రంగుల హేల 53: ఎన్నికల రగడ

11
12

[సంచిక మాసపత్రికలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు అందిస్తున్న కాలమ్ ‘రంగుల హేల’.]

[dropcap]చా[/dropcap]ట్ బళ్ళవాళ్ళు, సమోసాలు చిదిమి అక్కడే ఉన్న నానా పదార్థాలు కలిపి ‘సమోసా రగడ’ పేరుతో రుచికరమైనదేదో చేసి, నిమ్మకాయపిండి, ప్లేటులో స్పూన్‌తో సహా వేసి అందిస్తుంటే మనం ఫ్రెండ్స్‌తో కలిసి ఎంతో ఆనందంగా తింటున్నాం కదా! సరిగ్గా అలాంటి రుచితో, డైలాగు వార్స్, నాయకుల పార్టీ దూకుళ్లు ఇంకా అనేకానేక ఉవ్విళ్లూరించే విశేషాలతో ‘పొలిటికల్ రగడ’ తయారు చేసి టీవీ చానల్స్ మనకందించి రేటింగ్ పెంచుకుంటూ మనకి పసందైన కాలక్షేపం కలిగిస్తున్నాయి. ప్రొఫెసర్లు కూడా డైలీ పొలిటికల్ సినారియోలపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసి, సందేహాలు తీరుస్తూ టీవీ చానళ్లకు యూనివర్సిటీ క్లాసుల గౌరవాన్ని తెస్తున్నారు.

ఈ సంవత్సరం మొదలైనప్పటినుండీ సన్నగా అనుమానంగా మొదలైన వైరస్, ఎలక్షన్ షెడ్యూల్ రాగానే దేశాన్ని చుట్టుముట్టేసింది. ప్రతివారూ ఆవేశంతో ఊగిపోతున్నారు. రాజకీయ నాయకులు సరే సరి. సొంత పార్టీపై అలిగి గోడలు దూకి మరో పార్టీలో చేరి సీటు సంపాదించే రంధిలోపడ్డారు. గత ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీలోకి దూకిన ఓడిన పార్టీ నాయకులు మళ్లీ అదే క్రమశిక్షణ పాటిస్తూ, గెలిచిన పార్టీలోకి భయం, బిడియం లేకుండా మొహమాటం, మర్యాద కూడా మర్చిపోయి దూకుతున్నారు. పాత పార్టీ నాయకుడి మీద కనీస దయాదాక్షిణ్యo కూడా చూపించట్లేదు. కొందరు, కోతులు పిల్లల్ని పొట్టకు చుట్టుకుని, ఒక చెట్టు నుండి మరో చెట్టు పైకి ఉరికినంత సులభంగా పుత్ర, పుత్రికల్ని చంకన వేసుకుని మరీ దూకుతున్నారు. మరీ వీర తెలివిమంతులు ఒక పిల్లను ఒక పార్టీలో పెట్టి, మరో పిల్లని మరో పార్టీలో పెట్టి (దూరదృష్టితో) సర్దుకుంటున్నారు. పార్టీల రోడ్ షోలూ, రాలీలూ, దీక్షలూ హోరాహోరీగా జరుగుతున్నాయి.

ప్రజలు ఇంతకుముందు ఒక మొహం చూడగానే ఫలానా పార్టీ వాడని గుర్తుపెట్టుకునేవారు. అలాంటి సౌలభ్యం ఇప్పుడు లేదు. ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ఎన్నికల నాటికి బ్యాలెట్ పేపర్లో ఏ పార్టీ కింద అతని పేరుంటే ఉంటే అదే అతని పార్టీ అని మాత్రమే గుర్తుంచుకోవాలి. మ్యూజికల్ చైర్స్ ఆటలో రిఫరీ విజిల్ ఆపగానే కుర్చీ దొరికినవాడే గెలిచినట్టు, టిక్కెట్ దొరికిన వాడే విజేత. ఎన్నికల్లో గెలుస్తాడా లేదా అన్న సంగతి తర్వాత. లీడర్లు ఏ పార్టీ నుంచి గెలిచినా పవర్ పార్టీతో టచ్‌లో ఉంటూ, సొంత పార్టీ పట్ల టచ్చీగా ఉంటున్నారు. పార్టీ పెద్దగారు స్వయంగా వెళ్లి “మిము వీడి మీముండలేము. మీకేం తక్కువ చేసాము?” అని బ్రతిమాలినా ఫలితం ఉండట్లేదు. ఈ ఎన్నికల సెగ వాతావరణంలో కలిసిపోయి మన జంట రాష్ట్రాల్లో మరో నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. ఇక మీదట నిజాయితీగా ఉండిపోవాలని ఒట్టేసుకున్న కొందరు పునీతపార్టీలో చేరి నిశ్చింతగా నిద్రపోతున్నారు.

