల్తాన్‍కి ఇస్తారు. నీళ్ళు తాగించమని, కుంకుమబొట్టు నుదుటన పెట్టమని చెప్తారు. త్వరలో మామూలు మనిషవుతాడని చెప్తారు. సుల్తాన్ రాబర్ట్ ఇంటికి వచ్చి, అతని చేత అభిషేక జలం తాగించి, బొట్టు పెడతాడు. తల్లీకూతుళ్లకి ధైర్యం చెప్తాడు. స్కూలుకి లక్ష రూపాయలు విరాళం ఇచ్చేందుకు బయల్దేరుతుంది ఇండియా. దారిలో బందిలదొడ్డిలో అన్ని పశువులను చూసి వాటి గురించి సుల్తాన్‍ను అడిగితే, జరిగిన విషయం చెప్తాడు. ఇండియా తన దగ్గరున్న డబ్బు నుంచి సుమారు యాభైవేలతో రైతులందరి బాకీలు తీర్చి వాళ్ళ పశువులను వాళ్ళకి అప్పగించేలా చేస్తుంది. తరువాత స్కూలుకి వెళ్ళి హెడ్‍మిసెస్ గౌరిని పలకరించి, తెలుగులో మాట్లాడుతుంది. డబ్బు బయటకి తీసి తాను లక్ష రూపాయలతో బయల్దేరాననీ, కానీ మధ్యలో సుమారు యాభైవేలు ఖర్చయిపోయాయని చెప్తుంది. గౌరి అడిగిన మీదట తాను చేసిన పనిని వివరిస్తుంది. గౌరి ఎంతో మెచ్చుకుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సీతను పలకరిస్తుంది ఇండియా. విరాళం ఇచ్చిన సంగతి గౌరి చెబితే, మన డబ్బును తాను విరాళంగా ఇచ్చి దాత అనే పేరు కొట్టేసిందన్న మాట అని వ్యంగ్యంగా అని అక్కడ్నించి వెళ్ళిపోతుంది సీత. తరువాత గౌరి అనుమతితో అద్వైత్ పాఠం చెబుతున్న క్లాసులోకి వెళ్ళి కూర్చుంటుంది. అద్వైత్ కందుకూరి వీరేశలింగం గారి గురించి, స్వామీ వివేకానంద గురిచి పిల్లలకి వివరిస్తాడు. క్లాస్ అయిపోయాకా, తనకి కూడా స్వామీ వివేకానంద అంటే గౌరవమనీ, బేలూరులో మఠానికి కూడా వెళ్ళానని చెబుతుంది ఇండియా. ఇంతలో అక్కడికి వచ్చిన సీతతో కలిసి ఇంటికి భోజనానికి వెళ్తాడు అద్వైత్. – ఇక చదవండి.]

అధ్యాయం 16:

[dropcap]ఇం[/dropcap]డియా ఇంటికి వెళ్ళి స్కూలుకు వెళ్ళే దార్లో తాను చూచిన దృశ్యాన్ని.. తాను తీసికొన్న నిర్ణయాన్ని అమలు పరచిన విధానాన్ని తల్లి ఆండ్రియాకు వివరంగా చెప్పింది. అంతా విన్న ఆండ్రియా ఆనందంతో..

“డార్లింగ్ యు డిడ్ ఏ గ్రేట్ జాబ్.. యు నో సంథింగ్.. దిస్ కంట్రీ మెయిన్ ఇన్‍కమ్ ఈజ్ బై అగ్రికల్చర్.. మోర్ ద్యాన్ సిక్స్‌టీ పర్సెంట్ ప్యూపుల్ లివ్స్ యిన్ విలేజెస్. దేర్ ట్రేడింగ్ యీజ్ అగ్రికల్చర్ ఓన్లీ.. విత్ బుల్స్ దె విల్ ప్లవ్ ద ల్యాండ్. బుల్స్ మదర్స్ ఆర్ కౌవ్స్. దీస్ ప్యూపుల్ వర్షి కౌవ్స్. దటీజ్ దేర్ కష్టమ్. వుయ్ షుడ్ నాట్ క్రిటిసైజ్. క్రిటిసైజింగ్ అదర్స్ యీజే సిన్.”

“యస్ మామ్. యు ఆర్ రైట్”

ఆండ్రియా లోనికి వెళ్ళి యాభైవేలు తెచ్చి సుల్తాన్‍కు ఇచ్చి.. గౌరి మేడమ్‍కు ఇచ్చి రమ్మని చెప్పింది. ఇండియా పరమానందంతో తల్లిని కౌగలించుకుంది.

“మై మమ్మీ ఈజ్ గ్రేట్..” అంది.

యిదే సమయంలో అక్కడ నరసింహశాస్త్రిగారి యింటికి రెడ్డిరామిరెడ్డిగారు వచ్చారు. భోజనానంతరం.. వరండాలో కూర్చొని నరసింహశాస్త్రి పేపర్ చదువుతున్నారు. “నమస్కారం స్వామీ!..” రెడ్డిగారి మాటలు విని తల ఎత్తి చూచారు నరసింహశాస్త్రి. “రండి రెడ్డిగారు!.. కూర్చోండి.” సాదరంగా చెప్పారు నరసింహశాస్త్రి. రెడ్డిగారు వారికి ఎదురుగా కూర్చున్నారు.

“చెప్పండి. విషయం ఏమిటి?..” రెడ్డిగారి ముఖంలోకి చూస్తూ అడిగారు నరసింహశాస్త్రి.

భోజనానికి వచ్చిన అద్వైత్, సీతలు శాస్త్రిగారికి స్కూలుకు బయలుదేరారు.

“మీకు తెలిసిన విషయమే!.. వర్షాలు లేక పంట భూములు బీటలు బారాయి. పేదవాళ్ళు తిండికి నీళ్ళకు ఎంతగానో కష్టపడుతున్నారు. పెళ్ళాల మెడలోని నగలను తాకట్టు పెట్టి ఆవులను గేదెలను సాకలేక కొనేవాడు అడిగిన ధరకు విక్రయిస్తున్నారు. ఆవులను గేదెలను కొన్నవారు కేరళకు ఎగుమతి చేస్తున్నారట. ఆ ప్రాంతంలో కొందరికి పశు మాంస ప్రియులట. యీ స్థితి యిలాగే కొనసాగితే జనం మలమల మాడి చచ్చిపోతారు. కనుక..” ఆగిపోయారు రెడ్డిగారు.