ఇక పార్టీల వాగ్దానాల మానిఫెస్టోలు అబ్రకదబ్ర మేజిక్‌కి తీసిపోవట్లేదు. అవి చదివిన సామాన్యుడు మొహం ఎలా పెట్టుకోవాలో తెలియక అది కామెడీయా ట్రాజెడీయా అర్థంకాకపోయినా పిచ్చాసుపత్రికి వెళ్ళకుండా బ్రతకగలుగుతున్నాడంటే అతని పరిణతి. ఆ సంగతి మనం గుర్తించి ఆమ్ ఆద్మీని సన్మానించాలి. ప్రభుత్వ సొమ్మును పంచి పెట్టడంలో పోటీపడి పదవి పొందాలన్న ఆశ తప్ప ఒక ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తామని కనీసం ఉతుత్తి గానైనా చెప్పే నాథుడు లేకపోవడం మనకెవరో పెట్టిన శాపం.

అవినీతిపై యుద్ధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, అవినీతి కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళుతూ కొందరు వీరుళ్ళలా నడుస్తూ బాడీ లాంగ్వేజ్‌తో అభిమానులను ఓదారుస్తున్నారు., “నేను అవినీతి చెయ్యడం ఏంటి? పరువు నష్టం దావా వేస్తా!” అని హర్ట్ అయినవారు, కేసులు మీద పడగా జైలుకి వెళుతూ గాల్లో చేతులు ఊపుతూ (మనలాంటి అర్భకులకు ధైర్యం చెప్పడానికి కావచ్చు) నడవడం కలియుగ మహిమ అని పెద్దవాళ్లు వాపోవడం చూస్తున్నాం. బహుశా వారి తరఫున వాదించే లాయర్లు “మీ తప్పు లేదు మేమున్నాం” అని ఇచ్చిన ధైర్యం, హామీ, ధీమా కావచ్చును. వారు మాత్రం “మేము నిర్దోషులం, అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేసారు, న్యాయ పోరాటం చేస్తాం!” అని గట్టిగా చెబుతున్నారు. అదే సత్యం కావచ్చును. నిజం నిలకడ మీద కానీ తేలదు. కొండొకచో ఎప్పటికీ తేలకపోవచ్చును కూడా! దశాబ్దాల తరబడి బెయిల్‌పై ఉండే నిర్దోషులని కూడా చూస్తున్నాం కదా! ఇప్పుడు మొట్టమొదటి సారి, జైలులోనుంచి పాలన చేసే జైల్ ముఖ్యమంత్రినీ చూసే మహద్భాగ్యమూ కలిగిందికదా! ఇంకేమేం చూసే భాగ్యం కలుగనుందో కదా!

ఏది సత్యం? ఏదసత్యం? ఏది పుణ్యం? ఏది పాపం? అని కళ్ళు మూసుకుని తత్వాలు పాడుకుంటున్న మనం, ఎప్పుడో ఒకప్పుడు మానసిక చికిత్సకి వెళ్లక తప్పదేమో! ఎందుకంటే మనది రాజకీయాలు తప్ప మరో ఎంటర్‌టైన్మెంట్ లేని దుస్థితి. సీరియల్స్ చూసే స్థితికి చేరలేక, డబ్బింగ్ కళాఖండాలు చూసి మిత్రుల్ని చూడమని వారి చెవుల తుప్పు వదిలించాక, మనకి మిగిలేవి పోలిటిక్సేకదా !

ఒకప్పుడు రాజకీయాలు ఆ రంగంలోనే ఉండేవి. ఇప్పుడవి పరిణతి చెంది మిగిలిన రంగాలకు యథేచ్చగా అంటువ్యాధుల్లా వ్యాపించాయి. టీవీ సీరియళ్లు కుటుంబ బంధాల్లోని కుట్రకోణాల్ని కలర్‌ఫుల్‌గా ఆవిష్కరించాయి. అవి, ఇవి చూసిన ప్రజలు బాగా విజ్ఞులై ఆచితూచి లాభదాయకమైన రీతిలో స్పందిస్తున్నారు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలని కదా మేధావుల ఉవాచ. అదే ఇప్పుడు జరుగుతోంది. ఆ విధంగా వృద్ధి సాధించిన ఓటర్లు “నీవు నేర్పిన విద్యయే” అంటూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. రాజకీయాలు పైపైన చూసిన వాళ్ళు ‘అబ్బో! ఇది మనకు బాగా తెలిసిన సబ్జెక్ట్’ అని మురిసిపోతూ దొరికిన వాళ్లందరితో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. కాస్త లోతుగా దిగిన వాళ్ళు ‘అయ్యో నా దేశం ఎక్కడికి వెళుతోందీ!’ అని ఉద్వేగపడతారు. గడకర్ర పెట్టి పూర్తి అడుగు కనిపెట్టిన వాళ్లు మౌనం దాల్చి పెద్దపెద్ద బై లైన్ ఆర్టికల్స్ రాసి నిట్టూరుస్తారు.