రెడ్డిగారి ముఖంలోకి చూచారు నరసింహశాస్త్రి.

“ఏం చేయాలనుకొంటున్నారు!..”

“యజ్ఞం.. తమరి ఆధ్వర్యంలో..”

“చాలా ఖర్చవుతుంది కదా..”

“దాన్ని నేను సమకూర్చుతాను. నిర్వహణ బాధ్యతను తమరు స్వీకరించాలి”

“మీరు తీసుకొన్న నిర్ణయం.. చాలా గొప్పది. బాధల్లో వున్న మన జనాన్ని ఆదుకోవాలన్న మీ ఆలోచన అద్వితీయం. యజ్ఞ నిర్వహణకు నాకు పరిపూర్ణ సమ్మతం రెడ్డిగారు..” చిరునవ్వుతో చెప్పారు నరసింహశాస్త్రి.

“కావలసిన ధనాన్ని ఏర్పాటు చేయడం నా వంతు. కార్యభారాన్ని యథావిధిగా మోయడం మీ వంతు. మీరు సమ్మతించినందుకు నాకు ఎంతో సంతోషంగా వుంది. ఇక నేను బయలుదేరుతాను”

“మంచిది వెళ్ళిరండి”

“మరొక్కమాట..”

“చెప్పండి..”

“యజ్ఞం ముగిసిన తదనంతరం.. మనం లోగడ అనుకున్నట్లుగా మన కాశీ ప్రయాణం.”

“అంతా ఆ సర్వేశ్వరుని నిర్ణయం. మనం నిమిత్తమాత్రులం.”

రెడ్డిగారు లేచి మెట్లు దిగారు. నరసింహశాస్త్రి వారితో పాటు వీధి గేటు వరకు వచ్చారు. రెడ్డిగారు వారికి నమస్కరించి వెళ్ళిపోయారు.

నరసింహశాస్త్రి వెను తిరిగి వరండాను సమీపించారు. వారి అర్ధాంగి సావిత్రి యింటి సింహద్వారం ప్రక్కన నిలబడి వుంది. నరసింహశాస్త్రి వరండాలో కూర్చుంటూ..

“సావిత్రీ.. రెడ్డిగారు చెప్పిన మాటలను విన్నావా!..”

“లేదండి. వంట యింట్లో వున్నాను. వారు మీరు వాకిటి వైపుకు వెళుతుండగా చూచాను”

“వారు యజ్ఞాన్ని నిర్వహించాలని నిర్ణయించుకొన్నారు. ఆ కార్యనిర్వాహక బాధ్యతను నా పై వుంచారు. నాకు సోమయాజులని.. నీకు సోమిదేవమ్మనే మరో నామకరణాలను ఆ సర్వేశ్వరుడు ప్రసాదించే దానికి నిర్ణయించుకొన్నాడు. యిలాంటి అదృష్టం అందరికీ రాదు సావిత్రి.. మనం ఎంతగానో ఆనందించవలసిన విషయం యిది.” ఆనందంగా నవ్వుతూ భార్య ముఖంలోకి చూచారు నరసింహశాస్త్రి.

“మీ మంచి మనసే.. మనకందరికీ శ్రీరామరక్ష..” నవ్వుతూ చెప్పింది సావిత్రి.

వీధిలో.. దాదాపు ముఫై మంది జనం.. ‘రాబర్ట్ దొర.. జిందాబాద్’.. ‘రాబర్ట్ దొర జిందాబాద్’ అని అరచుకొంటూ ముందుకు సాగిపోయారు.

వారి ఆ అరుపులు.. నరశింహశాస్త్రి సావిత్రిలకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.

“ఏమండీ!.. వారంతా..” సావిత్రి పూర్తిగా చెప్పకముందే..

“రాబర్ట్ దొర జిందాబాద్ అని అరుస్తూ వెళుతున్నారు” అన్నారు శాస్త్రిగారు.

“అంటే వారు.. వీరికి ఏదో మంచిని చేసి వుంటారు కదా!..”

“ఆ మంచి.. ఏమిటో మనకు తెలియని విషయం సావిత్రి. ప్రస్తుతం రాబర్ట్.. అమ్మ సోకిన కారణంగా తీవ్ర జ్వరంలో వున్నాడు”

“ఐదు గంటలకు ఇండియా వస్తుందిగా..”

“ఆ.. రావచ్చు.. ఆమె వస్తే మనకు విషయం తెలుస్తుంది సావిత్రీ..”

“వారంతా అంతగా ఆనందపడుతూ వారి పేరును స్మరిస్తున్నారంటే.. రాబర్ట్ దొరగారు వారికి సంబంధించిన ఏదో మంచిని చేసి వుండవచ్చు” సాలోచనగా అంది సావిత్రి,

“అది నీ వూహ..”

“మరి నిజం..”

“నిలకడ మీద తెలుస్తుంది సావిత్రి.. ఆ.. నేను రేపు యజ్ఞ నిర్వహకులను కలిసి మాట్లాడే దానికి విజయనగరం వెళ్ళి వస్తాను”

“అలాగేనండీ వెళ్ళిరండి.”

పోస్టుమెన్ వచ్చాడు. నరసింహశాస్త్రికి నమస్కరించి ఇన్‍ల్యాండ్ లెటర్‍ను వారికి అందించాడు. వెళ్ళిపోయాడు.

“ఎవరు వ్రాశారండీ!..”

“మన రాఘవ..”

“వాడు అద్వైత్‍కు వ్రాశాడు సావిత్రీ!..”

“మీ పేర వ్రాయలేదా!..”

“లేదు.. సావిత్రీ!.. మరికొద్ది సేపట్లో అద్వైత్ వస్తాడుగా. వాడే మనకు చదివి వినిపిస్తాడు”.

“ఒకరి పేరున వచ్చిన ఉత్తరాన్ని మనం చదవకూడదని చెబుతున్నారు. అంతేగా!..”

“నీవు అన్నది అక్షరసత్యం..” సావిత్రి ముఖంలోకి చూస్తూ నవ్వారు నరసింహశాస్త్రి. భర్త తనను హేళన చేస్తూ నవ్వుతున్నాడని సావిత్రి గ్రహించింది. మూతి ముడుచుకొంది.

“నిజం చెప్పిన దానికి నా మీద నీకు నిష్ఠూరమా!..”

“కాదు.. గౌరవం..” నవ్వింది సావిత్రి.

అద్వైత్.. సీత గేటు తెరచుకొని లోనికి వచ్చారు.

“అడుగో మన వాడు వచ్చేశాడు” ఆనందంగా అంది సావిత్రి.

వరండా మెట్లు ఎక్కుతూ.. “ఏమిటమ్మా!.. చాలా సంతోషంగా వున్నావ్!..” అడిగాడు అద్వైత్.

“మన రాఘవ నీకు ఉత్తరం వ్రాశాడురా..”

“ఏదీ!..”

తన చేతిలోని ఉత్తరాన్ని నరసింహశాస్త్రి అద్వైత్‍కు అందించారు. అద్వైత్ అందుకొన్నాడు.

“బావా!.. పెద్దగా చదువు. అందరం వింటాం” అంది సీత.

“వాడు వ్రాసింది నాకు..”

“మమ్మల్ని గురించి వ్రాసి వుండడంటావా!..” చిరుకోపంతో అడిగింది సీత.

“సరే.. నువ్వే చదువు నేను వింటాను”

అద్వైత్ చేతిలోని ఉత్తరాన్ని లాక్కొని.. “వాడు నీకు బావమరది అయితే నాకు అన్నయ్య అన్న విషయాన్ని మరచిపోకు బావా!.. నిజం చెప్పాలంటే ముందు నాకు అన్న.. తర్వాత నీకు బావమరది. కదా అత్తయ్యా!..” నవ్వుతూ అడిగింది సీత.

“ఒసేయ్!.. ముందు ఉత్తరం చదువు. ఏం రాశాడో..”

“ఆఁ.. ఆఁ.. చదువుతాను అత్తయ్యా!.. మీరు వినాలని చాలా ఆతృతగా వున్నారని నాకు అర్థమయింది” కవర్‍ను చించింది సీత..

‘బ్రహ్మశ్రీ వేదమూర్తులు.. గౌరవనీయులు అయిన బావగారికి నమస్కారములు. ఇచ్చట నేను క్షేమం. అచ్చట మీరు మామయ్యగారు అత్తయ్యగారు.. నానమ్మ.. సీత క్షేమం అని తలుస్తాను’ సీత చదవడం ఆపేసింది. ముఖాన్ని చిట్లించింది. ముగ్గురూ సీత వైపు ఆశ్చర్యంగా చూచారు.

“ఏమే!.. అపేసావ్. చదువు..” అంది సావిత్రి.

“మామయ్యా!.. ఆ నా అన్నగాడికి నేనంటే లెక్కేలేదు. చూడండి నా పేరును చివరన వ్రాశాడు” బుంగమూతితో నరసింహశాస్త్రికి ఫిర్యాదు చేసింది సీత.

అద్వైత్ సీత చేతిలోని ఉత్తరాన్ని లాక్కున్నాడు.

సీత అతన్ని చురచురా చూస్తూ వెళ్ళి సావిత్రి ప్రక్కన నిలబడింది.

“ఆది!.. చదవరా!..” అంది సావిత్రి.

‘బావా!.. నాకు నా వుద్యోగం బాగా నచ్చింది. అడవిలో కొన్ని వన్య మృగాలను చూచాను. స్వేచ్ఛగా ఎలాంటి భయమూ లేకుండా అవి తిరిగే తీరును చూస్తుంటే.. యీ మన మనుష్య జన్మకన్నా.. అడవిలో ఏదో జంతువు రూపంలో పుట్టి వుంటే ఎంత బాగుండేదో అనిపిస్తూ వుంది.

యీ ప్రాంతంలో టేక్ వృక్ష సంపద అధికం.. కొందరు దొంగలు రాత్రి సమయాల్లో చెట్లను నరికి నగర ప్రాంతాలకు పంపుతున్నారని తెలిసింది. వారికి దొరల అండదండలున్నాయని విన్నాను. యీ దొంగ వ్యాపారాన్ని సాగించే వారిని పట్టుకోవాలని నిర్ణయించుకొన్నాను. తప్పనిసరిగా సరైన ఆధారాలతో వారిని పట్టుకొంటాను. విషయాన్ని నా పై అధికారికి చెప్పాను. వాడు మనం ప్రశాంతంగా బ్రతకాలంటే యింలాంటి విషయాలను మనం కళ్ళారా చూచినా చూడనట్లే వుండాలి అని నాకు హితోపదేశం చేశాడు. దాన్ని బట్టి వాడి తత్వం ఎలాంటిదో నాకు అర్ధం అయింది.

అడవుల్లోని కోయలు.. చాలా మంచివారు. నాకు వారు చారపప్పును.. పుట్టతేనెను వెళ్ళినప్పుడల్లా ఇస్తారు.. ‘దొరా దొరా’.. అని నన్ను ఎంతో గౌరవంగా ప్రేమతో పలుకరిస్తారు. వారు చాలా అమాయకులు. వారికి కల్లాకపటం తెలియదు. ఇండియా.. సీత ఎలా వున్నారు?..’

“అత్తయ్యా చూచావా వాడికి ఎంత పొగరో. వాడికి చెల్లెలిని నేనా ఆ తెల్లకోతి ఇండియానా!.. ముందు వ్రాయాల్సింది నా పేరా దాని పేరా!..” చిరుకోపంతో అంది సీత.

“వాణ్ణి వుత్తరాన్ని పూర్తిగా చదవనీవే!..” అంది సావిత్రి.

“అమ్మా సీతా!.. రాఘవ వ్రాసిందాంట్లో తప్పు లేదమ్మా!.. వాడు నీకు ఎలాగూ అన్నయ్యే కదా!.. యీ వుత్తరాన్ని ఒకవేళ ఇండియా విని వుంటే.. నీ పేరు కన్నా ముందు తన పేరును వ్రాసినందుకు ఎంతగానో సంతోషించి వుండేది. అది స్నేహబంధం. నీకు వాడికి మద్యన వున్నది.. రక్తసంబంధం. అది ఎంతో గొప్పదమ్మా.. నిన్ను చిన్నబుచ్చాలని వాడు అలా వ్రాయలేదు” అనునయంగా చెప్పి..

“ఆదీ!.. చదువు..” అన్నారు నరసింహశాస్త్రి.