నేడు రాజకీయాలు అష్టావక్రను మించిన వంకర్లు తిరిగి ఉన్నాయి. నాయకులు దీనవదనాలతో ఓటర్లకు జాలి కలిగేలా రెండు చేతులు పైకెత్తి (చొక్కాలు పైకి లేచిపోయేట్టుగా) దండాలు పెడుతున్నారు. వ్యక్తిగత కారణాలతో ద్వేషించేవాళ్లు అటు ఇటు చేరుతున్నారు. అర్ధమనస్కుల శల్యసారథులకూ లోటులేదు. ఫలానా విఐపి గారికి టికెట్ ఎందుకు రాలేదు? అంటూ జరిగే చానెల్స్ చర్చల్లో, వాదోపవాదాలు పెరిగి వేడి పొగలు ఎగిసి కొట్టుకోబోతున్నప్పుడు ఆ పక్కన టీ తాగుతున్న మోడరేటర్ పరుగున వచ్చి ఆపుతున్నాడు. విశ్లేషకులు కూడా ఆవేశంతో ఊగిపోవడం పరిస్థితుల తీవ్రతకు తార్కాణం. దేశమంతా ఒకేసారి ఎన్నిక ఉంటే డబ్బు ఆదా అని సీనియర్ మేధావుల యోచన. ఒకే పార్టీ ఉంటే బాగుంటుందని కొన్ని బృందాల ప్రార్థన.

ఇంటి పత్రికలు గిరిగిసుకొని తమ వాకిలి కబుర్లు మాత్రం రాసుకుంటున్నాయి. వీరాభిమానులు అర్ధనిమీలిత నేత్రాలతో అదే ప్రపంచంలో ఉంటున్నారు. నేడు సోషల్ ఇంజనీరింగులూ, బాడీ కెమిస్ట్రీలు కూడా ఇక్కడ తమదైన పాత్రను పోషిస్తున్నాయి. టిక్కెట్లు దొరికిన వందల కోట్ల అధిపతులూ, వేలకోట్ల అధితులయిన పార్టీ నాయకులు తమను తాము పబ్లిక్ మీటింగుల్లో బీదలుగా, పేదలుగా వర్ణించుకోవడం గొప్ప తమాషాగా ఉంది. వాళ్ళ బిడ్డలు విదేశాల్లో చదువుకుంటున్నప్పటికీ పెద్దమనసు చేసుకుని. ‘మన బిడ్డల చదువు కోసం ఓటెయ్యండి’ అని ప్రేమ కురిపిస్తున్నారు.

రాజకీయ పార్టీల వారికి ఎదుటిపార్టీ వారిలో త్రిపురాసుర లక్షణాలు కనబడుతున్నాయి. వాటిని ప్రసంగాల్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఓటర్లు రెంటి వైపూ అనుమానంగా చూస్తున్నారు. జాతీయస్థాయి మేనిఫెస్టోలూ, రాష్ట్రస్థాయి మేనిఫెస్టోలూ వచ్చి పడుతున్నాయి. ప్రజాస్వామ్యానికి పండగ లాంటివి ఎన్నికలు అని పెద్దల దీవెన. కానీ పరిస్థితి చూస్తే కురుక్షేత్ర యుద్ద వాతావరణం కనబడుతోంది. తాడో, పేడో అన్నట్టుంది. ఎవరికి వారు తాము పాండవులమని భావిస్తూ ప్రజలకు వివరిస్తున్నారు. మరో ఐదు దివ్య సంవత్సరాలు అధికారంలో ఉండాలని అధికార పార్టీలు హడావుడిగా తపస్సు చేస్తున్నాయి.

గతంలో అధికారం అందే వరకు తపస్సు చేసి అందాక, ఉద్యోగం, ఉపాధి మాట తప్పిన నాయకులు, ఇప్పుడు ఇచ్చిన వరాలను మళ్ళీ ఇస్తున్నారు. ఏ స్లోగన్‌తో, హామీతో గెలిచారో ఆ హామీని గెలిచిన అయిదు నిమిషాల్లో అసాధ్యం అని చెప్పి చెయ్యి కడుక్కున్నవాళ్ళు – ఇప్పుడు నన్ను నమ్మండి అంటున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు కోర్ట్‌కు కూడా వెళుతున్నారు. అవి కూడా తీర్పుల్లో తికమక పడినట్టుగా కనిపిస్తుంది కానీ కోర్టులు పడవు. అలా అనుకుంటాం మనకి ధర్మసూక్ష్మం తెలీక.

‘ఓటు ప్రజలకు జీవధాతువు. మీ ఓటుతో మీ తలరాత మారుతుంది.’ అని విజ్ఞులు సుద్దులు చెబుతుంటారు. మన తలరాత ఎలా ఉంది? ఎలా మారాలనుకుంటున్నాం? అన్నది మనకే తెలీదు. అసలు మనం రాబోతున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తున్నాము అన్న విషయం మీద, మనకి ఇంకా క్లారిటీ లేదు, అందుకే కదా ఈ చర్చలన్నీ. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఆచంట మల్లన్నలే కాబట్టి మనం మరీ ఇదైపోయి, అదయిపోనక్కర్లేదు. అయిననూ వెయ్యవలె ఓటును! కొందరిని ఇంటికి పంపుటకు, కొందరికి  అవకాశం ఇచ్చుటకు, మన అదృష్టం మరోసారి పరీక్షించుకొనుటకు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here