‘సీతకు నా శుభాశీస్సులు. హృదయపూర్వక దీవెనలు. ఇండియాను అడిగినట్లు చెప్పు. బావా!.. నేను తొందర పడతానని బాధపడకు. తీరిక వేళల్లో నేను నిన్ను తలచుకొని నీవు నాకు యిచ్చిన సలహాలను మననం చేసుకొంటుంటాను. అందులో నాకు ఎంతో ఆనందం. ప్రశాంతత. మామగారికి.. నానమ్మకు.. అత్తకు నా నమస్కారాలు తెలియజేయండి. నీవు నాకంటే రెండేళ్ళు పెద్దవాడివి కదా, నీకూ నా ప్రత్యేక నమస్కారములు మరోమారు. నా చిట్టి చెల్లి సీతను జాగ్రర్తగా చూచుకో బావా!.. అది చాలా అమాయకురాలు. అదంటే నాకు ప్రాణం.. ఆ విషయం నీకు తెలుసుగా!.. మీ అందరి క్షేమసమాచారాలతో ఉత్తరం వ్రాయి. ఎదురుచూస్తూ వుంటాను.,

ఇట్లు

నీ రాఘవ.’

అద్వైత్ వుత్తరాన్ని చదవడం ముగించి సీత ముఖంలోకి చూచాడు. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ కళ్ళు అద్వైత్ చూపులతో కలిశాయి. సీత తల దించుకొని మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది.

“ఆదీ!..”

“చెప్పండి నాన్నగారూ!..”

“రాఘవకు మనమంతా క్షేమమేనని.. మా అక్క, సీత ఆనందంగా వున్నారని, జాబు వ్రాయి” చెప్పారు నరసింహశాస్త్రి.

శాస్త్రిగారి అక్క వసుంధర తన మేనమామ సీనియర్ లాయర్ గోపాల్ శర్మ యింటి నుంచి వచ్చింది. సావిత్రి ఆమెకు రాఘవ.. వ్రాసిన ఉత్తర సమాచారాలను తెలియజేసింది.

“నాకు చాలా సంతోషమే సావిత్రి.. అక్కడ వాడు ఎవరితో ఎలాంటి గొడవలు పెట్టుకొంటాడో అని నాకు భయం. వాడి ఉత్తరం నాకు శాంతిని కలిగించింది” అంది ఆనందంగా వసుంధర.

కొన్నిక్షణాల తర్వాత..

“ఒరేయ్!.. నరసింహ.. మామయ్య నిన్ను వెంటనే బయలుదేరి రమ్మన్నాడురా. నీతో ఏదో మాట్లాడాలట. రెడ్డిరామిరెడ్డి గారు వారిని కలిశారట”

“ఓహో!.. అలాగా!..”

“అవున్రా!.. విషయం ఏమిటో మామయ్య నాకు చెప్పలేదురా!..”

“మరేం లేదక్కా.. యీ సంవత్సరం వర్షాలు లేవు కదా!.. అందుకని రెడ్డిగారు యజ్ఞం జరిపించాలని నిర్ణయించుకొన్నారు” కుర్చీ నుంచి లేచి.. లోనికి వెళ్ళారు నరసింహశాస్త్రి. వెనకాలే సావిత్రి వెళ్ళింది. వసుంధర కుర్చీలో కూర్చుంది.

ఐదు నిముషాల్లో నరసింహశాస్త్రి చొక్కాను ధరించి పైపంచతో.. వరండాలోకి వచ్చారు. వారి వెనకాలే సావిత్రి వుంది.

“అక్కా!.. నేను మామయ్యను కలసి వస్తాను.”

వీధి భాగవత నిర్వాహకుడు కోదండయ్య వరండాను సమీపించి తను ఎదురైన నరసింహశాస్త్రికి నమస్కరించాడు.

“ఏం కోదండా.!.. యీ రోజేగా మీ ప్రదర్శన!..” చిరునవ్వుతో అడిగారు నరసింహశాస్త్రి.

“అవును సామీ!.. రాత్రి ఏడుగంటలకు ప్రారంభిస్తాం..”

వసుంధర వచ్చి నరసింహశాస్త్రి ప్రక్కన నిలబడింది.

“పెద్దమ్మగారూ!.. దండాలు..” నవ్వుతూ చెప్పాడు కోదండ.

“ఒరేయ్!.. కోదండా నువ్వా!.. అంతా బాగున్నారా!..”

“అంతా మీలాంటి ధర్మ ప్రభువుల దయమ్మగోరూ!.. అంతా బాగుండామ్” వినయంగా చెప్పాడు కోదండ.

“యీ రోజు ఏం నాటకం వేస్తావురా!..”

“శ్రీకృష్ణ రాయబారం ఏస్తామమ్మగారూ!..”

“ఓహో.. మరి కృష్ణుడు ఎవడ్రా!..”

“నా పెద్దకొడుకమ్మగోరూ!..”

“బాగా పాడుతాడా!..”

“ఆ ఫర్వాలేదమ్మా..”

“ఒరేయ్ కోదండా!..”

“నాటకాన్ని మన తెలంగాణా ప్రాంతపు భాషలో వేయగలరా!..”

“ఆఁ వేయగలం అమ్మగారూ!.. ఆ ప్రాంతం పోయినప్పుడు ఆ భాషనే కదా అమ్మగోరూ వాడేది!..”

తన ప్రక్కన నిలబడి వున్న భార్య సావిత్రి ముఖంలోకి చూచాడు నరసింహశాస్త్రి చిరునవ్వుతో, సావిత్రి నవ్వింది

తన వదినగారు కోదండాన్ని కోరిన కోరికను మనస్సులో తలచుకొంటూ.

“కోదండా!.. ఏమైనా కావాలా!..” అడిగాడు నరసింహశాస్త్రి

“సామీ!.. ఏమీ వద్దు. తమరికి నాటక విషయాన్ని చెప్పేదానికి వచ్చినా అంతే!..”

“సరే నేను పని మీద బయటికి వెళుతున్నాను. అందరం రాత్రి నాటకానికి వస్తాం” అన్నారు శాస్త్రిగారు.

“సంతోషం సామీ!..”

“పెట్రోమాక్సు లైట్లు అవీ బాగా ఏర్పాటు చేయండిరా!..” అంది వసుంధర.

“పెట్రోమాక్సు లైట్లు కాదమ్మగోరూ!.. కరెంటు దీపాలే. రెడ్డిగారు ఏర్పాటు చేస్తానన్నారు”

“అలాగా!..”

“అవునమ్మగోరు.. యిక నే వెళ్ళొస్తానమ్మా!..” వినయంతో చేతులు జోడించాడు కోదండ.

“మంచిదిరా కోదండా!.. వెళ్ళిరా!..” అంది వసుంధర.

నరసింహశాస్త్రి భార్య ముఖంలోకి చూచాడు. సావిత్రి తల ఆడించింది.

ముందు నరసింహశాస్త్రి.. వెనక కోదండయ్యా.. నడిచి వీధిలో ప్రవేశించారు. కోదండ నరసింహశాస్త్రికి చెప్పి, తన మకాం వైపు బయలుదేరాడు.

తన మేనమామ గోపాలశర్మ యింటికి రాబర్ట్ యిల్లు వున్న మార్గాన నడుస్తున్నారు నరసింహశాస్త్రి. అర్ధగంట క్రింద తన యింటి ముందు నుంచి ‘రాబర్ట్.. జిందాబాద్’ అంటూ కేకలు వేస్తూ వెళ్ళిన రైతు జనం వారికి ఎదురైనారు.

“నాకు ముందే తెలుసురా!.. ఆ పని వాడు చేసి వుండడని..” వారిలో ఒక వ్యక్తి మాట అది.

“అయితే మాతో ఎందుకు చెప్పలేదు?..” అతని ప్రక్కన వున్న వ్యక్తి ప్రశ్న.

“ఎవరైతేనేంరా!.. మనం డబ్బు కట్టకుండా మన ఆవులు.. గేదెలు.. మన యిళ్ళకు చేరినాయి. సంతోషించండ్రా..” మరో వ్యక్తి మాట.

“మొత్తానికి ఆ చిన్నదొరసాని, చాలా మంచిదిరా!.. ఆ తల్లి మనందరికీ ఎంతో మేలు చేసింది” మొదటి వ్యక్తి ఆనందంగా చెప్పాడు.

నరసింహశాస్త్రి వారిని సమీపించారు. శాస్త్రిగారిని చూచి.. వారు ప్రక్కన నిలబడ్డారు.

“దండాలు సామీ!..” ఏక కంఠంతో చెప్పారు.

వారిలో రాజయ్య ఒకడు. అతను నరసింహశాస్త్రిని బాగా ఎరిగినవాడు.

“రాజయ్యా!.. పెద్దగా నినాదాలు చేస్తూ వెళ్ళారు. ఏమిటి విషయం!..” అడిగారు నరసింహశాస్త్రి.

“సామీ!.. శిస్తులు చెల్లించలేదని మొన్న మా ఆవుల్ని గేదెల్ని బందిల్ దొడ్డి పాలు చేశాడు కరణం. యీ రోజు అవి యిళ్ళ కొచ్చేసినాయి. రాబర్ట్ యిడిపించాడని సంతోషంతో వాడి పేర జిందాబాద్ అని అరచినాం. తీరా వాడి యింటికాడికి పోతే తెలిసింది..”

“ఏం తెలిసింది?..”

“ఆ మంచి పన్ని చేసింది వాడు కాదని. వాడి కూతురని..”

“ఆ తల్లి మన తెలుగును చక్కగా మాట్లాడింది సామీ!.. వాళ్ళ నాయన చేసిన తప్పును క్షమించమని మమ్మల్ని కోరిందిదయ్యా!.. ఆ అమ్మ చాలా మంచిది సామీ!..” ఆనందంగా చెప్పాడు రాజయ్య.

“ఆమె పేరు ఇండియా!.. నా శిష్యురాలు.. చాలా మంచిది..” సగర్వంగా చెప్పారు నరసింహశాస్త్రి.

“ఆ చిన్నమ్మగారి తల్లి కూడా చాలా మంచిది సామీ!..”

“ఆమెనూ నేను ఎరుగుదును. మంచి మనసున్న మనిషి..”

“దండాలు సామీ!.. ఆ తల్లికూతుళ్ళు నిండు నూరేళ్ళు చల్లగుండాలి. ఇక మేము బయలుదేరుతాం సామీ!..”

“మంచిది. వెళ్ళి రండి..”

వారంతా ఆనందంగా ముందుకు వెళ్ళిపోయారు. ఆ పేదల ముఖాల్లోని ఆనందానికి కారకురాలైన ఇండియాను మనసున ఎంతో ప్రేమాభిమానాలతో దీవించారు నరసింహశాస్త్రి. చిరునవ్వుతో ముందుకు నడిచారు.

శిష్యరికం కేవలం విద్య నభ్యసించే దానికి కొందరు చేస్తారు. విద్యను గ్రహించడంతో బాటు.. ఆ గురువుగారి మాటల తీరును గుణగణాలను కొందరు అలవరచుకొంటారు. ఆ రెండవ కోవకు చెందినది ఇండియా.

అధ్యాయం 17:

సమయం రాత్రి ఏడు గంటల ప్రాంతం. వీధి భాగవతం బృందం నరసింహశాస్త్రి ఇంటి ప్రక్కనున్న విశాలమైన స్థలంలో గోడ ప్రక్కగా ముందు వున్న స్థలం మధ్యలో తెరలు కట్టారు. తెరల వెనక భాగంలో నటులంతా ముఖానికి రంగలు పూసుకొని పాత్రోచితమైన దుస్తులను ధరించారు.

ఆ ప్రాంతపు పెద్దలంతా వచ్చి వారి వారి ఇండ్ల నుంచి తెచ్చిన మంచాల మీడ, బెంచీల మీద కూర్చున్నారు. నరసింహశాస్త్రిగారి బృందం.. వసుంధర, సావిత్రి, అద్వైత్, పాండురంగ, సీత, శాస్త్రిగారూ రెండు మంచాల మీద కూర్చున్నారు. రెడ్డి రామిరెడ్డిగారు.. సతీమణి.. వారి యిరువురు పిల్లలు శాస్త్రిగారి పరివారానికి ప్రక్కగా కూర్చున్నారు.

గంట మ్రోగింది. పిట్టల దొర వేషంలో హాస్యగాడు తెరల ముందుకు వచ్చాడు.

“మహా జనానికి.. పెద్దలకు యీ దొర దండాలు.. అయ్యలారా!.. అమ్మలారా!.. యియ్యాల యీరాత్రి.. మా దండు యీడ శ్రీ కృష్ణరాయబారం వీధి భాగోతాన్ని ఆడి మీ అందరి దిల్ కుషీ చేయబోతుండం. దీన్ని ఏర్పాటు చేసిన స్వాములు నరసింహశాస్త్రిగారికి.. పెద్దలు రెడ్డి రామిరెడ్డిగారికి కుషీగా మరోసారి సలాం చేస్తుండా!.. ఇప్పుడు మొదటి సీను. కౌరవులు పాండవుల్తో జంగ్ యుద్ధం.. చేయాలనుకొన్నరు. వారి రాజ్య అర్ధభాగం వారికి యియ్యనన్నరు. జంగ్ జరగాల్సిందేనంటు తొడలు కొట్టిండ్రు.

ధర్మరాజుకు జంగ్ అంటె మనసు లేదాయె. శ్రీకృష్ణుణ్ణి పిలిపించిండు. పంచ పాండవులు, ద్రౌపతి కిట్టన్నకు ఏం ఎరుక చేసిండ్రో చూడండి. పెద్దలారా.. పిన్నలారా!.. చూచి ఆనందించండి.”

పిట్టలదొర తలపైన టోపీని గాల్లోకి ఎగరేసి దాన్ని కింద పడనీకుండా జరిగి.. తన తలమీద టోపీ పడేలా చిత్రంగా కదిలాడు. టోపీ అతని తలపై కూర్చుంది. తెల్ల తెర తొలిగిపోయింది. పిట్టల దొర ముందు కనబడే తెర వెనక్కు వెళ్ళిపోయాడు.

మధ్యన శ్రీకృష్ణుడు ప్రక్కన ధర్మరాజు, భీముడు, అర్జునుడు నకుల సహదేవులు కూర్చొని వున్నారు. కృష్ణుని ప్రక్కన ద్రౌపతి నిలబడి వుంది.

“బావలారా!.. మీరంతా నన్ను రమ్మన్నరు. వచ్చినా.. నాకు తెలిసిన కాడికి చెబుతుండా.. జంగ్ జరక్కమానదు. మీరేమంటారు?..”

ధర్మరాజు.. “బావా!.. నీకు ఎరుకలేని యిసయం అంటూ లేదాయె. జంగు జరిగితే ఎంతోమంది జనం చచ్చిపోతరు. ఎందరో ఆడోళ్ళ పుస్తలు తిగెపోతయి. అలాంటి జంగ్ చేయాలని నాకు లేదు. నీవు హస్థినాపురానికి ఎల్లి మా పెదనాయనతో మాటాడి జంగ్ను ఆపుసెయ్యి. అదా రాజ్య యిస్తే నాకు ఎంతో కుషీ, కాదన్నడంటే.. మా అయిదుగురికి ఐదు పల్లెల నిమ్మని అడుగు. జంగ్.. జరగకుండా ఆపుసెయ్యి” దీనంగా చెప్పాడు.

ద్రౌపతి.. రోషంతో.. “అన్నా!.. ఆయన మాటలు యినుకోకు. ఇన్సాఫ్‍గా అర్ధరాజ్యం యిస్తే సరి.. యీనన్నరనుకో, జంగ్ తప్పదని చెప్పు. ముస్టి ఐదు పల్లెలు మా కొద్దు. ఎరుకాయనా!..” అంది.

“ఓ చెల్లమ్మా!.. పెదబావ ఐదూళ్ళు యిస్తే చాలన్నడు. నీవు ముస్టి ఐదు పల్లెలు ఒద్దన్నవు. అంటే జంగ్ జరగాల్సిందే అనే కదా నీవు అంటుండవు!..”

“అదా రాజ్యం మాకు రాకపోతే జంగు జరగాల్సిందే అన్నా..” రోషంగా చెప్పింది ద్రౌపతి.

“బావా! క్రిష్ణా!.. ఆడోరికి ఆవేశం హెచ్చని నీకెరుకే కదా!.. ద్రౌపతి మాటలు నీవు మనసున పెట్టక. జంగ్ జరగకుండ సంధి జరిగేలా సూడయ్యా!..” దీనంగా చెప్పాడు ధర్మరాజు.

“బావా!.. ఓ ధర్మా!.. నీ మాట యినుకొన్నాక.. నేను హస్తినకు ఎల్లక తప్పదని తెలిసిపోనాది. సరే. నీ మనసులోని మాట నీవు చెప్పినావు. మరి మిగతా నలుగురి బావలు ఏమంటరో యినుకొంటా!.. (భీముని వైపు చూచి) బావా! భీమసేనా!.. నీవేమంటవు?..” భీముని అడిగాడు శ్రీకృష్ణుడు.

“బావా!.. జంగ్ జరగాల్సిందే. నా గదతో ఆ కౌరవులను నేను చంపాల్సిందే.. దుశ్శాసనుణ్ణి చంపి.. వాడి రక్తంతో నేను ద్రౌపతి తలనీలాలను తడిపి ముడి వేయాల్సిందే..” అన్నాడు భీముడు.

“భీమా!.. అయినోళ్ళ మీద గుస్సా పనికి రాదురా!..” అణ్నాడు ధర్మరాజు విచారంగా.

భీముడు ముఖం చిట్లించి కూర్చున్నాడు. కొన్ని క్షణాల తర్వాత.. “బావా!.. సరే, అన్న చెప్పినట్టుగానే మాటాడు” అన్నాడు భీముడు.

“బావా! భీమా!.. ఆ మాటలన్నది నీవేనా!.. కొన్ని క్షణాల ముందున్న నీ రోసం ఏమాయె. జంగ్ అంటే భయమాయనా!..” వ్యంగ్యంగా నవ్వుతూ అడిగాడు శ్రీకృష్ణుడు.

భీమన్న రోషం వచ్చింది.

“ఓ బావా!.. నాకు.. యీ భీముడికి జంగ్ అంటే భయమా!..” (వికటంగా నవ్వుతాడు) అన్న మాటను కాదని ఆయన దిల్క దరద్ యివ్వకూడదని అట్లా గంటినే కాని.. జంగ్ అంటే నాకు ఫికర్ లేదు బావా!..” రోషంతో చెప్పాడు భీముడు.

“సరే!.. సరే!.. శాంతించు బావా.. బావా అర్జునా.. నీవేమంటవు?..” అర్జునుని చూస్తూ అడిగాడు శ్రీకృష్ణుడు.

“బావా!.. కృష్ణా.. వారు ఐదు పల్లెల్ని మాకు యిచ్చేదానికి ఒప్పుకోరు. దుర్యోధనుని దిల్ నీకు ఎరుకే కదా!..”

“అవును.. అయితే జంగ్ తప్పదంటవా!..”

“అవును బావా! ..”

“ఆఁ నకులా!.. నీవేమంటవు?..”

“బావా!.. వారికి మా పట్ల రహం లేదు. కాబట్టి..”

“జంగ్ జరుగుతుందంటవా!..”

“అవును..”

“మరి సహదేవా!.. నీ మాట!..”

“బావా!.. అన్నలు నలుగురు నడిచే దారినే నేను నడుస్తా. వారి మాటను నేను ఖదర్ చేస్తా”

“ఓహో!.. మరి చెల్లెమ్మా!.. వీరి మాటలనన్నీ విన్నావు కదా!.. మరి నీ చివరి మాట?..”

“అన్నా!.. నాకు జరిగిన పరాభవం నీకు ఎరకలేదా!.. నీ సాయం లేకుంటే నేను ఆనాడే చచ్చిపోయుండేదాన్ని. నా యిజ్జత్తును యాలం ఏసినోళ్ళందరికీ.. తగ్గ శాస్తి జరగలన్నా. అది జరగాలంటే.. జంగ్ తప్పదన్నా!..” రోషంతో చెప్పింది ద్రౌపతి.

“జరగవలసింది జరగక మానదు. మీరు మీ మీ ఖయాల్ నాకు చెప్పిండ్రు. నేను హస్తినాపురానికి ఎల్లి సంధికి ప్రయత్నిస్తా. వారు నా మాటలను విని మీకు సగభాగం యిచ్చినారంటే అందరికీ మంచి. కాదన్నరంటే.. జంగ్ జరుగుద్ది. దాని ఫలితం చాల భయంకరంగ వుండబోద్ది” శూన్యంలోకి చూస్తూ చెప్పాడు కృష్ణుడు.

“బావా!.. సహనంతో మాట్లాడి సంధికుదిరేలా చూడండ్రి..” ప్రాధేయపూర్వకంగా కోరాడు ధర్మరాజు.

“అలాగే బావా!.. నా ప్రయత్నం నేను చేస్తునులే..” కృష్ణుడు లేచాడు.

అందరూ లేచారు. తెర వెనుకకు వెళ్ళిపోయారు.

ఇండియా కారు వచ్చి ఆ ఆవరణంలో ఆగింది. ఇండియా కారు దిగింది.

నరసింహశాస్త్రి చూపులు ఆమె వైపు మళ్ళాయి. ఆమె వారి వైపుకే వేగంగా రాసాగింది.

కూర్చొని వున్న జనమంతా లేచి ఇండియాను ఆశ్చర్యంగా చూడసాగాడు.

నరసింహశాస్త్రి.. అద్వైత్ ముఖంలోకి చూచారు. వారి చూపుల భావాన్ని గ్రహించిన అద్వైత్ వేగంగా ఇండియా వైపుకు నడిచాడు.

సీత.. సావిత్రి.. వసుంధర ఇండియాను చూచారు.

‘ఈ తెల్ల రాక్షసి యీ సమయంలో యిక్కడికి ఎదుకు వచ్చిందో.. ఇది నన్ను ప్రశాంతంగా వుండనీదు’ అనుకొంది సీత. అద్వైత్ ఇండియాను సమీపించాడు. తన్ను సమీపించిన అద్వైత్‌ను చూచి ఇండియా ఆగిపోయింది. ఆమె ముఖంలో కలవరం.

“ఏం యిలా వచ్చావ్?..” మెల్లగా అడిగాడు అద్వైత్.

“నాన్నగారు మంటలు మంటలు అని అరుస్తున్నారు. శరీరం ఎంతో వేడిగా వుంది.. మా అమ్మ గురూజీని కలపమని నన్ను పంపింది. ప్లీజ్ హెల్ప్ మీ!..” దీనంగా అడిగింది ఇండియా, పరుగున అద్వైత్ నరసింహశాస్త్రిని సమీపించాడు. విషయాన్ని చెప్పాడు.

వారిరువురూ ఇండియా వున్న చోటికి వచ్చారు. ఇండియా విషయాన్ని శాస్త్రి గారికి చెప్పింది. వారు కారును సమీపించారు. కూర్చున్నారు. ఇండియా కారును స్టార్ట్ చేసింది. అందరూ ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో తిలకించారు.

పావుగంటలో కారు రాబర్ట్ భవంతి ముందలి పోర్చిలో ఆగింది. ముగ్గురూ కారు దిగి వేగంగా రాబర్ట్ వున్న గదిలో ప్రవేశించారు. ఆండ్రియా కన్నీటితో నిలబడి వుంది. రాబర్ట్ ‘మంట.. మంట’ అని భయంకరంగా అరుస్తున్నాడు. అతన్ని కొన్నిక్షణాలు చూచి.. నరసింహశాస్త్రి ఆండ్రియాను సమీపించి.. “అమ్మా మీరు భయపడకండి. వారికి ఏమీ కాదు..” ఇండియా వైపు తిరిగి.. “ఇండియా బాత్‌తూమ్ ఎక్కడ?..” అడిగారు నరసింహశాస్త్రి.

“రండి గురూజీ!..”

ముందు ఇండియా.. వెనకాల నరసింహశాస్త్రి నడిచి బాత్‌తూమ్‍ను సమీపించారు.

నరసింహశాస్త్రి బాత్‌తూమ్‌లో ప్రవేశించి తలుపు మూసుకొన్నారు. ఇండియా ద్వారం ముందు కన్నీటితో నిలబడి పోయింది.

అద్వైత్.. రాబర్ట్ పడే బాధను చూడలేక కళ్ళు మూసుకొన్నాడు.

‘సర్వేశ్వరా!.. వీరిని రక్షించు. జగత్ జననీ.. వారిని కాపాడు’ మనసారా వేడుకొన్నాడు. అద్వైత్.. కళ్ళు మూసుకొని.

భర్తను అద్వైత్ను చూచి ఆండ్రియా కన్నీరు కార్చుతూ వుంది.

కళ్ళు తెరచిన అద్వైత్.. “మేడం. వారికేం కాదు. నాన్నగారు ఏదో చేస్తారు. వారికి తగ్గిపోతుంది. మీరు భయపడకండి” మంచి మనిషిగా.. మానవతావాదంతో అద్వైత్ చెప్పిన మాటలివి.

నరసింహశాస్త్రి గది నుంచి తడి బట్టలతో బయటికి వచ్చారు.

“ఇండియా ఒక గ్లాస్ కావాలి..” అడిగాడు.

పరుగున లోనికి వెళ్ళి ఇండియా గాజుగ్లాసును తెచ్చి నరసింహశాస్త్రికి అందించింది.

గ్లాసులో నీళ్ళు నింపుకొని నరసింహశాస్త్రి నేల కూర్చున్నారు. వారి చర్యలను ఇండియా ఆశ్చర్యంతో చూడసాగింది. పద్మాసనం వేసికొని కూర్చున్న నరసింహశాస్త్రి కళ్ళు మూసుకొని బొటనవేలితో మిగతా వేళ్ళ గుణుపులను లెక్కిస్తూ జపం ప్రారంభించారు. వారు అదే స్థితిలో పావు గంట గడిపారు. జపాన్ని ముగించారు. ఐదు సార్లు నీటి గ్లాసులో తన నోటిలో గాలిని వూదారు. లేచారు. వేగంగా రాబర్ట్ గదిలో ప్రవేశించారు.

“ఆదీ!.. వారి మెడ క్రింద చేయి వేసి పైకి లేపు” అన్నారు శాస్త్రిగారు. అద్వైత్ వారు చెప్పినట్లుగానే చేశారు. తన చేతిలోని గ్లాసును రాబర్ట్ నోటి వద్ద వుంచి..

“సార్!.. నోరు తెరవండి..” అన్నారు బిగ్గరగా ఇంగ్లీష్‌లో. రాబర్ట్ ప్రయాసతో నోరు తెరిచాడు. శాస్త్రిగారు గ్లాసులోని నీటిని వారి నోట్లో పోశారు. గ్లాసులోని నీళ్ళు ఖాళీ కాగానే గ్లాసును ఇండియాకు అందించారు. తన కుడి చేతిని రాబర్ట్ తలపై వుంచారు. మంత్రోచ్ఛారణ చేశారు. తల నుండి కాళ్ళ వరకూ తన నోటి గాలిని వారిపై ప్రసరింప చేశారు.

“ఆదీ!.. వారి తలను యథాస్థానంలో వుంచు” అన్నారు శాస్త్రిగారు.

అద్వైత్ రాబర్ట్ తలను దిండుపై వుంచారు.

కొన్ని క్షణాల్లో రాబర్ట్ తొట్రుపాటు.. అరుపులు.. తగ్గాయి.

“అమ్మా!.. వారి ఆరోగ్యాన్ని గురించి యిక మీరు కలత చెందకండి. అమ్మ దిగిపోతుంది. వారికి స్వస్థత కలుగుతుంది. ఇక నేను వెళతానమ్మా!” చెప్పారు నరసింహశాస్త్రి, అద్వైత్ ముఖంలోకి చూచారు.

భావాన్ని గ్రహించిన అద్వైత్.. తల ఆడించారు.

“మీ సహాయాన్ని నేను యీ జన్మలో మరచిపోలేను. మీ ఋణాన్ని నేను తీర్చుకోలేను. మీకు నా ధన్యవాదాలు సార్..” సవినయంగా చెప్పింది ఆండ్రియా.

“ప్రతి మనిషీ మానవతావాదానికి బద్ధుడుగా వుండాలి. అలాంటి వారే అసలైన మనుషులు. నేను ఆ తత్వాన్ని నమ్మిన వాడిని. పాటించే వాడిని. మీరూ నాలాంటి వారేనని విన్నాను. కాబట్టి మన మధ్యన ధన్యవాదాలకు తావులేదు” చిరునవ్వుతో చెప్పారు నరసింహశాస్త్రి.

“అమ్మా!.. నేను గురూజీ గారిని యింటి వద్ద దించి వస్తాను” అంది ఇండియా.

“వెళ్ళిరా!..” అంది ఆండ్రియా.

నలుగురూ వరండాలోకి వచ్చారు.

స్త్రీమూర్తికి తాను యిచ్చే గౌరవ ప్రదమైన సమస్కారాన్ని చేశారు నరసింహశాస్త్రి ఆండ్రియాకు.

ఆండ్రియా చేతులు జోడించి ప్రతి నమస్కారం చేసింది. ఇండియా కారు డ్రైవర్ స్థానంలో కూర్చుంది.

నరసింహశాస్త్రి, అద్వైత్‍లు వెనకసీట్లో కూర్చున్నారు. కారు కదిలి వీధిలో ప్రవేశించింది.

“అమ్మా!.. ఇండియా!..” పిలిచారు నరసింహశాస్త్రి.

చెప్పండి గురూజీ!..”

“బందిల్ దొడ్లో వున్న గోవులను గేదెలను సొమ్ము చెల్లించి విడిపించావా!..”

“అవును గురూజీ!..” వందనంగా చెప్పింది ఇండియా.

“చాలా గొప్ప పని చేశావమ్మా!.. నాకు ఎంతో ఆనందంగా వుంది. ఆ జగన్మాత ఎప్పుడూ నిన్ను చల్లగా చూస్తుంది”

“ధన్యవాదాలు గురూజీ!..”

“యీ విషయం మీ నాన్నగారికి తెలిస్తే!..” తన సందేహాన్ని వ్యక్తం చేశాడు అద్వైత్.

“అది వారి ఆర్జన కాదు. మా అమ్మగారిది.. మూన్ అంకుల్ గారిది. ఆ కారణంగా నేను వారికి భయపడనవసరం లేదు” నిశ్చలంగా చెప్పింది ఇండియా.

ఆమె మాటలను విని నరసింహశాస్త్రి.. అద్వైత్ ముఖంలోకి చిరునవ్వుతో చూచారు.

అద్వైత్ పెదవుల పైనా చిరునవ్వు.

‘ఇండియా సామాన్యురాలు కాదు. తప్ప పుట్టింది ఆ తండ్రికి..’ అనుకొన్నాడు అద్వైత్.

కారు నరసింహశాస్త్రి ఇంటి ముందు ఆగింది. తండ్రి కొడుకు కారు దిగారు. ఇండియా కూడా కారు దిగి.. గురువుగారికి నమస్కరించి కారు ఎక్కింది. వారు.. లోనికి నడిచారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here